May 3, 2024

పద్యమాలిక – 2

padyamalika2

Maddali Srinivas

పంచ చామరం
————————————————–
శివంబు మంగళంబు రాజ శేఖరా ముదంబుగన్
రవించు వీణ నాదమంజు రావముల్ సుతారమౌ
నివాళి నీకు జేతు నయ్య నీ దశాననంబులన్
రవించు గాడ్దె వోండ్ర లల్లె రంకెలింక నాపుమా

ముదావహంబు నీదు వీణ మోహనంబు రాగమున్
సదా మనోహరంబునౌను సాధనల్ నిధానముల్
నిదానమే ప్రధానమౌను నీదు గాత్రమే మహా
విదారకంబునౌ వినంగ వీనులందు నోప్రభూ

తాపీ గా నీ వీణను
కాపీ పలికించినంత కాఫీ ఖూబౌ
నాపై పది గొంతులతో
నాపాటను పాడుటేల నా తల పగులన్

శివతాండవ స్తుతిని తా
నవలీలగ జేసి నాడునయ్యవసరమున్
రవభీషణమున రావణు
నెవరోడించగ లరయ నెన్నటికైనన్

దశగళ గాన వాహిని విదారక ధారనురంబు చిన్నమై
వశమును గాక వీనులునవశ్యము శాంతిని గోర నాపుమా
కుశలత వీణ నాదమును గ్రోలను చిత్తము నాశ నొందుదున్
దశదిశలందు మ్రోగను హృదాంతర సీమను మోదమౌ ప్రభూ!

Bss Prasad

కం. వీణా నాదము చాలును
పోనీ యని వినుదునేను పూటల కొద్దీ
కానీ ఆ పదిగొంతుల
గానము విననా వశమున కాదిక మగడా

కం. దానవ బ్రహ్మా ! వినుమా
వీణా వాదము సహింతు, వీనుల విందే!
గానము నాపుము ప్రభువా !
ప్రాణము నాదింక పోవు పాటను వినగా

ఓ నాధా మనసే హసించు ముదమున్- యొక్కింత రాణింప గా
వీణావాదములే స్రవించి విరివిన్ -వేదమ్ము సంధించ గా
కానీ నా వశమే వికార గళమున్- కామించి సాధింప నీ
గానమ్మున్ ధరణీశనీవు దయయున్ -కంఠంబులన్ మూయుమా !

చక్కగ వీణలు మ్రోగ గ
మక్కువ తోవిను దునేను మండో దరినై
ప్రక్కగ పాడుట నాపుము
దక్కును ప్రాణము యొకింత దాపము తరగన్

మెల్లని వీణా వాదము
చెల్లును నదినాకునచ్చి చెవులే మెచ్చన్
గొల్లున గొంతును పెంచగ
ఒల్లను నేనది గృహమున ఓండ్రలు పెట్టన్

చక్కనౌ వీణ వాయించ మెల్ల గాను
సొక్కదే మది ద్రావించు రాగ సుధల్
ప్రక్కగా పాడి నువ్వు పా డుస్వరము
తొక్కనేల మమ్మిట్టి దురావస్తలన్

వాయించుమునీవీణియ
మ్రోయించు మహేశు గీతములు జగమెల్లన్
చేయించు చెవుల పండుగ
గాయన మది వలదిక దశ కంఠా వినుమా

Devarakonda Subrahmanyam

వీణావాదనమునకు
తన గానామృతము జోడింపగ దశకంఠుండు
వినలేక మండోదరి
చనువున వారించె నాధుని పాట వలదంచున్

NagaJyothi Ramana

గూబలుగుయ్యనుచునదరె
గాబరగనుగుండెలదిరె-గాత్రము చాలున్
ప్రాభవముగవీణనిపుడు
శోభనముగమీటితమరు-శోభిలుమింకన్

రౌద్రపు వీణను వినియున్
రుద్రుడుసంతసమునతను-రువ్వెన్ వరముల్
భద్రము రావణ రాజా
రుద్రుడు నీ గాత్రమువిని –రుసరుసలాడున్

పదిగొంతుల పాడకుమా
అది తీయును ప్రాణములను-అవలీలగనే
సుధలొలికిడి నీవీణను
ముదమారగమీటుమికను-మూర్ఖపు మగడా

సరదా పడి పాటడిగిన
పొరపాటు ను చేయనుమరి_పొందితి బుధ్ధిన్
పరిపరి విధముల వేడుచు
వరమునొకటి ఇపుడదిగెద -వలదిక గాత్రం.

Srinivasa Bharadwaj Kishore

పదిపాటలు దశకంఠుడు
పదిగొంతుల నొక్కసారి పాడుటవినగన్
అదిరిపడెను యటయుండిన
ముదితయె దైత్యాదులంత మూసిరిచెవులన్

ఫుల్లుగ వాల్యూమ్లోనే
గల్లీ లో పాడు పోయి గణపతి కాడే
సల్లంగా వుంటిమిగద
మెల్లంగా పాటనాపు మియ్యానీవే

ఎలుగెత్తిటు పాడకునివు
పలుగొంతులు కలవకుండె పాటలు ఘోరం
విలవలలాడెను ప్రాణము
నిలుపర నీపోరునింక నేనుభరించన్

చెలగు యాట గాను జేసి నవ్వేవీవు
ప్రాణ సంక టమ్ము పాట మాకు
బిక్క మొగము వేసె పిచ్చితల్పముగూడ
వేడె దాప పాట వీణ చాలు

వయ్యమ్మో ఇదియేందిర
ఇయ్యాలీ తీరులొల్లి ఎందుకుమగడా
దయ్యాలే జడుసుకునెగ
దయ్యా ఇంకాపరాదె ఆపదిపాటల్

Subrahmanya Chakravarthi Oruganti

పట్టెను రావణు వీణను
గట్టిగ గొంతెత్తి పాడె గార్ధభ స్వరమున్
పుట్టగ గుండెలలో దడ
తిట్టెను పెండ్లాము నోటి తీటలు తీరన్

గోలి హనుమచ్ఛాస్త్రి

ఐదు తలలవాడు ఆత్మలింగమ్మును
ఎందుకిచ్చె ననగ నిపుడు తెలిసె
పదితలలును ఘోష పడిపడి జేయగా
తట్టుకొనగ లేక తమరి బంపె.

రావణు పది గొంతుకలే
చేవగనే పాడ వీణ చేతనె బట్టన్
రా, వణుకే పుట్టెను సతి
కేవలమావీణజాలు గీతి వలదనెన్

పది వాయిద్యమ్ములు నొక
మదిదోచెడి గొంతు వినిన మాన్యుడ హాయౌ
కుదురున యొక్కటె వీణయు
పదిగొంతుకలున్న గోల పదపద చాలున్.

మీకేం పదితల లాయెను
నాకున్నది చూడ నొకటి నానాధా ఈ
భీకర గానమునాపుము
శ్రీకంఠుడు భూతపతికె చెల్లును వినగన్

దండిగ పదిగొంతులతో
బండగ నారావణుండు పాటను పాడన్
మండగ నుదరమ్మప్పుడు
మండోదరి కసరె తాను ” మండోదరియై ” .

( ” మండు ఉదరి ” సరదా ప్రయోగమని మనవి )

 

సరిగమలను పదిగొంతుల
సరిజేయుచు రావణుండు ‘ సా ‘ యన మండో
దరి పదనిస పది ” నస ” పద
సరిగాదిది వీణయొకటె చాలని చెప్పెన్.

గతమున నాపై మీరే
మితిమీరుచు పాట బాడి మెప్పించితిరే
హితమా ! నేడా సీతన్
స్తుతిజేయుచు బాడ నాకు దుఃఖము రాదా !

మీస్తవము శివుడు మెచ్చెను
వాస్తవమే గాని నాధ ! ప్రతిరోజిటులన్
ముస్తాబై , పదిగొంతుల
జాస్తిగనదె పాడి పాడి చం’పగ’ తగునా ?

నన్నొక్క నోట తలపవు
నిన్ననొ మొన్ననొ ధరణిజ నిట దెస్తిరిగా
కన్నొకటి వేసి చూస్తిని
హన్నా పదినోళ్ళ మెచ్చి హాయంటారా !

శ్రీ కంఠుని మెప్పించిన
మీకంఠములందు పాట మెచ్చితి, వేరే
స్త్రీ కంఠము నందుటకై
ఈ కంఠపు శోష మాను మిదిగో నాధా !

అది గొప్పయె కాదననులె
పది పాటల నొక్కమారు పాడెడు ఘనులే !
పదిగొంతుల నొక పాటయె
పదిలముగా పాడుమయ్య పతిదేవా ! హా !

Arka Somayaji

కింకరులు బెదరు చుండిరి,
లంకాధిప! మీదు గాన లహరులు వినుచున్,
జంకెడు, నా హంసము! మీ
రంకెలు! మానుండు!(ఆ) భేరి,రాగమునందున్

దశ కంఠులు గద!, మీ….యా
దశ దిశల పరిభ్రమించు ధ్వని సంపత్తుల్,
విశదమ్మె! నాకు! నాధా!
మశకమ్ములు జేరు, నోట! మానుండికపై

Venkata Subba Sahadevudu Gunda

గొంతున కొక పాటైనను
వింతౌ నొకటైన వీణ వీనుల వినగన్!
సంతస మందగ మీ పది
గొంతుక లందొక్క పాటఁ గూర్చుము నాథా!

పనిలేక మీరు పాడఁగ
వినలేకను విసుగు పుట్టె వీణే జాలున్!
పనివారలుమూయఁజెవుల
పని పురమాయించు టెట్లు ప్రభువా! వినవా?

హంస వాహ నంబు హడలిపోతున్నది!
సేవఁ జేయు వారు చెవులమూయ
వీణ యొకటె జాలు వినసొంపు గానుండు!
నోరు మూయ కున్న పారి పోదు!

చెవులు మూసి వెడల సేవక బృందమ్ము
పాల నంబు జేయ పాట నాపి
పదుగురల్లె మారి పనిజేయ గదలండి
లంక ప్రజల కెట్టి జంకు లేక!

శంకరులమెప్పుపొందిరి!
కింకరులకు మీదు పాట గిట్టదు స్వామీ!
లింకులు వీడిన మనపని
సంకటమై నిల్చు నింక సకిలించకుమా!

సీతను దలచెడు గొంతుల
మోతకు మాగూబలదరె!మూసిన మేలౌ!
వాతాత్మజు సందేశము
సీతాపతిఁ జేరి నంతఁ జిక్కులఁ బడరే!

ఒకనోటను వలదన్నను
పకపక మని నవ్వి సీత పాటే పాడన్!
యకటా! వినలేమయ్యా!
నకరాలవి మానకున్న నగుబాటు గదే!

అందమ్మన నీదనియెడు
చందమ్మున పాడు చుండ సరసుడ వేరా!
బృందము వినలేకున్నది
సుందర! ‘రూపేచలక్ష్మి’ సొంతము నీకున్!

నోరార పాడు చుండగ
భారమ్మౌ వీణ మీట పట్టును విడుమా!
గోరార నేనె మీటగఁ
గోరితి ‘కార్యేషు దాశి’ కోరిక దీర్చన్!

పడకింటికి పరిమితమౌ
నుడికారముఁ బాటఁ జేసి నోరాడించన్!
జడిసితి రా సేవకులే
‘మడి’ లో ‘శయనేషు రంభ’ మరచిన మేలౌ!

ఎదురుగఁ గూర్చో బెట్టుకు
పది నోళ్లను బాటఁ గూర్చి పాడుచు వీణన్
సొదబెట్టిన వినగలరా!
వదలక! ‘క్షమయా ధరిత్రిఁ’ బఠియించితిరా!

ఆదిమహాలక్ష్మిన్ మదిఁ
గాదన సేమమ్ము దక్కు గాండ్రించకుమా!
వాదమ్ములేలర? సదా
నీదగు ‘కరణేషు మంత్రి’ నేనే గానా?

పది నోళ్ల తోడ విందున
పది రకముల భక్ష్య భోజ్య పరమాన్నంబుల్
ముదమున వడ్డించితినని
యెదురుగ’భోజ్యేషు మాత’ యేకరువేలా?

Voleti Srinivasa Bhanu

“వీణా పాడవె “అంటూ
ఆ నాడే పాడినాను అదిమరచితిరా
ఈ నాడిదేమి విభులీ
గానాలతొ మమ్ము చంపు కారణమెదియో

ఘనుడగు ఆ ఎన్టీఆర్
కనువిందుగ మీటుచుండ గమకములొప్పన్
తనవంతు బీ సరోజా
వినిపించెను వీణ పాట వినిమరచితిరా

Chakravarthula Kiran

మీ పాటకు మీ ఖోరస్
ఆపాలనిపించదేమి, హయ్యో “రామా”!
నా పాటికి నేనుంటే
ఈ పాట్లవి యేల నాకు? ఏం ఖర్మ, సఖా!

వాయించుకునేదేదో
హాయిగనే ఉంది కాస్త – అది “ఓకే” లే!
పోయేలా ఉన్నాం మేం
సోయైనా లేక తమరు “షో” చేస్తుంటే!

మా బాగా పాడానని
మీ బలమైన అనుకోలు! మేటరు చూస్తే
గూబలదిఱిపోతున్నాయ్ –
ఆ బంటుల బాధ జూడు, అయ్యో పాపం!

తీగలు మీటడమెందుకు?
మీ గళదశమున్న చాలు మేదిని కదులున్!
ఊగెను మందిరమంతయు
సాగే మీ స్వైరగాత్ర సాధింపేలా!!

Chandramouli Suryanaryana

వీణయె చాలును స్వామీ
క్షోణిని రావములనేల క్షోభిత పరచన్
శోణితముకారు చెవులను
రాణువ బెంబేలు పడిన రణముననోడున్

పదితలకాయల స్వామీ
వదలుడు గాత్రమ్ము మీకు వందనమిడుదున్
మదికిన్ వీణా నాదమె
ముదమగు వాయించ మీరు ముచ్చట గాదే

ఏ పాపము జేసితినో
మీ పాటల బారి బడితి ! మీరీ రొదనే
యాపక పోయిన నేనీ
కాపురమును జేయను దశకంఠా వినుమా!

మత్త కోకిల :
పాటయెంతయు గొప్పదైనను బంతిమోముల పాడినన్
చేటుచేయదె కర్ణభేరికి చిత్తగించుడు మా వ్యధన్
దీటులేరుగ మీకునెవ్వరు దిట్టమీరుగ వీణలో
మీటినన్ తమ వీణతంత్రుల మెచ్చునెల్లరునోప్రభూ

మత్తేభము:

దశకంఠంబుల పాడిమీరు మము నాధా యిట్లు హింసించినన్
కుశలం బెవ్వరికేనియున్ కలదె మాకోర్పుల్ నశించున్ గదా
యశమున్ బొందగ చేతిలో కలదుగా యావీణ వాయించినన్
వశమౌ నెల్ల ప్రశంసలున్ గనుక మీపంతంబునాపండికన్

ఏపాటను తనుపాడిన
నాపకుమో రాణి లంకకదియే శుభమౌ
నీపతి పాటలనాపిన
యేపాపపు పనుల దెచ్చు నేచిక్కులనో

పాటనాపివేయుడింక పాడినంత చాలులే
చేటుచేయనేల దించి చెవ్వులందు మేకులన్
సాటిలేని మేటి వీణసాధకుండు మీరుగా
తీటతీరుదాక వీణ తీయగాను మీటుడీ
J K Mohana Rao

మత్తకోకిల –
పాటఁ బాడును చక్కగాఁ బది – పంచమస్వర కంఠముల్
నీటుగాఁ బ్రణయమ్ము నింపఁగ – నేర్పుతోఁ బెను గూర్పుతో
మీటు వీణను సుందరమ్ముగ – మించు వేగముతోడ నా
మేటి రావణుఁ జిన్నబుచ్చుట – మేలు గాదని జెప్పెదన్

Shankar Boddu

దశకంఠుని గానముతో
దశదిశలే పిక్కటిల్ల దడపుట్టినదో
దశకంఠుని భార్యామణి
శ్మశానమే దిక్కటంచు చాలించుమనెన్!

వీణను వాయించు తమ ప్ర
వీణత నెరుగుదును స్వామి వినుటకు నింపౌ
క్షోణీమండలమున మా
ప్రాణములను దీయునటుల పాడకు నాథా!

గుండు మధుసూదన్

పది తలల తోడఁ బాడిన
పదివీణలు కావలెనయ పౌలస్త్యా నీ
విదియే యెఱిఁగియుఁ బాడిన
ముదమగు మా కందఱకును మూర్ధములూగున్!

“దశకంఠుఁడ, నేఁ బాడం
దశదిశలును మ్రోఁగవలయు” నన, సతి నగుచున్
“పిశితాశనపతి! తవ గా
త్ర శక్తి మచ్ఛ్రోత్రభేరి వ్రక్కలయె” ననెన్!

Sudharshan Kusma

బాణీలను నేర్చు కొనుచు
వీణను వాయించు చాలు విందుము ప్రీతిన్
ప్రాణములార్పెడి గానపు
రాణంబుల నాపుమయ్య రావణరాయా!

Srinivas Iduri

పది తలలూపుచు ముదమున
మది మెచ్చగ పాడవలెను మానస చోరా
వదలక వినెదము, గానీ
కదిలెను పేగులు కడుపులొ కదపగ వీణన్

తెచ్చుట తేలిక సీతను
మెచ్చదు గానము తమరిది-మేల్కొను నాధా
చొచ్చుట తధ్యము రాముడు
వచ్చును లంకకు పతనము వల్లభ వినుమా

Sailaja Akundi

పంక్తి కంఠుడు వీణ మీటిన భార్య గారికి మోదమే
పంక్తి కంఠుడు పాట పాడిన పాప మామెకు ఖేదమే
పంక్తి కంఠుని పాట వేటుకు బంటు లందరు చచ్చిరే
పంక్తి కంఠుని పాట ధాటికి పైకి పోయెను ప్రాణమే!!!

దిక్కులు వణికెను నాధా!
ముక్కంటియె తెఱచు నేమొ మూడవ కన్నే
స్రుక్కెను కింకరు లదివో!
మ్రొక్కెద మరి పాడవలదు మొత్తుము వీణన్!!!

Vanam Venkata Varaprasadarao

విషమునుగొనె విషధరముల
విషయమనక గళముననిడె విషయుతగళముల్
విషమ పదివినుట శివునకు
విషమునిడుము సుధగగొనెద విడమిసరిగమల్

వీణియచేతనా సుగుణవీణను సీతను మోహపుచ్చుటల్
తూణియమన్ననూ, వినర! తూపుల చాలన ఖేలనమ్మునన్
పోణిమలున్నవాడటర! పోరుకు వాకిట నిల్చినాడటన్
ప్రాణములున్నచాలు నిను ప్రార్థనజేసెద వీడుమా సతిన్

వీణా వాదన తత్పర
ఏణాక్షిని నిప్పుఁ దెచ్చి ఏమరి పాటల్?
ఘోణివి నీవన తాఁ హరి
కాణాచిర కదనకళకు కాంతను విడుమా!

యిదేమన్న బాగున్నదిట్రా సరిట్రా?
పదున్నాయనేగంద పంతంబటట్రా?
పదెత్తీ అరిస్తేల? పౌలస్త్యచస్తా
గదిస్తా, చరిస్తే ముగుస్తా, మురుస్తా!

వగపుల దారుణ వాదన కారణ వీణలవాదన ‘వా!’ విడుమా!
మిగలను నేనిక మెచ్చెద చచ్చెద మేలవు గావిషమే నిడుమా!
పగడవ? సీతను పట్టను గట్టిది పట్టితి వీణియ పాపి యమా!
పగులును పుచ్చెలు పంతమ? పుచ్చుము పట్టను సీతను పన్నగమా?

భామను, వీణతొ రావణు
నామదిఁ గనఁ మెదిలె, లంక నాశపు నిప్పుల్,
రోమది తగలడుచుండగ
సోమరి నీరో ఫిడేలు ‘జో’రన్ మ్రోతల్!

Gopala Krishna Rao Pantula

శ్రీ రాముడు లంకాపురి
చేరిన సంగతి తెలియగ చేవయె లేకన్
ఆ రాముని అని యందున
ఈ రావణు డెదుర లేక ఈ పని కొప్పెన్!!

దశ కంఠుని గాత్రమ్మది
దశ దిశలను చేరి యపుడు డమఢమలాడన్
దశరథ రాముడు బెగ్గిలి
విసవిస తనసేన తోడ వెనుకకు మరలెన్ !!

 

Sirasri Poet

ఉత్సాహ:

రావణుండు వీణమీటి రాగమాలపించగా
బావురంటు కోటలోని బంటుకోటి కెవ్వనెన్
గావుకేక లంకనెల్ల గానమయ్యి చుట్టగాన్
ఈ విధమ్మునాపమంచునీసడించె భార్యయే

 

7 thoughts on “పద్యమాలిక – 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *