May 21, 2024

భ్రమర వ్యసనం

రచన: జయశ్రీ నాయుడు

వ్యసనాలు విచిత్రమైనవి
హషిష్ కన్నా గాఢంగా హత్తుకుపోతాయి

ఆలోచనల్లోకి కూరుకుపోయి
మెదడు నుండి హృదయానికి
అలసట లేక ప్రవహించే
మోహతరంగాల వెన్నెల సంద్రం

అమావాస్యలున్నా
పున్నములే అక్కడ పదిలమవుతాయి

నిజమిదే అని నిర్ధారించేలోగా
అబద్ధం ఉల్లిపొరల్లోని ఘాటులా
ప్రశ్నార్థకపు సెగలు నింపుతుంది
వాస్తవం స్పృశించేలోగా
మిథ్యా మారుతం చుట్టేస్తుంది

ఎన్ని కాలాలు గ్రంధస్థమైనా
లిపి లేని ఘడియలకు
ప్రాణం పోసి పదిలం చెయ్యడమూ ఒక వ్యసనమే

కోల్పోయిన ఆత్మీయతల ఆలంబనలు
ఋతువుల్లా తిరిగొస్తాయన్న భ్రమల్లో
కొనసాగే ఎదురుచూపులు

తారలున్నా లేకున్నా
ఉదయాస్తమానాల్లో నవ్వుకొనే నింగిలా
ఒక్క మొగ్గ లేకున్నా వసంతమనుకునే భ్రమర హృదయం…

నిజాలన్నీ తలపు తుట్టెలో దాచి
ఇష్టాలనే పువ్వులు పూసినవేళ
కోరికల తేనె పోగుచేసేందుకు
ఆ భ్రమర మానసం
మరో ఉదయంలా రివ్వుమంటోంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *