May 13, 2024

పండిన నాప చేను (తండ్రి – కూతురు)

.                                                                                                                                                                                       బాలసారె రోజు  —                                                                                                                                                                                                                                               ” మళ్ళాఆడపిల్లేనా!”అక్క అనసూయ వెక్కిరింపు, ఆమెకు చక్కనైన కొడుకున్నాడని టెక్కు..

“మూడోసారైనా వంశోధ్ధారకుడు పుడతాడని మీ అమ్మానాన్న కలలు కన్నార్రా!” మేనత్త నసుగుడు, తమ్ముడ్ని తక్కువ చేయాలని ఆమె యావ. “ముగ్గురికి చదువులూ, పెళ్ళిళ్ళూ పేరంటాలూ నీవల్లవుతుందా! పోనీ దీన్ని పెంపుడుకివ్వరాదుట్రా!” పిన్నమ్మ పితలాటం, తన తోడికోడలికి పిల్లల్లేరు, ఈ బంగారపు బొమ్మను ఆ నల్ల బంగారాలకు కట్టబెట్టి, మెప్పుపొందాలని ఆమె ఆశ.

“ఆ ఆడపిలల్లకేం చదువుల్లే! ఇంటి పన్లూ వంట పన్లూ నేర్పితే సరి.” మేనమావ జడ్జిమెంటు, పాపం జడ్జీ కావాలవి ఆశ, కానీ ఆయన చెట్టుక్రింది ప్లీడరే, ఇక్కడైనా జడ్జిమెంట్  ఇచ్చాననే తృప్తి .                                                                                                                                                                                 ” ఐనా ఒక్క మగబిడ్డ నైనా కనలేని వ్యర్ధురాలేంట్రా నీ పెళ్ళాం?” పెద్ద మేనత్త మాయమాట! మేనల్లుని మేలుకు ప్రాకులాడుతున్నట్లు నాటకం.

” ఏమైనా ఆడపిల్లల్ని పెంచడం కష్టమమ్మా! ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం మాటలా! ఎప్పుడెవరితో లేచిపోతారోని భయపడి చావాల్సిందే. మాకు ముగ్గురూ మనవళ్ళేగనక మాకా బాధలుండవు.! ” పక్కింటి పంకజమ్మ ధీమా.  మనవళ్ళుతనని ఆదరించి , ఆకాశానికెత్తుతారని చచ్చేంత  ఆశ.

“ఇహ చాలు ఆపి అన్నాలకు పదండి.” ఇంటి పెద్ద గాండ్రింపు విని అంతా నోళ్ళుకట్టుకుని లేచారు , ఆ నోళ్ళలో విందుభోజనం పట్టించడానికి.

ఆ రాత్రి బాలింత భామతి కుళ్ళికుళ్ళి ఏడుస్తుండగా అత్త అరుణమ్మ ” అమ్మాయ్! బాలింత ఏడవకూడదే!ఎందుకే ఏడ్పు?మీ ఆయనే మన్నా అన్నాడా?  మేమేమన్నా అన్నామా? లోకులు కాకులమ్మా!వారి మాటలు పట్టించుకోకు. బంగారపు బొమ్మలాఉందే పాపాయి. కరాగ్రే వస్తే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ, కరమూలే స్థితా గౌరీ అని — లక్ష్మీ , సరస్వతుల తర్వాత , గౌరీమాత పుట్టిందే అమ్మామనింట! ఐనా ఆడపిల్ల పుట్టను నీ తప్పేముందమ్మా! నీవేమన్నా మగబిడ్డను కననన్నావా! ఊరుకోమ్మా! దేవుడిచ్చిన బిడ్ద ఎవరైతే నేం? ” అంటూ బుజ్జగించింది.

బళ్ళోవేసినరోజు —                                                                                                                                                                                                                “భలే ఉన్నారు ముగ్గురునూ, బొమ్మల్లా !, ఒకటవకృష్ణుడు —కాదు-కాదు ఒకటవ రాధ, రెండవ రాధ. మూడవ రాధ , మనం వేయించబోయే డ్యాన్స్ డ్రామాకు ముగ్గురూ పనికొస్తారు మేడం!.” స్కూల్లో పెద్ద పంతులమ్మతో అంది డ్రామాలు నేర్పించే పంతులమ్మ, సంబరపడిపోతూ  .

అప్పుడే తన మనవల్ని బళ్ళో చేర్పించను వచ్చిన పక్కింటి  పంకజమ్మ ” అలాగైతే మా మనవల్ని ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు , మూడో కృష్ణులుగా తీసుకోండి, వాళ్ళ పక్కన బావుంటారు. “అంది. నీలిమేఘ వర్ణంలో ఉన్న వారి ముగ్గురినీ నవ్వుతూ చూసారు పంతులమ్మలు..
బొమ్మలకొలువు పేరంటంలో                                                                                                                                                                              “అమ్మా!వనజా! అందరికీ బొట్టు పెట్టమ్మా! మనోజా!నీవు అందరికీ కాళ్ళకు పసుపు రాయమ్మా! తనూజా !నీవు జాగ్రత్తగా అందరికీ ఆ తాంబూలం పొట్లాలు ఇవ్వమ్మా!”అని తల్లి భామతి చెప్తుండగా మెల్లిగా చక్కగా పిల్లలు పనులు చేయసాగారు.

“భామతీ!ఎంత బాగా చేస్తున్నారే నీ పిల్లలు ! అందుకేనే ఒక్కఆడపిల్లైనా కావాలని కోరుకుంటారు.ఈ ముగ్గుర్నీకూడా ఆ కొలువులో కూర్చోబెట్టరాదుటే! ఎంత చక్కగా బంగారపు బొమ్మల్లా ఉన్నారే, పట్టు పరికిణీలు కట్టుకుని!మాకు ముగ్గురూ మగ వెధవలే! ఏ పనీ చేసుకోరు. అన్నీ అందించాలి వెధవ లకు.” అంది పంకజమ్మ, మనవల్ని తల్చుకుని మురిసిపోతూ.                                                                                                                                                                                       “ఏం మగపిల్లలైనంతే మాత్రాన అంత గారాబంగా పెంచితే ఎలా వదినా!”  అన్నది పొరుగింటి రత్నమ్మ.

“ఔనే మగ మహారాజులు వారికేం ఖర్మ పనులు చేసుకోను. ఎవర్తో రాకపోతుందా పెళ్ళాంగా చేయకపోతుందా!” అని సాగదీసింది పంకజమ్మ.

“ఏమోలే వదినా! రాబోయేకాలం ఎలా ఉంటుందో ఎవరు చూసొచ్చార్లే! ” అంటూ ముక్తాయించింది రత్నమ్మ.

” ఐనా భామతీ! నీ పిల్లలెంత పనిమంతులే! నా ముగ్గురు మనవలకూ నీ ముగ్గురు కూతుళ్ళనూ ఇవ్వరాదుటే! పంతులయ్య ఉద్యోగం చేసే మీ ఆయన సంపాదనలో ఖర్చులేం పెట్టుకుంటావ్? నీకూ ఖర్చులూ కలిసొస్తాయి , మా యింట్లో పనివాళ్ళురాక నానా బాధలూ పడుతున్నాం , మాకేమీ కట్నకానుకలు వద్దులే తలా పాతిక కాసులు పెట్టు చాలు. ఇంటి పక్కనే ఉన్నట్లు ఉంటారు, రోజూ కళ్ళారా చూసుకోవచ్చు.”అంటూ సాగదీస్తున్న పంకజమ్మను “ఎందుకే పంకజం ఎప్పుడూ నా మనవరాళ్ళమీద నీ కళ్ళు సోడాబుడ్లవుతుంటాయి? వాళ్ళకిప్పుడే పెళ్ళిళ్ళేవిటే! పసికూనలు చదువులూ అవీ కానీ, నీగ్గానీ మతిపోలేదు కదా!”అంటూ అంటించింది ఇహ వినలేక అరుణమ్మ.   “ఓ యబ్బా! తెగ పొడుచుకొచ్చిందే రోషం! ముగ్గురాడపిల్లలకు ఎలా పెళ్ళిళ్ళుచేస్తావో చూస్తాగా? చదివి ఉద్యోగాల్జేసి ఊళ్ళేలతారా! చూడనూ! ” అంటూ మెటికలిరుస్తూ తాంబూలం తీసుకెళ్ళి పోయింది పంకజమ్మ.
ఇంట్లో ఉదయాన్నే–                                                                                                                                                                                            “కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే స్థితాగౌరీ ప్రభాతే —…”అని తండ్రి నవనీతరావు చదువుతుండగానే ముగ్గురూ వచ్చి తండ్రి ఎదుట నిలిచేవారు.అప్పుడాయన పద్యాన్ని ఇలా పూర్తిచేసేవాడు – ‘దుహిత దర్శనం’ – అంటూ కళ్ళు తెరిచి ముగ్గుర్నీ చూసి,  “మా బంగారు తల్లులు! మా ఇంటి మహాలక్ష్ములు! జీవితాంతం నాకిలాగే మీ ముగ్గురూ ఉదయాన్నేకనిపించాలమ్మలూ!” అంటూ పొంగిపోయే వాడాయన.                 “తప్పక నాన్నా! రండి …ముఖం కడుక్కోండి–” అంటూ ముగ్గురూ ఆయనకు, తాతగారికీ  కావాల్సినవన్నీ అమరుస్తారు. వారింట ఉదయాన్నే రోజూ ఇదే దృశ్యం. “ఒరే!నవనీతా!ఇలాగైతే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి పంపాక ఏం చేస్తావురా!”నవ్వుతూ అంటున్న తండ్రి రమణమూర్తిని చూసి,             ” అదేమో నాన్నా! నా బంగారు తల్లుల్ని ముగ్గుర్నీ చూడకుండా  నేనుండలేను.”  అని నవనీతరావు అనగానే, ” మానాన్న బంగారం!” అంటూ ముగ్గురూ ఆయన చుట్టూ చేరేవారు.

రాత్రి భోజనాలయ్యాక దృశ్యం..                                                                                                                                                                           ” అమ్మలూ రండిరా! ఈ రోజు భలే తమాషా జరిగిందిరా!..”అంటూ తండ్రి  ఏవేవో ఒక అర్ధగంట చెప్తుండగా నలుగురూ కలిసి నవ్వుకునేవారు.ఒక రోజున “నాన్నా! మేమంతా ఆడపిల్లలం పుట్టామని నీకు మా మీద కోపంలేదా! ” అన్నదానికి ఆయన ” అది ఎవరి తప్పమ్మా! మిమల్నికన్నది నేను , ఆ కోపమేదైనా ఉంటే నామీద నాకే ఉండాలి, మీమీదెందుకమ్మా! మీరు మాఇంటి లక్ష్ములమ్మా! ఐనా మీరు దేవుడు మాకిచ్చిన బంగారాలమ్మా!” అంటూ పిల్లలను దగ్గరకు తీసుకునేవాడు.

కాలంగిర్రునతిరిగింది.
పిల్లలు ముగ్గురూ బాగా చదివి స్కాలర్ షిప్ లతో డిగ్రీలు పొందారు. పెద్దమ్మాయ్ వనజ, రెండోది నీరజ కూడా ఇంజనీర్లై  మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాల్లో చేరారు. కోరివచ్చి మంచి సాంప్రదాయ కుటుంబాలవారు పెళ్లి చేసుకున్నారు. ఖర్చు కూడా లేకుండా సింపుల్ గా పెళ్ళిళ్ళైపోయాయి యిద్దరికీనీ. మూడోది మనోజకూ మంచి ఉదోగం వచ్చింది.ఇహ పెళ్ళే చేయాలని అనుకుంటున్నారు పెద్దలు.

“ఏమే !అరుణా! నీ మూడో మనవరాలు మనోజకు ఇంకా పెళ్ళి చేయవా! ఏంటీ ? ” అంటూ వచ్చింది పంకజమ్మ.

“నా మనవరాలి పెళ్ళితో నీకేం పనే పంకజం ? వాళ్ళ ఊసెద్ద వద్దని ఎన్నిమార్లు చెప్పినా నీ చెవికెక్కదా! ” కసిరింది అరుణమ్మ.

“ఆ ఒక్కదాన్నైనా నా మనవళ్ళలో ఒక్కరికి ఇస్తావేమోనీ– ”   ఆశగా అర్ధింపు  —                                                                                                                               “అబ్బాఆశ! చిన్నతనం నుండే చెప్తున్నా! నా మనవరాళ్ళ జోలికి రావద్దనీ. నీ ధ్యాస ఎప్పుడూ వాళ్ళ మీదనేనా! ఐనా నీ మనవలు మగమహారాజులు కదా! వాళ్ళకు పిల్లలే దొరకరా ! బంగారంలాంటి నా మూడో మనవరాలు  హాయిగా ఉద్యోగం  చేసుకుంటోంది.  తండ్రికి సాయంగా ఉంది ”

“అందుకే కదమ్మా అరుణమ్మా! మా కోడలికి చక్కగా చదువుకుని ఉద్యోగం  చేసే పిల్ల కోడలైనతే సుఖపడుతుందనీ..”అంటూ కొనసాగిస్తున్నపంకజమ్మతో  “కుదరదు పంకజం! మరెప్పుడూ ఆ ప్రస్తావన తేకు.  చదువు , ఉద్యోగం లేని వాడికి నా మనవరాలినివ్వను ఏంఖర్మ పట్టలేదు.” ఖరా ఖండీగా చెప్పింది అరుణమ్మ.

హాస్పెటల్లో—                                                                                                                                                                                                      “నీవెంత అదృష్టవంతుడివయ్యా! నవనీతరావ్! ఎంత మంచి బిడ్డల్నుకన్నావయ్యా! నీకు బాగాలేదని తెలియగానే భర్తలతోపాటుగా రెక్కలుకట్టుకుని వాలారయ్యా! ఒకరు రక్తం ఇచ్చారు. ఒకరు కిడ్నీ దానం చేశారు. మరొకరు రేయింబవళ్ళూ కనిపెట్టుకుని సేవ చేశారు!  ఇంతమంచి బిడ్డలు పుట్టడం నీ పూర్వజన్మ సుకృతమయ్యా ! ఎందుకూ నాకూ ఉన్నారు ముగ్గురు కుపుత్రులు!  వెధవలు ఇంకా డిగ్రీలే పూర్తి చేయలేదు . వెధవ తిరుగుళ్ళు తిరుగుతూ నా ఆస్తంతా హారతి కర్పూరం చేసేస్తున్నారు. అంతా మా అమ్మ చేసిన గారాబం. మొన్నామధ్య నాకు యాక్సిడెంటై రక్తం కావలిస్తే ఒక్క వెధవా రాలేదు కనీసం చూట్టానికైనా,’ రక్తం ఇవ్వాలిరా!’ అని వాళ్ళ బామ్మ అదే మా అమ్మ అడిగితే ‘మేమెక్కడ రక్త మిస్తామే!నీ ముసలి కొడుక్కోసం! ఎంతో కాలం బతకాల్సిన వాళ్ళం, మావల్ల కాదు పోవే!’ అని ఖండితంగా చెప్పేశారు. కనీసం’ ఎట్లావున్నావ’ నైనా అడగలేదయ్యా పనికిమాలిన వెధవలు. నాభార్యకు టైఫాయిడ్ జ్వరం వచ్చి మంచం పడితే ఒక్క రోజైనా దగ్గర కొచ్చి పలకరించిన పాపాన పోలేదు దౌర్భాగ్యులు. ఎందుకయ్యా కొడుకులు, ఈవెధవలు రేపు మాకు తలకొరివి పెట్టనూ రారయ్యా! ” అంగలార్చాడు పంకజమ్మ కొడుకు రామ్మూర్తి .

అతడితో పాటుగా అక్కడున్న తమ బంధువులందర్నీ చూస్తూ అంది అరుణమ్మ  .”ఏమోలే రామ్మూర్తీ !మాకు ముగ్గురూ మనవరాళ్ళేగా! ఎలాగో దేవుని దయవల్ల సక్రమంగా చదువులు పూర్తై ,ఉద్యోగాలు పెళ్ళిళ్ళూ సక్రమంగా అయ్యాయి, తల్లి దండ్రులకు అండగా ఉంటున్నారు. ఈరోజు తమ తండ్రికి ఇలా కిడ్నీ మార్చాల్సి వచ్చిందని తెలీగానే ఆఘమేఘాలమీద,ఉద్యోగాలకు శలవు పెట్టుకుని వచ్చి వాలి, అన్నీదగ్గరుండి చూశారు, డబ్బుతెచ్చి దగ్గరుండి సేవచేశారు. అంతా ఆ దేవుని దయ.” అంది ప్రేమగా కిడ్నీ ఇచ్చిన మూడో మనవరాలు మనోజ   తల మీద చెయ్యేసి నిమురుతూ. కళ్ళుతెరిచి ఎదురుగా ఉన్న తన ముగ్గురు కూతుళ్ళనూ చూస్తూ చిరు నవ్వు నవ్వాడు నవనీతరావ్. “కరాగ్రే వసతే లక్ష్మీ—“-అని పాడుతూ

2 thoughts on “పండిన నాప చేను (తండ్రి – కూతురు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *