May 17, 2024

ఆత్మకు వినబడే పాట

chitra
రచన: రామా చంద్రమౌళి

చిత్రం: చిత్ర ఆర్టిస్ట్

పాట చాలాసార్లు నిశ్శబ్దంగానే ఉంటుంది
వినబడ్తుంది ఎవరికి వారికే..ఆత్మకు
కళ్ళు మూసుకుని నిన్ను నువ్వు కోల్పోతున్నపుడో
నిద్రపట్టని రాత్రి ఎండుటాకువై కొట్టుకుపోతున్నపుడో
ఒట్టి శూన్య దృక్కులతో వాన చినుకుల్లోకి చూస్తున్నపుడో
నగ్నమైన పాట నీకు మాత్రమే వినబడే
ఒక ఏక్ తార ధ్వనిగానో
ఒక తెగి అతుకుతూ గాలిలో తేలివచ్చే వేణుగానంగానో
ఒక ఆకు రాలుతున్న చప్పుడుగానో
ఏ భాషకూ అందని దుఃఖ సారంగీ జీరగానో –

తొంగి లోపలికి చూచుకున్నపుడు
నీలో ఆమె ఉంటుంది..కాని ఆమెలో నువ్వుండవు
ఒక్కోసారి
ఆమెలో నువ్వుంటావు..కాని నీలో ఆమె ఉండదు
కొన్నిసార్లు
అసలు నీలోనే నువ్వుండవు..అంతా ఒట్టి ఖాళీ
అప్పుడుకూడా ఒక దుఃఖగీతం
నిశ్శబ్దంగానే..ఏ భాషాలేక నగ్నంగా వినబడ్తుంది పాటై-

పాట ఒక భాషను తొడుక్కుని
ధ్వనితో అలంకరించుకుని
రాగాలతో ముస్తాబైతే..క్రమక్రమంగా కలుషితమై
తన సహజ రూపాన్ని కోల్పోతూ
ఒట్టి శబ్దశకలంగా మిగిలిపోతుంది
అప్పుడది ఒక ముద్ర కాజాలదు –

ఏ భాషాలేని ఒక వయొలిన్ విషాద స్వరమో
ఒక జాజ్ భీకర హోరో
ఒక సితార అలలు అలలుగా జార్చే మధుస్వనమో
మనిషిని శరీరాతీతుణ్ణి చేసి
ఒట్టి ఖాళీ సీసాగా మిగులుస్తుంది
అప్పుడు..ఒక రాహిత్య తాదాత్మ్యతలోకి రాలిపోతావు నువ్వు
అందుకే..మనిషి కల్లోల సముద్రమైనపుడు
తల్లి ఒడిలోని శిశువులా
ఒక వినిపించని పాటలో తడుస్తూ
అంతిమంగా అంతర్ధానమౌతూ నిశ్శేషమైపోతావు –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *