May 17, 2024

ఆదర్శ దాంపత్యం

రచన: టీవీయస్.శాస్త్రి

రామచంద్రుని సోదరీ, ఋష్యశృంగుని ఇల్లాలు శాంత. దశరథుడుకి యజ్ఞం ఫలం ద్వారా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సంతానంగా కలిగారు. అలాగే వసిష్ట ముని కామధేనువు అయిన సురభి అనుగ్రహంతో దశరధుడికి పుత్రికగా జన్మిస్తుంది శాంత. దశరథునికి మంచి స్నేహితుడు రోమపాదుడు. ఇతనికి సంతానం లేదు. ఆ దిగులుతో అతడు కృశించిపొతున్నాడు. ఆప్త మిత్రుడిని ఆదుకునేందుకు దశరధుడు తన కుమార్తె శాంతను అతనికి దత్తత ఇస్తాడు.
పెళ్లీడురాగానే శాంతకు సరైన వరుడి కోసం స్వయంవరం ప్రకటిస్తారు. ఈ వార్త తెలుసుకొని పరశురాముడు ఆగ్రహంతో ఊగిపోతూ రోమపాదుడుని సంహరించటానికి వస్తాడు. రోమపాదుడు భయపడి తన తప్పేంటో చెప్పమని అడుగుతాడు . శాంతను ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేస్తే, చంపనని చెబుతాడు పరశురాముడు. దీనికి రోమపాదుడు ఒప్పుకుంటాడు. అయితే కూతురైన శాంతకు ఒక్క మాట కూడా చెప్పకుండా పరశురాముడికి మాటిచ్చాడు. అయినా సరే తండ్రి మాట జవదాటని శాంత అందుకు అంగీకరించింది . రోమపాదుని రాజ్యంలో తీవ్రమైన కరవు ఏర్పడుతుంది. దీనికి కారణం ఏమిటని ఆయన తన పురోహితులను అడుగుతాడు. అరికాలిలో అదృష్ట రేఖలున్న ఋషిని రాజ్యానికి రప్పిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని వారు సలహా ఇచ్చారు. అలాంటి లక్షణాలు ఋష్యశృంగుడికే ఉన్నాయని చెప్పారు పురోహితులు . ఋష్యశృంగుణ్ణి రాజ్యానికి తీసుకురావడం ఎలాగో రోమపాదునికి తెలియటం లేదు. ఈ సందర్భంగా ఋష్యశృంగుని గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం! ఋష్యశృంగ మహర్షి గురించి రామాయణములోని బాలకాండములో వివరించబడింది. దశరథుని మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు. కశ్యప ప్రజాపతి కుమారుడైన విభండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యా వందనము చేసుకొను సమయమున, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న ఊర్వశి కనిపిస్తుంది. ఆ ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక జింక గర్భం ధరించి, కొమ్ము కల బాలునికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించినాడు కావున ఆ బాలకునకు ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు విభండకుడు. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై, విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.
రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, విషయ సుఖాలంటే తెలియవని, అందువలన ఋష్యశృంగుని రప్పించటం దుర్భేద్యమైన కార్యమని, దానికి తరుణోపాయంగా విభండక మహర్షి ఆశ్రమములో లేని సమయములో వేశ్యలని పంపమని చెబుతారు. మహారాజు అందుకు అంగీకరించి, వేశ్యలని ఋష్యశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తారు. ఆ శబ్దాలకు ఋష్యశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋష్యశృంగుడిని చూసి విభండక మహర్షి ఆశ్రమములో లేడని తెలుసుకొని ఋష్యశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని, స్త్రీ పురుష బేధం తెలియని ఋష్యశృంగుడు వేశ్యలకు అర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి, ఋష్యశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋష్యశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. వేశ్యలు విభండక మహర్షి వచ్చే సమయం అయిందని భావించి వెళ్ళి పోతూ వెళ్ళి పోతూ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు. వారు కౌగిలించుకున్న తర్వాత ఋష్యశృంగుడికి కూడా విషయ వాంఛ కలిగి వారిని చూడాలి అనే కోరిక పుడుతుంది. వారిని వెతుకుతూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋష్యశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋష్యశృంగుడు అంగీకరించి వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది.
కపటనాటకము ద్వారా ఋష్యశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని ఆయన తండ్రి అయిన విభండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటారు. ఆ మునిని రాజ్యంలో ఆపటానికి శాంతనిచ్చి పాణిగ్రహణం జరిపిస్తాడు రోమపాదుడు. (ఋష్యశృంగుడి దేవాలయము ఇప్పటి శృంగేరికి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో ఉంది. శృంగేరికి ఆ పేరు ఋష్యశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు. )ఎండ కన్నెరగని రాజకుమారి తండ్రి మాట ప్రకారం ఏమీ మాట్లాడకుండా ఋష్యశృంగునితో అడవులకు వెళ్ళింది. పర్ణశాల జీవితాన్ని అలవాటు చేసుకుంది. ఋష్యశృంగుడు ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేసేందుకు సహాయం అందించింది ఆమె. తనకు జన్మనిచ్చిన దశరథునిచేత తన భర్తే పుత్రకామేష్ఠియాగం జరిపించినందుకు ఎంతగానో సంతోషిస్తుంది. ఆ యాగం ఫలం వలనే తనకు శ్రీరామచంద్రుడు, ఆయన సోదరులు తమ్ముళ్లుగా లభించినందుకు ఆనందించింది . పుట్టింటి బాధ్యతలు ఎప్పుడూ పంచుకునేది శాంత. శ్రీ రాముడు వనవాసం చేస్తున్నకాలంలో కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు అండగా ఉంటుంది . రావణసంహారం అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు సతీసోదర సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చేవరకు పుట్టింటి బాధ్యతలను అన్నిటినీ మోసింది శాంత. ఈ విధంగా శాంత తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించటానికి ఋష్యశృంగ మహర్షి సహాయ సహకారాలు ఆమెకు లభించాయి. ఆయన విశాల హృదయానికి, భార్య పట్ల ఆయనకు ఉన్న అనురాగానికి ఇంతకన్నా ఏమి తార్కాణం కావాలి!
ఆదర్శ దాంపత్యం అంటే అలా ఉండాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *