May 20, 2024

జీవితం ఇలా కూడా ఉంటుందా?? 2

రచన: శ్రీమతి అంగులూరి అంజనీదేవి

మాధవీలత శూన్యంలోకి చూస్తూ ”ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల్లో, తుఫానులో చనిపోయినవారిని టీ.వీలో చూపినప్పటి నుండి నాకు సతీష్‌చంద్ర గురించి భయం ఎక్కువైంది మోక్షా!” అంది.
నివ్వెరపోయి చూసింది మోక్ష. ఎందుకంటే ఎప్పుడైనా మాధవీలత సతీష్‌చంద్రను పట్టించుకోదు. అతను చెప్పిన మాట వినడని ఆనంద్‌ ఒక్కడే తన మాటను, మర్యాదను నిలుపుతాడని చెప్పుకుంటుంది. అలాంటి ఆమె సతీష్‌చంద్ర గురించి భయపడటమా!!
”అయినా ఉత్తరాఖండ్‌ వరదలకి సతీష్‌చంద్రకి ఏమి అత్తయ్యా సంబంధం? సతీష్‌ అక్కడ లేడు కదా?”
”సతీష్‌ అక్కడ లేకుంటేనేం! సైన్యంలో వున్నాడుగా! సైన్యంలో వున్న వాళ్లని ఎప్పుడు ఎక్కడికి పంపుతారో, దేశంలో ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో మనమేమన్నా కలగన్నామా మోక్షా!”
”దీన్ని కలగనడం అనరు. ఊహించుకొని భయపడటం అంటారు. అవసరమా అత్తయ్యా! ఆరోగ్యం పాడవదా?” అంది మోక్ష.
”నా ఆరోగ్యం పాడవుతుందని నా కొడుకు గురించి ఆలోచించకుండా ఎలా వుంటాను మోక్షా! ఎంత వద్దనుకున్నా ఉత్తరాఖండ్‌లో వరద బాధితుల్ని కాపాడానికి వెళ్లి సాంకేతిక లోపం వల్ల పేలిపోయిన సైనిక హెలికాప్టరే నా కళ్లకి కనిపిస్తోంది. అందులో వున్న సైనిక సిబ్బంది, పైల్‌ెల ప్రాణాలు గాల్లో కలిసిపోవటం టీవీలో చూసినప్పటి నుండే నేను ఇలా అయ్యాను… మీ మామయ్యగారికి చెబితే ఆయనెంత బాధపడతారో నని ఆయనకు తెలియకుండా నేనొక్కదాన్నే బాధపడుతున్నాను”
”మామయ్య గారికి తెలియకపోవడం ఏమి అత్తయ్యా! ఈ వార్తను ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూసే వుంటారు. హెలికాప్టర్‌లో వచ్చిన సైనికులే కాదు, కొందరు మాజీ సైనికులు కూడా బాధితులను కాపాడాలని వెళ్లి ఆ కొండచరియల్లో చిక్కుకుపోయారని తెలిసింది. ఇది చాలా దురదృష్టపు, దయనీయ, ఘోర ఘటన. దీన్ని చూసినప్పుడు ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. కానీ ఏది ఎలా జరగాలో అది జరుగుతుంది, జరిగి తీరుతుందనుకోవాలి కానీ భయపడటం దేనికి… నాకు తెలిసి మామయ్య గారు కూడా ఈ వార్తను మీతో చెబితే మీరు భయపడతారని ఆయనలో ఆయనే బాధపడుతూ వుండొచ్చు”
”ఏమో మోక్షా! ఆయన కూడా దేనికో ఏమో బాధ పడుతూ వున్నట్లే వున్నారు. నా బాధలో నేనుండి ఆయన్ను అసలు పట్టించుకోలేదు” అంది దిగులుగా.
”మీ ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు బాధ పడుతూ వుంటే నష్టమే తప్ప లాభం వుండదు. అయినా సతీష్‌చంద్ర దేశాన్ని కాపాడాలని వెళ్లాడు. కాబట్టి అతన్ని దేవుడే చూసుకుంటాడు. మీరు ఈ నమ్మకంతో వుండండి. భయాన్ని తగ్గించుకోండి” అంది మోక్ష.
అప్పుడే బయటకెళ్లిన అంకిరెడ్డి లోపలికి వచ్చాడు… ఆయన కారు దిగి నేరుగా లోపలికి రాలేదు. అలా అని ఆయన వాళ్ల మాటలు వింటూ గుమ్మం పక్కన ఆగాడన్నది వాళ్లకు తెలియదు. ఆయన వాళ్ల మాటల్ని విన్నా విననట్లే వెళ్లి ”మాధవీ! నాకోసారి కాఫీ ఇవ్వు ఆఫీసుకెళ్లాలి” అంటూ కోడలివైపు చూసి ”పూర్వి బాగుందా మోక్షా! నీతో రాలేదా?” అన్నాడు సోఫాలో కూర్చుంటూ.
”రాలేదు మామయ్యా! అది మా అమ్మను వదిలి రానంటోంది” అంది అక్కడే నిలబడి మోక్ష.
వంటగదిలోకి వెళ్లిన మాధవీలతకు కోడలు, మామగార్ల సంభాషణ స్పష్టంగా విన్పిస్తోంది. మాధవీలతకు పూర్వి అంటే చాలా ఇష్టం. కానీ ఎత్తుకోవడమే రాదు. చిన్నపిల్ల కింద పడేస్తానేమోనన్న భయంతో పూర్వి పుట్టినప్పటి నుండి ఎత్తుకోలేదు. ఒకసారి పూర్వికి స్నానం చేయిస్తూ పూర్వి ముక్కుల్లోకి, చెవుల్లోకి నీళ్లుపోతాయేమోనన్న కంగారులో పూర్విని కింద పడేసింది. ఇక అప్పటి నుండి పూర్వి ఆడుతున్నా, దోగాడుతున్నా, తప్పటడుగులు వేస్తున్నా చూసి ఆనందిస్తుందే కాని ఎత్తుకోదు. ఇప్పుడు పూర్వి నడుస్తోంది. ముద్దుగా, మురిపెంగా దగ్గరకి తీసుకోవాలని చూస్తే అదేం చిత్రమో ‘నానమ్మ బూచి, పిచ్చి…’ అని వచ్చీ రాని మాటలతో అంటుంటే సిగ్గుగా వుంది. అది చూసి అంకిరెడ్డి కూడా ఆశ్చర్యపోతుంటాడు.
పూర్విని గుర్తు చేసుకుంటూ ”పూర్వి మారిందా? అలాగే వుందామ్మా మోక్షా? పూర్విని చూడాలని వుందమ్మా!” అన్నాడు.
”అలాగే వుంది మామయ్యా! పెద్దగా ఏం మారలేదు”
”చిన్నపిల్ల కదా! కాస్త వయసు వస్తే మారుతుందిలేమ్మా!”
”ఏం మారుతుందో మామయ్యా! బయటవాళ్లు ఎవరు వచ్చి ఎత్తుకోబోయినా, ముద్దు చేయబోయినా గీ అంటుంది. అమ్మే ప్రపంచం అయింది దానికి… వాళ్లేమనుకుంటారో ఏమో అని అమ్మ బాధపడుతుంటుంది. పైగా మాది విలేజ్‌ కల్చర్‌ కదా!”
”కానీ మీ ఇంటి వాతావరణం చూస్తుంటే మీది విలేజ్‌ కల్చర్‌లా అన్పించదు మోక్షా! నీ పెళ్లప్పుడు మేము అదే గమనించాం! మీ బంధువులు కూడా అలా లేరు.” అన్నాడు. ఆయనకు అది చాలా సంతోషమనిపించింది అప్పట్లో… ఆయన బంధువులు కూడా అంకిరెడ్డికి చాలా మంచి సంబంధమే దొరికిందనుకున్నారు.
”నిజమే మామయ్యా! ఇది మీరే కాదు మమ్మల్ని చూసిన చాలామంది ఇలాగే అంటుంటారు. మాది సిటీకి దూరంగా అవుట్ స్కక్టస్ లో వుండే వ్యవసాయ కుటుంబమే అయినా మాలో అందరం అంతో ఇంతో చదువుకున్న వాళ్లమే అయినందువల్లనే అలా అన్పిస్తుందేమో!” అంది.
ఈ లోపల మాధవీలత కాఫీ కలుపుకొచ్చి భర్తకి ఇచ్చింది.
అంకిరెడ్డి కాఫీ తాగుతుంటే మోక్ష ఆలోచనగా కొద్దిగా తల వంచుకుని మళ్లీ తల ఎత్తి ”చదువే కదా మామయ్యా! మనిషిని ఎంత దరిద్రంలోంచైనా బయటకు తీసుకొచ్చేది. స్నేహాలు కూడా అంతే! పాలమ్మేవాని కొడుకు, ఎం.పి. కొడుకు చదువుతున్న క్లాసులో గనక వుంటే వాళ్లు తప్పనిసరిగా ఫ్రెండ్సే అవుతారు. అక్కడ సోషల్‌ స్టేటస్‌ కాని, ఎకనామికల్‌ పొజిషన్‌ కాని అడ్డురావు. భుజాలమీద చేతులు వేసుకొని ‘అరె! మామా!’ అనుకుంటూ తిరుగుతారు. అది చూసి పెద్దవాళ్లు కూడా ‘ఆ అబ్బాయి మావాడి క్లాస్‌మేట్!’ అంటారే కాని పాలు అమ్మేవాని కొడుకు అని మాత్రం అనరు” అంది.
”నువ్వు చెప్పేది నిజమేనమ్మా మోక్షా! చదువుకోవటం వల్ల వచ్చే సౌకర్యాలు మరి దేనిలోనూ రావు. చదువుకుంటే చాలు అంతవరకు పూరిపాకలో వున్న వాడు కూడా ఆఫీసరైపోతాడు. మనం చూస్తుండగానే అందరూ నమస్తే పెట్టే సీట్లోకి వెళ్లిపోతాడు” అన్నాడు.
”మా నాన్నగారు కూడా ఇలాగే అంటుంటారు మామయ్యా! మా అన్నయ్య రవి చదివిన చదువుకి ఉద్యోగం రాక మా నాన్నగారి లాగే పొలం పనులు చూస్తుంటే మా పనివాని కొడుకు ఐఎఎస్‌ ఆఫీసరై హైదరాబాదులోనే వున్నాడు. అతనికి ఏ.సి.లో కూర్చుని ఫైల్స్‌ చూడడం తప్ప పొలం పనులు తెలియవు. మా అన్నయ్యకు ఎండలో కాలడం తప్ప ఎ.సి. ఎలా వుంటుందో తెలియదు. మా ఇంట్లో కాని మా ఊరిలో కాని రోజూ ఇదే చర్చ…” అంది మోక్ష.
అంకిరెడ్డికి వెంటనే తన కొడుకు సతీష్‌చంద్ర గుర్తొచ్చాడు. తను చెప్పిన మాట విని శ్రద్ధగా చదివి వుంటే తన కొడుకు కూడా జాన్‌ కొడుకు లాగే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయ్యేవాడు. నాయక్‌ కొడుకులాగే ఎం.బి.ఏ. చేసి వుంటే లండన్‌ వెళ్లి బిజినెస్‌ చేస్తుండేవాడు. వాసుదేవ్‌కి పిల్లలు లేరు. ఎప్పుడు విన్నా ‘జీవించడం ఒక కళ’ అంటూ చాలా కళాత్మకంగా జీవిస్తుంటాడు… తన పరిస్థితే విషమంగా వుంది. ‘నాకిక్కడ వుండాలని లేదు నాన్నా! మీరంతా నన్ను చదువులేని చవటను చూసినట్లు చూస్తున్నారు. మీ చూపుల్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు మాత్రం వుండదా నాన్నా కాసింత ప్రేమ, కాసింత పొగడ్త కావాలని. మీరు నా ముందే ఎంటెక్‌లు, ఎం.బి.ఏలు చేసినవాళ్లను ఆకాశానికెత్తి మాట్లాడుతుంటే నాకు ఎటైనా పారిపోవాలనిపిస్తుంది’ అన్న కొడుకు మాటలే గుర్తొస్తున్నాయి. మనసంతా వికలమైంది. వెంటనే తాగుతున్న కాఫీని పూర్తిగా తాగకుండానే సగం కాఫీ వున్న కప్పును టీపాయ్‌ మీద పెట్టి లేచాడు.
”నేను ఆఫీసు కెళ్లి వస్తాను. ఇప్పటికే బాగా ఆలస్యమైంది” అంటూ బయటకెళ్లి కార్లో కూర్చుని ఆఫీసుకెళ్లాడు అంకిరెడ్డి.
* * * * ** *
రాత్రి డిన్నర్‌ అయ్యాక- తలుపులన్నీ వేసి వంటగదిలోకి వెళ్లి లైటాపేసి తన గదిలోకి వెళ్తున్న మోక్షను ”ఇలా రా! మోక్షా!” అంటూ పిలిచింది మాధవీలత.
మోక్ష ఆగి తనవైపే చూస్తున్న అత్తగారి దగ్గరకి వెళ్లింది. క్రీం కలర్‌ నైటీలో వున్న మోక్ష షాంపూతో అప్పుడే హెడ్‌బాత్‌ చేసినట్లుంది. జుట్టును క్లిప్‌ పెట్టి అలాగే వదిలెయ్యడంతో సముద్రంలోని ఒక చిన్న అల వచ్చి ఆమె వీపుపై కదిలినట్లు జుట్టంతా నల్లగా నిగనిగలాడుతోంది. ఐదు అడుగులు దాటిన ఎత్తుతో సన్నగా, ఆరోగ్యంగా వున్న కోడలి వైపు అలాగే చూస్తే బాగోదని చూపుల్ని తిప్పుకుంటూ
”మన కాంపౌండ్‌ లోపల పూసిన సన్నజాజి పూలను తెంపి మాల అల్లి ఫ్రిజ్‌లో పెట్టాను. అవి పెట్టుకొని వెళ్లు” అంది.
అత్తగారు చెబుతుండగానే ఫ్రిజ్‌ దగ్గరకి వెళ్లింది మోక్ష. ఫ్రిజ్‌ డోర్‌ తీసి ఫ్రిజ్‌లో ఉన్న రెండు మూరల సన్నజాజి మాలను చేతిలోకి తీసికొంది. వెంటనే జుట్టుకున్న క్లిప్‌ను తీసి ఆ మాలను తల్లో పెట్టుకుంది. ఇప్పుడు జుట్టుతో పాటు ఆ మాల కూడా ఆమె కదిలినప్పుడల్లా కదులుతోంది. ఫ్రిజ్‌లో వున్నప్పుడు ఆ పూలకో పరిమళం వున్నట్లు తెలియలేదు కాని ఇప్పుడు మోక్ష ఎక్కడ తిరిగితే అక్కడ నేనున్నానన్నట్లు ఆ సన్నజాజి మాల తన సువాసనల్ని వెదజల్లుతోంది.
మాధవీలత అంకిరెడ్డి వున్న గదిలోకి వెళితే మోక్ష ఆనంద్‌ వున్న గదిలోకి వెళ్లింది. ఆమె వెళ్లేటప్పటికి ఆనంద్‌ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.
ఆమెకన్నా ముందుగా వెళ్లిన సన్నజాజిపూల వాసన అతన్ని చుట్టుముట్టింది. అతను దాన్ని ఆస్వాదించలేదు. అతను ఆఫీసు నుండి ఇంటికొచ్చాక ఆమెతో మాట్లాడే ఏకాంతం రాకపోవటంతో డిన్నర్‌ అయినప్పటి నుండి ఎప్పుడెప్పుడు గదిలోకి వస్తుందా అని ఆమెకోసం ఎదురుచూస్తున్నాడు.
అతను రిమోట్ తో టీవి ఆపుతుండగా ఆమె వెళ్లి అతని పక్కన పడుకుంది. అంతవరకు వెల్లకిలా పడుకొని వున్న ఆనంద్‌ అలాగే పడుకొని రెండు చేతుల్ని తలకింద పెట్టుకున్నాడు. ఆమె అతని వైపుకి తిరిగి తన చేతిని ప్రేమగా అతనిపై వేసింది.
ఆనంద్‌ ఆమె వైపుకి తిరగకుండా అలాగే పడుకొని ”డబ్బులు పంపారా మీవాళ్లు?” అన్నాడు.
అతని మీద వేసిన చేతిని మెల్లగా తనవైపుకి తీసుకుంది. ఆమె కూడా తిరిగి వెల్లకిలా పడుకుంది. ”పంపుతారట. ఇప్పుడు కాదు” అంది.
”ఇంకెప్పుడు?” అన్నాడు. అతని గొంతులో అంతవరకు వున్న సౌమ్యత తగ్గింది.
ఆమె పడుకున్నదల్లా చటుక్కున లేచి కూర్చుంది.
”ఏంటి! లేచికూర్చున్నావ్‌?”
”పడుకుంటే నేను మీకెలా కన్పిస్తాను. మీరేమైనా నావైపు చూస్తున్నారా?”
”డబ్బులు అడగానికి చూడటమెందుకు? పిచ్చిప్రశ్న కాకపోతే!”
”మీరెంత ఆర్టిఫీషియల్‌గా వున్నారో మీకు తెలుస్తుందా?”
”నాకు ఆర్టిఫీషియల్‌గా వుండటమే ఇష్టం. లేకుంటే మోసపోతాం! మనల్ని మనం మోసం చేసుకుంటుంటాం. అది నాకు ఇష్టం వుండదు”
”డబ్బు తప్ప మీకు ఇంకే ఇష్టాలు లేవా?”
”డబ్బు తప్ప కేవలం ఇష్టాలు మాత్రమే వున్నవాళ్లని పెళ్లి చేసుకోవలసింది. ఇష్టం వచ్చినట్లు గాల్లో చప్పట్లు కొట్టుకుంటూ ఎంజాయ్‌ చేసేదానివి… అయినా నా డబ్బులు నాకు ఇవ్వటానికి మీ వాళ్లకి ఏం నొప్పి…?”
”ఫ్రాంక్‌గా చెప్పండి! మావాళ్లు మీ దగ్గరేమైనా డబ్బులు తీసుకున్నారా? లేదు కదా! పెళ్లిలో కట్నం డబ్బులు ఇవ్వలేక నోటు రాసిచ్చారు. దానికే వాళ్లేదో మీ దగ్గర డబ్బులు తీసుకున్నట్లు ఒకటే నస… భరించలేకపోతున్నాను. ఒక్కరోజు కాదు, మూడు సంవత్సరాలుగా!” అంది.
అతను కూడా లేచి కూర్చుని ”నాది నసా? నోటు రాసిచ్చినప్పుడు చచ్చినట్లు డబ్బులు ఇవ్వాలా లేదా? మూడు సంవత్సరాలుగా సతాయిస్తున్నారు… అసలు ఎవరు రాసిమ్మన్నారు మీవాళ్లను ప్రోనోటు? ఏదో నోట్ కదా డబ్బులేమైనా ఇస్తున్నామా? రోజులు గడిచేకొద్ది వాళ్ల భార్యాభర్తల అనుబంధం పెరిగి నోటు విషయం మరచిపోతామనుకున్నారు మీవాళ్లు… వెదవ తెలివితేటలు. అలాంటి తెలివి తేటలు వాళ్లకన్నా నాకే ఎక్కువ వున్నాయి. అది తెలిసినట్లు లేదు వాళ్లకు… వెళ్లి చెప్పు!” అన్నాడు ఆనంద్‌.
”ఎప్పుడు వెళ్లాలి? ఎప్పుడు చెప్పాలి?”
”రేపే వెళ్లి చెప్పు!”
”నేను వెళ్లను. నాకు మా ఆఫీసులో లీవ్స్‌ ఇవ్వమని మొన్న మా ఊరు వెళ్లేటప్పుడే చెప్పారు…”
”మరి డబ్బులెలా రావాలి? వాళ్లేమైనా నాకు ఫైనాన్స్‌ వాళ్లకి ఇచ్చినట్లు పదిరూపాయలు వడ్డీ ఇస్తున్నారా? నోటులో క్లియర్‌గా నెలకి నూటికి ఒక్కరూపాయి వడ్డీ మాత్రమే ఇవ్వగలం అని రాసివుంది. వడ్డీ రేటన్నా పెంచమను, లేకుంటే డబ్బులైనా త్వరగా ఇమ్మను” అన్నాడు.
”ఈ సంవత్సరమైతే మావాళ్లు మీకు డబ్బులు ఇవ్వలేరు. మొన్న వచ్చిన తుఫానుకు తోటలో కాచిన కాయ పూత మొత్తం రాలిపోయింది. అది చూసి ఇంట్లో అందరు కుప్పకూలిపోయి వున్నారు. ఈ స్థితిలో నేను వెళ్లి వడ్డీరేటు పెంచమనో, లేదా డబ్బులు ఇమ్మనో అడిగితే వాళ్లంతా విషం తాగి చస్తారు” అంది. అలా అంటున్నప్పుడు బాధతో ఆమె గొంతు వణికింది.
అతనే మాత్రం ఆమెను అర్థం చేసుకోకుండా ”బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నవు కదూ! అంటే మళ్లీ మీ తోటలో కాపు వచ్చేంతవరకు నన్ను డబ్బులు అడగవద్దనేగా! అప్పుడు కూడా తుఫాను రాకుంటేనే డబ్బులు వస్తాయి. లేకుంటే ఆ సంవత్సరం కూడా రావు” అన్నాడు.
మోక్ష మాట్లాడలేదు.
”అవునూ! నాకు ఒకటే అర్థం కాదు మోక్షా!” అని ఆగాడు.
ఏమిటన్నట్లు అతనివైపు చూసింది. అతను మాత్రం ఎో చూసి ”తుఫాను వచ్చినా మీవాళ్లు తింటున్నారు, స్నానాలు చేస్తున్నారు, డ్రస్‌లు మార్చుకుంటున్నారు. నిద్రపోతున్నారు. నా డబ్బులే ఎందుకు ఆపుతున్నారు? అలా ఆపినందువల్ల నేనెంత నష్టపోతున్నానో నీకు తెలుసా?” అన్నాడు.
”మీకేం నష్టమండీ?” వెంటనే అంది.
”అది నీకు చెప్పినా అర్థం కాదులే!” అన్నాడు.
”చదువుకున్న దాన్నేగా! చెప్పండి పర్వాలేదు” అంది.
”మూడు సంవత్సరాల క్రితం మీవాళ్లు నాకు ఇస్తామన్న డబ్బుల్ని అప్పుడే ఇచ్చి వుంటే వాటిని నేను రెండు రూపాయల వడ్డీకి అప్పటి నుండే బయటనో, మా ఆఫీసులోనో ఇచ్చి, మార్చుకునేవాడిని. మా ఆఫీసులో చాలామంది ఇలాగే చేస్తుంటారు”
ఆశ్చర్యపోయి చూసింది మోక్ష.
”ఏంటా చూపు? ఇప్పుడు రూపాయి విలువ పడిపోయి భవిష్యత్తులో చాలా బాధలొస్తాయని ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో రూపాయల్ని పెంచుకోవాలనే ప్రయత్నిస్తున్నారు. అయినా ఏర్‌టెల్‌ ఆఫీసులో పని చేస్తున్న దానివి రూపాయి విలువ గురించి నేను నీకు చెప్పాలా? నీకు తెలియదా? 1917 సం||లో 1 రూ|| విలువ 13 డాలర్లు అయితే ఇప్పుడు అనగా 2013లో 60 రూ|| విలువ 1 డాలర్‌ అయ్యింది…” అన్నాడు.
ఇప్పుడు మరింత ఆశ్చర్యపోయి చూసింది మోక్ష.
”నువ్వలా చూడకు. నేనేదో ఆర్ధిక నేరం చేసి సంపాయిస్తుంటే నువ్వు దాన్ని పబ్లిక్‌ చేసి ఆన్‌లైన్లో పెట్టి అందరికీ తెలియజేస్తావేమోననిపిస్తోంది. నేనేం చేసినా మన పాపకోసమే…” అన్నాడు.
ఆమె వెంటనే కదిలి ”ఏదీ మళ్లీ అనండి ఆ మాట?” అంది.
ఆనంద్‌ ఆ మాటను మళ్లీ అన్నాడు. నాకేమైనా భయమా అన్నట్లు చూశాడు. నాకు నా పాప ముఖ్యం అన్నట్లు మరింత ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు.
”నేను దాన్ని కాదనను. ఏ తండ్రి సంపాదన అయినా చివరకి అంతో ఇంతో పిల్లలకే వస్తుంది. కానీ నేను మా ఊరు వెళ్లి వచ్చాను కదా! మీరు ఆఫీసు నుండి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. పూర్వి ఎలా వుందని అడిగారా? దాన్ని చూడాలని వుంది అని అయినా చెప్పారా? మానవీయ సంబంధాలు ఏ కోశానా లేకుండా దానికోసం మీరెంత ప్రోగు చేసి ఏం లాభం? అది దానికి తెలుస్తుందా? మీరిచ్చే ఒక చిన్న ముద్దు కలిగించే ఆనందమే కదా దానికిప్పుడు కావాలి… ఆ వయసులోనే కదా అదిప్పుడు వుండేది… ఎప్పుడు చూసినా అది మా ఊరిలోనే వుంటోంది. అక్కడే పెరుగుతోంది…” అంది.
ఆమె వైపు సూటిగా చూసి ”అంటే నువ్వనేది నాకర్థం కావడం లేదు. ఇప్పుడు నేను నీ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి?”
”అర్థం చేసుకోవాలని వుంటే కదా అర్థమయ్యేది”
”అర్థమయిందిలే. ఇంత క్లియర్‌గా చెప్పాక ఇంకా అర్థం కాకుండా వుంటుందా? పూర్వి పుట్టినప్పటి నుండి మీ ఊరిలోనే వుంది కాబట్టి దాని పాలకి, నీళ్లకి, తిండికి, వసతికి మీవాళ్ళు లెక్కలు కట్టి నాకివ్వాల్సిన డబ్బుల్లో తగ్గించి యిస్తారేమోకదా!” అన్నాడు.
మోక్ష విసురుగా లేచి నిలబడి తలగడను చేతుల్లోకి తీసుకొని ”నేను వెళ్లి హాల్లో వున్న సోఫాలో పడుకుంటాను. ఇక్కడ పడుకుంటే నాకు నిద్ర పట్టేలాలేదు. ఉదయాన్నే లేచి ఆఫీసుకెళ్లాలి” అంది. అతను కూడా లేచి ఆమె చేతిలో వున్న తలగడను లాగి బెడ్‌మీద పడేసి
”అవసరం లేదు. ఇక్కడే పడుకో! అమ్మ చూసిందంటే నేనేదో నేరం చేసినట్లు అసలు నేరస్తుల్ని వదిలేసి నన్ను తిడుతుంది. ఎొచ్చీ డబ్బులు ఎగ్గొట్టాలనేగా మీవాళ్ల ప్రయత్నం. లేకుంటే పూర్వి ప్రసక్తి ఎందుకు తెస్తావ్‌? నీతో ఇన్ని మాటలు ఎందుకు గాని భవిష్యత్తులో ఏ ఇబ్బందీ వుండకుండా, నువ్వో పని చెయ్యి” అన్నాడు.
”ఏం పని?”
”పూర్విని వాళ్లు వుంచుకొని పెంచుతున్నందుకు నెలకి ఇంతని మనమే లెక్కచూసి ఇద్దాం! లేకుంటే వాళ్లు నాకివ్వాల్సిన డబ్బులు పూర్విని పెంచినందుకు సరిపోయాయంటారు” అన్నాడు.
బాధతో, కోపంతో, రోషంతో ఆమె ముక్కుపుటాలు ఎరుపెక్కి ఆమె ముఖంలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. భర్తతో గొడవ పడటం ఆమెకు ఇష్టం లేదు. ఇందులో తన తండ్రి తప్పు కూడా ఏం లేదు. మూడు సంవత్సరాలుగా పంటలు లేవు. బ్యాంకులో తీసుకున్న క్రాపు లోను కట్టానికే కష్టంగా వుందంటున్నారు. అన్నయ్యను బయటకెళ్లి ఏదైనా పని చూసుకోమని ఎంత చెప్పినా ఊరు వదిలి బయటకెళ్లడు.
”మాట్లాడవేం! నేను చెప్పిన అభిప్రాయం ఎలా వుంది?” అన్నాడు. మెచ్చుకుంటుందనుకున్నాడు.
కానీ ఆమె ”చెత్తలా వుంది” అంటే చేత్తో పొడిచి చంపుతాడేమోనని నాలికను అదుపులో పెట్టుకుంది. పెళ్లయినప్పటి నుండి ఇలా ఎప్పటికప్పుడు తన మనోభావాలను నొక్కిపెడుతూనే వుంది. ఎక్కువసేపు నిలబడకుండా పడుకుంది. ఈసారి అతని వైపు తిరిగి పడుకోలేదు. గోడవైపుకి తిరిగి పడుకుంది.
అతనికి వెంటనే సమాధానం ఇవ్వకపోతే జబ్బమీద చేయివేసి గట్టిగా నొక్కిపట్టుకొని అతని వైపుకి తిప్పుకుంటాడని ఆమెకు తెలుసు. అందుకే ”మీకు ఇవ్వాల్సిన డబ్బులు తప్పకుండా ఇస్తారు. కాకపోతే కాస్త సమయం పడుతుంది. పూర్వి ఖర్చులకి దానికి సంబంధం లేదు.” అంది.
”అని నువ్వు అనగానే సరిపోతుందా? నాకిదో డౌట్ పెట్టావుగా ఇప్పుడు! నేనెలా నమ్మాలి మీ వాళ్లను. నాకు ఇవ్వాల్సిన డబ్బుల్లో కొన్ని డబ్బులయినా చెల్లుబెట్టుకోకుండా ఇస్తారని…” అన్నాడు.
”ఐతే పూర్విని ఇక్కడికి తీసుకురానా?”
”అదిక్కడ కొస్తే నిన్ను ఆఫీసుకు వెళ్లనిస్తుందా?”
”అత్తగారు వున్నారుగా?”
”అమ్మకి దాని పనులేమొస్తాయ్‌?”
”ఐతే దాని గురించి ఇంకెప్పుడూ మాట్లాడకండి! దాన్ని చూస్తుంటే మావాళ్లకి నన్ను చూస్తున్నట్లే వుంటుందట… నన్ను పెంచినంత ప్రేమగా దాన్నికూడా పెంచుకుంటున్నారు. అది ఆడుకునేది నేలమీద కాదు మా అన్నయ్య, మా నాన్నల గుండెల మీద… వాళ్ల ప్రేమను డబ్బుతో లెక్కకట్టి రక్త సంబంధాలను దుమ్ములో కలపకండి! అయినా నా బిడ్డేమైనా మావాళ్లకి పేయింగ్‌ గెస్టా?? మనవరాలు… భవిష్యత్తులో పూర్వికో బిడ్డపుడితే ఆ బిడ్డకి కొనిచ్చే చాక్‌లెట్టు మీరు మీ అల్లుడు దగ్గర డబ్బులు తీసుకుంటారేమో కాని మావాళ్లు అలా తీసుకోరు. పడుకోండి!”
ఆనంద్‌ మాట్లాడలేదు… మాటలు ఆగిపోవటం వల్లనో ఏమో గదితో పాటు మనసు కూడా నిశ్ధబ్దంగా మారింది.
మోక్ష తలలో సన్నజాజి పూల వాసన గాల్లో తేలివస్తూ గదితోపాటు మనసుకు కూడా వ్యాపిస్తోంది. వెంటనే అతని చేయి ఆమె మీద పడేలోపలే ఆమె కదిలి సన్నజాజి పూలకున్న క్లిప్‌ని లాగేసింది.
”అత్తయ్య పెట్టుకోమంటే పెట్టుకున్నాను కాని పెట్టుకున్నప్పటి నుండి గుచ్చుకుంటూనే వున్నాయి. ఏం పూలో, ఏం వాసనో” అంటూ లేచి ఆ పూలను టీ.వి. పక్కన పెట్టేసింది.
ఒక్క క్షణం ఆమె ముఖంలోకి చూసి ఆమె మీద వెయ్యాలనుకున్న చేయిని వెనక్కు తీసుకున్నాడు ఆనంద్‌.
* * * * * *
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తల్లిదండ్రులు ఫేస్‌బుక్‌తో పెనవేసుకుపోయిన తమ పిల్లల జీవితాలను చూసి ఆందోళన చెందుతుంటే అంకిరెడ్డి సైన్యంలో చేరిన తన కొడుకు గురించి ఆలోచిస్తూ అంతకన్నా ఎక్కువగా ఆందోళన చెందుతున్నాడు. నిజానికి ఫేస్‌బుక్‌తో ఆడుకునే పిల్లల జీవితాలు చివరకి ఎలా వుంటాయో, ఎంత అయోమయంగా మారుతాయో తెలియకపోయినా సైన్యంలో వున్న తన కొడుకు జీవితం ఏ క్షణాన ఎలా మారుతుందో అసలు వుంటుందో లేకుండా పోతుందోనన్న బెంగ ఆయన్ని వదలడం లేదు.
ఆలోచిస్తూ కారులో వస్తున్న అంకిరెడ్డికి సతీష్‌చంద్ర స్నేహితుడు నరేంద్ర రోడ్డు మీద నడుచుకుంటూ రావడం కన్పించి వెంటనే కారును పక్కకి తీసి ఆపేశాడు. అంకిరెడ్డి కారు డోర్‌ తీసుకొని ఆత్రంగా కారు దిగి నరేంద్ర వైపు అడుగులు వేసి ”నరేంద్రా! ఎప్పుడొచ్చావ్‌?” అంటూ ప్రేమగా పలకరించాడు.
ఎప్పుడైనా పిలవగానే ”అంకుల్‌!” అంటూ అత్యుత్సాహంతో పలికే నరేంద్ర ట్రాన్స్‌లో వున్నట్లు అంకిరెడ్డిని చూడగానే ”అంకుల్‌! మీరా?” అన్నాడు.
”నేనేనయ్యా ఎప్పుడొచ్చావ్‌? నువ్వు బాగున్నావా?” అంటూ నరేంద్ర ఒళ్లంతా తడిమాడు. మళ్లీ జన్మ ఎత్తినవాడిని చూసినట్లు చూశాడు.
నరేంద్ర ఆశ్చర్యపోయి ”ఎందుకంకుల్‌ అలా అడుగుతున్నారు? నేను బాగానే వున్నాను. ఓ… మీక్కూడా ఆ విషయం తెలిసిందా?” అన్నాడు బాధగా.
”తెలిసిందయ్యా! రాత్రి పది గంటల న్యూస్‌లో చూశాను. అదే న్యూస్‌ రిపీట్ కూడా అయింది” అన్నాడు.
”నమ్మలేకపోతున్నాను అంకుల్‌! టీ.వీలో రావటం ఏంటి? అదే న్యూస్‌ రిపీట్ కావడం ఏంటి? ఆ వార్త అంతదాకా రాలేదు. మా నాన్న కాల్‌ చెయ్యగానే నేను ప్లైట్ లో వచ్చాను… ఇప్పుడు నా భార్య బాగానే వుంది… కానీ ఇంకా బాగుండాలంటే ఎలా అన్నది నేను వెళ్లేలోపల ఆలోచించి డిసైడ్‌ చెయ్యాలి. అలా చేసే వెళ్తాను” అన్నాడు.
నరేంద్ర చెప్పేది అంకిరెడ్డికి అర్థం కాలేదు. నరేంద్ర న్యావీలో పనిచేస్తాడు. ఆర్మీలో వుండే తన కొడుకు సతీష్‌చంద్ర, ఈ నరేంద్ర బాల్య స్నేహితులు. వాళ్లు ఏ ప్రాంతంలో వున్నా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుని ఒకరి సమాచారం ఒకరు తెలుసుకుంటుంటారు. ఎప్పుడైనా సతీష్‌చంద్ర ఫోన్‌ కలవకపోయినా… రింగొచ్చి ఆగిపోయినా, మాటల మధ్యలో ఫోన్‌ కట్ అయినా కలవరపడి వెంటనే నరేంద్రకి కాల్‌ చేసి సతీష్‌చంద్ర యోగక్షేమాలను తెలుసుకుంటాడు అంకిరెడ్డి. రాత్రి చూసిన న్యూస్‌ వల్ల నరేంద్ర చనిపోయి వుంటాడనే అనుకున్నాడు అంకిరెడ్డి. వెంటనే సతీష్‌చంద్రకి కూడా కాల్‌ చేశాడు. సతీష్‌చంద్ర ఎక్కడున్నాడో ఏమో ఫోన్‌ కలవలేదు. అతని ఫోన్‌ కలవక పోవడం వల్ల అతనెలా వున్నాడోనని రాత్రంతా నిద్ర పోలేదు. ఇప్పుడు నరేంద్ర కన్పించగానే షాక్‌ తిని అవాక్కయ్యాడు. కానీ నరేంద్ర ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు అంకిరెడ్డికి…
”నరేంద్రా! రాత్రి నుండి నా కొడుకు ఫోనే చెయ్యట్లేదయ్యా! అలా ఫోన్‌ చెయ్యకపోతే దూరంలో వున్నాడు. ఎలావున్నాడో ఏమోనన్న భయం మాకుండదా? నువ్వయినా చెప్పయ్యా! ఎలా వున్నాడు నా కొడుకు? అసలే అక్కడ గొడవలుగా వున్నాయిటగా!” చాలా దయనీయంగా అడిగాడు.
”మీరేం కంగారు పడకండి అంకుల్‌! అతను కాల్‌ చేస్తాడు. నేను మెసేజ్‌ పెట్టి అతని చేత మీకు కాల్‌ చేయిస్తాను. ఇప్పుడు అతను ముందున్న దగ్గర లేడు. అరుణాచల్‌ మార్చారు. ఆ హడావుడిలో వుండి మీకు ఫోన్‌ చెయ్యటం కుదిరి వుండదు” అన్నాడు.
”నిజంగా వాడు ఆర్మీలో చేరడం నాకు ఇష్టం లేదు నరేంద్రా! అసలు వాడు అందులో చేరేటప్పుడు ఆ ఫీల్డ్‌ గురించి నాకేం తెలియదు. తెలిసివుంటే వెళ్లనిచ్చేవాడిని కాదు. ఇప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు ఏ ఊరు మారుస్తారో తెలియదు. ఏ ఊరు ఎలా వుంటుందో తెలియదు. అక్కడ ఎన్ని బాధలు వుంటాయో తెలియదు. అప్పటికి వెళ్లేటప్పుడు వద్దనే చెప్పాను. నా మాట వినకుండా వెళ్లాడు” అన్నాడు.
”డోంట్ వర్రీ అంకుల్‌! ఏ ఊరు మారినా ఏం కాదు. ఎంజాయ్‌గానే వుంటుంది” అన్నాడు నరేంద్ర.
”యుద్ధం ఎంజాయా నరేంద్రా? అంతకన్నా రిస్క్‌ ఇంకొకి వుందా?”
”ఎవరి ఫోర్స్‌ వల్లనో అందులోకి వెళ్లలేదు కదంకుల్‌! అందుకే రిస్క్‌ వున్నా అలా అన్పించదు. పైగా మా వల్ల ఏదో ఉపయోగం వుందన్న తృప్తిలో వుంటాం!” అన్నాడు.
ఆయనకు రాత్రి చూసిన న్యూస్‌ గుర్తొచ్చి ”ఏం చూసుకొని తృప్తి పడతారయ్యా నరేంద్రా! నువ్వుండే దగ్గరేగా (ముంబై డాక్‌యార్డ్‌లో) మంగళవారం అర్ధరాత్రి ఐఎన్‌ఎస్‌ సింధురక్షక్‌ జలంతర్గామిలో పేలుడు జరిగింది. సహాయక చర్యల్లో భాగంగా మీ నేవీకి చెందిన గజ ఈతగాళ్లు ఎంత ప్రయత్నిస్తున్నా జలంతర్గామి లోపలకి ప్రవేశించలేక పోతున్నారట… జలాంతర్గామిలో చిక్కుకున్న 18 మంది నేవీ సిబ్బంది ఆచూకీ ఇంకా తెలియనే లేదట… ప్రమాద సమయంలో జలాంతర్గామిలో వున్న ముగ్గురు అధికారులతో సహా నేవీ సిబ్బంది అంతా మరణించి వుంటారని అనుమానిస్తున్నారట… ఇదంతా చూసిన నేను నువ్వు ప్రాణాలతో వున్నావన్న వార్తను వినాలని నా కొడుక్కి ఎన్నిసార్లు ఫోన్‌ చేసివుంటానో నీకు చెప్పినా నమ్మవు” అన్నాడు. ఆయన మాటల్లోని నిజాయితీ నరేంద్ర హృదయాన్ని కదిలించింది.
”కానీ మా జలాంతర్గామిలో ఆక్సిజన్‌ బ్యాగులు అందుబాటులో వుంటాయి అంకుల్‌! కాకపోతే జలాంతర్గామిలోకి భారీగా నీరు చేరడం, లోపలతంతా చీకిగా వుండటం వల్ల సహాయిక చర్యలకి అడ్డంకిగా వుంది. పేలుడు వల్ల వెలువడిన వేడి కారణంగా జలాంతర్గామి లోపల నిర్మాణం కరిగిపోయి, గదులు ధ్వంసమై వస్తువులు, పరికరాలు చిందర వందర కావడం వల్ల గజ ఈతగాళ్లు లోపలకి ప్రవేశించలేకపోతున్నారట. అందుకే జలాంతర్గామిలో నిండిన నీటిని భారీ పంపులతో తోడేందుకు ప్రయత్నిస్తున్నారు. జలాంతర్గామిని సముద్రంపై తేలేలా చేసేందుకు యుద్ధ ప్రతిపాదికన 24 గంటల పాటు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకో రెండు మూడు రోజుల్లో తెలుస్తాయి. అయినా అది ఏ యుద్ధం వల్లనో, విద్రోహ చర్య వల్లనో జరిగింది కాదు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన. అయినా సింధురక్షక్‌ ప్రమాదంపై దర్యాప్తులో సహాయం చేస్తామని రష్యా తెలిపింది. తమ నేవీ ఇంజనీర్లను పంపుతామని వెల్లడించారు. నేవీ సిబ్బంది గాలింపు చర్యల్లో సహాయపడేందుకు సిద్ధంగా వున్నామని అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు తెలిపాయి. అవసరమైతే ఆ దేశాల సహాయం తీసుకుంటామని నేవీ వర్గాలు చెప్పాయి. మనకేమైనా జరిగితే పక్క దేశాలు చూస్తూ వూరుకోవు. ఆదుకుంటాయి అంకుల్‌” అన్నాడు.
”అంత పెద్ద ప్రమాదాన్ని ఎంత తేలిగ్గా చెబుతున్నావ్‌ నరేంద్రా! చెబితే చెప్పావ్‌ గాని ఎలాగూ వచ్చావ్‌! ప్రాణాలతో వున్నావ్‌! దానికి సంతోషం. ఇక వెళ్లకు…” అన్నాడు.
”అలా వుండదు అంకుల్‌! నేను ఇక్కడికి వచ్చిన కారణం వేరు. మళ్లీ వెళ్తాను. అయినా మీరు భయపడే యుద్ధాలేం అక్కడ జరగవు” అన్నాడు నరేంద్ర.
”యుద్ధాలు అక్కడ జరగక ఇక్కడ జరుగుతాయా నరేంద్రా! మరీ చిన్నపిల్లాడిని చేసి మాట్లాడకు…”
”అది కాదు అంకుల్‌! ఇప్పుడు ప్రపంచంలో శాంతి ఎక్కువైంది”
”శాంతా!!!”
”అవునంకుల్‌! శాంతినే! భూమికోసం యుద్ధం చేయడం పూర్తిగా తగ్గింది. అందుకే శాంతి ఎక్కువైంది అంటున్నాను” అన్నాడు నరేంద్ర.
ఇలాంటి వాళ్లు సైన్యంలోకి వెళ్తారనే గాని వీళ్లకేం తెలుసని? ఏది తెలియాలన్నా బుక్స్‌ చదవాలి లేదంటే ప్రపంచాన్నయినా చూడాలి. కాని చూడలేదు.
నరేంద్రకు భయమేసింది. ”నువ్వు తప్పుకో నరేంద్రా! మీరు కూడా కొంచెం తప్పుకొని గాలి రానివ్వండి!” అంటూ ఆడవాళ్లలో ఒకావిడ సౌమ్య చేయి పట్టుకొని చూసి ”నాడి సరిగ్గా కొట్టుకోవటం లేదు బాబు! హాస్పిటల్‌కి తీసుకెళ్లు” అంటూ తొందర పెట్టింది. తారమ్మ కూడా కోడలివైపు చూస్తూ అక్కడే నిలబడింది. ఆమెను ఎవరూ ఏమీ అనటం లేదు. ఆమెవైపు కూడా చూడడం లేదు. సౌమ్య బ్రతకదన్న అనుమానంతో ఏడుస్తున్నారు.
నరేంద్రకి మెదడంతా మొద్దుబారినట్లైంది. ఆ కంగారులో అతనికి ఏం చేయాలో తోచటం లేదు. అంకిరెడ్డి వైపు చూశాడు. ఆయన వెంటనే నరేంద్ర భుజం తట్టి ”కమాన్‌! నరేంద్రా! అమ్మాయిని కారులో పడుకోబెట్టు హాస్పిటల్‌కి తీసికెళ్దాం! ఆలస్యం చెయ్యొద్దు” అంటూ ఆయన కారు దగ్గరకి వెళ్లి కారు వెనక డోరు తెరవగానే నరేంద్ర సౌమ్యను రెండు చేతులపై లేపుకొచ్చి కార్లో పడుకోబెట్టాడు. ఆమె తలను తన ఒడిలో పెట్టుకొని అతను వెనక సీట్లోనే కూర్చున్నాడు.
అంకిరెడ్డి డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని కారును చాలా ఫాస్ట్‌గా డ్రైవ్‌ చేస్తున్నాడు. ఆయన తారమ్మ మాటల్ని ప్రత్యక్షంగా వినడం వల్లనో ఏమో ”అయ్యో! పాపం! ఏ తల్లి కన్నబిడ్డో” అని సౌమ్య గురించే ఆలోచిస్తున్నాడు. హాస్పిటల్‌ రాగానే ఆయన కారు ఆపుకొని, కారు దిగి హాస్పిటల్‌ లోపలికి వెళ్లాడు. అక్కడ వాళ్లతో ఏం మాట్లాడాడో ఏమో హాస్పిటల్‌ సిబ్బంది ఆయన వెంటే స్ట్రెచర్‌ పట్టుకొని కారు దగ్గరకి వచ్చారు.
నరేంద్ర కారు దిగి సౌమ్యను స్ట్రెచర్‌ మీదకు చేర్చాడు.
వాళ్లు చూస్తుండగానే సౌమ్య వున్న స్ట్రెచర్‌ కారిడార్‌కి కుడివైపున వున్న ఎమర్జన్సీ వార్డులోకి వెళ్లింది.
సౌమ్యకి స్పెషల్‌ డాక్టర్స్‌వచ్చి స్పెషల్‌ ట్రీట్మెంట్ ఇస్తుంటే అంకిరెడ్డి, నరేంద్ర కారిడార్‌లో నిలబడి వున్నారు. సౌమ్యను చూడానికి వచ్చిన ఆ ఊరివాళ్లు హాస్పిటల్‌ లోపల కాంపౌండు గోడ దగ్గర నిలబడి ఆందోళనగా ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుకుంటున్నారు. తారమ్మ మాత్రం నెత్తిమీద గుడ్డేసుకొని అటు ఇటు చూస్తూ, వాళ్ల మాటలు విన్నా విననట్లే నిలబడి వుంది.
హాస్పిటల్‌ లోపల నుండి వాళ్ల ఊరు అతను బయటకొచ్చి ఆడవాళ్లు నిలబడి వున్న చోటుకి వెళ్లి తారమ్మతో ”భయపడాల్సిందేం లేదు. లోపల నీ కోడలికి స్పెషల్‌ ట్రీట్మెంట్ జరుగుతోంది” అని చెప్పి అక్కడే నిలబడ్డాడు.
ఆమె ఉలిక్కిపడి ”మళ్లీ దానికి స్పెషల్‌ ట్రీట్మెంటా? మొన్నంతా అదే వైద్యం చేశారు. ఇప్పుడు కూడా అదే అంటే ఎన్ని డబ్బులు కావాలి?” అంది.
అతనికి మండి ”అసలు ఇదంతా నీవల్లనే జరిగింది. ఎప్పుడు చూసినా ఆ నోటితో ఏదో ఒకటి అంటూనే వుంటావు” అన్నాడు.
”నేనేమన్నానురా!” అంది తారమ్మ.
”ఎందుకనవులే! నీకేమైనా భయమా! పాడా! ఏదో ఒకటి అని బాధ పెడుతూనే వుంటావు. అసలు ఆ సౌమ్యమ్మ కాబట్టి నీ దగ్గర వుంది. ఇంకో కోడలైతే ఎప్పుడో పుట్టింటికి వెళ్లేది” అన్నాడు అటుఇటు చూసి ఎవరూ వినడం లేదులే అన్నట్లు. వాళ్ల మాటలు అంకిరెడ్డికి, నరేంద్రకి విన్పిస్తూనే వున్నాయి.
”పుట్టింటికా! పెళ్లి చేసుకునేది పుట్టింట్లో వుండానికా?” అరిచింది తారమ్మ.
”వుండక… నువ్విలా చూస్తుంటే ఏం చేస్తారు? చావాలా?”
”చావమని నేనన్నానా? అదే చావాలని చూస్తోంది… ఇదిగో నన్నిలా మాటలు అన్పించానికి…”
”ఇందుకే నీకు నోరెక్కువనేది. నిన్ను మాటలు అన్పించానికి ప్రాణాలు తీసుకుంటారా ఎవరైనా? నువ్వు మాటలు అంటుంటే భరించలేక చావాలనుకుంటోంది నీ కోడలు… ఏం ఒక్క రోజన్నా మౌనంగా వుండలేవా? ఎప్పుడు చూసినా కోడల్ని ముఖం మ్మీదే నల్లమొహం దానా పిల్లికళ్ల దానా అనకపోతే. అదేం అంటే కాళ్లు వత్తమంటావ్‌! అరికాళ్లు గీరమంటావ్‌! పొలంలోకి అన్నం తేవడం కాస్త ఆలస్యమైనా కళ్లెర్ర చేసి పచ్చిబూతులు తిడతావ్‌! మేం వినటం లేదా? నువ్వసలు అత్తవా? రాక్షసివా? మన ఊరిలో అత్తలందరు కోడళ్లని నీలాగే చూస్తున్నారా?”
”ఏమైందిరా నీకు? నామీద పడి ఏడుస్తున్నావ్‌? అసలే నా బాధలో నేనుంటే! చూస్తుంటే ఇది చాలా పెద్ద హాస్పిటల్లా వుంది. ఖర్చు ఎంతవుతుందో ఏమో!” అంది హాస్పిటల్‌ ఎత్తును తలఎత్తి చూస్తూ.
”ఎంతయితే ఏం కోడలు బ్రతికితే చాలదా? కాకుంటే ఒక ఎకరం పొలం అమ్ము… ఉన్న ఒక్క కొడుకు నరేంద్ర ఎలాగూ నీ దగ్గర వుండకుండా సైన్యంలో చేరాడు. కనీసం కోడల్ని అయినా కొంపలో వుంచుకో! తలదించు. మెడ పట్టుకుంటుంది” అని అతను అక్కడి నుండి వెళ్లిపోయాడు.
తారమ్మ అతను వెళ్లగానే తలదించి ఆడవాళ్ల వైపుకి తిరిగింది. వాళ్ల లోకంలో వాళ్లున్నారు. వాళ్ల ధ్యాసంతా సౌమ్య వాళ్ల అన్నయ్య ఇంకా రాలేదని, ఆమె తల్లిదండ్రులు కూడా రాలేదని… ఇదే విషయం మీద కొంతమంది బుగ్గలు నొక్కుకుంటున్నారు. కొంతమంది మాత్రం అసలీ వార్త వాళ్లదాకా వెళ్లిందో లేదో అని అనుకుంటున్నారు.
ఈలోగా ఒకతను వెళ్తుంటే ”ఇదిగో నాయనా! కొంచెం ఆగు” అంటూ అతన్ని ఆపింది తారమ్మ. నెత్తిమీద వున్న గుడ్డను సవరించుకుంటూ ”నా కొడుకు దేశానికి సేవచేస్తూ సైన్యంలో వుంటాడయ్యా! నా కోడలికి ఈ హాస్పిటల్‌లో ఉచితంగా వైద్యం చెయ్యరా?” అని అడిగింది.
”చెయ్యరమ్మా! ఇది ప్రైవేటు హాస్పిటల్‌. మిలటరీ హాస్పిటల్‌ కాదు. ఇందులో ఎంత ఖర్చయినా మనమే పెట్టుకోవాలి” అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్లిపోయాడు.
ఆడవాళ్లు ఆమె వైపు చూస్తున్నారే కాని ఆమెతో మాట్లాడడం లేదు. కోడలికి ఎలా వుందోనన్న బాధకన్నా హాస్పిటల్‌ ఖర్చు ఎంతవుతుందోనన్న ఆరా ఆమెలో ఎక్కువగా వున్నందుకు సిగ్గుపడుతున్నారు. వాళ్లలో కొందరికి సౌమ్య అంటే జాలి, తారమ్మ అంటే అసహ్యంగా వుంది.
తారమ్మ అదేం పట్టించుకోకుండా తన వయసే వున్న చిలకాకుపచ్చ చీరామె దగ్గరకెళ్లి ”ఇదేం పీడే వదినా! వరుసగా మూడు రోజుల నుండి హాస్పిటల్‌ చుట్టే తిరుగుతున్నాం. అదేమో లోపలికి పోయి హాయిగా పడుకుంది. నాకేమో నిలబడి నిలబడి కాళ్లు గుంజుతున్నాయి. లోగడ మా అత్త కొడవలి పిడితో నా మోచేతి మీద ఎన్నిసార్లు కొట్టలేదు. నేనెప్పుడైనా దీనిలాగా చచ్చే ప్రయత్నాలు చేశానా?” అంది తల పట్టుకొని నేలచూపులు చూస్తూ.
”నువ్వెందుకు చస్తావు తారమ్మా! ఎప్పుడు చూసినా మీ అత్తగారికి నిన్ను కొట్టే పరిస్థితి తెచ్చి ఆవిడ కొడుతుంటే నువ్వు నవ్వుకుంటూ ఎగిరేదానివిగా! రాత్రయ్యే సరికి శేషన్నకు ఆవిడ మీద చాడీలు చెప్పి ఆవిడను కొట్టించేదానివి… కొడుకు చేత దెబ్బలు తినలేకనే ఆవిడ పాపం పశువుల మందలోకి దూరి వాటి కాళ్లకింద పడి చచ్చిపోయింది. అయినా ఇదంతా ఎందుకు తారమ్మా! నువ్వు చెప్పడం మేము వినటం అవసరమా! లోపల నీ కోడలు ఎలా వుందో తెలియదు. అసలు వుందో… పోయిందో… తెలియదు. నువ్వేమో ఇక్కడ నిలబడి నా కోడల్ని నేను కొట్టానా! మా అత్త నన్ను కొడవలి పిడితో ఎన్నిసార్లు కొట్టలేదు అని అంటున్నావు. ఇవన్నీ ఎవరు వింటారు చెప్పు! ఆ రోజులు వేరు. ఈ రోజులు వేరు. ఈ రోజుల్లో పిల్లలు చిన్నమాట అన్నా పడేలా లేరు. అయినా నీ కోడలికి ఎవరున్నారు చెప్పు! నువ్వు కొట్టినా, తిట్టినా సర్దిచెప్పానికి. భర్త వుంటే ఆరునెలలు సముద్రంలో ఆరునెలలు భూమ్మీద. నువ్వేం చేసినా నీ కొడుక్కేమన్నా తెలుస్తుందా? అదంతా చూసుకునే ‘ఇక ఈ జీవితం వద్దులే’ అని నిర్ణయం తీసుకున్నట్లుంది పిచ్చిపిల్ల… నువ్వేదో తక్కువదానివైనట్లు మాట్లాడుతున్నావ్‌! అదిగో నీ గురించి తెలియనివాళ్లు అక్కడున్నారు. వెళ్లి చెప్పుపో!” అంటూ పేషంట్ల కోసం వచ్చిన వాళ్ల బంధువుల వైపు చూపించింది.
ఆమె మాటలు తారమ్మను బాగా కలవరపరిచాయి. అక్కడ నుండి మౌనంగా వెళ్లి హాస్పిటల్‌ గేటు పక్కన చిన్న అరుగు లాంటిది వుంటే దాని మీద కూర్చుంది. ఆమె నెత్తిమీద గుడ్డ అలాగే వుంది. గాలికి ఎగిరి కింద పడుతుందని ఆ గుడ్డ కొసను నోటితో పట్టుకొని హాస్పిటల్‌ వైపే చూస్తోంది. ఎవరేమి అనుకున్నా నాకేంటి? అన్న ధీమా, నిర్లక్ష్యం, పట్టీపట్టని తనం ఆమె కూర్చున్న విధానంలో స్పష్టంగా కన్పిస్తోంది.
కానీ ఆమె మనసు మూలల్లో మాత్రం ఎక్కడో ఏదో వెలితి. దారమున్న సూదితో కుట్టినట్లు మనసు నిండా పైకి కన్పించని బలమైన కుట్లు. అదేంటంటే కొడుకు వచ్చినప్పటి నుండి ఆమెతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఎప్పుడైనా దగ్గర కూర్చునేవాడు. మంచి మాటలు చెప్పేవాడు. ‘అమ్మా! రోజు కూలీగా పత్తిమిల్లులోకి పనికెళ్లే నాన్న ఇంకా ఎన్నిరోజులు వెళ్తాడు. నేను డబ్బులు పంపుతానన్నానుగా! నాన్నను వెళ్లొద్దని చెప్పు’ అనేవాడు. ఇప్పుడా మాటలేం లేవు. వచ్చినప్పటి నుండి ఆ నల్లమొహం దాన్ని కనిపెట్టుకొని దాని దగ్గరే కూర్చుంటున్నాడు. ఇదేం కర్మో ఏమో అని ఆమె మనసులో కొడుకు గురించే ఆలోచిస్తుండగా హాస్పిటల్‌ గేటులోంచి రొప్పుకుంటూ వచ్చాడు శేషేంద్ర.
కోడలి వార్త తెలియగానే ఆయన సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చాడు. ఆయాస పడుతున్నాడు. పైకి కట్టిన తెల్ల లుంగీ, చేతులు మడిచిన తెల్ల చొక్కాలో ఆయన చేతులు, కాళ్లు నల్లగా, బక్కగా కన్పిస్తున్నాయి. ఆయన్ను చూడగానే వచ్చావా అన్నట్లు పైకీ కిందకీ చూసింది తారమ్మ. తారమ్మది పచ్చి పసిమిఛాయ, బొర్ర ముక్కు. ఆ ముక్కుకి అడ్డబేసరి. మనిషి పొట్టిగా వున్నా, చలాకీగా నిండుగా మూటకట్ నిలబెట్టిన ఉలవల బస్తాలా వుంటుంది.
”కోడలికి ఎలా వుంది తారమ్మా?” అంటూ ఆమెకు దగ్గరగా వెళ్లి నిలబడి అడిగాడు శేషేంద్ర. ఆమెను ఎప్పుడైనా ఆయన తారమ్మ అనే పిలుస్తాడు.

ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *