May 19, 2024

గత సంవత్సర మాతృమూర్తి

 ప్రవీణ్ కుమార్ వేముల

నా మనసు సుమబాలను సంపెంగరసితో స్నానం చేయించి

ఉరిమిని అరువుతెచ్చి వస్త్రాన్ని కుట్టించి

కరుణను నా కంటికి కాటుకజేసి

వినయ, విధేయత వజ్రాలతో నా ఆభరణాలను చేయించి

తామస సంహారశైలి తిలకంగా దిద్ది

మమతలను కరిగించి ముక్కెరగా చేయించి

జ్ఞానసంపదను నా జడకుచ్చులుగా వేయించి

ఆత్మీయతా స్నేహంలో నా అలంకరణ గావించి

ప్రపంచ పూదోటలో నను విహారానికి తీస్కెళ్ళింది…

శోకగ్రస్తమైనవేళ చెలిమిని పంచి

సంతసంతో చిందులువేస్తే కౌగిలి పంచి

ఓటమికి వెరచినవేళ వెన్నుతట్టి

ప్రతి పనికి ప్రోత్సాహక ఉగ్గుపట్టి

ఆశయాల అంబరాన్ని నా కళ్ళముందు చేర్చి

అంతరంగ శక్తులను అస్త్రాలుగా మార్చే నైపుణ్యం నేర్పి

ప్రకృతిలో ప, ద, ని, స, లు వినే భావుకత నేర్పి

ప్రతి క్రియలో సంతోషశోధన చూపి….

శిశిరం … గ్రీష్మం … వసంతం … అని తేడా లేకుండా

తోడై నిలిచి డస్సిపోయిందేమో! ….

నాకై —-

బ్రతుకు బాటలో భవితలో తోడుగా

“తెలుగు నూతన వత్సర ఓరిమి” ని నా ముందు నిల్పింది !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *