May 17, 2024

!! మొదటి తరం కథాకుసుమాలు !!రాయలసీమ కథలు

ModatiTaramRayalaseemaKathalu600
సమీక్ష: పుష్యమి సాగర్

ఆంధ్ర దేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు గిడుగు రామమూర్తి పంతులు. ఇతడి కృషి వలననే అప్పటి దాకా గ్రాంధికంలో కొనసాగుతున్న తెలుగు పామరులు సైతం చదివేలా ఉండాలని ఉద్యమించి విజయము సాదించారు. తెలుగు అప్పటి దాక రెండు విధాలుగా ఉండేది. గ్రాంధికం, వ్యవహారికం . 18 శతాబ్దపు వరకు రచనలు గ్రాంధికభాషలోనే కొనసాగేవి …అలా 19 వ శతాబ్దపు ప్రారంభం వరకు కూడా సాహిత్యంపై గ్రాంధిక ప్రభావమే ఉండేది. ఈ వివరణ అంతా ఎందుకు అంటే రాయలసీమ మొదటి తరం కధల సంపుటి ని గురించి ఇప్పుడు చర్చించ బోతున్నాము . 18 -19 శతాబ్దంలో రాయలసీమ లో ఉన్న కథాసాహిత్యాన్ని చాలావరకు ఈ పుస్తకం పరిచయం చేస్తుంది.
కరువులో సుగాలి కుటుంబం బుక్కెడు బువ్వ కోసం ఆ కుటుంబ పెద్ద పడ్డ కష్టం , వేదన, “సుగాలి కుటుంబం” లో ఎంతో బాగా వర్ణించారు చింతా దీక్షితులు. గాడిచర్ల సర్వోత్తంగారు స్వాతంత్ర్య సమరయోదులే కాదు మంచి కథకులు కూడా. ఆయన రచించిన “రోజాంబ శ్వేతాంబ” లో నోరు లేని మూగజీవితో చేసిన స్నేహం ఇద్దరు అక్క చెల్ల్లెల్లకి ఎలాంటి అనుభవాన్ని కలిగించిది. మంచి అన్నది చివరివరకు నిలిచి ఆనందాన్ని ఇస్తుంది (రోజాంబ, శ్వేతాంబ ). ఎవరికైన చదువు జ్ఞానాన్ని ఇస్తుంది అంటారు కాని చదువు వలన తాము ఎలాంటి ఇక్కట్లను, విపత్తులను ఎదుర్కొన్నాం, తమ ఇంటిలో చదువు తెచ్చిన తంటాలను తలచుకొని అసలు చదువే వద్దన్న శెట్టి మూర్కత్వం నవ్వు తెప్పిస్తుంది.
(అచ్చుబాటు కాని చదువు, కొప్పర్తి నారాయణ) దేవుడిని దర్శించడానికి బయలుదేరిన ఇద్దరి మిత్రుల ప్రయాణంలో కలిగిన అనుభవాలే “ఇరువురి మిత్రుల ప్రయాణం”. “పరోపకారం ఇదం శరీరం ” అన్నారు పెద్దలు . గోపాలం దాహం తీర్చడానికి వెళ్ళిన గ్రామంలో కరువు పాలుపడటం వలన స్థితిని చూసి చలించిపోతాడు. తిరుపతి దర్శనానికి అని తెచ్చుకున్న డబ్బులని అంతా చావడానికి సిద్ధంగా వున్న కుటుంబం కోసం ఖర్చు చేస్తాడు. మనసులోనే స్వామికి మొక్కి మిగిలిన డబ్బులతో ఇంటికి బయలుదేరతాడు ..అదే సమయంలో మిత్రుడు రామస్వామికి తిరుపతిలో దేవుడి సమీపాన గోపాలం నమస్కరిస్తున్నట్టుగా కన్పించడం చమత్కారం. తిరిగి వచ్చేటప్పుడు గోపాలం బస చేసిన గ్రామాన్ని సందర్శించడం గోపాలం చేసిన మంచి పని వలన బాగుపడటం. రామస్వామికి అనిపిస్తుంది “మానవ సేవే మాధవ సేవ” అని. చక్కని సందేశంతో కూడిన కధ ఇది నేటి కాలానికి కావలసినది ఇదే..
భగీరధుడు గంగను అవలీలగా భూమికి తీసుకు వచ్చినా రాయలసీమ కరువు తీర్చడానికి ప్రజా ప్రభుత్వంతో ఎలా పోరాడాడు, వ్యంగాత్మకంగా చెప్పిన ఈ కధ ఆసాంతం పాలకుల నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. (భగీరధ ప్రయత్నం ). ఎంతో ప్రేమతో భర్తకి సేవలు చేసిన సుబ్బమ్మ చనిపోగానే రామయ్యను స్వేచ్చ ఎంత వరకు తీసుకు వెళ్లగలిగింది. నాటకాల్లో వేషాలు వేసి ఉరందరి చేతా వెలి వెయ్యబడ్డ రాముడు తానై పెంచిన బిడ్డనే పెళ్లాడబోతే ఎదురయిన పరిస్థితిని “ప్రేమ బలి” లో ఎంతో చక్కగా తెరకెక్కించారు. వీధిలో తిరిగే కుక్క తన సమూహంలో నుంచి దొరల చెంతకు చేరడం , రాజ వైబోగంతో దేశాలన్నీ తిరిగినా ఆ ప్రాభవం పోగానే చివరకు అనామకంగా మరల మొదటి చోటుకు చేరటం . జీవితంలో ఉచ్చ నీచ స్థితులకు దర్పణం పట్టే సత్యాన్ని శేషాచార్యులు తమ “బ్లాకీ కుక్క” చరిత్ర లో వివరిస్తారు. చెంగి మానాన్ని ఫాదర్ దోచుకునే ప్రయత్నంలో విఫలం చెంది ఫాదర్ చనిపోతే చెంగిని పోలీసులు పట్టుకు పొతున్నపుడు గుండు గాడి పెళ్ళాం అయిన సుబ్బి చేసిన సహాయం మానవతకు మచ్చుతునక. చెంగి సుబ్బుల సంబంధం తెలిసినా కూడా సహాయం చెయ్యడం ఆమె గొప్ప మనసుకు నిదర్శనం .(“పాపి చావు”, అర్మోగం పిళ్ళై ). చిన్నప్పటి స్నేహితురాలు చాలా కాలం క్రితం దూరమై వితంతువుగా తన ఎదురుగా నిలిచి వస్తే చంద్రం ఏమి చేసాడు . తమ ప్రేమ స్వచ్ఛమని ఇద్దరు ఒక్కటిగా మారి చీకట్లను చీల్చివేసారు . (“వెలి” ) . వ్యసనం ఎంత చెడ్డది అంటే చివరకు బిక్షం ఎత్తించడానికి అయిన వొడి గట్టిస్తుంది. తన, పర భేదం లేకుండా విచక్షణ మరిచేలా ప్రేరేపిస్తుంది. చివరకు వ్యసనం మనిషిని బలి తీసుకుంటుంది అచ్చం “విడుమర” కధలో లాగానే.. విద్వాన్ విశ్వం గారు అందించిన “ఎందుకు” లో ఎన్నో జవాబు లేని ప్రశ్నలు మనల్ని ఆలోచింప చేస్తాయి . సంఘ నిర్మాణంలో మానవుని స్వార్ధాన్ని, పరమోచ్చ స్థానానికి కొని పోయే ధనికత్వాన్ని నీలదీసి కడిగేస్తారు. సంఘ నిర్మాణంలో మనిషి ఆలోచన మారాలంటారు. (ఎందుకు, విద్వాన్ విశ్వం ). అలాగే వీరు రాసిన మరో కధ “నీతులు” లో చాలా వరకు నేటి నాగరిక ప్రపంచంలో ఆచరింపజాలనివే. ఇంకా ఈ కధల సంపుటిలో కే. సభా గారు రాసిన “కడగండ్లు “, రామకృష్ణ గారు రాసిన “చిరంజీవి” , శేషాచార్యులు గారు రాసిన “రైల్వే గైడ్ ” , విద్వాన్ విశ్వం రాసిన “నా పెండ్లి సంబరం ” లాంటి మంచి కదలని పేర్కొనవచ్చు . పేరున్న రచయతలే కాకుండా కొంత కొత్త వాళ్ళని కూడా పరిచయం చెయ్యడం ఎంతో ముదాహవం.
ఈ కధల పుస్తకం 18 శతాబ్దానికి చెందిన జీవన స్థితిని , అప్పటి వాడుక భాషని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు . గ్రాంధిక భాషలో ఉన్నప్పటి కూడా చాలా వరకు సులభంగానే అర్థం అవుతాయి. ఈ పుస్తకంలో మరో ఆకట్టుకునే అంశం ఏమిటి అంటే అప్పటి వాడుక పదాలు, వ్యాకరణం, నుడికారం బహుశా ఇప్పటి వాళ్ళకు కనీసం ఎరికలో అయినా ఉండకపోవచ్చు. ఉదా : లావణ్య సారం (ఉప్పు ), బేలు పుచ్చి (మాటలు చెప్పి) , వాకిలి మెటికలు (వాకిలి మెట్లు ) , గుప్పిడి చప్పిడి (గుట్టు చప్పుడు కాకుండా), తాలటం (ఆగడం ), పాపనం (పసి వాడు ), పిల్లతనం (చిన్నతనం ). ఇవి కేవలం కొన్ని మాత్రమే.. ఇలాంటివి ఈ పుస్తకం నిండా కొకొల్లలు. ఇక ఈ కథలు అన్నీ జన వినోదిని (1882), సౌందర్య వల్లి (1918), శారద (1922), శ్రీ సాధన (1926-1941), విజయవాణి (1941) నుంచి సేకరించినవి . చరిత్రలో మరుగుపడిపొయిన అద్భుతమైన రాయల సీమ కధల్ని ఓపిక గా సేకరించి సంకలనం గా తీసుకు వచ్చిన సంపాదకులు డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి గారు అబినందనీయులు . అలాగే ఈ పుస్తకాన్ని మన ముందుకు తెచ్చిన “అబ్జ క్రియేషన్ “వారికి ధన్యవాదాలు . మొత్తానికి అచ్చ తెనుగులో వచ్చిన మంచి పుస్తకం .అందరు తప్పక చదవాల్సినది.

1 thought on “!! మొదటి తరం కథాకుసుమాలు !!రాయలసీమ కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *