May 4, 2024

క్షమించు నాన్నా ( తండ్రి కూతురు )

రచన: కర్ర నాగలక్ష్మి

 

రైల్వే లో బుకింగ్ క్లర్క్ గా పనిచేస్తున్న నాకు రైల్వే కాలని లో రెండు గదుల  ఇల్లు ఇచ్చారు రైల్వే వారు .

పుట్టింది పెరిగింది అంతా ఈ ఊరే కావటంతో నా బతుకు ఈ ఊర్లో అందరికి తెరిచినా పుస్తకం అయింది. నాకు ఆఫీసు ఇల్లు తప్ప ఏ కాలక్షేపం లేదు.స్నేహితులు లేరు . లేరు అనడం కంటే ఎవరితోనూ స్నేహం చెయ్యలేదు అంటే సరిగ్గా సరిపోతుంది .

ఎందుకో చిన్నప్పటి నుంచి నాలో నేనే ముడుచుకు పోతుండే దాన్ని. ప్రైమరీ స్కుల్నుంచి హైస్కూల్ వరకు ఒకే బెంచి మీద పక్కపక్కనే కూర్చునే సుజాత తప్ప ఎవ్వరితోను స్నేహం లేదు .

ఆఫీస్ పని ముగించు కొని ఇంటికి వస్తుంటే బస్సు స్టాండ్ కూడలి లో కనబడింది సుజాత. ఇంతకు  ముందు లాగే తనని చూడనట్టు తప్పించుకొని పోదామని ప్రయత్నించిన  నన్ను అడ్డుకొని ,

“హాయ్ వనజా  చాల మారిపోయావు గుర్తు పట్టలేక పోయాను సుమా?”

నాకు “హాయ్ “అనక తప్పలేదు

“ముందు మీ ఇంటికి పద చాలా మాట్లాడు కోవాలి”

నాకెంత మాత్రం తనని ఇంటికి తీసుకు వెళ్ళడం ఇష్టం లేదు. అలాగని సుజాతని ఎవాయిడ్ చెయ్యాలని లేదు.

ఎందు కంటే నాకు బ్రెయిన్ వాష్ చెయ్యడానికే నాతొ వస్తానంది.

నాకు నా బలహీనతలు తెలుసు వాటిని ఎవరితోనూ పంచు కోవడం నచ్చదు.

ఇవన్ని సుజాతకి తెలుసు. అయినా నాతొ మాట్లాడాలి అంటోంది. ఒక్క సుజాత దగ్గర మాత్రమే నేను ఎ సమస్యనైన చర్చించ గలను. ఆ చనువు స్వేచ్చ సుజాత ఇచ్చింది.

ఇద్దరం మా ఇంటి వైపు నడుస్తున్నాం .

దారిలో పాకిస్తానీ (ఇప్పటి బంగ్లాదేశ్) హోటల్ లో 4  సింగడాలు, నాలుగు రసగుల్లాలు కొని మళ్ళా నడక ప్రారంభించాం.

సమోసాలని మా ప్రాంతంలో సింగడాలని అంటారు .

గబగబా టీ పెట్టి సింగడాలు, రసగుల్లాలు టేబుల్ మీద పెట్టి వనజకి ఎదురుగా కూర్చున్నాను.

వనజా నీకు తెలుసు నేను చాలా సూటిగా మాట్లాడతానని. అందుకే విషయంలోకి వస్తున్నాను.

” మీ నాన్న పరిస్ధితి నీకు తెలుసా?”

సమాధానం చెప్పడం నాకిష్టం లేదు .అందుకే మౌనం వహించేను

“నీకు తెలుసనీ నాకు తెలుసు వనజా, నువ్వు ఇంకా చిన్న పిల్లవి కావు ఐదు పదులు దాటిన వయసులో ఇంకా అవేశాలు  కోపాలు, ప్రతికారాలు అవుసరమా? ”

“ఐదు పదుల వయసు లో ఇలా మోడులా ఎందుకు వుండిపోవలసి వచ్చింది. దానికి కారణం నాన్నే కదా ? ”

“ఓ మువ్వింకా అదే పాత పాట పాడుతున్నావా? ”

‘నా బతుకు నీకు పాటలా ఉందా? నీకేం నీ జీవితం వడ్డించిన విస్తరి కదూ నీకేలా తెలుస్తుంది నా బాధ .’

“నా జీవితం వడ్డించిన విస్తరిగా మార్చుకున్నాను. అవకాశాలు అందరికి ఒకేలా వస్తాయి వాటిని సమయానికి అందిపుచ్చుకోవాలి. నీళ్ళ  లోకి దిగితేనే ఈత వస్తుంది. ఒడ్డున కూర్చోని నాకు ఈత రాలేదంటే ఎలా? ”

“పెద్దదాన్ని నన్నొదిలేసి చిన్న వాళ్లకి పెళ్ళిళ్ళు చేసిన మా నాన్నని నువ్వు ఎలా సమర్దిస్తావో చెప్పు వింటాను ” నాలో ఉక్రోషం తన్నుకొస్తోంది.

“చూడు చిన్నప్పుడు మీ నాన్న నీకు అర్ధం కాకపోవడం అంటే అర్ధం చేసుకోవచ్చు కాని ఈ వయసులో కూడానా? ”

“నీ జీవితంలో జరిగిన చిన్న పెద్ద సంఘటనలు అన్ని నాకు తెలియనివి కావు. తప్పు మీ ఇద్దరిదికాదు మీ ఇద్దరి మధ్యనున్న కమ్యునికేషన్ గాప్ ది. ఈ గాప్ తగ్గించు కోవడానికి నువ్వు గాని. ఆతను గాని ప్రయత్నం చెయ్యలేదు . ”

” సరే నీ చిన్నప్పటి సంగతికి వస్తే  నీకు కళ్ళు సరిగ్గా కనిపించవని తెలియగానే రెండు రోజులు శలవు పెట్టించి కళ్ళ జోడు నీకు పెట్టిన తరువాత స్కూలుకు పంపించారు. అది నువ్వంటే వున్నా అభిమానం కాదా?”

ఇవాల్టి వరకు కాదు అని అనిపించేది కాని సుజాత చెప్తున్నప్పుడు ఔనేమో అనిపిస్తోంది.

“కాని అంతకు ముందు తిన్న దెబ్బలో?” అని అడగకుండా ఉండలేకపోయేను .

“అది తన మీద కోపం నీ మీద చూపించేరు ”

“మరి పెద్ద దానైన నన్నొదిలి చిన్న చెల్లెళ్లకి పెళ్లి చెయ్యడాన్ని ఎలా సమర్ధిస్టావు” మంచి ప్రశ్న వేసి సుజాతని ఇరుకున పెట్టేననే ఆనందం నాలో.

” నీకు జ్ఞాపకం ఉందా నీకు హాండీ కేప్డు  కోటాలో నీకు ఉద్యోగం వేయించడానికి ఎలా  తిరిగేరో మీ నాన్న? నీ అతి జాగర్తతో  పెళ్లి  వారిని  వేసిన చెత్త ప్రశ్నలకి భయపడి వెళ్లిపోతున్నవారిని  మీ చెల్లితో సంబంధం కుదిర్చి దానికి ఓ దారి చూపించడం తప్పా?

నాకు అలా నాన్నని సుజాత వెనక వేసుకు రావడం నచ్చలేదు. ఇంకా కోపం ఉక్రోషం పట్టలేక ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టేను. ఆ అరుపులలోనే నాకు నాన్న మీద వున్న అభియోగాలన్ని ఏకరువు పెట్టసాగేను .” నా జీవితంలో ఒకే అబ్బాయి నన్ను ప్రేమించేనని వుత్తరం రాసేడు జ్ఞాపకం ఉందా? నేనేమి నీలా అందగత్తెని కాను. అదే నా జీవితంలో మొదటి ఉత్తరం, చివరిది కుడా? అతడితో పారిపోయి జీవితం పంచుకోవాలని అంతో ఆశ పడ్డాను . నా ఆశని మొగ్గలోనే తుంచి నా జీవితాన్ని మోడు చేసింది అతను కాదూ ? అతనికి మాత్రం పెళ్ళికి ఎదిగి వచ్చిన కూతుళ్ళు ఉన్నా సిగ్గు లేకుండా మరో దాంతో కాపురం పెట్టొచ్చు.  ఆర్జించిన డబ్బుదాని మొహాన్న పోసి రిటైర్ అయ్యాక వచ్చిన సొమ్ము  దాని యదాన కొట్టి ఖాళీ చేతులతో సిగ్గు ఎగ్గు లేక మళ్ళా అమ్మ దగ్గరకి చేరితే తన్ని తగలెయ్యక ఆవిడ కుడా సిగ్గు లేక అతన్ని చేరదీసింది. ఆయనగారిని చేరనియ్యక ముందు ఆవిడతో ఉన్న సంబంధం తెంచుకొని ఏకాకిలా బతుకుతున్నాను. పెళ్లి లేదు ,పిల్లలు లేరు, స్నేహితులు లేరు , తల్లి, తండ్రి ఉన్నా  లేనట్టే అలాగే అక్క, చెల్లెలు ఉండి కూడా లేనిదాన్ని అయ్యేను. మరో నాలుగేళ్ళలో రిటైర్ అయ్యే నేను ఎలా బతకాలి ఎవరి అండలో ఉండాలో చెప్తావా?  అదే మా నాన్న నా ప్రేమతో నా వివాహం జరిపితే నా బతుకు మరోలా వుండేది.” అంటూ బోరుమన్నాను.

ఓదార్పుగా వీపు నిమురుతూ ఉదృతం తగ్గేంతవరకు  ఆగి గ్లాసుతో నీళ్లందించి నేను దుఃఖంలోంచి తేరుకునే వరకు ఊరుకుంది.

ఇప్పుడు “ఎలా ఉంది వనజా ?are you feeling better” . అంటూ ఎదురుగా కూర్చుంది. సింగడ ఒకటి తను తీసుకొని ప్లేటుని నా వైపుకి  జరిపి తీసుకో అంది. ఇద్దరం సింగడాలు తినడమే మా ధ్యేయం అన్నట్లుగా ప్లేటు ఖాళీ చేసాం .

సుజాత మళ్ళా  మొదలు పెట్టింది. నువ్వు లవ్వు లో పడి ఇంటి నుంచి జంప్ అవుదామనుకున్నప్పుడు నీకు పద్నాలుగేళ్ళు మాత్రమే. మనం ఎనిమిదిలో చదువుతున్నాం. వాడు అదే నీ లవర్ పదో తరగతి  ఫెయిల్. ఇద్దరూ పారిపోయి ఎలా బతుకుదాం అనుకున్నారు. అంట్లు తోమి మూటలు మోసి బతుకుతారా? ఎన్నాళ్ళు ? వచ్చీరాని జ్ఞానంతో సినిమాలు చూసి అదే ప్రేమ అనుకొని జీవితం పాడు చేసుకుంటుంటే మీ నాన్న బాధ్యత గల తండ్రిగా నిన్ను రక్షించుకోవడం తప్పా? ఆత్మా న్యూనతాభావంతో నీలో నువ్వే ముడుచుకు పోయి ఎవ్వరితోను స్నేహం చెయ్యలేకపోయేవు. ఇక మీ నాన్న రెండో కాపురం సంగతి. అది మీ అమ్మకి నాన్నకి సంబంధించిన విషయం. ఎప్పుడు ఎలా అవిడతో సంబంధం ఏర్పడిందో అప్పటినుంచి మీ అమ్మకి  రైల్వే లో లేడీస్ కోటాలో ఉద్యోగం వేయించి మీకో ఆధారం చూపించి  రైల్వే ఇల్లు మీ అమ్మ పేరుమీదకి  మార్పించాకే  ఆవిడ దగ్గరకి వేళ్లేరు. నీకు ఉద్యోగం వేయించినప్పుడు, మీకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు, పెళ్లిళ్ళు చేసేటప్పుడు అందుబాటులో ఉండేవారుగా ? తండ్రిగా ఆతను ఎప్పుడూ తన బాధ్యతలని మరచి పోలేదు. ఏ బలహీనమైన క్షణంలో ఎవరి పొరపాటు వల్ల జరిగిందో గాని మీ నాన్నగారు ఇద్దరి బాధ్యతలు సమానంగా నిర్వర్తించారు.  ఏవేనా అభ్యంతరాలు వుంటే మీ అమ్మకి ఉండాలి. ఆవిడే పెద్దమనసుతో మీ నాన్నని క్షమిస్తే నీకెందుకు కోపం. అసలు మొదటి నుంచి నీకు వివేకాన్ని చంపే కోపం ఎక్కువ. తన కోపమే తన శతృవు అని మరిచిపోయేవా?” ఇద్దరు ముగ్గురు నీ కోలీగ్స్ నిన్ను పెళ్లి చేసుకోవాలని మద్యవర్తులని పంపితే నువ్విచ్చిన  సమాధానం గుర్తు చేసుకో.

ఇలా అంటున్నానని ఏమి అనుకోకు గాని నువ్వు ఎప్పుడైనా, ఎవ్వరితోనైనా  నవ్వుతూ మాట్లాడేవా ? నీ మొహం ఎప్పుడు ధుమధుమలాడుతూ ఉంటుంది. ఒక్కసారి నవ్వుతూ మీ కొలీగ్స్ ని పలకరించి చూడు తేడా నీకే తెలుస్తుంది. ఒక్క చిరునవ్వు, ఒక మంచిమాటతో మనం సాధించలేనిది ఏది లేదు.

సకారాత్మకంగా అలోచించి చూడు మీ నాన్నమీద నీ కోపం వ్యర్ధమైనదిగా కనబడుతుంది.

సుజాత మాటలు నామీద బాగా పని చేసాయి. నేనే నాన్నని తప్పుగా అర్ధం చేసుకున్నానని అర్ధమైంది.

ఒక్కసారిగా నా మనసంతా తేలిగ్గా అయింది. రేపే వెళ్లి అమ్మని నాన్నని నాతో తెచ్చుకొని అజ్ఞానంతో నేనన్న తప్పుడు మాటలకి, చేతలకి కన్నీళ్ళతో క్షమించమని వేడుకోవాలి అని నిర్ణయించుకున్నాను.

సుజాత వైపు నవ్వుతూ చూసాను. సుజాత టప్పున నా చెక్కిలి మీద ముద్దు పెట్టి “ఇలా నవ్వుతూ వుంటే ఎంత ముద్దోస్తున్నావో తెలుసా? ఎప్పుడు ఇలాగే నవ్వుతూ వుండు. మబ్బులు వీడిన చంద్రుడిలా వున్నావు. నీ ఈ నవ్వు ముఖం చూడ్డానికి ఎన్నేళ్ళుగా మీ నాన్న అమ్మకూడా ఎదురు చూస్తున్నారు .

ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీలో ఈ మార్పు కోసమే మేమందరం ఎదురు చూస్తున్నాం. వెళ్లి నాన్నని జాగర్తగా చూసుకో బై వస్తాను. అని సుజాత వెళ్లి పోయింది.

కళ్ళకి కమ్మిన అజ్ఞానపు పొరలు విడిపోవడంతో రేపే నాన్నని నా దగ్గరకి తెచ్చు కోవాలని నిర్ణయించుకున్నాను.

 

 

 

 

7 thoughts on “క్షమించు నాన్నా ( తండ్రి కూతురు )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *