May 22, 2024

అంతా రామమయం….

రచన: నండూరి సుందరీ నాగమణి

angy-lord-rama-on-indian-festival-ram-navmi-wide-screen-wallpapers-rama-wallpaper-

ప్రకృతి మాత వసంతపు వలువలను ధరించింది… నిండుగా పూచిన గున్నమావి వేదికపై, కోకిలమ్మ గాయని కూర్చుని, పంచమ స్వరంతో గానకచేరీ ఆలపిస్తోంది… ఈ సంతోష సంబరాలు ఎందుకంటారా? ఇందుకే…

 

చైత్ర శుద్ధ నవమి! శ్రీ రామ నవమి…పునర్వసు నక్షత్ర లగ్నమున  దశరథ తనయుడై రామచంద్రుడు ఇనవంశాంబుధిలో ఉదయించిన పవిత్రమైన పర్వదినం ఈనాడే… కోదండ రాముడు, కౌసల్యా తనయుడు సీతను చేపట్టి, సీతారాముడైన శుభదినం కూడా ఈనాడే… అందుకనే వాడవాడలా పందిళ్ళు, వేడుకగా రామ మందిరాలలో కళ్యాణ మహోత్సవాలు… చల్లని వడపప్పు, పానకాలు… ఎంతటి వైభవం ఆ స్వామి కల్యాణం?

 

అందుకనే, ‘విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా…’ రామ జననం మొదలుకొని, శ్రీ రామ పట్టాభిషేకం వరకూ, రామ చంద్రుని విలువిద్య నుంచి, ఉత్తర రామాయణం వరకూ ఆ రామలీలలను వివరించే, వర్ణించే అద్భుతమైన సినీ గీతాలు ఎన్నెన్నో…

 

‘రామకథను వినరయ్యా, ఇహపర సుఖముల నొసగే సీతారామకథను వినరయ్యా….’ అంటూ సాగే గీతంలో ‘అయోధ్యానగరానికి రాజు దశరథమహారాజు…’ అని ప్రారంభమై, పుత్రకామేష్టి వలన దశరథునికి నలుగురు పిల్లలు పుట్టటం, విశ్వామిత్రుని యాగ రక్షణ నెపమున (అతని విలువిద్యకోసమై) ముని వెంట పంపటం,  అస్త్రాభ్యాసం తదుపరి, సీతా స్వయంవరానికి మిథిలా నగరానికి రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట పయనించటం, అక్కడ శివుని విల్లును విరిచి, కలికి సీతమ్మను చేపట్టటం… ‘కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలసినవీ…’ అని ఆగుతుంది ఈ మధురగీతం.

 

‘వినుడు వినుడు రామాయణ గాథా’ అని సాగే మరో గీతంలో శ్రీరామ పట్టాభిషేకానికి జరిగే ఏర్పాట్లు, అది చూసి మంధర మాత్సర్యంతో కైకేయి మనసును విరిచివేయటం, ఆమె అలకపాన్పు ఎక్కి, భర్త దగ్గర వరాలు కోరుకోవటం, తత్ఫలితంగా శ్రీరామ వనవాసం ప్రారంభం కావటం… చివరి వాక్యాల్లో, శ్రీరాముడు అడవికి బయలుదేరినందుకట – ‘గోడు గోడున అయోధ్య ఘొల్లుమన్నదీ, వీడకుమా మనలేనని వేడుకున్నదీ… అడుగుల బడి రాఘవా… ఆగమన్నదీ… ఆగమన్నదీ…ఆగమన్నదీ…అడలీ అడలీ కన్నీరై అరయుచున్నదీ…’ అని ముగుస్తుంది… ఆ గాన మాధురికి నీరైపోని గుండె ఉంటుందా? ఆ వియోగాన్ని పాట వింటున్న శ్రోత సైతం అయోధ్యలాగానే అనుభవించడూ?

 

‘శ్రీరాముని చరితమునూ వినుడోయమ్మా…’ సీతారాముల వనవాసం మొదలుకొని, రావణ వధ అనంతరం తిరిగి సీతతో అయోధ్యకు తిరిగి రావటం వరకూ కొనసాగుతుంది.  ఈ మూడు పాటల్లోనూ బాలకాండ నుండి యుద్ధ కాండ వరకూ జరిగిన రామాయణ గాథనంతా ఎంతో హృద్యంగా రచించిన శ్రీ సముద్రాల రాఘవాచార్య గారికీ, ఈ గానలహరికి ఎంతో మంచి సంగీత బాణీలను ఇచ్చిన ఘంటసాల మాష్టారికీ, ఆ పాటలను ఎంతో మధురంగా పడిన పికద్వయం శ్రీమతి లీల, శ్రీమతి సుశీల గార్లకు తెలుగు జాతి యావత్తూ ఋణపడి ఉంటుందని అనటంలో సందేహం ఏమాత్రం లేదు.

 

ఇలాగే, శ్రీరామ జననం నుండీ, పట్టాభిషేకం వరకూ మన కనులముందు రామాయణ ఘట్టాలను ఆవిష్కరింప జేసే మరో మధురగీతం, భూకైలాస్ చిత్రం లోని ‘రాముని అవతారం – రవికుల సోముని అవతారం’ గీతం. నారద మహర్షుల వారు, పార్వతీ దేవికి భావిలో సంభవించబోయే రామావతార ఘట్టాన్ని వివరించే దృశ్యం అది. ‘చదువులు నేరుచు మిష చేత – చాపము దాలిచి చేత…’ అన్న పంక్తుల్లో అర్థాలంకారం అనన్య సామాన్యమే… ‘ధనువో, జనకుని మనమున భయమో, ధారుణి కన్యా సంశయమో… దనుజులు కలగను సుఖ గోపురమో, విరిగెను మిథిలా నగరమున…’ ఆహా, ఎన్ని విరిగినవి, మిథిలా నగరంలో? ఈ మధుర గీతాన్ని సముద్రాల రాఘవాచార్య గారు రచించగా ఆర్.సుదర్శనం, ఆర్. గోవర్థనం గారలు సంగీతం సమకూర్చారు. అద్భుతంగా ఘంటసాల వారు తమ కంచుకంఠం తో గానం చేసారు.

 

ఇక కళ్యాణం – సీతా స్వయంవరంలో, సభా మంటపంలో శివధనుర్భంగము కావించి, సీత చేయిని చేపట్టిన వైనాన్ని, ఈ తెలుగు పాటలో ప్రతీ ఏటా పందిట్లో  వింటూనే ఉంటాము, ప్రతీ పెళ్లి పందిరిలో ఈ పాట మారుమ్రోగిపోతూ ఉంటుంది…

 

“సీతా రాముల కల్యాణం, చూతము రారండి…శ్రీ

సీతా రాముల కల్యాణం, చూతము రారండి

 

చూచు వారలకు చూడముచ్చటట- పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట…

భక్తి యుక్తులకు ముక్తిప్రదమట

ఆ…ఆ…ఆ…ఆ…[ఈ ఆలాపన అద్భుతం అంతే…]

భక్తి యుక్తులకు ముక్తిప్రదమట – సురలను మునులను చూడవచ్చునట…

కల్యాణం, చూతము రారండి

 

దుర్జన కోటిని దర్పమడంచగ – సజ్జన కోటిని సంరక్షింపగ…

ధారుణి శాంతిని స్థాపన చేయగ

ఆ…ఆ…ఆ…ఆ…

ధారుణి శాంతిని స్థాపన చేయగ – నరుడై వెలసిన పురుషోత్తముని…

కల్యాణం, చూతము రారండి

 

దశరథ రాజు సుతుడై వెలసీ, కౌశికు యాగము రక్షణ చేసీ,

జనకుని సభలో హరువిల్లు విరచీ

ఆ…ఆ…ఆ…ఆ…

జనకుని సభలో హరువిల్లు విరచీ – జానకి మనసు గెలిచిన రాముని

కల్యాణం, చూతము రారండి

 

సిరి కళ్యాణపు బొట్టును పెట్టీ…- మణి బాసికమును నుదుటను కట్టీ

పారాణిని పాదాలకు పెట్టీ…

ఆ…ఆ…ఆ…ఆ…

పారాణిని పాదాలకు పెట్టీ… – పెండ్లి కూతురై వెలసిన సీతా

కల్యాణం, చూతము రారండి

 

సంపగి నూనెను కురులను దువ్వీ – సొంపుగ కస్తూరి నామము దీర్చీ

చెంప జవ్వాది చుక్కను పెట్టి

ఆ…ఆ…ఆ…ఆ…

చెంప జవ్వాది చుక్కను పెట్టి – పెండ్లీ కొడుకై వెలసిన రాముని

కల్యాణం, చూతము రారండి…

 

రాముని దోసిట కెంపుల ప్రోవై, – జానకి దోసిట నీలపు రాశై…

ఆణిముత్యములు తలంబ్రాలుగా…

ఆ…ఆ…ఆ…ఆ…

ఆణిముత్యములు తలంబ్రాలుగా…శిరముల మెరిసిన సీతారాముల

కల్యాణం, చూతము రారండి…

శ్రీ సీతా రాముల కల్యాణం, చూతము రారండి

 

 

ఇలా ఆరు చరణాలతో హాయిగా సాగిపోతుంది… శ్రీమతి సుశీల గారు కోరస్ తో కలిసి అద్భుతంగా గానం చేసిన ఈ పాటను రచించిన వారు సముద్రాల సీనియర్, సంగీత దర్శకత్వం వహించిన వారు శ్రీ గాలిపెంచల నరసింహారావు గారు.

 

సీతా కళ్యాణ ఘట్టం గురించిన మరోపాట వాగ్దానం చిత్రం లోని ‘శ్రీ నగజా తనయాం’ అనే శ్లోకంతో మొదలయ్యే ఒక హరికథ. ఘంటసాల వారి అమరగానంలో, రేలంగి గారి అభినయంలో హాయిగా తీయగా సాగిపోతుంది. పెండ్యాల నాగేశ్వరరావు గారి మధుర బాణీలో శ్రీశ్రీ గారి అద్భుతమైన సాహిత్యం అలా ఒదిగిపోయింది. నాస్తికులు గా పేరు పొందిన మహాకవి కలం నుండి ఇంతటి మహత్తర గీతం రావటం నిజంగా అద్భుతం కాక ఇంకేమిటి?  రామచంద్రుని అసమాన సౌందర్యాన్ని వర్ణిస్తూ కవి అంటారు, ‘వాడు, నెలరేడు… సరిజోడు, మొనగాడు … వాని కనులు మగ మీలనేలు రా.. వాని నగవు రతనాల జాలురా… వాని జూచి మగవారలైన మైమరచి మరుల్గొనెడు మరో మరుడు, మనోహరుడు…రఘూ రాముడు… రమణీయ వినీల ఘన శ్యాముడు…’ అని… ఇంతటి సాహితీ విలువలున్న పదబంధాలు సృష్టించిన శ్రీశ్రీ గారికి మన కృతజ్ఞతలు తెలుపవలసిందే…

 

“ఫెళ్ళు మనే విల్లు, ఘంటలు ఘల్లుమనే… గుభిల్లుమనే గుండె రిపులకు, ఝల్లుమనియే జానకీ దేహము… ఒక నిమేషమ్ము నందె నయము, జయమును, భయము, విస్మయము గదురా…శ్రీ మద్రమారమణ గోవింద!’ శబ్దాలంకారం చూసారా మరి? ఎంత బాగుందో… ‘కాస్త పాలూ మిరియాలూ ఏమైనా?’ అని అడగటంలో, ‘భక్తులందరూ చాల నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది, మరొక్కసారి’ అనటంలో  ఘంటసాల వారి స్వరంలో హాస్యరసం ఎంత బాగా ఒలికిందో గమనించారా?

 

సీతా స్వయంవరం గురించి, కళ్యాణ వైభోగం గురించి ఎంతో ముచ్చటగా వివరించే మరో పాట ‘స్వాతిముత్యం’ చిత్రం లోని ‘రామా కనవేమిరా?’ అనే గీతం. ఈ గీతంలో హరికథా గానంలో, జానపద శైలిలో సాగే కోలాటం లో సీతా కళ్యాణ గాథను వివరిస్తారు, కవి శ్రీ ఆత్రేయ… ‘రమణీ లలామ, నవ లావణ్య సీమ – ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా…. రామా, కనవేమిరా?’ ఈ పాటకు స్వర సామ్రాట్టు ఇళయరాజా గారి బాణీ సాహిత్యానికి ఎంతో సుగంధాలను అద్దింది.

 

హరికథాగాన రూపంలో సాగిన మరో సీతాకళ్యాణ గాథ, ‘కలియుగ సీత’ అనే చిత్రం లోని ‘మిథిలా పురిలో రాచనగరులో నెలత స్వయంవర మంటపము – జనకరాజ సుత వరమాలికతో నిలిచే సీత ఆ క్షణము…’ అనే పాట. ఈ గీతాన్ని శ్రీ  బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి సుశీల గానం చేసారు.

 

ఇద్దరు రామభక్తుల గురించి చెప్పుకొనే తీరాలి… గుహుడు… రాముడంటే ఎంత భక్తియో ఆయనకి… ఆయన దర్శనం కాగానే జన్మ ధన్యమయిందట… ‘రామయ తండ్రీ, ఓ రామయ తండ్రీ… మా నోములన్నీ పండినాయి రామయ తండ్రీ…’ [సంపూర్ణ రామాయణం – శ్రీ ఘంటసాల]. ‘నీ కాలిదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నాకు తెలుసులే, నా నావ మీద కాలు పెడితే ఏమౌతాదో తంటా!’ శ్రీరాముని మహిమల పట్ల అచంచల విశ్వాసం… ఈ తీయని భక్తి గీతాన్ని రచించిన వారు శ్రీ కొసరాజు రాఘవయ్య గారు, సంగీతం మామ మహదేవన్ గారు. గుహుని పాత్రలో ఒదిగి పోయింది శ్రీ అర్జా జనార్దన రావు గారు… వీరు చాలా సినిమాల్లో [ఈ చిత్రంలో కూడా] ఆంజనేయస్వామి పాత్ర కూడా ధరించారు.

 

అలాగే శబరి… వయసుడిగిపోయింది… ఓపిక లేదు… అయినా రాముడు వస్తాడేమో అని ఆశ… ‘ఊరకే కొలను నీరు ఉలికి ఉలికి పడుతోంది….’ తన రామయ్య వస్తాడేమో అని ప్రకృతి కూడా తనలాగే కాచుకొని ఉన్నదట… అవును… ‘అదిగో, రామయ్యే, ఆ అడుగులు నా తండ్రివే… ఇదిగో శబరీ శబరీ వస్తున్నానంటున్నవి…’ ‘అసలే ఆనదు చూపు, ఆపై ఈ కన్నీరు, తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో…’ ఎంత కరుణరసపూరితాలు ఈ పంక్తులు? ఇలా వ్రాసేది ఒకే ఒక్కరు.. వారే శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు… శబరి అంటేనే పండరీబాయి… ఈమె చాలా చిత్రాల్లో ఈ పాత్రను ధరించారు. [సంపూర్ణ రామాయణం – శ్రీమతి సుశీల].

 

ఇక తెలుగువారికి ఇంటింటా ఇలవేల్పు, ఇష్టదైవం అయిన రామచంద్రుని కీర్తించే పాటలు ఎన్నో. రామనామాలలోని మధురిమను వివరించే ‘శ్రీరామ నామాలు శతకోటి’, [మీనా], ‘మనసెరిగిన వాడు మా దేవుడు’ [పంతులమ్మ] ఎంతో వినసొంపుగా లలితంగా ఉంటాయి. ఈ రెండు గీతాలను సుశీల గారే గానం చేసారు. ‘పూజలు చేయ పూలు తెచ్చాను’ [పూజ – శ్రీమతి వాణీ జయరామ్], ‘శ్రీరామ పరంధామ’ [లవకుశ – లీల, సుశీల], ‘శ్రీరామ జయరామ సీతారామ’ [ముత్యాలముగ్గు – శ్రీ బాలమురళీ కృష్ణ],   ‘శ్రీరఘురాం, జయరఘురాం’

[శాంతినివాసం – శ్రీ పి.బి. శ్రీనివాస్, శ్రీమతి సుశీల],   ‘జగదభిరాముడు మా రాముడే’ [లవకుశ – ఘంటసాల, సుశీల, లీల], ‘జగదభి రామా, రఘుకుల సోమా’ [రామాలయం – ఘంటసాల], ‘జగదానంద కారకా… జయ జానకీ ప్రాణ నాయకా…’ [శ్రీరామ రాజ్యం – బాలూ, శ్రేయా ఘోషాల్], ‘అందరి బంధువయా, భద్రాచల రామయ్యా…’ [దేవుళ్ళు – బాలు], ‘ఇదిగిదిగో నా రాముడు – ఈడనే కొలువుండినాడు’ [శ్రీరామదాసు – సునీత]… ఇంకా ఎన్నో… మరీ మరీ విని తరించాలని అనిపించే మధురగీతాలు…

 

‘జగమే రామమయం…’ రామాయణం వ్రాసిన మొల్లకి… ‘అంతా రామమయం…’ రామాలయాన్ని కట్టించిన శ్రీ రామదాసుకి…

 

ఇంతకూ రాముడు నిజంగా దేవుడేనా? మనం పూజించాల్సిందేనా? అవునట…

 

‘తండ్రి మాటలకై పదవుల త్యాగమే చేసెను…

తన తమ్ముని బాగుకై తాను బాధనొందెను…

అందాలా రాముడు అందువలన దేవుడు…

 

ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను…

ధర్మము  కాపాడుటకా సతినే విడనాడెను…

అందాలా రాముడు అందువలన దేవుడు…’

 

అందుకే…

‘అందాలా రాముడు, ఇందీవర శ్యాముడు…

ఇనకులాబ్ది సోముడు, ఇలలో మన దేముడు…’

 

అంచేత, కళ్యాణం చూసి, అక్షింతలు చల్లుకొని, పానకం, వడపప్పు సేవించి, శ్రీరామచంద్రుని మనసారా సేవించండి.

 

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు…

 

***

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *