May 19, 2024

ఒక్క సారి రారాదా!                                        

వాయుగుండ్ల శశి కళ

 

ఒక్క సారి రారాదా

నీకోసం హృదయం పచ్చని ఆకులుగా మార్చి

తోరణాలు కడుతాను

ఒక్క క్షణం లో ఎర్రటి జ్వాల ను పూసుకున్న కళ్ళు

ఒక ప్రశ్నగా మారి వేలాడుతూ

నీరు లేక జనాలు చేసే రణాలు సంగతి ఏమిటి?

యుద్దాల మధ్యలో ఎక్కడైనా పచ్చని చిగురు

విరబూస్తుందా ?

 

నా ఉద్వేగాలను రంగరించి

షడ్రుచుల పచ్చడిగా చేసి నైవేద్యం చేస్తాను

ఒక్క సారి రారాదా …..

వేదనతో మ్లానమైన మొహం తో

ఒక్క సారి తిరస్కరింపు తల అటు తిప్పుతూ

రోదనలు ఆవేదనలు తప్ప నీ చుట్టూ

సమాజం లో ఏ ఉద్వేగము లేదు

ఆరు రుచులు ఎక్కడినుండి తెస్తావు

దోసెడు నుండి కన్నీళ్లు తప్ప!

 

ఈ ఏడాది పంచాంగానికి

నిన్నే రాజును చేస్తాను

కాసిన్ని నీ మెత్తని అడుగులు

ఇటు వైపు వేయరాదా ! కోయిల కూజితాల తో

స్వాగతం పలుకుతాను

 

సన్నటి నవ్వు లేత పెదాలపై

చిగురాకు ఎరుపులా ….

నింగి లోని నెలరాజునే

నాలో పొదువుకున్నాను

ఈ ఎడారి రాజరికాలతో నాకు పని ఏమిటి ?

ఆక్రమించుకున్న పంట భూముల

సాక్షిగా

కట్టబోయే ఆకాశ హర్మ్యాల సాక్షిగా

లేత చివుళ్ళు లేని తెలుగు గడ్డపై

కోయిలలు ఎలా తెస్తావు !

ఆకలికి మండిన గుండెల అరుపుల తప్ప

పర్లేదు …. నీకు అలవాటేగా

ఈ ఉగాదిని కూడా హాలోగ్రామ్స్ గా మార్చి చూసుకో ….

తెలుగు ఉగాది

ఒక్క సారి రారాదా !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *