May 21, 2024

మాయానగరం : 13

రచన: భువనచంద్ర

 

మనుషులు ఎందుకు తగుతారు? జీవితంలో ఓటమి భరించలేకా? అది ఎటువంటి ఓటమైనా కావచ్చు.. తాగినంత మాత్రాన ఓటమి గెలుపుగా మారుతుందా? ఆలోచిస్తోంది మిసెస్ మాధవి రావు. తాగుడు వల్లే గుడిసెలో, సిటీలో జనాలు శలభాల్లా రాలిపోయారని తెలుసు. కానీ దాన్ని ‘కలరా ‘ కి ముడిపెట్టారు. అన్నీ వున్న సుందరీబాయ్ ఇక్కడకి వచ్చి మరీ ఇంత చిత్తుగా ఎందుకు తాగింది? ప్లాష్ బాక్ అంతా మళ్ళీ రివైండ్ అయ్యింది.

 

**********

 

“మాధ్వీ! ఇవ్వాళ నేను కాసేపు నీలా గడపాలి…! ” కొంచం ముద్దగా అంది సుందరి, మిట్టమద్యాహ్నం ఇంటికొచ్చి కావలించుకొంటూ.

“ఏమయ్యింది సుందు! ” ఆదరంతో అడిగింది మాధవి.

“తాగాను. కొంచమే అనుకో. అయితే పిచ్చిగా తాగాలని వుంది. తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోవాలని వుంది. అందుకే ఫుల్ బాటిల్ తెచ్చాను. సోడా కూడా ఉందిలే. నువ్వు మాత్రం ఆ బాస్టర్డ్ లాగా… ” బొటబొట కన్నీళ్ళు కార్చింది సుందరీ బాయ్.

“ఓకే…ఓకే… అసలేమయింది సుందూ…! ” కాస్త జాలిగా, ఎంతో అనూయంగా అడిగింది మాధవి.

“నేను ఆడదాన్నా.. కాదా? ” కళ్ళెత్తింది సుందరి.

“ఛా… డౌటెందుకు? ” నవ్వొచ్చినా ఆపుకుని అన్నది మాధవి.

“బాగా చూడు.. చూసి చెప్పు ” చున్నీని తీసేసి ఉండగా చుట్టి మూలకి విసిరేసి అన్నది సుందరి.

“ఏవిటి సుందరి! నువ్వు ఆడదానివి కాదని ఎవరన్నారు? ” లేచి చున్నీని తీసుకొచ్చి సుందరి చేతికిస్తూ అన్నది మాధవి.

” ఓ గ్లాసు కావాలి !” విననట్టుగా అంటూ చున్నీని పక్కకు పారేసింది సుందరి. గుజరాతీల అవయవాలన్నీ పుష్టిగా, నిండుగా తీర్చిదిద్దినట్టున్నాయి. మాధవి ఆడది గనక సరిపోయింది. అక్కడ గనక మొగవాడు ఎవరేనా వుంటే ఏం జరిగేదో చెప్పడం చాలా తేలిక.

ఇష్టం లేకపోయినా గ్లాస్ తెచ్చి ఇచ్చింది మాధవి. ఆత్రంగా విస్కీ బాటిల్ మూత తీసి రెండు పెగ్గుల విస్కీ పోసి మిగతా గ్లాసుని పెట్ సోడాతో నింపి గటా గటా తాగేసింది సుందరి.

సుందరికి మందు కొట్టడం కొత్తేమి కాదు. కాలేజీలో చదివేటప్పుడే స్నేహితురాళ్ళతో కలిసి ఎవరికంటా పడకుండా దొంగతనంగా అప్పుడప్పుడు మందుకొట్టేది. అప్పుడైతే కేవలం బీరో , వైనో, ఇంకాస్త ‘ మజా ‘ కావాలనుకొంటే లిమ్కాతో మిక్స్ చేసిన జిన్నో పుచ్చుకునేవాళ్లు.

ఎప్పుడో కానీ ‘ విస్కీ ‘ జోలికి పోయేది కాదు. అయితే సుందరి మందుకి బానిస కాదు. అకేషనల్ డ్రింకర్ మాత్రమే. జరీవాలా పుట్టినరోజున పడగ్గదిని “శోభనం” గదిగా అలంకరించి పాలగ్లాస్ కి బదులు విస్కీ సోడా + తినుబండారాలు పెట్టేది.

చిత్రం ఏమంటే మిగతా రోజుల్లో చాలా మర్యాదగా సున్నితంగా కందిపోతుందేమో అన్నంత జాగ్రత్తగా హాండిల్ చేసే జరీవాలా ఆ రోజు మాత్రం పిచ్చి కసిగా, పరమ శత్రువుగా ప్రవర్తించేవాడు. ఒక కక్షతో రమిస్తున్నట్టుగా రమించేవాడు. ఆ మరుసటి రోజున సుందరి ఒంటి నిండా గత రాత్రి ఆనవాళ్ళే. అతను అలా ప్రవర్తిస్తే ఆమెకి చాలా సంతోషం కలిగేది. ఒక మృగం ఇంకో మృగాన్ని రెచ్చగొట్టినట్టుగా సుందరి కూడా జరీవాలాని రెచ్చగొట్టేది.

“టెల్ మీ మాధ్వీ! … నాలో ఏ బిగువు తగ్గిందనీ? చూడు. వీటిని చూడు కవ్వించేలా లేవూ? ఇదిగో యీ భాగాలన్నీ చూడు. ఏ ఋష్యశృంగుడికైనా పిచ్చెక్కదు వీటి పొందిక చూసి! ” గ్లాస్ లో మిగిలిన సగాన్ని ఒక్క గుటకలో తాగేసి అన్నది సుందరి.

“యూ నో మాధ్వీ! ఆడది పడక సుఖాన్ని ఇచ్చేటప్పుడు రంభలా ఉండాలంటారు కదూ… నేను మాత్రం పచ్చి లం_ లాగా సుఖాన్ని ఇచ్చేదాన్ని. అలాగే సుఖాన్ని కూడా అలాగే పిండుకునేదాన్ని. గాన్.. ఎవ్రీ థింగ్ యీజ్ గాన్ విత్ ద విండ్.  ఏం జరిగిందంటావా? చెప్పను. జరిగిన అవమానాన్ని చెప్పుకోవడం అంటే మళ్ళీ మళ్ళీ ఉరేసుకు చావడమే. ఒద్దు.. నేను చెప్పను గాక చెప్పను. బట్.. నేను యీ అవమానంతో మాత్రం బతకలేను. బతకాలంటే ఒకటే ఉపాయం. అతను నాకు కావాలి… నిజంగా.. అతను నాకు కావాలి. ఇప్పుడు గనక అతను ఇక్కడికి వస్తే … ఓయ్.. మాధ్వీ.. నిజంగా అతను ఇక్కడకి వస్తే పచ్చి నగ్నంగా నిలబడి నన్ను నేను అర్పించుకుంటాను… అ.. త.. ను… నాకు… ” మత్తులో బెడ్ మీద వాలిపోయింది సుందరి.

 

********

 

 

 

సుందరి హర్ట్ అయ్యింది. ఎక్కడ, ఎందుకు హర్ట్ అయ్యిందో మాధవికి తెలియదు. కానీ మాధవి ఆలోచిస్తోంది. “అతడు నాకు కావాలి ” అని కలవరిస్తోంది సుందరి. ఆ “అతడు” ఎవరు? అతను ఇక్కడికెలా వస్తాడు? ” “ఇక్కడకి కొస్తే ” అని మామూలుగా అందా? కావాలనే అన్నదా? అయినా ఇక్కడి కొచ్చే మగాళ్ళు ఎవరు, ఒక్క ఆనందరావు తప్ప.

షాక్ తిన్నట్టయింది మాధవికి. అంటే సుందరి కన్ను ఆనందరావు మీద పడిందా? అతనో తెల్లని కాగితంలాంటి వాడు. సుందరి కత్తిలాంటిది. కావల్సినదాని కోసం ఎంతకైనా ‘తెగిస్తుంది ‘.  అంతే కాదు సుందరి దృష్టిలో మగాళ్ళు ఆటవస్తువుల్లాంటి వారు. సుందరికేమో మగాళ్ళని కవ్వించి తన చుట్టూ తిప్పుకుంటూ ఏడిపించడం అలవాటు. దొరికి దొరకకుండా ఏడ్పించే టాలెంటు సుందరికి మెండుగా వుంది.

సుందరినీ, ఆనందరావుని కలిపి ఒక్క క్షణం కూడా వూహించలేకపోయింది మాధవి. బెడ్ మీద సుందరి సన్నగా గుర్రుపెడుతోంది. విస్కీ బాటిల్ లో మందు సగం  మాత్రమే వుంది.

తలుపు చప్పుడైతే ఉలిక్కిపడింది మాధవీరావు. ఎలాగ తలుపు తీయడం. సుందరి బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గభాల్న ఓ దుప్పటి ఆమెకి కప్పి, విస్కీ బాటిల్ ని సోడా బాటిల్ ని వంటింట్లో డబ్బాలు పెట్టుకొనే కప్ బోర్డ్  లో పెట్టి, తలుపు తీసింది మాధవి.

“సారీ..డిస్టర్బ్ చేశానా? ” నవ్వుతూ కొంచం ఇబ్బందిని కూడా జోడించి అన్నాడు ఆనంద రావు.

“ఓహ్.. అదీ.. అంటే… అదీ… సారీ… రండి ” పొంతన లేని పదాలతో ఇబ్బందిగా ఆహ్వానించింది మాధవి.

“మీరేదో కంగారుగా ఉన్నట్టున్నారు. పోనీ తరవాత రానా? ”  గుమ్మానికి అవతలే నిలబడి అన్నాడు ఆనందరావు.

“నో..నో.. మీకేం…మీరు రావచ్చు…” గుమ్మంలోనుంచి తొలగి దారియిస్తూ  అన్నది మాధవి.

లోపలికి రాగానే బెడ్ మీద ఉన్న సుందరిని చూశాడు ఆనంద రావు “సుందరిగారు ఇక్కడా? ఒంట్లో బాగాలేదా? “అడిగాడు ఆనందరావు.

“నిజం చెపితే… ” ఆగింది మాధవి. ఠక్కున నేల మీద కూర్చుంటూ. తనూ నేల మీదే కూర్చున్నాడు ఆనందరావు.

“ఊ..నిజమే చెప్పండి. మీరు పది జన్మలెత్తినా అబద్ధం ఆడలేరని నాకు తెలుసు. ” అన్నాడు ఆనంద రావు.

“ఎందుకో తెలియదు కానీ తను బాగా డ్రింక్ చేసింది. మనిషి చాలా మంచిది ఆనంద రావు గారు… చాలా సెన్సిటివ్…”

“ఎందుకు తాగిందో తెలుసా? ” అడిగాడు అనందరావు.

“అదే విచిత్రంగా ఉంది. తను చెప్పిన మాటల ప్రకారం ఒకరి మీద తీవ్రమైన ద్వేషమూ కక్షా వున్నాయి. మరొకరి మీద భీకరమైన కాంక్ష వుంది… ఇంతకీ వాళ్ళిద్దరూ ఎవరో నాకు కనీసం ‘సూచన’  గానైనా అందలేదు. ” సిన్సియర్ గా అంది మాధవి.

పకపకా నవ్వాడు ఆనందరావు.

“ఎందుకు నవ్వుతున్నారు? ”  అయ్యోమయంగా అడిగింది మాధవి.

“చూశారా…. బియ్యానికి పిడకకీ ఒకే మంత్రం అన్నట్టు, అటు ద్వేషానికి ఇటు కాంక్షకీ కూడా ఒకే మందు అన్న మాట. టూ బాడ్స్ అట్ వన్ షాట్ అంటారు చూశారా? అలాగన్న మాట. ఒకే దెబ్బకి రెండు తీరతై ! ” నవ్వాడు ఆనంద రావు.

నిద్రలోనే సుందరి వెల్లకిలా తిరిగి పడుకోవడంలో దుప్పటి ఇరుక్కుని ఆమె ఒళ్ళు క్లియర్ గా ఎక్స్ పోజ్  అయింది.

సిగ్గుతో గభాల్న లేచి మరో దుప్పటి తెచ్చి సుందరికి కప్పింది మాధవి. చూడాలను కాకపోయినా అప్రయత్నంగా సుందరి ఒంపుసొంపుల్ని ఓ క్షణం పాటు చూశాడు ఆనంద రావు. కళ్ళు గిర్రున తిరిగాయి. ఆనందరావుకి అదే మొదటిసారి.. ఒక ఆడదాన్ని అంత దగ్గరగా అర్ధనగ్నంగా చూడటం. ఠక్కున కళ్ళు మూసేసుకున్నాడు.

“సారీ..తను సృహలో లేదు ! ” సుందరి తరఫున సంజాయిషీ చెపుతున్నట్టు బిడియంగా అన్నది మాధవీ రావు.

“సారీ నేను చెప్పాలి. మరోసారి ఎప్పుడైనా వస్తాను. ” నిద్రలో నుంచి మేల్కొన్నవాడిలా నేల మీద నుంచి లేచి అన్నాడు ఆనంద రావు.

“వీళ్ళ కారు రోడ్ మీద ఉండి ఉంటుంది. బహుశా డ్రైవర్ కూడా కార్ లోనే ఉంటాడు. అతన్ని పిలిచి వాళ్ళ ఇంటికి కబురు పెడితే బాగుంటుందా? నాకేమీ తెలియటం లేదు. ” నిస్సహాయమైన స్వరంతో అర్ధించింది మాధవి.

“వొద్దు మాధవీ గారూ! ఆ పని చెయ్యకండి. డ్రైవర్ కూడా మగవాడేగా..! ఈ స్థితిలో ఆమెను కదపడం మంచిది కాదు. ఇంటికి కబురంపడం అంత కన్న మంచిది కాదు. ఎందుకంటే, ఒక వేళ ఇంట్లోనే దెబ్బలాడి వచ్చిందనుకోండి.. అప్పుడు పరీస్థితి మరింత విషమిస్తుంది. సాయంత్రం దాకా అలాగే పడుకోనివ్వండి, ఏడుగంటలకి మళ్ళీ నేను ఇక్కడకి  వస్తాను. అప్పటి దాక ఆవిడ నిద్రలేవకపోతే అప్పుడు ఆలోచిద్దాము, ఏం చెయ్యాలో..సరేనా? ” అనూనయంగా మాధవితో చెప్పి బయటకి నడిచి తన వెనుకనే తలుపుని దగ్గరకు లాగాడు ఆనందరావు.

ఆనందరావు కి పిచ్చెక్కినట్టుంది. స్త్రీత్వం అంటే ఇదా! మై గాడ్..! ఒక్కసారి మాధవిని అలా అర్ధనగ్నంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకొనే ప్రయత్నం చేశాడు ఆనందరావు.  కానీ మనసు మాత్రం సుందరినే మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ, ఆ ‘క్షణ ‘ పు సౌందర్యాన్ని మరీ మరీ రివైండ్ చేసుకుంటోంది.

నడుస్తున్నవాడు కాస్త టకాల్ని ఆగాడు. “ఏమిటీ విచిత్రం క్షణం మాత్రం చూసిన సుందరి అర్ధనగ్న  శరీరం క్షణక్షణానికి గుర్తుకొచ్చి ఓ రకమైన ‘వెర్రి ‘  లో మనసుని పడేస్తుంటే, ఎంత ప్రయత్నించినా అలాగే మాధవిని వూహించుకోడానికి మనసు ఎందుకు తిరస్కరిస్తోంది? ఇద్దరూ ఆడవాళ్ళేగా, ఏమిటీ తేడా? ” అని మనసునే తర్కించుకోవడం మొదలెట్టాడు ఆనందరావు.

పిచ్చివాడిలా రోడల్నీ తిరుగుతూ తిరుగుతూ, పరిపుష్టంగా, బలంగా, బింకంగా కవ్వించే సుందరి సోయగాలని మరీమరీ అయిష్టంగానే, అసంకల్పితంగానే మనసులో మళ్ళీ మళ్ళీ చూస్తూ ఓ రెండు గంటలు గడిచాక అతనికి అర్ధమైంది. కాళ్ళు విపరీతంగా నెప్పులు పుడుతున్నాయని.

చుట్టూ చూస్తే నవ్వొచ్చింది. గానుగెద్దు గుండ్రంగా తిరిగినట్టు ఊరంతా తిరిగి తన యింటి ముందే నిలబడి వున్నట్టు. జేబులోనుంచి తాళం చెవి బయటకు తీసి గది తలుపులు తెరిచాడు.

ఎప్పుడూ లేనిది అద్దంలో పరీక్షగా తన మొహాన్ని చూసుకున్నాడు. మొహం అంతా ఉబ్బినట్టు, కళ్ళుబాగా ఎర్రబడ్డట్టు గమనించాడు. మొహం అంతా సెగలు….

‘స్త్రీ స్వరూపం ఇదా? ‘ అని మళ్ళీ మళ్ళీ అనుకున్నాడు. మాధవి కూడా ఇలానే ఉంటుందా? అయితే మాధవి బొద్దుగా ఉండదు. సన్నజాజిలా నాజూకుగా ఉంటుంది. తటాల్న ఓ ఆలోచన మెరుపులా మనసులో మెరిసింది.

సుందరి శరీరం క్షణక్షణం గుర్తుకొస్తోంది. మాధవిని అలా ఊహించుకుందామన్నా మనసు నిరాకరిస్తోంది. కారణం ప్రేమకి కామానికి ఉన్న తేడా. సుందరి శరీరం మనసుని వేడేక్కించగలదు. మాధవిని చూస్తున్నది మనసుతో.. కళ్ళతో కాదు. ప్రేమ పవిత్రం. ప్రేమించిన వ్యక్తి శరీరమూ పవిత్రమే. అందుకే మనసు ‘ అలా ‘ ఊహించడానికి తిరస్కరించేది.

ఏదో మబ్బు విడిపోయినట్టయింది. అవును.. మాధవిని నేను ప్రేమిస్తున్నాను. ఎంతగానంటే ఆమె గురించి వూహల్లో కూడా తప్పుగా వూహించలేనంత. ‘ అని అనుకున్నాక ఆనందరావు మనసుకి చెప్పలేని ఓ శాంతి కలిగింది.

యస్.. ఇప్పుడు లక్షమంది సుందరీబాయ్ లు నా చుట్టూ నగ్నంగా నాట్యం చేసినా నా మనసు చెదరదు. ‘ అని గట్టిగా నిట్టూర్చి ఉత్సాహంగా లేచి నిలబడ్డాడు ఆనందరావు.

సాయంత్రమైంది.  పక్షులు రెక్కలల్లార్చుతూ  గూళ్లకు మళ్ళుతున్నాయి. ఆటోరిక్షాలు, సిటీ బస్సులు రొద చేస్తూ వాతావరణ కాలుష్యాన్ని పెంచేస్తుంటే ఆనందరావు మాత్రం తన మానాన తాను ఉషారుగా నడుస్తూ  మాధవి ఇంటి దారి పట్టాడు. దూరం నుంచే అబ్జర్వ్ చేశాడు. సుందరీబాయ్ కారు అక్కడ లేదు. అంటే ఆవిడ ఇంటికి వెళ్ళిపోయిందన్న మాట. మరో నిట్టూర్పు అప్రయత్నంగా వెలుబడింది. ఎందుకు? ఈ నిట్టుర్పులో ఓ చిన్న అసంతృప్తి. ఎందుకు? ఆలోచించాడు ఆనందరావు. బహుశా మనసు మారుమూలల్లో మళ్ళీ ఓ సారి సుందరి అర్ధనగ్న దేహాన్ని చూడాలనే కోరిక ఏమైనా నలుసులాగా మిగిలి ఉందా?

‘మనసు గుర్రము రోరి మడిసీ  ” అన్నవాడు మహాజ్ఞాని.

 

 

*******

 

 

వెంకటస్వామి పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుషులాగా వుంది. పరమశివం అదేదో సినిమాలో అన్నట్టు చూపుల్తోనే చురకత్తులు దూస్తున్నాడు. అలా అని ఆ చూపుల్లో కోపం లేదు వ్యంగ్యం వుంది… వెటకారం వుంది… పైశాచిక ఆనందం వుంది.

నందిని అమాయకంగా నగలన్నీ మూటగట్టి సిద్ధంగా వుంచానని చెప్పినా వెంకటస్వామి ధైర్యం చేయలేకపోతున్నాడు. “ఏదో చెయ్యాలి.. చాలా తెలివిగా, తొందరగా తప్పించుకోవాలి. ఆలోచిస్తూ “సర్వింగ్” చేస్తుండగా టేబుల్ మీద పెట్టాల్సిన గ్లాసు పొరబాటున కిందపడి భళ్ళున బద్దలయింది. దోసెలు వేస్తున్న పరమశివం ఫకాల్న నవ్వాడు. వెంకటస్వామి ఏమీ మాట్లాడకుండా గాజుముక్కలన్నీ భద్రంగా ఏరి, ఓ సాసర్‌లో పడేసి వాటీని చెత్తకుండీలో పడేశాడు.

తొమ్మిదింటికి ‘ఆఫ్’ దొరికింది. ఓ క్వార్టర్ బాటిలు కొనుక్కొని మేడమీద ‘మందు సరంజామాలో కూర్చున్నాడు వెంకటస్వామి. పరిపరివిధాల ఆలోచిస్తూ, రెండు గంటలు గడిచినా ఆలోచనలు ఓ కొలిక్కి రాలేదు.

“భలే స్వామి భలే.. ఇవ్వాళ నాకు మందు కొట్టాలనిపించింది. ఇలా అనుకున్నానో లేదో ‘నువ్వు’ ఆల్‌మోస్ట్ క్వార్టర్ బాటిల్ని లాగించేశావు అంటే ఏమి అర్ధం అవుతోందో తెలుసా? నా బుర్రా, నీ బుర్రా ఒకటే విధంగా ఆలోచిస్తూ ఒకేవిధంగా పని చేస్తున్నాయని.. కదూ”

జేబులోనించి ఓ హాఫ్ బాటిల్, ఓ లీటర్ వాటర్ బాటిలూ, ఓ బీడీ కట్ట, అగ్గిపెట్టే తీసి వెంకటస్వామి ఎదురుగ్గ్గా కూర్చున్నాడు పరమశివం.

“ఇంకోటి. అందరూ చిన్న చిన్న జేబులు కుట్టించుకుంటారు. నాకది ఇష్టం వుండదు. జేబు అంటే ఏలా వుండాలొ తెలుసా? పోనీ  ఎంత వుండాలో చెబుతా. మన మహాదేవన్ గారికి ఒక్కతే కూతురు. ఒక్కతే కూతురుండే తండ్రి తన కూతురికి ఎన్ని నగలు చేయిస్తాడో తెలుసా? అన్నిటికీ కలిపి ఓ పెద్ద మూట అవుతుంది.. అంత పెద్ద మూట పట్టేలా వుండే జేబులంటే నాకిష్టం. ఇదిగో ఇటు చూడు ఆ జేబులోంచి అన్ని వస్తువుల్ని తీయడం చూశావు గదా. యీ జేబులో నించి ఏం వస్తుందో చూడు..?” పకపకా నవ్వుతూ జేబులోనించి కాయితం చుట్టిన ఓ ‘కట్ట’ని బయటికి తీసి నేలమీద పరిచాడు. 9 అంగుళాల  చాకులు రెండు, ఆరంగుళాల చాకులు రెండు, ఓ కత్తీ, ఓ దబ్బనం, పుస్తకాలు కుట్టే బండ సూదులూ,  పిన్నీసులూ, ఓ కటింగ్ ప్లేయరూ వున్నాయి. గొంతులొ తడి ఆరిపోయింది వెంకటస్వామికి.

“క్వార్టర్” మందు ఖాళీ అయిపోయిందని భయమా?  డోంట్ వరీ నా దగ్గర హాఫ్ బాటిల్ వుంది. అవునూ.. కోడిపందేళ్లో పాల్గొనే కోళ్ల కాళ్లకి కత్తులెందుకు కడతారో తెలుసా? కోళ్లు ఒకదాన్నొకటి పొడుచుకునేటప్పుడు నెప్పి తెలీకుండా కోడికి ఉగ్గుపట్టినట్టు సారా పడతారు తెలుసా?.. హా..హా.. అది నీ గ్లాసు.. ఇది నా గ్లాసు.. అందులో ఓ పెగ్గు.. ఇందులో ఓ పెగ్గు.. అందులో ఇదిగో నీళ్లు.. ఇందులోనూ నీళ్లే.. వెధవది నీళ్ల బదులు రక్తం కలుపుకు తాగితే ఇంకెంత మజానో… ” నవ్వుతూ గ్లాసందుకున్నాడు పరమశివం.

వెంకటస్వామికి సడన్‌గా కళ్లు తి..రి..గాయి…

మళ్లీ కలుద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *