May 21, 2024

వెటకారియా రొంబ కామెడియా 8

రచన: మధు అద్దంకి

అమ్మలక్కలాయణం.

 

“కుక్కకాటు” వారింట్లో సందడి మొదలయ్యింది.. అంతా హడావుడిగా పని ఉన్నా లేకున్నా తెగ తిరిగేస్తున్నారు..

అప్పుడే ఒక ఆటో వచ్చి ఇంటి ముందాగింది..అందులోంచి ఒక భారీ శాల్తీ ఉస్సూరంటూ దిగింది.. ఆ శాల్తీ దిగంగానే ఆ ఆవరణలో ఉన్న జనాలందరు ఒక్కరు కూడ మిగలకుండా పరిగెత్తారు.. ఆటో డ్రయివర్ బిత్తరపోయాడు.

ఉస్సూరంటూ దిగిన సదరు శాల్తీ పేరు “జెమ్ గాళ్” ..ఇదేంటి వెరైటీ పేరనుకుంటున్నారా.. ఆవిడకి టెంగ్లీష్ మీద మక్కువతో పెట్టుకున్న పేరది.. అసలు పేరు “రత్న కుమారి” ముద్దుగా టెంగ్లీష్ లో “జెమ్ గాళ్” అని పెట్టుకుంది.

“ఇదిగో ఆటో బాయ్ ఒక్కళ్ళు కూడ కనపడటంలేదు గాని నా సామానంతా ఆ వసారాలోకి పుట్టింగ్స్ నేను నీకు పైసలు ఇచ్చింగ్స్” అంది..

వాడికి ఒక్క ముక్క కూడ అర్ధం కాక అలానే తెల్ల ముఖం వేసుకుని చూశాడు..

“వై  మాన్ అట్లా లూకింగ్? సామాన్స్ ఇన్సయిడ్ పెట్టింగ్స్” అంది.. అయినా వాడికి అర్ధం కాలా.

ఇంక లాభం లేదనుకుని సామాన్లు చూపించి యాక్షన్ చేస్తూ చూపెట్టింది..ఆవిడ  బాధేమిటో వాడికి అర్ధం కాకపోయినా బాగ్ తో ఏమన్నా బాధ ఉందేమో అనుకుని బాగ్ తీసుకుని లోపల పెట్టాడు..

” పైసే దేవ్” అన్నాడు ఆటోవాలా.

” ఏంటి షవుటింగ్ పైసలు  ఇచ్చింగ్స్ నువ్వు స్టాండూ” అంటూ ఆటోవాడికి పైసలిచ్చి పంపించి నెమ్మదిగా లోపలికి నడిచింది జెమ్ గాళ్..

హాల్లో ఉన్న సోఫాలో కూలబడి ” ఓలు దేర్? కొంచం నీళ్ళు గివింగ్స్” అంటూ ఒక్కరుపు అరిచింది.. నీళ్ళివ్వకపోతే కిచెన్లోకి వచ్చేస్తుందేమోనని భయపడి నెమ్మదిగా గ్లాసు నీళ్ళతో వచ్చింది వంట మనిషి శాంతి..

“హెలో పీస్ ఎలా యూ డూఇంగ్” అంటూ పలరించింది జెమ్ గాళ్..

“జెమ్ గాళ్ గారు నేను బావున్నా మీరు?” అనడిగింది శాంతి.

“ఇలా ఏడ్చింగ్స్” అంటూ నిట్టూర్చింది జెమ్ గాల్..

“అవును మారేజ్ హవుస్ కదా ఎక్కడ అందరూ?” అనడిగింది జె.గా

“ఇప్పుడే మీరొచ్చారు కదా రిలాక్స్ అవుదామని వెళ్ళారు అంది” పీస్

“ఒకే..చాలా ఇరిటేషన్ గా ఉంది బాత్ చేసొస్తా నా రూం వేర్” అనడిగింది జె.గా

రండి అంటూ ఆమెని ఒక గదిలోకి తీసుకెళ్ళింది పీస్..

జె.గా గదిలోకి వెళ్ళగానే అందరు బిల బిల లాడుతూ బయటకి వచ్చారు..

హమ్మయ్యా కొద్ది సేపు మనకి శాంతి అనుకున్నారు..

జె.గా స్నానం చేసి బయటకొచ్చేసరికి మళ్ళా అందరూ బిల బిల లాడుతూ వెళ్ళిపోయారు..హాల్ అంతా పరికించి చూసింది జె.గా.. వీళ్ళ దిసీస్ ఇలా కాదు వేరేలా బేటింగ్ అనుకుంటూ ఒక్క పొలికేక పెట్టి చెప్పింది” మర్యాదగా అందరు బయటకి రాకుంటే నేను ఒక్కొక్కరి గదుల్లోకి రావాల్సుంటుంది” అని

ఇక తప్పదు అన్నట్టు అందరూ పిల్లుల్లా బయటకి వచ్చారు..

“ఏమర్రా కిడింగ్స్ అందరూ ఎలా చచ్చింగ్స్?” అంటూ పలకరింపులు మొదలెట్టింది.

పెళ్ళి సమయంలో చావులెందుకులే అక్కా అంటూ ముందుకొచ్చాడు పె.కూ.త ( పెళ్ళి కూతురి తండ్రి) పాపారావు.

“ఓసోసి భలే జొకేశావురా పాపిగా” అంటూ జబ్బ మీద చెళ్ళున ఒక్కటిచ్చింది జె.గా.

“అంత గట్టిగా కొట్టి మరీ మెచ్చుకోవాలా రత్నక్కా?? చూడు జబ్బెలా ఉబ్బిపోయిందో నీ దెబ్బకి” అన్నాడు పాపారావు జబ్బని చరుచుకుంటూ..

“ఇదిగో రత్నక్కా అంటూ ఏమిటా పిలుపు? నేను జెమ్ గాళ్ ని “అన్నది జె..గా

“సరేలే ఎలా పిలిస్తే ఏమి కాని బావగారు రాలేదా? పిల్లలు ఎక్కడ” అంటూ ప్రశ్నలు కురిపించాడు పా.రా( పాపా రావు)

ఆయనకి నాతో రావడానికి టయిం వేర్?? ఎన్ని పనులో..

( పనులు కాదులే..నీ నుండి తప్పించుకునే అవకాశం బావ విడిచిపెట్టడు) అనుకున్నాడు పా.రా

పిల్లలు కూడ చదువుల్లో బిజీ అంచేత నేనొక్కదాన్నే కమింగ్ అంది జె.గా

నువ్వొచ్చావు ఇక ఇల్లంతా సందడే సందడి అక్కా ( చచ్చింది మా గొర్రె) అనుకుంటూ అటు తిరిగి భార్యకి సౌంజ్ఞ చేశాడు..

కాఫీ తీసుకోండి వదినా అంటూ వచ్చింది పా.రా భార్య రాణి..

“ఓహో క్వీన్ ఎలా ఉన్నావ్” అంటూ తనదైన శైలిలో పలకరించింది జె.గా..”

ఇంతకీ మారేజ్ గాళ్ ఎక్కడ” అనడిగింది జె.గా

“ఇదిగో వస్తున్నా అత్తా” అంటూ ముందుకొచ్చింది పె.కూ (పెళ్ళి కూతురు) ఐశ్వర్య..

“హలో వెల్త్ ఎలా డూయింగ్” అంటూ పలకరించింది జె.గా.ఈ రకంగా తనదైన శైలిలో చుట్టాలందరినీ ఒక పట్టు పట్టింది జె.గాల్

తర్వాత పెళ్ళి పన్లన్ని చక చక జరిగిపోయాయి..పెళ్ళివారందరు పెళ్ళి మంటపానికి తరలి వెళ్ళారు.

అక్కడ తనకొచ్చీ రాని టెంగ్లీష్ లో అందరినీ వేయించుకు తినేసింది జె.గాల్..

పెళ్ళి కూతురిని చేస్తున్నప్పుడు అమ్మలక్కలందరు చేరారు.. చేరి

” ఇది విన్నావా జె.గాళక్కా” మన కాముడి కూతురు లేచిపోయిందిట పక్కింటి టైలర్ వెధవతో” అయినా అదేమి చోద్యమమ్మా లేచిపోవడానికి వాడే దొరికాడా తింగరి వెధవ” అన్నది కళ్యాణి.

మరే..ఎక్కడ చూసిన ఇలాంటివేనమ్మా..మొన్నటికి మొన్న మా పక్కింటి పెళ్ళాం లేచిపోయింది ఇలానే ఎవడితోనో.. కలికాలమమ్మా పిదప బుద్దులు..మా రోజుల్లో ఇలా కాదు అంటూ వాపోయింది ఒక బోడెమ్మ.

“అవునులే నీ రోజుల్లో నిన్ను కుళ్ళబొడిచి  పనిచేయించాడులే బావ బోడెమ్మక్కా నువ్వెక్కడికి పోవడానికి లేకుండా ” అన్నది కాకమ్మ..

ఆ మాటలు విని కిసిక్కిన నవ్వింది కూతమ్మ.. ఊఊ అంటూ మూతి తిప్పింది బోడెమ్మ..

ఇంతలో అటు చూడండి అంటూ మోచేత్తో పొడిచింది జె.గా..

అప్పుడే ఫెళ ఫెళ లాడే పట్టుచీర కట్టుకుని, వంటి నిండా నగలు పెట్టుకుని వచ్చింది శ్యామల.

బాగున్నావా శ్యామలా అంటూ అందరూ పలకరించారు.. “బాగున్నా అంటూ” తలూపింది శ్యామల..

“నీ చీర బావుంది శ్యామల ఎక్కడ కొన్నావు” అనడిగింది జె.గా..

ఇక్కడే “యన్.చెంగన్న” బ్రదర్స్ లో కొన్నా.. కంచిపట్టు చీర.. 100% ప్యూర్ జరీ అక్కా” అన్నది శ్యామల.

“ఆ ఈ రోజుల్లో ప్యూర్ జరీ ఎక్కడుంది? అంతా ఉత్తిదే”అని కొట్టి పారేసింది బోడెమ్మ.

“నువ్వద్రుష్టవంతురాలివి శ్యామలా మా తమ్ముడు నిన్ను నెత్తిన పెట్టి చూసుకుంటున్నాడు..నీకు బోలెడు చీరలు, నగలు కొనిపెడుతున్నాడు” అన్నది జె.గా.

” ఆ ఇవ్వకేమి చేస్తాడు..సంపాదించేదంతా నల్ల డబ్బయ్యే మరి..ఎక్కడ దాచుకుంటాడు ” అన్నది బోడెమ్మ.

ఇక ఆ మాటలు వినలేక ” నేను వస్తా వదినా” అంటూ వెళ్ళిపోయింది శ్యామల.

మూతి మూడు వంకర్లు తిప్పింది బోడెమ్మ..

పెళ్ళి కూతురు ఫక్షన్, పెళ్ళి, సత్యనారాయణ వ్రతం ఎప్పుడయ్యాయో తెలియలేదు కబుర్లల్లో పడ్డ ఈ అమ్మలక్కలకి. వీళ్ళు వాళ్ళు అని లేకుండా ఒక్కరిని కూడ విడిచిపెట్టకుండా సమూలంగా , కామంట్లు చేసి వారి నోటి దురద తీర్చుకున్నారు.. చివరాఖరుకి అలిసిపోయి ఇంటికెళ్ళిపోయారు..

మళ్ళా ఇంకో ఫంక్షన్ కోసం వెయిటింగ్ నోటి దురద తీర్చుకోడానికి.

 

ఇదండీ అమ్మలక్కలాయణం..ఇటువంటివారు మనందరికీ తగులుతూనే ఉంటారు కదూ..

5 thoughts on “వెటకారియా రొంబ కామెడియా 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *