May 17, 2024

ఆదర్శ కళ్యాణ వైభోగం

రచన: సుభద్ర వడ్లమాని

కృష్ణ మూర్తిగారు హడావుడిగా హాల్ల్లోకి వచ్చి “రాధా ఇంకా రెడీ అవలేదా? ఫ్లైట్ వచ్చే టైం అయిపోతోంది. నేను కార్ బయటికి తీస్తాను. తొందరగా రా.” అని చెప్పి బయటికి వెళ్లారు. 5 నిమిషాలలో రాధాదేవి వచ్చి కారులో కూర్చోగానే ఎయిర్ పోర్ట్ కి బయల్దేరారు. వాళ్లకి ఇద్దరూ అమ్మాయిలే. పెద్దమ్మాయి సుకన్య వివాహం అయి లండన్లో ఉంటోంది. చిన్నమ్మాయి సుప్రియ ఎం,స్ చేసి యూ.స్ లో మంచి ఉద్యోగం చేస్తోంది. రెండేళ్ల తరువాత ఇండియాకి వస్తోంది. వీళ్లిద్దరు వెళ్ళేసరికే సుప్రియ ఫ్లైట్ దిగి తల్లితండ్రులకోసం ఎదురుచూస్తోంది. ఇద్దరూ కూతుర్ని చూడగానే ఆనందంతో దగ్గరకి వెళ్లి కుశల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. సుప్రియ “ఇతను నా ఫ్రెండ్ ఆదర్శ్” అని తన పక్కన నిలుచున్న అతనిని పరిచయం చేసేసరికి ఈ లోకంలోకొచ్చారు.
ఆ అబ్బాయి ఈ కాలంలో కుర్రాళ్ళలాగా హాయ్! ఆంటీ , హాయ్! అంకుల్ అనకుండా రెండు చేతులూ జోడించి వినయంగా “నమస్కారమండీ” అనేసరికి ఇద్దరికీ ముచ్చటేసింది. అతను కూడా సుప్రియతో పాటు అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. అప్పుడు రాధాదేవి అతన్ని తేరిపారా చూసింది. అందగాడు, మంచి పొడగరి, చూడగానే మంచి అభిప్రాయం కలుగుతుంది. వెంటనే తేరుకుని ఆవిడ “పదండి ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాము” అనేసరికి నలుగురూ ఇంటిముఖం పట్టారు. కృష్ణమూర్తిగారు పెద్ద వ్యాపారవేత్త. బంజారాహిల్స్ లో విల్లా ఉంది.
ఇంటికి చేరగానే రాధాదేవి “అందరు ఫ్రెషప్ అయ్యి రండి. భోజనం చేద్దాం. సుప్రియ ఆదర్శ్ కి గెస్ట్ రూమ్ చూపించమ్మా” అని చెప్పి లోపలకి వెళ్ళిపోయింది. భోజనాలయ్యాక సుప్రియ “నాన్నగారు, అమ్మ మీతో మాట్లాడాలి” అని చెప్పేసరికి అందరికి వచ్చే అనుమానమే వాళ్ళకీ వచ్చి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అందరూ హాళ్లలో కూర్చున్నారు. ఆదర్శ్ కూడ అక్కడే ఉన్నాడు. సుప్రియ ఇంకా ఆలస్యం చెయ్యకుండా “నేను ఆదర్శ్ పెళ్లి చేసుకుందామనుకుంటున్నాము. అతను వాళ్ళ తల్లితండ్రులతో చెప్పాడు. వాళ్ళు ఒప్పుకున్నారు” అని చెప్పింది. మూర్తి, రాధల అనుమానం నిజమయ్యింది.
మూర్తిగారు ఆదర్శ్ తల్లిదండ్రుల గురించి వివరాలు తెలుసుకున్నారు. అన్నీ తృప్తికరంగా ఉండడంతో ఇరువైపులవారు మాట్లాడుకోవడం, పెళ్లి నిశ్చయించడం జరిగిపోయింది. పెళ్లి ముహూర్తం 20 రోజుల్లో ఉంది. నిశ్చయతాంబూలాలు నిరాడంబరంగా జరిగిపోయాయి. మర్నాడు మూర్తిగారు భార్యతో “రాధా! నెల కూడా లేదు పెళ్ళికి. పెద్దమ్మాయి పెళ్లికన్నా ప్రియ పెళ్లి ఘనంగా చేద్దామనుకున్నాం. కుదుర్తుందంటావా?” అని అంటుండగా సుప్రియ విని “నాన్న మీరే ఏర్పాట్లు చెయ్యద్దు. మా పెళ్లి ఎక్కడ చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో మేము ముందే నిర్ణయించుకున్నాము. ఏ పనీ మీరు చేయద్దు. మా పెళ్ళికి మేమే మిమ్మల్నందర్నీ తీసుకెళ్లాము.” అని ఖచ్చితంగా చెప్పింది. ఎన్నోరకాలుగా చెప్పడానికి ప్రయత్నించి ఏమి చెయ్యలేక మౌనం వహించారిద్దరు.
15 రోజులపాటు ప్రియ, ఆదర్శ్ ఎం చేస్తున్నారో , ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఆఖరికి లగ్నపత్రికలు, పిలుపుల విషయం కూడా వాళ్ళే చూసుకున్నారు. రెండు రోజుల్లో పెళ్లనగా ప్రియ, ఆదర్శ్ వాళ్ళ వాళ్ళ స్నేహితులని, బంధువులని తీసుకుని బస్సులో బయల్దేరారు. అందరికి ఉత్కంఠగా ఉంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారా తెలియదు. బస్సు ఒక గ్రామానికి చేరుకుంది. అది కృష్ణమూర్తి గారి గ్రామం రామాపురం. మూర్తిగారికి ఆ ఊళ్ళో ఎకరం వరిపొలం, ఎకరం మామిడితోట, పెద్ద పెంకుటిల్లు ఉన్నాయి. ఆ ఇల్లు మామిడి తోరణాలతో , ఇంటిముందు ముగ్గులతో కళకళలాడుతోంది. కానీ బస్ లో వెళ్ళినవాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. “ఇదేంటమ్మా ఇంత తక్కువమందా పెళ్ళికి. అదే హైదరాబాద్ లో ఐతే 2000 మందికి తక్కువ ఉండేవారు కాదు. ఎంత ఘనంగా జరగాల్సింది.” అని ఇంకేదో అనబోయిన మూర్తిగారిని మాట్లానివ్వకుండా సుప్రియ ” ఇంతకన్నా ఘనంగా జరుగుతుంది నాన్నా. రావాల్సినవాళ్లు పెళ్లి టైంకి వస్తారు.” అని చెప్పి వెళ్లిపోతుండగా వాళ్ళ అక్క సుకన్య ” ఐడెమ్ బాగాలేదు సుప్రియ. ఇంట సింపుల్ గానా నీ పెళ్లి జరగడం. నాన్న, అమ్మ, మీ బావ కూడా ఎంత బాధ పడుతున్నారో తెలుసా. రెండేళ్ల కిందట జరిగిన నా పెళ్లి గురించి అందరూ ఇప్పటికీ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో. మనకేం తక్కువ చెప్పు.” అని చెప్పబోతున్న ఆమెని వారించి ” ప్లీజ్ అక్కా! నాకిలాగే ఇష్టం ఇంకేం చెప్పకు.” అనేసి సుప్రియ వెళ్ళిపోయింది. ఇరువైపుల వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు.
పెళ్లిరోజు రానే వచ్చింది. ముహూర్తం ఉదయం 9.36 ని:లకు . 8.30 సమయంలో 3 నుంచి 4 వందలమంది పిల్లలు 3 నుంచి 15 ఏళ్ల వయసువాళ్ళు బిలబిలమని పెళ్లి మండపానికి వచ్చేరు. వాళ్ళతో 4 గురు పెద్దవాళ్ళు కూడా వచ్చారు. అందరూ ఆశ్చర్యంతో వీళ్ళెవరూ? ఎందుకొచ్చారు? అన్నట్లు చూసారు. ప్రియ తన స్నేహితులని పిలిచి ఏదో చెప్పింది. వాళ్ళు పిల్లల్ని ఒక చోట కూర్చోపెట్టారు. మామిడి తోటలో ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగుమీద, బాజా భజంత్రీలతో, మేళతాళాలతో సుప్రియ,ఆదర్శ్ ల వివాహం జరిగిపోయింది. అందరూ అక్షతలు చల్లారు. కానీ అందరి మొహాల్లో అసంతృప్తి ఇంకా వీడలేదు. వధూవరులిద్దరూ అందరికి నమస్కరించి, ఆశీర్వచనాలు పొందారు.
అప్పుడు సుప్రియ చేతులూ జోడించి “పెద్ద లందరికీ నమస్కారాలు. అమ్మ, నాన్న మిమ్మల్ని అసంతృప్తి పరచినందుకు క్షమించండి. కానీ నేనెందుకిలా చేసానంటే అక్క పెళ్లి చూసిన నాకు ఎంతో డబ్బుని అవసరానికి మించి ఖర్చు చేసినట్లు అనిపించింది. మన దేశంలో ఎంతోమంది ఆనాధలు, అభాగ్యులు తిండిలేక అల్లాడిపోతున్నారు. అందర్నీ మనం ఉద్దరించలేకపోవచ్చు. కానీ మనం పెళ్ళిళ్ళకి చేసే ఖర్చు తగ్గించి కొంతమందినైనా ఆడుకోవచ్చు కదా అన్న ఆలోచన వచ్చింది. నేను ఆదర్శతో ఈ విషయం గురించి మాట్లాడాను. అతను చాలా సంతోషించి నాతో సహకరించాడు. అతనిలాంటి మనిషి నాకు భర్తగా దొరకడం నా అదృష్టం. ఇద్దరం ఆలోచించి ఏదయినా అనాధ శరణాలయానికి సహాయం అందిద్దామని నిర్ణయించుకున్నాము. దర్యాప్తు చేయగా మన రామాపురంలోనే ఒక అనాధ శరణాలయం ఉందని, దానికి సహాయనిధులు సరిగా అందడంలేదని తెలిసింది. అందుకే ఈ గ్రామంలోనే నిరాడంబరంగా పెళ్లి చేసుకుని వారందరికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాము. పెళ్ళికి వచ్చిన పిల్లలే పెళ్లి పెద్దలు , బంధువులు. అత్తయ్య, మామయ్యా, అమ్మ, నాన్న మమ్మల్ని మరోసారి క్షమించాలి ఎందుకంటే మీ అనుమతి తీసుకోకుండా ఈ అనాధలలో ఒకర్ని దత్తత తీసుకుంటున్నాము. మీరందరూ పెద్దమనసుతో మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము.”
ఇందంతా విని అందరి కళ్ళు చెమర్చాయి. ఆ ప్రదేశమంతా కరతాళధ్వనులతో నిండిపోయింది. కృష్ణమూర్తిగారు తేరుకుని తన అల్లుడ్ని, కూతురిని ఆనందభాష్పాలతో అక్కున చేర్చుకున్నారు. ఆదర్శ్, సుప్రియ దంపతులు అక్కడికక్కడే ఒక పాపని దత్తత తీసుకున్నారు. అనాధ శరణాలయానికి 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. అక్కడున్న వాళ్ళందరూ ఆ జంటని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *