May 21, 2024

చిగురాకు రెపరెపలు-9:

రచన: మన్నెం శారద

నర్సీపట్నం వెళ్ళాం. పెద్ద పచ్చిక బయలులో వుంది పెదనాన్న క్వార్టర్సు. కాంపౌండు వాల్స్ లేవు. అక్కడక్కడా పెద్ద పెద్ద చెట్లు.
అన్నిటికన్నా పెద్ద ఆకర్షణ పెదనాన్నకి అడవిలోకి వెళ్ళడానికి ఏనుగు నిచ్చేరు. క్వార్టర్సు ఎదురుగానే ఏనుగుశాల వుండేది. రోజూ రెండుపూటలా దానికి ఆహారం పెట్టడానికి మా ఇంటికి తీసుకొచ్చేవారు.
ఇక మా పిల్లల సందడి అంతా యింతా కాదు. ఏనుగుని అదివరకు సర్కస్ లోనే చూడటం!
ఇప్పుడది మా యింటికొచ్చింది!
అంత పెద్ద ఆకారాన్ని సంభ్రమంగా చూశాం! రాగానే ‘బార్ సలాం’ అనేవాడు మావటివాడు!
వెంటనే అది తొండం మడిచి సలాం చేసేది!
ఎండుగడ్డి గిన్నెల్లా చుట్టి అందులో బియ్యం, కూరగాయలు వేసి… ఆహారంగా పెట్టేవాడు మావటి. ఆ బియ్యం కొలత మా యింట్లో వాళ్ళు చూడాలి!
అదవ్వగానే మేమంతా స్టోర్ రూం లోకి పరిగెత్తి దానికి వెలక్కాయలు, చెరుకుగడలు… ఇంకా ఏజెన్సీలో దొరికే పళ్ళు దాని తొండం లో పెట్టేవాళ్ళం. అది నోట్లో పెట్టుకొనేది.
ఆ కార్యక్రమం కాగానే మావటి మమ్మల్నందరినీ ఏనుగు ఎక్కించేవాడు. కాలు మెట్ల లాగ వంకర వంకర గా పెట్టేది. మేం దాన్ని ఆధారం చేసుకొని ఎక్కేసేవాళ్ళం. మా హేమక్క మాత్రం బెదరి ఎక్కేది కాదు. మా అమ్మగారు ఎంత ప్రయత్నించినా!
అందరూ ఎక్కేవారు కాని, దాని మెడదగ్గరగా ఎవరూ కూర్చునేవారు కాదు. నడుస్తున్నప్పుడు దాని మెడ కండరాలు అటూ యిటూ కదిలి క్రింద పడిపోతామన్న భ్రాంతి కలిగించేది!
అక్కడ నేనొక్కర్తినే కూర్చునేదాన్ని. దాని మెడలో బలంగా వున్న గొలుసులు పట్టుకుని …
దాని చెవులు అటూ యిటూ విసురుతున్నప్పుడు నా కాళ్ళకి తగిలి వళ్ళు గగుర్పొడిచేది. అయినా పైకి బింకంగా కూర్చునేదాన్ని. అలా వూరంతా తిప్పేది ఏనుగు.
చివరకు అది నదికి స్నానానికి వెళ్ళినప్పుడు కూడా ఒడ్డున కూర్చునే వాళ్ళం. అది నీళ్ళను పీల్చి తొండంతో వెదజల్లడం భలేగా వుండేది.
అటుకెళ్ళి చెట్ల కొమ్మలు విరుచుకుని తొండంలో చుట్టుకుని తెచ్చేటప్పుడు కూడ మేం దాని మీదనే వుండే వాళ్ళం. ఒకసారి మా పెదనాన్న గారింట్లో “తవుడు” అనే పేరుతో ఒక ఆర్డర్లీ వుండేవాడు. అతను నాకు ఆ కాంపౌండ్ లో వున్న తాటి చెట్ల క్రింద పాతిపెట్టిన తాటికాయలు తేగలుగా మారడం వాటిల్లో తెల్లటి కొబ్బరిలాంటి పదార్ధం పగలగొట్టి ఎలా తినాలో చూపించేడు. వాటిని బుర్రగుంజు అంటారని చెప్పగానే మేం తెగ నవ్వేవాళ్ళం.
“నీ బుర్రలో గుంజా!” అనే వాళ్ళం.
“గుంజు లేదనేగా తవుడుని పేరు పెట్టేరు” అనే వాడన్నయ్య.
పాపం, తవుడు ఏవీ అనుకునే వాడు కాదు.
ఆరుబయట పచ్చిక బయళ్ళలో కూర్చోబెట్టి మంచి మంచి కధలు చెప్పాడు. నాకు ఒక మట్టి డిబ్బీ తెచ్చి డబ్బులు ఎలా దాచుకోవాలో చెప్పాడు. ఇక అది వూపుతూ పెదనాన్న రాగానే చిల్లర అడిగేదాన్ని.
పెదనాన్న ఇచ్చేవారు.
ఒకరోజు నేను తాటిచెట్టు దాగ్గర తేగల కోసం గుంత తవ్వుతుండగా కుక్క మొరగడంతో మావటి కంట్రోల్ తప్పి ఏనుగు పరిగెత్తింది.
మావటి అక్కడున్న మా అందర్నీ తప్పుకోమని అరుస్తూ ఏనుగుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
నేనదేమీ గమనించకుండా ఏకాగ్రతలో తేగల పనిలో నిమగ్నమయ్యేను.
అన్నయ్య, ఇంట్లోంచి అమ్మ, దొడ్డమ్మ కేకలు పెడుతున్నారు.
ఏనుగు నా దగ్గరకి రానే వచ్చింది. ఒక్కసారి వులిక్కి పడ్డాను. కాని.. ఏం చేయాలో తెలియలేదు!
షాక్ గా అలానే వుడిపోయాను.
“చచ్చింది! చచ్చింది! దేవుడా!” అంటున్నారు. నేను కళ్ళు గట్టిగా మూసుకున్నాను. గంటల శబ్దం దగ్గిరగా వచ్చేసింది. కాని.. నేను చచ్చినట్లు లేదు!
అని తొక్కేసిందా!
చచ్చిపోయానా?
ఎవరో ఎత్తుకున్నట్లైంది! కళ్ళు మెల్లిగా తెరిచేను.
మావటి!
“ఏనుగు తొక్కలేదా?” అడిగాను.
“ఎంత అదృష్టవంతురాలివమ్మా… దాని కాళ్ళ క్రిందే వున్నావు. అది నీ మీద నుండే పరిగెత్తింది. ఏ కాలూ నీ మీద పడలేదూ అన్నాడు.
అందరూ పరిగెత్తుకొచ్చేరు.
ఇక మా అమ్మ తిట్లు మామూలే!
ఇందులో నా తప్పేముందని?
అయినా అంతే!
కాని… చాలా రోజులు ఏనుగుని చూస్తే భయం వేసేది! నర్సీపట్నం దగ్గిర అనుకుని వున్న చింతపల్లి, సీలేరు అడవులు చూశాం. దారిలో దట్టమైన అడవులు, సన్న గా పారే సెలయేళ్ళు, వర్షానికి అకస్మాతుగా కొండల మీద నుండి దూకే జలపాతాలు… రకరకాల పూలు, పళ్ళు మనోహరంగా మనసుకి హత్తుకు పోయాయి.. ఆ దృశ్యాలు!
మాచర్ల తిరిగి వచ్చాం.
నాన్న ఆఫీసర్ల క్లబ్ సెక్రటరీగా వున్నారు.
ఆ సంవత్సరం ఏం ఫంక్షనో నాకు తెలియదు గాని సుశీలత్త మేనకోడళ్ళు వచ్చి డాన్స్ చేసేరు. జరీ బట్టలతో, మెరిసే నగలతో వాళ్ళు కొండపల్లి బొమ్మల్లా డాన్స్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది.
‘పిల్లలు బొమ్మల్లా వుంటారు డాన్సు నేర్పించు వదినా!’ అని సుశీలత్త మా అమ్మని పోరింది.
‘చీ! డాన్సా!’అని మా అమ్మ చీత్కరించేది.
‘ఏం తప్పుందని, అలాగంటావ్!’ అనేది సుశీలత్త చివరకు అందరూ చెప్పగా చెప్పగా… తెనాలి నుండి వచ్చి మాచర్లలో సెటిలయిన ఒక డాన్స్ మాస్టారు మా హేమక్కకి, ఇందిరకి డాన్సు నేర్పించసాగేరు.
‘నేనూ నేర్చుకుంటానూ అంటే ఒప్పుకోలేదమ్మ.
నాన్నా అంతే ” నువ్వు మగరాయుడివిరా! బాగా చదువుకుని డాక్టరవ్వాలి!” అన్నారు.
నేను ఏడ్చేను. దొర్లేను. జుట్టు పీక్కున్నాను. ప్రయోజనం లేకపోయింది.
చివరకు గతిలేక వాళ్ళు నేర్చుకుంటుంటే అక్కడే బాసింపట్లేసుకొని కూర్చుని తదేకంగా చూసేదాన్ని.
మాస్టారు వెళ్ళిపోయాక పెరట్లోకెళ్ళి ఒంటరిగా ప్రాక్టీసు చేసేదాన్ని.
అలా ఏ రోజు క్లాసు ఆ రోజు నేర్చుకోవడం ఎవరికీ తెలియదు.
క్లబ్బులో ఏదో ఫంక్షనొచ్చింది.
ఈ సారి హేమక్క, ఇందిరల డాన్సు ప్రోగ్రాం పెట్టేరు.
నెలరోజుల ముందునుండే వాళ్ళ కాస్ట్యూమ్స్ సుశీలత్త, అమ్మ తయారు చేసేరు. రోజూ ప్రాక్టీసులు.
నేనలాగే అటూ యిటూ తిరుగుతూ చూస్తుండేదాన్ని.
క్లబ్బులో ఫంక్షనంటే మాచర్లంతా హడావుడే!
టూరింగ్ టాకీసు సినిమాలు తప్ప, మరే వినోదం లేదక్కడ.
ఆ రోజు రానే వచ్చింది.
ఇందిర, హేమక్క మధురానగరిలో చేసేరు. ఇందిర కృష్ణుడుగా ముద్దుగా వుంది. హేమక్క సరేసరి! అందగత్తెని పేరు.
నాకొక నెహ్రూ డ్రస్సులాంటిది కుట్టించేరు-ఏడ్చిపోకుండా.
నేనటూ ఇటూ తిరుగుతున్నాను-చేసేదేమి లేక!
ఎటు చూసినా జనమే!
చెట్లు కొమ్మలన్నీ ఎక్కేసేరు.
ఇప్పటికే నాకు కొల్లేరు వలస పక్షుల్ని చూసినప్పుడు ఆ దృశ్యమే గుర్తొచ్చి నవ్వొస్తుంది.
హేమక్కని, ఇందిరని మరో డాన్సుకి మేకప్ చేస్తున్నారు లోపల.
ఏవో సినిమా పాటలు పెట్టారు మధ్యలో.
నాకు సడన్ గా ఒక అయిడియా ఫాషయ్యింది. నాన్న అక్కడ లేదు. అంతే!
వెంటనే గ్రామఫోను పెడుతున్న వాడి చెవిలో మెల్లిగా నాకిష్టమైన డాన్సు పాట పెట్టమని చెప్పేను. వాడు తలూపేడు. నేను కర్టెన్ రెయిజ్ చేయమన్నాను.
వాడికేం తెలుసు?
నేను ప్రోగ్రాంలో లేవని!
వెంటనే కర్టెన్ తీసేరు.
పాట హోరు మంటూ మైక్ లో వచ్చేస్తోంది. ఇక నేను ఆడేను… చెప్పొద్దు!
ఫుల్ స్టాపూ కామా లేదు.
ఒకటే వూపు!
ఒకటే ఈలలు! గోల.
ఆ దెబ్బకి కంగారుగా మా నాన్న వచ్చేసేరు.
నేను ఆయన వైపు చూసి నవ్వుతూ ఇంకా ఆడేసేను.
హెలెన్ లా!
మా నాన్న కర్టెన్ పక్కన చేరి వేలు చూపించి బెదిరిస్తూ లోపలికి రమ్మని సైగ చేస్తున్నారు.
నేనెందుకు వింటాను?
బయట అదిరిపోయే రెస్పాన్సు.
కర్టెన్ వేసేయమని చెప్పేడు మా నాన్న.
“వద్దు సార్! జనానికి బాగా నచ్చింది. పైగా బాగా కడ్తుంది కదా!” అన్నాడతను.
అలా నా మొదటి ప్రోగ్రాం అత్యంత భారీ రెస్పాన్స్ తో సాగింది.
రికార్డయిపోగానే పళ్ళికలించుకుంటూ గ్రీన్ రూంలో కెళ్లేను.
మా అమ్మ కళ్ళురుముతూ చూసింది. కొట్టబోయింది.
“ఊరుకో వదినా! దానికెంత రెస్పాన్సొచ్చింది. దానిక్కూడ నేర్పిస్తే పోయేది కదా! నీదంతా చూళ్ళేని తనం!” అంది సుశీలత్త నన్ను వెనకేసుకొచ్చి.
ఆ తర్వాత నా కాలేజి రోజుల్లో నేనే బెస్ట్ డాన్సర్ని. అప్పటిలానే నా డాన్స్ వుందంటే కాకినాడ కాలేజీల పిల్లలందరూ
మా కాలేజి గోడల మీద వుండేవారు. వన్స్ మోర్లు భరించలేక లెక్చ్రర్స్, ప్రిన్సిపాల్ మళ్ళీ చేయించేవారు.
నేను ఆ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ లో కూడ ప్రయిజులు తెచ్చుకున్నాను. అప్పుడు గుర్తించేరు అమ్మా, నాన్న!
అలా నేను మంచి డాన్సరయ్యేను.
‘ఇక వీళ్ళని స్కూల్లో వెయ్యండి. ట్యూషన్ చదువులేంటీ అని అన్నారందరూ.
స్కూల్లో సీట్సు లేవన్నారు.
“ఇంకో బెంచీ వెయ్యచ్చు కదా!” అని నేను నాన్నని సతాయించాను.
నాన్న నవ్వి “క్లాసుకింత మందే అని వుంటార్రా!” అని చెప్పేరు.
అయినా నాకర్ధం కాలేదు.
ఏదో ట్రాన్సఫర్ సీట్సు వున్నాయని దుర్గి అనే పల్లెటూరికి మా పోస్టుమాన్ తీసుకెళ్ళేడు.
అక్కడ మాస్టారొకడు మమ్మల్ని రచ్చబండ మీద కూర్చో బెట్టి ఏవేవో ప్రశ్నలడిగేడు. మా అక్క మాస్టార్ని దగ్గర రచ్చబండ మీద కూర్చుని వినయంగా చెప్పింది.
ఆ రచ్చబండ మీద వేపచెట్టు క్రిందకి వంగి పెరిగింది. నేను చర చరా చెట్లెక్కి మళ్ళీ క్రిందకి జారుతూ మాస్టారడిగినవన్నీ చెప్పేను.
“అలా కాదమ్మా, కాస్త కూర్చుని చెప్పు” అని పోస్టుమాన్ బ్రతిమిలాడేడు.
“పోనీలే! ఊరుకో. బాగానే చెప్పుతున్నదిలే” అన్నారు మాస్టారు.
అలా నాకు ఇంటూ ఫస్ట్ ఫాం (ఆరో క్లాసు) మా అక్కకి ఇంటూ ధర్డ్ ఫాం (ఎనిమిదో క్లాసు)లో సీట్లు వచ్చాయి.
అలా నేను నా ఏడో సంవత్సరంలో ఆరోక్లాసులో జాయినయ్యేను.
వెళ్ళిన రోజునే బ్లాక్ బోర్డ్ కెదురుగా వున్న అబ్బాయిల బెంచీలో కూర్చున్నాను.
ఏ! ఏ! ఇది అబ్బాయిల బెంచీ అమ్మాయ్! నువ్వాడ కూర్చోవాలి! ఓ మాలని వేసిన బెంచీ చూపించారు. అక్కడ చీరంత వోణీ చుట్టుకుని కూర్చునుంది ఒకమ్మాయి.
“ఏ ఇక్కడ కూర్చుంటే?” అన్నాను కోపంగా. ఇంతలో మాస్టారు వచ్చారు.
ఆయన నన్ను పలకరించి ‘శారద నీరదా’ అన్న పద్యం పాడి అమ్మాయిల బెంచీ కూర్చోబెట్టేరు.
చదువు బాగానే చదివేదాన్ని! కాని… అలా బాగా చదువుతున్నాను నాకు తెలియదు.
మాస్టారెళ్ళగానే బెంచి ఎక్కి డాన్స్ చేసేదాన్ని.
మగపిల్లలంతా ఈలలు వేసి, ” భలే కడ్తున్నావే, కట్టు! అనేవారు.
నాగేశ్వరమ్మ నా బెంచిమేటు పేరు. వాళ్ళది వ్యవసాయం. బాక్సులో కొర్రన్నం తెచ్చేది ‘తింటావా’ అని కొంచెం పెట్టేది. బాగానే వుండేది.
స్కూల్లో అతి చిన్న పిల్లని నేను.
అందరూ ముద్దు చేసేవారు. డ్రాయింగ్ మాస్టారికి బాగా ఇష్టం!
బొమ్మలు బాగా వేస్తానని. రైటింగ్ చాలా బాగుంటుందని మెచ్చుకునే వారందరూ!
రంగయ్య శాస్త్రిగారయితే.. “అది రైటింగా! ముత్యాలు తెంపి కాగితమ్మీద పోసినట్లు రాస్తుందయ్యా. శారద”.. అనే వారు. ఆ మాస్టర్ల ప్రేమ తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్ళొస్తాయి నాకు!
మా స్కూలు పక్కనే చంద్రవంక పారుతుండేది.
అప్పట్లో అది పెద్ద ఎట్రాక్షన్ నాకు.
నీరంటే ఎందుకో… చాల యిష్టంగా వుండేది. భయమేసేది కాదు.
చిన్నగా లంచ్ కాగానే ఎవరికీ చెప్పకుండా చంద్రవంకకి వెళ్ళేదాన్ని. వర్షాకాలం పొంగి పొర్లేది ఆ నది. ఒట్టప్పుడు ఇసుకమేటలో సన్నగా పాయలుగా ప్రవహిస్తుండేది. చిన్నగా నేను గౌను తీసి ఈత కొట్టడానికి ప్రయత్నించేదాన్ని లోతు లేదు కదా!
నది దాటి పల్లెటూళ్ళకి వెళ్ళేవాళ్ళు నన్ను వింతగా చూస్తుండేవారు.
ఒక జత బంగారు గాజులు, లోలకులు వుండేవి. ఆ రోజుల్లో ఇంత దొంగతనాలు, హత్యలు లేవు కాబట్టి నేను ఇంత అల్లరి చేసినా ఏ ప్రమాదమూ జరగలేదు నాకు! అలా ఈత కొడుతున్నప్పుడు నాకు కొన్ని రంగు రంగు రాళ్ళు కనిపించేది. వాటిని ఏరుకుని గౌనులో వేసుకుని తిరిగొచ్చేదాన్ని. ఇంటికి వచ్చేటప్పుడు మా హేమక్కకి చూపించేదాన్ని.
దానికీ “బొమ్మల పిచ్చే”
“ఎక్కడివీ!” అనడిగేది కళ్ళు పెద్దవి చేసి.
“ఎక్కడివో అక్కడివి!” అనేదాన్ని గర్వంగా.
దానికి అనుమాన మొచ్చి సడెన్ గా గౌనెత్తి తడిసిన చెడ్డీ చూసి “అమ్మో, చంద్రవంక కెళ్ళేవా! ఈత కొట్టేవా? అమ్మకి చెబుతా” అనేది.
“అయితే ఈ రాళ్ళు నీకివ్వను. బొమ్మలకి రంగులెలా వేస్తావ్?” అనేదాన్ని.
అది కూడ బొమ్మలు వేసేది. వెంటనే దిగజారి పోయేది.
“సరే, ఇంకెప్పుడూ వెళ్ళకే. చచ్చిపోతావే. చంద్రవంక ఎప్పుడు పొంగిపోతుందో తెలియదు” అనేది బ్రతిమలాడుతూ.
“సరే” అనేదాన్ని అప్పటికి.
ఇద్దరం పోస్టాఫీసుకి మా క్వార్టర్స్ కి మధ్యలో పార్టిషన్ లా పాతిన నాపరాళ్ళ మీద ఎడా పెడా బొమ్మలు వేసేసే వాళ్ళం.
పోస్టాఫీసుకి వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజుల్లో అదే పెద్ద ఎగ్జిబిషన్.
అందరూ మెచ్చుకునేవారు.
అలాగే ఒకసారి గుర్రం మల్లయ్య గారు వచ్చారు. ఆయనెవరో నిజానికి నాకు తెలియదు. ఆయన పెద్ద ఆర్టిస్టని తర్వాత తెలిసింది.
ఆయన నాపరాళ్ళ మీద బొమ్మలు చూసి “ఎవరు వేసారు?” అని మా నాన్నగారినడిగారట.
మా నాన్నగారూ”మీరే కాదు సార్! మా యింట్లో ఒక పెద్ద ఆర్టిస్టు వుంది” అని చెప్పేరట మా నాన్న.
నన్ను పంపించమన్నారు గుర్రం మల్లయ్య గారు. నాకప్పుడు బాబ్డ్ హెయిరే వుండేది.
వెంటనే వెళ్ళి నిలబడ్డాను. ఆయన నా తల నిమిరి, ఇంత చిన్న వయసులో..
“ఇంత బాగా వేస్తుందే. ఈ అమ్మాయికి నేర్పిస్తే. చాల పెద్ద ఆర్టిస్టవుతుంది నా దాగ్గిరకి పంపండి. నేను నేర్పుతాను” అన్నారాయన.
నా కళ్ళు మెరిసేయి ఆనందంతో.
కాని…నాన్న, అమ్మ పంపలేదు. అసలు చదువులే వద్దనుకున్న వాళ్ళు డ్రాయింగెలా నేర్పిస్తారు.
ఎంత బతిమలాడినా నన్ను పంపలేదు. అలా ఆ అవకాశం చెయ్యి జారిపోయింది.
తర్వాత నా పదకొండో సంవత్సరంలో నాగార్జున సాగర్ వాళ్ళకి ట్రాన్స్ ఫరయినప్పుడు అక్కడ మోడల్ డామ్ ని నిర్మించింది. శ్రీ గుర్రం మల్లయ్యగారేనని తెలిసి ఆనందపడి. ఆయన దగ్గిర పెయింటింగ్ నేర్చుకునే అవకాశం చెయ్యి జారినందుకు విచారించేను.
నేను అక్క, కాగితాల మీద బొమ్మలేసి ఆకు పసర్లతోనూ, సిరాతోనూ, దానిమ్మ పూలతోనూ రంగులేసి ఆనందించేవాళ్ళం.
అప్పుడే క్రిష్ణక్క వాళ్ళకి మాచర్ల ట్రాన్స్ ఫరయ్యింది. బావగారు ఇంజనీరు. ఆయన మా తంటాలు చూసి మొట్టమొదట సారిగా మాకు వాటర్ కలర్స్ బ్రష్ లూ, డ్రాయింగ్ షీట్లూ కొనిచ్చేరు. ఇక మాకు పండగే!
ఎడా పెడా బొమ్మలేసేసేం!

3 thoughts on “చిగురాకు రెపరెపలు-9:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *