May 17, 2024

అమెరి’కలకలం’

పరిచయం: శారదా మన్నెం.

పెద్దపుస్తకం కవర్

వంగూరి చిట్టెన్ రాజుగారు!
వారి గురించి వినడమే కాని వారిని నేను ముఖతా చూడటం మొన్న డి.కామేశ్వరిగారి కథల అనువాద పుస్తకావిష్కరణ రోజునే. వెళ్ళి పలకరించే సాహసం చెయ్యలేదు. అలాంటి చొరవ నాకు చాల తక్కువ. అప్పుడప్పుడు వారి రచనలు కొన్ని చదివాను. వారి సాహితీ సేవాకార్యక్రమాల గురించి విన్నాను.
మొన్న శ్రీమతి జ్యోతి వలబోజుగారు ప్రచురించిన అమెరి’కలకలం’ కథలూ, కమామీషులూ చదవడం జరిగింది. చిట్టెన్ రాజుగారి గురించి మరింత తెలుసుకునే అవకాశం ఆ పుస్తకం నాకిచ్చింది. వారి నిరంతర సాహితీసేవ నాకు బాగా నచ్చింది. నచ్చడానికేముంది! చాలా తేలిక. వారిలా చమత్కర ధోరణిలో చెప్పాలంటే నచ్చడాలు అనేక రకాలు! అందులో అవసరాలు, స్వార్ధాలు కూడా ఉంటాయి.

అమెరికా ఆకాశంలో చంద్రుడిలా వారిని అనేకమంది సాహితీకారులు వీక్షించవచ్చు. సహజంగా హాస్యాన్ని, చమత్కారంగా విసుర్లు విసిరే ధోరణి వున్న నాకు వీరి రచన చాలా ఆకట్టుకుంది. చిన్న పుస్తకమే అయినా మరోసారి, మరింకోసారీ అలా చదివాను. చదివి నవ్వుకున్నాను. నవ్వుకుని చదివాను.

ఇందులో పద్నాలుగు చెణుకుల్లాంటి వ్యాసాలు – వారి మాటల్లో చెప్పాలంటే కథల్లాంటి వ్యాసాలు వున్నాయి. దేనికదే ఒకదానితో మరొకటి పోటి!

జాతకాల మూఢ నమ్మకాల గురించి చెప్పినా, ఉగాది రచనల పోటీ గురించి చెప్పినా, ‘నోటా, నోట మట్టా?’ అని భారతదేశపు ఎన్నికల భాగోతాన్ని ఎండగట్టినా – ఆయన తన విశిష్ట చమత్కార ధోరణిలో ఉతికి ఆరేసారు. ఆనక చక్కగా ఇస్త్రీ కూడా చేశారు.

‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ కొంప ముంచిన ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌లో మన తెలుగుదేశం రెండు ముక్కలయిన వైనాన్ని తనదైన హాస్యధోరణిలో నిశితంగా విమర్శిస్తూనే బాధపడ్డారు. సోనియాని ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా’ అభివర్ణించడం ఆయన చమత్కార ధోరణికో మచ్చుతునక.

‘తెకోకాకరాహై యాత్రా స్పెషల్’ అనే పేరుతో మనవారు ఎంత ఘనంగా తెలుగు సభలు నిర్వహించారో ఆయన మాటల్లో విని నవ్వు వచ్చినా జాగ్రత్తగా గమనిస్తే దాని వెనుక అంతర్లీనమైన విచారం వ్యక్తమవుతూనే వుంది. నాలుగు వందలమందికి ఒకే రకం సిగ్గుబిళ్ళ, ఒకేరకం శాలువా వేసి సరిపెట్టడం – అని చెప్పగల్గడం ఆయనకే చెల్లునేమో అనిపించింది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసిన న్యాయం ఏమిటని బాధ కల్గుతుంది.

‘ఆ ఒక్కటీ అడక్కు’లో చాలా తమాషాగా సాగి, నవ్వు పుట్టించినా వారు సాహితీ సేవలో ఎంతగా చేతులు కాల్చుకుని అవస్థ పడుతున్నారో తెలిసి – ఒకలాంటి ఆవేదన కల్గుతుంది. నానాటికీ దిగజారుతున్న పుస్తక విక్రయాల గురించి బాధ కల్గుతుంది.

అమెరికాలో నిర్వహించిన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం గురించి చదివి మనసు పొంగిపోయింది. నిజం చెప్పాలంటే సంతోషం ఉప్పొంగి జలపాతంలా దూకింది.
అయితే వీటన్నిటి వెనుకా చిట్టెన్ రాజుగారికి మన దేశ సాహితీ, సంగీతల పట్ల వున్న ప్రగాఢ ప్రేమ, వాటికోసం నిరంతరం శ్రమిస్తున్న హృదయం ప్రస్ఫుటంగా కనిపించి మనల్ని అబ్బురపరుస్తాయి.

పుస్తకం చివరి పేజీల్లో వారు నిర్వహించిన కార్యక్రమాల వెనుక వారి నిరంతర శ్రమే కాక ఖర్చు పెట్టిన డాలర్లు కూడా కనపడి కళ్లు తిరుగుతాయి.
అక్కడా, ఇక్కడా ఇలాంటి రాజులు వుంటేనే కదా ‘దేశభషలందు తెలుగు లెస్స’గా భాసిల్లేది!

వారి కృషికి వారిని మనసారా అభినందిస్తూ, తెలుగుజాతి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఏదో నా వంతుగా నాలుగు మాటలు.

నమస్సులతో
మన్నెం శారద.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *