May 18, 2024

హృద్యమైన తెలుగు పద్యం

రచన: తుమ్మూరి రాంమోహన్ రావు  తుమ్మూరి

ఉపోద్ఘాతం

చిన్నప్పుడు మన చెవుల్లో  అప్పిచ్చువాడు వైద్యుడో, చీమలు పెట్టిన పుట్టలో, అనగననగ రాగమో, అల్పుడెపుడు పల్కునో  పడే ఉంటాయి. ఆ వయస్సులో అదో పద్యమనీ దానికో ఛందస్సుంటుందనీ, లయ ఉంటుందనీ, చదివే రీతి ఉంటుందనీ  ఏమీ తెలియకపోయినా  అవి ఎవరి నుండి వింటామో వారిని అనుకరించి చదవటం పరిపాటి. పద్యమనే ఏమిటి జోల పాటైనా, లాలి పాటైనా, ఉయ్యాల పాటైనా, బతుకమ్మ పాటైనా, పల్లె పాటైనా, పడవ పాటైనా ఎవరో ఒకరు పాడతారు. అందులో కొందరు శ్రావ్యంగా పాడుతారు. అలా శ్రావ్యంగా పాడిన పాటను విన్న శ్రవణేంద్రియాలు వాటిని మనసులో ముద్రించుకుంటాయి. మనసు తానిష్టపడిన వాటిని తన అనుభవాలుగా మార్చుకోవడానికి ఇష్టపడుతుంది. అప్పటినుండి తన ప్రయత్నం మొదలవుతుంది. అలా వారి వారి అభిరుచుల్ని బట్టి  వారు వినగలిగిన అవకాశాల్ని బట్టి వివిధ ప్రక్రియలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. మూడు నాలుగు దశాబ్దాల క్రితం దాకా  తెలుగు భాషలోని అనేక ప్రక్రియలు సజీవంగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఆంగ్ల మాధ్యమ విద్య ప్రాచుర్యాన్ని పొందిందో  అనేక ప్రక్రియల ఆనవాళ్లు కరువౌతున్నాయి.
మన సాహిత్యం పద్య ప్రక్రియతోనే  ప్రారంభమయ్యిందని చెప్పవచ్చు. పద్యానికి మూలం సంస్కృత  శ్లోకం అయ్యేందుకు  కావలసినంత  ఆస్కారమున్నది. అలాగని జానపద సాహిత్యాన్ని కూడా మరచిపోవడం మంచిది కాదు.  ఏ భాషలోనైనా ఆయా  భాషలు మాట్లాడే ప్రాంతంలోని సంస్కృతీ వైభవాలు తొలుత జానపద రూపంలోనే వెలువడుతాయి. పాటకు అలవాటు పడ్డ  గొంతు  పరిసరాలకు  పరవశించినప్పుడు  పాటగా వెలువడుతుంది. పనిలోని అలసటను మరిపించే శక్తిగల పాట ప్రయోజనాన్ని కూడా వెతుక్కుంటుంది. అమ్మ పాడే జోల పాట పిల్లవాడి నిద్రపుచ్చేదిగా, తల్లి గానకళను పెంపొందించేదిగా, ఏ దేవుణ్ణో స్మరించేదిగా, సంస్కృతిని వింగడించేదిగా ఉంటుంది. పిల్లవాడిపై ఉప్పొంగిన ప్రేమ భాష తప్పకుండా  తీయగానే ఉంటుంది. ఏ ప్రేక్షకులూ లేని,  ఏ మెప్పులు కోరని, ఏ భేషజాలు లేని ఆ సాహిత్యం సహజ సుందరంగా ఉంటుంది.
కన్నులు అందమైన దృశ్యానికి  చెదిరినట్టే, నాసాపుటాలు కమ్మని వాసనకు అదిరినట్లే, జిహ్వ కమ్మని రుచులకు చలించినట్లే, ఒడలు కమనీయ స్పర్శకు పులకించినట్లే, చెవులు పాటకు పరవశిస్తాయి, కథకు దాసోహమంటాయి.
కథను చెప్పడానికి ఒక్కొక్కరు ఒక్కో ప్రక్రియను ఎన్నుకుంటారు. ఒక్కో ప్రక్రియ ఒక్కో కళారూపానికి ఒదుగుతుంది. ఆ కళాకారుడి జీవలక్షణం మీద అది అధారపడి ఉంటుంది. కళాకారుల్లో కూడా రెండురకాల వాళ్ళు ఉంటారు. సృజనాత్మక కళాకారులు కొందరైతే , అనుకరణ కళాకారులు మరి కొందరు. అన్నమయ్య కీర్తనలకు  ఇంత ప్రాచుర్యం కలిగించిన వారు శతాబ్దాలుగా ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తూ వస్తున్నవారు  వీరే. మనకేదో ఒక కూర అంటే  చాలా ఇష్టమయితే మాత్రం ఏడాది  పొడుగునా మూడు పూటలూ  అదే కూరతో తినలేం కదా. అందుకే అనేక ప్రక్రియలు వెలుగు చూచినై .
జోలపాట, లాలిపాట మొదలుకుని కీర్తనలు, భజనలు, జావళీలు,మంగళ హారతులు, లలిత గీతాలు, గేయాలు, ఒగ్గు కథలు, బుర్రకథలు, హరికథలు, గొబ్బి పాటలు, బతుకమ్మ పాటలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రక్రియలు కనిపిస్తాయి. ప్రకృతినుండే పాఠాలు నేర్చుకుని ఆ ప్రకృతినే  ఎప్పటికప్పుడు తనకున్న పరిజ్ఞానంతో  తనకనుకూలంగా మార్చుకోవడం మానవ నైజం . ఆ విషయంలో  మానవుని తృష్ణ  ఎన్నటికీ తీరనిది. అదే సాహిత్యంలోనూ జరుగుతూ వస్తున్నది. అలా  శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం ఏర్పడ్డట్టే  చందోబద్ధమైన కవిత్వానికి బీజాలు పడ్డాయి. దైనందిన జీవితంలో ఇనుము, రాగి , ఇత్తడి  వంటి లోహాలు ఎక్కువ ఉపయోగపడ్డా  బంగారానికే విలువ ఎక్కువ. ఎందుకంటే అది  చిరకాలం మన్నే లక్షణం కలిగి ఉంది. ఎప్పుడైతే  దానికి ఆ లక్షణం ఉందని తెలిసిందో దానితో తయారు చేసే ఆభరణాల తయారీలోనూ విశిష్టతకై ప్రయత్నం మొదలయ్యింది. అలాగే ఛందస్సు మేలిమి బంగారం. మేలిమి బంగారంతో అందమైన  ఆభరణం చేయగలిగే నేర్పున్నవాడు సహస్రాబ్దాలైనా మరుపుకు రాడు. నన్నయ్య పద్యం అందుకు ఉదాహరణం కాదంటారా.
తెలుగుతనానికి ప్రతీక తెలుగు పద్యం. పద్యాన్ని జనాంకితం చేసిన వాడు వేమన. రాజకీయ, సామాజిక, ఆర్ధిక, మానసిక శాస్త్ర విషయాలను చక్కని ఉపమానాలతో బోధ చేసాడు.’సుకవి జీవించు ప్రజల నాలుకల యందు’ అన్నట్లు ఆయన ఆటవెలదులు శతాబ్దాలుగా పండిత పామరుల నాలుకలపై నర్తిస్తున్నవి. ఇందులో కవి ప్రతిభతోబాటు ప్రక్రియ గొప్పతనం కూడా ఉన్నదని చెప్పడమే  నా ముఖ్య ఉద్దేశ్యం. పద్యం లయాన్వితమైనది గనుక ధారణకు నిలుస్తుంది. ఇది పద్యానికున్న అతి ప్రాముఖ్యత గల్గిన లక్షణం. కొన్నివేల పద్యాలను అనర్గళంగా  చదివే వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఏ ప్రక్రియకైనా ఒక విధమైన చదివే పధ్ధతి ఉంది. సాధారణంగా దానిని ధాటి అంటారు. ఆ ధాటి  అలవాటు చిన్నప్పుడే అయితే పద్యం మీద మక్కువ ఏర్పడే అవకాశాలు మెండు. మనకున్న పద్యాల రకాలు అనేకమే అయినా వాటిలో ప్రహతంలో ఉండి ఇప్పటికీ ఆదరించబడుతున్న వాటిలో  చంపకోత్పలమాలలు ,శార్దూల మత్తేభ విక్రీడితాలు, మత్తకోకిలలు , సీసము, కందము, ఆటవెలది, తేటగీతి ప్రముఖమైనవి. ఇంకా రగడలు, తరువోజలు వంటివి కొన్ని కూడా ఉన్నాయి. అప్పకవీయం చూస్తే ఎన్ని రకాలున్నాయో తెలుస్తుంది. మన విద్యా విధానము శృతి. సంప్రదాయం నుండి  వచ్చినది కనుక పూర్వకవులు తమ కావ్యాలలో  సందర్భోచితమైన  ప్రక్రియ ద్వారా  కావ్యానికి పరిపక్వత తేవడానికి ప్రయత్నించారు. ఒక పద్యం చదవగానే ఆ సందర్భ నేపథ్యం స్ఫురిస్తుంది. అయితే వచ్చిన చిక్కల్లా ఎక్కడంటే ఏ పద్యం ఎలా చదవాలన్నది. ఆధునిక యుగంలో ఒకరకంగా పద్యంపై చిన్నచూపు పెద్దదై పోతుంది. ఈ చిన్న చూపుకి ఒక కారణం ఆంగ్ల మాధ్యమమైతే మరో కారణం తెలుగు బోధకులు. మూడు నాలుగు దశాబ్దాల క్రితం తెలుగు బోధించిన గురువులు పద్యాన్ని మద్యం మత్తులా ఎక్కించే వారు. వారు పఠించే పద్యం శ్రావ్యత గలిగి విద్యార్థుల్ని రసజ్ఞుల్ని చేయగలిగేది. అప్పట్లో పాండిత్యాన్ని పదవి వరించేది. ఇప్పుడు పట్టాను పదవి వరించాల్సి వస్తుంది. అసలే తానొక పిచ్చి కోతి నిప్పుల్ ద్రొక్కె  కల్ ద్రావె అన్నట్లు తల్లిదండ్రుల దగ్గర్నుంచీ పిల్లలదాకా ఆంగ్ల భాషపై మోజు, దానికి తోడు  తరగతి గదిలో ఉండవలసినంత ఉత్సాహం లేకపోవడం పద్యం పాలిట శాపమైంది. ప్రతి విషయానికీ కొంత మినహాయింపు వుంటుందనేది అందరూ ఎరిగినదే.
ఇక నేను చెప్ప దలచుకున్న విషయం ఏమిటంటే  మన తెలుగు సాహిత్యం లోని వివిధ ప్రక్రియలు కొనసాగాలంటే వాటిని ప్రస్తుతీకరించే విధానంలో గణనీయమైన మార్పు రావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *