May 19, 2024

 సాగనంపేస్తా 

యు.ఎల్. ఎన్. సింహా

అదిగో నవ ఉగాది వచ్చేస్తుంది
ఇక పండగే పండుగ మనకు
దినపత్రిక పేజీలలో దినఫలాలుగా
దూరదర్శన్లలో దేదీప్యమానంగా

ముఖపుస్తకంలో మె(ము)రిసిపోతూ
వెబ్ సైటులో వెలిగిపోతోంది….
కవితా పోటీలు…పండుగ సంబరాలు…
పంచాంగ శ్రవణాలు, అష్టవధాన కాలక్షేపాలు

మనకిక పండుగే పండుగ…
ఆనాటి పల్లెలు లేకపోతేనేం..
మావిడితోరణాలు గుమ్మానికి కట్టకపోతేనేం…
పసుపుగడపలు కనుమరుగైతేనేం …

గుండెల నిండా ఆత్మీయతల్ని…
మనసునిండా మమతానురాగాల్ని నింపుకుని…
ఓ నలుగురు బంధువులు మన మధ్యకు రాకపోతేనేం…
చిచ్చుబుడ్డికి కొత్త చొక్కా తొడిగినట్టు

సంతోషాల్ని విరజిమ్ముతూ తిరిగే చిన్నారులు
మన మధ్య ఆడకపోతేనేం…
పట్టు పరికిణీల్లో చిట్టి తల్లుల్ని చూడకపోతేనేం..
ఆ సంతోషాల వెలుగుల్లో పెద్దల ముచ్చట్లు మెరవకపోతేనేం..
కోయిలమ్మల రాగాలాపనలు వినకుంటేనేం…

చిగురించడం మానేసిన చెట్లు…
కూలిపోయి పలకరించే గులకరాళ్ళ మొండి గోడలు..
ఇంకా పల్లె వెలుగు బస్సు కోసం ఎదురు చూసే
ఆ పెద్దాయన చేతిలోని చుట్ట వాసన…
ఇవి తప్ప ఏముంది అక్కడ పండగ…

పండుగంటే మనది…
పసందంటే మనది….
మనిషితో పనిలేదు…మాటతో పనిలేదు…
ఇంటర్నెట్ ముందు ఇకిలించి కూర్చుంటా…
ముఖ పుస్తకంలో ఉగాదికి ఊరేగింపు చేస్తుంటా…

లైకుల నైవేద్యాలతో..
కామెంట్ల కర్పూరహారతి పట్టిస్తా..
ఉసూరుమంటూ ఉగాదిని
మరోమారు ఉత్తచేతులతో  సాగనంపేస్తా…
ఓ పిడికెడు కూడ ఆనాటి పల్లె పరిమళాన్ని పెట్టకుండా..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *