May 7, 2024

శుద్ధ కవిత్వ భాషలో జరిపిన సుదీర్ఘ సంభాషణ – ఇందిరకవిత్వం

సమీక్ష: రామాచంద్రమౌళి

13267774_1026384354117440_4112460082304661424_n

 

From the Biography of an Unknown Woman

                                       – Indira Babbellapati

 

 

కవిత్వం రకరకాలుగా నిర్వచించబడి మనిషి ఆవిర్భావం నుండి ఇప్పటిదాకా ఒక అతీత భావస్పర్శకోసం నిరంతరం అన్వేషిస్తూనే కవిత్వాన్ని కేవలం ఒక అనుభవైకవేద్యమైన రసాత్మక మహానుభూతిగా మాత్రమే స్వీకరిస్తూ రకరకాల రూపాలతో,శైలితో, వ్యక్తీకరణలతో,ప్రతీకలతో,అనేకానేక నైరూప్య మార్మిక అభివ్యక్తులతో కేవలం శరీరంతో మాత్రమే కాక హృదయంతోకూడా జీవించే వ్యక్తులకోసం రసభాషగా కొనసాగుతూ వస్తూనేఉంది యుగయుగాలుగా.దేశాలు,ప్రాంతాలు,నాగరికతలు,భౌగోళిక నేపథ్యాలు..ఇవేవీ కవిత్వ సంగ్రహణా…అనుభవ దాహానికి ఎప్పుడూ అవరోధాలు కాలేదు.ఎక్కడ ఒక వాక్యం రసాత్మకంగా వెలువడ్డా సకల సరిహద్దులనూ చెరిపేస్తూ అక్షరాన్ని కవిత్వం ప్రజ్వరిల్లజేస్తూ కవిత్వ ప్రక్రియను విశ్వజనీనం చేస్తూనే ఉంది.ఆ పరిణామ వికాసాలను మెట్లు మెట్లుగా అధిరోహిస్తూ కవిత్వ సృజన ఆధునికంగా..అత్యాధునికంగా…ఆధునికోత్తర సాహిత్య ఉద్గారతగా తన రూపురేఖలను వికిరణ పరుస్తూ భాసిస్తూ వస్తూనే ఉంది.ఆ క్రమంలో కొన్ని సంక్లిష్టతలు…కొన్ని అనిర్ధుష్టతలు…కొన్ని అస్పష్ట సంలీనతలు…వీటన్నింటినీ ప్రవాహీకరించుకుంటూ చొచ్చుకొస్తూనే ఉంది కవిత్వ సృష్టి.

 

ఈ ఇరవైయ్యవ శతాబ్దిని దాటుతున్న కాల క్రమంలోప్రసిద్ధుడూ, మనకంటే వరిష్ఠుడూ ఐ న టి ఎస్ ఇలియట్ … తదనంతర ఈనాటి యువ కవిత్వ సృజనకారులు “కవిత్వాన్ని” నిర్వచిస్తున్న తీరును గమనించండి.

 

T.S. Eliot:

“Poetry is not a turning loose of emotion, but an escape from emotion; it is not the expression of personality, but an escape from personality. But, of course, only those who have personality and emotions know what it means to want to escape from these things”.

 

William H. Gass (Middle-2013), a post-modern poet:

“Postmodern poetry often includes themes of restlessness and is usually written in a very free format. Line breaks and structures can be chaotic or seemingly meaningless, though there is usually a purpose for the unusual breaks. While ideas were often expressed in older forms of poetry through the separation of lines and punctuation, postmodern poetry utilizes erratic line breaks to indicate the chaotic shapelessness of the world. The very form of the poem serves to reinforce the idea that forms are meaningless and that purpose cannot be imposed upon the work”.

 

ఈ వర్తమాన కవిత్వ నేపథ్యంలో తనను తాను బహుళ ప్రచార వేదికలపై ప్రదర్శించుకోకుండా గత కొన్నేళ్లుగా నిశ్శబ్దంగానే మంచి కవిత్వాన్ని రాసి కవితాప్రియులకు వినిపిస్తున్న తెలుగు ఆంగ్ల కవయిత్రి ఇందిరా బబ్బెల్లపాటి ఈమధ్య ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ” పెంగ్విన్” తన రాండం హౌజ్ విభాగమైన “పాట్రిడ్జ్” ద్వారా వెలువరించిన 257 పెజీల బృహత్ ఆధునికానంతర దీర్ధ కవిత్వ ఇంటర్నేషనల్ ఎడిషన్( ఇంగ్లిష్ లో) పుస్తకం “ఒక అపరిచిత స్త్రీ ఆత్మకథ నుండి(from the Biography of an Unknown Woman) గురించి  సంక్షిప్త పరిచయం ఈ నాలుగు వాక్యాలు.

 

ఇందిరా బబ్బెల్లపాటి ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇదివరకు ఈమెవి” affaire de coeur” ను publishamerica.com, Baltimore, USA,”vignetts of thesea” ను monfakira ,  kolkotta,”echo“ ను Global fraternity of poets gurgoan లు ప్రచురించాయి భారతదేశ కేంద్ర సాహిత్య అకాడెమీ కోసం తెలుగులోఅత్యంత పాఠకాదరణ పొందిన బాలగంగాధర తిలక్  ప్రసిద్ధ కావ్యం”అమృతం కురిసిన రాత్రి” ని “నైట్

ఆఫ్ నెక్టార్” పేర, మరో సాహిత్య అకాడెమీ అవార్ద్ పొందిన “అబ్బూరి ఛాయాదేవి కథలు” ను ఇంగ్లిష్ లోకి అనువదించారు. రావిశాస్త్రికథలను, కొడవటిగంటికుటుంబరావు, ఆర్.ఎస్.సుదర్శనం కథలను ద్రవిడ యూనివర్సిటీ, కుప్పం ప్రచురించింది.ఇవిగాక ఈమె కవితలు హిందీ, బాంగ్లా, స్పానిష్, ఫ్రెంచ్ బాషల్లోకి విరివిగా అనువదించబడ్డాయి. అంతర్జాతీయ కవిత్వ పాఠకులలో వందలాదిగా వివిధ ఇంగ్లిష్ కవిత్వ వెబ్ పత్రికల్లో వస్తున్న కవితల్లో ఇందిర కవితలు విలక్షణమైనవి గా గుర్తింపును పొందాయి.

 

ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి మురియల్ రుకేసర్ అంటుందిఒక తన కవితలో…”ఒక స్త్రీ కనుక తన జీవిత నిజమైన కథను వినిపిస్తే…అప్పుడేమౌతుందో తెలుసా/ఈ ప్రపంచం విచ్ఛిన్నమై విచ్చుకుంటుంది” అని.

 

ఈ పుస్తకానికి ప్రవేశికను రాస్తూ ఇంగ్లిష్ మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయం, హైదరాబాద్…ప్రొఫెసర్ మరియు ఇంగ్లిష్ శాఖాధిపతి ఎం. ఇ. వేదశరణ్ అంటాడు…ఒక స్త్రీ తన “నిజమైన జీవిత కథ”ను వినిపించడం గురించి మనందరం జాగ్రత్తగా…సూక్ష్మంగా ఆలోచించవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమై ఉందని..అసలు ఒక స్త్రీ అపరిచితురాలిగా విశ్వవ్యాప్తయై ఉండడమేమిటి…పైకి అగ్నిపర్వతంవలె కనిపించే…అగ్నిపర్వతాన్ని కూడా భరిస్తున్న పుడమిలా కనిపించే స్త్రీ అంతరంగాన్ని ఒక పూర్ణాపూర్ణాలుగా ధ్వంసమౌతున్న దీర్ఘ ఆత్మకథగా ప్రస్తుతిస్తూ క్షితిజ రేఖమీద నిలబడి ఇందిర ఒక ఉటంకనగా ప్రతీకాత్మకంగా మొత్తం స్త్రీ ప్రపంచం పక్షాన నిలబడి ఎలుగెత్తి ఈ కవిత్వాన్ని మనకిప్పుడు వినిపించడమేమిటి..అని ఒక హెచ్చరికను జారీచేస్తూనే…ఈ అతికొత్త గొంతును వినమని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

రెండువందల యాభైఏడు పేజీల నిడివిలో సాగిన ఈ ‘ఇంటర్నల్ మోనోలాగ్’ లో లోపల ఎక్కడా సాధారణ కవిత్వ పుస్తకాల్లో కనిపించే భిన్న కవితలుగా విభజించే శీర్షిక లేవీ లేవు. ఏకబిగిగా సాగే మహోధృత కవిత్వ ప్రవాహ మొక్కటే వినిపిస్తుంది. ఐతే ఇదేదీ స్త్రీవాద కవిత్వం కాదు. స్త్రీ తరపున వాదించే. ప్రపంచ స్త్రీ అంతరంగాన్ని విప్పి పరిచిన ఒక శబ్దవిస్ఫోటనం ఇది. వీటిని చదువుతున్నప్పుడు ఎవరిపైనా క్రోధమో…ఆగ్రహమో కలుగదు ‘అయ్యో ఇదిలా ఎందుకు జరుగుతోంది…ఇదిలా జరుగకుండా ఇంతకంటే మానవీయంగా జరుగుతే బాగుండును కదా’ అన్న ఒక క్షోభ కలిగి అది..చదువరిని ఆలోచింపజేస్తూనే ఒక సంస్కారవంతమైన పరివర్తనను పాఠకునిలోకి ప్రవహింప జేస్తుంది. అందుకే ప్రసిద్ధ ‘దిటెన్స్ టైం’ అన్న అంతర్జాతీయ తెలుగు కవితల ఆంగ్లానువాద గ్రంథాన్ని ఎప్పుడో 30 యేళ్ళక్రితం వెలువరిస్తున్నప్పటినుండి వేగుంట మోహన ప్రసాద్ తో సహకరిస్తూ వచ్చిన ఇందిర గురించి మో..”ఇందిర కవిత్వాన్ని రాయదు…కవిత్వమే ఆమెతో రాయిస్తుంది” అన్నాడు.

 

ఒక కవితలో ఇందిర అంటుంది… (పే.104)

నాకేమీ తెలియదు

తెలిసిందల్లా

నేనతని ప్రక్కనుండాలి

ప్రతి రాత్రీ నేను పడుకునే ముందు,

 

అతను నాకోసం బట్టలు తెస్తాడు

అతనికిష్టమొచ్చినవి

 

అతను నాకోసం నగలు తెస్తాడు

అతనికిష్టమొచ్చినవి

అతను నిర్ణయిస్తాడునేను ఏమి వండాలో

ప్రతి మధ్యాహ్న మరియు రాత్రి భోజనాల్లో

 

అతనే పిల్లల జీవితాలను నిర్దేశిస్తాడు

 

ఇప్పుడు

నే నిప్పుడతడు లేనితనాన్ని ఎలా సర్దుకుపోవాలి

చెప్పండి నాకు! చెప్పండి నాకు

 

అనిఆమె కుమిలి కుమిలి దుఃఖిస్తోంది-

 

మరో చోట అంటుంది ( పే.147)

 

ప్రతి ఉదయమూ ఆమె

ఉత్సుకతతో మేల్కుంటుంది

 

ప్రతి సాయంత్రమూ ఆమె

చాలా ఓపిగ్గా నిరీక్షిస్తుంది

 

ప్రతి రాత్రినీ ఆమె

గొప్ప నిరాశతో విరమిస్తుంది

 

ఒక నిరంతరమై సాగే యాత్ర

ఆమె నిరీక్షణ ఒకనిత్య క్రతువు-

 

‘మనం దేన్నైతే సృష్టిస్తామో..దాన్నే ధ్వంసిస్తాము …పిల్లలం మనం..మనం పిల్లలు గానే మిగిలిపోతాము ‘ అంటుంది

(పే 95) ఒక గాఢ అంతర్ముఖ ఆత్మ వివేచనతో.

 

అతననుకున్నాడు

అతను ఆమె జీవితంలోకి ప్రవేశించాక

ఆమెకు స్నేహితులే అవసరం లేదని

ప్రతిరాత్రీ వెళ్ళిపోతాడు

ఆమెను ఖాళీ గోడలకు వదిలేసి

అతని స్నేహితులతో వినోదించడానికి

వినోదించబడడానికి

అతనంటాడు నిన్నుపెళ్ళిచేసుకున్నాను

నీపై జాలితో,

ఆమెను ఇతర పురుషులనుండి రక్షించడానికి … అని

కాని, అతడిప్పుడు ఇతర పురుషుల్లో కలిసిపోయాడు

మనసు

ఒక అరుదైన జీవజాతి …అది రెక్కల కోతి-

 

ఆమె మేఘాలు గుమికూడుతున్నట్టు ఆలోచిస్తుంది.చాలా చాలా కథలు చెప్పబడకుండానే ముగుస్తాయి…కొన్నింటిని చెప్పడం కష్టం…సాధ్యం కాదుకూడా.గాయాలూ,అనుభవాలూ ఎప్పుడైనా వ్యక్తీకరణకు అందనివే.ఆమె చిన్న ప్రపంచానికి తలుపులు లేవు..పరదాలు లేవు…యజమాన్యాలూ,ఆజ్ఞలూ లేవు.ఆమె చిన్ని ప్రపంచంలో అవిశ్వాసాలు,ప్రశ్నించడాలు,అవగాహనా రాహిత్యాలు లేవు.ఆమె ఒక దట్టమైన,అరణ్యమయమైన కొండ కొమ్ముపై ఒక ఒంటరి  చెట్టు..వికసిస్తుందామె…వికసించడం ప్రకృతి లక్షణం…అని ఒక స్వగత వలపోతను వినిపిస్తూంటుంది… (పే9…11).

 

ఆమె ఒక చీకటి కెరటం

ఆమె చీకటి సముద్రం

ఆమె రక్తం గర్జిస్తూ ప్రవహిస్తున్నప్పుడు…నిజంగా ఆమె సముద్రమే-

ఆమె అగ్ని

ఆమె మోహాలన్నీ తగులబెట్టబడ్తున్నప్పుడు-

ఆమె ఆకాశం

తననుతాను నీపై పరుచుకుంటున్నప్పుడు-

ఆమె గాలి

నీలోకి ఒక జీవితాన్ని శ్వాసిస్తున్నపుడు-

ఆమె పృథ్వి

నిన్ను పూర్తిగా గ్రహించి

నీకు ఒక రూపాన్ని దానం చేస్తున్నపుడు- (పే 12 … 13)

 

లోతైన…గాఢమైన…చాలా సరళంగా అనిపిస్తూనే అతి సంక్లిష్టమైన స్త్రీ ఆత్మిక భావనను చాలా చోట్ల తనదైన సున్నిత శైలిలో ఇందిర అలా అలవోకగా   పద్యపాదాలుగా అల్లుకుపోతూండడాన్ని గమనిస్తే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది.అది ఆమె వ్యక్తీకరణ ప్రతిభగా ఒప్పుకోకతప్పని స్థితి ఒకటి మనకు ఎదురౌతూంటుంది.చూడండి దీన్ని … (పే.65)

 

“నువ్వు వేరే స్త్రీలలో దేన్నైతే చూస్తూంటావో

దాన్నే నాలోకూడా వేరే పురుషులు చూస్తారు

ఐతే నువ్వు గానీ,వాళ్ళుగానీ

నిజమైన నేనేమిటో

ఎప్పుడూ చూడరు”

 

అది దృష్టి. స్త్రీ తన అస్థిత్వ స్పృహతో తనను తాను తన చుట్టూ ఉన్న పురుష,పురుషేతర ప్రపంచాన్ని ఏ కోణంలో ఎంతదీనమైన, నిస్సహాయమైన  అనుభవాలను భరిస్తూ సహిస్తూ తీక్షణంగా వ్యక్తపరుస్తున్నదో పై వాక్యాలు పట్టిస్తాయి.

 

అత్యున్నతమైన సహజ స్త్రీత్వాన్నీ,త్యాగమయియైన ప్రకృతికి ప్రతీకయైన స్త్రీ ఔన్నత్యాన్ని ఒక నైరూప్య రూపంగా అభివర్ణిస్తూ సరళసుందర రీతిలో కవితావాక్యాలుగా విన్యసిస్తూండడం ఇందిర కవితలో ఎలా మనకు చేరుతూందో గమనించండి.

ఆమె ఇసుకను ప్రోగుచేసి

కాగితపు గోడలతోనే ఒక భవనాన్నీ,

ఒక స్వప్న గృహాన్నీ నిర్మిస్తుంది

సాధారణంగా ఆమె నిటారుగా,మహోన్నతంగా

హృదయశోభ ఉట్టిపడ్తూండగా తన వాలుకుర్చీలో కనిపిస్తూంటుంది

దూరంగా ఆకాశంలోకి చూస్తూ –

ఆమె అక్కడ టీ ని సేవిస్తూ

ప్రతి చాయ్ గుటకా నిన్నటి కన్నీళ్ళ పరిగ్రహణ ఔతూండగా

దుఃఖిత మరో రేపుకోసం నిరీక్షిస్తూంటుంది

ఆమె గమనిస్తూంటుంది

వచ్చి వెళ్తున్న ఋతువులను

ఊడ్చుకుపోయే శీతల వాయువులను

వియుక్తమైపోతున్న వేడి పెనుగాలులను

వేడి గాలులే మళ్ళీ వర్ష బిందువులుగా..అవే

తుఫానులుగా పరివర్తించడాన్ని

చివరికి ఋతువులు…ఒక రాశై…అవిభక్తమై

అస్పృశ్యంగా మిగిలిపోవడాన్ని – (పే.18- 19)

 

ఒక ప్రతీకాత్మకమైన అసంపూర్ణత తెరలు తెరలుగా విస్తరిస్తూ కవిత్వ ద్రవ్యమై స్త్రీ అంతః చేతనను స్ఫోరకపర్చడం ఇక్కడమనకు తెలుస్తూంటుంది.అది కవి యొక్క కవిత్వ నిర్మాణ ప్రతిభ.ఈ రకంగా అనేక చోట్ల ఇందిర స్త్రీ అంతరంగాన్ని అతి శక్తివంతంగా ఏకునుండి దారంలా విస్తరిస్తూ, అల్లుకుంటూ పోవడం ఈపుస్తకం నిండా దర్శన మౌతుంది. పాఠకులకు ఐతే ఈ కావ్యంలో ఇందిర ఎక్కడా స్త్రీవాద తీవ్ర ఆరోపణలేవీ చేయలేదు.కేవలం స్త్రీ శరీరాన్ని ఆత్మగా రూపిస్తూ పురుష ఆధిపత్యంలోని విస్మరణను ‘ స్త్రీకి జీవితం ఉండుట..జీవితం లేకపొవుట ‘ గా విడమరుస్తూ ఒక స్పర్శగా అందించింది.సున్నితత్వం ఒక్కోసారి అతి కఠినంగా అనుభవంలోకి రావడం ఈ పుస్తకంద్వారా మనకు తెలుస్తుంది.

 

పుస్తకం వెనుక అంతర్జాతీయ పత్రికల్లో,వెబ్ సైట్లలో ఇదివరకే వెలువడిన ఈ పుస్తకంలోని కవితల్లోని కొన్ని భాగాలను చదిని స్పందించిన అనేకమంది దేశ విదేశీ ప్రముఖుల అభిప్రాయాలను పొందుపర్చారు.అవి ఈ కవికి ఉన్న పాఠకాదరణను తెలియజేస్తున్నాయి.

 

ఇందిరలో భారతీయ ఆధ్యాత్మిక చింతన తాలూకు ప్రతిఫలనలుకూడా విస్తారంగా కనిపిస్తాయి అనేక కవితల్లో… పంచభూతాత్మక శరీరం… అగ్ని… ఆకాశం… సముద్రాలు…భూమి… వాయువు… వివిధ సందర్భాల్లో కవిత్వ వాహికగా ప్రతీకలై ఈమె అభివ్యక్తికి అదనపు బలాన్ని చేకూర్చాయి.

ఇందిర అంటుంది.

 

“ఆమె ఒక స్త్రీ

వయస్సు ఎప్పుడూ ఒక ఉత్సవమే” అని.

అదీ ఆమెను వేరే కవులనుండి వేరుపర్చే విలక్షణత.

పూర్ణ మదః పూర్ణ మిదం

పూర్ణాత్ పూర్ణముదచ్యతే

పూర్ణస్య పూర్ణమాదాయ

పూర్ణమేవ వషిష్యతే …అన్న ఉపనిషత్ శాంతి మంత్రంలోని పూర్ణానికి పూర్ణాన్ని కలిపినా, పూర్ణంనుంది పూర్ణాన్ని తీసివేసినా అంతిమంగా పూర్ణమే మిగిలి ఉండే సృష్టి రహస్యాన్ని ప్రస్తావిస్తూ.. ఇందిర స్త్రీని సృష్టిలో ఒక పూర్ణ జీవిగా సంభావిస్తూ ప్రస్తావించడం కూడా ఈ పుస్తకానికి పరిపూర్ణతను చేకూర్చింది.

 

పుస్తకం లభ్యతా వివరాలు:

PATRIDGE

(A Penguin Random House company)

Orders.india@patridgepublishing.com

Amezon

Cost; INR   249                      Dollars: 15

1 thought on “శుద్ధ కవిత్వ భాషలో జరిపిన సుదీర్ఘ సంభాషణ – ఇందిరకవిత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *