May 19, 2024

ఆమని ఆగమనం

  మంథా భానురామారావు   

 

ఆమని ఆగమనం తో ఆరంభం కదా

కోయిలమ్మల కుహుకుహురావాలు!

పోటీపడి వేసే స్వరకల్పనలు

పంచమ స్వరంలో ప్రతిధ్వనిస్తూ.

ఎర్రని మావి చివుర్ల మధ్య వేలాడే పిందెలు

చల్ల గాలికి తలలూపుతూ

వసంత లక్ష్మికి స్వాగతం పలుకుతున్నాయి.

విరగపూసిన వేపచెట్లు మంచు బిందువుల్లా రాల్చే పూలు

నేలంతా పరచుకుని భూమాతకి

వెచ్చని కంబళి కప్పుతుంటే ఆగలేని

వాయుదేవుడు పని కట్టుకుని అక్కడక్కడ లేపి

రంగవల్లులు దిద్దుతున్నాడు.

నింబవృక్షాలకి కట్టిన ఊయలలు

పడుచు కన్నెల కిలకిలలతో సొగసుగా ఊగుతుంటే

కోడెకారు చిన్నవాళ్లు వలపు వలలు విసురుతూ

వసంత వనముల్లో విహరిస్తున్నారు.

కొత్త అల్లుళ్లు బిడియంగా వరండాలో

ఒదిగి ఉంటే చిలిపి మరదళ్లు అక్కని దాచి

ఆట పట్టిస్తున్నారు, అమ్మ అదిలింపులను

నాన్న కోర చూపులను లెక్క చేయక.

నవకాయ పిండివంటలు నాలుక చవులూరిస్తుంటే

ఉగాది పచ్చడి అంటూ చేతిలో వేసింది బామ్మ.

షడ్రుచులేమో గాని, చేదే తగిలి కేక పెట్టి

నొసలు చిట్లించారు పిల్లందరు కూడి ఏక బిగిని.

జీవిత మందునా చేదుకూడ భాగమంటూ

వేదాతం వల్లించారు తాతగారు వాడిగా.

కొత్త వలువలు కట్టి పెరపెర మంటూ

ఏటి గట్టుకు వెళ్లి దోబూచులాడుతుంటే

కొత్త అల్లునికి దొరికింది కోమలాంగి.

నును సిగ్గు మోముతో కలికి కౌగిలి నిమడగా

కొత్త వత్సరపు ఆనంద లహరిలో

కేరింతలే మిన్నంటె పల్లె లోన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *