May 20, 2024

ఓ అబ్బాయి పెళ్లి కథ .!! (తరాలు – అంతరాలు)

రచన: సమ్మెట ఉమాదేవి

“వివాహమన్నది మధ్యలో ఆరంభమయిన ప్రయాణమే అయినా చివరి వరకు సాగేదే ఆ యానం. అలా మనతో కలసి నడవడానికి ఎక్కడో ఎవరో మనకోసం పుట్టే ఉంటారన్న భావనే అద్భుతంగా ఉంటుంది కదూ..” సందీప్ అన్నాడు.
“అవును ఒక నిర్ణయం మన జీవితాలను మార్చేస్తుందిస్తుంది కదూ.” నాటక ఫక్కీలో అన్నాడు మనోజ్. సందీప్ మనోజ్ బీ టెక్ నుండి మంచి మిత్రులు ఇపుడు రూమ్మేట్స్ కూడా
“రేపు అమ్మా నాన్నా వస్తున్నారు మనోజ్ . ఏవో సంబంధాలు ఉన్నాయట. నువ్వు కూడా ఉండాలి సుమా ..
“ఓ.. తప్పకుండా .. మై హూనా.. ”
“మొగవాడినన్న బింకం చూపించడమే గాని ఈ పెళ్లి చూపులు ఇదీ మనకు ఎంత మొహమాటంగా ఉంటాయో కదూ. నీకు ఆ సమస్య లేదు మీ మరదలు ఉంది కదా “..
“అవును కాని ఎందుకో నా కోసం ఆమో, ఆమె కోసం నేనో అన్న భావన కలగడం లేదురా శాలినిని చూస్తుంటే.. వేరే సంభంధం చూడమని అమ్మకు చె ప్పేసాను..”
“అదేంటి మనోజ్ నువ్వు ఆ అమ్మాయిని కాదంటే మీ అత్తయ్యా, మామయ్య బాధ పడరా..”
” లేదు సందీప్ నేను తనను కాదనడం కాదు. తానే నన్ను వద్దనుకుంటుంది ..”
“నువ్వేమి బాధపడకు మనోజ్ ..”
“తన గురించి నేనేమి ఆశలు పెంచుకోలేదు కాబట్టి నాకు పెద్దగా బాధ లేదు. కాని.. ఈ సందర్భంగా అమ్మాయిల అభిరుచులు అలవాట్లు ఎలా మారిపోతున్నాయో అన్నది నాకు బాగా అర్ధమౌతున్నది..” అనుకున్నాడు మనసులో
*** *** ***
మర్నాడు ఉదయమే అమ్మ నాన్నాల కోసం సందీప్ స్టేషన్ కి, కాస్త పని ఉండి బాంక్ కి మనోజ్ బయలు దేరారు. బ్యాంకు పని అవ్వగానే కాంటిన్ కి వెళ్లి నాన్ రోటికి ఆర్డర్ ఇచ్చాడు.
మనోజ్ కు మరదలు శాలిని గుర్తుకు వచ్చింది. కిందటి నెల మామయ్య వాళ్ళింటికి వెళ్ళినప్పుడు రాధత్త షుగరు, బీపి, ఒబేసిటీ లతో ఇప్పుడే చేతకానిదానిలా అయిపొయి పని చేసుకోలేక పోవడం గమనించాడు. శాలిని అత్తయ్యకు ఇంటి పనుల్లో గాని బయటి పనుల్లో గాని ఏ సాయం చేయ్య కపోగా .. అస్తమానం చెవుల్లో ఇయర్ పోన్స్ పెట్టుకుని పాటలు వినడమో ఫ్రెండ్స్ తో మాట్లాడుకోడమో చేస్తూ మంచినీళ్ళు కూడ అత్తయనే అడగడం చూసాడు. పైగా తనను చెయ్యి పట్టుకుని తన గదికి లాక్కెళ్ళి ..
” ఆ ముసలి వాళ్ళతో మనకెందుకు గాని ఏమి సినిమాలు చూసావు బావా .? ఫారిన్ ట్రయల్స్ ఏమయనా చేస్తున్నావా.. అబ్బా ఇక ఇండియాలో యెంత కాలం ఉంటావు..?” అడిగింది
“నాకా ఆలోచన లేదు శాలిని ..! అమ్మ నాన్నలను వదిలి ఎక్కడకు వెళ్లేదే లేదు. నాకు ఆ ప్రయాసలు డబ్బు కెరీర్ అంటూ పరుగులు పెట్టడంవల్ల మన తల్లిదండ్రులకు దూరము అవడం మాత్రమే కాదు .. పుట్టిన పిల్లలను ఇబ్బంది పెట్టడం అవుతున్నది. మనమా పూర్తిగా అక్కడ స్థిరపడలేము వెళ్లి నాలుగు డబ్బులు ఇల్లు స్థలం సంపాదించుకున్న ఈ పదేళ్ళ లో పిల్లల భాషా సంస్కృతులలో తేడా వచ్చేస్తున్నది .. ఇలా నేను ఎంతోమంది కుటుంబాలను చూస్తున్నాను..”
“అంటే వెళ్ళేవాళ్ళంతా ఫూల్సా..”
“అలా అని నేను అనడం లేదు. బయటకు వెళ్ళడం నా మనస్తత్వానికి సరిపడదు అంటున్నా.. నాకు అమ్మ నాన్నలకు.. దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు ” అని చెప్పాడు. అప్పటినుండి
“బావ ఫారిన్ కి వెళ్తే మామిడి కాయ పప్పు , గొంగూర పచ్చడి గుమ్మడి వడియాలు మిస్సవుతాడట నాన్నా.” అంటూ వెటకారమాడింది. “అయినా నువ్వు ఫారిన్ కి వెళ్లవుగా..” అంటూ దెప్పడం మొదలు పెట్టింది. ” “ఫారిన్ కి వెళ్ళను అనే నిన్ను నేను చేసుకోలేను..” అన్న విషయం అడుగడుగునా స్పష్టం చేసింది. అమ్మకివేవి చెప్పడం ఇష్టం లేక వేరే సంభంధం చూడమని చెప్పాడు.
తరువాత చూసిన సంబంధం రమణి, నిజంగానే రమణీయంగా ఉంది. పెద్దలు ఇద్దరినీ మాట్లాడుకోడానికి ఏర్పాటు చేసారు. ” నేను మీకు నచ్చే ఉంటాను. దయ చేసి నచ్చలేదు అని చెప్పండి. నాకు మీలా ఇండియాలోనే ఉండి పోవాలని అనుకోవడం లేదు ..” అని అన్నది
ఇక పెళ్లి సంబంధాలు చూసే శంకరం “నువ్వు ఇప్పటి నుండే నేను విదేశాలకు వెళ్ళను అని చెప్పకయ్యా.. పెళ్ళయ్యాక ఆమెకి ఫారిన్ వెళ్ళాలని ఉన్నా నీ పెళ్ళాం నిన్ను వదిలి ఎక్కడకు పోతుంది చెప్పు ” అని అన్నాడు. ” నేను అలా చెప్పలేను..” చెప్పేసాడు .
“బీ.టెక్ చదివి ఇదేమి బుద్దయ్యా .. ఈ ఎమ్మెస్ చేస్తానికో ఏదయినా మరో మంచి కంపెనిలో చెరో విదేశాలకు వెళ్తే నాలుగు దేశాలు చూడొచ్చు నాలుగు రాళ్ళూ వేనుకేసుకోవచ్చు కదా..” అని వాదించాడు. ఓ క్వాలిఫైడ్ అబ్బాయి విదేశాలకు వెళ్ళడం ఇష్టం లేదు అనడం సుతారము నచ్చలేదు అతనికి.
ఓ పెద్దమనిషి తను పని చేస్తున్న ఉద్యోగం గురించి జీతం గురించి వాకాబ్ చేసుకుని వచ్చి మనోజ్ ని కలిసి కుటుంబం గురించి అడిగాడు. వివరాలు చెప్పాక.. “మీ ఉద్యోగం అదీ బాగానే ఉన్నది. కాని దానికి తగ్గ బాద్యతలు కూడా ఉన్నాయిగా .. మీకు ఓ తమ్ముడు, చెల్లెలు.. అంటే ఆ ఇద్దరి బాధ్యత మీదే నన్న మాట. పైగా మీ నానమ్మా మీ దగ్గర ఉంటారా…?మా అమ్మాయి ఇంత మందికి చెయ్యలేదు. ఇంత పెద్ద కుటుంబంలో మా అమ్మాయి ఇమడలేదు” అన్నాడు. “తమ్ముడూ, చెల్లి, అమ్మ నాన్నా, నానమ్మా ఇది పెద్ద కుటుంబం.. అతనికి” విరక్తిగా నవ్వుకున్నాడు ..
మనోజ్ జ్ఞాపకాలనుండి బయట పడి, సందీప్ దగ్గర నుండి పోన్ లేదు పిన్నీ బాబ్బాయి వచ్చే ఉంటారు. అనుకుంటూ బిల్ కట్టి బయటకు నడిచాడు. సందీప్ కి తనే పోన్ చేసాడు. ఎందుకో పోన్ కలవడం లేదు. ఒక వేళ మెడికల్ చెకప్ కని హాస్పిటల్ కి వెళ్ళారేమో.. అందుకే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడేమో అనుకున్నాడు.
కొద్ది దూరం వెళ్ళాక రఘు, నర్సింగ్ కనపడ్డారు.”పదరా హాస్టల్ కి వెళ్దాం మనోళ్ళంతా ఇవ్వాళ అక్కడే కలుస్తున్నారు..”
“వద్దురా నన్ను ఒదిలెయ్. ఇక ఆ హాస్టల్ అది వద్దు అనుకునేగా దూరం వచ్చేసాను గాని, ఏమిటి సంగతులు ” అడిగాడు మనోజ్. రోడ్డు పక్కనే ఉన్న బడ్డి కొట్టు దగ్గర చేరి ముగ్గురూ మాటల్లో పడ్డారు.
” ఏముంటాయిరా ఎప్పటిలాగే హాస్టల్ దారంతా చెట్ల చాటున కనపడే జంటలు, కాంపౌండ్ చుట్టూ ఖాళీ సీసాలు, సిగిరెట్ పీకలు. అందరూ ఒక దగ్గర చేరి , సినిమాలు, రాజకీయాలు, అమ్మాయిల ముచ్చట్లు.. ఎప్పటి లాగే కళా పోషణ జరుగుతున్నది నవ్వాడు రఘు.
అలా రఘు, నర్సింగ్ గల గల ఏదో మాట్లాడుతూనే ఉన్నారు మనోజ్ సందీప్ నుండి పోన్ కోసం ఎదురు చూస్తూ వింటున్నాడు.
“అరె మనోజ్ వీడికి తాగుడు ఇంకా ఎక్కువయ్యిందిరా” రఘు ఆరోపించాడు.
” ఒరే ఎదురుగా మిఠాయిలు పెట్టి నువ్వు తినకూడదురా అంటే ఎలా కుదురుతుంది రా..? కళ్ళముందే బడ్డీ కోట్లల్లో పాన్ పరాగ్ లు, సిగిరెట్లు, కనపడుతుంటాయి నువ్వు కాల్చొద్దు అంటారు. సందు సందుకు బార్లు ఉంటాయి. నువ్వు తాగొద్దు అంటారు. రూం రూంలో కింగ్ ఫిషర్ కాలెండర్లూ ఊరించే తారల బొమ్మలు. రోడ్లమీద కవ్వించే సినిమా పోస్టర్లు.. సినీ మాయ లోకం చూపే పరువాల పాపలు. బయటకు వస్తే నఖ శిఖ పర్యంతం అందంగా అలకరించుకుని తిరిగే కలర్స్. అసలు ఎట్లారా బతకడం ..? నేనయితే అమ్మా ఉద్యోగం వచ్చినప్పుడే వస్తుంది. నా పెళ్ళాంతో కలిపి నీకు .. ముగ్గురు పిల్లలనుకో నాకు పెళ్లి చేసేయి. లేకుంటే నేను ఎవర్ని ఎత్తుకోస్తానో నాకే తెలియదు అని చెప్పేసాను..” నవ్వాడు ఆ నర్సింగ్.
“నువ్వు తాగడం సరే.. ఆ సబితా వాళ్ళకు ఇంకా తెచ్చిస్తున్నావా …” అడిగాడు.
“మరి.. వాళ్ళు నన్ను వదలరు. తప్పదు.. ఎమి చేస్తాం చెప్పు ?”
“సిగ్గు లేదురా అలా చెప్పుకోడానికి ..”
” . వాళ్లకు లేని సిగ్గు నాకెందుకురా. నా కమీషన్ నాకు వస్తుంది. నేను తేకపోతే వాళ్ళు మరొకరితో తెప్పించుకుంటారు కాని తాగుడు మానేస్తారనుకుంటున్నావా. పబ్ లకు వెళ్తున్నారు. వాళ్ళు నువ్వు అనుకున్నంత అమాయకులేమి కాదు. చాటు మాటుగా హుక్కలు తాగుతున్నారు. సిగిరెట్లు కాలుస్తున్నారు. అన్నీ రుచి చూడాలని వాళ్ళ తాపత్రయం. ఆదివారం వచ్చిందంటే వాళ్ళు వీడెనుక పడతారు.. వీడేమో వాళ్ళకు బీర్లు, యాపిల్ జూసులు తెచ్చిస్తాడు.” మనోజ్ మానం వహించాడు.
తనను సిగరెట్స్ తెచ్చిపెట్టమని, పబ్ కి తీసుకెళ్లమని వెంట పడి పది వేధించే జయంతి గుర్తుకు వచ్చింది. “నా వల్ల కాదు నన్ను వదిలేయ్..” అన్నప్పుడు నలుగురిలో పట్టుకుని “వీడో స్పెషల్ మేడ్..” అంటూ ఈసడించుకున్న విషయం గుర్తుకు వచ్చింది. మనోజ్ ఏదో అనబోయేంతలో. సందీప్ నుండి పోన్ ..
“ఏమయి పోయావురా అమ్మ వాళ్ళు వచ్చేసారా ..?” అడిగాడు.
“మనోజ్ అమ్మ వాళ్ళకు ఆక్సిడెంట్ అయ్యింది రా. నువ్వు త్వరగా రారా నాకు చాల భయంగా ఉంది ..” ఏడుస్తూ చెప్పాడు సందీప్. కళ్ళు తిరిగినంత పనయ్యింది
“నువ్వేమి కంగారు పడకు నేను బయలు దేరుతున్నా.” హాస్పిటల్ అడ్రస్ కనుక్కుని రఘుని, నర్సింగ్ ని వెంట పెట్టుకుని కంగారు కంగారుగా బయలు దేరాడు ..
“అమ్మ వాళ్ళు ఇంత దూరం మా కోసం రావొద్దు. మేము ఆటోలో వచ్చి అమీర్ పెట్ దగ్గర నిన్ను కలుస్తాము అన్నారు. వాళ్ళను తీసుకొస్తున్న వస్తున్న ఆటోను ట్రక్కు గుద్దేసింది. నాన్న తలకు దెబ్బ తగిలింది. కుడి కాలు విరిగింది. రిబ్స్ విరిగి ఉంటాయి అంటున్నారు. అమ్మ తలకు బలమయిన దెబ్బలు తగిలాయి. కంటి చూపు ఉంటుందో పోతుందో తెలియదు ..” బావురుమన్నాడు. మనోజ్ కళ్ళు చెమర్చాయి
“ప్రాణాపాయం లేదు అన్నారు కదా. అదే అదృష్టమనుకోరా ధైర్యంగా ఉండు.. ” అన్నాడే కాని గాయాలతో అలా స్పృహ లేకుండా పడి ఉన్న అరుంధతమ్మ పరిస్థితి చూస్తే గుండెలు అవిసిపోయాయి. ఇక నెప్పితో కేకలు పెడుతున్న సంజీవరావు బాధను చూడలేక పోయారు. ఇంతలో సిస్టర్ వచ్చి
” మీ నాన్న గారిని త్వరగా ఆర్థో ఫిజిషియన్ దగ్గరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వెంటనే సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది..” అని హెచ్చరించి వెళ్ళిపోయింది .
“ఎలారా ఇక్కడ అమ్మ స్పృహ లేకుండా పది ఉన్నది.. నాన్నను గ్లోబల్ హాస్పిటల్కి తీసుకేల్లాలాట ..” సందీప్ ఆందోళన పడిపోయాడు ..
” సందీప్ నువ్వు అమ్మను చూసుకో. రఘు నువ్వు ఇక్కడే సందీప్ కి తోడుగా ఉండు. మేము అంకుల్ ని గ్లోబల్ హాస్పిటల్ కి తీసుకెళతాం.” అన్నాడు.
*** *** *** ***

మనోజ్ అంబులెన్స్ లో వెళ్ళాడు. నర్సింగ్ మనోజ్ బండి తీసుకుని వెనుకే వచ్చాడు. సంజేవరావును ఐ సి యు లోకి తీసుకెళ్ళారు ..
తన అకౌంట్లో ఉన్న డబ్బుకు తోడు పోన్ చేసి కొలీగ్స్ ఇద్దరి దగ్గర మరి కొంత డబ్బు అడిగాడు. అడిగిన మందునల్లా కొని తెస్తూ. అటూ ఇటూ పరుగులు పెట్టాడు.. సందీప్ కాల్స్ అటెండ్ అవుతూ అరుంధతమ్మ గురించి కనుక్కుంటూ ధైర్యం చెప్పసాగాడు. సందీప్ వాళ్ళ ఒక అక్క డిల్లిలో ఉన్నది .”వచ్చే నెల అక్క డెలివరీ. ఇప్పుడు అక్కకి ఈ వార్త ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు..” అంటూ బాధ పడ్డాడు.
” సంజీవరావుగారి తరుపున మీరేనా? పేషంట్ పిలుస్తున్నారు .. సిస్టర్ వచ్చి పిలిచింది. లోపలి గది నుండి మరో గదిలోకి అడుగు పెట్టగానే ఆ చల్లదనం, ఆ మందుల వాసన, ఆ నిశ్శబ్దం భీతి గొలిపాయి. లోపల నాలుగు బెడ్స్ పైనా నలుగురు ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కుంటున్న పేషంట్స్ ఉన్నారు. సంజీవరావు తలకు కట్టు కట్టి ఉంది. గుండెల మీద బాండేజి చుట్టి ఉంది .
సందీప్ ని చూడగానే”బాబు అది బతుకుతుందంటావా.” బావురుమన్నాడు .
“పిన్నికేమి పరవాలేదు. బాబాయి.. మీరు ధైర్యంగా ఉండండి. ముందూ, మీరు కోలుకోవాలి.?”
” ఏమి కోలుకుంటానో నరకం కనపడుతున్నదయ్యా ..” పెద్దగా ఏడ్చేశాడు.
“అంకుల్ మీకేమి అవ్వదు. నేను చెప్తున్నా వినండి. కొద్దిపాటి గాయాలతోనే బయట పడ్డారు .. త్వరలోనే కోలుకుంటారు. కాకపోతే కొన్ని రోజులు ఈ ఇంజక్షన్స్ మందులూ తీసుకోవాలి అంతే ..” నర్స్ వచ్చి సంజీవరావు చెయ్యి పట్టుకుని నిమురుతూ సన్నని స్వరంతో ధైర్యం చెప్పి ఇంజక్షన్ చేసింది.
“మీరు అతని చెయ్యి పట్టుకుని ధైర్యం చెబుతూ కాస్సేపు అతని దగ్గరే కూర్చోండి ఫీవర్ వచ్చింది. ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది ” చిన్నగా చెప్పింది.
ఆ వెంటనే పక్కనే మరో పేషంట్ కి సెలైన్ పెట్టింది. ఇంకో పేషంట్ కి ఏవో పరికరాలు అమర్చి రీడింగ్స్ నోట్ చేసుకుంటున్నది. మనోజ్ సంజీవరావుకి ధైర్యం చెప్తూ పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు. మద్య మధ్య నర్స్ చేస్తున్న పరిచర్యలు చూస్తున్నాడు. అటూ ఇటూ మెల్లగా నడుస్తూ.. మధ్య మధ్య వచ్చి వెళ్తున్న డాక్టర్లకు రోగుల పరిస్తితి వివరిస్తూ, బయటకు వెళ్లి రోగుల తరుపు వాళ్ళకు జవాబులు చెబుతూ.. ఆ వెంటనే వచ్చి పేషంట్స్ పల్స్, బీపి చూస్తూ..వాళ్ళకు ధైర్యం చెబుతూ, సెలైన్లు మారుస్తూ, ఇంజక్షన్లు చేస్తూ, మందులు వేస్తూ. వాళ్ళకు ప్రాణం పోసే దేవకన్యలా కనిపించింది ఆమె. హెడ్ నర్స్ వచ్చి పిలవడాన్ని బట్టి ఆమె పేరు ‘ధాత్రి ‘ అని అర్దమయ్యింది.
“ఇంక మీరు వెళ్ళవచ్చు ఏదయినా అవసరమయితే పిలుస్తాను..” అన్నది మరో లోకంలోకి వచ్చినట్లు బయటకు వచ్చాడు . టైం చూసుకుంటే రాత్రి పన్నెండు దాటింది. నర్సింగ్ పదకొండు గంటలకే వెళ్లి పోయాడు. ఎప్పటికప్పుడు అమ్మావాళ్ళకు పోన్ చేసి చెబుతూనే ఉన్నాడు. ఇపుడు పన్నెండు దాటి పోయిందని ఇక కాల్ చెయ్యలేదు.
హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉన్నది. కింద పైనా బోలెడు వార్డులు ఉన్నాయి. ఇదొక్కటే విసేరేసినట్టు కారిడార్ కి ఈ మూలాన ఉన్నది. ఆ అమ్మాయి ఒక్క చేత్తో మృత్యువుతో పోరాడుతున్న నలుగురయిదుగురు పేషంట్స్ ని చూస్తున్నది. మందులతో పాటు వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తున్నది. ధాత్రిని చూస్తుంటే భలే ముచ్చట వేసింది మనోజ్ కి..
సందీప్ పోన్ చెయ్యగానే “బాబాయికేమి పరవాలేదు.. పిన్ని గురించే ఆందోళన పడుతున్నారు” అని పరిస్థితినంతా వివరించి చెప్పాడు.
*** *** *** ***
మర్నాడు సంజీవరావుకి ఆపరేషన్ జరిగింది. దాదాపు మూడు రోజులు ఐ సి యు లోనే ఉంచాల్సి వచ్చింది. సందీప్ అక్కడ అమ్మను వదిలి పెట్టి వచ్చి ఇక్కడ ఎక్కువ సేపు ఉండలేక, వెళ్ళలేక సతమతమైపోయాడు.
“సందీప్ నేను వారం రోజులు సెలవు పెట్టాను. నీవు ఇక బాబాయి గురించి వర్రీ అవ్వకు.. పిన్ని సంగతి చూసుకో. అటూ ఇటూ తిరుగుతూ అవస్థ పడకు మధ్య మాధ్య రఘూ, నర్సింగ్ వస్తూ పోతూనే ఉంటారు ” అంటూ ధైర్యం చెప్పాడు
“ఇలా సెలవు పెట్టి.. డబ్బులు ఖర్చు పెట్టి ఎలా తీర్చుకోవ్వాలి రా నీ ఋణం.” .. సందీప్ ఏడ్చేశాడు. “బంధువులంతా పలకరించి వెళ్తున్నారే గాని ఎవరి జీవితాలు వాళ్ళవి. మనకోసం హాస్పటల్ లో రాత్రి పూట కూడా ఉండే వారెవరు..? బావగారు వచ్చి, నెలలు నిండిన మీ అక్క అక్కడ వంటిరిగా ఉంది. నేను వెళ్ళక తప్పడం లేదు అంటూ వెళ్ళలేక, వెళ్ళలేక వెళ్లారు. మనిషికి మనిషి సాయం ఎంత అవసరమో కదరా .. డబ్బులంటే అప్పయినా తెస్తాము రా, మనుష్యులనేలా తెస్తాము.” సందీప్ చాల బాధపడుతూ అన్నాడు .
” ఇప్పుడు నువ్వు మరేమీ ఆలోచించకు .. బాబాయిని రేపు వేరే వార్డ్ కు మారుస్తారనుకుంటా .. నువ్వు పిన్నికి ధైర్యం చెప్పు” అని చెప్పి పంపించాడు. వెళ్తూ వెళ్తూ సందేప్ అన్న మాటలు చెవుల్లో రింగు మంటున్నాయి మనోజ్ కి
“మనోజ్ నేనంటూ ఇక్కడ ఉంటేనే పరిస్తితి ఇలా ఉన్నది.. కిందటి సారి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నేను విదేశాలకు వెళ్ళిపోయి ఉంటే.. అప్పుడు అమ్మా వాళ్ళకు ఇలా ఏదయినా జరిగి ఉంటే దిక్కులేని వాళ్లై పోయేవాళ్లు కదరా ..” అన్నాడు. దేశం వదిలి వెళ్ళడానికి ఇష్టపడని మనోజ్ మనో భావనలకు మరింత బలం చేకూరింది. అమ్మా నాన్నలకు పోన్ చేసి గుండె బరువంతా దిమ్పుకున్నాడు.
*** *** *** ***
సంజీవరావు కు మందులు ఇచ్చి వస్తానని లోపలికి వెళ్ళాడు మనోజ్.
” ఏంటి! మీ డ్యూటి టైం అయిపొయింది కదా, మీరు ఇంటికి వెళ్ళలేదా?
“పేషంట్ కండీషన్ ఏమి బాగోలేదు మధ్యాహ్నం వెళ్తాను.. వార్డ్ బాయ్ బయటకు వెళ్లినట్టున్నాడు. ఒక్కసారి ఇటు వచ్చి కాస్త సాయం పడతారా..”
పేషంట్ ను అటు వైపు తిప్పి బాండేజ్ కడుతూ అడిగింది ధాత్రి . దగ్గరకు వెళ్లి ఆమె పక్కనె నుంచుని సాయం చేసాడు. ముఖాన చిన్న దోసగింజంత బొట్టు తప్ప వేరే ఏ అలంకరణ లేదు .. చురుకయిన చూపులు, చిన్న స్వరం, మెత్తని అడుగులు, సన్నని వేళ్ళు, ఏదో దివ్య శక్తి ఉన్నదామెలో. ఆమెను చూడగానే దట్టమైన మేకప్ వేసుకుని.. “మీరు ఫారిన్ కి వెళ్ళరా? ప్లీజ్ నేను నచ్చలేదు అని చెప్పెయ్యండి..” అన్న రమణి గుర్తుకు వచ్చింది. చేతిలో సెల్ పోన్, చెవులకు ఇయర్ పోన్స్ తో అస్తమానం అటూ ఇటూ తిరుగుతూ. “ఆ చెప్పరా.. ” ఇంకా ఎంటిరా..? అంటూ అడిగే క్లాస్ మేట్స్ అనిత, రూపా గుర్తుకు వచ్చారు. “నువ్వంటే నాకిష్టం రా నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది ..కాని నీవన్నీ బీ సి నాటి భావాలు .. బీ ప్రాక్టికల్ .. ” అంటూ గొడవ చేసిన స్రవంతి గుర్తుకు వచ్చింది
“అలా రాత్రి పూట వంటరిగా.. ఈ పేషంట్స్ మధ్య భయం వెయ్యదా మీకు..” .
“భయం వేస్తే మా డ్యూటి ఎలా చెయ్యగలుగుతాము..? భయాన్ని జయించాలి .. బాధను జయించాలి..”
“అయినా నేనేమి వంటరిగా ఏమి ఉండను. ప్రతి రెండు గంటలకు డ్యూటి డాక్టర్లు వచ్చి వెళ్తుంటారు. మధ్య మధ్య హెడ్ నర్స్ వచ్చి వెళ్తుంటుంది’ అన్నది. వేగంగా కదులుతూ. ఆమెని గమనించడం ఒక ఇష్టమయిన వ్యాపకంగా మారిపోయింది మనోజ్ కి.
తన స్నేహితుల్లో బొద్దింక చూసి రాద్దాంతం చేసే నిర్మల, గదిలో పిల్లి ఉన్నదని రెండు గంటల పాటు బయటే ఉండి పోయిన శైలజ గుర్తుకు వచ్చారు.
అక్కడంతా పాతికా ముప్పయి లోపు వయసు అమ్మాయిలే .. ముడి వేసుకున్న కురులతో లేత గులాబీ రంగు యూనీఫామ్ తో శాంతి దూతల్లా ఉన్నారు. యువతరాన్ని వెర్రెక్కించే రక రకాల ఆక్రందనలతో సంబంధం లేనట్టు పేషంట్ల గాయాలను, రక్త స్రావాలను చూస్తూ అరుపులు, కేకలూ, రోదనలు వింటూ వాసనలు భరిస్తూ. సేవే పరమావధిగా నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుంటూ పోతున్న నర్సులందరి మీదా గౌరవం రెట్టిమపయ్యింది మనోజ్ కి.
*** *** *** ***
సంజీవరావుని వార్డ్ మార్చారు. అయ్యో ఇక ధాత్రి కనపడదు. ఆమెని చూడాలంటే మళ్ళీ ఐ సి యూ కి వెళ్ళాలేమో అనుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడ సంజీవరావుకి డ్రెస్సింగ్ చేస్తూ ధాత్రి కనపడింది .
“ఏమిటి మీరిక్కడ..” అన్నాడు ..
“నన్ను కూడా వార్డ్ మార్చారు. ఈ వారమంతా నాకు ఇక్కడే డ్యూటి..” నవ్వుతూ అన్నది. మనోజ్ కి సంతోషమనిపించింది. దాత్రి “అంకుల్ మీరు త్వరగా ఇంటికి వెళ్ళాలనుకుంటే ఈ మందులు వేసుకోవాలి మరి .” అంటూ ఒకరిని .. “సర్ మీరు మెల్లగా లేచి అడుగులు వేయాలి తప్పదు..” అంటూ మరొకరిని పలుకరిస్తూ తన డ్యూటిలో మునిగిపోయింది దాత్రి.
“డాక్టర్ గారు మీకు చెప్పే ఉంటారు. మీ బాబాయిగారు ఇక్కడ దాదాపు ఇరవయి రోజులు ఉండాలి ఆ తరువాత ఇంటికి పంపినా నాలుగు నెలలపాటు వీరు మంచం మీదే ఉండాల్సి ఉంటుంది.” దగ్గరకు వచ్చి చెప్పింది ధాత్రి ..
మనోజ్ వెళ్లి సంజీవరావుకి టిఫిన్ తినిపించాడు.”
సంజీవరావు ” నువ్వు నాకు దేవుడిచ్చిన కొడుకువయ్యా.. నీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు ” అన్నారు.
” మీరు మరీను మనలో మనకు రుణాలా బాబాయి ..” అన్నాడు
సందీప్ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు మనోజ్ అరుంధతమ్మ దగ్గరకు వెళ్తున్నాడు. సందీప్ పిన్ని కొడుకు వచ్చి యాక్సిడెంట్ కేస్ సంగతి చూసుకుంటున్నాడు. రోజు ఆఫీస్ కి వెళ్ళి వస్తూ రెండు పూటలా భోజనం తీసుకు వస్తూ చాలా ఇబ్బందిగా ఉన్నా ఎలాగోలా తంటాలు పడసాగాడు. మనోజ్. పదిహేను రోజులు గడిచిపోయాయి.
*** *** *** ***
“బాబయి. పిన్నిని రేపు డిశ్చార్జ్ చేస్తున్నారు.. తన కన్నుబాగు పడింది. ఓ రెండు నెలలు ఎండలో తిరగకుండా రెస్ట్ తీసుకోవాలాట. ఎల్లుండి పిన్ని మీ దగ్గరకు వచ్చేస్తుంది కూడా ” అని చెప్పాడు .. సంజీవరావు సంబర పడిపోయాడు.
మధ్యలో ఈ పదిహేను రోజుల్లో దాత్రితో మనోజ్ కి మంచి స్నేహం కుదిరింది.
మనోజ్ తన అమ్మా, నాన్నా, చెల్లీ తమ్ముడు నానమ్మ అందరి గురించి ఆసక్తిగా చెప్పాడు. తన క్లాస్ మేట్స్. వాళ్ళ అల్లరి గురించి చెప్పాడు. తన పెళ్లి చూపుల ప్రహసనాలు చెప్పి నవ్వించాడు.
ఆ రోజు సంజీవరావుకి భోజనం తీసుకెళ్లినప్పుడు. ధాత్రి ఎందుకో చిన్నబోయి ఎందుకో చాల బాధ పడుతున్నట్లుగా అనిపించింది ..
మనోజ్ బయటకు వెళ్లి ధాత్రికి టీ తెచ్చి ఇచ్చాడు. చాలా మొహమాట పడి తాగింది. అందరూ లంచ్ కి వెళ్తే తను మాత్రం రెండయిన మూడయినా వెళ్ళలేదు ..
“మీరు లంచ్ చెయ్యరా..” అని అడిగాడు.
“బాక్స్ తెచ్చుకోలేదు. క్యాంటిన్ వరకు వెళ్ళే ఓపిక లేదు”. అన్నది. అంతలో చివరి బెడ్డు అతను గట్టిగా మూలిగాడు అటు పరుగెత్తుకు వెళ్ళింది. అతనికి ఇంజక్షన్ ఇచ్చి వచ్చింది థాత్రి.
. “మీకు దేనికి ఓపిక వస్తుందో, దేనికి ఓపిక ఉండదో నాకు అర్డంయ్యంది కాని ఇక నడవండి వెళ్లి ఏమయినా తిని వద్దాం.” అన్నాడు .. దాత్రి నవ్వి అతనితో అడుగులు వేసింది.
“వండుకోడానికి ఓపిక లేక కాదు గాస్ అయిపొయింది. చూసుకోలేదు..”
“అవును మీరింత శ్రద్దగా పేషంట్స్ ని చూస్తారు కదా యం బీ బీ ఎస్ ఎందుకు చదవలేదు .. సీటు రాలేదా..”
” సీటు రాక కాదు రాత లేక.. అదే సంవత్సరం మా నాన్న పోయారు. దానితో … నర్సింగ్ బీ ఎస్సి చదివాను. ఎమ్మెస్సీ చెయ్యాలన్న కోరిక తీరనే లేదు. నిజానికి డాక్టర్ల కంటే మేము చేసే సేవలే ముఖ్యం. కాని ఎంతయినా వాళ్ళు డాక్టర్స్ కదా వాళ్ళు ఏమన్నా పడాల్సిందే” ఆమె కన్నుల్లో చెమ్మ. అంటే ధాత్రిని ఎవరో డాక్టర్ కోప్పడ్డారని అర్ధమయింది.
“మీరింత బాధ్యతగా ఉంటారు మిమ్మల్ని అన్నాడంటే వాడొట్టి మూర్కుడై ఉంటాడు…”
“అసలు మా వృత్తి అన్నా. మేము అన్న చాలామందికి చులకన . అమ్మావాళ్ళు రెండేళ్ళ నుండి పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు .. కాని ఈ రోజుల్లో కూడా చాలామందికి నర్సులంటే ఇంకా చిన్నచూపే. ముందు అమ్మాయి నచ్చిందంటారు. మళ్ళీ ఎందుకో విరమించుకుంటారు.. ఇక ఓ డాక్టర్ కి నేను బాగా నచ్చానట కాని పెళ్ళి కాగానే జాబ్ మానెయ్యాలట.. తన భార్య నర్స్ అని చెప్పుకోవడం అతనికి ఇష్టం లేదట ” నవ్వింది.
“ధాత్రి .. మీతో ఓ విషయం చెప్పాలి. ఈ యాక్సిడెంట్ జరిగిన పది రోజులకనుకుంటా.. ఆ రోజు బాబాయికి బాగుండక ముఖ్యమయిన ఆఫీస్ కాల్స్ అటెండ్ అవ్వలేదు. దాంతో మా డెలివరీ హెడ్ కి కోపం వచ్చి సెలవు తీసుకోమ్మన్నాడు. నిజానికి మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడగాలని ఉంది ధాత్రి . కాని నా ఉద్యోగం పోయింది. మళ్ళీ కొత్త ఉద్యోగం రావడానికి కొన్ని నెలలు పడుతుంది..” .
“నా జీతంతో ఈ కొన్ని నెలలు ఇద్దరం బతకలేమా..” ధాత్రి అన్నది
“సరే మరి.. నాకు ఉద్యోగం వచ్చాక నువ్వు ఉద్యోగం మానెయ్యాలి సుమా ” మనోజ్ వంక తెల్లబోయి చూసింది.
“అంత కోపమొద్దు. నువ్వు ఉద్యోగం మానల్సింది.. ఎమ్మెస్సీ నర్సింగ్ చేయడానికి ..”
ఆమె నవ్వుల పారిజతమయ్యింది. వెన్నెల మోముతో ఇద్దరూ కలసి ముందుకు నడిచారు.

*** *** *** ***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *