May 21, 2024

చిగురాకు రెపరెపలు – 2

రచన: మన్నెం శారద

 

ఈ ఉదంతం ఏ మీడియా సహాయం లేకుండా చుట్టాలందరికీ తెలిసి పోయింది. అందుకోసం తెల్లారగానే “అక్కా” అంటూ వచ్చి మా దొడ్డమ్మ దగ్గర కాఫీ తాగి ఊళ్ళో కబుర్లన్ని మోసుకొచ్చే మా ఎదురింటి అప్పారావు మావయ్య కష్టపడి సైకిల్ తొక్కి మరీ చెప్పొచ్చేడు. అతను ఎలాంటి చుట్టమో- లేదా ఇరుగింటివారో మాకిప్పటికీ తెలియదు. ఆయన ఫైరాఫీసులో పని చేసేవాడు. అప్పుడిలా చీటికి మాటికి అగ్నిప్రమాదాలు లేవుకదా! అందుకని కాళ్లు బార జాపుకుని ఫైరాఫీసు బయట కుర్చీలో కూర్చునే వాడు. చర్చిస్క్వేర్ పక్కనే ఆఫీసు. అందరం బయట కెళ్తే అటునుంచే వెళ్ళాలి. కళ్ళకి నిఘా కెమెరాలు తగిలించుకుని అందర్నీ ఎగాదిగా చూసేవాడు.

ఆ తర్వాత తన శక్తి కొద్దీ వాటికి మెరుగులు దిద్ది తిన్నగా మా దొడ్డమ్మ దగ్గిరకొచ్చి చాల సీరియస్ గా చప్పరించుకుంటూ ఊరిస్తూ చెప్పేవాడు. ఆవిడ అవన్నీ విని “ఏరా, అప్పారావ్ డబ్బులేవన్నా కావాలా!” అని అతను చెయ్యి చాపి వద్దు వద్దంటున్నా యిచ్చేది.

ఈ భాగోతమంతా నేను అలా నిలబడి చూసే దాన్ని..  చాలా చిన్నదానవడం వలన వాళ్ళు నా పరిశీలనాత్మక దృష్టిని తక్కువగా అంచనా వేసేవారు.

ఆ రోజు అలానే అదరా బాదరా వచ్చాడు. “పెద్దక్కా” అంటూ హడావుడిగా.

చిన్నక్క ……మా అమ్మగారు.

అప్పారావు మావయ్య వచ్చినట్లున్నాడు. కూర్చోమను? అని చెప్పింది మా దొడ్డమ్మ నాకు. నేనెక్కువ ఆవిడ కనుసన్నల్లో తిరుగుతుండేదాన్ని. దానిక్కారణం ఆవిడ నన్ను లబ్జు చేసి మా అమ్మమ్మా, మూడో మావయ్యా గురించి వివరాలడుగుండేది. వాళ్ళకి ఈవిడకి ఏదో తగాదాలు. నేను అన్నీ చెప్పేదాన్ని. అందుకు బదులుగా ఆవిడ నాకు బాగా స్వీట్లు పెట్టేది. నేను మంచినీళ్ళిచ్చి “కూర్చో మావయ్యా, దొడ్డమ్మ వస్తోంది” అని చెప్పేను అప్పారావుకి.

అప్పారావు నన్ను ఎగాదిగా చూశాడు.

“ఏవే ఇలా రావే నల్లదానా!” అని పిలిచేడు.

నాకు వళ్ళు మండిపోయింది కాని… ఎదిరించలేని వయసు. పొగ చూరి పోయినట్లున్న మొహం పెట్టుకుని నన్నలా పిలిస్తే నా కెంత బాధగా వుంటుందీ! అతను మాట్లాడుతుంటే చుంచు మూతిలా మూతి ముందుకు సాగుతుంటుంది.

అయిష్టంగా వెళ్ళి నిలబడ్డాను.

“ఏవే, నీ కిదేం బుద్దులే. బల్లికి పిండం పెడతావా? పైగా కాకులు ముట్టుకోపోతే ఏంటేంటో  ప్రామిస్ లు చేసేవేంటి? ఏం చేసేవ్?” అన్నాడు.

నేను అమాయకంగా మొహం పెట్టి  ఏం తెలియని దానిలా చూశాను.

అంతలో మా దొడ్డమ్మ కాఫీ, ఉప్మా తీసుకొచ్చింది. ముందు కాఫీ తాగి తర్వాత ఉప్మా తినటం మొదలెట్టేడు అప్పారావు మావయ్య.

“ఇది విన్నావా  పెద్దక్కా.. మొన్న సురేకాంతం వదినింటికెళ్ళానా, అక్కడంతా దీని సంగతే. సిగ్గేసిందనుకో” అన్నాడు ఉపోద్ఘాతంగా.

నేను కళ్ళు పెద్దవి చేసి జాలిగా మా పెద్దమ్మ వంక చూశాను.

“ఏదో లేరా చిన్నది!” అంది మా దొడ్డమ్మ నవ్వుతూ. “చిన్నదా, హవ్వ, బల్లి సంతానాన్నంత బాగా చూసుకుంటానని ప్రామిస్ చేసిందట ఏవే చూసుకున్నావా? అనడిగేడు వెటకారంగా.

“పోనివ్వరా, పోవే ఆడుకో” అంది మా దొడ్డమ్మ అడ్డుపడి.

ఏం కాలమో, ఏం పిల్లలో! ఎంతెంత అల్లరి చేస్తుందో ఇది! బొత్తిగా భయం లేకుండా పెరుగుతోంది!” అని అంటూనే వున్నాడు. నేను రివ్వున పరిగెత్తి లోపల  పెరట్లో మామిడి చెట్టు దగిర నిలబడి ఆలోచించాను.

నేనంత తప్పేం చేసానో నా కర్ధం కాలేదు. ఇంతలో మణక్క(మణిమాల వచ్చింది. మణక్క నాకన్నా ఎనిమిదేళ్లు పెద్దది.

అంటే అప్పుడు పదమూడేళ్ళుంటాయేమో!

నేను జరిగింది చెప్పేను.

“ఏడ్చాడులే.. అడుక్కోటానికొస్తాడు. మా అమ్మకి ఇలా విషయాలు సేకరించి చెబితే ఇష్టం. పో. ఆడుకో” అంది.

అయినా నాకు కోపంగానే వుంది.

అప్పారావు పడుకుని నిద్రపోతున్నప్పుడు పీక పిసికేస్తే…” అనిపించింది

అప్పారావు భార్య పేరు సత్యవతి.

“ఏవే శారదా, ఇలా రావే!” అంది.

“నేను రానత్తా. మావయ్య నన్ను ఏదేదో అంటున్నాడు” అన్నాను అలా దూరంగా నిలబడి.

“అది కాదే.. కొంచెం కారం అయిపోయింది. మీ అమ్మనడిగి తీసుకురా. నా తల్లివి కదూ!” అంటూ బలవంతంగా నా చేతిలో గిన్నె పెట్టింది.

నాకు చిన్నప్పటినుండి మొగమాటమెక్కువ. కాదనలేక గిన్నె తీసుకుని అమ్మనడిగేసాను.

అమ్మ నన్ను ఎగాదిగా చూసింది.

స్నానం చెయ్యలేదు. రెండు జడల్లో ఒక జడ వూడిపోయి వుంది. చెయ్యిపట్టుకుని దగ్గరకి లాగి “ఏవే.. స్నానం చేసేవా?” అంది.

నేను భయంగా తలడ్డంగా వూపేను.

“పొద్దున్నుండి నువ్వు తప్ప అందరూ స్నానాలు చేసి జడలేయించుకున్నారు. ఎక్కడ తిరుగుతున్నావే నువ్వు. ఆ వళ్లంతా ఆ మట్టేంటీ? అని ఒకటిచ్చింది.

“పోన్లెండి  వదినగారు! వాళ్ల దొడ్డమ్మ పెట్టి వుంటుందిలే. ఏంటా చేతిలో గిన్నె?” అంది మా అరుంధతత్త.

“సత్యవతి అత్తకి కారం కావాలంట”

మా అమ్మ అంతెత్తున లేచింది.

“నిన్ను పనిపిల్లనుకుందా? రోజుకు మూడు గౌన్లు మార్చి పెంచుతున్నాను. అయినా నీ బతుకింతేలే. ఇల్లొదిలి అలా రోడ్లు పట్టుకు తిరిగితే .. ఇంకెలా చూస్తారు నిన్ను?” అంది కోపంగా.

మా అత్త కారం తెచ్చి నాకిచ్చి “ఇచ్చేసిరా. స్నానం చేద్దువుగాని” అంది.

“ఇంకోసారి ఇలాంటి పనులు చెప్పిందా.. సత్యవతికి మర్యాద దక్కదని చెప్పు” అంది అమ్మ వార్నింగ్‌లా.

నేను గిన్నె తీసుకుని రివ్వున బయటకొచ్చేను. ఒక్కసారి నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది.

ఆ రోజు ఆదివారం.

అప్పారావు చప్పరించుకుంటూ  ఊరి కొంపలన్నీ తిరిగి భోజనానికొస్తాడు “చూస్తా” అనుకున్నాను. అనుకోవడమే తడవు రోడ్డు పక్కన కుప్ప పోసిన ఇసక కొంచెం తీసి కారంలో కలిపేసేను.

నన్ను చూడగానే “తెచ్చావా? ఏంటే ఇంత ఆలస్యం?” అంటూ గిన్నె అందుకుంది సత్యవతి.

“మా అమ్మ తిడుతుంది. మా ఇంట్లో  బోల్డుమంది జవానులుంటే.. నువ్వు నా చేత పని చేయిస్తున్నావని. ఈసారి ఊరుకోనని చెప్పమంది” అని పరిగెత్తుకొచ్చేసా.

కాని మనసంతా వాళ్ల చుట్టే తిరుగుతుంది. సత్యవతి అత్త ఆ కారం వేసి కూర చేసిందా. చేస్తే అప్పారావు అన్నం తిన్నాడా? వాడి పని బాగయిందా.. ఇంకా ఏవిటీ  అరుపులు వినిపించడం లేదని తచ్చాడుతున్నాను.

మా మణక్క నన్నే గమనిస్తోంది.

“ఏంటే! ఏం  ఘనకార్యమన్నా చేసేవా? అంది నన్ను దగ్గరకు పిలిచి.

నాకు వెంటనే పళ్ళికిలించి నవ్వడం ఒక దురలవాటు. నవ్వు ఆగేది కాదు.మాట దాగేదీ కాదు.

మా మణక్కకి చెప్పేశా.

మణక్క పెద్దగా నవ్వేసింది.

“దొంగమొహమా. నవ్వకు. అందరూ పసిగట్టేస్తారు. వెళ్ళి నిద్ర రాకపోయినా ముసుగు తన్ని పడుకో.” అంది.

నేను గబగబా అన్నం తినేసి మా అమ్మమ్మ మంచమ్మీద దూరిపోయి పక్కన పడుకున్నాను.

“ఏవే.. ఇలా వచ్చావు! ఈ రోజేం ఘనకార్యాలు లేవా చేయడానికి?” అంది అమ్మమ్మ.

“తలనొప్పి” అన్నాను మొహం తలగడలో పెట్టి నవ్వు దాచుకుంటూ.

“ఎండలో గానీ తిరిగేవా? జ్వరం గానొచ్చిందా?” అని అమ్మమ్మ నా వంటిమీద చెయ్యేసి చూసింది.

“జ్వరం లేదే! పోన్లే వేడిగాని చేసిందేమో! పడుకో” అని మీద చెయ్యేసింది.

ఏవో గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి.

ఒకటి మా అమ్మ గొంతు. రెండోది సత్యవతి అత్తది. మధ్యలో మా మణక్క. అప్పుడప్పుడూ అరుంధతత్త.

నేను కుతూహలంగా చెవులు రిక్కించి వింటున్నాను.

“దాక దాక విసిరేసేడమ్మా మీ మావయ్య. అంతా ఒకటే ఇసక.” అని సాగదీస్తోంది సత్యవతత్త.

“అయ్యో రామచంద్ర! మొన్ననే పట్టించేను కారం. ఇంకా నయం” అని సాగదీస్తోంది అరుంధతత్త.

“ఏది, దాన్ని పిలవండి” సత్యవతత్త అరుస్తోంది.

“ఇదిగో సత్యవతీ! చిన్నతనం నుండీ ఒకచోట వున్నామని గౌరవిస్తున్నాను. నా కూతురికి ఇలాంటి పనులు చెబితే వూరుకోను. మర్యాదగా వెళ్ళు” అమ్మ మాట.

“పాపం దానికేం తెలుసు. అదెవరు పని చెప్పినా చేస్తుంది. నువ్వే ఎలా చేసావో అత్తా” మణక్క అంటోంది.

“ఏంటే గొడవ?” అంది అమ్మమ్మ నావంక చూసి.

“ఏమో! నాకేం తెలుసు” అన్నాను అమాయకంగా.

సత్యవతి సణుక్కుంటూ వెళ్లిపోవడం తెలుస్తోంది.

ఆ వెంటనే కర్ర తీసుకుని మా అమ్మా, వెనక మణక్క, అరుంధతత్త మేమున్న గదిలోకొచ్చేరు.

“ఏం చేసేవే నువ్వు, కారంలో ఇసకగానీ కలిపేవా?”

“ఊరుకోండి, దానికేం తెలుసు? ఆ సత్యవతి చీటికి మాటికి ఇలానే వస్తుంది తగాదాలకి. అసలెలా వండి చచ్చిందో!” అంది మా అరుంధతత్త అమ్మ చేతిలో కర్ర లాక్కుంటూ.

మా మణక్క నన్ను లేవొద్దని కళ్లు మూసుకుని పడుకోమని సైగ చేసింది.

నేను గట్టిగా కళ్లు మూసుకున్నాను.

మా అమ్మమ్మ లేచి కూర్చుని “ఏంటి గొడవ?” అంది.

మా మణక్క అంతా చెప్పి “అందరూ దాన్నే పిలిచి పన్లు చేయించుకుంటారు. మళ్లీ దాన్నే అంటారు పాపం. ఈ చిన్నమ్మకి దాన్ని కొట్టకపోతే నిద్రపట్టదు” అంది కోపంగా.

“అదికాదే మణిమాలా! ఇదెందుకెళ్లి చేయాలసలు. నాకు అనుమానమే! ఏ చెట్టుమీదో వుండేది ఈ టైములో పడుకుందంటే!!” అంది అమ్మమ్మ.

దానిక్కాస్త జ్వరమొచ్చినట్లుంది ఊరుకో.. ఈసారి ఏవన్నా అడిగితే ఇవ్వకండా సత్యవతికి” అంది అమ్మమ్మ.

మా అమ్మ కోపంగా వెళ్లిపోయింది గదిలోంచి.

మా అత్త కూడా వెళ్ళేక మా మణక్క చెప్పింది”కూరంతా ఇసకేనంటే. అప్పారావుగాడు సత్యవతిని కొట్టినంత పని చేశేడంట.  సైకిలేసుకుని బయటకి పోయాడంట.”అని  చెప్పి కిసుక్కున నవ్వింది.

మా యిద్దరి నవ్వులు చూసి మా అమ్మమ్మకి అనుమానం వచ్చింది.

“ఏవే, నిజంగానే కలిపేవా?” అంది.

“మరి పొద్దున్న నన్ను నల్లదానా అన్నాడు  వీడేదో మెరిసిపోతున్నట్లు. బల్లికి దినం చేస్తే వీడికెందుకంట. పరువు పోయిందంట..!!” అన్నాను.

“ఓసి నీ అసాధ్యం కూల! అలాంటి పనులు చెయ్యకూడదని చెబితే వినవు కదా! సరే పడుకో. ఏ మాత్రం తెల్సినా మీ అమ్మ చావబాదుతుంది” అంది అమ్మమ్మ.

మణక్క వెళ్లిపోయింది నవ్వుకుంటూ.

“అవునూ. నీకు దెబ్బలంటే లెక్కలేదటే! అలా తన్నులు తింటావు!” అనడిగింది అమ్మమ్మ.

నేను అమ్మమ్మ వైపు చూశాను.

“అమ్మమ్మా!”

“ఊ”

“నేను బాగోనా?”

నా ప్రశ్నకి అదోలా చూసింది.

“బాగోవాలంటే తెల్లగా వుండాలా?”

“నీ మొహం. మీ ఇంట్లో నువ్వే బాగుంటావ్. నీ కళ్లు చూడు. ఎంత బాగుంటాయో!” అంది అమ్మమ్మ.

మరెందుకు నన్నందరూ ‘నల్లదానా’ అని పిలుస్తారు. వీళ్లింట్లో హేమలత, ఇందిర, లలిత అందరూ బాగుంటారు.. ఇదే.. అని సాగదీస్తారెందుకు?” అనడిగేసేను. ఎంత చిన్న వయసయినా, అల్లరి చేసినా నా మనసులో వీళ్ళనే మాట బాగా పాతుకుపోయింది.

“వాళ్ల బొంద. తెల్లతోలుంటే అందం అనుకుంటారు. అయినా నువ్వు కూడా అంతేనే.. ఎప్పుడు ఆ దొడ్లలో పడి తిరుగుతూ, మట్టిలో ఆడుతూ తిరుగుతుంటావు. వాళ్లు షోకులు చేసుకుని కూర్చుంటారు. నువ్వు కూడా అల్లర్లు మాను” అంది.

“అవునూ.. మొన్న రాజరత్నం వస్తే ఏదో అన్నావంట. పెద్దాళ్లని అలా అనొచ్చా?” అనడిగింది అమ్మమ్మ.

“ఏవన్నాను?”

“తెలియనట్లు!” అని నెత్తి మీద మొట్టికాయ వేసింది.

రాజారత్నం మా అరుంధతత్త అక్కగారు. ఏనాం నుండి చూడ్డానికొచ్చింది.

ఎవరొచ్చినా నాకేం పట్టదు.

నేను కనకాంబరం  మొక్కల దగ్గర కూర్చుని మట్టితో బొమ్మలు చెయ్యడానికి  ప్రయత్నిస్తున్నాను. నా గౌను నిండా, మొహం నిండా మట్టి అంటుకుని వుంది.

ఆవిడ వెళ్ళేది వెళ్లక నా వంక చూసి “ఇది శారద కదూ?” అంది మా దొడ్డమ్మతో. పక్కనే మా అమ్మ వుంది.

అవిడకి రెండువరసల పళ్లు ఎత్తు. బయటకి పొడుచుకొచ్చినట్లుంటాయి.

“దీనికి పెళ్లవడం కష్టమే!” అంది భళ్ళున నవ్వుతూ.

నాకు చెప్పలేనంత కోపం వచ్చేసింది. ఎందుకో మరి.

“అసలు ఎప్పుడూ ఈ పెళ్లి గోల, అందం గోల ఏవిటీ?”

వెంటనే సర్రున ఆవిడవైపు చూసి “మీకవ్వగా లేంది నా కవ్వదా?” అన్నాను కోపంగా.

ఆవిడ నిర్ఘాంతపోయింది.

పళ్లు మరీ బయటకి పొడుచుకుకొచ్చేసేయి.

“శారదా”అంటూ  మా అమ్మ శంకరాభరణంలో శంకరశాస్త్రిలా హుంకరించి అరిచింది.

నేను భయపడలేదు.

“కొడ్తుంది అంతేకదా! నేనేం చేయకపోయినా ఏదో వంకతో కొడుతుంది. అనుకున్నాను.

లేచి నిలబడ్డాను మట్టి చేతులతో.

“చిన్నపిల్ల.. ఏవీ అనుకోకు” అని సర్దిచెప్పింది మా దొడ్డమ్మ.

ఆవిడ వెళ్ళిపోయింది. కొంచెం పిల్లకి మంచీ చెడ్డా నేర్పాలి!” అని సణుక్కుంటూ.

ఆ తర్వాత ఏ కళనుందో మా దొడ్డమ్మ మా అమ్మని హెచ్చరించింది.

“దాని కొట్టావా వూరుకోను. ఆవిడలా అనొచ్చా మరి! అందరూ అలా అంటుంటే అది మాత్రం ఎలా సహిస్తుంది?” అంది.

మా అమ్మ అసహనంగా చూసి “నా పెంపకం బాగోలేదని వెళ్లింది”అని ఘీంకరించి వెళ్లింది.

ఆ సంగతి చెప్పేను అమ్మమ్మకి

అమ్మమ్మ కూడా నవ్వింది.

“కాని ఎంతమాటంటే అంత మాటంటావా మరి పెద్దాళ్లని?” అంది.

“మరి ఆవిడ పిల్లల్ని అలా అనొచ్చా?” అనడిగేను.

“నిజవే! కొందరికి వయసొస్తుంది కాని ఎలా మాట్లాడాలో జ్ఞానమేడ్వదు” అని అమ్మమ్మ.

ఆ తర్వాత అప్పారావు మావయ్య కూరలో కారం గురించి పిల్లల మధ్య పెద్ద టాపిక్కయి పోయింది.

అందరూ గుసగుసలాడి పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వుకున్నారు. వాళ్లకి నేను హీరోయినయిపోయేను.

“భలే చేసేవే. రాత్రంతా ఇద్దరూ తన్నుకు చచ్చారనుకో” అని చెప్పింది అమ్మాజి. ధమంజి వచ్చి “ఏవే శారదా! మేం చెయ్యలేని పని నువ్వు చేసేవా?” అన్నాడు పరమశివం.

అలా అందరూ నన్ను పైకెత్తేసేరు.

రాత్రి పదవుతుండగా పడుకున్న నన్ను మా అన్నయ్య సైగ చేసి లేచి రమ్మని పిలిచేడు.

నేను మెల్లిగా లేచి వెళ్లి పిల్లిలా నడుచుకుంటూ బయటికొచ్చేను.

“ఏంట్రా?”

“ష్.. మెల్లిగా” అన్నాడు.

“ఏంట్రా?” అన్నాను మళ్లీ గుసగుసగా.

“అప్పారావుగాడి కూరలో ఇసక పోసేవంట నిజవేనా?”

“ఊ” అన్నాను భయంగా వాడి కళ్లలోకి చూస్తూ.

వాడు వెంటనే నాకు షేక్‌హాండిచ్చి “నేను సినిమాకెళ్లడం చూసి మా అమ్మకి చెప్పి తన్నించేడు. బాగా చేసేవ్!” అన్నాడు.

“అది చెప్పడానికా నిద్ర లేపావ్! మా అమ్మ చూసిందంటే…” అన్నాను భయంగా.

చిన్నమ్మ నిద్రపోయిందిలే! ఇలారా” అన్నాడు. తన కూడా వెళ్లేను.

వాడు నా చేతికి బ్లేడు యిచ్చేడు.

“ఎందుకు?” అన్నాను భయంగా.

“నేనీ మూల దాకుంటాను. వెళ్లి వాడి సైకిలు సీటు కోసేయ్..” అన్నాడు.

“వద్దురా, ఈ రోజే కూర గోలయింది. తెల్సిపోతుంది.” అన్నాను.

“ఫర్వాలేదు. ఏం కాదు.” అన్నాడు.

“నువ్వే చెయ్యొచ్చు కదా!” అన్నాను.

“ఆల్రెడీ నేను చక్రాల్లో గాలి తీసేసేసేను. అత్త నన్ను చూసింది. అందుకే నీకు  చెబుతున్నా” అన్నాడు.

నేను భయంగానే వెళ్లి అటూయిటూ చూస్తూ సీటు పరపరా కోసేసి రివ్వున పరిగెత్తుకొచ్చి “భయమేస్తుందిరా” అన్నాను.

” ఏం ఫర్వాలేదు. వెళ్లి పడుకో” అన్నాడు.

నేను వెళ్లి ముసుగు తన్ని పడుకున్నాను.

చాలా భయమేసింది. నిద్ర పట్టలేదు.

తెల్లవారేక ఎంత గొడవవుతుందో. అసలే అప్పారావు మావయ్య కాక మీద వున్నాడు. ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయేను.

ఎవరో తడుతూ లేపుతున్నారు.

“లేవవే శారదా! వెధవ మొద్దు నిద్రా నువ్వునూ!”

నేను మెల్లిగా కళ్లు తెరిచేను.

 

సశేషం..

8 thoughts on “చిగురాకు రెపరెపలు – 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *