May 17, 2024

“చారిత్రిక నవలా సాహిత్యం.”

రచన: మంథా భానుమతి
bhanumathi

నవలా సాహిత్యంలో ఉన్న వివిధ విభాగాలలో చారిత్రిక నవలలది ఒక ప్రత్యేక స్థానంగా పలువురు పెద్దలు పేర్కొన్నారు.
చారిత్రిక నవలల ప్రత్యేకత ఏమిటి? కొద్ది సంవత్సరాలుగా వెనుక బడి మళ్లీ ఈ మధ్య కాలంలో కొంత ప్రాధాన్య సంతరించుకుంటోంది ఈ చారిత్రిక నవలా సాహిత్యం! ఒకప్పుడు వచ్చిన కొన్ని సినిమాలు, చరిత్రను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి.. కొద్ది మార్పులు చేర్పులు ఉన్నా కూడా.
బోలెడు అవార్డులందుకున్న బాహుబలి.. చారిత్రాత్మకం కాదు. తొలి జైన తీర్ధంకరుడైన రిషభదేవుని కొడుకు బాహుబలి. అతడి చరిత్రకీ సినిమా కథకీ సంబంధం లేదు.
తెలుగు సాహిత్యంలో నవలలు రెండు శతాబ్దాల క్రితం మాత్రమే వచ్చినా.. అప్పటి నుంచీ బహుముఖాలుగా తమ ఉనికిని చాటుకున్నాయనే చెప్పవచ్చు.
‘నవల’ అనే పేరు కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రిగారు పెట్టారని అంటారు.
“నవలకు మూలభూతమైనది కథ. ఒక నవలలో కథాకథనంతో పాత్రల సృష్టి చేయవచ్చు. సాంఘిక, ఆధ్యాత్మిక జీవితాలను చిత్రించవచ్చు. వాఙ్మయ సంఘర్షణలు ప్రదర్శించవచ్చు. నేటి జీవిన విధనాలని విమర్శించి ఆదర్శజీవితం సూచించవచ్చు. ఇంకా ఎన్నో సాధించి ఆనందం కలిగించవచ్చు. వీటన్నింటినీ పూర్వకాలానికి అన్వయించి రాస్తే, అది చారిత్రక నవల అవుతుంది.”
చారిత్రిక నవలలు సాహిత్యంలో అంత ప్రాముఖ్యతని సంతరించుకోలేదనే చెప్పచ్చు. సాంఘిక నవలలతో పోలిస్తే సంఖ్యలో చాలా తక్కువే. ఆరంభంలో చారిత్రిక నవలలు ప్రత్యేక సాహిత్యంగా గుర్తింపబడలేదు.
చరిత్ర ఏ ప్రక్రియలో రచింపబడింది? ఎప్పుడైనా, ఏ కాలంలో నైనా, ఏ సాహిత్య ప్రక్రియ ప్రాచుర్యంలో ఉందో, అదే ప్రక్రియలో! పురాణం ప్రాచుర్యం ఉన్న కాలంలో చరిత్ర పురాణంగానూ, కావ్యం ప్రాచుర్యంలో ఉన్న కాలంలో కావ్యంగానూ, వచనం ప్రధాన సాహిత్య సాధనం అయిన కాలంలో చరిత్ర రచనలను వచనంగానూ రచించారు..
జరిగిన సంఘటనలను తీసుకుని, కల్పన కలిపి రాసే నవల చారిత్రిక నవల. ఆనాటి కాలమాన పరిస్థితులలోకి వెళ్తూ.. ఒక రకంగా టైమ్ మెషిన్ లో ఆ నాటికి పయనించడమే ఈ నవలలలోని ప్రత్యేకత.
గత చరిత్ర సంఘటనలతో అవినాభావ సంబంధము కలిగి భవిష్యత్తులో మానవాళికి సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, పురోగమనాలలో దిశా నిర్దేశం చేసే శాస్త్రాన్ని చరిత్ర అని నిర్వచించ వచ్చు..
చారిత్రిక నవలల లక్షణాలను వివిధరకాలుగా ప్రతిపాదించారు పలువురు పెద్దలు. చరిత్రను రచయితలు అవగాహన చేసుకునే పద్ధతిని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. చరిత్రలో కూడా, పలువురు రచించిన గ్రంధాలను బట్టి, శాసనాలు ఆధారంగా చేసిన శోధనలను బట్టి కొద్ది తేడాలుండ వచ్చు. ఉదాహరణకి శ్రీనాధ మహాకవి, జననం, జీవిత కాలం గురించి నాలుగో ఐదో అభిప్రాయాలున్నాయి. వేటూరి ప్రభాకర శాస్త్రిగారు, వేలూరి వెంకటేశ్వర్రావుగారు, నేలటూరి వెంకటరమణయ్యగారు మొదలైన సాహితీ వేత్తలు దాదాపు ఇరవై సంవత్సరాలు అటూ ఇటూగా సంవత్సరాలని స్థిర పరచారు. అందుకే ఆరుద్ర గారు తమ సమగ్రాంధ్ర సాహిత్యంలో ఉజ్జాయింపుగా అని చెప్తారు.. కొన్ని సందేహాస్పదమైన కాలాలకి. ప్రముఖ సాహితీవేత్త వేలూరి వెంకటేశ్వర్రావు గారు, చారిత్రాత్మక నవలలు రాజకీయానుగుణ్యంగా ఉంటాయంటారు. అది కొంత నిజమే.. ఏ నవలలోనైనా ఆ కాలంనాటి పాలకుల విధానాలు, ప్రజల జీవితాలు కనిపిస్తూ ఉంటాయి.
పలు చారిత్రిక నవలలు రాసిన నోరి నరసింహశాస్త్రిగారు కొన్ని నిర్దిష్ట లక్షణాలను చెప్పారు. “జరిగినదంతా వ్రాసుకుంటూ పోతే చరిత్ర కాదు. లోకానికో, దేశానికో, సంఘానికో, వ్యక్తికో, మంచికో, చెడుకో ప్రభావం కలిగించే సంఘటనలు వ్రాస్తేనే చరిత్ర. దానితో అనుగుణమైన కల్పన జోడిస్తే చరిత్రాత్మక నవల అవుతుంది. దానికి చరిత్ర బీజముంటే సరిపోతుంది.”
చారిత్రక నవలల రచయితలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. వర్తమాన ఆచారాలనూ, భావాలనూ పూర్వ కాలానికి అన్వయించి చరిత్రను మార్చే ప్రయత్నం చెయ్యకూడదు.
ఆయాకాలాల సాంఘిక ఆచారాలను తెలిపే ప్రయత్నం చెయ్యాలి కానీ, ప్రస్థుత పరిస్థితులను చెప్పకూడదు.
హంగరీకి చెందిన మార్క్సిస్ట్ సాహిత్య సిద్ధాంతకర్త లూనాచ్ (1885-1971). లూనాచ్ ప్రవచించిన సిద్ధాంతం ప్రకారం చారిత్రక నవలకి ముఖ్యంగా ఐదు ప్రధానమైన లక్షణాలు ఉండాలి. అవి ఈ కింది క్రమంలో ఉంటాయి:
1. చారిత్రిక నవల సాంప్రదాయక రూపం ఇతిహాసం. ఈ ఇతిహాసం, కొందరు కీలక వ్యక్తుల పైనున్న సాంఘిక శక్తుల ప్రభావం, సాధారణ జనుల జీవితాలను ఏ విధంగా మార్చిందో తెలియజేస్తుంది.
2. ఈ ఇతిహాసంలో పేరుపొందిన చారిత్రిక వ్యక్తులు పాత్రధారులుగా వస్తారు; కాని వారి పాత్ర కేవలం నామమాత్రమే.
3. కథ సామాన్యమైన మధ్యరకం వ్యక్తులతో అల్లబడుతుంది. రెండు విరుద్ధ శక్తుల ఘర్షణలో వీళ్ళు కథాగమనానికి వ్యక్తిగతమైన స్పష్టత ఇస్తారు.
4. సాంఘిక జీవితాలలో మార్పులకి నవల వేదిక అవుతుంది.
5. వివిధ పోరాటాలతో సమాజాలని, ఆ సమాజాలలో వ్యక్తులనీ వేరుచేసి చూపించి, సాంప్రదాయక చారిత్రక నవల తుదిలో మానవ ప్రగతిని ధ్రువీకరిస్తుంది. (‘ఈమాట’ లో వ్యాసం నుండి..)
లూనాచ్ చెప్పిన మొదటి లక్షణం అందరికీ ఆమోద యోగ్యమే. పురాణాలలో, ఇతిహాసాలలో చెప్పే కొన్ని కథలు ఎప్పుడో విన్నట్లే అనిపిస్తాయి. ఎందుకంటే చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. మహా భారత యుద్ధం, పలనాటి యుద్ధం మధ్న ఉన్న సారూప్యాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుకు తెచ్చుకోవచ్చును.
రామాయణ మహా భారతాలను ఇతిహాసాలంటున్నాం. అవి భారత దేశంలో నిత్యకృత్యాలలో పెనవేసుకు పోయాయి.
“ధర్మార్ధ కామ మోక్షాణాం ఉపదేశ సమన్వితం
పురావృత్తం కథా యుక్తం ఇతిహాసం ప్రచక్ష్యతే” అని ఇతిహాస లక్షణాలను చెప్తారు. మొట్టమొదటి చారిత్రాత్మక నవలలు ఆ ఇతిహాసాలే.. జరిగిన సంఘటనలే ఆ గ్రంధాలలో ఉన్నాయి.. అందుకనే అక్కడున్న ప్రదేశాలు మనకి దేశంలో అన్ని చోట్లా కనిపిస్తూనే ఉంటాయి.
ఐతే అన్ని చారిత్రిక నవలలూ మిగిలిన లూనాచ్ సూత్రాలను పాటిస్తూ ఉండ నక్కరలేదు. సాహిత్యవేత్తలు చరిత్రను భిన్న కోణాల నుంచి అర్థం చేసుకుని వివిధ పద్ధతుల్లో వ్యక్తీకరించ వచ్చు.
చరిత్రకూ నవలకూ తేడా లేదని కూడా కొందరు పెద్దలు చెప్తారు.
ప్రముఖ సాహితీ వేత్త బెజవాడ గోపాలరెడ్డిగారు “చరిత్రాత్మక నవల, ఇతిహాసమూ కల్పనా కలగలసిన సమరసమైన సుందరమైన కూర్పు” అని చెప్పారు. ఇదే ఒక సూత్రంగా మనం తీసుకోవచ్చు.
పాశ్చాత్యులకి చారిత్రిక విశేషాలన్నీ భద్ర పరచే అలవాటుంది. అందుకే వారు “భారతీయులకి చరిత్ర తెలీదు.. కదిలిస్తే పుక్కిటి పురాణాలు చెప్తారు” అంటారు. ఇదే సంగతి విదేశీ పాలకులు పదే పదే చెప్తుండడంతో అదే నిజమేమో అనే భ్రమ వచ్చేసింది మనందరికీ. విదేశీ పర్యాటకుల వల్ల మనకి మధ్యకాలంలో చరిత్ర తెలిసినా, మన పురాణాలవల్లే ప్రాచీన చరిత్ర తెలిసింది. అందుకే విశ్వనాధ సత్యనారాయణగారు పురాణ వైర గ్రంధమాల అని 12 చారిత్రిక నవలలు రాశారు. ఐతే చాలా మంది సాహిత్యకారులు వీటిని చారిత్రిక నవలలుగా ఒప్పుకోలేదు.
ఒక రకంగా, చరిత్ర మరీ ఎక్కువ తెలియకపోవడం కూడా వరమే నవలా కారులకి! కల్పన ఎక్కువగా చెయ్యచ్చు.
తెలుగులో సాంఘికనవలలోతో పాటుగానే చారిత్రాత్మక నవలలు కూడా 19 వ శతాబ్దం చివర్లో మొదలయ్యాయి.
చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు మొదటగా రాజస్థాన్ రాజుల చరిత్ర ఆధారంగా.. అప్పటికి ఆంగ్లంలో వచ్చిన కథా సంపుటాల ఆధారంగా రాసిన ‘హేమలత’ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. హోల్కారు రాణి అహల్యాబాయి మీద కూడా వారే నవల రాశారు.
మరి కొందరు రాసినా, రాజస్థాన్ రాజుల గురించే రాశారు. చిలుకూరి వీరభద్ర రావుగారు ఐదు సంపుటాలు, ఆంధ్రుల చరిత్ర రాశారు కానీ నవల రూపంలో లేదు.
తెలుగు గడ్డ నేలిన రాజుల చరిత్రతో మొట్టమొదటి చారిత్రిక నవల, 1914 లో దుగ్గిరాల రామచంద్రయ్యగారు రాసిన ‘విజయనగర సామ్రాజ్యం’ గా నోరి నరసింహశాస్త్రిగారు పేర్కొన్నారు.
ఆ తరువాత దాదాపు రెండు దశాబ్దాలు, తెలుగువారి చారిత్రిక నవలల జాడ కనిపించలేదు. పెద్దవారు స్వాతంత్ర సమరం ప్రభావంలో ఉండడం, కవిత్వం మీద దృష్టి ఎక్కువగా పెట్టడం, వచన కావ్య రచయితలు ప్రసిద్ధ గ్రంధాలని అనువాదాలు చెయ్యడంతో తృప్తి చెందడం వంటివి కారణాలై ఉండచ్చు.
విశ్వనాధ సత్యనారాయణగారు 1932 ప్రాంతాలలో రాసిన ఏకవీర చారిత్రిక నవలా సాహిత్యాన్ని మలుపు తిప్పిందని చెప్పచ్చు. తమిళనాడు ప్రాంతంలో, నాయకరాజుల యుగం నేపథ్యంగా తీసుకుని ఇరువురు స్నేహితుల ప్రణయం గురించి చిత్రీకరించిన నవల ఏకవీర. ప్రధానగాథ ఇద్దరు మిత్రుల సాంసారిక జీవితానికి సంబంధించిందైనా సందర్భవశాత్తుగా అప్పటి సాంఘిక పరిస్థితులు, పోర్చుగీసువారి దుండగాలు-దోపిడులు, రాబర్టు నోబిలి తత్త్వబోధకస్వామి అనే సన్యాసి వేషంతో చేసిన దొంగ మతబోధ, దేవాలయాలలోని శిల్పనైపుణ్యాదులు చక్కగా ప్రదర్శింపబడ్డాయి.
తరువాత బద్దన్న సేనాని వంటి నవలలు రాశారు. ఈ నేపథ్యంలో పురాణాల చారిత్రికతను తిరస్కరించిన చరిత్ర రచనా ధోరణిని విశ్వనాథ వారు పురాణవైరంగా పేర్కొన్నారు. భగవంతుని మీది పగ ఉపోద్ఘాతంలో ఈ నవలామాలిక లక్ష్యాలను పేర్కొంటూ “ఆ లెక్క(పాశ్చాత్య చరిత్ర కారుల లెక్క) ప్రకారము కలి ప్రవేశము మొదలు- సంయుక్తా పృథ్వీరాజుల కథ దనుక, పాశ్చాత్యులు తారుమారు చేసిరి. ఆ కాలము, అనగా సుమారు మూడువేల యేండ్ల కాలము, మహమ్మదు గోరీ వచ్చువరకు మన చరిత్రలో పాశ్చాత్యులు చేసిన అవక తవకలను కాదని నవలల రూపమున నిరూపించుటకు చేసెడి ప్రయత్నమిది. అందుచేత దీనికి పురాణవైరము అని శీర్షిక ఏర్పరుపబడినది.” అన్నారు విశ్వనాథ సత్యనారాయణగారు.
అదే సమయంలో ఆంధ్రుల చరిత్రకు సంబంధించి ప్రామాణిక గ్రంధాలు చాలా వచ్చాయి. చిలుకూరి వీరభద్ర రావుగారు, డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్యగారు, భావరాజు కృష్ణారావుగారు, మల్లంపల్లి వారు, మారేమండ రామారావుగారు ఎన్నో గ్రంధాలు రచించారు.
ఐతిహాసిక మండలివారు రాజరాజ నరేంద్ర సంచిక, కళింగ సంచిక, రెడ్డి సంచిక, కాకతీయ సంచిక, శాతవాహన సంచిక మొదలైన అమూల్య గ్రంథాలు ప్రచురించి ఆంధ్రుల చరిత్రతో పాటు మూలాధారాలు కూడా పాఠకుల అందుబాటులోకి తెచ్చారు. కానీ రచయితలు వాటిని ఉపయోగించుకుని రచనలు చేసినట్లు కనిపించదు.
1951లో ఆంధ్రా యూనివర్సిటీ వారు, ఇంటర్మీడియెట్ కు ఉపవాచకాలుగా నిర్ణయించే నిమిత్తము ఆంధ్ర చరిత్రకు సంబంధించిన ఉత్తమ నవలకు ఒక్కొక్కదానికి వెయ్యి రూపాయలు బహుమతి ప్రకటించారు. మల్లాది వసుంధర రాసిన తంజావూరు పతనం, సప్తపర్ణి; ధూళిపాళ శ్రీరామమూర్తి రచించిన భువన విజయము, గృహరాజు మేడ: పాటిబండ మాధవ శర్మ రాసిన రాజశిల్పి నవలలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు బహుమతి ప్రదానం చేశారు.
ఈ నవలలన్నింటిలోనూ మల్లాది వసుంధరగారు రాసిన ‘తంజావూరు పతనం’ పలువురి ప్రసంశ లందుకుంది. ఏకవీర లో లాగానే అరవ ప్రాంతంలో జరిగిన కథైనా, తెలుగు గడ్డనేలిన, తంజావూరు నాయకరాజులలో చివరి వాడైన విజయరాఘవరాయలి కి సంబంధించినది కనుక తెలుగు చరిత్రేనని చెప్పచ్చు. విజయరాఘవుడు మంచి సాహిత్య పోషకుడు.. సమర్ధుడైన పాలకుడు. కానీ, రంగాజమ్మ మోహంలో పడి రాజ్య పాలన విస్మరించి, మహారాణి రాజగోపాలాంబిక ఆగ్రహానికి గురయి, పొగడ్తల కి లొంగిపోయి, తాను దైవాంశ సంభూతుండనుకుని గర్వంతో విర్ర వీగుతూ, అష్టమహిషులనీ సరిగ్గా చూడకపోవడం వంటి లోపాలతో పతనమౌతాడు.. చివరికి కొడుకుని బంధించారని కోపోద్రిక్తురాలైన రాజగోపాలాంబిక, ఉంపుడు గత్తె రంగాజమ్మ తనకి సోదరి అని తెలిసి కృంగి పోవడంతో కథ ముగుస్తుంది. చరిత్రని సర్వజనామోదంగా నవలగా మలచడంలో అద్భుతమైన ప్రావీణ్యం చూపారు రచయిత్రి. ఈ నవల రాసినప్పుడు ఆవిడ వయసు 17 సంవత్సరాలు. చదువు కుంటున్నారు. విశ్వనాధవారి శిష్యురాలు. ఈ రచయిత్రి రచించిన ‘సప్తపర్ణి’ నవల కాకతీయ రాజ్యపతనం గురించి రాసింది. అది కూడా బహుమతి పొందింది.వీరు రాసినవి ఆరు నవలలే ఐనా, ఎంతో ప్రాచుర్యం పొందాయి. అప్పట్లో వెయ్యి రూపాయలు బహుమతులు రెండు నవలలకి రావడం సంచలనం సృష్టించింది.
ఇంత లాగ వీరి గురించి చెప్తున్నాను.. ఎందుకో తెలుసుగా.. ఈ నాలుగు మాటలు మాట్లాడ్డానికి గాను చేసిన పది రోజుల పరిశోధనలో.. నోరి నర్సింహ శాస్త్రిగారి వ్యాసంలో చోటు చేసుకున్నచారిత్రిక నవలలు రాసిన ‘రచయిత్రి’ వీరొక్కరే.
ముక్తేవి భారతిగారు భారతంలో కథలు మొదలైన ఇతిహాస సంబంధమై న రచనలు చేశారు. మనం ఇతిహాసాలు చరిత్రలనుకున్నాం కనుక భారతిగారు కూడా చారిత్రాత్మక రచనలు చేశారని భావించ వచ్చు.
ఆంధ్రా విశ్వ విద్యాలయం వారి బహుమతి పొందిన ఇంకొక రచయిత ధూళిపాళ శ్రీరామమూర్తి గారు. వారు రాసిన భువన విజయం, పారిజాత సౌరభం కూడా అందరూ మెచ్చుకున్న నవలలు. విజయనగర సామ్రాజ్యం, కృష్ణదేవరాయల ఆస్థానం, చాలా నవలలకి మూల కథలనందించాయి. చారిత్రాత్మక నవల లక్షణాలకి దగ్గరలో ఈ చరిత్ర నిలిచింది. దీనికి ఆ కాలంలో జరిగిన అనేక సంఘటనలు కథా వస్తువులకి అనుకూలంగా ఉండడమే కారణం.
అంతే కాదు…
వివిధ పోరాటాలతో సమాజాలని, ఆ సమాజాలలో వ్యక్తులనీ వేరుచేసి చూపించడంలో, సాంప్రదాయక చారిత్రక రచనలకి ఆస్కారమయింది. తుదిలో మానవ ప్రగతిని కూడా ధ్రువీకరిస్తుంది.
పాటిబండ మాధవశర్మగారి రాజశిల్పి కూడా ఆంధ్రా విశ్వవిద్యాలయము వారి బహుమతి పొందిన నవల. కొండవీటి రాజ్యమును కుమారగిరి పాలించిన నాటి చరిత్ర. ఈ నవలలో ప్రముఖులైన కోమటి వేమారెడ్డి, శ్రీనాధ కవి మొదలైన వారికి చాలా తక్కువ ప్రాధాన్యత నిచ్చారు. నవలాకారులకి ఆ స్వేచ్ఛ ఉంటుందంటారు నోరి నరసింహ శాస్త్రిగారు.
ప్రముఖ రచయిత, కళాకారుడు అడవి బాపిరాజుగారు.. హిమబిందు, గోనగన్నారెడ్డి, అడవి శాంతిశ్రీ నవలలను వేర్వేరు చారిత్రిక కాలాలను నేపథ్యాలుగా తీసుకుని రచించారు.
చారిత్రిక నవలలకు, సారస్వత రూపాన్నిచ్చినవారు అడవి బాపిరాజు గారు. వారి నవలలలో హిమబిందు ప్రపంచ భాషల నవల్లో ఉత్తమస్థాయి నందుకుంది. శ్రీముఖ శాతవాహన చక్రవర్తి కాలంనాటి కథ. ఇందులో చక్రవర్తి మతసహనం వల్ల వైదిక, జిన, బుద్ధ ధర్మాలన్నీ సామరస్యంతో మన గలిగాయి. ఇందులోనే విషకన్య ప్రయోగం కూడా పరిచయం చేశారు రచయిత.
నోరి నరసింహశాస్త్రి మూడు శతాబ్దాల సారస్వత చరిత్ర, సాంఘిక చరిత్ర ఆధారముగా తీసుకొని మూడు నవలలు నారాయణ భట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి రాశారు. అవి కాక శ్రీనాథుని జీవితాన్ని, కవిత్వాన్ని గురించి కవి సార్వభౌముడు, ధూర్జటి జీవితాన్ని, కావ్యాలను ఆలంబనం చేసుకుని ధూర్జటి, మొదలగు చారిత్రిక నవలలు రాశారు. నోరివారి రచనలకీ, అడవి బాపిరాజుగారి రచనలకీ తేడా ఉందని నరసింహశాస్త్రిగారే చెప్తారు. బాపిరాజుగారు బౌద్ధమతాన్ని అభిమానిస్తే, నోరివారు వైదిక నిష్ఠాపరులు. వారు భారతీయాభిమానులైతే, వీరు ఆంధ్రాభిమానులు. ఈ విషయాలు వారి రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
చారిత్రిక నవలలంటే ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారే గుర్తుకొస్తారు నాకు. దాదాపు 30 నవలలు రాశారు.
వీరికి చారిత్రిక నవలా చక్రవర్తి, అభినవ పాల్కురికి అన్న బిరుదులున్నాయి. ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహికగా వచ్చిన శ్రావణి బాగా పాఠకాదరణ పొందింది. మచ్చుకి ఈ నవల గురించి కొంత.. రెండువేల నాటి మహొజ్వల మహా యుగంలో, గొతమీ పుత్ర శాతకర్ణి, భారతావనిని పరి పాలిస్తున్న కాలం.. ఇతడిని శకకర్త, శక హర్త అంటారు.ఇప్పటి గుంటూరు జిల్లాలోని అమరావతి అప్పట్లో వారి రాజధాని. అప్పటి ఆంధ్రుల సాహిత్యానికి సంస్కృతికి, నాగరికతకు అద్దం పట్టిన నవల శ్రావణి. ఇదొక గద్య ప్రబంధం. నవరసభరితమైన వచన మహాకావ్యం. శాతవాహనులు తొలి తెలుగు రాజులు. వారి అశ్వాలు త్రిసముద్ర తోయ పీత వహనలు. మూడు సముద్రాలలోని నీటిని తాగాయిట. ఇదొక అతిశయోక్తి అనుకుందాం.. సముద్రంలో నీళ్లు తాగగలవా అనే ప్రశ్న మనం వెయ్యకూడదు.వారి జెండాలు,రోము ,గ్రీకు,ఈజిప్టు,బర్మా,కాంబోడియా, చైనా తీ రాలలోని రేవు పట్టణాలలో రెపరెపలాడాయి.దేదీప్యమానమైన కాంతులను వెదజల్లుతూ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిన దివ్యమణి, ఇంద్ర నీలమణి శ్రావణి. దానిని ఆంధ్ర చక్రవర్తులు పోగొట్టు కుంటారు.
గౌతమీ పుత్ర శాతకర్ణి, తల్లి ఐన గౌతమీ బాలశ్రీ సూచనల ప్రకారమే సామ్రాజ్య బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. ఆ సూచనలలో భాగంగా గౌతమీ పుత్ర శాతకర్ణి తన పెద్ద కొడుకయిన వాశిష్టి పుత్ర పులోమావిని . శ్రీకాకుళం ఆంధ్రసామ్రాజ్యపు ఉప రాజధాని అయిన శ్రీకాకుళానికి అధిపతి గా నియమించ బోతుండుగా అతడు తండ్రిని వారించి, ముందుగ పోగట్టుకున్న శ్రావణి ని తిరిగి సంపాందించి శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు మెడలో అలంకరించిన పిమ్మటే నేను పట్టాభిషిక్తుడునవుతాను. అని చెప్పి బయల్దేరతాడు.
ఆ ఇంద్రమణి శ్రావణి అన్వేషణ, సామ్రాజ్య విస్తరణ రెండూ వేర్వేరు అంశాలు కావు. ఒకే నాణేనికి రెండుముఖాలు. ఇది జరిగినాడు నిజమైన సామ్రాట్టులుగా మొత్తము ప్రపంచము గుర్తిస్తుంది. శ్రీకాకుళం ఏమిటి మన ప్రతిష్టానాన్ని పాటలీ పుత్రాన్ని మళ్ళీ స్వాధీనము చేసుకుంటాము. మన గుర్రములు త్రివేణీ సంగమము లో స్నానము చెయ్యాలి. మన నాగధ్వజము ఇంద్రప్రస్థముపై రెపరెపలాడాలి. ఉజ్జయిని మన పాదాక్రాంతము కావాలి. అప్పుడే మనకు విశ్రాంతి.అని పులోమావి అంటాడు. అన్వేషణ కై వెళ్ళిన అతనికి ఎన్నో వింతలూ విశేషాలు అనుభవాలు ఎదురవుతాయి. ఆనాటి ఆంధ్రుల ప్రాభవం ,వారి జీవన విధానం చదువుతుంటే ఒడలు పులకరిస్తుంది.
అవన్నీ ఒక రెండు వాక్యాలలో చెప్పలేము. ప్రతి తెలుగు వారు తప్పక చదవలసిన పుస్తకం.
ఇంకొకటి ఆచార్య నాగార్జనుని జీవతాన్ని గురించిన నాగపూర్ణిమ నవల.. నాగార్జనుని జీవితకాలం, ప్రదేశాలు గురించి చరిత్రలో భిన్నాభిప్రాయాలున్నాయి. వాటిలో తమ కథకు అనుకూలమైనవి తీసుకునే స్వతంత్రం నవలా కారునికి ఉంటుంది.
ముదిగొండవారి నవలల్లో నాయకునికి ఒక చెలికాడు ఉంటాడు. హాస్యం పండిస్తూ ఉంటాడు. నాయికలుంటారు. వారి ప్రేమగాధలుంటాయి. ప్రతీ నవల ఆద్యంతం ఆసక్తి దాయకంగా సాగుతుంటుంది.
తెన్నేటి సూరి మంగోలు చరిత్రను ఆధారంగా చేసుకుని చెంఘిజ్ ఖాన్ రాశారు. ఈ నవల సర్వాంగ సుందరమై అడుగడుగునా గోబీ ఎడారి వాతావరణముతో అక్కడి జనముల తీవ్ర రాగద్వేషాలతో స్పందిస్తున్నది.
వేదుల సూర్యనారాయణశర్మ ఆర్యచాణక్యుడు రచించారు. కానీ ఈ రచన నవల అనిపించుకోలేదని నోరివారు అంటారు.
మహీధర రామమోహనరావు ‘కొల్లాయిగట్టితేనేమి?” నవలను, 1921లో ముంగండ అగ్రహారంలో సంప్రదాయ బ్రాహ్మణ యువకుడు చేసిన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆధారంగా తీసుకుని రాశారు. ఈ నవలకి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డ్ నిచ్చి సత్కరించింది. అవార్డ్ దక్కించుకున్న చారిత్రిక నవల ఇదే అనుకుంటున్నాను.
చారిత్రిక నవల అంటే.. రాజుల కాలంనాటిదే కాదు.. గతంలో జరిగిన ఏసంఘటన నైనా ఆధారంగా తీసుకుని రాయచ్చని ఈ నవల చదివితే తెలుస్తుంది. ఇందులో ఆ బ్రాహ్మణ యువకునికి అయిన అనుభవాలు ఏ చరిత్రలోనికీ ఎక్కలేదు. స్వాతంత్ర పోరాటంలో పాల్గోన్న దువ్వూరి సుబ్బమ్మగారు, సంఘసంస్కర్త వీరేశలింగంగారు, గాంధీగారు మొదలైన వారి ప్రస్థావన వస్తుంది. కథానాయకుడు సామాన్య యువకుడు. అతడి సాంసారిక జీవనం, మామగారు చేస్తున్న దాష్టీకం, చదువు మీది ఆసక్తితో కాపురాన్ని వదులుకున్న ఇతర కులస్థురాలితో అతని పరిచయం, నిమ్న కులస్తులని గ్రామీణ జీవన స్రవంతిలో కలిపే ప్రయత్నంలో కథానాయకుని ప్రయత్నాలు బాగా.. అలవోకగా చెప్పారు రచయిత.
రాచమల్లు రామచంద్రారెడ్డి వంటి విమర్శకులు కొల్లాయి గట్టి తేనేమి?, చెంఘీజ్ ఖాన్ వంటి నవలలను తప్ప ఇతరమైన చాలా నవలలను చారిత్రిక నవలలుగా గుర్తించలేదు. కొల్లాయి గట్టి తేనేమి? నవల గురించి రాసిన వ్యాసంలో ఆయన చెప్పుకోదగిన చారిత్రక నవల అంటూ లేని తెలుగు సాహిత్యంలో యీ నవలకున్న స్థానం అమూల్యమైనది అంటారు రా.రా. ఐతే, రారా గారు, మహీధర వారు ఇద్దరూ మార్క్సిస్ట్ భావాలు కలిగిన వారే. నోరి వారు సరదాగా కమ్యూనిస్టు గోరోజనం అలా రాయిస్తుంది నీ చేత అనే వారుట. సాహిత్య అకాడమీ అవార్డ్ కి వారి నవలకి రెండు విడతల్లోనూ మార్కులు వేశానని చెప్పి మరీ! సద్విమర్శకులు తమకు నచ్చిన వాటిని పొగడడం సబబే, కానీ ఇంక మిగిలినవేవీ చారిత్రిక నవలలే కాదనడం భావ్యంకాదనిపిస్తుంది నాకు.
భైరవభట్ల కామేశ్వర్రావుగారి వంటి పలు సాహితీ వేత్తల విమర్శలకు గురయిందీ విశ్లేషణ. ‘ఈ మాట’లో ఇచ్చిన పూర్తి వ్యాసం చదువుతే మనకి కూడా ఆవిధంగా అనిపించడం కద్దు. మొత్తం వ్యాసం అంతా నవలని సమర్ధించడానికే నడిచింది. అదే నోరివారి వంటి సాహితీ వేత్తలకి కూడా నచ్చలేదు.
కానీ.. ఇటువంటిదే అశోక మిత్రన్ రాసిన “జంటనగరాలు” నవల. సికంద్రాబాద్ , హైదరాబాద్ నగరాలలో 1947,48 నాటి రాజకీయ మలుపులను చిత్రీకరిస్తుందీ నవల. తమిళంలో రాసిన ఈ నవలను, జిసి. జీవి తెలుగులోకి అనువదించారు. ఈ నవల కూడా రారా గారి నిర్వచనానికి సరిపోతుంది. అయినా వారు దీనిని గుర్తించలేదు.
చాలా మంది విమర్శకులు లూనచ్ చెప్పినదే సిద్ధాంతం కింద తీసుకోనక్కర్లేదని చరిత్రకి సంబంధించిన నవలలన్నీ చార్త్రిక నవలల కింద వస్తాయని అంటారు.
అందుకే నోరి నరసింహశాస్త్రి వంటి వారు చాలా నవలలను పేర్కొని మంచి చారిత్రిక నవలలు అని ప్రశంసించారు.
1952 లో బేతపూడివెంకట శివరావు, అమర సింహుడు నవలలో, రాజస్థాన్ లోని మేవాడ్ రాజ్యానికి చెందిన రాజపుత్ర రాజు, శౌర్యవంతుడు ఐన అమరసింహుని జీవితాన్ని చిత్రీకరించారు.
కావ్యకంఠ వాశిష్ట గణపతి మునిగారు రాసిన “సత్యప్రభ” ఎన్నదగిన చారిత్రిక నవల. ఈ నవల ఇతి వృత్తం అలనాటి ఆంధ్రసామ్రాజ్యమునేలిన శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ. ఆంధ్ర, మగధ రాజ్యాల రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితుల నాధారంగా జేసుకొని విస్తృతమైన తెరమీద ఎన్నో పాత్రలను సంధానం చేస్తూ ఆంధ్రమహావిష్ణువు యొక్క చారిత్రాత్మక ప్రణయగాధగా మలచిన శ్రీకావ్యకంఠ వాశిష్ఠ గణపతి మునిగారి స్వకపోల కల్పితం.
నేటి కాలానికి సంబంధించిన కథా వస్తువు తీసుకుంటే అందులో రచయిత అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వడం జరుగుతుంది, తాము నమ్మిన సిద్ధాంతాలని చదువరులంతా నమ్మితీరాలని ఆశించే ప్రమాదం ఉంది. వర్తమానం కంటే గడచిన కాలాన్ని చిత్రిస్తేనే కొంత నిర్లిప్తతతో రచన చేసి సారస్వతసిద్ధి కలిగించేందుకు ఎక్కువ అవకాశమున్నదేమో అనిపిస్తుంది.
పైగా ఏదో ఒక వాదానికి సంబంధించి వ్రాస్తేనే గుర్తింపు కలుగుతోందని చాలా మంది నవలా కారులు అభిప్రాయ పడుతున్నారు.
నోరి వారే ఒక దగ్గర సెలవిచ్చారు.. ధనవంతులు పరమ దుర్మార్గులు గానూ, పేదవాళ్లు సద్గుణ వంతులుగానూ చిత్రిస్తేనే అది మంచి సాంఘిక నవలగా చెలామణీ అవగలదని (అంటే.. నేనింకా కాస్త నాజూగ్గా చెప్పాననుకోండి వారి అభిప్రాయం) అందుకే చారిత్రిక నవలలో ఆ సమస్య ఉండదనీ.. కల్పనకూడా విస్త్రుతంగా చేయవచ్చనీ వారు అంటారు.
పైగా నా మీద ఇలా రాశారేవిటీ అని దెబ్బలాడ్డానికి అందులో పాత్రలు లేచి రాలేవు కూడా! చరిత్రని మార్చి రాశావేమిటీ అని అంతగా అంటే అది రచయిత తీసుకున్న స్వతంత్రమనేయచ్చు.
ఇంకా వావిలాల సోమయాజులుగారు, పుట్టపర్తి నారాయణాచార్యులుగారు, విహారి-శాలివాహన, డాక్టర్ త్రిపురనేని వెంకటేశ్వర రావుగారు, మరెందరో చారిత్రిక నవలలు రాశారు.
స్థూలంగా ఇదీ చారిత్రాత్మక నవలా సాహిత్యం చరిత్ర.
(డాలస్ నగరంలో, 2016, మే 27,28,29 తేదీలలో జరిగిన నాటా మహా సభలలో చేసిన ప్రసంగం. ఈ అవకాశం ఇచ్చిన నాటా, సాహిత్యం విభాగం నిర్వాహకులకి ధన్యవాదాలతో… మంథా భానుమతి.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *