May 20, 2024

మార్పు. .

రచన: ysr లక్ష్మీ

“అత్తయ్యా”అన్న పిలుపు విని వంటింట్లో నుంచి ఇవతలికి వచ్చాను. కోడలు రోజా పిలుపు అది. “ఏమిటమ్మా “అన్నాను. “భువికి వంట్లో బాగున్నట్లు లేదు పాలు తాగిస్తే మొత్తం వాంతి చేసుకున్నది”అన్నది. భువి నా మనవరాలు. ఏడాది పిల్ల.
నెల రోజుల క్రితం అమెరికా నుండి ఇండియా వచ్చారు నా కోడలు, మనవరాలు. పుట్టింట్లో ఒక వారం, ఇక్కడోక వారం గడుపుతున్నారు. రెండు రోజుల క్రితమే పుట్టింటి నుంచి ఇక్కడకు వచ్చింది. రాత్రి పడుకోబోయే ముందు బాగానే ఉంది, తెల్లారేటప్పటికి జ్వరం తగిలి నట్లుంది. దాన్ని చేతుల్లోకి తీసుకోబోయి ఒక నిమిషం సందేహించాను. అంతకు ముందు వచ్చినప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.

*******

కొడుకు, కోడలు ఉద్యోగస్థులు అవడంతో మనవరాలి పెంపకానికి అమెరికా వెళ్ళి నాలుగు నెలలు ఉండి వచ్చేసాను. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు మన గవర్నమెంటు ఉద్యోగాల లాగా పర్మినెంటు కావు కదా! ప్రాజెక్టు అయిపోవడంతో కోడలి ఉద్యోగానికి విరామం దొరికింది. తను ఖాళీగా ఇంట్లోనే ఉంది కదా అని నేను వచ్చేశాను. జాబ్ లో చేరడానికి సమయం పడుతుందని నేను వచ్చిన రెండు నెలలకే తనూ భువిని తీసుకొని ఇండియా వచ్చింది.
క్రితం సారి రోజా మా ఇంటికి వచ్చినప్పుడు భువి నన్ను చూడగానే చేతుల్లో వాలింది. ఇంట్లో ముప్పై ఏళ్ళ తరువాత విరిసిన బోసి నవ్వులు కావడంతో నేనూ ముద్దు చేసేదాన్ని. ఎందుకో మరి అదీ నన్ను వదిలేది కాదు. స్నానం , తిండి సమయంలోనే వాళ్ళమ్మ దగ్గర ఉండేది . అదీ బలవంతానా! ఒకటి రెండు సార్లు ఆడుకుంటూ నా దగ్గరే నిద్దరపోయింది. మర్నాడు నా కొడుకు దగ్గర్నుంచి ఫోన్ “అమ్మా! భువిని రోజా నిద్రబుచుతుంది కదా! నీ కెందుకు శ్రమ. తనకిచ్చేయి. తను ఫీలౌతోంది! “అని. ఫీలవట మేమిటో నాకర్ధము కాలేదు. అప్పటికి ఏమీ మాట్లాడకుండా తీసికెళ్ళి ఇచ్చేశాను.
మరునాడు వాడు ఫోన్ చేసినప్పుడు “రోజా ఫీలౌడ మెందుకురా?” అంటే వాడు చెప్పిన సమాధానం విని అవాక్కవడం నా వంతు అయ్యింది. సారాంశం ఏమిటంటే నేను దగ్గరకు తీయడం వల్ల భువి నాకు దగ్గరై అమ్మగా తనకు దూరమై పోతుందనే భయమట.
ఏడవాలో? నవ్వాలో ?తెలియలేదు. చదువులు తెలివితేటలు ఎక్కువ అవడం వలన ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి కాబోలు. భర్త, పిల్లల ప్రేమ తమకి తప్ప వేరే వారికి పంచితే భరించలేరా! టెక్నాలజీతో ప్రపంచం కుగ్రామం అయ్యిందని సంబర పడుతున్నాము కాని మనసులు కుచించుకు పోతున్నాయని గ్రహించ లేకపోతున్నాము. నా కాలంలో పిల్లల్ని అమ్మమ్మలు, నాయనమ్మలు పెంచడమే మహద్భాగ్యం గా భావించే వారము. సెలవలొస్తాయంటే ముందుగానే వాళ్ళు ఊళ్ళకు వెళ్ళడానికి, పరీక్షల ముందు నుంచీ అక్కడ ఏమేమి చెయ్యాలో ప్రణాళికలు వేసేవారు. అక్కడ వారి గారాబం , చెప్పే కబుర్లు, కధలు చేసే అల్లరి అన్నీ మక్కువే! అమ్మమ్మ, నాయనమ్మల దగ్గర పెరిగిన వారంతా అమ్మల ప్రేమ చూపడం లేదా? ప్రేమ ఎల్లలు లేనిదని ఒకరి పై ప్రేమకు, మరొకరి పై చూపించే ప్రేమకు సంబంధము, పోలికా లేదని ఎప్పటికి గ్రహిస్తారు ఈనాటి పిల్లలు. తల్లిదండ్రుల మీద, తాతా అమ్మమ్మలు మీద, సోదరులపై, స్నేహితుల పై, బంధువుల పై, భార్యా భర్తల ప్రేమ అన్నీ ఆహ్వానించదగినవే ! వేటికవే ప్రత్యేకమైనవే! ఒకదానికొకటి సంబంధము లేనివే! అది గ్రహించాలంటే ప్రేమ లాగానే మన మనస్సూ విశాలమై ఉండాలి. నేను, నా భర్త, నా పిల్లలు ఇంత వరకే నా కుటుంబము అని గిరి గీసుకుంటే ఇన్ని రకాల ప్రేమలు ఎలా అర్ధమౌతాయి?

********

నా సందేహాన్ని గమనించిన రోజా “క్షమించండత్తయ్యా! అపోహ పడ్డాను. ఒకరి ప్రేమకు, మరొకరి ప్రేమ పోటీ కాదని గ్రహించ లేక పోయాను”అంది. మారు మాట్లాడ కుండా భువిని చేతుల్లోకి తీసుకొని నోరు చేతులు శుభ్రంగా కడిగి ముద్దాడాను ఒకింత సంతోషంగా!
ఈ మార్పుకు కారణం ఆ ముందు రోజు మాటల సందర్భంలో “భువి!! ఊష తెలియని పసి పిల్ల . ఎవరి దగ్గర దానికి సౌకర్యం గా ఉంటే వారి దగ్గర ఉంటుంది. పది రోజులైతే మీ దారిన మీరు అమెరికా వెళ్ళి పోతారు. ఏడాదికో, రెండేళ్ళకో వస్తారు. అక్కడ దానికి మీదే లోకం. సమయాన్ని బట్టి నెలకు ఒకసారో, రెండు సార్లో ఫేస్ టైం లో హలో అంటారు. దాని ముందు కుదురుగా కూర్చొని కబుర్లు చెప్పేంత వయసు దానికి లేదు. దానికి ఊహ తెలిసి మీరు ఇక్కడకు వచ్చేటప్పటికి ప్రేమలోని తేడాలు దానికి అర్ధ మౌతాయి. కాబట్టి దాని దృష్టిలో మీరు ఎప్పటికీ పదిలమే! అయినా నువ్వు చిన్నప్పుడు మీ అమ్మమ్మ తాతయ్యల దగ్గర కొంత కాలమున్నానని “మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టమని”చెప్పావు కదా! అంటే మీ అమ్మా నాన్నల మీద ప్రేమ లేనట్లా? ఆలోచించు. “అని లోపలకు వెళ్ళాను.
ఆ సంభాషణ తనలో మార్పు తీసుకొని వచ్చినట్లుంది. ‘హమ్మయ్య! ‘ఆనందంగా నిట్తూర్చాను. తన చర్యకు ప్రతి గా నేను కూడా ఆవేశపడి ఉంటే ఇంత సుహృద్భావ వాతావరణం ఉండేది కాదు కదా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *