May 18, 2024

అస్త్ర సన్యాసం

రచన: అశోక్ అవారి

సమాజ సంఘటనల్ని
ఎప్పుడు కొలిచినా..
హృదయస్పందనల్లో హెచ్చుతగ్గులే.
మానవత్వాన్ని ఎప్పుడు తూచినా
మనసెప్పుడూ..
సంద్రంలో ఆటు పోటుల్లా అల్లకల్లోలమే.

మనిషి నిఘంటువులో
మంచితనపు పదాన్ని చేర్చలేక
అస్త్ర సన్యాసం చేసిన..
చేతగాని మానసిక అవిటి వాన్ని.
గురుదక్షిణగా నైపుణ్యం
బొటనవేలై తెగిపడ్డ ఏకలవ్యున్ని.
వ్యూహమే లేకుండా..
సమాజ సమస్యా పద్మవ్యూహంలో
కిరాతకంగా హత్య చేయబడ్డ వాన్ని.
ఇప్పుడు నేనొక జీవ మృత కళేభరాన్ని-

కడిగినా పోని నిత్య పాపాలపై
ప్రళయ రుద్రునిలా..
పాశుపతాన్ని ఇప్పుడెలా సంధించగలను ?
నిత్యం ఎక్కడో ఓ చోట విధిగా జరిగే
అత్యాచార ఆక్రందనలపై..
శబ్దవేదులను ఎలా ప్రయోగించగలను?
కాముకుల నీలిక్రీడలపై..
అద్దంలో ప్రతిబింబాలను చూసి
ఇంకెలా మదమాత్సర్యాలను పడగొట్టను ?

మంచే చెడుపై..
మారణాయుధం కావాలి.
హృదయమే ప్రేమ..
వజ్రాయుధంగా మారాలి.
త్రికరణాలే..
త్రిశూలమై దిగిపోవాలి.
ఎవరికివారే..
ఎదిరించే ఒక అస్త్రం కావాలి.
మంచితనమే..
మానవ నైజమై వెలగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *