May 20, 2024

అవధులెరుగని ప్రేమ!

“బియాండ్ లౌ!” అన్న ఈ కథను మొదట ఇంగ్లీషులో రాసినది : శ్రావ్య. జి
తెలుగులోకి స్వేచ్చానువాదం చేసినది : వెంఫటి హేమ

hand-writing1

టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుని పెన్నుల స్టాండు లోంచి ఒక పెన్ను తీసుకుని ఆమె రాయడం మొదలుపెట్టింది. ఆ పెన్నులో సిరా చాలా తక్కువ ఉంది, కాని అది ఆమె చూసుకోలేదు. తన దారిన తాను చకచకా రాసుకుంటూ పోయింది …..
“ఇదిగో, ఇటు చూడు! ఈ లేఖ నేనేం నీ పేరుతో మొదలెట్టడం లేదు, చూశావుగా …. ఎందుకంటే నేను ప్రేమలేఖ అంటూ రాయడం మొదలుపెట్టానంటే అది నీకు తప్ప వేరెవరికీ కాదన్నది, నాకే కాదు – నీకూ బాగా తెలుసు. మళ్ళీ నేను నీకు చెప్పనక్కరలేదు కదూ, ఔనా? ఇంక అలాంటప్పుడు వేరే నీ పేరు రాయడం అవసరమా ప్రియతమా? ఈ ఉత్తరం నువ్వు చదవడం మొదలెట్టగానే ఇది నీకే రాశానన్నది నీకిట్టే తెలిసిపోతుందన్న సంగతి నాకూ బాగానే తెలుసు !
తొలిప్రేమ అట్టేకాలం నిలవదు, ఎంత వేగంగా పుడుతుందో అంత వేగంగానూ మాయమైపోతుంది – అంటారు చాలామంది. తొలి బాంధవ్యానికి తొందరెక్కువ, అది ఇట్టే వచ్చి అట్టే చక్కాపోతుంది అంటారు మరికొందరు! కాని నేనది ఎంత మాత్రమూ ఒప్పుకోను. అలా అనడం చాలా పెద్ద పొరపాటు – నా దృష్టిలో. ఎందుకంటే , నీకూ తెలుసుకదా; శాశ్వతంగా మనిద్దరినీ ఒకటి చేసింది తొలి ప్రేమేనని ! కాని, మనిద్దరిలో మొదట ప్రేమలో పడింది నేనేనన్నది నీకు ఇంతవరకూ తెలియనీయలేదు నేను. దానికి కారణం, నేనది నీ కెప్పుడూ చెప్పకపోడమే! ఇక దాచను, చెప్పేస్తా, విను – నిన్ను తొలిసారి మన కాలేజి కారిడార్లో చూడగానే నాకు, “నువ్వే నావాడివి” అనిపించింది గట్టిగా. అది మొదలు నేను క్షణమైనా విరామం లేకుండా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా …
నిజానికి నాది, “లవ్ ఎట్ ఫస్టు సైట్ ” అన్నమాట! “అలా ఎందుకనిపించింది” అని నువ్వు నిలదీసి అడిగితే నా దగ్గర జవాబు లేదు. కాని ఒకటి మాత్రం చెప్పగలను – అప్పుడు నువ్వు నాకు ఎంతో ఆకర్షనీయంగా, కోరదగిన వ్యక్తివిగా కనిపించావు. ఆ మరుక్షణమే నాకు, “నువ్వే నాకు సర్వస్వం” అనిపించింది. కాని ఆ విషయం నేను వెంటనే ఎవరికీ చెప్పలేదు,.చాలా రోజులు ఆ సంగతిని నా మనసులోనే పదిలంగా దాచుకున్నా. ఆ తరువాత నెమ్మదిగా నాకు తెలిసింది – నేనే కాదు, ఇంకా చాలామంది అమ్మాయిలు కూడా నిన్ను చూసి అలాగే , అంటే- అచ్చం నాలాగే, నీ గురించి అనుకుంటున్నారన్నది! అది తెలియగానే నాకు చాలా భయం వేసింది. అక్కడితో నీపై నేను పెంచుకున్న ఆశ మొత్తం నీరుగారిపోయింది. ఆ తరవాత కొన్నాళ్ళకు నువ్వే దాన్ని పునరుద్ధరించావు అది నువ్వు ఒప్పుకోక తప్పదు!
మనది హైస్కూలు ప్రేమ. అప్పుడు మనం కౌమారప్రాయంలో ఉన్నాము. మన వయసు కాస్త ఇటూ అటూగా పదిహేడో పదహారో ఉండవచ్చు. మనమేం ఆరిందాలంకాము కదా! అలాగని ఏమీ తెలియని పసివాళ్ళమూ కాము. ఎటూకాని వయసది. అందుకే నేను, మనసులో ఎంత ఆశ ఉన్నా, వల్లమాలిన సిగ్గువల్ల , నాకు నేనుగా నిన్ను పలుకరించలేకపోయా. చాలా రోజులవరకు నేను నీకు దూరంగానే ఉండిపోయా. ఆ తరువాత ఎప్పుడో, ఒక మంచి సమయంలో అని చెప్పవచ్చు, మనమిద్దరం తొలిసారి కలుసుకున్నాము.
నేనిప్పుడు నీకో మాట చెప్పాలనుకుంటున్నాను, అది నువ్వు ఒప్పుకోకపోవచ్చు, కాని నేనది నీకు చెప్పక మానను. అదేమిటంటే – వింటున్నావా? అదేమిటంటే, నువ్వు కాదు, నేనే ముందుగా నీ మాయలో పడిపోయానన్నది! ఇది అక్షరాలా నిజం! ఇన్నాళ్ళూ ఇది నీ నుండి దాచా. ఇంక ఇప్పుడు నీకిది చెప్పక మానను. ఎందుకంటే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పాలిట! నువ్వెప్పుడూ అంటూంటావుగా, నువ్వే ముందుగా నన్ను ప్రేమించావని ; అది ఎంతమాత్రం నిజం కాదని ఇప్పుడైనా నీకు తెలియాలి కదా! నేను నీలా మీనమేషాలు లెక్కింఛి మరీ ప్రేమించలేదు, నువ్వు నా కంటపడ్డ మరుక్షణంలోనే నేను నిన్ను ప్రేమించేశా . ప్రేమ విషయానికి వస్తే, నూటికి నూరుపాళ్ళూ విజేతని నేనే! తొలి చూపులోనే నాకు నీపైన ప్రేమ పుట్టింది, తలమునకలుగా! కాని నేనది ఎవరికీ చెప్పలేదు, నీకు కూడా! అప్పట్లో సిగ్గుతో నాలోనే దాచుకున్నా. ఆ తరవాత నీ ఉబలాటం చూసి చెప్పి “కిల్ జాయ్ “ని కావాలనుకోలేదు. .
చాలారోజుల తరవాత ఒకరోజు కాలేజీలో ఉండగా నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచావు, నన్ను నీతో సరదాగా షికారుకి రమ్మని అడిగావు -.అది నీకూ జ్ఞాపకం ఉండే ఉంటుంది. అదే తొలిసారి నువ్వు నన్ను పలకరించడం. ఆ వేసవిలోనే నాకు పదహారేళ్ళు వచ్చాయి. నా మనసంతా నీమీది వలపు తొణికిసలాడుతోందేమో మితిమీరిన సంతోషంతో అప్పటికప్పుడు ఆనంద నృత్యం చెయ్యాలన్న ఉత్సుకత పుట్టింది నా మనసులో. ప్రేమ భావనతో నా ఒళ్ళు పులకించి పోయింది. నువ్వు నావైపు చూస్తూ చిరునవ్వు నవ్వినప్పుడు, పలకరింపుగా చెయ్యి ఊపినప్పుడు నేను నా ప్రేమలో నిలువునా కరిగిపోయేదాన్ని. కాని నా ప్రేమని నీ ఎదుట వ్యక్తం చెయ్యడానికి మొహమాటంగా ఉండేది. అందుకని నా మనోభావనలని లోలోపలే అణిచి ఉంచి, ఏమీ ఎరగనట్లుగా అమాయికత్వాన్ని నటించేదాన్ని. అలా నటించడం ఎంత కష్టమయ్యేదో చెప్పలేను. అయినా సరే!.అది గ్రహించిన నా స్నేహితురాళ్ళు నన్ను చివాట్లు పెట్టేవారు.”నువ్వు చాలా తెలివితక్కువగా ప్రవర్తిస్తున్నావు” అనేవారు. “నువ్విలా సిగ్గుతో అతన్ని తప్పించుకుని తిరుగుతుంటే చివరకు అతడు నీకు పరాయివాడిగానే మిగిలిపోతాడు. అంతేకాదు, అతనితో కలిసి మసలకపోతే అతని గురించి నీకెలా తెలుస్తుంది” అంటూ హెచ్చరికలు చెప్పేవారు. .
కాని, నిన్నుగురించి నాకు తెలియకపోవడమా! అది ఎలా సంభవం? సంవత్సరంలోని 360 రోజులూ నిన్నూ, నువ్వు చేసే ప్రతిపనినీ అనుక్షణం గమనిస్తూనే ఉండేదాన్ని నేను ; అది నీకు తెలుసునో తెలియదో మరి! నిన్నుగురించి నాకు బాగా తెలుసు – మధ్యాహ్న భోజన సమయంలో నువ్వు అందరితో కలిసివాడివి కావు. నీ ప్రియ మిత్రులిద్దరిని వెంట తీసుకుని స్కూల్ వెనకవైపుకి వెళ్ళిపోయి, అక్కడ లాన్లో కూర్చుని వాళ్ళతో కలిసి లంచ్ తినేవాడివి. ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయి! రాగిరంగు జుట్టుతో ఎత్తరిగా మగరాయుడిలా ఉండేది. అబ్బాయి నల్లని ఫ్రేం ఉన్న దడసరి కళ్ళద్దాలు పెట్టుకుని ఉండేవాడు. చూడగానే అతడు వట్టి “పుస్తకాల పురు” గని యిట్టే తెలిసిపోతుంది. బొత్తిగా మిగతా ప్రపంచంలోని ఎవరితోనూ ఏ సంబంధం లేనట్లు మీ ముగ్గురే మీ లోకమైనట్లు, మీ ముగ్గురూ కలిసిమెలిసి తిరిగేవారు. మిగిలినవాళ్ళు మిమ్మల్ని గురించి, మీరు మొరటు వాళ్ళనీ, పొగరుబోతులనీ చెప్పుకునీవారు. ఏ చిన్న వంక దొరికినా మిమ్మల్ని ఎదో ఒక పొల్లు మాట అనకుండా విడిచిపెట్టేవారు కాదు.
నాకు మాత్రం అది నచ్చేది. కాదు. నాకు నీ మిత్రులను గురించి ఏమీ తెలియకపోయినా, నువ్వలా నీకు నచ్సినవాళ్ళకి ప్రాధాన్యతనిచ్చి, వెంట తిప్పుకుంటూ, వాళ్ళతో మాత్రమే కలిసి అలా ప్రశాంతంగా తిని తిరగడమన్నది నాకు నచ్చేది.
నీ వెంట తిరిగే ఆ అమ్మాయి, తక్కిన వాళ్ళతో కలివిడిగా ఉండే రకంకాదన్న సంగతి ఆ అమ్మాయిని చూస్తే చాలు ఇట్టే తెలిసిపోతుంది. క్లాసులో ఒక మూలగా, మౌనంగా తనని తానే ఓదార్చుకుంటున్న దానిలా, ఎవరినీ పలకరించి మాట్లాడకుండా కూర్చుని ఉండేది, పాపం! ఆమెను నువ్వు స్నేహితురాలిగా చేసుకుని నీవెంట ఉంచుకోడం చూశాక నాకు నీమీదున్న ప్రేమ మరీ పెరిగింది.. ఇక నీ వెంట ఉండే అబ్బాయి విషయానికి వస్తే – అంతా అతన్నొక విచిత్ర జీవి అన్నట్లుగా చూసేవారు, నేనొక్కదాన్నీ తప్ప! అతడంటే నాకు ఇష్టం ఉండేది. అది ఎందుకో తెలుసా ? అతడు నీ స్నేహితుడని! నువ్వేకాదు, నీకు సంబంధించినవి ఏవైనాసరే – అవి నాకు ఇష్టమౌతాయి. నువ్వంటే నాకంత ప్రేమ. ఎందుకంటే, నువ్వు అందరు అబ్బాయిల్లాంటివాడివి కావు కనక!.
నాకు 16 ఏళ్ళు నిండిన పుట్టినరోజునాడు నేను స్నేహితులనందరినీ పిలిచి ఇంటిదగ్గరే పార్టీ ఇచ్చాను. ఆ పార్టీకి నువ్వూ వచ్చావు, ఒక చిన్న గిఫ్టు పెట్టె చేత్తో పట్టుకుని. నేను నెమ్మదిగా ఎవరూ చూడకుండా ఉన్నప్పుడు ఆ పెట్టెను తీసి వేరేగా దాచేశాను, ఎవరూ లేనప్పుడు నేను మాత్రమే ప్రత్యేకంగా దాన్ని విప్పి చూడాలనే కోరికతో. అదేదో పెద్ద ఖరీదైన బహుమానం కావాలన్న ఆశ కాదు నాది,. అది ఎంత చిన్నదైనా కూడా, దాన్ని నాకు అత్యంత ప్రియమైన నువ్విచ్చావు కనక నాకది అముల్యమైనదే. కాని, నువ్వు అపార్థం చేసుకున్నావు.
ఫ్రెండ్సు ముందు వచ్చిన బహుమతులను విప్పి చూస్తున్నప్పుడు, వాటి మధ్య నువ్విచ్చిన గిఫ్టు బాక్సు కనిపించకపోడంతో నువ్వు హర్టయ్యావు. అందరూ వెళ్ళిపోయినా నువ్వు మాత్రం వెళ్ళకుండా ఉండిపోయావు. నాకు దగ్గరగా వచ్చి నా చెవిలో, రహస్యంలా లోగొంతుతో అడిగావు, “నేనిచ్చిన గిఫ్టు ఏదీ? విప్పి చూడలేదు ఎందుకనీ?”
నువ్వు ఉండిపోడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. కాని నువ్వు నావల్ల చిన్నబుచ్చుకోడం అన్నది నేను ఎంత మాత్రం ఊహించలేనిది కావడంతో, నీకు ఏమని జవాబు చెప్పాలో తోచక అవాక్కై ఉండిపోయా. .
నాకు అంత దగ్గరగా నువ్వు రావడం అదే మొదటిసారి కావడం వల్ల నాకు అదాటుగా సిగ్గు ముంచుకొచ్చింది. నోట మాట రావడం కష్టమయ్యింది. తలవంచుకుని, నీవైపు ఓరగా చూస్తూ ఎట్టకేలకు నెమ్మదిగా చెప్పాను, ” అది నాకెంతో ప్రియమైనది కనక, దాన్ని నేనొక్కదాన్నే ఉన్నప్పుడు విప్పి చూడాలని ప్రత్యేకంగా దాచి ఉంచాను” అన్నా.
అలా అంటూనే డ్రాయర్ లోంచి ఆ పెట్టెను బయటికి తీసి నీకు చూపించా – జ్ఞాపకముందా?.
“ఇప్పుడు మనం ఒంటరిగానే ఉన్నాం కదా, పెట్టె తెరు” అన్నావు, నావైపు చిరునవ్వుతో చూస్తూ.
నాకూ నవ్వు వచ్చింది. “ఔను! ఇప్పుడు ఇక్కడ మనం ఒక్కళ్ళమే ఉన్నాము” అన్నా. నువ్వు పెద్దగా నవ్వావు. ఆ తరవాత మనమిద్దరం కలిసి ఆ పెట్టెని తెరిచాము. దానిలో ముద్దులు మూటకట్టే చిన్న టెడ్డీ బేర్ బొమ్మ ఉంది. దాని పక్కన ఒక కాగితం మడత కూడా ఉంది. దానిని చేతిలోకి తీసుకుని మడత విప్పి చదివా. నువ్వు ఏమీ ఎరగనట్లు నటిస్తూ, ఏటో చూస్తూ నిలబడ్డావు. నేను దాన్ని విప్పి చదివా, దానిమీద, ” సరదాగా సినిమాకు వెడదాం, వస్తావా?”. అన్న ఒక్క పంక్తి మాత్రమే నీ చేతి రాతతో రాసివుంది, అంతే …
నా కళ్ళను నేనే నమ్మలేకపోయా, అది నిజమేనా అని ఆశ్చర్యపోయా . నన్నాట పట్టించడానికి నువ్వలా రాశావనిపించి తలెత్తి సందిగ్ధంగా నీవైపు చూశా … నువ్వు బుజాలు ఎగరవేసి అందంగా నవ్వావు. ఆ పై, కొంటెగా నావైపు చూస్తూ “నాతో వస్తావు కదూ” అన్నావు. అది చాలు నేను సంతోషంతో మైమరచిపోడానికి! ఇక ఆ రోజు మొదలు మనం వెనక్కి తిరిగి చూసింది లేదు. కలిసి మెలసి తిరిగేవాళ్ళం, నీకు గుర్తుంది కదూ!
పార్కులలో, బీచ్ లో – ఎ క్కడ కూర్చున్నా మనం, మనిద్దరిలో ఎవర్ని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు – అన్న విషయం మీద వాదించుకునీ వాళ్ళం. కొంత సేపు వాదించి నేను నెమ్మదిగా వెనక్కి తగ్గేదాన్ని. ఎప్పుడూ నువ్వే నెగ్గేవాడివి మన వాదనలలో… విజయగర్వంతో మెరిసేవి నీ కళ్ళు. అది చూడ్డం నాకు ఎంతో ఇష్టంగా ఉండేది. ప్రేమ గొప్పదే, కాదనను. ప్రేమించడమూ గొప్పదే గాని, ప్రేమించబడడం మరీ గొప్పది. అందుకే నేను కావాలని ఓడిపోయీదాన్ని ఎప్పుడూ. ఇన్నాళ్ళు నీనుండి దాచా ఈ సంగతి, నన్ను క్షమించు. క్షమిస్తావు కదూ? ఇది తప్పించి నేను నీనుండి దాచిన రహస్యాలు మరేవీ లేవు. అలాంటప్పుడు ఇదిమాత్రం ఎందుకు మిగిలి ఉండాలి – అనిపించింది. అందుకే ఇప్పుడు నీకిది చెప్పేస్తున్నా.
“ఇదిగో , నేనే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా, కావాలంటే నువ్వు నా ఫ్రెండ్సుని అడుగు” అనే వాడివి నువ్వు ఎప్పుడూ!
నేను చిన్నగా నవ్వి ఊరుకునీదాన్ని . కాని లోలోపల , ” నో! అది నిజంకాదు, నేనే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, కావాలంటే నువ్వు నా మనసుని అడుగు” అనుకునీదాన్ని.
నీకు ఫ్రెండ్సని ఎక్కువమంది లేరు, నటాషా, జాక్ – ఈ ఇద్దరే ఫ్రెండ్సు! నిన్ను బట్టి వాళ్ళు నాకూ ఫ్రెండ్సు అయ్యారు. ఆ తరువాత లంచ్ మనం నలుగురం కలిసి లాన్లో కూర్చుని తినేవాళ్ళం. మొదట్లో అది చూసి నా స్నేహితురాళ్ళు బాగా
విస్తుపోయారు. అది వాళ్ళు ఊహించని విషయం. అప్పట్లో నేనూ మన స్నేహం ఇలా కలకాలం నిలిచి ఉంటుందని ఎంత మాత్రం అనుకోలేకపోయా. మనమిద్దరం అప్పటికింకా చిన్నపిల్లలక్రిందే లెక్క! అభం శుభం తెలియని వయసది! ఒకపక్క ఈ బంధం శాశ్వతం కాదని అనుకుంటూనే ఇది కలకాలం నిలిచి ఉండాలని కోరుకునేదాన్ని, తెలుసా? నా కోరిక తీరింది బ్రహ్మాండంగా!. ఇప్పటిదాకా మనమలాగే కలిసి ఉన్నాము, ఎప్పటికీ ఇలాగే కలిసే ఉంటాము !
నువ్వు నాకు “ప్రపోజ్” చేసిననాటి సంఘటనలు నాకు ఇప్పటికీ వివరంగా గుర్తున్నాయి. నా జీవితంలో అది చాలా అందమైన రోజు. అప్పటికి మన వయసు ఇరవయ్యోపడిలో పడింది. అంటే యుక్తవయస్కుల మయ్యామన్నమాట! పెళ్ళంటే ఏమిటో, దానిలోని సులువు బలువులేమిటో చక్కగా అర్థమయ్యింది మనకు. వివాహానికి తగిన వయసది.
ఆ రోజు నీ చేతిని నా చేత్తో చుట్టి పట్టుకున్నాను. ఆకుపచ్చ రంగులో ఉన్న పలుచటి నా వేసవి దుస్తులు గాలికి అందంగా నృత్యం చేస్తున్నాయి. నువ్వు, నీ బ్లూ షర్టు కాలర్ని సవరించుకుంటూ ఇబ్బంది పడుతున్నావు. అది బిగుతుగా నీ మెడని అంటిపెట్టుకుని ఉండి నిన్ను బాగా చికాకు పెడుతోంది. అయినా, అది తొడుక్కున్నావు. కారణం – అది నేను నీకు నీ పుట్టినరోజు కానుకగా ఇచ్చిన షర్టు కావడం! ఆ రోజు నువ్వదే తొడుక్కున్నావు నా సంతోషం కోసం. అది నీ కొలతలకంటే కొద్దిగా చిన్నది. అది మార్చి, అంతకంటే పై సైజుది మరోటి తీసుకుందామన్నా నువ్వు ఒప్పుకోలేదు. అది నీకోసం నేను తొలిసారిగా ఏరి కోరి కొన్న షర్టు కనుక దాన్నే వాడుకుంటానంటూ నువ్వు దానిని విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. పట్టుదలగా దాన్నే వాడుకోడం మొదలుపెట్టావు. కాని, నువ్వా షర్టులో కనిపించినప్పుడల్లా నా మనసు అపరాధభావంతో మూలిగేది. కాని, నీకిది తెలియదు.
రోజులాగే ఆ రోజూ మనం మన ఉద్యోగాలు – అంటే రాబోయే ఉద్యోగాలు, గురించి, తరవాత చెయ్యబోయే మంచి పనులు గురించి మాట్లాడుకుంటున్నాము క్రమంగా మనమాటలు దారి మారి, భవిష్యత్తులో మనం గడపబోయే సొగసైన జీవితం వైపుకి మళ్ళాయి. ఎందుకనో, మధ్యలో నువ్వు మాటలు ఆపేశావు. అంతకు కొంచెం ముందుగానే నాకు నీలో ఏదో అలజడి కనిపించింది. నువ్వు చిరునవ్వులు ఒలకబోస్తూ, తల ఉపుకుంటూ నా మాటలు వింటున్నట్లు నటిస్తున్నావే గాని, ఒక్కటి కూడా నీ మనసుకి ఎక్కడం లేదేమో అనిపించింది నాకు. హఠాత్తుగా నువ్వు నాకు ఎదురుగా, అభ్యర్ధిస్తున్నవాడిలా మోకాలిమీద కూర్చున్నప్పుడు నాకు తెలిసింది నీలో అంత అలజడి ఎందుకో …
ఇంక కంగారుపడడం నా వంతయ్యింది. అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశా. తరవాత భయపడ్డా, ఆ అసంకల్పిత చర్యవల్ల నేను నీతో పెళ్ళికి ఇష్టపడటంలేదు – అనుకుంటావేమోనని కంగారుపడ్డా. నీకైతే మొహమంతా చెమటలు పట్టేశాయి. నీ ఊపిరి వేగం పెరిగింది. తీర్చిదిద్దినట్లుండే నీ అందమైన ముఖం మీద, మనసులోని మాట తేలికగా పైకి చెప్పలేక నువ్వు పడుతున్న ఇబ్బంది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ఎట్టకేలకు గొంతు పెకలించుకుని “లూసీ” అంటూ నా పేరు పలకగలిగావు. అంతలో పట్టినట్లైంది కాబోలు, గొంతు సవరించుకున్నావు, గుర్తుందా? ఆ తరవాత దడదడా చెప్పేశావు, ” లూసీ! చుట్టూ ఎంతమంది అమ్మాయిలు తిరుగుతున్నా నేను మాత్రం ఎప్పుడూ నువ్వే నాదానివి కావాలని కోరుకున్నాను. స్కూలులో ప్రతిరోజూ నిన్ను చూస్తూండగా ఒకనాడు అనిపించింది, నువ్వు నాకోసం పుట్టినదానివని! కాని అప్పట్లో నాతో కలిసి సరదాగా తిరగడానికి నిన్ను రమ్మని పిలవాలన్నా ధైర్యం చాలేదికాదు. ఆ నా భయం తగ్గడానికి ఒక సంవత్సరం పైనే పట్టింది. అప్పటికే నాది సరైన నిర్ణయమని నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. నేనిప్పుడు నిన్ను నాదానివి కమ్మని అర్ధిస్తున్నాను. నా మాటలు పేలవంగా ఉన్నా, మన్నించి నన్ను పెళ్ళి చేసుకుని, నాలోని లోపాలు చక్కదిద్దుకుని నాకొక చక్కని జీవితాన్ని ఇవ్వవా” అంటూ చెయ్యి చాపి అడిగావు.
నా కళ్ళనిండా ఆనందభాష్పాలు! ఆ కన్నీటి పొరల చాటునుండి నీ వైపు చూసి ఆనందంతో చిరునవ్వు నవ్వాను. వెంటనే నేను కూడా మోకాళ్ళమీద కూర్చుని నిన్ను గాఢంగా కౌగిలించుకున్నాను. కొంతసేపటి తరువాత,” నావి రెండు ప్రశ్నలున్నాయి” అన్నా. నువ్వు, నేనేమడుగుతానోనన్న భయంతో నువ్వు మొహం దిగులుగా పెట్టుకున్నా, నేను మాత్రం నా ప్రశ్నల్ని అడగడం మానలేదు…
“నువ్వు నతాషాని, జాక్ ని మాత్రమే స్నేహితులుగా చేసుకున్నావు, ఎందుకని?” ఇది నా తొలి ప్రశ్న.
నువ్వు తబ్బిబ్బు పడ్డావు . జవాబు చెప్పడానికి ఆలస్యం చేశావు. చివరకు చిన్నగా నవ్వి అన్నావు, “వాళ్ళు నన్ను నన్నుగా అభిమానిస్తారు. మంచి మిత్రులు , వాళ్ళకి నమ్మక ద్రోహం చెయ్యడం ఎంతమాత్రం తెలియదు.”
నీ మాటల్ని నేను సరిగానే అర్థం చేసుకున్నాను. నీ చిన్నతనంలో నీ తల్లిదండ్రులు విడిపోడం, దానివల్ల నువ్వు అనుభవించిన క్షోభ వీటిగురించి నేను విన్నాను. అందువల్లనే బహుశః, నీకు మనుష్యులపైన నమ్మకం పోయి ఉంటుంది – అనుకున్నా. తిరిగి నీకా నమ్మకం పుట్టించగల వ్యక్తి తోడు నీకు ఎంత అవసరమో నాకు అర్థమయ్యింది. అలా జరిగితే నువ్వొక మంచి భర్తవౌతావని నాకు అర్థమైపోయింది.
“ఇక నీ రెండవ ప్రశ్న?” అందమైన వజ్రపుటుంగరాన్ని పైకి తీస్తూ అడిగావు.
“నన్ను నీ జీవితభాగాస్వామినిగా ఎంచుకున్నావు ఎందుకని?” ఇది నా రెండవ ప్రశ్న .
“ఎందుకంటే ” అంటూ నువ్వు నా ముక్కుకొస మీటి అన్నావు, ” ఇంతవరకు నాకు కనిపించిన అమ్మాయిలందరిలోకి నువ్వే నాకు ఎక్కువ నచ్చావు. బాహ్య సౌందర్యముతోపాటుగా నీకు మానసిక సౌందర్యం కూడా ఉంది. అంతేకాదు, నువ్వు నా మిత్రులను గురించి అడిగి తెలుసుకున్నావు చూడు – అది నాకు మరీ నచ్చింది. ఇలా అడిగిన మొదటి అమ్మాయివి నువ్వే ఐవుంటావు. నాకు చాలా సంతోషంగా ఉంది”
“అలాగా!”
అంతలో కిలకిల నవ్వులు వినిపించాయి. నేనేమంటానో తెలుసుకోడానికి చెట్లచాటున నక్కి ఉన్న జాక్, నటాషా సంతోషంగా నవ్వుకుంటూ అక్కడినుంచి పారిపోయారు.
* * *
నటాషా జుట్టు బాగా పొడుగ్గా పెంచుకుంది. ఆ జుట్టు చాటున ఆమె సన్నని నడుము, చక్కని ఓంటితీరూ దాగి ఉండి బయటికి కనిపించేవి కావు. ఆమె అందం సూర్యుని కాంతిలా తీక్షణమైనది. అలాగే ఎవరి చేతికీ దొరకనిది.
నా విషయానికి వస్తే – నాది నల్లని జుట్టు, చిన్నకళ్ళు …. అద్దంలోని నా ప్రతిబింబం నాకే అంతగా నచ్చేది కాదు. నా వైపు చూసినంత ప్రేమగా ఇంకే వైపుకీ చూసేవాడివి కావు. అది నాకు ఎంతో విడ్డూరంగా అనిపించేది, తెలుసా?
జాక్ కూడా పెద్దవాడయ్యాక హాండ్సంగా తయారయ్యాడు. స్టైల్ పెరిగింది . కండలు కూడా బాగా పెంచాడు. చాలా బాగున్నాడనిపించింది.
నేనిప్పుడు చెపుతున్నది శ్రద్ధగా విను …. ఆ రోజు, అదే — నువ్వు నాకు ప్రపోజ్ చేసినరోజు… నీకు గుర్తుందా ? ఆ రోజు నువ్వు నా ప్రశ్నలకు జవాబు చెప్పలేక తబ్బిబ్బయినా, సరిగా ప్రపోజ్ చెయ్యడం చేతకాక తికమకపడినా, ఏదెంత పాడుగా జరిగినా కూడా నేను నా సమ్మతినే నీకు తెలియజేసి ఉండేదాన్ని- తెలిసిందా? ఎందుకంటే …. నువ్వు ప్రేమించినంత గొప్పగా ఇంకెవరూ నన్ను ప్రేమించలేరని అప్పటికే నాకు తెలుసు కనుక!
మన పెళ్ళికి ముందురోజున నువ్వు – జాక్ తో, నటాషాతో నీకున్న స్నేహబంధం ఇకముందు సాగదేమోనన్న నీ భయం గురించి నాతో చెప్పావు. నీ కంగారు నాకు అర్ధమయ్యింది. అందుకే, నీ సందేహం తీర్చడానికి, అలాంటి భయాలకు మన జీవితంలో తావు లేదని నొక్కి చెప్పి నేను నీ భయాన్ని పోగొట్టాను, గుర్తుందికదూ ! నేను మాటతప్పే మనిషిని కాను, ఏమాత్రం భయపడకు. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ అంతే!
ఆ తరవాత కొన్నాళ్ళకి నీకు మరో భయం పుట్టింది, “మనలాగే జాక్, నటాషా కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే మనం మొత్తం ఆరుగురం ఔతాము కదా! అప్పుడు ఆ వచ్చినవాళ్ళు నీలా మన స్నేహాన్ని సరిగా ఆర్థం చేసుకోలేకపోతే? అప్పుడు మనమేం చెయ్యాలి” అని అడిగావు నన్ను బిక్కమొగం పెట్టుకుని. .
ఏం చెప్పడానికీ నాకు తోచలేదు. కాని, నీకు ఓదార్పునివ్వాలని, నీ చెయ్యి పట్టుకుని, ” ముందు పెళ్లి జరగనియ్యి, ఆ తరవాత ఏదో ఒక మార్గం దొరక్కపోదులే. మన స్నేహం మాత్రం తెగిపోదు ఎప్పటికీ, నామాట నమ్ము” అన్నాను. నా మాటలు నీకు సంతోషాన్నిచ్చాయి.
నీ చేతిలో ఉన్న నా చెయ్యి ఒత్తి పట్టుకుని నవ్వావు. అప్పటికి మనకింకా తెలియలేదు గాని, మరి కొద్దిరోజులు గడిచేసరికి వాళ్ళిద్దరూ తమ జీవిత సాఫల్యాన్ని ఒకరిలో ఒకరు కనుగొన గలిగారు. కాబోలు, జాక్, నటాషాలు పెళ్లి చేసుకున్నారు.
ఆ రోజు తీరికూచుని నువ్వొక పాడుమాటన్నావు, “వీళ్ళ పెళ్లి జరిగేవరకు నా కప్పుడూ భయమేసేది, నువ్వు నన్ను వదలి జాక్ తో వెళ్ళిపోతావేమోనని; ఇప్పుడింక నా బెంగ తీరింది” అని.
ఆ మాటకి నాకు కోపం రాలేదు, నవ్వొచ్చింది! కాని నవ్వాపుకున్నా. అది నువ్వు నిజంగా అన్న మాట కాదనీ, నన్ను ఆటపట్టించడానికే నువ్వలా అన్నావని నాకు తెలుసు. అందుకే వెంటనే మాటకి మాట అందించాలని, సీరియస్నెస్
నటిస్తూ, గుండెలమీద చెయ్యేసుకుని, “ఓ! డియర్! సరిగ్గా నాకూ అలాంటి అనుమానమే ఉండేది, నువ్వెక్కడ నన్నొదిలి నటాషాని లేపుకుని పారిపోతావోనని నాకు ఎప్పుడూ భయమేసేది. ఇప్పుడింక నా భయం తీరింది, అమ్మయ్య” అన్నా. .
నా సీరియస్ నెస్ చూసి నేను నిజంగానే అన్నాననుకుని నువ్వు కంగారుపడ్డావు. “లేదు,లేదు … ఊరికే అన్నా, తమాషాకి. నీ సంగతి నాకు తెలుసు. ఇక నా విషయమంటావా – నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, అటువంటి ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు” అంటూ పడుకుని ఉన్నవాడివి అదాటుగా మోచేతిమీద లేచావు. నీ ముఖంలోని ఆదుర్దా చూస్తూంటే నా మనసులోని నవ్వంతా ఆవిరైపోయింది. అలా మాటాడినందుకు లోలోన పశ్చాత్తాపపడ్డా .
నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూ మరోమాట అన్నావు, “లూసీ! నామాట నమ్ము! మృత్యువు తప్ప మనల్ని మరెవరూ విడదీయలేరు!”
నాకు ఇప్పుడనిపిస్తోంది, ఆ మాట నీ నోట రాకుండా ఉంటే ఎంతబాగుండేది – అని!
. నేనిప్పుడు ఇక్కడ కూర్చుని ఈ ఉత్తరం రాస్తూ అనుకుంటున్నాను. నువ్వసలు ఈ లేఖని చదవగలవా – అని! చదవగలిగితే, కాగితం మడత విప్పగానే నీకు తెలుస్తుంది, ఇందులో కన్నీట తడవని అక్షరం ఒక్కటి కూడా లేదన్న సంగతి. నేను అప్పుడూ, ఇప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, అంతేకాదు, ఇకపైన కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, ఓ నా ప్రియసఖా ! ఆ రాత్రి నువ్వన్నది సరికాదు, మనల్ని వేరుచేసే శక్తి మృత్యువుకు కూడా లేదు! ఇది నిజం ! నమ్మాలి నువ్వు.

ఎప్పటికీ నీదే ఐన నీ లూసీ…

లూసీ రాయడం పూర్తిచేసి, ఫుల్ స్టాప్ పెట్టేసరికి సరిగా కలంలో సిరా పూర్తిగా ఖర్చై పోయింది. కలంలోని సిరా ఐపోయింది గాని, లూసీ హృదయమంతా నిండి ఉన్న ప్రేమ మాత్రం తరగలేదు. ఆ ఉత్తరాన్ని తీరుగా మడిచి పట్టుకుని డెస్కు ముందునుండి లేచి అద్దం దగ్గరకు నడిచింది ఆమె. నెరిసి తెల్లబడ్డ జుట్టు సర్దుకుని, కళ్ళు తుడుచుకుని, భర్త పడుకునివున్న గదిలోకి నడిచింది.
భర్త మంచం మీద అతని పక్కన కూర్చుని, చెదిరి మొహమంతా వ్యాపించి వున్న అతని జుట్టుని సవరిస్తూ, పెరిగిన వయసు అతనిలో తెచ్చిన మార్పులు చూసి, బాధపడింది లూసీ. ఆమె కళ్ళు తిరిగి కన్నీటి చెలమలయ్యాయి. అతని చేయి అందుకుని తనురాసిన ప్రేమలేఖని అతని అరచేతిలో ఉంచింది ఆమె.
“ఈ ఉత్తరమే నేననుకుని నీ వెంట దీన్ని తీసుకెళ్ళు” అంటూ అతన్ని ముద్దుపెట్టుకుని అతని ముఖాన్ని కన్నీట తడిపింది.
చాలా రోజులనుండి అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వారం నుండి అతనిలో ఏ కదలికా లేదు. కాని, ఆమె తను రాసిన ఉత్తరం అతని చేతిలో ఉంచగానే అతని చేతివేళ్ళు దానిచుట్టూ బిగుసుకున్నాయి. మరికొద్ది సేపట్లో తన చేతిని చుట్టివున్న అతని చేతివేళ్ళ స్పర్స ఆమెకు తెలియజేసింది, అతనింక లేడన్నది! అతని శ్వాస ఆగిపోయింది గాని అతడా ఉత్తరాన్ని మాత్రం విడవలేదు. నిర్జీవమైన అతని చేతివేళ్లు ఆ ఉత్తరాన్ని చుట్టి పట్టుకునే ఉన్నాయి.
తన వేలినున్న పెళ్లి ఉంగరాన్ని తడుముకుంటూ లూసీ అనుకుంది, “మహా ఐతే ఇకపై మరో రెండుమూడేళ్ళు నేను బ్రతికి ఉంటాను. ఆపైన నా వంతు కూడా వస్తుంది. నువ్వు నా వెంట నుంటే యుగాలైనా క్షనాలనిపించేవి. ఇప్పుడింక నాకు రోజు గడవడం కష్టమే ఔతుంది! ఇకనుండి నన్ను క్షణాలు యుగాలై పీడిస్తాయి కాబోలు” అనుకుంది దుఃఖంతో.
అంతలో ఆమె వెనుకనున్న తలుపు భడాలున తెరుచుకుంది. వెనక్కి తిరిగి చూడకుండానే, వచ్సినది జాక్, నటాషాలన్నది తెలిసిపోయింది లూసీకి. వాళ్ళు ముగ్గురూ ఒకరినొకరు కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చారు. వాళ్ళ ముగ్గురికీ తెలుసు, ఈ స్నేహం కూడా లూసీ హృదయంలోని ప్రేమలాగే శాశ్వతమైనదని! . .
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *