May 1, 2024

ధీర – 2 (కళ్యాణి)

ప్రభుత్వం వారో, లేదా మరే ఇతర సంస్థ వారో అవార్డులు, రివార్డులు ఇచ్చి సన్మానిస్తేనే గొప్పవారు అవుతారా? పేపర్లూ, పత్రికలూ వారి గురించి రాస్తేనే ప్రముఖులా? సఫలత కి కొలమానం ఏమిటి? మనలో ఒకరుగా కనిపిస్తూ, సామాన్యంగా అనిపిస్తూనే తమ పరిధిలో విజేతలుగా నిలిచిన మహిళలందరూ ధీరలే కదా!. అలాంటి మరొక మహిళ గురించి ఈ నెల ‘ధీర’ లో ఆమె కోడలు సుభద్ర మాటల్లో తెలుసుకుందాం.
పుట్టినది కోనసీమలోని అందమైన చిన్న గ్రామం. నెమ్మదిగా సాగే శాంత గోదారిలా చల్లగా అందంగా సాగే జీవనం. ఊరంతటికీ తలమానికంగానూ, గౌరవప్రదంగానూ నిలిచే పెద్ద కుటుంబంలో, మర్యాదా, సాంప్రదాయపు కట్టుబాట్ల మధ్యనా, పెద్దలు పంచిన, ప్రేమా గారాబాల మధ్యన కనువిందుగా, క్రమశిక్షణతో గడచిన బాల్యం. పట్టుమని పాతిక కిలోమీటర్లైనా లేని అమ్మమ్మ గారింటికైనా సరే అరుదుగానే వెళ్ళే ప్రయాణాలు. అదే ఊరిలో ఉన్న చిన్న బడిలో ఎప్పుడో చదువుకున్న చదువు. కేవలం పెళ్ళంటేనే కాదు, ప్రపంచమంటే కూడా ఏ మాత్రం అవగాహన లేని పదమూడేళ్ళ పసి ప్రాయంలో జరిగిన వివాహమూ, ఇవి చాలు, ఎప్పుడూ తమ ఊరు దాటి ఎరగని, ఏ పల్లెటూరి అమ్మాయైనా ఒక్కసారిగా హైదరాబాదు పట్నవాసపు నివాసం అనగానే కంగారు పడటానికి.
కానీ స్వభావసిధ్ధమైన అణకువా, నెమ్మదీ, ఎవరినీ నొప్పించని మాటతీరు, పనికి వెనుకాడని తత్వమూ ఈ అమ్మాయిని త్వరలోనే కొత్త జీవితానికి అలవాటు పడేలా చేయడమే కాక, అత్తింట్లో అందరికీ తలలో నాలికని కూడా చేశాయి. ఉమ్మడికుటుంబంలో అత్తా, మావల, బావ మరుదుల మరియు ఆడపచుల మన్ననలందుకునేలా చేశాయి. తోడికోడళ్ళంటే ఒకరికొకరుగా, ఒకరి వెనుక మరొకరుగా తోడుగా వచ్చిన అక్కచెల్లెళ్ళే. ఒక మాట అనుకున్నా, ఒకరిమీద ఒకరు అలిగినా మళ్ళీ అంతలోనే తిరిగి కలిసి పోయి నవ్వులూ, కబుర్లూ కలబోసుకునే ఆనందాలే నేటికీ. అత్తగారి వెంట ఉంటూ వంటా, ఇంటి పనులు నేర్చుకుంటూ, వీలున్నప్పుడల్లా తను చదువుకున్న చదువు మర్చిపోకుండా నవలలూ, పుస్తకాలు చదువుకుంటూ, ఊరిలోని తన స్నేహితురాళ్ళకి ఉత్తరాల్లో ఆ కధలు రాస్తూ ఉండడం ఆమెకొక అలవాటుగా మారింది. అక్కడ ఆ పుస్తకాలు దొరకని వారికదెంతో ఆనందంగా ఉండేది.
1

ఉమ్మడి కుటుంబం

“ఊరికే ఇంట్లో కూర్చుని సమయాన్ని వృధా చెయ్యడమెందుకర్రా? మన ఇంటి దగ్గరే ఉన్న పబ్లిక్ గార్డెన్స్ లో బట్టలు కుట్టడంలోనూ, ఊలు అల్లికలోనూ శిక్షణ ఇస్తున్నారు, వెళ్ళి నేర్చుకోకూడదూ?” అన్న అత్తగారి మాట పాటించి తోడికోడలితో పాటుగా ఆ తరగతులకి హాజరయి ఆ పనులు నేర్చుకునేలా చేశాయి. ‘ మనుషలన్నాకా కాస్త సరదాలు కూడా ఉండాలి, చక్కగా అందరూ కలిసి సినిమాకెళ్ళండర్రా, నేను పిల్లలనీ, వంటపనీ చూసుకుంటానూ” అని కోడళ్ళకి డబ్బులిచ్చి మరీ సినిమాలకి పంపేవారుట ఆవిడ అత్తగారు, అది ఈ నాటికీ తల్చుకుంటూ తానూ అలాగే ఉండాలని అనుకుంటారావిడ. “ఇప్పుడు ఇంటిపనులూ, ఉద్యోగాల్లోనూ పడి మీరు ఎంజాయ్ చేస్తున్నదేమీ లేదు, ఆరోజుల్లో మాతో పోల్చుకుంటే ” అంటారా తోడికోడళ్ళందరూ.

2

తోడికోడళ్ళూ, ఆడపడుచు

మొదటినించీ తలపెట్టిన పనిని శ్రద్దగా పూర్తి చేసే అలవాటు వల్ల సరదాగా నేర్చుకున్న కుట్టుపనీ, ఊలు అల్లికలూ, క్రోషియాలో ఎన్నో రకాల డిజయిన్లూ, కొత్తరకాలు అల్లడమే కాక, తనకీ, కూతురికీ కూడా బట్టలన్నీ స్వయంగా కుట్టుకునే అలవాటు అయింది. ఎవరైనా కొత్త స్వెటర్ అల్లుతున్నారంటే వారిదగ్గరకి వెళ్ళి అది “తనకొచ్చిన డిజయినా లేక కొత్తదా? ” అని పరిశీలించి అది కొత్తదయితే నేర్చుకునేదాకా ఉండలేరు ఆవిడ. తమ కుటుంబంలో ఎంతమందికి స్వెట్టర్లు అల్లి ఇచ్చారో లెక్కే లేదు, ఈనాటికీ తన భర్తకి తనే స్వయంగా స్వెట్టర్లు అల్లుతారు. వంటలంటే ఎంతో మక్కువ ఉండడమే కాక, కొత్త రకాలు ప్రయత్నించాలనే ఆసక్తి కేవలం సాంప్రదాయవంటకాలే కాక ఎన్నో కొత్త రుచులు అందించడం లో అందె వేసిన చెయ్యిగా మలచింది.
ఇవన్నీ ప్రతీ గృహిణీ సామాన్యంగా అంతో ఇంతో ప్రావీణ్యం సాధించేవే, ఇందులో ఇంతగా చెప్పేందుకేముంది? అనుకోవచ్చు అందరూ. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఆవిడ అల్లిన అల్లికలూ, వండిన వంటల గురించి కాదు, ఆవిడ కున్న పట్టుదలా, క్రమశిక్షణల వల్ల తను అనుకున్న ఏ పనినైనా ఎంతో పధ్ధతిగానూ, ఓపికగానూ శ్రద్ధగానూ పూర్తి చేసే లక్షణాన్ని గురించి. . ఆమె వయసులో ఎందరో కనీసం ప్రయత్నించడానికి కూడా పూనుకోని అలవాటుగురించి. అదే నేడు ఆవిడకి ఎంతో ముఖ్యమైన వ్యాపకాన్ని సమకూర్చింది
తనకి యాభై సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మంది లాగే రక్తపోటు పెరిగింది. పెరిగిన బీ.పీ ని చూస్తే మొదటగా కంగారు పడటం ఎవరికైనా సహజం. డాక్టరు రాసిన మందులు కొనుక్కుని ఇంటికి వస్తూ ” దీన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా పెరిగిపోతుందేమో?, ఒకసారి వస్తే తగ్గుతుందా? దీనివల్ల ఇంకెలాంటి ప్రమాదాలు వస్తాయో?” అన్న ఆలోచనలు ఆమెని చుట్టుముట్టాయి. ఆ కంగారులోనే పరిష్కారమార్గం కోసమై “ఏం చేస్తే దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు?” అని డాక్టర్ ని అడిగారు.
దానికి డాక్టర్ గారు, ” ఒకసారి అధిక రక్తపోటు వచ్చాక తగినంత జాగ్రత్తగా ఉంటూ, సరి అయిన మందులు వాడడం ఎంత ముఖ్యమో, మనసుని ఎలాంటి ఒత్తిడికీ, కలవరానికీ లోను కాకుండా ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం ” అని చెప్పారు. ” దానికి మార్గాలుగా ధ్యానం, ప్రాణాయామం, యోగాభ్యాసం వంటివి చేస్తే బావుంటుంది” అని సూచించారు.
“మనసుండాలే కానీ మార్గం తప్పకుండా ఉంటుంది, కనిపిస్తుంది”. డాక్టర్ మాటలననుసరించి సాగిన ఆమె అన్వేషణ తొందరలోనే ఫలించింది. తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక పార్క్ లోఉచితంగా యోగాసానాలు, సూర్యనమస్కారాలు నేర్పించడం గమనించారు. అదే అవకాశంగా భావించి రోజూ సాయంత్రం వేళ ఆ పార్కులోని యోగా తరగతుల్లో చేరి యోగాభ్యాసం నేర్చుకోవడం ప్రారంభించారు. మొదట్లో చాలా కష్టమనిపించినా ఆ సాధన అందించే సత్ఫలితాలను చాలా తొందరలోనే గ్రహించగలిగారు.కేవలం మానసిక ప్రశాంతత కోసమూ, శారీరక ఆరోగ్యం కోసమూ మొదలైన ఆ యోగాభ్యాసం అతి స్వల్ప సమయంలోనే ఆవిడ జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. ఆ క్లాసుల్లో చాలామంది తన వయసువారైన మహిళలుండడం ఆవిడకెంతో ధైర్యాన్నీ, ప్రోత్సాహాన్నీ ఇచ్చింది.
ఒక వయసు దాటిన తర్వాత శరీరాన్ని వంచడమూ, ఆసనాలు వేయడమూ అంత సులభం కాదు, అయినా ఆమె ఎప్పుడూ రాజీ పడలేదు. తనకు వీలున్నంతవరకూ వివిధ ఆసనాలని ఎంతో ఒడుపుగానూ, సరి అయిన పద్ధతిలోనూ వేస్తారు. తనకంత సులభం కాదనుకున్నవాటిని ఒకటికి రెండు సార్లు ఇంట్లో సాధన చేసి మరీ సాధిస్తారు. ” అవన్నీ చిన్నపిల్లకి వీలు కానీ, మన వయసులో అంతగా శరీరాన్ని కష్టపెట్టడం అవసరమా?” అని తన తోటివారు అన్నా కూడ ఆవిడ చిరునవ్వుతో ఆ ఆసనాల మీద పట్టు సాధించి “అవసరమే” అని చూపిస్తారు. అలా దాదాపు గత పధ్ధెనిమిదేళ్ళుగా ఆమె యోగాభ్యాసం క్రమం తప్పకుండా సాగుతూనే ఉంది.
మొదటగా పార్క్ లో మొదలైన యోగా తరగతులు తర్వాత కొన్నాళ్ళకి నిలిచిపోవడంతో రోజూ వచ్చే చాలా మంది చాలా నిరాశ పడ్డారు. తమకెన్నో రకాలుగా ఉపయోగపడుతున్న యొగా క్లాసులు ఇలా మధ్యలోనే ఆగిపోవడం వల్ల చాలా బాధ పడ్డారు. అంతకుముందు అక్కడ నేర్పే గురువులు రాకపోవడం వల్ల రోజూ అక్కడకు వచ్చేవారే ఒక గ్రూప్ గా ఏర్పడి తమలో తామే ఆ క్లాసులను నిర్వహించుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఒక ప్రముఖ యోగా సంస్థ వారి సహాయంతో హైదరాబాద్ లోని శివం రోడ్ కి సమీపంలో ఉన్న శ్రీ శిరిడీ సాయి బాబా మందిరం లోకి ఆ తరగతులు మారాయి. అప్పటినించీ మొదటగా పార్కులో మొదలుపెట్టిన వారందరూ కూడా సాయి బాబా ఆలయంలో జరిగే తరగతులకే హాజరవడం మొదలు పెట్టారు, అలా అక్కడ ఒక పెద్ద ‘యోగా కుటుంబానికి’ రూపకల్పన జరిగింది. ఆ కుటుంబంలో ఆవిడ ఒక ముఖ్య సభ్యురాలు. ఆమెకి బాగాముఖ్యులైన ఇద్దరు స్నేహితురాళ్ళు ఆ తరగతుల్లో అప్పటికే పేరు తెచ్చుకున్న గురువులు.
ఆమె దినచర్య ప్రతీ రోజూ ఒకే తీరుగా, క్రమపద్ధతిలో నడుస్తుంది. ప్రతీ రోజూ నాలుగున్నరకే నిద్రలేచి తమ ఇంటికి దగ్గరలోని సాయి బాబా గుడిలో నిర్వహించే యోగా తరగతులకి హాజరవడం, ఆ తర్వాత బాబాని దర్శించుకుని ఇంటికి రావడం, ఆ తర్వాత తన పనులు చూసుకోవటం. ” మీరు ఇంత బాగా అన్ని ఆసనాలూ వేస్తారు కదా, మీరు మాలాగే శిక్షణ ఇవ్వచ్చు కదా కదా?” అని తన స్నేహితులైన సీనియర్లూ, చాలా రోజులుగా శిక్షణ ఇస్తున్నవారూ ప్రొత్సహించగా మొదలైన అసక్తితో ఆవిడ శిక్షకురాలిగా మారారు. ఎప్పుడూ సభాముఖాన ఏదీ చెప్పడమూ, వేదికనెక్కే అలవాటు లేకపోవడం వల్ల మొదట్లో కంగారు పడినా, ఆ బాలారిష్టాలని మళ్ళీ తనదైన పట్టుదలతో అధిగమించి ఇప్పుడు అదే యోగా తరగతుల్లో శిక్షకురాలిగా రాణిస్తున్నారు.
” ఇన్నేళ్ళనించీ చేస్తున్నాను కదా, నాకు తెలిసినది అందరికీ చెప్పాలని అనిపించి శిక్షణ ఇవ్వాలని అనుకున్నాను కానీ మొదట్లో ఎంత భయం వేసిందో? అందరూ ధైర్యం చెప్పి నా వెనక ఉండబట్టి ఈ రోజు ఇలా చెప్పగలుగుతున్నాను” అంటారు. అలా మొదలైన ఆ శిక్షణ నిచ్చే ప్రక్రియ గత కొన్ని సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోంది.. తన సహ శిక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ, వారి సూచనలు పాటిస్తూ, వారితో ఎంతో స్నేహపూరితంగా మెలుగుతూ ఆవిడ అందించే ఈ శిక్షణ అందరినీ అలరిస్తూ, మన్ననలని పొందు తోంది.
ఎట్టిపరిస్థితుల్లోనూ యోగా క్లాస్ మానడానికి ఇష్టపడని ఆమెని క్రమశిక్షణకూ, పట్టుదలకీ మారుపేరుగా చెప్పుకుంటారు. ఎంతో ముఖ్యమైన పనో, లేక ఏ కారణంవల్లనైనా ఎక్కడికైనా వెళ్ళడమో జరిగితే తప్ప ఆవిడ యోగా క్లాస్ మానడం అనేది అరుదు. అలా ముందుగా చెప్పకుండా ఆవిడ ఏరోజైనా రాకపోతే ‘ఆవిడకి ఆరోగ్యం బాగాలేదని అర్ధం అని అంటారు ‘ఆమె సహశిక్షకులు. యోగాసనాల వల్ల జరిగే మంచిని స్వయంగా అనుభవించిన వారు కనక తన అక్క చెల్లెళ్ళనీ, ఇతర స్నేహితులనీ యోగాభ్యాసంలో చేరమని ప్రోత్సహిస్తారు. విన్నవారు విని లాభపడతారు, లేని వారు లేదు, కానీ ఆవిడ మాత్రం తన యోగాని ఏ రోజూ మానడానికి ఇష్టపడరు.

3

యోగా గురువుగా కానుకలందుకున్నవేళ

తన సహశిక్షకులకెప్పుడైనా ఏదైనా ఇబ్బంది వల్ల తాము క్లాస్ తీసుకోలేకపోతే తాను వెంటనే వారి వంతు కూడా ఆనందంగా స్వీకరిస్తారు. వాటిల్లో భాగంగానే, హైదరాబాద్ శివం సమీపంలో ఉన్న శ్రీ అరబిందో స్కూల్ లోని టీచర్లకి కూడా కొన్నాళ్ళు తన శిక్షణనందించి వారి మెప్పు పొందారు. ఇంటిదగ్గరైనా, క్లాస్ లోనైనా ఎప్పుడెవరు అడిగినా కాదనకుండా తనకొచ్చిన విద్యని చెప్తారు. ఉచితం గా శిక్షణనిచ్చే ఈ తరగతుల్లో వీరందరూ కూడ ఏ రకమైన ధనాపేక్షా లేకుండా కేవలం సర్వీస్ గా భావించి నేర్పిస్తారు. ప్రతీ వీధిలోనూ యోగా క్లాస్ పేరిట, వేలకి వేలు వసూలు చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి శిక్షణ ఇంటి పక్కనే లభించడం ఎంతో అరుదైన మంచి అవకాశం. కాస్త శ్రద్ధ పెట్టి ఉదయాన్నే నిద్ర లేచి రాగగిలితే ఇక్కడ నేర్చుకోవడం ఎంతో మంచి అవకాశం అంటారు అందరూ.

4
గురుపూర్ణిమనాటి సత్కారం

ఎంతో ఉదారంగా, ఉచితంగా ఈ శిక్షకులు నేర్పించే విద్యకి గురు దక్షిణగా అక్కడి విధ్యార్ధులు ఏడాదికొకసారి “గురుపూర్ణిమ” నాడు తమ యోగా గురువులందరినీ తగు రీతిలో సత్కరిస్తారు. ప్రతీ సంవత్సరమూ జరిగే ఆ సన్మానంలో పాల్గోవడమూ, వేదికనెక్కి ప్రేమతో శిష్యులందించిన కానుక స్వీకరించడమూ మరిచిపోలేని అనుభూతి అంటూనే, ఇవన్నీ తన భర్త ప్రోత్సాహం వల్లనే సాధ్యపడింది అని చెప్పే సిసలు భారత నారి ఆవిడ.

5
తన శ్రీవారు ప్రకాశరావుగారితో యోగా టీచర్ గారు

ఇంతా చెప్పి ఆవిడ పేరు చెప్పలేదని అనుకుంటున్నారా? ఆమె పేరు శ్రీమతి రాణి కల్యాణి. కోనసీమలోని కొత్తపేటకి సమీపంలోని ఏనుగుమహల్ అనే చిన్న ఊరిలో పుట్టారు ఆమె. ప్రస్తుతం హైదరాబాద్ లోని శివం రోడ్ కి సమీపం లో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో నివాసం. క్రమం తప్పని యోగాభ్యాసంతో పాటు, మంచి మితృలతో మహిళామండలి కార్యక్రమాలు, ప్రతీ ఏకాదశి నాడు స్నేహితులతో కలిసి భగవద్గీత పారాయణమూ ఆవిడకెంతో ఇష్టమైన వ్యాపకాలు. ఇన్ని వ్యవహారాల మధ్యనకూడా ఇల్లాలిగా తన బాధ్యతనెప్పుడూ విస్మరించరు, భర్తనీ, పిల్లలనీ, మనవలనీ, బంధువులనీ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఎవరింట్లో ఏ సహాయం కావాలన్నా ముందుంటారు. ఆమెని తెలిసిన వారందరూ కూడా ఆవిడకున్న పట్టుదలా, ఓపిక లలో మనకి సగం ఉన్నా చాలంటారు.
ఆవిడ సాధించిన విజయాలన్నింటికీ మేమందరమూ ఎంతో సంతోషిస్తూనే పిల్లలుగా మేము ఆమె వయసు రీత్యా, ఎక్కువగా కష్టపడవద్దనీ, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని మాత్రం చెప్తూ ఉంటాము. ” తిరిగి ఏమీ ఆశిచకుండానే అందరికీ సహాయపడాలి” అనే అరుదైన లక్షణాన్ని కలిగిన ఆమెకి నేను కోడలిని అవడం నాకెంతో సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మా అత్తగారైన శ్రీమతి కల్యాణి గారిని ” మాలిక” పాఠకులకి పరిచయం చెయ్యగలిగే అవకాశం రావడం మరింత సంతోషకరం.

సుభద్ర వేదుల

17 thoughts on “ధీర – 2 (కళ్యాణి)

  1. ఇవన్నీ ఆమె మాటల్లోనే విన్నాను పరిపూర్ణమైన స్త్రీతో కలిసి మాట్లాడానన్న తృప్తితోనే శుభద్రగారికి tag చేస్తూ పోస్ట్ పెట్టాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *