May 2, 2024

Dead people don’t speak-9

రచన:శ్రీసత్య గౌతమి

కార్లో స్టేషన్ కి వెళ్తూ అనైటాకి ఏరన్ చెప్పాడు, “ఇవాళ నేనే ఫోన్ ఇన్ ప్రోగ్రాంని కండక్ట్ చేస్తాను చూద్దాం పెయింటర్ ఏమి చేస్తాడో”.
అనైటా ఏమీ మాట్లాడలేదు. ఏరన్ ముఖం పూర్తిగా తిప్పకుండా.. క్రీగంటతో ఆమెని గమనించాడు. అనైటా ముఖంలో ఏ ఎక్స్ ప్రెషన్సూ లేవు.
స్టేషన్ వచ్చేసింది. లోపలికి అడుగుపెడుతూ ఎల్విన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
“వెల్ కం…ఏరన్. మొదటిసారి ఆగమనం మీరు మా స్టేషన్ కి”.. అంటూ ఎల్విన్ సాదరంగా ఆహ్వానించాడు మలై భాష లో.
“సో.. పెయింటర్ కూడా మన అతిధిగా ఇవాళ రాక తప్పదు.. ఏరన్ ని కలవడానికి”…అని నవ్వుతూ జోక్ చేశాడు ఎల్విన్. అనైటా కూడా ఆ మాటకు నవ్వింది.
ఎల్విన్!ఈ రోజు పెయింటర్ ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుదామనుకుంటున్నాను… ఏరన్ అన్నాడు.
ష్యూర్.. యాస్ యు విష్..
ఇవాళ్టి కార్యక్రమాన్ని కూడా నేనే ప్రసారం చేస్తాను, మీరు నాకు గైడ్ చెయ్యాలి.
అలాగే. తప్పకుండా. ఇట్స్ ఎ ఫన్ టూ.
ఇప్పటివరకూ జరిగిన ప్రోగ్రాంలను ఎలా రికార్డ్ చేశారు?
ఇదిగో అది ఇన్-బిల్ట్ ప్రోగ్రామే. కార్యక్రమం నడుస్తుండగానే ఆల్ రెడీ సేవ్ మోడ్ లోనే సెట్ చేసేశాను కాబట్టి.. ఆటోమేటిక్ గా రికార్డ్ అయినదంతా సేవ్ అయిపోతుంది.
ఓ..ఓకె.
మరి పెయింటర్ వాయిస్ కూడా అలాగే సేవ్ అయి వుండాలి కదా?
యస్.
అవి ఒకసారి మళ్ళీ నేను వినొచ్చా?
ష్యూర్..
ఎల్విన్ పాత తారీకుల్లోకి పోయి.. పెయింటర్ రికార్డింగ్స్ ని మళ్ళీ వేశాడు.
అదే కీచు శబ్దాలు, అదే వాయిస్, అవే మాటలు.
ఓకె. మరి ఇది ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఒక భాగం కదా?
యస్.
ఇది ఒక ఇంటెరాక్టివ్ ప్రోగ్రాం అంటే మీరు మీ శ్రోతలతో మాట్లాడుతుంటారు… వాళ్ళూ, మీరూ మాట్లాడేది ఒక ప్రక్క రికార్డవుతుంటుంది, మరో ప్రక్క సేవ్ కూడా అవుతుంది, రైట్?
యస్.
మరి పెయింటర్ మాటలు కూడా శ్రోతలకు ప్రసారమవ్వాలి కదా?
అవ్వాలి. అవుతుంది.
మరి.. ఆ విచిత్ర ధ్వనులను, మాటలను విన్నాక శ్రోతలెవరూ, అది ఏమిటీ అని ప్రశ్నలు వెయ్యలేదా? మీ స్టేషన్ కి కనీసం ఉత్తరాలైనా రాలేదా?
ఎల్విన్ అవాక్కయ్యాడు. ఒకసారి ఆలోచనలో పడ్డాడు. “నిజమే కదా! ఎవరూ ప్రశ్నించలేదు. ఈ ప్రసారం కేవలం గాలిలో ప్రసారం. ఎవరూ ప్రశ్నించలేదేమిటి? భయంతో ఇలా జరిగిందని ఆనాడు నా ఫ్రెండ్స్ తో చెప్పినప్పుడు కూడా నేను చెబ్బితేనే మొదటిసారిగా వింటున్నట్లుగా విన్నారే తప్పా, తాము కూడా రేడియో నుండి విన్నట్టుగానో లేక ఎవరైనా విని చెప్పుకుంటుంటే విన్నట్టుగానో వాళ్ళు చెప్పలేదు”.. అనుకున్నాడు.
తను స్వగతంలో అనుకున్నదే ఏరన్ కి చెప్పాడు.
అప్పుడు ఏరన్ చాలా చురుగ్గా చెప్పాడు “అంటే పెయింటర్ మాటలు మీకు మాత్రమే వినిపించాయి. మీ శ్రోతలకు కాదు”.
యస్..యస్ అనుకుంటా! ఆశ్చర్యపోతూ ఎల్విన్ వణికాడు. అంటే ఆ ఆత్మ నేనొక్కడినే వుండి.. ప్రోగ్రాం రన్ చేస్తున్నప్పుడు అదృశ్యరూపంలో ఇక్కడే తిరుగుతూ.. నాకు మాత్రమే చెప్పిందన్నమాట..” అన్న వెంటనే ముచ్చెమటలు పోశాయి ఎల్విన్ కు.
ఏరన్ నవ్వి..కాకపోవచ్చు కూడా.. ఎందుకంటే రికార్డింగ్స్ వున్నాయి కదా మీ సాఫ్ట్ వేర్ లోనే రికార్డ్ అయ్యి? అందుకే కదా వాటిని మీరు అనైటాకి ఇవ్వగలిగారు?
దీన్ని బట్టి నాకర్ధమవుతున్నదేమిటంటే..పెయింటర్ మీ ప్రోగ్రాంకి ఒక శ్రోతలాగే కాల్ చేస్తున్నాడు, అందరు మాట్లాడేవి రికార్డ్ అయినట్లే తన మాటలు కూడా రికార్డ్ అవుతున్నవి, కాకపోతే గాలిలో అవి పైకి ప్రసారం కావడం లేదు. అతని ధ్వని గాలిలో ప్రసారం అవ్వకుండా ఏదో ఆపుతుంది వెరసి గాలిలో కలిసిపోయిన పెయింటర్ ఆపుతున్నాడా ???????? . అది ప్రశ్న!
ఎల్విన్ కు మతిపోయింది, తాను కూర్చున్న రూంలో తనకు తెలియకుండానే ఇంత ఫిజిక్సు, కెమిస్ట్రీ నడుస్తున్నదా????
ఒకవేళ నేనే బై మిస్టేక్ మ్యూట్ నొక్కేశానా ప్రోగ్రాం మధ్యలో? అందుకే పెయింటర్ వాయిస్ ని ఎవరూ వినలేదా?..నమ్మలేక నమ్మలేక మళ్ళీ అడిగాడు.
అయితే పెయింటర్ మాట్లాడి ఆగిపోయాక యధావిధిగా ప్రోగ్రాం కంటిన్యూ అయ్యిందా?
యస్.
మళ్ళీ నెక్స్ట్ శ్రోతతో కూడా మాట్లాడాను, అక్కడితో ఆగిపోలేదు”.. అని ఒక కార్యక్రమంలో తరువాతి రికార్డింగ్స్ కూడా
వినిపించాడు. అనైటా మాత్రం డిస్కషన్ లో పాల్గొన లేదు, వింటూ కూర్చున్నది. ఏరన్ ఆమెని అడిగాడు నీ వైపు నుండి ఎల్విన్ కి ఏమైనా ప్రశ్నలు వున్నాయా?
“లేవు”.. ముక్తసరి గా సమాధానమొచ్చింది.
సరే..ఎల్విన్. ఈ రోజు ప్రోగ్రాంని నేనే కండక్ట్ చేస్తాను, చూద్దాం. ఈసారి జాగ్రత్తగా ఆని యాంగిల్స్ లో పరిశీలిద్దాం.
ఎల్విన్ చాలా కుతూహలంగా సరే అన్నాడు.
ఏరన్ మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు. రికార్డింగ్స్, రూంలోని సెట్ అప్ చూస్తుంటే.. పెయింటర్ వీళ్ళ ఫోన్లకి ప్రయివేట్ కాల్స్ చేస్తున్నట్లుగా లేదు. డైరెక్ట్ గానే స్టేషన్ కి శ్రోతలా చేస్తున్నాడు, కాని అది ప్రసారం కావట్లేదు. సరే చూద్దాం ఈ రోజు. అయినా ఎందుకయినా మంచిది, అనైటా ఫోన్ ని మాత్రం స్విట్చ్ ఆఫ్ చేయించాలి.
“అనైటా… ప్రోగ్రాం స్టార్త్ అవ్వడానికి కొద్ది నిముషాలేగా, మన పర్సనల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేద్దాం, ప్రోగ్రాం మధ్యలో వేరే కాల్స్ అటెండ్ చెయ్యలేంకదా, ప్రోగ్రాం డిస్టర్బ్ అవుతుంది”… అని అంటూ తన ఫోన్ ని ఆఫ్ చేసేసి టేబుల్ మీద పెట్టేడు, అలాగే ఎల్విన్ కూడా అక్కడే పెట్టేశాడు. కానీ అనైటా పెట్టలేదు.
“నేను ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను, హడావిడి గా బయలుదేరడంలో”.. అని అంది.
వన్ మూమెంట్.. ఏరన్ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఊహించని సంఘటన. అయినా ఓకె. తను మాత్రం ఇక్కడే వుందిగా… అనుకున్నాడు.
ఎందుకైనా మంచిదని ఎల్విన్ మళ్ళీ ఎలా ఆపరేట్ చెయ్యాలో అడిగి తెలుసుకున్నాడు.
ఏరన్ కి గట్టి నమ్మకం.. అనైటా దగ్గిర ఫోన్ లేదు, అనైటా తమతోనే వుంది. సో.. పెయింటర్ ఇక ఫోన్ చెయ్యలేడు స్టేషన్ కి. తను వేసిన పధకం కరక్టే అయ్యితే.. రెండు విషయాలు కన్ ఫర్మ్ అవుతాయి. ఒకటి అనైటాని పెయింటర్ ఒక మీడియంగా ఉపయోగించుకుంటున్నాడు, రెండవది అనైటాయే అమాండా. అమాండా అనే వేరే వ్యక్తి లేరు. ఈ పెయింటర్ అనైటా ద్వారా చాలా పన్లను చెయ్యాలనుకుంటున్నాడు. అందుకే ఈ అనైటా ద్వారానే మమ్మల్నందరినీ కాంటాక్ట్ చేశాడన్న మాట, ఏదో జరిగింది, అది వెలికి తీయించాలనుకుంటున్నాడు. ఇలా ఏరన్ కి ఎన్నో ఆలోచనలు, ఒక సరళి అయిపోయింది.
***************
ఫోన్ ఇన్ కార్యక్రమం మొదలయ్యింది. ఏరన్ తానే సౌండ్ ఇంజినీరింగ్ చేస్తూ ఆపరేట్ చేస్తున్నాడు జాగ్రత్తగా, ఎక్కడా ఏ లోపం రానీయకుండా. ఎల్విన్ శ్రోతలతో జోకులేస్తూ, మాట్లాడుతూ వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ, మళ్ళీ తన ప్రశ్నలకు వాళ్ళని సమాధానాలు అడుగుతూ ప్రోగ్రాంని ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా సేపయ్యింది అలాగే. ఎంతకీ పెయింటర్ రాలేదు. అనైటా మాత్రం మామూలుగానే వుంది, తాను కూడా మధ్య మధ్యలో ఎల్విన్ తో పాటు శ్రోతలతో అప్పుడప్పుడు మాట్లాడుతూ. అంతా మామాలుగానే వుందనిపించింది. అనైటా ఇక్కడ వుండిపోవడం వల్ల పెయింటర్ కి సోర్స్ ఆఫ్ మీడియం లేక ఇక ప్రోగ్రాం కి కనెక్ట్ అవ్వడు. ఇది ఖచ్చితంగా అనైటా ద్వారానే జరుగుతుంది, నో డౌట్ అని అనుకుంటున్న తరుణంలో….
.
.
.
.
శ్రోతల వైపు నుండి కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆవహించింది. ఎల్విన్..కనెక్షన్ ఎక్కడైనా కట్ అయిందేమో అని చూడ్డం మొదలెట్టాడు. ఏరన్ కూడా అలాగే అనుకున్నాడు, ఒక ప్రక్క తాను జాగ్రత్తగానే ఆపరేట్ చేస్తున్నా!
ఇంతలో… ఏదో తెలియని ద్వని మెల్లగా రావడం మొదలైంది. వెంటనే ముగ్గురూ అలెర్ట్ అయిపోయారు.
ఏరన్ మరింత అలెర్ట్ అయ్యాడు.. తాను మళ్ళీ అన్నీచెక్ చేసుకున్నాడు ఆపరేటింగ్ సిస్టంని అంతా!
ఎక్కడో మూత వేసిన డ్రమ్ములోంచి గాలి ఊళ ప్రయాణించుకొని వీళ్ళదగ్గిరకి వచ్చింది.. మెల్ల మెల్లగా ఆ ఊళ ధ్వని పెద్దదవుతూ వచ్చింది. కాని, మాటలు లేవు. మళ్ళీ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోనుండి.. మాటలు వినబడ్డాయి…
.
ఏరన్… (పెయింటర్ పిలుపు. ఆ పిలుపు ఏదో చివికిపోయిన గొంతులా వుంది)
ఏరన్ .. తన పేరుతో పిలవగానే.. తుళ్లిపడ్డాడు. మిగితా ఇద్దరూ.. ఒకలాగ ఏరన్ ని చూశారు.
ఏరన్ : నేను నీకు తెలుసా? నా పేరు నీకెలా తెలుసు? (మలై భాషలో సంభాషణ సాగింది)
పెయింటర్: తెలుసు. నువ్వు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నావ్. అదీ తెలుసు.
ఏరన్ : నీ స్టోరీ ఏమిటి? ఎందుకు మా వెంట పడుతున్నావ్? అసలు ఎవరు నువ్వు? నీతో ఎవరెవరున్నారు? అసలు నువ్వెక్కడ వున్నావు? అసలు నువ్వెలా మాట్లాడుతున్నావ్?
పెయింటర్: నేను చనిపోయి 30 ఏళ్ళయ్యింది. నాతో పాటు నా స్నేహితులున్నారు. అప్పుడు మాకు 12-13 ఏళ్ళ వయసు.
ఏరన్ : ఊ.. అయితే ఏమయ్యింది.. చెప్పు.. చెప్పు..
మళ్ళీ నిశ్శబ్దం.
ఇంతలో ఊ..ఊ… అనే ఏడుపు మొదలయ్యింది.
వెంటనే ఏరన్: ఎవరది? పెయింటర్ ఎందుకేడుస్తున్నావ్?.. చెప్పు.. నీతో ఇంకెవరెవరున్నారు? నువ్వు మాతో ఎలా మాట్లాడుతున్నావ్? మా నుండి నీకేం కావాలి? చెప్పు.. చెప్పు.
పెయింటర్: నా స్నేహితురాలు అమాండా ఏడుస్తున్నది, నేను కాదు.
ఏరన్ షాక్! అమాండా.. అమాండా.. నీతో వున్నదా?
పెయింటర్: అవును, తానూ నాలాగే చనిపోయింది. కాదు మమ్మల్ని చంపేశారు.
ఏరన్ : ఎవరు చెప్పు. మా నుండి ఏం కావాలి?
పెయింటర్: సహాయం.
ఏరన్ : తప్పకుండా. చెప్పు, ఎవరు చంపారు?
ఈ లోపల.. మళ్ళీ ఏదో టేబుల్ పైనుండి ఒక బరువైన వస్తువుని ఎవరైనా తోసేస్తే అది భళ్ళున క్రింద పడి పగిలి ముక్కలయిపోయినట్లు శబ్దం వచ్చింది, అదే గాలి ఊళ నుండి. దానితో పెయింటర్ చెబుతున్నప్పుడు ఆవరించిన నిశ్శబ్దం మొత్తం చెదిరిపోయింది. పెయింటర్ వెళ్ళిపోయాడు.
కొద్ది క్షణాలు వీళ్ళ మధ్య మౌనం.
వెంటనే ఏరన్ తేరుకుని, అది తాను రికార్డు చేశాడా లేదా, సేవ్ అయ్యిందాలేదా… ముఖ్యంగా గాలిలోకి వెళ్ళి అందరూ వినగలిగారా లేదా అని చూశాడు, చాలా ఆశ్చర్యం ఏమిటంటే..తన చూపుడు వేలు మ్యూట్ బటన్ మీద వుంది. తాను ఎందుకు ఆ బటన్ నొక్కి వుంటాడో అర్ధం కాలేదు. పైగా ఎప్పటికప్పుడు ఆపరేటింగ్ సిస్టంని కనిపెట్టుకున్న ముగ్గురిలో ఏ ఒక్కరూ కనుక్కోలేకపోయారు ఏరన్ ఎలా మ్యూట్ నొక్కాడో. ఇది అసంకల్పిత చర్య!
ఆ మ్యూట్ నొక్కబడడం వల్ల ప్రోగ్రాంకి పెద్ద తేడా రాలేదు, శ్రోతలు డిస్ కనెక్ట్ అయ్యిందనుకున్నారు, ఈ లోపు టైం కూడా అయిపోయింది కాబట్టి పెద్ద వర్రీ ఏర్పడలేదు.
ఏరన్ కి మిగితా ముగ్గురికీ, మింగుడు పడని విషయం.. తానెలా తనకి తెలియకుండానే పెయింటర్ వాయిస్ ని ప్రసారం నుండి ఎడిట్ చేశాడా అని.
ఏరన్ కి పై ప్రశ్నతో పాటు, మరెన్నో ఆలోచనలు అనైటా తమతోనే వుంటుండగా ఎలా పెయింటర్ ఫోన్ చేశాడు. వెంటనే ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఏరన్ కి.
ఎల్విన్.. పెయింటర్ ఏ నెంబర్ నుండి ఫోన్ చేశాడో మనకి ఎక్కడైనా రికార్డ్ అవుతుందా?
అవ్వదు. సారీ… ఎల్విన్ పెదవి విరిచాడు.
ఓకె…
అయితే.. అనైటా ఫోన్ లేకపోయినా ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నాడో, అసలు ఒక ఆత్మ ఫోన్ ఎలా చేస్తున్నదో తెలుసుకోవాలి.. తెలుసుకోవాలి..!!!
నా సహాయం కావాలనుకుంటున్నాడు కాబట్టి రోజూ స్తేషన్ కి వెళ్ళాలి స్టోరీ తెలుసుకోవడానికి.
30 ఏళ్ళక్రితం చనిపోయిన పిల్లల కేసు. దీని వివరాలు పోలీసులకి తెలిసేవుంటుంది. పోలీసు స్టేషన్ లో తెలుసుకోవాలి..అనుకుంటూ ఎన్నో ప్లాన్స్ వేసుకొని ఎల్విన్ తో, అనైటా తో కూడా చెప్పాడు.
సరే అనైటా ఇల్లు వచ్చింది, ఆమెని అక్కడ డ్రాప్ చేసేసి.. తాను వెళ్ళిపోదామనుకున్నాడు. అనైటా కారు దిగింది. ఏరన్ వెంటనె వెళ్ళిపోకుండా.. కార్ లోనే ఒక సిగరెట్ వెలిగించుకుందామని వెలిగించుకుంటూ ఆగాడు.
ఇంతలో లోపలికి వెళ్ళిన అనైటా … కెవ్వు మని అరుస్తూ..ఏరన్ అని గట్టిగా కేక వేసి.. కారు దగ్గిరకి పరిగెత్తుకొని వచ్చింది.
(ఇంకా వుంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *