May 19, 2024

ముష్టి భక్తులు!  

టీవీయస్.శాస్త్రి

మీరెప్పుడైనా అడుక్కునే వాళ్ళ సభలను చూశారా! చూసేవుంటారు! చూడటమే కాకుండా పాల్గొని కూడా ఉంటారు. కానీ అవి బిచ్చగాళ్ళ సభలు అని  అనుకొని  ఉండరు అంతే ! ఇటువంటి ఒక సభను చూసే ‘అదృష్టం’ ఈ మధ్యనే నాకు కలిగింది. కొంత మంది కోరికపై ఆ సభానిర్వహణ భారం కూడా నా మీద పడింది.అన్నీ భగవంతుని నిర్ణయం మేరకే జరుగుతాయి అనటానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ మరేదీ అక్కరలేదు.బిచ్చగాళ్ళ కోరికలూ,  ఆలోచనలూ ఎలా ఉంటాయో చెబుతాను.నేను మొదట్లో ధ్యానంలో కూర్చున్నప్పుడు  మాస్టర్ ను రెండు మూడుసార్లు కోరికలు కోరాను.  మాస్టర్  రెండు మూడు సార్లూ నా కోరికలు తీర్చారు. ఆ తరువాత ఈ మార్గం సులభంగా ఉండటం చేత, మాస్టర్ ను కోరికలు తీర్చమని మళ్ళీ కోరాను ఇంకొకసారి! ఈ సారి మాస్టర్  నన్ను మందలింపుగా ఇలా అన్నారు, “ఎప్పుడూ బిచ్చగాడిలా ఉండటానికి ఎందుకు ఇష్ట పడుతావు? నీకు కావలసింది ఏదో  కష్టపడి సంపాదించుకుని,  అందరికీ ఇచ్చే స్థాయికి చేరుకోవాలని ఎందుకు అనుకోవు ?” అని. మాస్టర్ మందలింపులోని  అంతరార్ధం నాకు అర్ధమయింది.అప్పటి నుండి నేను “అడుక్కోవటం” పూర్తిగా మానేశాను. “ఇచ్చేస్థాయికి” చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. చాలా రోజుల క్రితం భగవద్గీత చదువుతున్న సమయంలో నాకు ఒక మంచి పదం లభించింది.అదే ‘సంకల్ప సన్యాసం’! దానిని గురించి ఒక పుస్తకం వ్రాయటానికి ఉపక్రమించాను. కానీ అది కార్యరూపం దాల్చలేదు. కారణం బహుశః అది వ్రాసేందుకు మాస్టర్ ను అనుమతి ‘అడుక్కోవటమే’ కారణం అయి ఉంటుంది. వీడికి ఎప్పుడూ ‘అడుక్కోవటమే’ అలవాటైంది. ఈ అలవాటును మాన్పించాలని మాస్టర్ భావన  కావచ్చు! అర్ధమైన తరువాత ‘అడుక్కోవటం’ పూర్తిగా మానేసి ఆనందంగా ఉన్నాను. అదీగాక రోజూ ‘అడుక్కునే’ వారిని చూస్తే ఎవరికైనా అసహ్యం కలుగుతుంది.అందులో ఏమాత్రం సందేహం ఉండనవసరం లేదు.ఆ మధ్య నా భార్యకు తీవ్రమైన జబ్బు చేసింది. పిల్లలందరూ దూరప్రాంతాలలో ఉన్నారు.ఒంటరిగా ఉన్నానుకున్నాను, కానీ మాస్టర్  నా చెంతనే వెన్నంటి ఉన్నారు.ఆ సమయంలోమాస్టర్ ని ఒక కోరిక కోరాను.అది ఏమిటంటే,”ఈ పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం ప్రసాదించమని. “మాస్టర్ నా కోరిక మన్నించటమే కాకుండా,నా భార్యను కూడా కాపాడారు.ఎందుకంటే అది ‘అడుక్కోవటం’ కాదని మాస్టర్  భావన అయి ఉంటుంది, నేనూ కూడా ‘అడుక్కునే’ భావనతో కోరిక కోరలేదు. మనం ‘అడుక్కోవటానికి’ పూర్తిగా అలవాటు పడ్డాం. అందులో ఏమాత్రం సందేహం అక్కరలేదు! గుడిలోపల ‘అడుక్కునే’ మనకూ,గుడి బయట ‘అడుక్కునే’ బిచ్చగాళ్ళకు తేడా ఏముంది? ఒక విధంగా చెప్పాలంటే, మనం ఖరీదైన బిచ్చగాళ్ళం.కార్లల్లో వచ్చి ‘అడుక్కుంటాం’! పూజారికీ, హుండీలలో విపరీతంగా లంచాలు పడేసి ‘అడుక్కుంటాం’. మన ప్రార్ధనలన్నీ’అడుక్కోవటమే’! మనమే ‘నిత్య బిచ్చగాళ్ళం’ అయినప్పుడు, ఇంకొకరికి ఇచ్చే ప్రసక్తి ఎక్కడుంటుంది? ‘అడుక్కోవటం’ కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. “ఈ మధ్య మేము తిరుపతి వెళ్లి స్వామి వారికి కళ్యాణం చేయించాం.మా అబ్బాయికి మంచి సంబంధం కుదరాలని ‘అడుక్కున్నాం’! అని కొంతమంది గొప్పగా  చెప్పటం మనం వింటూనే ఉన్నాం. ఇలా రకరకాల బిచ్చగాళ్ళు ఉన్నారు. బిచ్చగాళ్లలో  కూడా స్థాయీ బేధాలు ఉన్నాయి. ఎవరి స్థాయిని బట్టి వారు ‘అడుక్కుంటారు’. ఇలా ‘అడుక్కొని’ తినేవాడి(రి)కి, కష్టపడి సంపాదించుకోవాలనే భావన ఉండదు. సరే! బిచ్చగాళ్ళ సభలోని విషయాలు చెబుతాను.బిచ్చగాళ్ళ సంఘం అధ్యక్షుడు ,తన సందేశంలో ఇలా చెప్పారు, “మనం అందరమూ సంఘటితమై, మరింతమంది సభ్యులను చేర్చుకొని,కష్టపడి ‘ముష్టి’ సంపాదించుకోవాలి” అని. బహుశః వారి సంఘం యొక్క ఆశయం చెప్పివుంటారు. నేను ఆశ్చర్యపోయి, వెంటనే తేరుకొని,”అవును నాదే తప్పు! ఇటువంటి  సభకు రావటం ఏమిటి? పైగా నిర్వహణ బాధ్యత కూడా తీసుకోవటమేమిటీ ?” అని మధనపడి తేరుకొని, చేసిన తప్పుకు చింతిస్తూ, నేను లేచి నా సందేశంలో ఇలా చెప్పాను, “ముష్టి ఎత్తుకొని వంద రూపాయలు సంపాదించుకోవటం కన్నా, కష్టపడి ఒక రూపాయి సంపాదించుకోవటంలో ఎంతో తృప్తీ, ఆనందమూ ఉంటాయి.అందుకని మనం కష్టపడి సంపాదించుకుందాం. అదే అలవాటు చేసుకుందాం” అని నేను చెప్పిన మాటలు సహజంగా ముష్టి సంఘం నాయకులకు కోపం తెప్పించాయి.” మనం  కష్టపడి ముష్టి విద్య నేర్చుకుంటే వీడెవడూ ఇది తప్పని చెప్పటానికి? మన ముష్టికి వీడు పెద్ద అడ్డంకి ” అని చెప్పటమే కాకుండా ఒక మంచి నినాదాన్ని కూడా ఇచ్చారు. అదేమిటంటే, “ముష్టి వాళ్ళు సమిష్టిగా ఉండాలి! ముష్టి వారి సంఘం వర్ధిల్లాలి!”అని.

వ్యష్టిగా,సమిష్టిగా మనకు ముష్టి ఇష్టమని నేననుకోను! మరి మీరేమంటారు?

(ఇది కేవలం హాస్య,వ్యంగ్య,యదార్ధ రచనే కానీ, ఎవరినీ ఉద్దేశించి రాసింది మాత్రం కాదు!)

22 thoughts on “ముష్టి భక్తులు!  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *