May 21, 2024

అంతిమం (నవల) 1

రచన: రామా చంద్రమౌళి

 

     IMG_20150330_131238

ప్రవేశిక:

ప్రేమ తత్వాన్ని ఔత్సాహిక, పరిణత దశలతో పోలుస్తూ. .  నిజమైన ప్రేమ లోతును తెలియజేస్తూ ‘ నువ్వు నాకు కావాలి కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ‘ దశనుండి ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నాకు కావాలి ‘ స్థితివరకు ఎదగమని ప్రఖ్యాత జర్మన్ మానసిక శాస్త్రవేత్త ఎరిక్ ఫ్రాం అన్నాడు.

ఔను. . ప్రేమ అగ్ని. . హిమాగ్ని. . అదృశ్యంగా దహిస్తూ వ్యాపిస్తూ ఆక్రమిస్తూ రహిస్తూ రమిస్తూ అంతిమంగా జీవమై ప్రాణమై ఊపిరై చంచలించేదీ. . జీవితానికి పరమార్థాన్ని చేకూర్చేదీ కూడా. అందుకే మహాత్మా గాంధీ అతి సరళ భాషలో ‘ ప్రేమ ఉన్నచోటనే జీవితం ఉంటుంది ‘ అని సిద్ధాంతీకరించాడు.

శివపురాణంలో శివుడు ‘ ప్రేమే శక్తి ‘ అన్నాడు.

ఐతే అసలు ఈ ప్రేమ ఏమిటి. ? ఎవరిమధ్య ఎటువంటి ప్రేమ ఉండాలి.  స్త్రీ పురుషుల మధ్య. . తోబుట్టువుల మధ్య. . స్నేహితుల మధ్య. .  తల్లిదండ్రుల మధ్య. .  గురుశిష్యుల మధ్య. .  ఈ రకంగా ప్రేమ అనంతమై అఖండమై అరూపమై అవిభాజ్యమై. . యుగయుగాలుగా అనాదిగా మనిషిని. . మానవేతర సకల చరాచర జీవరాశిని సృష్టి ‘ ప్రేమ ‘ అనే మహామాయతో శాసిస్తూనే ఉంది. మాయ, మిథ్య, భ్రాంతి వంటి అనుక్షణిక ఉద్వేగ ప్రచలనాలతో మనిషి కాలాన్ని వేటాడుతూ,కాలం మనిషిని వేటాడుతూ. . “ప్రేమ” ఒక నిరంతర అనంత జీవానుభవ అన్వేషణై కొనసాగుతూనే ఉంది.

అసలు మనిషికి ఏం కావాలి . . ఎంత ప్రేమ కావాలి. . ఈ ప్రేమదాహానికి ఒక అవధీ అంతమూ అనేది ఉందా. . ఉంటే ఎంత. . ఎక్కడివరకు. . ఎప్పటివరకు. ?

చూద్దాం ఒకసారి తొంగి. . ఈ అత్యాధునిక సమకాలీన జీవితాల్లోకి. . పదండి. . .

‘సగం జీవితం నన్ను కన్నవాళ్ళకోసం

సగం జీవితం నేను కన్నవాళ్ళకోసం

అసలు నా జీవితమేది. ?’

వెనక్కి తిరిగి చూసుకుంటే స్థూలంగా తన జీవితమంతా ఇంతే అనిపిస్తోంది.

జయరాజ్ కళ్ళు మూసుకున్నాడు అలసటగా.  అసలతను ఎప్పుడూ అలసిపోయినట్టనుకోలేదు ఇన్నాళ్ళూ.  మొదటిసారిగా ఈ మధ్య ఈ రకమైన ఏదో వ్యాకుల భావన పదేపదే మనసులో ములుకులా కదుల్తూ గుచ్చుకుంటోంది.

అతను గ్లోబల్ సర్కస్ గ్రీన్ రూంలో అద్దం ముందున్నాడు.  రాత్రి పదిన్నర.  సెకండ్ షో.  అన్ని ఐటంస్ ఐపోయి ఇక చిట్టచివరి  ఒళ్ళు గగుర్పొడిచే సాహసోపేతమైన, ఎంతో ప్రమాదంతో నిండిన తన రెండు ప్రదర్శనలతో ఇక ఆనాటి షో సమాప్తం.  ఆ సర్కస్ కంపనీలో చేరి పదహారు సంవత్సరాలైంది.  తనూ, శైల. .  ఇద్దరూ ఆ సర్కస్ కంపనీకి ఒక ప్రత్యేక ఆకర్షణలూ, ఆస్తులూ ఐ అది ఆర్థికంగా ఆరోగ్యంగా కొనసాగడానికి కారకులుగా నిలుస్తూ వస్తున్నారు.  కంపనీ యజమాని పరాశర్ రోజూ ఒక్కసారన్నా అంటూంటాడు ‘జయరాజ్. . నువ్వూ శైలా లేకుంటే ఈ కంపనీ ఎప్పుడో మూతపడిపోయేది ‘ అని.

పరాశర్ చెప్పేది పూర్తిగా వందశాతం నిజం.

శైల తన భార్య.  ఒకానొక చిత్రమైన సందర్భంలో భార్యాభర్తలుగా మారి ఈ సర్కస్ కంపనీలో కొనసాగుతున్న తమను తమ ఈ అతి ప్రమాదకర విన్యాసాలు చేసే జంటగా ప్రపంచ సర్కస్ సంస్థలు గుర్తించి ఇంకా ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తామని ఎన్నో ఆఫర్లు చేశాయి.  కాని పరాశర్ ను విడిచి వెళ్ళలేదు తాము.  దానిక్కారణం ఒక్కటే. .  పరాశర్, తామూ ఒకేరకమైన బాధితులు కావడమే.  జీవితంలో చాలా మందికి తెలియని ఒక అత్యంత సత్యమైన విషయ మేమిటంటే. .  మనుషులు పడ్తున్న బాధ స్వభావ స్వరూపాల్ని బట్టి కూడా ఒక సమూహంగా కలిసి మెలిసి ఉంటుంటారు.  కుష్టువాళ్ళు ఒక సమూహం. .  బిచ్చగాళ్ళు ఒక సమూహం. .  తాగుబోతులు ఒక సమూహం. .  ఒక నిర్దుష్టమైన వేదనతో బాధపడ్తున్నవాళ్ళందరూ ఒక సమూహం. .  ఇలా.

పరాశర్ కూ తమకూ ఉన్న సామ్యమేమిటంటే. ,

పరాశర్ భార్య చిత్ర. .  సర్కస్ లో ఒక విన్యాసం చేస్తూంటే నలభై అడుగుల ఎత్తునుండి కిందపడి, వెన్నెముక విరిగి కటిభాగపు క్రింది భాగమంతా చచ్చుబడిపోయింది.  అప్పటినుండి ఆమె అంతే. .  శాశ్వతంగా మంచంపైనే.  బెడ్ రిడెన్.  ఆమె శేష జీవితమంతా ఇక ఒక సుదీర్ఘ విషాదమై మిగిలిపోయింది.

పరాశర్ జీవితమంతా ఇక ఆమె సంరక్షణ, ఆలనాపాలనా. .  అంతే.  ఐతే అతను ఆమెను చాలా బాధ్యతగా చూసుకుంటాడు.  ఎక్కడా కొద్దిగాకూడా విసుక్కోడు.  ఆమెముందు అసంతృప్తినిగానీ, నిర్లక్ష్యాన్నిగానీ ప్రకటించడు.  మానవ బాంధవ్యాన్ని ఒక అద్భుతమైన  హృదయ సంబంధంగా అభివర్ణిస్తాడు.

జయరాజ్   అంటాడు. .  మనిషికి ఈ జీవితంలో ఎవరితో ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది. .  అంతకన్నా ఎంత ప్రాకులాడినా ఏమీ జరగదు. . దొరకదు” అని.

నిజమే అనిపిస్తుంది తనకు.

ఆ మాటకొస్తే తనకూ శైలకూ ఉన్న బంధం కూడా అటువంటిదే.  నేపథ్యాలు కూడా చిత్రమైనవే.

తనది దొమ్మరి కులం.  చిన్నప్పుడు తన తండ్రి గారడీ ఆట ఆడిస్తూ జీవనం కొనసాగించేవాడు.  నాయిన డోలక్ వాయిస్తూ హల్ చల్ చేస్తూంటే జనం మధ్య తను  రెండు కర్రల పంగలకు మధ్య గట్టిగా లాగికట్టిన తాడుపై చేతుల్లో బ్యాలన్సింగ్ బొంగును పట్టుకుని ఒడుపుగా నడుస్తూండేవాడు.  ఏ కొద్దిగా ఫిస్లాయించినా కిందపడడం ఖాయం.  చాలా ఏకాగ్రత, నైపుణ్యం, ధైర్యం ఉండాలి.  కాని తన విషయంగా అది తప్పనిసరి పరిస్థితి.  బతికేందుకు వేరే ఏ అధారమూ లేదు. అందరూ తన్మయత్వంతో తన సాహసోపేతమైన ‘వాకింగ్ ఆన్ ద రోప్’ ప్రదర్శనను తిలకిస్తున్నపుడు తల్లీ చెల్లీ సత్తు గిన్నెలను పట్టుకుని ప్రేక్షకులనుండి చిల్లర పైసలను అడుక్కునేవారు.  తర్వాత చిన్న ఇనుప రింగ్ నుండి దూరి బయటికి వచ్చే ఫీట్ ను చెల్లి చెసేది.  తర్వాత తల్లి ఒక నల్లటి గుడ్డ ముసుగులో దూరి నాన్న ఒక మహోధృతిలో డోలక్ వాయించీ వాయించీ క్లైమాక్స్ కు తీసికెల్లిన తర్వాత మాయమై. . .  తను వెళ్ళి ఆ ముసుగుపై నిలబడి కసాపిసా తొక్కుట. .  తర్వాత చిల్లర పైసల వర్షం.

ఏ పూటకాపూట. .  నిత్యపోరాట జీవితం.

ప్రతి మనిషికీ జన్మతః ఒక వృత్తిపరమైన నేపథ్యముంటుంది.  అది బాల్యం నుండే వాళ్ళను ప్రభావితం చేస్తూ ఒక మూలాధారమైన తత్వాన్ని స్థాపిస్తూ ప్రవర్తనను నిర్దేశిస్తుంది.  ఇక వాడి ఆలోచన, నడవడిక,చేష్టలు, స్వభావం అన్నీ వాటంతటవే రూపుదిద్దుకుంటాయి.

చిన్నప్పటినుండి తనకు తెలియకుండానే ఊళ్ళు మారుతూ మారుతూ ద్రిమ్మరితనం అలవాటైపోయింది.  తిరగడం తిరగడం. .  ఒకటే యాత్ర.

తిరగడం జీవితంలో ఒక భాగమైంది. . .

చెల్లి పద్నాలుగేళ్ళకే ఒకనితో లేచిపోయింది.

తను కూడా అప్పుడు కరీం నగర్ కు వచ్చిన ఒక సర్కస్ కంపనీ ట్రక్ లో రహస్యంగా దూరి. .  రాత్రంతా ప్రయాణం చేసీ చేసీ. .  తెల్లారి చూస్తే. .  అది చంద్రపూర్. మహారాష్ట్ర.

గడ్డిలారీ దిగగానే,

ఎవరు నువ్వు. . అని ప్రశ్న.

నాకే తెలియదు. . అని జవాబు.

ఏం జేస్తావు. . అని మళ్ళీ ప్రశ్న.

తెలియదు. . అని జవాబు.

ఐతే మాతోపాటే ఉండిపో. . అని ఒక అవకాశం.

వేరే మార్గం లేదు కదా.  అందుకని. .  ‘సరే’అని జవాబు.

సర్కస్ కంపనీలోకి అదీ ప్రవేశం.

బతకాలి. .  అధర్మంగా, అన్యాయంగా కాకుండా తనకు తానుగా, స్వంతకాళ్ళపై నీతిగా బతకాలి.

ఏ పనొస్తుంది నీకు. . అని మళ్ళీ ప్రశ్న.

‘వాకింగ్ ఆన్ ద రోప్’

‘చాలు. .  పద. .  నడువ్ తాడుపై. .  పరుగెత్తు తాడుపై. .  పడిపోకుండా నిలదొక్కుకుంటూ, పడినా మళ్ళీ లేచి నిలబడ్తూ. . ‘

పోరాటం. .  ఒంటరి అనివార్యమైన పోరాటం మొదలు.

అప్పుడు పరిచయమయ్యాడు ఒక అద్భుతమైన గ్రీక్ ఫ్రెండ్ డిమిట్రిస్ అదే సర్కస్ లో.  అతనితో స్టెల్లా.  ముచ్చటైన జోడి.  వాళ్ళు భార్యాభర్తలో, స్నేహితులో అవన్నింటినీ మించిన ఊహాతీతమైన మహామానవులో తెలియదు.  కాని తనకు తెలిసినంతవరకు వాళ్ళు ఒకరు స్త్రీ మరొకరు పురుషుడు.  అంతే.

వాళ్ళు చేస్తూండేవాళ్ళు ఈ’నైఫ్ షూటింగ్’ అనే సాహసోపేతమైన ప్రదర్శన సర్కస్ లో.

చూసేవాడు తను. . పరిశీలనగా. . ఆసక్తిగా. . పులకించిపోతూ.

‘నేర్చుకుంటావా’ అన్నాడొకనాడు డిమిట్రిస్ తనతో ప్రేమగా, వాత్సల్యంగా.

‘నేర్చుకోవచ్చా దీన్ని ‘అన్నాడు తను మహాశ్చర్యంగా.

‘నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ‘అని ఒక దరహాసం.

అంతే. . ఇక కత్తుల వంతెనపై పరుగు ప్రారంభం.

‘ఇప్పుడు నువ్వొక అసాధారణమైన విద్యను నేర్చుకుంటున్నావు.  తపస్సు ఇది.  ఏకాగ్రత, సునిశితత్వం, పట్టుదల ఇవే ప్రాణం దీన్ని నేర్చుకోడానికి ‘అన్నాడు డిమిట్రిస్.

అప్పుడే ప్రపంచ ప్రసిద్ది చెందిన తత్వవేత్త సోక్రటిస్ పుట్టిన గ్రీక్ నేలపైనుండి వచ్చిన డిమిట్రిస్ చెప్పిన పరమ తత్వమేమిటంటే. .  ‘మనిషి జీవితమంతా ఒక ప్రీడిటర్మైండ్ ప్రోగ్రాం జయరాజ్. .  పుట్టిన ప్రతి మనిషీ  దైవాజ్ఞప్రకారం ఏది చేయాలో అదే  చేస్తూంటాడు.  అది తప్ప మనిషి ఇంకే ఇతరమైందీ చేయలేడు. .  మీ భారతీయ చింతన ప్రకారం శివునాజ్ఞ లేనిది చీమైనా కదలదుకదా . . అదే. ‘ అని.

శిక్షణ ప్రారంభం.

లక్ష్యాన్ని గుర్తించడం. .  గురిచూడడం. .  గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడం.

చేతికి ఒక చాకు ఇవ్వబడింది.  ఇరవై ఐదు ఫీట్ల దూరంలో ఒక గడ్డి బొమ్మ.  బొమ్మ కంటిలోకి గురి చూసి చాకును విసరమని ఆజ్ఞ.

తను విసిరాడు ఉత్సాహంగా.  కాని చాకు కనీసం బొమ్మదగ్గరికి కూడా చేరలేదు సరికదా ఎక్కడో మధ్యలోనే పడిపోయింది.

‘ఊహ సుళువు.  ఆచరణ కష్టం’ అన్నాడు డిమిట్రిస్.

ఔను. . అని అర్థమైంది స్పష్టంగా.

ఇక మొదలైంది అసలు నడక.  డిమిట్రిస్ ముందు. . తను వెనక.

“సర్. . రెడీ. . ” అనే ధ్వని దర్వాజా దగ్గర.

జయరాజ్ లేచి నిలబడి పైనున్న పట్టు శాలువాను సవరించుకుని. ” పద. . మేడం రెడీనా”అన్నాడు.

“మేడం బోర్డ్ పై ఉన్నారు.  వ్యాఖ్యానం చేస్తున్నారు. . మీరు రావడమే తరువాయి”

జయరాజ్ సర్కస్ ఎరీనాలోకి ప్రవేశించాడు. అతని నరనరాల్లోకి తోటలోకి వసంతంలా అతనికే తెలియని ఒక విద్యుదుత్సాహం ముంచుకొచ్చింది.  ఒక్క క్షణంలో ఈ సకల ప్రపంచాన్నీ మరచి. . నిషా. . చప్పట్ల నిషా.  జనం ప్రశంసించే పొగడ్తల శాశ్వత నిషా.

కళ్ళు జిగేళ్మనే విద్యుత్కాంతుల వెల్లువ.  చుట్టూ వేల సంఖ్యలో క్రిక్కిరిసిన ప్రేక్షకులు.  పిల్లలు, పెద్దలు, అభిమానులు. .  ప్రత్యేకంగా సర్కస్ ను ప్రాణప్రదంగా ఇష్టపడే వ్యక్తుల సమూహాలు.  ఒకటే చప్పట్ల ప్రవాహం.

మైక్ లో చెబుతున్నారు చాలా గొప్పగా తను ప్రదర్శించబోయే ‘నైఫ్ షూటింగ్’గురించి.

గడ్డకడుతున్న నిశ్శబ్దం.

బిగపట్టిన ఊపిరి బుస.

జయరాజ్ ఎదురుగా ఇరవైఐదు ఫీట్ల దూరంలో పదిఫీట్ల వ్యాసంతో చేయబడ్డ అందమైన చెక్క బోర్డ్ వైపు చూశాడు ఇక తన ‘ట్రాన్స్ ‘లోకి వెళ్తూ.  ప్రపంచం అతనినుండి సెలవు తీసుకుంది.  ఒంటరిగా జయరాజ్ ఏకాగ్ర తపస్సులో. ,

ఎదురుగా. . బోర్డ్. . మధ్యలో చేతులూ,కాళ్ళూ బంధించబడి శైల.  ఆమె మీద పూర్తిగా ఫోకస్ చేయబడి లైట్లు.  పూర్తి కాంతి జిగేళ్మని.

యాంకర్ చెబుతున్నాడు రెట్టించిన ఉత్సాహంతో. .  ఇక జరుగబోతున్న విభ్రమాత్మక సాహసం గురించి.

అంతా గడ్డకట్టిన నిశ్శబ్దం.  అందరి చూపులన్నీ శైలపైననే.  ఇటు తన దిక్కు కూడా.

ఇక మెల్లగా శైల కట్టేయబడ్డ గుండ్రని బోర్డ్ తిరుగడం మొదలైంది.

తన ప్రక్క చేతినిండా తళతళ మెరుస్తున్న కత్తులతో ఒక మనిషి. అసిస్టెంట్.

ఒక కత్తి నందించాడు.

ఒకే ఒక లిప్త.

తను అందుకోవడం. .  శైలపైకి విసరడం. .  అది రెప్పపాటులో ఆమె చెవిక్రింద, మెడప్రక్కన రఫ్ ఫ్ ఫ్  మని దూసుకుపోయి కసుక్కున  చిక్కి దిగిపోవడం. ,

హమ్మయ్య. .  అని అందరూ ఊపిరి పీల్చుకుని. ,

మహాభారతంలో ద్రోణుడు ఏం కనిపిస్తోంది అర్జునా అని అడిగినప్పుడు పక్షి కన్ను మాత్రమే అని అర్జునుడు పరమ ఏకాగ్రతతో సమాధానం చెప్పినప్పటి పూర్తి కేంద్రీకృతమైన మానసిక స్థితి.

దృష్టినుండి సకల ప్రపంచమూ అదృశ్యమై కేవలం ఎదురుగా మెల్లగా తిరుగుతూన్న బోర్డ్. .  శైల.

మరొక కత్తి. .  వెంటనే మరొకటి. .  వెన్వెంటనే ఇంకొకటి ఛక్ ఛక్ ఛక్ మని వరుసగా బాణాలవలె దూసుకొస్తూ. . శైల నెత్తిపై, చెవులకు అటుప్రక్క, ఇటుప్రక్క, మెడకు మరో ప్రక్క, భుజాలపై. .  అటూ ఇటూ. .  చాచిన చేతులకు పైన. .  కింద. .  వ్రేళ్ళ కొసలదగ్గర. .  నడుముకు ఈ ప్రక్క. .  ఆ ప్రక్క. . తొడలకు ఈవైపు. .  అటు ఆవైపు. . చివరికి పాదాలకింద మెరుపుల్లా దూసుకొచ్చి రెండు కత్తులు చిక్కుకుని. .  మొత్తం పన్నెండు.

సర్కస్ ఆవరణంతా ఊపిరిబిగబట్టి. . స్థంభించి. ,

హమ్మయ్య.

ఒక్కసారిగా చప్పట్ల వర్షం.  మోగిపోయింది గాలినిండా కరతాళధ్వనులతో.

జయరాజ్ లో మాటలకందని మహానందం . శైలలో మళ్ళీ బతికి బయటపడ్డ తృప్తినిండిన గాఢోద్వేగం.  నిత్యం ఒక మరణం. .  ఒక పునర్ జననం.  జీవితమంతా ఎడతెగని సాహసం. .  ప్రతిరోజూ.

జయరాజ్ చటుక్కున వెళ్ళిపోయి మాయమయ్యాడు.  రెండు నిముషాల్లో డ్రెస్ చేంజ్.  ఒంటిపై బిగుతుగా మెరిసే ప్యాంట్ షర్ట్.  శైల కట్లు విప్పగానే బోర్డ్ దిగుతూ,

విపరీతమైన చప్పట్లు వినిపిస్తున్నాయి జయరాజ్ కు గ్రీన్ రూం లో.

క్షణకాలం జయరాజ్ మనసులో రోజూ కదిలే ఆలోచనే తళుక్కున మెరిసింది.

ఈ తన నిత్య ప్రదర్శిత సాహసకృత్యంలో ఎక్కువ రిస్క్ తీసుకునేది తనా. .  శైలనా.

శైల అంటుంది. . తనదే అని.

రెప్పపాటులో గురితప్పితే. . శైల హతురాలు. . తను హంతకుడు.

ఆ క్షణకాలం శైల కళ్ళుమూసుకుని తనను తాను మృత్యువుకు అప్పగించి గడిపే క్షణాలు. . ఏమిటవి. ?

మనిషి బతకడానికి ఇంత రిస్క్ అవసరమా. ? అని ప్రశ్న.

అవసరమే అనేది శైల జవాబు.  లేకుంటే జీవితంలో థ్రిల్ ఏమున్నది.  సాహసమే జీవితం. .  అంతే.  అంటుందామె.

సర్కస్ ఎరీనా మైక్ లో ప్రకటన జరుగుతోంది.  గ్లోబ్ లో మోటార్ సైకిల్ రన్.  ఎనిమిది మీటర్ల వ్యాసమున్న ఇనుపపట్టీల గోళంలో మోటార్ సైకిల్ ను వ్యాసతలంలో గిరగిరా వివిధ దిశల్లో నడిపి వేగాన్ని పెంచుతూ ప్రేక్షకులను చకితుల్ని చేయుట.  తను ఆ పని చేస్తున్నపుడే సాహసియైన శైల మరో మోటార్ సైకిల్ తో గ్లోబ్ లోకి ప్రవేశిస్తుంది.  ఇద్దరూ పరస్పర వ్యతిరేక దిశల్లో వేగాన్ని పుంజుకుంటూ తిరుగుట.  మెరుపువేగం.  విపరీతమైన వంద కిలోమీటర్ల స్పీడ్.  పొరబాటున గనుక ఒకరికొకరి తాకితే ఇద్దరూ శవాలే ముక్కలుముక్కలై.

బయటికొస్తూంటే ఎదురుగా మేనేజర్ పరాశర్. .  భుజంపై ఒక ఆత్మీయమైన స్పర్శ.  చిరునవ్వు.  కృతజ్ఞత.

జయరాజ్ వెళ్ళిపోయాడు. . విడిచిన బాణంలా.  నెత్తిపై హెల్మెట్తో.

ఆ ఉద్విగ్న క్షణంలో జయరాజ్ కు మొన్నమొన్ననే చనిపోయిన తన తండ్రీ. . ముంబైలోని కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కూతురూ జ్ఞాపకమొచ్చారు.

ఒకరు తనను కన్నవాడు. .  ఒకరు తను కన్నది.  ప్రస్తుతానికి ఇద్దరివల్లా మిగిలింది సముద్రమంత దుఃఖం.  కొన్ని జ్ఞాపకాలు మనిషిని ఆవేశపర్చి ఉద్యుక్తుల్ని చేస్తాయి.  మరికొన్ని తలుచుకుంటేనే అధఃపాతాళానికి జారిపొయేలా పతనపరుస్తాయి.

జయరాజ్ మనసు వికలమైపోయింది.  చటుక్కున పండుటమోటో పై బలమైన పాదం పడ్డట్టు. . చితికిపోయింది హృదయం.

ఐనా తప్పవు కొన్ని విధులు.

తన స్పెషల్ డార్ట్ మోటార్ సైకిల్ ను స్టార్ట్ చేసి యాక్సిలరేటర్ను తారాస్థాయికి పెంచుతూ దూసుకుపోయాడు ఎరీనాలోకి.  జయరాజ్ ప్రవేశించగానే మళ్ళీ ప్రేక్షకుల హర్షధ్వానాలు మిన్ను ముట్టాయి.  గ్లోబ్ ఇనుప ల్యాడర్ పై గర్జిస్తున్న సింహంవలే మిలమిల మెరిసే నల్లని జాకెట్ తో క్షణమాగి తలుపు తెరువగానే లోపలికి దూకి. .  ట్రయల్ స్పీడ్. .  అది పూర్తిగా ఫిజిక్స్ అనువర్తనం.  వృత్తాకార చలన సిద్ధాంతం.  అపకేంద్ర, అభికేంద్ర బలాలలైన  F=mv2/r  సూత్రంలోనుండి మోటార్ సైకిల్ టైర్లు గ్లోబ్ ను అంటిపెట్టుకుని జారిపడకుండా తిరగాలంటే కావలసిన కనీస వేగాన్ని గణించి ఆ పరిమితిపైననే ఎప్పుడూ తన వేగాన్ని మెయింటైన్ చేయడం. . చాకచక్యంగా బండిని హ్యాండిల్ చేయడం.  ఇద్దరు వ్యక్తులున్నపుడు ఒకరికొకరు గుద్దుకోకుండా జాగ్రత్త పడడం.

వెరసి. .  అంతా పూర్తి రిస్క్.  ప్రాణాలతో చెలగాటం.

అందులో ఒక స్త్రీ ఒక పురుషుడు.  లోకానికి తెలియని విషయం. .  వాళ్ళిద్దరు భార్యాభర్తలని.

జయరాజ్ గ్లోబ్ లో తిరుగుతున్నాడు అతివేగంగా, నుజ్జునుజ్జైన మనస్సుతో.

ఒకటి. . రెండు. . మూడు. . పది నిముషాల తర్వాత జయరాజ్ మోటార్ సైకిల్ వేగాన్ని తగ్గిస్తూ తగ్గిస్తూ కనీస వేగంతో అటుఇటూ రోల్ ఔతుండగా. .  శైల ప్రవేశించింది మెరుపువేగంతో. . బెబ్బులిలా లోపలికి. . మరో మోటార్ సైకిల్ పై.  రెండు మోటార్ సైకిళ్ళు పరస్పర వ్యతిరేక దిశల్లో ఉరుముతూ, గర్జిస్తూ, పోటీపడ్తూ. .  తిరుగుతూ. . ప్రేక్షలొకమంతా ఉరకలెత్తే ఉత్సాహంతో ఊగిపోతూ. . చప్పట్లు కొడ్తూ. . ఒక ఉత్తుంగతరంగం.

పరాశర్ నూ,ఆ సర్కస్ నూ నిలబెడ్తున్న ఫీట్లు అవే.

ఈలలు.  గోల.  ఆనందోద్వేగాలు.

దాదాపు పదినిముషాలు ఒక ఎడతెగని ఉత్కంఠతో ప్రదర్శన.

తర్వాత. . మెల్లగా విత్ డ్రాయల్. ఉపసంహారం. రెండు మోటార్ సైకిళ్ళు కొద్దిగా వెనక్కీ ముందుకూ జరుగుతూ కదులుతూ. . స్థిరపడి. చటుక్కున శైల దిగి. . వెంటనే అతనూ దిగి. ,

ఇద్దరూ వెళ్ళిపోయారు గబగబా లోపలికి. . ప్రేక్షకులనుండి వీడ్కోలు తీసుకుంటూ.

సెకండ్ షో ముగిసింది. జనం బయటికి వెళ్తున్నారు గుంపులు గుంపులుగా.

పరాశర్ ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్టనిపించింది. కాని. . మనసు బాగాలేదు జయరాజ్ కూ,శైలకు కూడా.

తమ గుడారంలోకి ఇద్దరూ వస్తూండగా. . పరాశర్ వెంట ఒక వ్యక్తి సంకోచిస్తూనే వచ్చి. ,

“ఇతను హిందుస్తాన్ టైమ్స్ పత్రిక. . ఒక క్వశ్చన్. . మిస్టర్ రవి దూబె”

ఫోల్డింగ్ కాట్ పై కూర్చుంటూ. ,

“చెప్పండి”అన్నాడు జయరాజ్.

“సర్. . ప్రతిరోజూ చేస్తున్న ఈ ఫీట్ లో ఏ ఒక్కరోజైనా మీ కత్తి గురి తప్పి శైలగారికి ప్రాణాపాయం సంభవించే అవకాశముంది గదా. ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా. సంభావ్యతా సిద్ధాంతం కింద కొన్నిసార్లయినా గురితప్పే చాన్స్ ఉందిగదా. ”

“జయరాజ్ గురి తప్పదు” అంది ప్రక్కనే షూ విప్పుకుంటున్న శైల.

విలేఖరి షాక్ తిని ఆమె వైపు చిత్రంగా చూశాడు.

“ఔను. జయరాజ్ ఈ విద్యను నేర్చుకుంటున్నప్పుడే చాలా నిజాయితీగా కేవలం వినోద ప్రదర్శనార్థమే కఠిన సాధన చేసి నేర్చుకున్నాడు. చాలా మంది విద్యలను తమతమ స్వార్థప్రయోజనాలకోసమే నేర్చుకుంటారు. పిస్తోల్ షూటర్ ఎప్పుడైనా ఎవర్నో ఒకర్ని చంపవలసి వస్తుందనే శిక్షణను పొంది సాధన చేస్తాడు. మా విషయం అలా కాదు. అతనికి గానీ, నాగ్గానీ ఎటువంటి నేరపూరిత ఆలోచన లేదు. ఉయార్ ట్రాన్స్పరెంట్. మాకేమీకాదు. జయరాజ్ గురితప్పదు. నాకెప్పుడూ హాని జరగదు. ”

రవి దూబె రాసుకుంటున్నాడు.

మళ్ళీ శైలే అంది. . “ఇక రిస్క్ అంటారా. . రిస్క్ లేని జీవితాన్ని జీవించడం మాకిష్టముండదు. ”

“ప్రమాదాలైనా. . ప్రమోదాలైనా జరుగవలసినవాటిని ఎవడూ ఆపలేడు. జరుగకుండా ఉండవలసినవాటిని ఎవడూ జరుపలేడు. “అంది మళ్ళీ. ఈ కొనసాగింపును జయరాజ్ కూడా ఊహించలేదు.

కొద్దిసేపు నిశ్శబ్దం అందరిమధ్య.

తర్వాత రవి దూబె ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు.

పరాశర్ కూడా ఎందుకో మౌనంగానే వెళ్లిపోయాడు తన టెంట్ వైపు.

ఏదో. . భిన్నత కనిపించింది జయరాజ్ కు.

క్షణాల్లో అంతా నిశ్శబ్దం. ఆకాశంలో సర్కస్ బాపతు పబ్లిసిటీ టార్చ్ లైట్ మెల్లగా తిరుగుతోంది.

దూరంగా. .  విశాలమైన  గుండ్రని గుడారంకింద. . ఏనుగులు,గుర్రాలు. . విశ్రాంతి తీసుకుంటున్నాయి.

పశువులు. . ఏ చీకూ చింతాలేక. .  మనుషులకు అన్నీ చింతలూ చికాకులే.

స్వతంత్రంగా అడవిలో ఉన్నపుడు ఆ రోజు ఆహారాన్ని ఆ రోజే సంపాదించుకుని. . గడుపుతూ. . గతం. . భవిష్యత్తు స్పృహ లేకుండా జీవించే పశువులు మనుషులకు బందీ ఐన తర్వాతైనా చెప్పింది చేస్తూ పెట్టింది తింటూ. . నిశ్చింత. ముఖాలనిండా ప్రశాంతత. అమాయకత్వం.

‘నిశ్చింత ‘అనే స్థితి మనిషికి సంప్రాప్తిస్తుందా అసలు ఎప్పుడైనా.

మళ్ళీ కూతురు జయ జ్ఞాపకమొచ్చింది.

‘దీని పేరు జయ. . డాటరాఫ్ జయరాజ్’ అని మెరిసే కళ్ళతో శైల బారసాలనాడు రోజుల పసిపాపకు నామకరణ చేస్తూ అన్న మాట జ్ఞాపకమొచ్చింది జయరాజ్ కు. జయ నిజంగా పూర్తిగా అచ్చుగుద్దినట్టు తన రూపురేఖలే. జయ ఒక మెరుపు ముక్క. ఒక విద్యుల్లత.

కాని. . ఇప్పుడు. . జయ. . పదేండ్ల జయ. . మ్యారో కేన్సర్ తో.  ,

ఎదురుగా అంతా ఫ్లడ్ లైట్ల కాంతి తెల్లగా. కాని లోపల అంతా చీకటి. . నల్లగా.

ఈ చీకటి అంతమౌతుందా.

ఎవరో కవి అన్నాడు. . ‘ఈ ప్రపంచంలో చీకటే శాశ్వతం. వెలుగే అప్పుడప్పుడు వచ్చివెళ్ళే అతిధి. . ‘అని. నిజమేనేమో.

పరిసరాలన్నీ గడ్డకట్టిన నిశ్శబ్దంలో కూరుకుపోయి ఉన్న ఆ క్షణం. . జయరాజ్ తన టెంట్ లోకి వచ్చాడు.

శైల ఎదురుగా టీపాయ్ పై సాండ్విచ్. . ఒక గాజు బొవెల్ లో గోధుమ రవ్వా పెరుగూ కలిపిన గడక. . మౌనంగా మనిషి. . పూర్తిగా అన్యమనస్కంగా.

దగ్గరికొస్తున్న జయరాజ్ ను చూచి సాండ్విచ్ ప్లేట్ ను అతనిదగ్గరికి జరిపి. ,

అతనేదో అనబోతూండగానే భోరున ఎక్కెక్కిపడి ఏడుస్తూ. . లేచి వచ్చి అతని గుండెలపై వాలి. . కుప్పకూలిపోయింది.

జయరాజ్ కూడా అదే స్థితిలో.

వాళ్ళిద్దరినీ ముంచేస్తూ. . దుఃఖం. తుఫానువంటి. . ఉప్పెనవంటి. . బీభత్స దుఃఖం.

సరిగ్గా ఆ క్షణం సర్వెంట్ రఫీక్ మొసపోస్తూ పరుగెత్తుకొచ్చి తడబడ్తున్న గొంతుతో అన్నాడు. . “సర్. . పరాశర్ జీ. . “అంటూనే మళ్ళీ పరాశర్ టెంట్ దిక్కు పరుగెత్తుతూ. ,

ఏమైంది. ,

జయరాజ్ పరుగెత్తాడు అనాలోచితంగానే. వెంట శైల.

వెళ్ళి చూస్తే. . కొయ్యబారిపోయి. . అవాక్కయి. . తల దిమ్ముతిరిగి.

ఎదురుగా. . టెంట్ బ్యారెల్ బీం కు గట్టి ప్లాస్టిక్ తాడుతో ఉరివేసుకుని శవమై వ్రేలాడ్తూ. . పరాశర్.

పరాశర్. . జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూచి తమ సర్కస్ కుటుంబమంతటికీ తండ్రివలె పెద్దదిక్కైన పరాశర్. . చచ్చిపోగలడా.

జస్ట్. . పదినిముషాల కిందట తనతోపాటు గడిపి. . నిశ్శబ్దంగా  వెళ్ళిపోయిన పరాశర్. ,

2

అప్పుడే  ఏడవతరగతి విద్యార్థులకు గణితంలో ‘కాలం-పని ‘ అధ్యాయాన్ని బోధించి వచ్చిన జానకి స్టాఫ్ రూంలోని సింక్ కింద చాక్ పీస్   పొడి అంటిన చేతులను కడుక్కుని తన హ్యాండ్ బ్యాగ్ లోని రుమాలుతో తుడుచుకుంటూ అలసటగా కుర్చీలో కూలబడి వెనక్కి వాలి, అలసటగా కళ్ళు మూసుకుంది.

తనలోపల ఎప్పటినుండో ఒక సముద్రం శ్వాసిస్తున్నట్టు, తన హృదయంలో ఎప్పటినుండో నిరంతరంగా  జడివాన కురుస్తూనే ఉన్నట్టు. . అంతా చిత్తడి చిత్తడి. . భారం. . తడిచిన గడ్డి కిందికి బరువెక్కి వాలిపోతున్నట్టు. . ఏదో ఎక్కడో కూలిపోతున్న చిత్రమైన ఏ భాషకూ అందని అనుభూతి. ఘర్షణ. మౌన వేదన. నిశ్శబ్ద దుఃఖం.

‘పి హెచ్ డి చేసిందానివి ఏ యూనివర్సిటీలోనో  పిజీ విద్యార్థులకు పాఠాలు చెప్పుకుంటూ ఉండక ఈ వెధవ ప్రైమరీ స్కూల్ పోరగాండ్లకు చెప్పడమేమిటి. . ఇన్సల్ట్. . ఛిఛీ. ‘ అని ప్రతిరోజూ మొత్తుకునే మొగుడు రమణ  ఐఏయెస్  జ్ఞాపకమొచ్చాడు ఎందుకో.

జానకి మనసు విరిగిన పాలవలె వికలమైపోయింది.

రమణ. . తను. . ఇత్తడినీ ఇనుమునూ కలిపి అతికినట్టు. ఫెర్రస్. . నాన్ ఫెర్రస్. . ఉహూ. . అతుకవు.

అసలు ఉద్యోగం అనే పదంయొక్క నిర్వచనమే వేరు తన దృష్టిలో. . అతని దృష్టిలో.

ఈ దేశంలోని మనుషుల్లో తొంభైశాతం మంది తను కోరుకుని,ఇష్టపడి. . లక్ష్యించిన ఉద్యోగాన్నెవరూ చేయట్లేదు. ప్రయత్నం చేస్తూ పోతున్న క్రమంలో ఏ ఉద్యోగం దొరికితే దాన్నే చేజిక్కించుకుని అలా యథాలాపంగా జీవిస్తూ వెళ్తున్నారు తప్పితే తన అభిరుచికి. . తన తత్వానికి సరిపోయే. . తను కలలుగన్న గమ్యాన్ని చేరుకునే దిశలో ఉపయోగపడే ఉద్యోగాన్ని ఎవరూ చేయట్లేదు. ఎందుకూ అంటే అసలు జీవికకోసం ఏదోఒక ఉద్యోగం దొరకడమే కష్టం,అదృష్టం ఈ దేశంలో. ఇక ఇష్టాలూ,ఐచ్చికాలూ ఎక్కడివి.

అదీగాక ప్రతివాడూ ఉద్యోగం దొరికిందీ అంటే ఇక ఒక పనైపోయిందనే అనుకుంటాడు గాని అసలు ఇక పనిచేయవలసిన ఒక భాధ్యతాయుతమైన జీవితం మొదలైందని అస్సలే అనుకోడు. చాలా మందికి తను దేనికోసం జీవిస్తున్నాడో తెలియదు. చదువుకోవడం. . ఏదోరకంగా ఉద్యోగం సంపాదించుకోవడం. . పెళ్ళి చేసుకోవడం. . పిల్లలను కనడం. . సాధ్యమైనంత డబ్బును ఏదోరకంగా సంపాదించడం. . ఇంకా ఇంకా సంపాదించడం. . అంతే. . ఆ తర్వాత. . ?

వ్చ్. . తెలియదు.

నిజమైన జీవితాన్ని జీవించడం తెలియదు. ఎలా జీవించాలి. . దేనికోసం జీవించాలి. . ఎవరికోసం జీవించాలి. . అసలు జీవితం ఏమిటి. . అంతిమంగా అసలు మనిషి ఏమిటి. ?. తెలియదు. చివరికి మనిషి ఎప్పుడు,ఎక్కడికి చేరాలో తెలియదు.

ఏదో ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకంలో చదివిన ప్రస్తావన జ్ఞాపకమొచ్చింది జానకికి.

ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ నాల్గురోడ్ల కూడలి దగ్గరకు రాగానే ఒక ముసలాయనను అడిగాడట ‘ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది?’అని. అందుకాయన ‘ మీరెక్కడికెళ్ళాలి ‘అని ప్రశ్నించాడు.

ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం ‘నాకు తెలియదు ‘అని.

ముసలాయనన్నాడు. . ‘ఐతే మీరు ఏ రోడ్డుమీద వెళ్ళినా ఫర్వాలేదు, తేడా ఏముండదు ‘అని.

చటుక్కున ప్రక్కనున్న కిటికీ రెక్క టకటకా కొట్టుకోవడంతో జానకి ఉలిక్కిపడి చుట్టూ  చూచింది జానకి. స్టాఫ్ రూంలో ఎవరూ లేరు. ఎప్పుడూ సందడిగా టీచర్లతో పక్షులునిండిన చెట్టులా ఉండే స్టాఫ్ రూం ఈరోజు ఎందుకిలా. ?

చూస్తూనే ఉంది జానకి కిటికీలోనుండి.

ఇంకో గంట తర్వాత పదవతరగతి పిల్లలకు చెప్పవలసిన ఫిజిక్స్ పాఠం జ్ఞాపకమొచ్చింది.

ఆల్బర్ట్ ఐన్ స్టిన్. . ఇ ఈజిక్వల్ టు ఎంసీస్క్వేర్. . శక్తి. . ద్రవ్యరాశి. . వేగం. . గణన.

ఒకసారి ఐన్ స్టిన్ ను అడిగారట ఎవరో. . ‘మనం ఈ ప్రపంచంలో ఎందుకున్నాం’ అని. అప్పుడాయన చెప్పిన జవాబేమిటంటే. . ‘ ఒకవేళ ఈ విశ్వ నిర్మాణం గనుక యాధృచ్ఛికంగా జరిగి ఉండినట్టయితే, మనం కూడా యాధృచ్ఛికంగానే ఈ భూమిమీద పుట్టాం. కానీ ఈ విశ్వానికి అర్థం అంటూ ఒకటుంటే, అప్పుడు మన జీవితాలకు కూడా తప్పకుండా ఒక అర్థం ఉంటుంది. ఐతే, నేను భౌతికశాస్త్రం చదివినకొద్దీ అధిభౌతిక శాస్త్రం, వేదాంతం, తాత్వికత వైపు ఆకర్షింపబడుతున్నాను. ‘అని.

అంతిమంగా. . ఈ ‘మనిషి ఏమిటి అన్న మీమాంస ‘.

మళ్ళీ కిటికీ రెక్కలు బలంగా పదే పదే కొట్టుకుంటూ. ,

బయట స్కూల్ ఆవరణలో ఆడుకునేందుకు విశాలమైన స్థలం. . ఖాళీగా. పిల్లలెవరూ లేక. ,

అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఫెళఫెళా వినిపించిన మేఘాల గర్జనతో ఉలిక్కిపడి. ,

తలెత్తి చూచిందామె ఆకాశంలోకి. నిండా నల్లగా దట్టమైన మేఘాలు ఏనుగుల గుంపుల్లా కదులుతూ. . గాలికూడా బలంగా వీస్తోంది చెట్లను ఊపేస్తూ. . ప్రశాంతత బీభత్సంగా పరివర్తిస్తున్నవేళ. ,

దూరంగా కొండలు. . చుట్టూ పొలాలు. అటుప్రక్కన ఒక చెరువు. ప్రక్కనే ఊరు.

నడుమ ఈ ఇంటర్నేషనల్ స్కూల్. . ‘ద స్టార్ ‘.

చెరువులో ఈతలుకొట్టి అర్థనగ్నంగా పిల్లలు పశువులను తోలుకుంటూ, కొందరు వాటి వీపులపై ఎక్కి. . ఒక జీవదృశ్యం.

ఒక మామూలు బడిపంతులు కూతురైన తను విలువలే జీవితానికి అధారభూతమైన పునాది అన్న సిద్ధాంతంలో పెరిగి. . ఈ సమాజాన్ని దృశ్యించడం నేర్చుకుని. ,

తన పెళ్ళిరొజే. . పందిరికింద కూర్చున్నపుడు పోస్ట్ లో మూడు ఉద్యోగాలొచ్చాయి. ఒకటి కమర్షియల్ టాక్స్ ఆఫీస్ లో ఎసిటిఓ, రెండవది రెవెన్యూ ఆఫీసర్, మరొకటి ఈ ఇంటర్నేషనల్ స్కూల్ లో టీచర్. . ఇంకా పసుపు పారాణి ఆరని ఆ క్షణం. . రమణ ఇచ్చిన సలహా ఏమిటంటే, మర్నాడే ఎసిటిఓ గా చేరమని. చేతులు చాచకుండానే ప్రతిదినం బోలెడు ‘డబ్బు ‘అని.

మనిషిని నిర్మించే పవిత్రస్థలం పాఠశాల. మైనపుముద్దవంటి పసివాళ్ళను సరియైన రూపులోకి మలచి, వాళ్ళలో సరియైన ‘సాఫ్ట్ వేర్ ‘ను  ప్రతిష్టించేదీ, మంచి పౌరులుగా తీర్చిదిద్ది ఈ దేశానికి అందించేదీ పాఠశాలలే. అందుకే తను ఈ అధ్యాపక వృత్తినే ఎంచుకుంది. ఒట్టి జ్ఞాన వినిమయం తప్ప ఎటువంటి ఆర్థికాకర్షణ లేని ఉద్యోగం.

అదీ. . రమణకూ తనకూ మధ్య మొట్టమొదటి రోజే మొదలైన స్పర్థ.

రైలు పట్టాలు ప్రక్కప్రక్కనే పయనిస్తూ వెళ్తాయి. కాని కలువవు. ఐతే దాంపత్యంలో సంసారమనే రైలుబండి నడిచేందుకు అధారమౌతాయి

తను రాత్రి చదివిన ఎవరిదో కవిత జ్ఞాపకమొచ్చింది జానకికి.

‘ప్రపంచాన్ని దర్శించాలంటే తప్పకుండా తలుపులు తెరవాల్సిందే

బయట వర్షం పిలుపు వినిగదా గదిని తెరిచాను

కురుస్తూ కురుస్తూ చినుకులు కవిత్వమౌతూండడం

చెట్లు,చెట్ల ఆకులు,చెట్ల కొమ్మలూ కవిత్వమౌతూండడం

వీధిలో నగ్నంగా ఆడుకుంటున్న పసిపిల్లలు కవిత్వమౌతూండడం

చివరికి కవిత్వమే మనిషిగా మారుతూండడం . . ఎంత జీవదృశ్యమిది-‘

వర్షం గురించి, వర్ష  పరవశం గురించి ఎంత గొప్పగా చెప్పాడు కవి.

కళ్ళు మూసుకుంది జానకి.

పెళ్ళయిన మర్నాడు తమ శోభన సందర్భం జ్ఞాపకమొచ్చిందామెకు. అప్పుడు రమణ ఒక జిల్లా కలెక్టర్ గా చేస్తూండేవాడు. అంతా అధికార దర్పం. మనిషికి ఉద్యోగంతో సంక్రమించే ఆధిపత్య అహంకారం అజ్ఞాతంగా నిరంతరమై ఆవహించి ఊరికే అలా గడ్డిమేస్తున్న జింకపైకి లంఘించి చీల్చి చంపి పైశాచికంగా ఆనందించే వింత మృగ ప్రవృత్తిని పాదుకొల్పుతుంది. ఆ గుప్త నిషాకు లోనైన అధికారి ఇక ఎన్నడూ తన అహంకార శిఖరాన్ని దిగిరాడు. మైకం, మత్తు మద్యంలాంటి తాత్కాలిక ఉత్ప్రేరకాలతోనైతే కొంతసేపుండి దిగిపోతుంది. కాని అధికార దర్పం అనంతమై, శాశ్వతమై మనిషిని లోలోపలే క్షయింపజేస్తూనే ఉంటుంది.

రాత్రి పదిగంటలకు శోభనం.

పదకొండున్నరకొచ్చాడు. బాగా తాగి. . ఊగుతూ. కళ్ళు తేలిపోతూండగా. . తనను పతివ్రతపాత్రలో ఊహించుకున్నట్టున్నాడు. . ఉరికి బూట్లు తీసి, కోటువిప్పి, ఒడిలో పడుకోబెట్టుకుని. . అదీ అతని ఆలోచన.

కాని అలా తను చేయలేదు. ఊర్కే పరిశీలనగా చూస్తూ. ,

వెంట తెచ్చిన బ్రీఫ్ కేస్ ను ప్రక్కనపెట్టి. . తెరిచి ఒక అన్నీ వేయిరూపాయల నోట్లకట్టను తనచేతిలో పెట్టి ‘ప్రతిరోజూ. . కనీసం లక్ష. . మన సంపాదన. లేకుంటే నిద్రపట్టదు మనకు. కమాన్ డార్లింగ్’అని పశువువలె పైకి దూకి.

గాజు పలకవంటి హృదయం భళ్ళున పగిలి బ్రద్దలైపోయిన విషాద దుఃఖ సందర్భమది. కన్నీళ్ళు సముద్రాలై పొంగాయి నిశ్శబ్దంగా.

ఏం చేయగల్గింది తను.

ఏమీ లేదు. ఒట్టి నిస్సహాయత. చిన్నపిల్లాడి ముందున్న ఒక అపురూపమైన బొమ్మమీద ఇంకు ఒలికిపడి అంతా వికారమైపోయినప్పటి ఏమీ చేయలేని అశక్తతలో నుండి  పెల్లుబికిన నిశ్శబ్ద దుఃఖం.

ఐదు నిముషాల్లో అంతాముగించి. . అదమరిచిన గొడ్డులా గుర్రుపెట్టి నిద్ర.

నిజానికి భారత సంప్రదాయ సమాజంలో ప్రతి యువతీ తన జీవితంలో ఎదుర్కుంటున్న మౌన వేదన ఇది.

పెళ్ళిచూపులు. . ఏం తెలుస్తుంది. పరస్పరపు ఒంటి రంగు. . రూపురేఖలు, వంపుసొంపులు, ఎత్తూ లావులు. . అలంకరణల మెరుగులు. . అంతేకదా. హృదయం తెలిసేదెట్లా.

వెంటనే పెద్దరికపు దుర్మార్గంతో చొచ్చుకొచ్చి కల్పించుకుని ఇక సంబంధాన్ని ఫిక్సప్ చేసేందుకు ఉరుకులాడే పెద్దమనుషులు. . అంతా ట్రాష్.

అమ్మ అంటుంది. . ‘అదృష్టమమ్మా. . ఆడదానికి రెండు జీవితాలు. ఒకటి ఇక్కడ ఇంకొకటి అక్కడ’ అని.

ఇక్కడి జీవితమంతా క్రమశిక్షణతో నిండి, తల్లిదండ్రుల పెంపకాన్నిబట్టి వృద్ధి చెందిన భావజాలంతో, అభిరుచులతో, ఆశలతో భావిజీవితంపట్ల కోటి  కాంక్షలతో  పెరిగిన యువతి. . అకస్మాత్తుగా నిన్నటిదాకా అపరిచితుడైన ఒక వ్యక్తి జీవితంలోకి నడచి వెళ్ళి. ,అతనెవరో. . అతని ఇష్టాయిష్టాలేమిటో. .   అతని ప్రవర్తనేమిటో, తత్వమేమిటో తెలియక బిక్కు బిక్కుమంటూ తనను తాను స్వాధీనం చేసుకునేందుకే ఎంతో కాలంపట్టి. .

తను సున్నితమనస్కురాలై, భావుకురాలై, అంతర్ముఖురాలైన మనిషైతే. . ఎదుటి వ్యక్తి ఒట్టి మొరటై, అవినీతిపరుడై, లంచగొండై, తాగుబోతై, శాడిస్టై. . సామాజికంగా దుర్మార్గుడని వివాహానంతర సాంగత్యంలో తేలితే స్త్రీ ఏంచేయాలి.  లేదా వాడు ఒట్టి వెధవై, అసమర్థుడై, చవటై. . దేనికీ పనికిరాని ఏబ్రాసి ఐతే ఏంచేయాలి??

పెళ్ళైన తర్వాత అసలు తత్వాలే కలువని, అభిరుచులు అస్సలే మ్యాచ్ కాని జంటలు ఎన్నున్నాయో.  ఐతే మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు. . అంటే. .  సర్దుకుపోతున్నారు. రాజీ పడిపోతున్నారు. మౌనంగా భరిస్తూ,లోలోపల ఈసడించుకుంటున్నా పైకి అలా పెదవులపై కాగితపు నవ్వులనంటించుకుని బ్రతికేస్తున్నారంతే. వ్యధ మనసంతా నిండకముందే ఒకరిద్దరు పిల్లలు పుడితే. . రాజీ పడడం,సర్దుకుపోవడం అనివార్యమై. . ఇక పూర్తిగా భూమిపుండులోకి కూరుకుపోయినట్టు. . పిల్లలకోసమని. . మొగడు ఏ గడ్డితిన్నా తెచ్చే పట్టు చీరలు, నగలు, సామాజిక గౌరవభ్రమ. . పచ్చిగా చెప్పాలంటే తనకు కూడా అవసరమయ్యే శారీరక వాంఛల ఉపశమనం కోసమని. . డబ్బు పిచ్చిలో మునిగిపోవడం. . ఇవన్నీ నీటిలోకి దిగిన మనిషి  కాళ్ళకు చుట్టుకునే నాచుతీగలా. బందీ ఐ మునిగిపోతూ, లోలోపలికి కూరుకుపోతూ. . ఇక అసలు తను ఒక స్వతంత్ర వ్యక్తిననే విషయాన్నే మరిచి. ,

కొన్నాళ్ళ తర్వాత ‘ఆ. . ఏముందింకా. . అంతా ఐపోయింది ‘ అనే ఒక విముఖ స్థితికి  చేరి. .  అప్పుడప్పుడు.  . . కళ్ళు మూసుకున్నప్పుడు. . ఒంటరిగా అలా ఖాళీ ఆకాశంలోకి చూస్తున్నపుడు.  తొంగి ఆత్మలోకి నిష్క్రమించినపుడు. .  ఏదో పక్షి గుండెను టకటకా ముక్కుతో పొడుస్తున్నట్టు. . ఎవరో శరీరంలోనుండి సకల శక్తులనూ తోడేసినట్టు. . ఒట్టి పిప్పివలె మిగిలి. . జీవిస్తూ కూడా ప్రతిదినం మరణిస్తున్నట్టు. . బయటికి కనబడని గాఢ దుఃఖం. . కన్నీళ్ళు. . శూన్యం.

అంతా ఖాళీ.

జానకికి ఎందుకో నోబుల్ సాహిత్య అవార్డ్ గ్రహీత హెర్మన్ హెస్ రాసిన నవల ‘సిద్ధార్థ ‘ జ్ఞాపకమొచ్చింది. అప్పట్లో సిమిగరెవాల్, శశికపూర్ లతో సినిమా కూడా తీశారు భారతదేశంలో. ఒక మహత్తరమైన ఆత్మిక. . ఆంతరంగిక. . తాత్విక మహాప్రవాహం ఆ కృతి. మనిషి తనను తాను వెదుక్కుంటూ, తన మూలాలను తాను అన్వేషించుకుంటూ, అంతర్ బహిర్ ప్రపంచాల అస్థిత్వాల ఆత్మను అవగతం చేసుకునే శాస్త్రీయయత్నంలో సాగిన గొప్ప సృజన అది. ఒక చోట అంటాడు. . ‘సిద్ధార్థ ముందు ఒకే ఒక లక్ష్యం నిలిచింది. తను పూర్తిగా ఖాళీ ఐపోవాలని. దాహార్తితో కూడిన ఖాళీ, కాంక్షాభరితమైన ఖాళీ, స్వప్నాలతో నిండిన ఖాళీ, ఆనందవిషాదాలతో నిండిన ఖాళీ ‘. . ఇక్కడ ఖాళీ ని ఒక వైవిధ్యపూరితమైన అభాసతో పూరించాడు హెస్. ఖాళీ అంటే ఏమీ లేకపోవడం కాదనీ, భౌతిక భౌతికేతరమైన ఆత్మ సంబంధ రసానుభూతులకు చెందిన లోలోతుల పార్శ్వాలను స్పర్శిస్తూనే ఒక అలౌకిక చింతనను ప్రతిపాదించాడు. స్వప్నాలతో నిండిన ఖాళీ అనడంలో మనిషి చేతనాచేతన సూక్ష్మ లోకాల దర్శనాన్ని మన ముందుంచాడు. చివరికి ‘జీవితం’ అంటే ఒక అనంతమైన నిరంతర అన్వేషణగా నిర్ధారించాడు. అందుకే ప్రపంచభాషలన్నింటిలోకీ అనువాదమై జన హృదయాల్లోకి ఇంకిపోయిందా నవల. అంతిమంగా మనిషి ఒక ఒట్టి వాహిక మాత్రమే అని ధృవపరుస్తూ దేహాతీతమైన స్ఫురణ కోసం దృష్టిని రూపొందించుకొమ్మనీ, అలవర్చుకొమ్మనీ చెప్పాడు.

ఉన్నట్టుండి బయట టపటపా చినుకులు. వర్షం మొదలై గుండుసూదులు కురుస్తున్నట్టు. . నేలపై చిక్కగా జల్లులు. వెన్వెంటనే ఈ సకల భూప్రపంచంలో ఎక్కడా దొరకని నేలపరిమళం. ఆకాశం. . పృథ్వీ సంగమిస్తే గాలిలో పరివ్యాప్తమై విస్తరించే  మట్టివాసన,  జీవస్పర్శ. మనసును వికసింపజేసే రసోద్దీపన.

కళ్ళు మూసుకుంది జానకి. . తాదాత్మ్యంతో.

అప్పుడు వినబడింది స్టాఫ్ రూం అటెండర్ రామస్వామి గొంతు. . “మేడం. . మిమ్మల్ని ప్రిన్స్ పాల్ గారు రమ్మంటున్నారు. మన స్టాఫంతా కూడా అక్కడే ఉన్నారు. “అన్నాడు గడగడా. రామస్వామి స్వరంలో ఎదో తెలియని వణుకు. . జీర. . బెరుకుతనం ఉన్నాయి.

“ఏమిటి చేస్తున్నారందరూ. ఏదైనా స్టాఫ్ మీటింగా”అంటూ జానకి లేచి ప్రిన్స్ పాల్ గది దిక్కు నడిచింది. టైం చూసుకుంది అనాలోచితంగానే. మూడూ పది నిముషాలు.

ప్రిన్స్ పాల్ గదిలోకి అడుగుపెట్టగానే ఆశ్చర్యపోయింది టి వి చుట్టూ అందరూ గుమికూడి మహాసక్తితో ఏదో చూస్తూండడం గమనించి.

నిశ్శబ్దంగానే దగ్గరగా నడిచి టివి స్క్రీన్ దిక్కు చూచింది.

పెద్ద మ్యూజిక్ తో ‘బ్రేకింగ్ న్యూస్ ‘అని ఒకటే గోల.

బయట వర్షం పెరిగి ఇంకా చినుకులు ఉధృతంగా జడివానై కురుస్తున్న భీకర ధ్వని.

టివి తెరపై. . ‘ఐ ఎ ఎస్ ఆఫీసర్ రమణను చెప్పుతో కొడ్తున్న బాధితురాలు సుమ ‘. ప్రక్కనే విజువల్స్. అతను చేతులను అడ్డుపెట్టుకుని తప్పుకుంటూండడం. . ఆమె ఎగబడి, ఎగబడి పైపైకి వెళ్తూ ఇంకాఇంకా గట్టిగా చెప్పుతో కొడుతూండడం. . చుట్టూ ఉన్న ఇతర మహిళా  ఉద్యోగులు కూడా ఆమెకు సహకరిస్తూ రమణను చేతులతో పట్టుకుంటూ సుమ ఇంకా ఎఫెక్టివ్ గా కొట్టేందుకు తోడ్పడుతూండడం. . ప్రక్కన అవాక్కైన ఇతర ఉద్యోగులు ఈ వింతను చోద్యంగా చూస్తూ. ,

అప్రతిభురాలైన జానకి గడ్డకట్టిపోయింది. సిగ్గుతో కుంచించుకుపోతూ. . ఒక్క క్షణంలో ఆమె మస్తిష్కంలో కోటి విస్ఫోటనాలు జరిగి. . ఎందుకో ఆమెకు తెలియకుండానే దుఃఖం ముంచుకొచ్చి పెనుగాలికి చిగురాకులా వణికిపోయింది. సిగ్గు. . అవమానం. . ధ్వంసమైపోయిన వ్యక్తిత్వం. . పరువు.

చటుక్కున అప్రయత్నంగానే ఒకసారి చుట్టూ అందరివైపు చూచింది జానకి. అందరి ముఖాల్లోనూ చెప్పలేనంత పరమానందం. మనుషుల్లో తమకు కలిగే కష్టంకంటే ఎదుటిమనిషి పొందుతున్న అవమానకర సందర్భాన్ని ఆనందించే వికృత తత్వం గుప్తంగా దాక్కుని ఉంటుంది. అది కొట్టొచ్చినట్టు అందరిముఖాల్లోనూ ప్రస్ఫుటంగా కనబడ్తూ. ,

ఆమె మనసు పాదరసంవలె ఆలోచిస్తోంది.

‘ఏం చేయాలిప్పుడు. ఇన్నాళ్ళూ గొంతులో విషంలా భరించిన అత్యంత వ్యక్తిగత  రహస్య  విషయాలు బహిర్గతమై. . రోడ్డుపైబడి. . నగుబాటై. . తలదించుకునే పరిస్థితి. . ఏమిటిప్పుడు తన కర్తవ్యం. ‘

మెరుపు. . మెరుపువలె ఆలోచనలు. గబుక్కున పెట్రోల్ ను చిమ్మగానే అంటుకుని భగ్గున మండుతున్న వేసవి అడవిలా. . దహనం. . అంతర్దహనం.

‘పిడికిట్లో గాజుముక్కలను పిసుకుతూ

రక్తం ధారలు ధారలుగా కారుతూంటే

ముఖంపై ప్రసన్న హాసాన్ని చిందిస్తున్నట్టు

జీవితం కత్తి అంచుపై ఎడతెగని పరుగు

బోసిపాదాలతో’

కవిత్వం. . కవిత్వం. కన్నీళ్ళు. .   కడగండ్లు . . నిశ్శబ్ద దుఃఖాలు. . ఆంతరిక అనలసముద్రాలు. . అనంత విస్ఫోటనలు. . అన్నీ కవిత్వమై. ,

క్షణంలో నిర్ణయం తీసుకుంది జానకి.

‘మేడం. . నేను వెంటనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. . లెటర్ను పంపిస్తాను. దయచేసి అంగీకరించండి’ అని ఇక క్షణంకూడా అక్కడ ఉండకుండా జానకి నిష్క్రమించింది.

వెనుకనుండి ‘జానకీ. . ఆలోచించండి. . డోంట్ బీ ఇన్ హర్రీ. . ‘ అని వినబడ్తోంది ప్రిన్స్ పాల్ మాట. ఆ మాటతోబాటే తన ఇతర సహ ఉద్యోగుల అవహేళనతో నిండిన పకపకల నవ్వులు. పరిహాస ధ్వనులు.

బయట వర్షం కురుస్తూనే ఉంది ఉధృతమౌతూ.  లోపల ఇంకా మహోధృతంగా. . సముద్రమే.

మనసునిండా టివి తెరపైన కనిపించిన బ్రేకింగ్ న్యూస్ బొమ్మలే. . రమణ. . చెప్పుతో కొడ్తున్న మహిళ. . బీభత్స దృశ్యం. . పదే పదే. . మళ్ళీ మళ్ళీ.

‘ఎన్నిసార్లు ప్రయత్నించిందో తను రమణను మార్చాలని. ఉహు. . కాలేదు. . తనతో సాధ్యం కాలేదు. రమణా ఎందుకు మనకీ దిక్కుమాలిన డబ్బు. ఇద్దరం రూల్స్ ప్రకారం సంపాదిస్తున్న డబ్బు చాలదా. హద్దుమీరిన డబ్బును ఇలా అనేక అవినీతికర పనులతో సంపాదించడమెందుకు. ఈ మనీమేకింగ్ అనే దౌర్భాగ్య ప్రయత్నంలో చూడు నువ్వు ఎన్నెన్ని తప్పుడు పనులు చేస్తూ పోతున్నావో. ఒకదానికోసం మరొకటి. . ఒకదానితో మరొకటి. . దాన్నుండి తప్పించుకొవడంకోసం ఇంకొకటి. . ఇలా ఒక తప్పుల పరంపర. శృంఖల. . ఊబి రమణా ఇది. . ఒక్కసారి లోపలికి దిగావంటే అంతే. కదుల్తున్నకొద్దీ లోపలికి కూరుకుపోవడం తప్పితే బయటపడడం ఉండదు. గిలగిలా తన్నుకుంటూ, అరుస్తూ ఇంకాఇంకా ఎక్కువ కదుల్తూంటే ఇంకా ఎక్కువ లోపలికి. . చివరికి ఎవరూ రక్షించలేనంత లోపలికి. డబ్బు తీసుకోడానికి ఒక వ్యక్తితో రహస్యంగా కలుసుకోవాలి. . అప్పుడు ఏకాంతత. . వ్యూహం. . కూర్చోవాలి. ఎక్కడో ఒక దగ్గర. మందు. తాగాలి. తాగుతున్నప్పుడు కోటి ముచ్చట్లు. మరో తప్పుడుపనికి ప్రస్తావనలు. దార్లు వెదుక్కోవడాలు. దుష్టపథకాల అమలు. మార్గాల అన్వేషణ. ఇక మనిషిని లోబర్చుకోడానికి అమ్మాయిలు. . ఏకాంత సుఖాలు. . టూర్లు. . తిరగడాలు. ఎక్కడికోపోయి ఎక్కడినుండో పనులు చేయించుకుని ఎక్కడో ఏదో సాధించడాలు. . ఇవన్నీ ఒకదానితోకకు మరొక కృత్యం తోడవుతూ ఇక నిరంతరమై సాగుతూ పోయే ఒక అనంత అవినీతి కార్యం. వద్దు రమణా మనకీ దుర్మార్గ విధానమొద్దు ప్లీజ్. . అని ఎన్ని ప్రాధేయపడడాలో. ఎన్ని బతిమాలడాలో. ఉహూ. . వినలేదు. పిచ్చి. డబ్బు పిచ్చి. తాగుడు. అమ్మాయిల వెంటపడి అనుభవించడం పిచ్చి. తిరుగడం. బినామీగా డబ్బును ఎక్కడెక్కడో దాయడం. ఇంకాఇంకా సంపాదిస్తూ సంపాదిస్తూ. . ఖతం. . మనిషి దారం తెగిపోయిన గాలిపటమై. ఎటో ప్రయాణం. ఎటో దిక్కూ దిశాలేని పరుగు. . పరుగు తర్వాత మరో పరుగు. . వ్యసనం ఒక్కసారి మనిషినిండా వ్యాపించిందంటే. . ఇక అంతే. . దయ్యంపట్టినట్టు విడవని పిచ్చి.

మారడు రమణ. మనిషిని మార్చాలనే తన సకల ప్రయత్నాలన్నీ విఫలమై విఫలమై. . రమణ దుశ్చర్యలకిది పరాకాష్ట. రహస్యం బట్టబయలైంది. ఇన్నాళ్ళూ తనకూ, తన కుటుంబానికి మాత్రమే సంబంధించిన విషయం బహిరంగమై. . ‘

సిగ్గు. . సిగ్గుగా ఉంది.

మనుషుల్లో కొన్ని తప్పుడు ఆలోచనలూ, తప్పుడు చింతన. . తప్పుడు దారిలో నడిచే తత్వం ఉంటాయి కావచ్చు. . వాటిని సరిదిద్దుతూ, కౌన్సిలింగ్ చేస్తూ మనిషిలో పరివర్తన తేవచ్చేమో అని తను భావించి నిజాయితీగా ప్రయత్నించింది మార్చేందుకు. ఉహు. . రమణ మారలేదు సరికదా మనిషి ఇంకాఇంకా అవినీతికర దుశ్చర్యల్లో కూరుకుపోయాడు. విచ్చలవిడి విజృంభణతో పెట్రేగిపోయాడు. హద్దులుమీరిన ప్రవర్తనతో ఇంగితం మరిచి పశువువలె ఎటుబడితే అటు. . ఎలా బుద్దిపుడితే అదే. . ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ. కళ్ళకు పొరలు కమ్మేశాయి పూర్తిగా.

మొన్ననే ఒక స్పష్టమైన నిర్ణయానికొచ్చింది తను. . అస్సలే మారని ఈ రమణతో. . అస్సలే ఈ దుశ్చర్యలను సహించలేని తను ఇంకెన్నాళ్ళు కాపురం చేయడం. . ఇప్పటికే ఎనిమిదేండ్లు. ప్రతిరాత్రీ ఒక సర్ప పరిష్వంగం. మనసును చంపుకుని రాజీపడడం. భరించడం. సహించడం. మార్పుకోసం వేచిచూడ్డం.

కాలేదు. . సరికదా రోజురోజుకు పరిస్థితి ఇంకాఇంకా దిగజారి. . ఇంటినిండా వేయిరూపాయల నోట్ల కట్టలే. బంగారు కడ్డీలూ, బిళ్ళలే. ఎక్కడెక్కడో బ్యాంక్ లాకర్లలో కుక్కికుక్కి దాచిన డబ్బే.

పాములపుట్టలో నివసిస్తున్న వికారానుభూతి తనది. స్వర్గలోకంలో పూలపానుపుపై  విశ్రమిస్తున్న మహానందం రమణది. నిశ్శబ్ద వైరుధ్యం. భిన్నత. చింతనలోనే పరస్పర వ్యతిరేకత.

కుదరదు. . ఇక కుదరదు.

ఒకటికాదు రెండుకాదు. ఎనిమిదేళ్ళు ఓపికపట్టి మనిషిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. కాని మారలేదు. . పైగా తననే అతని దుష్టమార్గంలోకి రమ్మని ప్రయత్నాలు.

ఇనుము. . ఇత్తడి అతుకవు. హెట్రోజీనియస్ పదార్థాలు అతుకవు. సంలీనం కావు. భిన్నత. . మూల లక్షణాల్లోనే భిన్నత. బయటికి కనిపించని ఆంతరిక ప్రళయాల నిశ్శబ్ద ఘోష.

ఈలోగా. . పాప. మూడేళ్ళ నిర్మల. కలువపువ్వువలె. . కాంతిమొగ్గవలె. కళ్ళనిండా వెన్నెలసముద్రాలతో. . పాప.

పాపకు ఇక పంకిలమంటుకుంటుందా అని భయం. తండ్రి దుర్మార్గ తత్వం తెలియని పాప మెలమెల్లగా మనుషులను గుర్తుపట్టడం ప్రారంభిస్తున్న తరుణంలో. . ఘర్షణ పడుతూనే ఉంది తను గత ఆరునెలలుగా. వాట్ టు డు. . వాట్ నాట్.

నిర్ణయం జఠిలమైంది. జీవితానికి సంబంధించి అత్యంత కీలకమైంది. నడుస్తున్నదారిని మార్చి మరో దిశలోకి మళ్ళించుకుపోయి రూపురేఖలనే సమూలంగా పునర్లిఖించేది.

ఇప్పుడు అనివార్యమై తననుతాను పునర్నిర్వచించుకోవలసిన సమయం ఆసన్నమైంది.

జానకి ఒక ప్రశ్నను సంధించుకుంది తనకు తాను.

ఈ ఎనిమిదేండ్ల దాంపత్యజీవితంలో తను తనకు నచ్చిన జీవితాన్ని కనీసం ఒక్కరోజైనా జీవించగలిగిందా. లేదుకదా. జరిగిందంతా. .  సర్దుకుపోవడం. . రాజీపడడం. మార్పొస్తుందేమోనని వేచిచూడడం. . ఇప్పుడు అంతా పూర్తిగా కన్సాలిడేట్ ఐ వ్యక్తిత్వాలు స్థిరపడ్డాయి. తనింతే. . రమణంతే. ఇక మార్పు అసంభవం. పొసగవు ఈ రెండుకత్తులు ఒక ఒరలో.  ఒకే గూటిలో గ్రద్దా, పావురం కలిసి జీవించలేవు.

జానకి చకచకా స్టాఫ్ రూంలోకి వచ్చి తన అల్మెరాలోనుండి చేతికందిన ముఖ్యమైన కాగితాలనూ, రెండుమూడు ఫైళ్ళనూ తీసుకుని గబగబా మెట్లపైనుండి వేగంగా వచ్చి కింద పార్కింగ్ లో ఉన్న కార్ లో కూర్చుంది.

వర్షం తగ్గలేదు. . ఇంకా ఉధృతమై ఆగకుండా దంచికొడుతోంది. చినుకుల చప్పుడు లయాత్మకంగా. . గంభీరంగా.

కార్ ను స్టార్ట్ చేస్తూండగా మళ్ళీ టివి లోని విజువల్స్ జ్ఞాపకమొచ్చాయి. రమణను చెప్పుతో కొడుతూ సుమ.

సుమ. . సుమ. . సుమ.

సుమ తెలుసు తనకు. రమణ ఆఫీస్ లో సెక్షన్ ఆఫీసర్. సెక్రెటరీ పేషీలో ఇన్వర్డ్ ఔట్వర్డ్ సెక్షన్ ను చూస్తూంటుంది. ఎన్నిసార్లు వచ్చిందో తనింటికి. మనిషి ఎప్పుడూ అప్పుడే ర్యాపర్ తీసేసిన కొత్తసబ్బు బిళ్ళలా నవనవలాడుతూంటుంది. తలెత్తి ఒక చూపు చూసిందంటే లంగరేస్తే ఎంతపెద్ద ఓడైనా చిక్కి స్థంభించి లటుక్కున ఆగి అక్కడే తన్నుకులాడుతున్నట్టు గిజగిజలాడవలసిందే ఏ మగాడైనా. ఆమె చూపులో గొప్ప అయస్కాంత శక్తి ఉంది. చూపునూ,నవ్వునూ,ఒక చిరు కదలికనూ కూర్చి దేహాన్నీ మెరుపులా ఝుళిపించిందంటే ఇక ఏ మగాడైనా పిచ్చోడై కుక్కలా ఆమె చుట్టూ అలా తిరుగుతూ ఉండవలసిందే. కవ్వింత. మనిషిని కొత్త బ్లేడ్తో మెత్తగా కోస్తున్నట్టు,అదృశ్య శక్తేదో గల్లాపట్టుకుని లాక్కెళ్తున్నట్టు కవ్వింత. ఆమె జన్మతః రగిల్చే ఆడది. మంట. దహించివేసే మంట. కార్చిచ్చు.

రెందునెలలే ఐంది సుమ వేరే ఏదో సెక్షన్ నుండి ట్రాన్స్ ఫరై రమణ సెక్షన్ లోకి వచ్చి. ఆ రోజు రాత్రే రమణ ఈ సుమ గురించి ప్రస్తావించాడు రాత్రి భోజనం చేస్తున్నపుడు. ‘ఈరోజు ఒక మెరుపు వచ్చింది జానకీ నా సెక్షన్ లోకి ‘అని.

అర్థమైంది తనకు జరుగబోయేదేమిటో. సుమను అనుభవించేదాకా రమణ వదలడని.

మర్నాడే సుమ రమణ కార్లో తమ ఇంటికొచ్చింది ఏదో ఆఫీస్ పనిని సాకుగా పెట్టుకుని. . ఒక కాన్ఫిడెన్షియల్ ఫైళ్ళ తోలు సంచీని పట్టుకుని. రమణ బెడ్రూం లోకి నేరుగా వెళ్ళి ఒక గంటసేపు గడిపింది ఫైళ్ళ అర్జంట్ డిస్పోజల్ నెపంతో. అంతా అర్థంచేసుకుని తను పాపను వెంటతీసుకుని డ్రైవర్ తో సహా షాపింగ్ నెపంతో జారుకుంది ఇంట్లోనుండి.

పెద్దపెద్ద వాళ్ళ ఇండ్లు పాముల పుట్టలు. పైకి అంతా నిశ్శబ్దంగా. . నున్నగా. . అందంగా కనిపిస్తాయి. లోపల పెనవేసుకుని సుళ్ళుతిరుగుతూ, పెనవేసుకుని చుట్టుకుపోతూ కుప్పలక్కుప్పలు పాములు. పైకి అద్భుతమైన రూపురేఖలతో, చెట్లూ లతలతో, పూలమొక్కలతో మనోహరంగా కనిపించే ఈ ఇండ్లలోనుండే. . ఈ దేశాన్నీ, ఈ సమాజాన్నీ కొల్లగొడ్తూ,సకల దుష్ట శక్తులనూ ఏకీకృతంచేస్తూ సమూహపర్చే వ్యూహాలన్నీ ఈ సుందర గృహాల్లోనుండే మొసలిపిల్లల మందలై పుట్టుకొస్తూంటాయి. గొంతుకోసే కత్తి ఎంత అందంగా ఉంటుందోకదా.

రోజూ ఆఫీస్ కు పోయేముందు సుమ ప్రత్యేకంగా రమణ సమకూర్చిన కార్లో తమ ఇంటికొచ్చి ఇంట్లో సంతకాలైన ఫైళ్ళ సంచులను వెంటపెట్టుకుని రమణతో కలిసే వెళ్ళేది. . చూడ్డానికి అందరికీ వాళ్ళిద్దరు పెళ్ళాంమగలకంటే ఎక్కువగా అనిపించేవారు. బ్యూరోక్రసీ. బహిరంగ అతిక్రమణలు. ఓపెన్ డిబ్యాచులరిజం. మెల్లమెల్లగా సుమ రమణ వ్యవహారం హద్దులుమీరి అఫీషియల్ టూర్ల నెపంతో కలిసి క్యాంప్ లు వేసుకుని ఎక్కడెక్కడో విచ్చలవిడిగా గడిపే యధేచ్చ స్థితికి చేరింది. అడ్డూ అదుపూ ఏదీలేని అతిస్థితి. కొందరు ఇతర ఐఏస్ ల భార్యలు తనకు ఫోన్లు చేసి ‘ఏం చేస్తున్నావు జానకీ నీ ముందే నీ మొగుణ్ణి ఎగరేసుకుపోతోందది. టేక్ కేర్. లేకుంటే నీకు నీ మనిషి దక్కడు ‘అని హెచ్చరించేవాళ్ళు.

ఒక్క నెలలోనే సుమ శైలి,చాల్ చలన్ లో విపరీతమైన మార్పొచ్చింది. ఇంట్లో తనతో మాట్లాడ్డంలోకూడా చాలా తేడా కనబడేది కొట్టొచ్చినట్టు. ఈ ఇంట్లో నువ్వెంతో నేనూ అంతే అన్న ధోరణి కనబరుస్తూ క్రమక్రమంగా చొచ్చురావడాన్ని ఇంకెక్కువ చేసింది సుమ. అనేక రాత్రులు స్త్రీ సహజ ఆత్మరక్షణ. . ప్రతిద్వందితో ప్రతిఘటన తత్వంతో దాడి జరిపేది తను. . రమణపైకి. . సుమపైకి. ప్రశ్నించేది. గొడవ చేసేది. అరిచేది. ఇల్లంతా చిన్నాభిన్నమై చిన్నపాటి యుద్ధం జరిగేది ఇంట్లో. . అంతా బయటికి ఏ మానవమాత్రునికీ తెలియకుండా. నిశ్శబ్దంగా.

హద్దులుమీరడాలు. . అతిక్రమించడాలు. . ‘కామాతురాణాం న బిడియం న లజ్జ ‘వలె ప్రవర్తించడాలు. ,

ఐతే సృష్టిలోని చిత్రమేమిటంటే ఏ అమృతతుల్యమైన సుఖమైనా పాతబడిపోవడం. . దానిపై మోజుతగ్గిపోవడం. . ఇక చాలు అన్న ముఖమొత్తిన స్థితిలో విరమణకు సిద్ధపడి క్రమక్రమంగా తనకు తెలియకుండానే వెనక్కి తగ్గుతూండడం.

అదే జరిగింది సుమ,రమణ విషయంలో కూడా. ఏమైందోకాని. . పెనవేసుకున్న రేఖలు విడివడి విచ్చుకుపోవడం మొదలై. . ఉధృతి తగ్గింది.

పాతొక రోత. . కొత్తొక వింత కదా ఎవరికైనా.

ఈ కొత్త ‘మనిషి ‘దాహం ఒక్క రమణకేగాదు సుమకుకూడా ఉందని చాలా జాగ్రత్తగా గమనిస్తే అర్థమైంది తనకు . . ఒకరోజు రాత్రి తమ ఇంటిలోనుండే గార్డెన్ లో చాటుగా నిలబడి ఐపిఎస్ అఫీసర్, ఇంటలిజెన్స్  డైరెక్టర్ సునిల్ గోస్వామితో ‘అత్యంత మోహపూరిత స్వరంతో. . కవ్వింపుగా మాట్లాడుతూండడం’ తను గమనించినప్పుడు. రమణకూడా ఈ ఉప అక్రమ సంబంధం గురించి సుమను నిలదీసినట్టున్నాడు. . దారులు క్రమంగా వేరై చీలిపోవడం జరుగుతోంది వడివడిగా.

‘తమ తమ నెలవులు తప్పిన. . తన మిత్రులె శతృలౌట తథ్యము సుమతీ’

అదే  జరిగినట్టుందిప్పుడు.

బహుశా తాము పనిచేస్తున్నది ప్రభుత్వ కార్యాలయమన్న స్పృహనుకూడా కోల్పోయి రమణ సుమను తన గదిలోకి పిలిచి ఏదో శృంగారం చేయబోయినట్టున్నాడు. . విముఖురాలై ఉన్న సుమ ఏదో వ్యూహంలో భాగంగా రమణకు దిమ్మతిరిగే రీతిలో ముహ్ తోడ్ జవాబిచ్చింది.

ఇది సుమపై మనసుపారేసుకున్న సునిల్ గోస్వామి పథకమైకూడా ఐ ఉండవచ్చు.

మానవసమాజంలో హద్దుమీరిన కుట్రలూ, పైకిపోతున్న మనిషిని కాలుపట్టి కిందికిలాగి పడేసేదాకా విశ్రమించని దుష్టతత్వం మరీ కింది తరగతి జనాల్లోనూ తిరిగి ఎగువ ఉన్నత వర్గాల్లోనూ ప్రస్ఫుటంగా కనబడ్తుంది. వ్యక్తి ఎక్కడో ఉండి మీట నొక్కితే. . ఎక్కడో ఎవరో లేచిపోవడం. అంతా ధ్వంసమై కాగల వినాశనం మిగలడం. . ఇవన్నీ నీచ వ్యూహాలు.

ఐతే అక్కడ ఆ సమయానికి అంతమంది మీడియా వ్యక్తులు చేతుల్లో కెమెరాలతో సహా ఎందుకున్నారు. . వాళ్ళకు ఈ రకంగా జరుగబోతోందని ముందే తెలుసా. ప్రతిరోజూ ఆ సమయానికి రమణ గదిలోకి సుమ వెళ్ళి వెలుగబెట్టే నిత్యకృత్యం ఏదైనా అందరికీ తెలిసే బహిరంగంగానే ఎప్పటినుండో జరుగుతూ వస్తోందా.

వ్చ్. . ఏదైతేనేమి, పాపం పండింది. వ్యూహమో,కుట్రో, ట్రాపో. . మంచే జరిగింది.

ఇక తనే ఒక నిర్ణయం తీసుకుని భావి జీవితానికి సంబంధించి తనదైన మార్గాన్ని స్పష్టంగా నిర్ధారించుకోవాలి.

జానకి కార్ ను పరధ్యానంగా తోలుతూనే ఉంది. ముందు అద్దంపై పెద్దపెద్ద వర్షం చినుకుల ఉధృతి. ముందటి దారి కనబడనంత నీటితెర.   . ఆమె మన   సులా.

దారి కనబడడంలేదు. . కాని దారిని సరిగ్గా గుర్తించి సరియైన దారిలోనే ప్రయాణించాలిక. దూరంగా శేర్ లింగంపల్లి గుట్టలు. తుమ్మల తుప్పలు. భూమి దొంగలు తోడుకుపోగా పోగా పెద్ద బొందలు బొందలుగా మిగిలిన ఎర్రటి మొరం నేల దూరంగా కనుచూపు ఆనేంత మేర. . నేలతల్లి ఒంటి చర్మాన్ని ఎవరో ఒలిచేసి రక్తసిక్తగా మిగిల్చినట్టు. . దోపిడి. అభివృద్దిపేర గ్రామాలకు గ్రామాలే ధ్వంసమైపోతూ కాంక్రీట్ అడవి ఆక్టొపస్ వలె వ్యాపిస్తూ వ్యాపిస్తూ. ,

మనుషులు ఏమైపోతున్నారో ఎవరికీ అంతుపట్టని ఒక విషాద బీభత్స సందర్భం.

ఒకటే పరుగు. ఎడతెగని పరుగు. నిరంతరమైన పరుగు. అనంతమైన పరుగు. ఎవరికోసం ఎవరు ఎందుకు పరుగెత్తుతున్నారో తెలియని పిచ్చి పరుగు. కార్లు. . మోటార్ సైకిళ్ళు. . ఆటోలు. . బస్సులు. . మెట్రో రైళ్ళు. ఎక్కడ చూచినా జనమే ఐన చీమల పుట్టలు పగిలి వెలువడ్డట్టు జనం. . పరుగు.

దీని పేరు అభివృద్దా. ?

ఈ సహజ సంపదనంతా ఎవడికిదొరికింది వాడు పట్టుకెళ్తూ. . ఒకడు నెలకు లక్ష సంపాదిస్తూ. . మరొకడు నెలకు వేయిరూపాయలు కూడా సంపాదించలేక కూలబడ్తూ. . పరుగు. ,

ఆకలి కడుపులు ఒకచోట. . అరగని సంపద ఒకచోట.

సిస్టం ఈజ్ నాట్ ఇన్ ఈక్విలిబ్రియం.

కార్ పరుగెత్తుతోంది. . హైదరాబాద్ అల్యూమినియం ఇండస్ట్రీస్. . త్రిబుల్ ఐటి. హైదరాబాద్ యూనివర్సిటీ. . గచ్చిబావులీ స్టేడియం.

లెఫ్ట్. . ఎడమకు తిరిగి. ,

చిరెక్ స్కూల్. గచ్చీ బావులీ బ్రాంచ్. . కార్పొరేట్ పాఠశాలలు.

ఈ రకమైన స్కూళ్ళ విస్తరణ. . వ్యాపారం వెనుక ఉన్న అతిసూక్ష్మమైన రహస్యమొక్కటే.

తేడా. నెలకు ఏడెనిమిది వేలు సంపాదించే ఒక సామాన్య గుమాస్తా కొడుకు. . నెలకు లక్షలు సంపాదించే నాయకులు,సినిమా తారలు,పారిశ్రామిక వేత్తలు,వ్యాపారస్తుల పిల్లలు ఒకేచోట చదువుకునేందుకు వీల్లేదు. తేడా ఉండాలి. గుర్రం గుర్రమే. . గాడిద గాడిదే అన్న బూటకపు తేడా ఉండాలి బూర్జువాలకు. అందుకు. . మనుషుల మధ్య బాల్యదశ నుండే వివక్షను సృష్టించేందుకు తేడా  ఉండాలి ఒక వర్గానికి.

మధ్య ఒక విభజన రేఖ కావాలి సంపన్నులకు.

యుగయుగాలనుండి చెరిగిపోని విభజన రేఖ. దారిద్ర్య రేఖ. రేఖకు పైన కొందరు. కింద మరికొందరు. హ్యావ్స్. . హ్యావ్ నాట్స్.

చిరిక్ స్కూల్ లో పాప రవళిని చేర్పిద్దామని రమణ అన్నపుడు తను వ్యతిరేకించింది. పిల్లలు ఈ దేశంలోని అన్నిరకాల సామాన్య ప్రజల జీవితాలతో పరిచయాన్ని పెంచుకుని వాస్తవ సామాజిక స్థితిని ఆకళింపుచేసుకోవాలని తన ఉద్దేశ్యం. దానికి రమణ చాలా కటువుగా ఉక్రోశపడి ‘నా కూతురు ఆ అలగాజనంతోపాటు కూర్చుని చదువుకోవాలా. అది ఒక ఐ ఎ ఎస్ ఆఫీసర్ బిడ్డ జ్ఞాపకముంచుకో. ‘అని విసవిసా వెళ్ళిపోయాడు. వేంటనే రమణ పర్సనల్ సెక్రెటరి రాములు వచ్చి పాపను వెంట తీసుకెళ్ళి చిరిక్ స్కూల్లో చేర్పించి వచ్చాడు. రమణ తను చిన్నప్పుడు అతి సాధారణ కుటుంబంలోనుండి వచ్చి వీధి బడిలోనుండే ఎదిగిన సంగతి పూర్తిగా మరిచిపోయాడు.

తన మాట ప్రతిసారీ చెల్లుబాటు కాకపోవడం. . గంజిలోని ఈగవలె తీసేయబడి విస్మరించబడడం చాలా మామూలైపోయింది.

కార్ చిరిక్ స్కూల్ ముందు ఆగింది అసంకల్పితంగానే.

భోరున వర్షం. రోడ్లన్నీ జలమయమై నీళ్ళు కాలువలై పారుతున్నాయి అంతటా.

జానకి కార్లోకూర్చునే ఫొన్ చేసింది మేనేజెర్ కు.

పది నిముషాల తర్వాత. . గొడుగుకింద పాప రవళిని వెంటపెట్టుకుని అటెండర్. ,

జానకిలో ఇక తను వేయబోయే అడుగు గురించిన నిశ్శబ్ద ఘర్షణ అప్పటినుండీ అండర్ కరెంట్ గా కొనసాగుతూనే ఉంది.

రవళి మౌనంగానే వచ్చి తల్లి ప్రక్కనున్న సీట్లో కూర్చుని జానకి ముఖంలోకి చూచింది ప్రసన్నంగా.

‘అమ్మా. . ఎందుకో ఒక గంటనుండి నా ఫ్రెండ్సందరూ నన్ను నువ్వు ఇంటికి పోగానే టివి చూడవే రవళీ అంటున్నారమ్మా’ అంది దీనంగా.

జానకి రవళితో ఏమీ అనలేదు. నిస్సహాయత నిండిన ఒక దీనమైన చూపుతో కూతురును చూచి. . కారును స్టార్ట్ చేసింది.

రవళి ఒక బంగారు తునక. ఏ రూపమిస్తే ఆ రూపాన్ని స్వేకరించి ఆభరణంగా మారగల స్థితి ఆమెది. ఐతే ఆమెను సరియైన విధంగా మలచగల నిపుణుడుగానీ,శుద్ద మానవీయ లక్షణాలతో ఉన్నతీకరించే గృహ వాతావరణంగానీ లేవిప్పుడు. ఇప్పుడిది ఒక సంక్లిష్ట దశ. అంతర్ ప్రళయం. బయట పెను తుఫాను.

‘చూద్దాం. అణిగిమణిగీ, భయపడీ ధైర్యం చేయలేకా ఏడెనిమిదేళ్ళ విలువైన సమయం కట్టుబానిసవలె గడచిపోయింది. ఇంకా జీవితాన్ని తాకట్టుపెట్టి ఒట్టి జీవన్ మృతురాలిగా కొనసాగుతూ. . భవిష్యత్తును ఇంకా చీకటిమయం చేసుకోవద్దసలే. ఇక తనను తాను పునర్నిర్మించుకోవాలి. ‘అనుకుంది జానకి స్థిరచిత్తంతో.

ఆ భావన మనసులో పొటమరించగానే ఎందుకో ఏదో కొత్త ఉత్సాహం ఆమెలో గంగలా పొంగి నింగికెగసింది.

కారు వేగాన్నందుకుని. . పది నిముషాల్లో ఇంటి ముందు.

జానకి ఊహించినట్టుగానే ఆమె వెళ్ళేసరికి అన్ని టివి ల విలేఖరులు. . ప్రింట్ మీడియా పాత్రికేయులు తమ ఇంటిముందు గుమికూడి ఎదురుచూస్తున్నారు అత్యుత్సాహంతో. . వర్షంలో. . కొందరు తడుస్తూ. . కొందరు గొడుగులు పట్టుకుని.

ఎదురుగా నాల్గు అంతస్తుల తమ ఇంద్ర భవనం. గేట్ ముందు గూర్ఖా.

ఇంతపెద్ద సకల సౌఖ్యాలతో నిండిన. . కనీసం ఓ ఇరవై కోట్లన్నా ధర పలుకగల ఈ భవనం కేవలం ఒక ఐ ఎ ఎస్ ఆఫీసర్గా పదేండ్ల సర్వీస్ కూడా లేని రమణకు ఎలా సంక్రమించింది అని ప్రశ్నించే వ్యవస్థే మన ప్రభుత్వంలో గానీ, ప్రజా సంఘాల్లోగానీ లేవు. ఎవడికి అందినంత వాడు దోచుకుని పారిపోవడమే ప్రస్తుత అతి స్వేచ్చాయుత సమాజంలో జరుగుతున్నది. . కనీసం చూచే నాధుడే లేడు. కుక్కవలె ఊర్కే అరిచే నిఘాకూడా లేదు.

అసమర్థ పాలకులు. . చేవచచ్చిన ప్రభుత్వాలు. లంచాలకు మరిగి తమతమ సహజ విధులను మరిచి ఇంటిదొంగలుగా మారిన ప్రభుత్వ ఉద్యోగులు. ఇక ఈ దేశం బాగుపడే అవకాశమే లేనంత దౌర్భాగ్య అవినీతివ్యాప్తి. ఎలా. ఎలా. . ?

జానికి రవళితో సహా కారు దిగగానే ఓ పది పదిహేనుమంది ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులు వాళ్ళను చుట్టుముట్టారు.

పైనుండి జోరుగా కురుస్తున్న వర్షం.

‘మేడం. . మీకు తెలుసు ఈరోజు సెక్రటేరియట్ లో మీ భర్త రమణ ఐ ఎ ఎస్ ఒక సాటి ఉద్యోగియైన మహిళపై అత్యాచారం జరుపబోయి పట్టుబడి ఆమెతో చెప్పుదెబ్బలు తిని. . అనేకమంది మహిళా ఉద్యోగినుల చీత్కారాలకు గురైన సంగతి. ఆయన భార్యగా. . బాధితురాలైన ఒక సాటి మహిళ పొందిన ఈ అవమానాన్ని అర్థంచేసుకుంటున్న విద్యావంతురాలిగా మీరెలా స్పందిస్తారు. ‘ప్రశ్నలు కురుస్తూనే ఉన్నాయి.

ఒకటి. . రెండు. . అనేక ప్రశ్నలు. గుచ్చి గుచ్చి. . తికమకలు మకతికలుగా. విలేఖరులకు ఇట్లాంటి విషయాల్లో అమితోత్సాహం. విషాదానంద చాపల్యం.

పాపం రవళి ఏమీ అర్థంకాక బిక్కచచ్చి అలా బేలగా చూస్తోంది చుట్టూ.

గూర్ఖా పరుగెత్తుకొచ్చాడు పరుగుపరుగున జానకి దగ్గరకు.

జానకికి చాలా సిగ్గుగా,ఎబ్బెట్టుగా,ఇబ్బందిగా ఉంది. వానలో తడుస్తున్న చీర కొంగును భుజాలచుట్టూ చుట్టుకుని. ,

గొంతు సవరించుకోబోయింది.

సరిగ్గా అప్పుడే రమణను ఎక్కించుకున్న ఓ టయోటో క్యామ్రీ కారు సర్రున దూకుడుగా దూసుకొచ్చి గేట్ ముందట ఆగింది. క్షణ కాలంలో చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించి,

చకచకా జానకీ రవళీ ఉన్న చోటికి నడచివచ్చి. . ఏదో అనబోతూండగా,

నిప్పు మీదబడ్డ మనిషిలా రమణ స్పర్శనుకూడా ఇచ్చగించని వ్యక్తిలా చేతిలోని పిల్లను పట్టుకుని దూరంగా జరుగుతూ. . “డోంట్ టచజ్. వీ హేట్ యు. గో ఎవే” అని అరిచింది జానకి బెబ్బులిలా.

రమణ షాక్ తిన్నాడు. అవాక్కయ్యాడు.

టివి కెమెరాలు సందర్భాన్ని ఉత్సాహంగా రికార్డ్ చేస్తూనే ఉన్నాయి. . ‘రేటింగ్. . రేటింగ్’ స్పృహ.

“మేడం చెప్పండి. . ”

” వీడు ఒక పూర్తి కరప్టివ్ బాస్టర్డ్. ఒక పెద్ద ఉమనైజర్. ప్రభుత్వంలో ఉన్న అత్యున్నత పదవిని అడ్డుపెట్టుకుని ఈ దేశాన్ని దోచుకు తింటున్న అనేకమంది బ్యూరోక్రాట్స్ లో ఒకడైన ఈ రమణ యొక్క అవినీతి భాగోతాన్ని నేను రేపు ఉదయం మీ టివి చానెళ్ళలో బయట పెడుతాను. . డాక్యుమెంటరీ ఋజువుల్తోసహా. . మీకు బయటికి కనబడ్తున్న. . ఈ రోజు టివి ల్లో చూపిన  దృశ్యాలన్నీ అబద్దం.  నిజాన్ని నేను రేపు చెబుతాను ప్రపంచానికి. అరేంజ్ ఫర్ మై ఇంటర్వ్యూ. ఈ రమణ ఎవరు. . రమణ బాగోతం ఏమిటి. ఇన్నాళ్ళూ రమణ వెంటపడి కుక్కలా విచ్చలవిడిగా తిరిగిన ఈ సుమ ఎవరు. సుమ క్యారెక్టర్,బ్యాక్ గ్రౌండ్. . అన్నీ రేపు విప్పి చెబుతాను నేను. నేను ది వైఫ్ ఆఫ్ మిస్టర్ రమణ ఐ ఎ ఎస్. “జానకి ఆవేశంగా చెప్పుకుపొతోంది. చుట్టూ నిశ్శబ్దం. ఒట్టి వాన చినుకుల చప్పుడు. అంతే.

రమణ జానకిని చేయిపట్టుకుని ఇంటిలోపలికి తీసుకెళ్ళేందుకని తన చేయి చాపి. ,

ఇంతలో. . మెరుపు వేగంతో. . ఎవరూ ఊహించనివిధంగా జానకి రమణ చెంపపై చళ్ళున చరచి. . తుపుక్కున ఆయన ముఖంపై కాండ్రించి ఉమ్మేసింది.

విస్తుబోయారందరూ. అప్రతిభులయ్యారు.

రెప్పపాటులో జానకి రవళిని తనవెంట చేయిపట్టుకుని లాక్కుపోతూ తన కారుదగ్గరికి వెళ్ళి డోర్ ను తెరిచి ఎక్కి. . స్టార్ట్ చేసుకుని మరుక్షణం అక్కడినుండి వెళ్ళిపోయింది.

అందరూ చూస్తున్నారు కారు వెళ్ళిపోతున్న దిక్కు. . రమణతోసహా. . అందరూ అవాక్కయి.

పైనుండి వర్షం కురుస్తూనే ఉంది. ఆగకుండా. జోరుగా.

3

అర్థరాత్రి దాటి. ,

వరంగల్ రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాం నంబర్ రెండు.

డిసెంబర్ దాటి. . జనవరి మూడవ తేదీ.

చలి. . విపరీతమైన చలి. దట్టంగా పొగమంచు. ఈ మధ్యకాలంలో ఎన్నడూ ఆ విధంగా పొగమంచు ఏర్పడలేదు అంత చిక్కగా. . రెండదుగుల దూరంలో ఉన్న మనిషికూడా కబడనంత.

ప్లాట్ ఫాం పై ఒక్క మనిషికూడా లేదు. వంతెన మెట్లకింద ఒక బక్కని కుక్క చలికి గజగజా వణికిపోతూ ఇంకాఇంకా లోలోపలి ముడుచుకుపోతూ మునగతీసుకుంటోంది.

అంతా నిశ్శబ్దం.

అక్కడక్కడ వెలుగులను వర్షిస్తున్న ట్యూబ్ లైట్లు తమను పొగమంచు కమ్మేస్తున్నందున గుడ్డిగుడ్డిగా వెలుగుతూ. . ఓడిపోతున్నాయి మిణుకుమిణుకులతో. . జ్వరంవచ్చి దీర్ఘకాలం తర్వాత అప్పుడే కోలుకుంటున్న మనిషిలా. . బలహీనంగా. . పీలగా. . నిస్సత్తువగా.

ఉండీ ఉండీ చటుక్కున ప్రకటనలు వినిపించే మైక్ గొంతు సవరించుకుని. ,

శబ్దం వాతావరణాన్ని సంచలింపచేస్తుందా. ?నిద్రపోతున్న మనిషిని తట్టిలేపుతున్నట్టు ధ్వని పరిసరాలను చైతన్యవంతం చేస్తుందా,?

‘దయచేసి వినండి. . ఒకటి రెండు తొమ్మిది ఆరు ఏడు చెన్నై జైపూర్ జైపూర్ ఎక్స్ ప్రెస్ మరికొద్ది నిముషములలో రెండవ నంబర్ ఫ్లాట్ ఫాం పైకి వచ్చును. యువర్ అటెన్షణ్ ప్లీజ్. . ‘ఖణ్ ఖణ్ మని ధ్వని మైక్ లో.

తర్వాత హిందీలో. . ఆ తర్వాత ఇంగ్లీష్ లో.

ఎక్కడా ఏ సంచలనమూ లేదు. మనుషుల అలికిడీ లేదు. మళ్ళీ నిశ్శబ్దం. చిక్కగా పొగమంచు.

ప్లాట్ ఫాంపైనున్న వ్రేలాడే గడియారం ముళ్ళను సవరించుకుంటోంది. టైం మూడూ పందొమ్మిది.

దూరంగా ఎర్రగా. . అప్పుడే ఆకుపచ్చని రంగులోకి మారిన సిగ్నల్ లైట్లు. దూరంగా ఏముందో తెలియని మంచు తెరలు. అవతల గాఢనిద్రలో స్పృహనుకోల్పోయి వరంగల్లు మహానగరం. ఇటుప్రక్క ఉత్తరంవైపు గోవిందరాజుల గుట్ట. పైన మిణుకుమిణుకుమంటూ కాంతి. . లైట్లు. శిఖరంపై.

స్టేషన్ మాస్టర్ ఎందుకో అనాలోచితంగానే తన గదిలోనుండి బయటికొచ్చి. . చుట్టూ చూశాడు. అతనికి చాలా విభ్రమంగా ఉంది. తను వరంగల్లు ట్రాన్స్ ఫరై వచ్చిన గత రెండేళ్ళలో ఎన్నడూ ఇంత పొగమంచును చూల్లేదు. అతనికి ఒకటవ ప్లాట్ ఫాం దాటి ఏమీ కనబడ్డంలేదు. రెండవ లైన్ పై ఒక గూడ్స్ బండి ఆగి ఉంది. అటూ ఇటూ చూశాడు కళ్ళని చికిలించి. దూరంగా మిణుకుమిణుకుమంటూ. . ఎర్రగా. . పసుపుగా. . సిగ్నల్ లైట్లు. . లీలగా. . గుడ్డిగుడ్డిగా.

ఎందుకొచ్చిందో ఈ రోజు ఇంత దట్టంగా పొగమంచు. . అనుకున్నాడతను. చేతిలో వాకీటాకీ ఉంది. చటుక్కున స్విచ్ నొక్కి. . సిగ్నల్ క్యాబిన్ కు కలిపాడు. కొంచం ఆందోళనగా అనిపించిందతనికి ఎందుకో.

” నాగభూషణం గారూ. . అంతా ఓకేనా. . పొగమంచు బాగా వ్యాపించి ఉందిగదా. . బి కేర్ ఫుల్. జాగ్రత్తగా గమనించు దృష్టి సారించి చూస్తూ. ఏదైనా డిలే ఐనా ఫర్వాలేదు కాని లైన్స్ ను జాగ్రత్తగా గమనిస్తూ ఆపరేట్ చెయ్. ”

“ఎస్సర్”అవతలినుండి జవాబు.

ప్లాట్ ఫాం నంబర్ వన్ పైనకూడ జన సంచారం లేనేలేదు. ఒకడెవడో కాళ్ళు చాపుకుని ప్రక్కన గేట్ దగ్గర కూర్చుని న్యూస్ పేపర్ల బండిల్ ను విప్పుకుంటున్నాడు. ఒకడు ‘వేప్పుల్లై. . వేప్పుల్లై ‘అని అరుస్తూ అటుఇటూ తిరుగుతూ. ,

ఇంత బోసిగా స్టేషన్ కనబడ్డం కూడా అతనికి వింతగా ఆశ్చర్యంగా అనిపించింది. అసలిది వరంగల్లు మహానగరమేనా లేక ఒక కుగ్రామంలో ఉన్న పిల్ల స్టేషనా అనిపించిందతనికి.

ఖాళీ మనసుతో అలా దూరంగా చూస్తూ ఏదీ కనబడక. . ఎవరో టియర్ గ్యాస్ షెల్స్ ను ప్రయోగిస్తే అలుముకున్న పొగవలె పైన దుప్పటిలా ఆక్రమించిన పొగమంచును చిత్రంగా చూస్తూ. ,

అప్పుడు కనిపించింది తూర్పు వైపునుండి రొప్పుతూ వస్తున్న రైలు. జైపూర్ ఎక్స్ ప్రెస్.

అంతా కర్ఫ్యూ వాతావరణం. సరిగ్గా అప్పుడే ఫిట్టర్ లక్ష్మణ్ కనిపించాడు తనవైపే వస్తూ.

“లక్ష్మణ్. . ప్లాట్ ఫాం నంబర్ టు కు పో. కోచ్ పొజిషన్ డిస్ప్లే ఉందా లేదా చూడు ఈ పొగమంచులో కనిపించట్లేదేదీ”అన్నాడు గడగడా.

లక్ష్మణ్ వెళ్ళిపోయాడు టకటకా మెట్లపైనుండి హనుమంతునిలా పరుగు తీస్తూ. ఒకే నిముషం. . మనిషి కనిపించలేదు మంచులోకి మాయమై.

లక్ష్మణ్ వచ్చి చూస్తే అన్ని కోచ్ డిస్ప్లే బోర్డ్స్ బాగానే వెలుగుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఎ సి కోచ్ ఎ వన్. . ఎ టు. . ప్రక్కనే బి వన్.

లక్ష్మన్ ఆశ్చర్యపోయాడు ఆ రోజు ప్లాట్ ఫాం అంత బోసిగా,ఒక్క మనిషికూడా లేకుండా ఉండడంను గమనించి.  దానికి తోడు దట్టమైన పొగమంచు. ఎన్నడూ లేని విధంగా. ఈ మధ్య గత ఇరవై యేళ్ళలో అతను ఎప్పుడూ ఇంత గాఢమైన పొగమంచు కమ్ముకురావడం చూడలేదు. ఇట్లనే ఉంటే రైళ్ళను నడపడం కష్టమే. అసలు ఎదుట ఏముందో కనిపించడమే లేదు. ఆ కొస నుండి ఈ కొసదాకా చూశాడు లక్ష్మణ్. ఇటువేపు ఎర్రగా,గుడ్డిగా వెలుగుతూ సిగ్నల్ లైట్. అటుదిక్కు అతి మెల్లగా రొప్పుతూ రైలు. . భీకరంగా చప్పుడు చేస్తూ.

కనీసం ఛాయ్ కాఫీలు అమ్మేవాళ్ళుకూడా లేరు.

ఏమైందీ రోజు. . అనుకున్నాడు లక్ష్మణ్. అనుకుని ఇక ఆగుతున్న రైలును గమనిస్తూనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నెక్కి. ,

మెట్లే కనబడ్డంలేదు. ఎదురుగా ఎవరైనా  వస్తే గుద్దుకునేట్టే ఉంది.

లక్ష్మణ్ వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్ మాస్టర్ పంపిన ఆర్పిఎఫ్ జవాన్ రహీం వచ్చాడు బ్రిడ్జ్ పైనుండి నడుస్తూ.

రైలు ఆగింది. కాని ఒక్క మనిషీ దిగలేదు. ఎవరూ ఎక్కలేదు. అంతా ఒట్టి నిశ్శబ్దమే. రహీం బ్రిడ్జ్ పైననే ఉండి చూస్తున్నాడు కిందికి. . చుట్టూ. . చూపు ఆనేంతమేరకు. అంతా ఒట్టి తెల్లని పొగమంచు. . నేలదిగి వచ్చి ‘ఇక్కడే చాలా బాగుంది ‘అని అక్కడే స్థిరపడిపోయినట్టు. రహీం కు వింతగా ఉందా దృశ్యం.

మూడు నిముషాలు గడిచిన తర్వాత మైక్ లోనుండి ప్రకటన. . ‘. . . . . జైపూర్ ఎక్స్ ప్రెస్ రవాణా హోనేకేలియే తయ్యార్ హై. . ‘

రైలు ఇంజన్ ముందున్న సిగ్నల్ ఆకుపచ్చగా మారి. . మెల్లగా కదలిక ప్రారంభమై. . ఒక్కో డబ్బా జరుగుతూ. ,

సరిగ్గా అప్పుడు జరిగింది. ఒక ఉదంతం.

ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ ఎ వన్ నుండి ఒక యువకుని నగ్న శరీరం దబుక్కున రైలు డబ్బాలోనుండి ప్లాట్ ఫాంపైకి ఒక మూటకట్టిన గోనె సంచిలా వచ్చి పడింది. శరీరం కాబట్టి పెద్దగా చప్పుడుకూడా కాలేదు. ఖచ్చితంగా అదేక్షణం రైలు ఇంజన్ నుండి రెండవ బోగీ ఐన లేడీస్ కంపార్ట్ మెంట్లోనుండి ఒక ఇరవై ఐదేళ్ళ యువతి గబాల్న అనూహ్యంగా దిగినట్టు బైటికి దూకింది. దిగి చాలా ఆందోళనగా,భయంభయంగా చుట్టూ చూచింది. ఏమీ కనబడలేదామెకు. కేవలం దట్టంగా అంతటా అలుముకున్న పొగమంచు తప్పితే.

గజగజ చలి.

అప్పటికే తలపైనుండి చెవులచుట్టూ. . ముఖాన్ని కప్పుతూ కట్టుకున్న ఓణీవంటి గుడ్డను ఆమె మరోసారి సవరించుకుని ఒంటిపైనున్న స్వెట్టర్ గుండీలను పైవరకు పెట్టుకుని కింద తనతోపాటు వచ్చిపడ్డ చౌకరకపు రెగ్జిన్ బ్యాగ్ ను చేతిలోకి తీసుకుంది.

వరంగల్ కొత్త. రావడం మొదటిసారి. ఇదివరకెప్పుడూ రాలేదు. విన్నది చాలా చాలా ఈ నగరం గురించి.

ఇక ఇప్పుడూ. . ఇకముందూ వరంగల్లే తన జీవితం కాబోతోంది.

ఎందుకో భయమేసిందామెకు. దుఃఖం కూడా ముంచుకొచ్చింది.

‘తప్పదు ‘అనుకుంది నిశ్చలంగా.

ఎటు వెళ్ళాలి తనిప్పుడు. ఎవరున్నారు తనకిక్కడ ఈ ఊరుగాని ఊళ్ళో. స్టేషన్ లో దిగే ప్రతి ప్రయాణీకుడూ రైలు దిగగానే తను చేరవలసిన గమ్యంవైపు చకచకా సాగిపోతాడు బయటికి వచ్చి. వాళ్ళకు ఎవరో ఒక తన స్వంత మనిషి ఉంటాడు. వాళ్ళను చేరుకోవడమే లక్ష్యం ప్రతివాడికి.

కాని తన విషయం అలా కాదు. ప్రస్తుతం ఎవరూ లేరు తనకు. ఉన్నదల్లా గుండెలనిండా ధైర్యం. ఈ దుర్మార్గ సమాజాన్ని ఎదిరించి,పోరాడి ‘గెలుపు ‘ను స్వంతం చేసుకోవాలన్న కసి.

‘చాలా మంది శరీరంతో జీవిస్తూంటారు. . కాని వివేకవంతులు జీవితాన్ని తెలివితో వ్యూహాత్మకంగా జీవిస్తారు. వివేకానికీ. . తెలివికీ. . ప్రతిభకూ. . ప్రజ్ఞకూ. . నైపుణ్యానికీ తేడాను తెలుసుకుని సార్థకతను సాధిస్తూనే బతుకును అర్థవంతంగా మలుచుకుని అంతిమంగా విజయాలను స్వంతం చేసుకుంటారు. ‘

ఆమె నడవడం ప్రారంభించింది బ్రిడ్జ్ వైపు. ప్రక్కనే అప్పటిదాకా మెల్లెగా కదుల్తూ ఉన్న రైలు వేగాన్నందుకుని ప్లాట్ ఫాంను దాటి పోయింది. ఐనా పొగమంచు మబ్బువల్ల అవతలి పట్టాలపై ఉన్న గూడ్స్ రైలు కనిపించడమే లేదు. కళ్ళను చికిలించుకుంటూ ఒక్కో అడుగు వేసుకుంటూ. . ‘బయటకు దారి ‘ఎక్కడో అని చూపులను చుట్టూ సారిస్తూ. ,

అప్పటికి బ్రిడ్జ్ పైనుండి చూస్తూన్న రహీం గబగబా కిందికి పరుగెత్తుకొచ్చి. . ఒక మూటవలె ప్లాట్ ఫాం మీద పడిఉన్న యువకున్ని గమనించి. . దగ్గరగా వచ్చి. ,

ఆశ్చర్యపోయాడు రహీం. గ్రీకు శిల్పంవలె చెక్కినట్టు శరీరం. . తెల్లగా. పోతపోసినట్టు ఒల్లంతా మెలితిరిగిన కండలు ఇనుపముద్దల్లా. అజానుబాహువు.

ఒంటిపై నూలుపోగు కూడా లేదు. పూర్తి నగ్నంగా. కనీసం మొలతాడు కూడా లేక ఒక పెద్ద చెట్టు కూలి నేలపైబడ్డట్టు. . చిత్రంగా.

ఒక మనిషిని ఈరకంగా ప్లాట్ ఫాంపై ఏదో పిచ్చోళ్ళను తప్పితే ఇలా పూర్తి నగ్నంగా చూడడం రహీంకు తన పదిహేనేండ్ల సర్వీస్ లో ఇదే మొదలు.

ఎవరై ఉంటాడు ఈ యువకుడు. ఇందుకిలా. . ప్రమాదవశాత్తు పడిపోవడమా ఇది. కాదనిపిస్తోంది ఒంటిపై ఎక్కడా ఒక్క రక్తపు చుక్కకూడా లేదు. గాయంలేదు. చెక్కుచెదరని దేహం తాజాగా.

ప్రక్కన ఏదైనా లగేజ్ ఉంటుందేమోనని వెదికాడు.

ఉహు. . లేదు. కనీసం ఒక సంచీ ఐనా లేదు. ఇప్పుడేంచేయాలి తను.

చేతిలోని బ్యాటరీని ఫోకస్ చేసి దట్టమైన పొగమంచులోకి అటుఇటూ తిప్పి చూశాడు. ఒక్క మనిషి జాడకూడా లేదెక్కడా. ఇంతకుముందు వెళ్ళిన రైలునుండి ఎవరైనా దిగారా అని కళ్ళతో వెదికాడు. ఎవ్వరూ కనబడలేదు.

సరిగ్గా ఆ క్షణమే ఎదురుగా అలా అడుగులోఅడుగేసుకుంటూ వస్తూ కనిపించింది ఆమె. . ఒక యువతి.

ఈ జైపూర్ ఎక్స్ ప్రెస్ నుండి బయటికి వచ్చినవాళ్ళు ఈ ఇద్దరేనన్నమాట అని అనుకుని రహీం ఆ యువతి వంక అదోలా పరిశీలనగా చూశాడు. ఆమె పోలీస్ ను చూచి కొంచెం జంకుగా తటపటాయిస్తూ. ,

“మీరెవరు. . ఈ జైపూర్ ఎక్స్ ప్రెస్ లోనుండే దిగారా”అని ఆమెను ప్రశ్నిస్తూనే ఏదో అనుమానమొచ్చి రహీం చటుక్కున వంగి ఆ పడిఉన్న నగ్న యువకుడి ముక్కుదగ్గర ఒక వ్రేలినుంచి ప్రాణముందా లేదా అని పరిశీలించాడు.

ఉంది. . ప్రాణముంది. . శ్వాస మామూలుగానే  ఆడుతోంది.

కాని అపస్మారకంగా ఉన్నట్టున్నాడు. ఏ కదలికలూ లేవు. కళ్ళు మూతబడే ఉన్నాయి.

వెంటనే రహీం తన మొబైల్ ను తీసుకుని తన ఆర్ పి ఎఫ్ ఎస్సైకి ఫోన్ చేశాడు పరిస్థితిని విడమర్చి చెబుతూ. ,

ఆమెకు అంత పొగమంచులోనూ చెమటలు పోయడం మొదలైంది.

మొదట్లో ఏదీ అర్థంకాలేదామెకు. కాని ఎప్పుడైతే ఎదుటున్న పోలీస్ ‘ఈ ట్రైన్ లో వచ్చింది మీరిద్దరేనా’ అని అడిగాడో. . ఆ క్షణం నుండి. . వణుకు. . భయం. . ఆవహించాయామెను.

ఐదు నిముషాల్లో ప్లాట్ ఫాం పైనున్న దృశ్యమంతా మారిపోయింది. దట్టమైన పొగమంచును చీల్చుకుంటూ. .  స్టేషన్ మాస్టర్. . ఆర్పిఎఫ్ ఎస్సై. . మరిద్దరు జమేదార్లు. . ఈ లోగా మరేదో రైలుకు వెళ్లవలసిన ఐదార్గురు ప్రయాణీకులు. . చుట్టూ ఒక చిన్న మనుషుల గుంపు.

ఎదుట బరిబాత భూమిపై పడుకోబెట్టిన శిల్పంలా అపస్మారక స్థితిలోఉన్న యువకుడు. జనంలో గుసగుస.

” నువ్వుకూడా అదే రైల్లో ప్రయాణిస్తూ దిగావా” అని ప్రశ్న. . యువతినుద్దేశ్యించి.

” ఔన్సార్”

” పదండి స్టేషన్ కు”

“నేనెందుకు సార్” అని ఆమె అమాయకమైన ప్రశ్న.

“నువ్వుగాకుంటె ఎవరొస్తరు నీ. . “ఎస్సై గొంతులోనుండి బూతుల ప్రవాహం.

“ఇతనెవరో నాకు తెల్వదిసార్. నేను లేడీస్ కంపార్ట్ మెంట్ లనుండి దిగిన సార్”

“సరె. . అన్నీ అక్కడ పోలీస్ స్టేషన్ల చెప్పుదువు పా”

ఆమెకు పిచ్చిపిచ్చిగా. . దుఃఖ దుఃఖంగా ఉంది.

“అరే రహీం ఇక్కడుంటే ఇదో పెద్ద షో ఐద్దిగని . . పట్టు పట్టు. . పట్టి ఆ ట్రాలీల వీన్నేసుకుని మన పోలీస్ స్టేషన్ లకు పట్క పా. వాడు పూర్తిగ బరిబాతున్నడు”

వెంటనే ఒకడు ఉరికి సామాన్లను వేసుకుపోయే ట్రాలీని తీసుకొచ్చి. ,

‘పటు పటు. . ‘అని కాళ్ళొకడు,చేతులొకడు పట్టి,మనిషిని బండిపైకి చేర్చి. ,

“అరే రహీం వానిమీద ఏదన్న కప్పుర. మరీ బరిబాతున్నడు అంతా బైటికి కనబడ్తాందిగాదుర. ఏ లే. . ఈ తుండుగుడ్డ కప్పు. ”

బండిని తోసుకుంటూ రహీం ఇంకో ముగ్గురు బేవార్స్ గాళ్ళు ప్లాట్ ఫాం నుండి తోసుకుని అటు డౌన్ నుండి వన్ వైపు తీసుకుపోయారు. ఎస్సై యువతిని తన వెంట నడిపించుకుపోతూ. . “ఐతే నీ పేరేమిటన్నవ్”అన్నాడు యధాలాపంగా అటు వన్ దిక్కు నడుస్తూ.

“నేనేమీ అనలేదు సార్. అసలు నా పేరునే మీకు చెప్పలేదు సర్ ఇంతవరకు. ”

చటుక్కున ఆమె ముఖాన్ని లిప్తకాలంలో షాక్ తో చూచి. . “ఐతే నీ పేరేంది. చెప్పు” అన్నాడు.

“వకుళ”అంది.

“ఊ. . బాగుంది. . ఈ పేరు కొత్తగా చాలా బాగుంది”

ముందు ఎస్సై పరుగు వంటి నడక.  వెంట ఆమె. . వకుళ.

ప్లాట్ ఫాం నంబర్ వన్ మీద ఆర్పీఫ్ ఆఫీస్.

ముందు ఎస్సై. . వెనుక వకుళ . . ఇంకా వెనుక మరో ఇద్దరు కానిస్టబుల్స్ వచ్చి. ,

“చూడు పోరీ. . నువ్వు జుంజుంగ ఉన్నవ్. నిన్ను చూస్తాంటె దుకాణం పెట్టబుద్దయితాంది. చెప్పేది బాగ ఇను. నేను చెప్పినట్టు దుకాణానికి ఓకె అంటే పది నిముషాల్లో ఖేల్ ఖతం తాళీ బజావ్. గంతే. నువ్వు బైటికి పోతౌ. నేను నాపని నేను చేసుకుంట. కాదన్నవనుకో నువ్వే ఆ పోరణ్ణి చావగొట్టి కండ్లుమూసే ప్రయత్నం చేసినవని కేస్ బనాయించి లాకప్ల పెట్టి నూకిస్త. ఎవడస్తడో చూస్త. సమజైందా. ”

వకుళ మనసు పాదరసంలా పనిచేస్తోంది.

చేయని తప్పుకు. . పులి నోట్లో తల.

శిక్ష. . శీలం.

“అరిగేదా కరిగేదా”అని పోలీస్ భాష.

ఆలోచిస్తోంది. . ఆమె మనసు అంటుకున్న ఎండాకాలపు అడవిలా ఉంది.

ఈ లోగా రహీం నూకుడు బండిలో ఆ యువకుడిని తీసుకొచ్చారు.

అప్పుడు చూచింది పరిశీలనగా ఆ మనిషిదిక్కు.

వాడి ముఖంలో ఏదో తెలియని కళ ఉంది. జీవముంది. వర్చస్సుంది. అర్థంకాని ఆకర్షణ ఉంది.

వకుళ మెరుపువలె ఆలోచించింది.

తనదగ్గర ఏమీ లేదు. హాండ్ బ్యాగ్ లో ఒకేఒక ఐదు వందల రూపాయల నోటు. . మరో వంద నోటు. . కొంత చిల్లర. అంతే. అదే తన ఆస్తి.

ట్రాలీలో వచ్చిన యువకుని దేహాని ఎస్సై పరిశీలనగా,దగ్గరగా చూచి ‘వీడెవడ్రా బాబు. అస్సలే కేసులు తెమలక మనం చస్తూంటే ఈ పరేషాన్ ఒకటి. ‘ అని స్వగతంగా గొణుక్కుంటూ. ,

“ఏయ్ పోరీ ఏమైంది. డిసైడ్ చేసుకున్నవా”

“చేసుకున్న సర్”

ఎస్సై యువకుని శరీరాన్ని జాగ్రత్తగా చూస్తున్నాడు అక్కడక్కడ ముట్టుకుంటూ.

“అరే రహీం. . వీని చెవుల వెనుక చూడ్రా. ఎవడో ఒక పొక్క చేసి. . ఏదో కానిచ్చి. . మళ్ళీ మూతమూసి అంతా తాజూఫ్ గ ఉందిరో. మిస్టరీ. ”

అప్పుడు చూసింది వకుళ ఆ యువకుణ్ణి. నిజమే. చెవుల వెనుక ఒక రంద్రం. . పచ్చగా గాయం.

ఎస్సై నుండి గుప్పున విస్కీ వాసన ఒక కెరటంలా వచ్చిపడింది.

“ఏయ్ పోరీ కమాన్ చెప్పు ఏంచేద్దాం. ”

“సర్. . నిజం చెబుతున్నా. . వీడు ఎవడో నాకు తెలియదు. కాని వీనిలో ఒక శక్తి ఉంది. ఆ విషయం తెలుస్తోంది నాకు. వీణ్ని నాకిచ్చేయండి. నేను తీసుకుపోతా. మీకు నేను కావాలికదా. ఓకె. డన్. ”

“ఐతే దా. లోపలికి దా. పనైన తర్వాత నువ్వూ వాడూ వెళ్ళిపోండి. సరేనా ”

వకుళ ఒకసారి ఆ అపరిచిత యువకునివైపు సాలోచనగా చూచి ఎస్సై వెనుక గదిలోపలికి నడిచింది. లోపలికి వెళ్ళగానే చీరను విప్పి అటు టేబుల్ పై విసిరేసి. ,

ఎస్సై వచ్చాడు హుషారుగా. . లోపలికి.

వకుళకు లోకం అర్థమౌతోంది ఇంకా ఇంకా.

బయట దట్టమైన పొగమంచు విడిపోయిందో లేదో వకుళకు తెలియదు.

బయట మైక్ లో వినబడుతోంది”. . . . . . . . గాడీ రవాణా హోనేకేలియే తయ్యార్ హై. . ”

4

అరవై రెండేండ్ల సదాశివం పట్టపగలు. . ఆ ప్యాసింజర్ బండిలో పయనిస్తున్నాడు. . కిటికీ దగ్గర కూర్చుని.

డబ్బాలో జనాలెక్కువ లేరు. అంతాకలిపితే ఓ పదిమంది ఉంటారేమో. ఎదుట ఉన్న సింగిల్ చెక్క కుర్చీపై కాళ్ళు చాపుకుని కూర్చుని అటుఎటో దిగంతాల్లోకి చూస్తున్నాడు. రైలు చాలా మెల్లగా వచ్చీ వచ్చీ ఆ చిన్న స్టేషన్లో కీచుమని శబ్దం చేస్తూ ఆగింది.

తలను కిటికీలో నుండి బయటికి సారించి చూశాడు. బోర్డ్ కనిపించింది రావి చెట్టుకింద.  పొత్కపల్లి. .  కరీంనగర్ జిల్లా. అక్కడే ఒక గజ్జికుక్క ఎందుకో మోరెత్తి బిగ్గరగా ఏడుస్తోంది. కుక్క ఏడుపు తప్పితే అంతా గాఢమైన నిశ్శబ్దం. ఎక్కడా ఏ అలికిడీ లేదు.

తెలుసు సదాశివంకు ప్యాసింజర్ రైల్లో ప్రయాణం ఎలా ఉంటుందో. తెలిసే. . కావాలనే అతను ఆ పర్యటనకు ప్యాసింజర్ రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నాడు.

పరిశీలించడం సదాశివంకు చాలా ఇష్టం.

మనుషులను పరిశీలించడం. . జీవితాలను పరిశీలించడం. . ఆకాశాన్ని,భూమిని. . సమాజాన్ని. . ప్రాంతాలను. . పుస్తకాలను. . వివిధ నాగరికతలను. . పతనమైపోతున్న విలువలను. . విచ్ఛిన్నమైపోతున్న మానవ సంబంధాలను. . గత అరవై ఐదు సంవత్సరాలనుండి వస్తున్న అసమర్థ,అవినీతిమయ ప్రభుత్వాలను. . విచ్చలవిడిగా పెచ్చరిల్లిపోతున్న ప్రజల సుఖలాలసతనూ. . ముందుచూపే లేని ప్రజాకంఠక ప్రభుత్వాలవల్ల హరించుకుపోతున్న ప్రకృతి వనరులనూ. . ధ్వంసమైపోతున్న సృష్టి సమతుల్యాన్నీ పరిశీలిస్తూనే ఉన్నాడు సదాశివం గత ఇరవై రెండేండ్లుగా.

పరిశీలిస్తున్నకొద్దీ సదాశివంకు దుఃఖమే మిగుల్తోంది. ఎక్కడో ఆకాశమంత ఎత్తునుండి కిందికి అతివేగంగా దిగజారుతూ ఇంకాఇంకా లోలోపలికి. . పాతాళంలోకి పయనిస్తున్న వికృతానుభూతి అతన్ని రోజురోజుకూ కుంగదీస్తోంది.

భారతదేశంలో సామాజిక పరిస్థితులు ఇలానే కొనసాగి ప్రకృతి ఇలాగే ధ్వంసమై ఈ హననం నిరంతరమౌతుందా. . ఈ ఆత్మ విధ్వంసాన్ని ఆపే నాధుడే లేడా.

అతని ప్రక్క పిడికెడు సైజ్ ఉన్న ఒక రాయి ఉంది. నల్లగా. . తళతళా మెరుస్తూ.

రాయిలోని సౌందర్యాన్ని చూడగల ‘చూపు ‘ ఈ దేశప్రజలకూ,ప్రభుత్వాలకూ ఎప్పుడు కలుగుతుందో. . అనుకున్నాడతను.

అతనికి తన ‘సేవ్ రాక్స్ ‘ఉద్యమం జ్ఞాపకమొచ్చింది.

2 thoughts on “అంతిమం (నవల) 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *