May 17, 2024

జీవితం ఇలా కూడా ఉంటుందా 5

రచన: అంగులూరి అంజనీదేవి

అప్పటికప్పుడే ఆమె ముందు కస్టమర్స్‌ క్యూ పెరిగింది… వాళ్లతో చాలా ఇంప్రెసివ్‌గా మాట్లాడుతూ వాళ్ల దృష్టిని ఎాక్ట్‌ చేసి వాళ్లను పక్కషాపులకు వెళ్లకుండా చేస్తోంది. ఆమెలోని ఆ షార్ప్‌నెస్‌ వల్ల, స్టాల్ వల్ల తమ బిజినెస్‌ స్పీడ్‌గా డెవలప్‌ అయ్యే అవకాశాలు వున్నాయని వాళ్ల ఏర్‌టెల్‌ డెమో ఆఫీసర్‌ పైవాళ్లకు ఆమె పేరును రెకమెండ్‌ చేసే ఛాన్సెస్‌ కూడా వున్నట్లు ఆమెకు నిన్ననే తెలిసింది.
*****

అంకిరెడ్డి వాకింగ్‌కి వెళ్తూ దారి మధ్యలో వున్నాడు. ఆయన కారును డ్రైవ్‌ చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఇవాళ ఎలాగైనా వాసుదేవ్‌తో సతీష్‌చంద్ర గురించి మ్లాడాలి. తను చేసిన ప్రయత్నాల్లో ఒక్కటీ కూడా తనకి అనుకూలంగా లేవు. సతీష్‌చంద్ర పెళ్లి అనుకున్న టైం ఎలాంటిదో అడుగడుగునా వ్యతిరేకమైన సమాధానాలే వస్తున్నాయి. ఒక్కరు కూడా మీ అబ్బాయికి మేం మా అమ్మాయిని ఇస్తామని ముందుకు రావడం లేదు. అడగ్గానే ముందు ఆసక్తి చూపినా ఆ తర్వాత అబ్బాయి గురించి అడిగి ఏ విషయం ఆలోచించి చెబుతాం అని తప్పించుకుంటున్నారు… ”ఇదేంటండీ పూటకి తిండిలేని వాళ్లకి కూడా పెళ్లిళ్లు అవుతున్నాయి. ఈ కర్మేంటి మనకు…” అని మాధవీలత ప్రతిరోజూ బాధపడుతూనే వుంది.
అంకిరెడ్డి ఎప్పటిలాగే కాలేజి ఆవరణలో చింతచెట్టు క్రింద తన కారును ఆపుకున్నాడు. వాసుదేవ్‌ వచ్చాడో లేడో అన్నట్లు ఆయన కారు కోసం వెతికాడు. వాసుదేవ్‌ కారు అక్కడే వుంది. ఆయన కూడా అప్పుడే వచ్చినట్లుంది. కారులోంచి దిగుతున్నాడు. వాసుదేవ్‌ అంకిరెడ్డిని చూడగానే ”గుడ్‌మార్నింగ్‌ రెడ్డీ!” అంటూ చేయి వూపాడు.
”గుడ్‌మార్నింగ్‌! గుడ్‌మార్నింగ్‌!” అంటూ వాసుదేవ్‌ను కలిశాడు అంకిరెడ్డి.
అంకిరెడ్డి మాట్లాడేలోపలే ”ఏం రెడ్డీ! ప్రత్యేక తెలంగాణ ఇస్తారా? లేక సమైక్య ఆంధ్రానా? నువ్వెలా గెస్‌ చేస్తున్నావ్‌?” అన్నాడు వాసుదేవ్‌.
”పొత్తులతో, ఎత్తులతో, జిత్తులతో, కుయుక్తులతో కుమ్మక్కయి సాగుతున్న రాజకీయాల గురించి ప్రస్తుతం ఏం మాట్లాడుకున్నా అది తెల్లవారేటప్పటికే మారిపోయేలా వుంది వాసు! అందుకే నేను ఏదీ గెస్‌ చెయ్యలేకపోతున్నాను” అంటూ ఆయన తన అభిప్రాయాన్ని చెప్పాడు.
”నువ్వేకాదులే! ఇప్పుడు అందరి పరిస్థితి అలాగే వుంది. ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుకోవటమే. నేనయితే వినడం, చూడటం తప్ప ఎటూ మాట్లాడలేకపోతున్నాను” అంటూ నవ్వాడు వాసుదేవ్‌.
వాసుదేవ్‌ మళ్లీ మాట్లాడే లోపలే తన కొడుకు పెళ్లి ప్రసక్తి తెచ్చాడు అంకిరెడ్డి. జరిగింది, జరుగుతున్నది చెప్పి బాధపడ్డాడు.
”అయ్యో! అలాగా!” అంటూ విన్నాడు వాసుదేవ్‌.
వాసుదేవ్‌ ఇక వినటం ఆపి ”ఒక్క నిముషం రెడ్డీ!” అంటూ వెంటనే మొబైల్‌ని బయటకి తీసి ప్రవీణ్‌ అనే అబ్బాయికి తన మొబైల్లోంచి కాల్‌ చేసి సతీష్‌చంద్ర గురించి చెప్పాడు. అవతల వైపు నుండి ఎలాటి సమాధానం వచ్చిందో తెలియదు కాని అంకిరెడ్డివైపు ప్రసన్నంగా చూస్తూ
”ప్రవీణ్‌ అని నాకు తెలిసిన ఒక కుర్రాడు వున్నాడు రెడ్డీ! అతనికో చెల్లెలు వుంది. పేరు ధృతి. ప్రస్తుతం డిగ్రీ ఫస్టియర్‌ చదువుతూ ఇక్కడే అమ్మాయిల హాస్టల్లో వుంది. ముందు మీరు అమ్మాయిని చూడండి. మీ అందరికి నచ్చితే సతీష్‌చంద్రకిచ్చి పెళ్లి చేద్దాం!” అన్నాడు.
అంకిరెడ్డి ముఖం ఆనందంతో వెలగడం వాసుదేవ్‌ గమనించాడు.
”ఐతే! నీకో సందేహం రావచ్చు. ఇవాళ, రేపు అమ్మాయిల్ని పెద్ద చదువులు చదివిస్తున్నారు కదా! డిగ్రీ పూర్తి చేయించకుండానే ఆడపిల్లలకి పెళ్లేంటి ? అని… ధృతి వాళ్ల అన్నయ్య ఆమె ఇంటర్లో వున్నప్పటి నుండే నాతో చెబుతుండేవాడు ‘ధృతికి త్వరగా పెళ్లి చెయ్యాలి అంకుల్‌! అప్పుడైతే నేనింకా నా వర్క్‌లో ఫ్రీగా వుండగలుగుతాను’ అని…” అన్నాడు.
”ఫ్రీగా అంటే? అతనేం చేస్తాడు వాసూ?” వెంటనే అడిగాడు అంకిరెడ్డి.
”అతని గురించి నువ్వు వినడమే కాదు. మీ ఇంట్లో అందరితో చెప్పాల్సిన అవసరం చాలా వుంది రెడ్డీ! మళ్లీ ‘మాకు ముందెందుకు చెప్పలేదు’ అని మీరెవరూ నన్ను ప్రశ్నించాల్సిన సందర్భం రాకూడదు. చెబుతాను విను” అన్నాడు.
వినేముందు ప్రవీణ్‌ పట్ల చాలా సందేహాలు తలెత్తాయి అంకిరెడ్డిలో… ఈ జనరేషన్‌లో కొంతమంది అబ్బాయిల బ్యాగ్రౌండ్‌ బాగుండటం లేదు. చెడు అలవాట్లనే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అదే సులభంగా వుంటోంది వాళ్లకి… అందుకే ప్రవీణ్‌ గురించి వాసుదేవ్‌ ఏం చెబుతాడో ఏం వినాల్సి వస్తుందో అని ఒక్కక్షణం భయపడ్డాడు. అయినా ప్రస్తుతం తనున్న సిట్యువేషన్‌లో తన కొడుక్కి ఒక దొంగ చెల్లెల్ని అయినా ఓ.కె. అనేలా వున్నాడు. అన్న ఎలాంటివాడైతేనేం? చెల్లెల్నే కదా మనం చేసుకునేది. అన్న దొంగయినా, జూదగాడయినా, తాగుబోతయినా, తిరుగుబోతయినా చెల్లెలికి అవన్నీ రావు కదా! పైగా హాస్టల్లో వుంచి చదివిస్తున్నాడు.
”చెప్పు వాసు! అతని గురించి నువ్వేం చెప్పినా వింటాను. చెప్పకపోయినా నో ప్రాబ్లమ్‌. అతని చెల్లెల్ని అయితే మనం సతీష్‌కి చేసుకుందాం! ఎందుకంటే నువ్వు నా గురించి కూడా ఆలోచిస్తావు కాబట్టి అది మంచి సంబంధమే అయి వుంటుందనుకుంటున్నాను” అన్నాడు.
”మంచీ-చెడూ అనేది నువ్వు అతని గురించి తెలుసుకున్నాక నిర్ణయించుకో రెడ్డీ!” అన్నాడు వాసుదేవ్‌.
”ఓ.కె. వాసు!” అని ఒప్పుకున్నాడు అంకిరెడ్డి.
”ప్రవీణ్‌ రియల్‌ లైఫ్‌లో మన అందరిలా అతనికో ఇల్లు. ఆ ఇంట్లో వంట, నిద్ర లాంటివి వుండవు రెడ్డీ! అతను ఎప్పుడు ఎక్కడ వుంటాడో అతనికే తెలియదు. అతను పెద్దగా చదువుకోలేదు. పదవ తరగతి మాత్రమే పూర్తిచేశాడు. అంతే!” అన్నాడు.
”పదవ తరగతా? అయితే అతను దాన్ని ఒక్కసారికే పూర్తి చేసి వుంటాడు. మా సతీష్‌ రెండుసార్లు తప్పాడు. ఇప్పుడు నేను చదువు గురించి పెద్దగా ఆలోచించటం మానేశాను వాసూ!” అన్నాడు అంకిరెడ్డి.
”అలా అయితే సమస్యే లేదు! కానీ అతనికి తల్లీదండ్రీ లేరు. ఒకవేళ ధృతి మీకు నచ్చి మీరు మీ ఇంటి కోడలిగా ఆమెను చేసుకుంటే ఆ క్షణం నుండే ఆమె బాధ్యత మొత్తం మీరే చూసుకోవలసి వుంటుంది”
”పర్లేదు. దానికేం ఇబ్బంది వుండదు. నేను, మాధవీ వున్నాం. మోక్షా, ఆనంద్‌ వున్నారు. మేము మరీ అంత ఒంటరివాళ్లమేం కాదు కదా! మేమలా చూడమేమోనన్న అనుమానమేమైనా వుందా?”
”లేదు. అయినా చెప్పాలి కదా! ఎందుకంటే ఆకలి, అనారోగ్యం, దుఃఖం, విషాదం ఎక్కడ వుంటే అదే ప్రవీణ్‌ అడ్రస్‌. అలాంటి చోటుకి అతను తన చెల్లెల్ని తీసికెళ్లి వుంచలేడు. ఆమెకు త్వరగా పెళ్లి చెయ్యాలన్న అతని ఉద్దేశం కూడా అందుకే! ఆమెకో సెక్యూర్డ్‌ ప్లేస్‌ను చూపిస్తే ఆ తర్వాత అతని పనులు అతను చేసుకోవచ్చు అని…”
అతనికేం పనులుంటాయి? వింటుంటే అతనో ఆవారాగాడిలా, అడ్రస్‌ లేని వ్యక్తిలా వున్నాడు అనుకున్నాడు మనసులో అంకిరెడ్డి. కానీ చెప్పేది వాసుదేవ్‌ కాబట్టి కాస్త సీరియస్‌గానే వింటున్నాడు.
”ఇంకా చెప్పాలంటే బాధల్ని, వ్యధల్ని, విధి చేత వంచింపబడిన వాళ్లని వెతుక్కుంటూ వెళ్తాడు ప్రవీణ్‌! అలాంటివాళ్లను క్లోజప్‌లో చూడటమే అతని హాబీ” అన్నాడు.
వండర్‌ఫుల్‌ హాబీ. ఫోటోగ్రఫీ నా హాబీ, అందులో ప్రకృతిని బంధించటం అంటే మహా సరదా అన్నంత గొప్పగా చెబుతున్నాడు. వినేవాళ్లుంటే ఎలాంటి మేటరయినా, అసలు మేటర్‌ లేకపోయినా అందంగానే వుంటుంది అనుకున్నాడు వెటకారంగా అంకిరెడ్డి.
”హాబీ అనాలో లేక ప్రవీణ్‌లోని ఆర్ధ్రత అనాలో 27 సంవత్సరాల వయసుకే అతనో ఫౌండేషన్‌ను స్థాపించాడు రెడ్డీ! సేవారంగంలో ఒకడిగా ప్రస్థానం ప్రారంభించి వందలాది మందితో వ్యవస్థను నిర్మించాడు” అన్నాడు.
ఈసారి అంకిరెడ్డి మైండ్‌ బ్లాంక్‌ అయింది. అందులో ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు లేవు. వెటకారాల్లేవు. ఊ అనడం కూడా మానేసి వుత్తినే చూస్తున్నాడు.
”మనిషిలో ఇలాంటి దృఢ సంకల్పాలు పుట్టాలి అంటే ఆ మనిషిని ఏదో ఒక సంఘటనో, సందర్భమో కదిలిస్తేనే తప్ప సాధ్యం కాదు. ప్రవీణ్‌కి 19 సంవత్సరాల వయస్సున్నప్పుడు అతని తండ్రికి కిడ్నీ వ్యాధి రావడంతో ఒక సంవత్సరం పాటు అతను తండ్రితో హాస్పిటల్లోనే వుండాల్సి వచ్చిందిట. ఆ హాస్పిటల్లో కిడ్నీలు పాడైనవాళ్లే కాక పసిబిడ్డలు అనుభవిస్తున్న వేదనను దగ్గరగా చూశాడు ప్రవీణ్‌. రకరకాల జబ్బులతో అల్లాడే అభాగ్యులను, వైద్యం అందక పిట్టల్లా రాలుతున్న ప్రాణాలను చూశాడు… కలత చెందాడు. కదిలిపోయాడు. ఆ కదలికలే టీనేజ్‌లో వున్న అతని దృక్పథాన్నే మార్చేశాయి. ఇప్పుడతను వ్యక్తి కాదు. వ్యవస్థ. రక్తం ఇచ్చి, ఇప్పించి ఎందరో ప్రాణాలను కాపాడుతున్నాడు. ఆకలితో అలమిస్తున్న వారికి పిడికెడు అన్నం పెట్టి కడుపు నింపుతున్నాడు. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే వున్న ప్రవీణ్‌ ఇలా ఎలా చెయ్యగలిగాడు అన్న ఆలోచన ఎవరికైనా రావచ్చు. అతని దృక్పథం నచ్చి చాలామంది యువకులు అతనితో చేయి కలిపారు. వాళ్లంతా కలిసి బయట ఫంక్షన్‌హాళ్లల్లో జరిగే పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పెళ్లిరోజు, పుట్టినరోజు, షష్టిపూర్తి లాంటి వేడుకల్లో మిగిలిపోయి పడేసే అన్నాన్ని వృధా కానివ్వకుండా దాన్ని తీసికెళ్లి అనాధల కడుపు నింపుతుంటారు. నగరంలో వుండే వందలాది ఫంక్షన్‌ హాల్స్‌కి వెళ్లి నిర్వహకులతో ముందుగానే మాట్లాడుకుని అక్కడ మిగిలిన అన్నాన్ని ప్యాకెట్లుగా కట్టి రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్‌స్టాండ్లలో వుండే అభాగ్యుల వద్దకు వాహనాల్లో వెళ్లి వారికి అందజేస్తుంటారు. ఒక్కరోజు వెయ్యి మందికి అన్నం పెట్టిన సందర్భాలు కూడా వున్నాయని చెబుతుంటాడు ప్రవీణ్‌! రోజూ కాకపోయినా అప్పుడప్పుడు ప్రవీణ్‌ నాతో మాట్లాడుతుంటాడు ఫోన్లో. నాతో మాట్లాడిన ప్రతిసారి వాళ్ల చెల్లెలు గురించే చెబుతుంటాడు” అన్నాడు వాసుదేవ్‌.
అంకిరెడ్డి షాక్‌లోకెళ్లి విన్నట్లు విన్నా అంతా స్పష్టంగానే విన్నాడు.
”వాసూ! ప్రవీణ్‌ గురించి మాట్లాడాలంటే నా దగ్గర మాటలు లేవు. అతనితో మాట్లాడు. ఇవాళ హాస్టల్‌కి వెళ్లి అతని చెల్లెల్ని చూసి వద్దాం! మాధవిని తీసుకొస్తాను. ఆ తర్వాత ఆనంద్‌, మోక్ష చూస్తారు.”
”నువ్వు చెప్పేది బాగానే వుంది రెడ్డీ! కానీ ప్రవీణ్‌ కట్నం లాంటివి ఏమీ ఇవ్వలేడు. మెడలోకి బంగారు చెయిన్‌, చెవులకి, ముక్కుకి చిన్నచిన్న ఐటమ్స్‌ ఈ మధ్యనే చేయించాడు. అంతకన్నా మీరేం ఆశించడానికి లేదు” అన్నాడు వాసుదేవ్‌.
”ఓ.కె. వాసూ! నేను ఇంట్లో కూడా మాట్లాడతాను. నీకు మళ్లీ కాల్‌ చేస్తాను. ఈవినింగ్‌ మాత్రం మనం అమ్మాయిని చూడాలి. ప్రవీణ్‌తో మాట్లాడు” అన్నాడు అంకిరెడ్డి.

*****

అంకిరెడ్డి ఇంటికెళ్లగానే మాధవీలతను కూర్చోబెట్టి వాసుదేవ్‌ ప్రవీణ్‌ గురించి చెప్పింది చెప్పాడు. ఆయన చెబుతున్నప్పుడు మోక్ష అక్కడే వుంది. అత్తాకోడళ్లు అంకిరెడ్డి చెప్పింది కలిసే విన్నారు. ఆనంద్‌ మాత్రం నిద్రపోతున్నాడు. భర్త చెప్పింది విన్నాక ”ప్రవీణ్‌ చెల్లెలు ధృతి మనకు నచ్చితే తప్పకుండా సతీష్‌చంద్రకి చేసుకుందాం! ఇవాళే వెళ్లి ధృతిని చూద్దాం! ఆలస్యం చేయొద్దు. ఇంకేం ఆలోచించకండి!” అంది మాధవీలత.
అప్పుడే వాసుదేవ్‌కి ఫోన్‌ చేసి సాయంత్రం ధృతిని చూడానికి వస్తున్నట్లు చెప్పాడు అంకిరెడ్డి.
అంకిరెడ్డి చెప్పగానే ప్రవీణ్‌కి కాల్‌ చేసి ”నువ్వు వెంటనే హాస్టల్‌కి వెళ్లి ధృతిని మన ఇంటికి తీసుకురా ప్రవీణ్‌!” అంటూ అంకిరెడ్డి గారి కుటుంబం గురించి సతీష్‌చంద్ర చేస్తున్న ఉద్యోగం గురించి వివరంగా చెప్పాడు ప్రవీణ్‌తో వాసుదేవ్‌.
ప్రవీణ్‌ ఒప్పుకున్నాడు. అతను ఎక్కువగా ఇష్టపడింది సతీష్‌చంద్ర సైన్యంలో వుండటమే… వెంటనే ధృతిని తీసుకొచ్చి వాసుదేవ్‌ ఇంట్లో వుంచాడు. అతను కూడా అక్కడే కూర్చున్నాడు.
సాయంత్రం నాలుగు దాటాక అంకిరెడ్డి, మాధవీలత కారు దిగగానే వాసుదేవ్‌, వాసుదేవ్‌ భార్య రాణిబాయి కన్నా ముందుగా కారు దగ్గరకి వెళ్లింది ప్రవీణే! వారిని సాదరంగా లోపలకి ఆహ్వానించి ధృతిని చూపించారు. ధృతిని చూస్తుంటే చిన్నప్పటి మాధవీలత గుర్తొచ్చింది అంకిరెడ్డికి. చాలా దగ్గర పోలికలు వున్నట్లనిపించి ఆశ్చర్యపోయాడు. మాధవీలతకు మాత్రం ధృతి చాలా బాగా నచ్చింది. ”అప్పుడప్పుడు తెలుగు పత్రికల్లో కన్పించే కరుణాకర్‌ బొమ్మలా వుంది కదండి అమ్మాయి…” అంది.
అవునన్నట్లు తలవూపాడు అంకిరెడ్డి.
ప్రవీణ్‌తో అన్ని విషయాలు మాట్లాడారు. ప్రవీణ్‌ చాలా హుషారుగా వున్నాడు. అప్పటికే అతని మొబైల్‌కి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. అది గమనించి వెంటనే అంకిరెడ్డి తన మొబైల్లో వున్న సతీష్‌చంద్ర ఫోటోను ప్రవీణ్‌కి చూపించి, ధృతికి చూపించమన్నాడు. ధృతి సతీష్‌చంద్ర ఫోను చూడగానే అందరాడపిల్లల్లా సిగ్గుపడలేదు కాని ఒక్కక్షణం ఆమె చెంపలు కెంపుల్లా మెరిశాయి. వాసుదేవ్‌ భార్య రాణీబాయి ఏదో అనడంతో వెన్నెల్లో పువ్వు విచ్చుకున్నట్లు నెమ్మదిగా నవ్వింది ధృతి. నవ్వగానే ఆమె పలువరుస వజ్రాల్లా మెరిశాయి.
‘గట్టిగా ఓ డిగ్రీ లేదు పాడు లేదు. చదవమంటే చక్కగా చదివేవాడు కాదు. అలాంటి తన కొడుక్కి ఇంత అందమైన అమ్మాయి భార్యగా రాబోతుందా?’ మాధవీలత ఒకటే ఆశ్చర్యపోతోంది.
వాసుదేవ్‌ ప్రవీణ్‌తో ”ప్రవీణ్‌! ఇప్పుడే ధృతిని ఒక ఫోటో తీసి నా లాప్‌టాప్‌లోంచి సతీష్‌చంద్ర మెయిల్‌కి సెండ్‌ చెయ్యి” అన్నాడు.
వెంటనే వాసుదేవ్‌ చెప్పినట్లు చేశాడు ప్రవీణ్‌. ప్రవీణ్‌కి కూడా తన చెల్లెల్ని దేశ సరిహద్దుల్ని కాపాడే ఒక సైనికుడికిచ్చి పెళ్లి చేయబోతున్నందుకు ఆనందంగా వుంది.
కొద్దిసేపు కూర్చుని అంకిరెడ్డి, మాధవీలత ఇంటికెళ్లిపోయారు.
*****
రాత్రికి భోజనాల దగ్గర ఆనంద్‌ ముఖం మాడ్చుకొని కూర్చున్నాడు. అలా ఎందుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు.
”ఏంటిరా! అలా వున్నావ్‌? ఆఫీసులో ఏమైనా గొడవైందా? ముందు అన్నం తిను. కెలుకుతూ కూర్చుంటే ప్రాబ్లమ్స్‌ పోతాయా?” అంకిరెడ్డి కొడుకు మీద కోప్పడ్డాడు.
ఆనంద్‌ తండ్రి వైపు చూడకుండా తల్లిని కూర వడ్డించమని, భార్యను మంచినీళ్ల గ్లాసును ఇంకాస్త దగ్గరగా పెట్టమని సైగచేశాడు. ఆ తర్వాత ”ఈ ఇంట్లో నేను పెద్ద కొడుకునన్న మాటేగాని ఒక్క విషయం కూడా నాతో చెప్పటం లేదు. అన్నీ రహస్యంగానే జరిగిపోతున్నాయి. తమ్ముడికి అమ్మాయిని చూసివచ్చేంత వరకు నాకా విషయం తెలియకపోవటం సిగ్గుగా వుంది” అన్నాడు ఆనంద్‌.
”ఇందులో అంత సిగ్గుపడాల్సింది ఏముంది ఆనంద్‌! ఉదయం వాకింగ్‌లో వాసు అంకుల్‌ చెప్పాడు ఈ సంబంధం వున్నట్లు… నాక్కూడా పర్వాలేదనిపించింది. ఇంటికి రాగానే మీ అమ్మతో, మోక్షతో చెప్పాను. నువ్వప్పుడు నిద్రపోతున్నావు. ఈలోపల నేను రెడీ అయి నీకన్నా ముందే ఆఫీసుకెళ్లాను. ఈవినింగ్‌ ఆఫీసు నుండి రాగానే మీ అమ్మను తీసుకొని వాసుదేవ్‌ ఇంటికి వెళ్లాను. వెళ్లేముందు నీకు కాల్‌ చేశాను. నువ్వు లిఫ్ట్‌ చెయ్యలేదు. నీ మొబైల్‌ సైలెంట్ మోడ్‌లో వున్నట్లుంది. కావాలంటే చూడు ఎన్ని మిస్‌డ్‌ కాల్స్‌ వుంటాయో!” అన్నాడు అంకిరెడ్డి కొడుకు వైపు చాలా ప్రశాంతంగా చూస్తూ.
”అయినా కోట్లు ఇస్తామన్న సంబంధాన్ని వదిలేసి ఇదేమి గొప్ప సంబంధమని వెళ్లారు నాన్నా?” అన్నాడు. ఇప్పుడు కూడా నేరుగా తండ్రివైపు చూడలేడు ఆనంద్‌. అతనికి మనసులో ఏమున్నా తండ్రి ముందు చాలా వినయంగా వుంటాడు. అలా వున్నట్లు తండ్రికి తెలియాలని ఎక్కువగా తాపత్రయ పడుతుంటాడు. ఇలాంటివి సతీష్‌చంద్రకి తెలియవు. తండ్రిముందే కాదు అతను ఎక్కడా నటించడు. అతి వినయం చూపించడు.
”కోట్లెందుకురా! అమ్మాయి బాగుండాలి గాని…”
”బాగుండి ఇప్పుడేం చెయ్యాలి? వాడెక్కడో అడవుల్లో వున్నాడు. తనతో ఏమైనా తీసికెళ్తాడా? డబ్బున్నా మనం వాడుకుంటాంగా! ఆర్ధిక ప్రణాళికలు ఇలాంటప్పుడు కాకుంటే ఇంకెప్పుడు చేస్తారు నాన్నా? మన ప్రమేయం లేకుండానే డబ్బు అంటూ వచ్చేది ఒక్క పెళ్లిలోనే! ఇది కూడా తెలియకుంటే ఎలా?”
మోక్ష, మాధవీలత వేడివేడిగా ఆమ్లెట్లు చేసుకు రావాలని వంటగదిలోకి వెళ్లారు. ఆనంద్‌కి చారు అన్నంలో ఆమ్లెట్లు తినటం అలవాటు.
ఆనంద్‌ మాటలకి అంకిరెడ్డి నొచ్చుకున్నాడు. అతని మాటలు ఆయనకు నచ్చకపోవటం ఇదే తొలిసారి… ”అంత తెలియని పనులు నేనేం చేయలేదులే ఆనంద్‌!” అన్నాడు.
”ఇంకా ఏం చేయాలి నాన్నా! అమ్మాయి అన్నయ్య ఏం చేస్తున్నాడో చూశారా? అతనికేమైనా ఉద్యోగం వుందా? వ్యాపారం వుందా? ఫంక్షన్‌ హాల్ల దగ్గర అన్నాన్ని పొట్లాలు కట్టుకెళ్లి అనాధలకు పంచటమేగా! అదేం పని అని మీకు నచ్చింది ఆ సంబంధం? బయట చెప్పుకోటానికి అసహ్యంగా లేదూ?” అన్నాడు. ఇప్పుడు కూడా తల వంచుకునే మాట్లాడాడు.
”అతని పనిలో నాకు మానవత్వం కన్పించింది. అయినా ఎవరి వృత్తి వాళ్లకి దైవంతో సమానం ఆనంద్‌! దాన్ని తప్పు పట్టకూడదు. అసహ్యించుకోకూడదు. ఎవరి ఆలోచనా సరళి వాళ్లది. నాకెందుకో ఈ సంబంధం నచ్చింది. సతీష్‌ ఎప్పుడు చూసినా అడవుల్లో, కొండల్లో, మంచులో వుంటుంటాడు. కనీసం ఇంటికొచ్చినప్పుడైనా తన భార్యతో సుఖపడతాడని నేనీ నిర్ణయం తీసుకున్నాను” అన్నాడు.
ఆయన అలా అనగానే ఆనంద్‌ అన్నం తినకుండానే లేచి చేయి కడుక్కుని తన గదిలోకి వెళ్లాడు. ఆమ్లెట్ ఉన్న ప్లేటు పట్టుకొని వంటగదిలోంచి వస్తున్న మోక్ష వెళ్లిపోతున్న భర్తను చూసి ”అయ్యో! నేను పెద్ద లేటేం చెయ్యలేదు. వచ్చాను కదండీ! ఎందుకెళ్లిపోతారు” అంటూ చేతిలో వున్న ప్లేటును డైనింగ్‌ టేబుల్‌పై పెట్టి భర్త వెనకాల వెళ్లింది.
కొడుకు ప్రవర్తనకు మాధవీలత కంగారు పడుతుంటే ”ఏం పర్వాలేదు. నువ్వు కూర్చో!” అంటూ ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకుని ”వడ్డించు” అన్నాడు అంకిరెడ్డి.
కొడుకు అలా లేచి వెళ్లిపోవటం మనసులో బాధగా వున్నా ఆమె వడ్డిస్తూ కూర్చుంది.
ఆనంద్‌ గదిలోకి వెళ్లాక బెడ్‌మీద వెల్లకిల్లా పడుకొని చేతుల్ని నుదుటి మీదగా వెనక్కి పెట్టుకున్నాడు. అదిచూసి, ‘ఈయనగారు అలగడానికి పెద్ద కారణాలేం వుండవు’ అనుకుంటూ ”రండి! తిందురు గాని” అంటూ పిలిచింది మోక్ష.
”అవసరం లేదు. నువ్వు కూడా వచ్చి పడుకో” అన్నాడు.
”పడుకోవాలా? నేనింకా తినలేదండీ!” అంటూ ఆశ్చర్య పోయింది.
”నేనేమైనా తిన్నానా? నేను కూడా తినలేదుగా!” అన్నాడు.
”అసలెందుకండీ తినకుండా వుండటం?” అర్ధం కానట్లు చూసింది.
”వాళ్లను తిని వెళ్లనీ! మనం తర్వాత వెళ్లి తిందాం” అన్నాడు.
ఆమె నెమ్మదిగా అతని దగ్గరకి వెళ్లి నుదుటిమీద వున్న అతని చేతుల్ని పక్కకి తీసి అతని ముఖంలోకి సూటిగా చూస్తూ ”అసలేం జరిగింది?” అంది.
”ప్రవీణ్‌ చెల్లెల్ని మా తమ్ముడికి చేసుకోవటం నాకు ఇష్టం లేదు” అన్నాడు.
అప్పుడర్ధమైంది ఆమెకు భర్త ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో!
”మీ ఇష్టంతో పనేముంది? సతీష్‌చంద్ర ధృతి ఫోటోని మెయిల్లో చూడగానే నచ్చాడట. ఆ విషయం వెంటనే మామయ్య మెయిల్‌కి మెసేజ్‌ పెట్టాడు. అతనిక ఎటువంటి పరిస్థితిలో ధృతిని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోడు. అతనితోపాటు అత్తయ్య, మామయ్య గారు కూడా అలానే ఫిక్సయిపోయారు. మీరు దీన్ని వదిలెయ్యటం మంచిది. లాగకండి” అంది.
అతను చివుక్కున లేచి కూర్చుని
”ఎలా వదిలెయ్యమంటావు చెప్పు. వాడు నా తమ్ముడు. ఈ ముసలోళ్లకి ఏం తెలుసని? అమ్మాయి నలుపు, కంటిరెప్ప కొట్టుకోవడం పెద్ద లోపమా? అవి రెండూ పక్కన పెడితే ఆ అమ్మాయిని చేసుకుంటే వాడెంత సుఖపడతాడు. వెంటనే ఇల్లు, కారు, ఖరీదైన కుక్కలతో గల డిగ్నిఫైడ్‌ లైఫ్‌ రాదా? ఎప్పుడు చూసినా ఈ మూరాబెత్తెడు లైఫ్‌ తప్ప ఇంకో లైఫ్‌ను ఎప్పుడు చూస్తాం చెప్పు!” అన్నాడు
”మీది వ్యాపారం. వాళ్లది జీవితం. ఎలా పొంతన కుదురుతుంది? వాళ్లు పెద్దవాళ్లు. వాళ్లకివ్వాల్సిన గౌరవం మనం యివ్వాలి. పైగా సతీష్‌చంద్ర వాళ్ల అబ్బాయి. అతనికి ఏ అమ్మాయిని చూడాలో, ఎలా పెళ్లి చెయ్యాలో ఒక అవగాహన అనేది వాళ్లలో ముందు నుండే వుంటుంది. అలాంటప్పుడు మనం ఏం మాట్లాడినా బాధ్యత లేని మాటల్లా తేలిపోతాయి. అందుకే ఎవరి బాధ్యతల్ని వాళ్లు గుర్తించి మసలుకోవటం మంచిది! ఆలోచించండి! ఆరాటం తగ్గించుకోండి!” అంది మోక్ష.
”నా ఆరాటంలో అర్ధం లేదంటావా?” అన్నాడు ఆనంద్‌.
”మీ అమ్మా, నాన్నలను అర్థం చేసుకోమంటున్నాను. పెళ్లి అనేది సతీష్‌కి సంబంధించింది. మిగతా విషయాలేమైనా మనం మాట్లాడవచ్చేమో కాని అతనికి ధృతి నచ్చినప్పుడు మీరు చెప్పే అమ్మాయి ఎలా నచ్చుతుంది? నచ్చిన మనిషితో ఒక్కరోజు గడిపినా చాలనుకోవటం మనిషి సహజసిద్ధమైన నైజం. మీ తమ్ముడ్ని నొప్పించకండి! ఈ పెళ్ళి జరగనివ్వండి!” అంది మోక్ష.
ఆమె చెబుతున్నది అతనేమాత్రం వినటం లేదు. అతనికి ఆఫీసుకొచ్చి ఆ రోజు మధ్యవర్తి చెప్పిందే గుర్తొస్తోంది. అమ్మాయి నలుపైనా ఆమె అన్నయ్య స్మగ్లింగ్‌ వ్యాపారం చేస్తాడు కాబట్టి పెళ్లి జరిగే సమయంలో పక్కకి పిలిచి మరికాస్త ఎక్కువ డబ్బు ఇమ్మని అడిగినా లెక్క చెయ్యకుండా ఇచ్చే పార్టీ అది. అంత మంచి పార్టీని వదులుకొని ప్రవీణ్‌ చెల్లెల్ని చేసుకుంటే ఏమొస్తుంది? మనిషన్నాక కేవలం ఆందమేనా? ఇంకేం చూడనవసరం లేదా? అందమేమైనా ఆస్తినా? ఆస్తి వున్నన్ని రోజులు అందం వుంటుందా? ఆస్తి, డబ్బు, బంగారం, కార్లు, ఇల్లులు ఇవి తరతరాలు అలాగే వుండిపోతాయి… నిత్యావసరాలకి ఎంత డబ్బు వాడినా రాయి మీద రాయి పెట్టినట్లు ఇంకా మిగిలే వుంటుంది. ఇంతెందుకు ఆఫీసుకెళ్తుంటే రోడ్డుకి ఇరువైపుల వుండే బిల్డింగ్‌లు రోజుకోరకంగా మారిపోతున్నాయి. అలాంటి ఒక్క బిల్డింగ్‌ అయినా తనకి వుందా? ఎన్నిరోజులు ఈ ఉద్యోగం చేసినా, ఎంత సేవింగ్స్‌ వుంచుకున్నా అలాంటి బిల్డింగ్‌ ఒక్కటైనా కట్టగలడా? ఎప్పుడు చూసినా ఇదే ఇల్లు. ఇదే బ్రతుకు… ఏం బ్రతుకు ఇది? ప్రతిరోజూ చూస్తున్న వీటినే చూసి చూసి చిరాకేస్తోంది. ఇలాగే వుంటే జీవితం చివర్లో అయినా ఎల్‌సిడి టీవీని కొనగలడా?
”ఏంటండీ ఆలోచిస్తున్నారు? నేను ఇప్పటి వరకు మాట్లాడింది మీరు వినలేదా?” అంది.
ఇప్పుడు కూడా ఆనంద్‌ మాట్లాడలేదు.
”ఇలాంటప్పుడు మీరిలా వుంటే ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి వుండదు. ముఖ్యంగా నాకు. పగలంతా ఆఫీసులో కొట్టుకొని కొట్టుకొని ఇంటికొస్తే ప్రశాంతంగా అంత తిండి తిని నిద్ర పోలేకపోతున్నాను. ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో! ఇంకా ఆలోచిస్తూనే వున్నారు. ఏం పోయిందని అంత ఆలోచన?”
”ఏం పోయిందో, అదెంత మంచి అవకాశమో నీకు తెలుసా? నాకు తెలుసు. జీవితంలో మనం ఏ పని చేస్తే అంత డబ్బు వస్తుంది? మనిషి వేగంగా తన అంతస్తును పెంచుకోవాలంటే ఇలాంటి వ్యవహారాలను దొంగచాటుగా నడిపితేనే వస్తుంది. అయినా ఇలాంటి అవకాశాలు కూడా అందరికీ రావు. ఇది నీ అదృష్టమో లేక పూర్వి అదృష్టమో! అదృష్టం అనేది ఎక్కువగా ఆడవాళ్లలోనే వుంటుందట” అన్నాడు.
ఇంకేం మాట్లాడకుండా అతన్నే మాట్లాడనీయ్‌ అన్నట్లు అక్కడే కూర్చుంది మోక్ష.
”ఎందుకు కూర్చుంటావ్‌! పద. వెళ్లి తిందాం!” అంటూ లేచి ఆమెకన్నా ముందుగా అతనే వెళ్లాడు డైనింగ్‌ హాల్లోకి…
*****
సతీష్‌చంద్ర పెళ్లి ప్రవీణ్‌ చెల్లెలుతో కాకుండా వేరే అమ్మాయితో చెయ్యాలని చాలా ప్రయత్నాలు చేశాడు ఆనంద్‌. అతను చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది. పైగా ఎగతాళిని, వ్యాఖ్యానాలను ఎదుర్కోవలసి వచ్చింది. సొంత అన్నయ్య నిర్ణయాలతో పనిలేకుండా పెళ్లి చేసుకోబోతున్న తమ్ముడంటే ఒక విధమైన నిర్లక్ష్యం, నిర్లిప్తత ఏర్పడ్డాయి. ఈ పెళ్లి నాకు సంబంధించింది కాదన్నట్లు పెళ్లి గురించి ఏం చెప్పినా అతను సరిగా వినటం లేదు. పట్టించుకోవటం లేదు. షాపింగ్‌కి రమ్మన్నా ఏదో ఒక సాకు చెప్పి ఆఫీసు నుండి ఆలస్యంగా వస్తున్నాడు. ఆఫీసులో కూడా తన తమ్ముడి పెళ్లి గురించి ఎవరికీ చెప్పలేదు. ముహూర్తాలు పెట్టుకున్నట్లు కూడా చెప్పలేదు. చెబితే సతీష్‌చంద్రకి ఇస్తున్నది ప్రవీణ్‌ చెల్లెల్ని అని తెలిసిపోతుంది. ముఖ్యంగా ప్రవీణ్‌ చేస్తున్న పని తెలిస్తే తలా ఓ రకంగా మ్లాడి కిసుక్కున నవ్వుతారు. పైకి నవ్వినా నవ్వకపోయినా లోపల మాత్రం వీళ్లెంత అమాయకులు అని అనుకుంటారు. ఎందుకంటే ఆ మధ్యవర్తి ప్రతిరోజు ఆఫీసుకొచ్చి కోటి రూపాయల కట్నం ఇచ్చే సంబంధాన్ని గురించి గుర్తుచేసి వెళ్తున్నాడు. ఆ మధ్యవర్తికి కూడా ఆ సంబంధం వల్ల చాలా డబ్బు వస్తుందని ఆఫీసులో అనుకోవడం ఆనంద్‌ విన్నాడు. ఏ పని చేసిన డబ్బు కోసమే కదా! డబ్బుతో సంబంధం లేని ఏ పని చేసినా వున్న విలువ పోతుంది. ”అసలు ఇలాంటి సంబంధం అందరికి దొరకదు ఆనంద్‌” అని ఆనంద్‌తోనే ఆఫీసులో అందరూ అన్నారు. అలాంటి వాళ్ల దగ్గరకెళ్లి నా తమ్ముడు కట్నం తీసుకోకుండా అనాధలకు అన్నం పెట్టేవాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాడని ఎలా చెప్పగలడు? ఇలాంటి పని కడుపుకి ఖరీదైన ఫుడ్‌ని పెడుతుందా? కార్లను ఇస్తుందా? స్థాయిని పెంచుతుందా? అసలు ప్రవీణ్‌ ఆ పని చేస్తున్నాడని తెలిస్తేనే పరువు పోయేలా వుంది. అందుకే ఎవరడిగినా ”అంతా మా నాన్నగారే చేస్తున్నారు. నాకేం తెలియదు” అంటున్నాడు.
పెళ్లి ముహూర్తం రెండు రోజులు వుందనగా ఇంటికొచ్చాడు సతీష్‌చంద్ర. దగ్గరి బంధువులంతా వచ్చి ఇంట్లో తిరుగుతుంటే అతనికి ఆనందంగా వుంది. మోక్షా, ఆనంద్‌ మాత్రం ఉదయాన్నే ఆఫీసులకి వెళ్లి రాత్రికి ఇంటికొస్తున్నారు. ”పెళ్లి రాత్రికి కాబట్టి నువ్వూ, నేనూ ఆఫీసులకి లీవ్‌ పెట్టాల్సిన అవసరం లేదు. పెళ్లిరోజు మనం ఆఫీసు నుండి ఇంటికొచ్చి రెడీ అయి నేరుగా ఫంక్షన్‌హాల్‌కి వెళ్లినా ఇంకా బోలెడు సమయం మిగిలి వుంటుంది” అని ఆనంద్‌ అనడం మోక్షకు నచ్చకపోయినా అతనితో వాదించలేదు. వాదించినా లాభం లేదనుకుంది. అత్తగారు అడిగినప్పుడు ”ఆఫీసులో నాకు సెలవు ఇవ్వనన్నారు అత్తయ్యా! గట్టిగా అడిగితే వేరే ఉద్యోగం చూసుకోమనేలా వున్నాడు. ఇప్పటికిప్పుడు వేరే ఉద్యోగాలు నాకేం దొరుకుతాయి. అందుకే ఆఫీసుకెళ్తున్నాను” అని చెప్పింది. అది విని మాధవీలత కాని, అంకిరెడ్డి కాని ఏమీ అనలేదు. వాళ్లు ముందే అనుకున్నారు. మనం దేనికీ ఆర్గ్యూ చెయ్యొద్దని… అలా చేస్తే ఒక్క పని కూడా ప్రశాంతంగా చేసుకోలేమని…
కానీ ఇంట్లో పెళ్లన్నప్పుడు అందులో చిన్నకొడుకు పెళ్లి చేస్తున్నప్పుడు పెద్దకోడలు తన పక్కన వుండి అన్ని పనుల్లో, అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఏ అత్తగారికైనా వుంటుంది. దాన్ని పైకి ప్రకటించకుండా మనసులో ఎలాంటి అసంతృప్తి, వెలితి లేని దానిలా గంభీరంగా తిరుగుతోంది.
పెళ్లి ఫంక్షన్‌ హాల్లో కాబట్టి ముహూర్తం సమయానికి బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫంక్షన్‌ హాల్‌కి చేరుకున్నారు. అంకిరెడ్డి, మాధవీలత ఆశించినట్లే పురోహితుడు వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికే వధూవరుల తలల మీద జీలకర్ర బెల్లం పెట్టించాడు.
మంగళవాయిద్యాల మధ్యన పెళ్లి చూస్తున్న బంధుజనం అందరి నోట్లోంచి విన్పించిన మాట ఒక్కటే ‘అబ్బాయి, అమ్మాయి బాగున్నారు. చక్కగా వుంది జోడి’ అని…
పెళ్లికూతురు దృతి అన్నయ్య ప్రవీణ్‌, అతని స్నేహితులు పెళ్లిలో చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా తిరిగారు. ప్రవీణ్‌కి చాలామంది స్నేహితులు వున్నారు. వాళ్లలో 21 మంది స్నేహితులు అతనికి కుడిభుజం లాంటివాళ్లు. అతనెక్కడ వుంటే వాళ్లూ అక్కడే వుంటారు. అతను ఏ పని చెబితే ఆ పనిని చక్కదిద్ది వస్తుంటారు. వాళ్లలో ఒక్కొక్కరే సతీష్‌చంద్రను పరిచయం చేసుకున్నారు. అతన్ని పరిచయం చేసుకుంటున్నంత సేపు చాలా ఉద్వేగభరితులై అతన్నే చూస్తూ నిలబడ్డారు. ఒకరి వెంట ఒకరు షేక్‌హ్యాండ్‌ తీసుకున్నారు. అందరూ యువకులే కావడం వల్ల అక్కడ సందడి బాగా పెరిగింది. ప్రవీణ్‌ లాగే వాళ్లు కూడా ఎత్తుగా, బలంగా, చైతన్యవంతంగా వున్నారు. వారికన్నా ఉన్నతంగా, బలంగా, ఎత్తుగా, సంధించి వదిలితే దూసుకుపోయే బాణంలా వున్నాడు సతీష్‌చంద్ర. ”మీరు సైన్యంలో వుండటం మాకు చాలా గర్వంగా వుంది సర్‌!” అన్నారు ప్రవీణ్‌ స్నేహితులు.
వాళ్లు అలా అనగానే ”మీ గురించి విన్నాను. మీరు కూడా మంచిపనులే చేస్తున్నారు. అలా చెయ్యటం విన్నంత సులభం కాదు” అన్నాడు సతీష్‌చంద్ర. అందర్ని చూసినట్లు కాకుండా వాళ్ల వైపు భిన్నంగా, అభిమానంగా చూశాడు. అభినందనపూర్వకంగా చూశాడు.
పెళ్లి జరిగాక, భోజనాలయ్యాక పెళ్లికి హాజరయినవాళ్లంతా వెళ్లిపోయారు. ఫంక్షన్‌ హాలంతా ఖాళీ అయింది. అంకిరెడ్డి కుటుంబ సభ్యులు, ఆ కుటుంబానికి బాగా సన్నిహితులైన వాళ్లు మాత్రం అక్కడ వున్నారు.
ఫంక్షన్‌ హాల్లోంచి భోజనాల హాల్లోకి దారి వుంది. పెళ్లికి ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలు అనుకున్న దానికన్నా ఎక్కువగానే మిగిలిపోయాయి.
వెంటనే ప్రవీణ్‌ యూనిట్ భోజనాల హాల్‌ వైపు కదిలింది. వాళ్లలో కొందరు అక్కడ మిగిలిన ఆహార పదార్థాలను మట్టిలో పడెయ్యనియ్యకుండా ప్యాకెట్స్ కట్టారు. వాళ్లు ఎక్కడున్నా రోజులో ఒక్క పూట అయినా కదల్లేని వికలాంగులకి, కుష్టు రోగులకి, అనాధలకి అన్నం పెడుతుంటారు. ఇప్పుడు కూడా అదే పనిలో వున్నారు. అందరూ చూస్తుండగానే ఆ ప్యాకెట్స్ ను తీసికెళ్లి వ్యాన్లో పెట్టుకున్నారు. వంతెనల కింద, సందుల్లో, చెట్లకిందా వున్న అనాధల్ని లేపి తల ఓ ప్యాకెట్ భోజనం, నీళ్ల ప్యాకెట్లు ఇచ్చి వచ్చారు.
అది చూసి ఆనంద్‌ విసుక్కున్నాడు. భార్యను పిలిచి ”ఛ.ఛ. చెప్పుకోవాలన్నా, చూడాలన్నా సిగ్గుగా వుంది. మన పెళ్లిలో కూడా ఇలాంటి పనులేంటి? పరువు వుంటుందా? అయినా మా నాన్నను అనాలి. ఇలాంటి సంబంధం ఎలా చేసుకున్నాడో ఏమో!” అని అంటుంటే ప్రవీణ్‌ ఫ్రెండ్స్‌లో కొందరు విన్నారు. ఆనంద్‌ లాంటి వాళ్లు వాళ్లకి కొత్తకాదు. కానీ సతీష్‌చంద్రలోని దేశభక్తిని చూసి ఎంత ముచ్చటపడ్డారో ఆనంద్‌లోని కుబుద్ధిని చూసి అంత నివ్వెరపోయారు. ఆనంద్‌ లాంటి వాళ్ల గురించి ఒక్క క్షణం కూడా వాళ్లు ఆలోచించరు. తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోరు. వాళ్లు చేస్తున్న పని వాళ్ల దృష్టిలో స్వచ్ఛమైన నది ప్రవాహం లాంటిది. అందులో అప్పుడప్పుడు అశుద్ధం కలిసినా కొట్టుకుపోతుందే కానీ ప్రవహించటం ఆగదు. ఆనంద్‌ మాటల్ని వాళ్లు అశుద్ధంలా భావించారు.
ఆనంద్‌ ఇంకా ఎక్కువ వక్రంగా, వెటకారంగా మ్లాడుతున్నాడు. ఆ విషయం ప్రవీణ్‌తో చెప్పకుండా అతని ఫ్రెండ్స్‌ ఒక్కొక్కరే బయటకెళ్లిపోసాగారు. అది గమనించి ప్రవీణ్‌ టక్కున తన చెల్లెలు ధృతి చేతిని సతీష్‌చంద్ర చేతిలో పెట్టి ”బావా! నా చెల్లెలు జాగ్రత్త!” అని చెప్పి, చప్పున వంగి అంకిరెడ్డి మాధవీలత పాదాలకు మొక్కి వెళ్లిపోయాడు.
ఆనంద్‌ ముఖమంతా వ్యతిరేక ఆలోచనలతో చాలా అసహ్యంగా మారింది. మోక్షకి అతని ముఖంలోకి చూడబుద్ధి కాక ఎదురుగా కన్పిస్తున్న స్పెషల్‌ డెకరేషన్‌ వైపు చూస్తూ దాని ప్రత్యేకతను పక్కన వున్న వాళ్లకి వివరిస్తూ నిలబడింది.
*****
సతీష్‌చంద్ర, ధృతిల రూపురేఖల్లో వుండే ప్రత్యేకత వల్లనో లేక వాళ్ల ప్రవర్తన వల్లనో ఏమో వాళ్ల రాకతో ఆ ఇంట్లోకి కొత్త కళ వచ్చినట్లైంది. మూడు బెడ్‌ రూములు వుండే ఆ ఇంట్లో నైరుతి భాగం గదిలో అంకిరెడ్డి దంపతులు వుంటే, ఆ తర్వాత గదిలో ఆనంద్‌ దంపతులు, చివర గదిలో సతీష్‌చంద్ర, ధృతి వుంటున్నారు. పనిమనిషి కీరమ్మ అందరి పనులు చూస్తుంటుంది. సతీష్‌చంద్ర, ధృతి వచ్చాక జీతం పెంచమని మొండికి పడి జీతం ఎక్కువ ఇప్పించుకుంటోంది.
ఉదయాన్నే ఎప్పుడు నిద్రలేస్తారో తెలియదు ఆనంద్‌, మోక్ష రాత్రి భోజనాల దగ్గరే కన్పిస్తారు. మధ్యలో చూద్దామన్నా కన్పించరు. అసలు వాళ్లిద్దరు ఆ ఇంట్లో వున్నట్లు కూడా అన్పించదు. అంకిరెడ్డి ఎప్పటిలాగే ఉదయాన్నే నడక, ఆ తర్వాత ఆఫీసు, ఆఫీసులో పనిని బట్టే సాయంత్రాలు ఇంటికి వస్తుంటాడు. మాధవీలత కీరమ్మ సాయంతో అందరికి కాఫీలు, టిఫిన్స్‌, మళ్లీ తాగాలనుకుంటే కాఫీ, మధ్యాహ్న భోజనం, రాత్రికి భోజనం క్రమం తప్పకుండా అందేలా చూస్తుంటుంది. ఆ ఇంట్లో ఎంత చేసినా పని పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే వుంటుంది.
సతీష్‌చంద్ర, ధృతి తెల్లవారుజాము 5 గంటలకే నిద్రలేస్తారు. కాలకృత్యాలు పూర్తి చేసుకొని స్నానం చేసి అంకిరెడ్డి కారు బయటకు తీసి వాకింగ్‌కి వెళ్లగానే ఇంటి ముందు వున్న పూలచెట్ల దగ్గరకి వెళ్తారు. వాటికి నీళ్లు పోస్తూ, కొత్తగా పూసిన పూలను విభ్రమతో చూస్తారు. సతీష్‌చంద్ర ఏదో ఒకటి మాట్లాడినప్పుడు దృతి నవ్వకుండా వుండలేదు. ఆమె నవ్వుతుంటే ఆ నవ్వు అక్కడ విరబూసిన పూలతో పోటీ పడి సూర్యుని కాంతిలో కలిసి మెరుస్తుంది. అలాంటప్పుడు సతీష్‌చంద్ర వూరుకోడు. అటు ఇటు చూసి ఆమె నడుం మీద చేతులుంచి ఆమెను నేల నుండి అడుగు ఎత్తున లేపి నెమ్మదిగా వదిలేస్తాడు. అప్పుడామె మెత్తి అందమైన పూలచెట్టు లయబద్దంగా కదిలినట్లు అతన్ని ఒరుసుకుంటూ కిందకి దిగి నేలమీద నిలబడి నిశ్శబ్దంగా నవ్వుతుంది. ఆ నవ్వు స్వచ్ఛమైన పాలకడలిలో రమ్యంగా కదిలే అలలా వుంటుంది. ఆ అల చిన్నదే అయినా పర్వతాలను కదిలించగలిగేంతి ప్రేమను గుభాళింపచేస్తుంది. సాగరాలను చీల్చే అనురక్తిని కలిగిస్తుంది. పరిమళ సుగంధ వాయువులను వణికింపజేసేంతి అనురాగాన్ని పుట్టిస్తుంది. ఉరుములా ఉలికులికి పడుతూ వలపు తలపుల్ని కమ్ముకునేలా చేస్తుంది… ఆ అనుభూతి సతీష్‌చంద్రకు హిమాలయాల్లో దొరకలేదు. అరుణాచల్‌ అడవుల్లో కలగలేదు. అస్సాం మంచులో లభించలేదు.
అనుక్షణం ఆర్మీ క్రమశిక్షణతో నడుచుకునే సతీష్‌చంద్ర ధృతిని చూశాకనే మరీ సున్నిత మనస్కుడై ప్రతి క్షణాన్ని మనసులో ఆస్వాదిస్తున్నాడు. మనసును స్కానర్‌లా మార్చుకుంటున్నాడు. అందులో ధృతి అనువణువును ముద్రించుకుంటున్నాడు.
పెళ్లయిన వెంటనే ”ధృతిని తీసుకుని ఎటైనా వెళ్లిరా సతీష్‌!” అని తండ్రి చెప్పినప్పుడు ”నాకు ఇంట్లోనే వుండాలని వుంది నాన్నా! ఎటూ వెళ్లాలని లేదు” అన్నాడు సతీష్‌చంద్ర. అతను అలా అన్నప్పుడు ఇంట్లో ఏముందిరా అని అంకిరెడ్డి అనుకున్నాడే కాని ఇంట్లోనే సతీష్‌చంద్ర దృతితో గడుపుతున్న విధానం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నాడు. ఆయనకే కాదు ఉదయాన్నే కాఫీ తాగుతూ కికీలోంచి లాన్‌ వైపు ఎవరు చూసినా వాళ్లకు చెట్ల మధ్యలో వున్న సతీష్‌చంద్ర, ధృతినే కన్పిస్తారు.
అంతేకాదు వాళ్లిద్దరు సాయంత్రం నాలుగు దాక గదిలోంచి బయటకొచ్చి ఇంటి వెనకాలకెళ్లి రింగ్‌ బాల్‌ ఆడుకుంటారు. బ్యాడ్మింటన్‌ ఆడతారు. ఒకప్పుడు ఆ స్థలం మనుషులు తిరగటానికి వీలుగా వుండేది కాదు. సతీష్‌చంద్రనే దాన్ని శుభ్రం చేసి ఆటస్థలంగా మార్చుకున్నాడు. దృతితో అతనక్కడ రకరకాల ఆటలు ఆడుతుంటాడు. ఆదివారం వచ్చిందంటే ఆనంద్‌ ఆఫీసు లేదని నిద్రపోతాడు. మోక్షకు ఆఫీసు లేకపోయినా నిద్ర రాదు. ఇంటి వెనకాల సతీష్‌చంద్ర దృతితో ఆడే ఆటల్ని చూస్తుంటుంది. అలా చూసినప్పుడు ఆమె గుండెనెవరో గుంజినట్లవుతుంది. ఒక్క రోజయినా దృతిని సతీష్‌చంద్ర చూసినట్లు ఆనంద్‌ ఆమెను చూడలేదు. అంత చనువుని, స్వేచ్ఛను, ప్రేమను అందివ్వలేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అని నొప్పిస్తుంటాడు. మాటలుండవు. నవ్వులుండవు. అసలు భార్యా, భర్త ఇలా వుండాలని చరిత్ర పుస్తకాల్లో వుంటుందో లేదో కాని ఆమెలాంటి వర్కింగ్‌ వుమన్‌కి భర్త ఆదివారాలు బయటకి తీసికెళ్తే అదే గొప్ప చరిత్ర. కానీ అతను తీసికెళ్లడు. ఒకవేళ తీసికెళ్లినా బయట ఏదో ఒకి తినాలనిపించినప్పుడు డబ్బులు ఖర్చవుతాయని ”వద్దులే” అంటాడు. నెలకింత కడితే ముప్పై సంవత్సరాల తర్వాత ఎంత వస్తుందన్నది మాత్రం రోజూ లెక్కలు వేస్తూనే వుాండు. ”అబ్బబ్బా! ఎప్పుడూ ఈ లెక్కలేనా?” అంటే ”నీకసలు బ్రతుకంటేనే లెక్కలేదే!” అంటాడు. ”బ్రతకటం కాదు. జీవించటం నేర్చుకోండి” అంటే ”చాల్చాలు నాకేం చెప్పకు, నీకసలు బుర్ర వుంటే కదా! మెంటల్‌ నీకు” అంటాడు. ఏ రోజూ నవ్వుతూ మాట్లాడడు. ”నవ్వితే నెత్తినెక్కుతావే నువ్వు” అంటాడు. ”ఎందుకులెండి నవ్వడం. నవ్వినా అది మీ ముఖానికి నప్పుతుందా పాడా! ఎప్పటిలాగే వుండండి. అలవాటు లేని పనులు ఎందుకు?” అని మనసులో గొణుక్కుంటే చాలు, అది విని ”ఏంటే! గొణుగుతున్నావ్‌! అసలు నేను లేకుంటే అర్ధమవుతుందే నీకు నా విలువ. అప్పుడు గాని నీకు మొగుడు మొగుడేనన్న సత్యం తెలిసి రాదు” అంటాడు. ఇంకా ఏదేదో మాట్లాడి అప్పటికప్పుడే టెన్షన్‌ పడేలా చేస్తాడు. అలా ఎందుకు చేస్తాడో అర్ధం కాదు. అర్ధంకాక ఈ మధ్య ”ఎందుకండి నన్ను ఎప్పుడు చూసినా కసురుకుంటారు, విసుక్కుంటారు. మీ తమ్ముడు చూడండి ధృతిని ఎంత బాగా చూసుకుంటున్నాడో! అతనిలా భార్యను చూసుకోవటం మీకు చేతకాదా?” అని అడిగింది.
అతను బిత్తరపోలేదు. నవ్వాడు. ”వాడి మొహం. వాడు అంతకన్నా ఏం చెయ్యగలడు?” అన్నాడు.
”అంటే?” అంది మోక్ష.
”అంటే ఏముందే నీకు నేను చెప్పటానికి నువ్వు వినటానికి?”
”ఏదో లేనిదే మీరలా అంటారా?”
”నీకు తెలీదా?”
ఆమె మాట్లాడలేదు. ఓపిక లేనట్లు చూసింది. అతను మళ్లీ నవ్వి
”మా నాన్న వాడిని చక్కగా హనీమూన్‌ వెళ్లిరారా అంటే వాడు విన్నాడా? పెళ్లాన్నేసుకుని ఇంటిచుట్టే తిరుగుతున్నాడు. నిద్రలేస్తే ఇంటికి ముందన్నా వుంటాడు, లేకుంటే ఇంటి వెనకన్నా వుంటాడు. వాడికేం తెలుసు భార్యతో ఎలా వుండాలో…”
”ఆ…”
”ఆ కాక ఈ అనుకుంటున్నావా?”
”ఏమీ అనుకోవటం లేదు”
”అనుకోకు. ఎందుకంటే వాడు అందరిలాంటివాడు కాదు. వట్టి తిక్కమనిషి. లేకుంటే మా నాన్నగారి ల్యాప్‌టాప్‌లో ఎన్ని గేమ్స్‌ లేవు ఆడుకోవానికి… నాన్నని అడిగి ల్యాప్‌టాప్‌ తీసుకొని హాయిగా సినిమాలు చూడొచ్చు. ఇంకా ఏం కావాలన్నా చూసుకోవచ్చు. వాడికి అలాంటివి రావు. చదివితేగా! గట్టిగా పది తరగతులు కూడా చదవని వాడికి లాప్‌టాప్‌ ఓపెన్‌ చెయ్యటం, ఇంటర్‌నెట్ లోకి వెళ్లటం ఎలా తెలుస్తుంది?”
”ఇద్దరి మధ్యన వుండాల్సిన సరససల్లాపాలన్నీ లాప్‌టాప్‌లోనే దొరుకుతాయాంటారు”
”ప్రపంచంలో ఏం కావాలన్నా అందులో దొరుకుతుంది. ఇంటర్‌నెట్ వల్ల, కమ్యూనికేషన్‌ వ్యవస్థ వల్ల ఇప్పుడు అందరికి అన్నీ తెలిసిపోతున్నాయి. తెలియనిదల్లా అందులోకి ఎలా వెళ్లి ఎలా సర్చ్‌ చెయ్యాలనేదే! ఇప్పుడదే మా వాడికి తెలియంది.” అన్నాడు.
మోక్ష చూసిన చూపుకి క్షణం ఆగి ”ఏంటే ఆ చూపు. నువ్వలా చూస్తే తెలుసుకోలేననుకుంటున్నావా?” అన్నాడు.
”ఏం తెలుసుకుంటారు?” వెంటనే అడిగింది.
”నీ వాలకం చూస్తుంటే నువ్వు తప్ప వాళ్లేదో తెగ సుఖపడిపో తున్నట్లుందిగా! అలాంటిదేమైనా వుంటే చెప్పు. ఉదయాన్నే ఆఫీసు మానేసైనా నిన్ను తీసికెళ్లి ఇంటి ముందున్న చెట్లల్లో తిప్పుతా. సాయంత్రం ఆఫీసులో వుండకపోయినా పర్వాలేదు ఇంటి వెనకాలకి వెళ్లి నీచేత కుప్పిగంతులాడిస్తా. అవేమైనా నాకు రాని పనులా? అలాంటి పనులు నాకూ వచ్చు. నేను చదివింది డిగ్రీ. వాడు చదివింది తెలుసుగా!” అన్నాడు.
అవాక్కయి చూసింది మోక్ష.
”ఇంకెప్పుడూ వాళ్లు మాత్రమే సుఖపడిపోతున్నారు, నేను తప్ప అని అనుకోవుగా! అనుకోవటమే కాదు. నన్ను వాడితో, వాడి పనులతో పోల్చి చూడకు. ఇది ఆకాశం, అది నేల. నేలబారు ఆలోచనలు చెయ్యబట్టే చీకట్లో రాళ్లేసినట్లు వెళ్లి ప్రవీణ్‌ చెల్లెల్ని పెళ్లిచేసుకున్నాడు. అదే నేనైతే అలాంటి పని చేసేవాడినే కాదు. అదీ నా లెవెల్‌” అన్నాడు.
నోరెత్తకుండా పక్కకెళ్లబోయింది మోక్ష. ఆమె భుజం గుచ్చి పట్టుకొని ”మాట్లాడుతుంటే వెళ్తావేం? నా మాటలకి నువ్వు శాటిస్‌ఫై అయి వెళ్తున్నావా? లేక నచ్చక వెళ్తున్నావా అన్నది నాకెలా తెలియాలి? వాళ్లు తిరిగే గాలి తిరుగుళ్లు నిన్ను బాగా ఆకట్టుకున్నట్లున్నాయిగా! అందుకే ముఖం అలా పెట్టుకున్నావ్‌!” అన్నాడు.
ఆమె వెంటనే ”గాలి తిరుగుళ్లు, చెత్త తిరుగుళ్లు అంటూ వాళ్ల పట్ల నాకు వుండే అద్భుతమైన భావనను కించబరచకండి! ఏదో చెప్పాను. విని తెలుసుకుంటారనుకున్నాను. ఇలా అంటారని మాత్రం అనుకోలేదు” అంటూ తన పెద్ద పెద్ద కళ్లతో అతన్ని కిందనుండి పైకి చూసి భుజాన్ని విడిపించుకొని వెళ్లిపోయింది.
*****
నెల రోజులు గడిచాక నరేంద్రవాళ్ల ఊరు వెళ్లాలని సతీష్‌చంద్ర, దృతి రెడీ అయ్యారు. కారు తీసికెళ్లమని చెప్పాడు అంకిరెడ్డి. ”వద్దు నాన్నా! మేము బస్‌లోనే వెళ్తాం!” అన్నాడు సతీష్‌చంద్ర.
అది వినలేదు ఆనంద్‌. తండ్రి కారు తీసికెళ్లమన్నది మాత్రమే విన్నాడు. అతను అక్కడికి దగ్గర్లోనే గడ్డానికి షేవింగ్‌ క్రీం రాసుకొని షేవింగ్‌ చేసుకుంటున్నాడు.
”వాడికి కారెందుకు నాన్నా! వాడు వెళ్లే ఊరిచుట్టూ పోలాలేగా వుండేది. పొలాల్లో ఏమైనా కారులో తిరుగుతారా? రోడ్డుమీద ఎంతసేపు తిరుగుతారు? అదేమైనా సిటీయా ఓ చోటు నుండి ఇంకో చోటుకి నడవాలంటే కష్టమనుకోటానికి. ఆ ఊరిలో గట్టిగా వంద ఇళ్లయినా వున్నాయో లేవో” అన్నాడు ఎగతాళిగా.
”ఎందుకురా అంత కష్టపడి మాట్లాడతావ్‌! ఇప్పుడంత క్లారిటీ అవసరమా? ఏదో కొత్తగా పెళ్లయిన జంట. కారులో వెళితే గొప్పగా వుంటుందని అన్నాను. వాడు బస్‌లోనే వెళ్తానన్నాడు. నువ్వు నీ పని చూసుకో!” అన్నాడు అంకిరెడ్డి.
తండ్రి మాటలు విన్నా విననట్లే ”ఏయ్‌ మోక్షా! నీళ్లు రావడం లేదు. మోటర్‌ స్విచ్‌ వెయ్‌!” అంటూ కేకేశాడు ఆనంద్‌.
మోక్ష వెళ్లి మోటర్‌ స్విచ్‌ వెయ్యాలంటే ఆనంద్‌ మీదుగానే వెళ్లాలి. మోక్ష వచ్చింది. గడ్డం నిండా షేవింగ్‌క్రీం రాసుకొని వున్న ఆనంద్‌ని చూస్తుంటే బూచోడిలాగే వున్నాడు. గతంలో ఒకసారి పూర్వి ఇలాగే చూసి దడుసుకుంది. ట్రిమ్మింగ్‌ సెట్ కొనుక్కోవచ్చుగా అని మనసులో అనుకుంటూ..
”పవర్‌ లేదండీ! ఇప్పుడే పోయింది. ఇదిగోండి వాటర్‌” అంటూ వాటర్‌బాిల్లో నీళ్లు తెచ్చి ”పైన ట్యాంక్‌లో నీళ్లు లేవు. ఇవే వున్నాయ్‌! కొద్దికొద్దిగా కడుక్కోండి” అంది.
”చట్ ! నేనిప్పుడు స్నానమెలా చెయ్యాలి” అంటూ ఆ బాటిల్‌ అందుకొని బయటకెళ్లి ఓ స్టూల్‌ మీద కూర్చుని పవర్‌ కోసం ఎదురు చూడసాగాడు.
తెల్లవారుజామునే నిద్రలేచిన సతీష్‌చంద్ర, ధృతి స్నానాలు చేసి, మాధవీలత పెట్టిన టిఫిన్‌ తిని బ్యాగ్‌లో తమ బట్టల్ని సర్దుకొని రెడీ అయ్యారు. వాళ్లు బస్టాండ్‌కెళ్లాలని ఇంట్లో అందరికి చెప్పి బయటకొచ్చాక ఆనంద్‌ దగ్గరకెళ్లారు. ”నరేంద్రవాళ్ల ఊరు వెళ్తున్నాం అన్నయ్యా!” అన్నాడు సతీష్‌చంద్ర.
”సరే! వెళ్లిరా! అయినా ఏముందిరా ఆ పల్లెటూరులో…? వెళితే వెళ్లావ్‌ పొలాల్లో తిరుగుతావేమో! పాములుంటాయ్‌! జాగ్రత్త” అన్నాడు ఆనంద్‌.
సతీష్‌చంద్ర వెనకాలే నిలబడి వున్న ధృతి కూడా ”వెళ్లొస్తాం బావగారు” అంది.
”సరే” అన్నట్లు తల వూపుతూ ఆమెను చూశాడు. పసుపు కలర్‌ చీరలో నుదుటన పాపిట్లో కుంకుమబొట్టుతో చక్కగా, కుదురుగా మూర్తీభవించిన తెలుగుదనంతో అద్భుతంగా వుంది.
వాళ్లు అక్కడ ఎక్కువసేపు నిలబడకుండా వెంటనే బస్‌స్టాండ్‌కి వెళ్లి బస్సెక్కారు. బస్సెక్కగానే వాళ్లకు సీట్లు దొరికాయి. కొంతమందికి సీట్లు దొరక్క నిలబడ్డారు. నిలబడినవాళ్లలో ఓ ముసలమ్మను చూసి సతీష్‌చంద్ర లేచి ”అవ్వా! నువ్విక్కడ కూర్చో!” అంటూ ఆమెను తన సీట్లో కూర్చోబెట్టాడు. బస్‌ దానిపాటికి అది వెళ్తోంది.
ఒక పది నిముషాలు గడవగానే దృతి లేచింది. నలుగురు మనుషుల మధ్యలో నిలబడి ఇబ్బంది పడుతున్న గర్భిణీస్త్రీని నెమ్మదిగా తీసుకొచ్చి ”నువ్వు ఇక్కడ కూర్చోమ్మా…” అంటూ తన సీట్లో కూర్చోబెట్టి ఆమె వెళ్లి సతీష్‌చంద్ర ముందు నిలబడింది.
ఒక గంట ప్రయాణం చెయ్యగానే నరేంద్ర వాళ్ల ఊరొచ్చింది.
బస్‌ ఆగింది. సతీష్‌చంద్ర, ధృతి బస్‌లోంచి దిగారు. నడుస్తున్నారు.
నరేంద్ర ఇల్లు సతీష్‌చంద్రకి తెలుసు. అతను అప్పుడప్పుడు నరేంద్ర కోసం వెళ్తుండేవాడు. మొన్నకూడా అతన్ని పెళ్లికొడుకును చెయ్యక ముందు వెళ్లి సౌమ్యను చూసి వచ్చాడు. సౌమ్యను చూడానికి వెళ్లిన రోజు నరేంద్రకు ఫోన్‌ చేసి తారమ్మతో, శేషేంద్రతో, సౌమ్యతో తన ఫోన్‌లోంచి మాట్లాడిపించాడు. నరేంద్ర చాలా సంతోషించాడు. నరేంద్ర చెప్పినట్లే వాళ్లకో కొత్త మొబైల్‌ కొని ఇచ్చాడు. అందులోంచి రోజూ నరేంద్రతో తారమ్మ, శేషేంద్ర, సౌమ్య మాట్లాడుతుంటారు.
నడుస్తున్న ధృతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ”ధృతీ!” అంటూ పిలిచాడు సతీష్‌చంద్ర. ఆమె తల ఎత్తి నవ్వుతూ అతని ముఖంలోకి చూసింది. ఈ ఊరు తీసుకురావటం అనేది ఆమెకు చాలా ఆనందాన్నిస్తోంది.
”మాకు ఆర్మీలో చాలా శిక్షణ, క్రమశిక్షణ వుంటుంది. అందులో భాగంగా ఆడవాళ్లను గౌరవించటం నేర్పుతారు. ఎక్కడైనా మేము నిలబడి ఆడవాళ్లని కూర్చోబెడతాం. ఆడవాళ్లను చూడగానే మర్యాదపూర్వకంగా లేచి నిలబడతాం. వాళ్లు పెద్దవాళ్లా, చిన్నవాళ్లా అన్నది కూడా చూడం… కానీ నువ్వు కూర్చున్న సీట్లోంచి లేచి ఇంకో స్త్రీని కూర్చోబెట్టావు. మనలో ఎవరూ అలా చెయ్యరు. అదే నాకు ఆశ్చర్యంగా, ఆనందంగా వుంది. ఇదెలా సాధ్యం? ఎందుకంటే ఆ బస్సులో చాలా మంది ఆడవాళ్లు మగవాళ్లు కూర్చునే వున్నారు. ఆమెను చూస్తున్నారు. వాళ్లలో ఎక్కువగా మగవాళ్లే వున్నారు. అందులో యువకులు కూడా వున్నారు. ఒక్కరు కూడా లేచి ఆడవాళ్లకి సీటు ఇవ్వటం లేదు. పైగా కూర్చోవటం మా జన్మహక్కు, ముందొచ్చాం కాబట్టి అన్నట్లు చూస్తున్నారు. అలా నువ్వెందుకు చూడలేదు?” అన్నాడు.
ధృతి చేయి సతీష్‌చంద్ర చేతిలోనే వుంది. దారి మధ్యలో మనుష్యులు కన్పించటంతో ఆమె చేయి వదిలి నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు.
”ఎప్పుడైనా మేం బస్‌లో వెళ్తున్నప్పుడు మా అన్నయ్య మీలాగే లేచి ఆడవాళ్లకి సీటు ఇచ్చేవాడు. ఆయన్ని చూసి నేను కూడా అలాగే చేసే దాన్ని మేము ఎప్పుడు బస్‌ ఎక్కినా చాలా వరకు అలాగే వుంటాం” అంది.
”గుడ్‌!” అన్నాడు సతీష్‌చంద్ర.
అతను ”గుడ్‌!” అనగానే ఆమె మనసు మరింత సౌందర్య వంతమైంది. ఆ ఊరిలో ఏ ఇంటికెళ్లాలన్నా నడవడమే కాని ఆటోలు వుండవు. నడుస్తూ మాట్లాడుకోవటం ఎంతో బాగుంది వాళ్లకు. పెళ్లయ్యాక ధృతిని ఓ ప్రశ్న అడగాలని అతనికి చాలాసార్లు అన్పించినా వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అడగాలనుకున్నాడు.
”దృతీ! సైన్యంలో వుండేవాళ్లను పెళ్లి చేసుకోవాలంటే ఏ అమ్మాయి అయినా ఆలోచిస్తుంది. నువ్వెందుకు ఆలోచించలేదు? పైగా నీకు ఇవే మొదటి పెళ్లిచూపులని విన్నాను. ఎవరో ఒకరులే అని విసిగిపోయి చేసుకుంది అనుకోటానికి కూడా లేదు” అన్నాడు.
”సైనికుడికి నా మనసులో మంచి స్థానం వుంది. అందుకే అన్నయ్య అడగ్గానే ‘సరే’ అన్నాను” అంది.
”మంచి స్థానం అంటే?” వెంటనే అడిగాడు.
ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా ”ఒక పువ్వు కూడా తనని తీసికెళ్లి ఒక సైనికుడి పాదాల దగ్గర పెడితే బాగుండు కదా అని కోరుకుంటుందట. నోరు లేని పువ్వుకే అంత అనుభూతి వుంటే నాకు వుండదా?” అంది.
ఆశ్చర్యపోయాడు సతీష్‌చంద్ర. తన భార్యలో అలాంటి అనుభూతులు వున్నందుకు సంతోషించాడు.
అతనికి చాలా స్పష్టంగా అర్థమైంది ఆ సంతోషం అంతా తను ఆర్మీలోకి వెళ్లడం వల్ల వచ్చిందే అని… నిజానికి ఆర్మీలోకి వెళ్లడం అనేది అంత సులభమేం కాదు. అన్నికన్నా ముఖ్యంగా ఫిజికల్‌ ఫ్‌ట్నెస్‌ కావాలి. ఇంటెలిజెన్సీ వుండాలి. అవి వున్నా కూడా మెడికల్‌ టెస్ట్‌లో సెలెక్ట్‌ కావాలి. అప్పుడే ఆర్మీలోకి వెళ్లానికి వీలవుతుంది. అలా వెళ్లాక భారతదేశంలో వివిధ శాఖల్లోకి పంపిస్తారు. అక్కడ ఫిజికల్‌ ట్రైనింగ్‌, డ్రిల్‌, ఫైరింగ్‌ అంటున్నప్పుడు ఆమెనే చూశాడు సతీష్‌చంద్ర. ఆమెది అమాయకత్వం అనుకోవాలో, ఆత్మస్థైర్యం అనుకోవాలో, పసితనం అనుకోవాలో అర్థం కాలేదు.
”మీరంతగా ఆలోచించకండి! నేను వుండగలను. దేశ రక్షణ కోసం మీరు చలిలో, అడవుల్లో, కందకాల్లో పడుకొని గడపగా లేనిది నేను ఇంట్లో అన్ని సౌకర్యాల మధ్యన వుండలేనా?”
”అది కాదు ధృతీ! నేను గుర్తొస్తే బాధపడతావేమోనని…”
”నేను గుర్తొస్తే మీరు బాధ పడతారా?” అంది. అతను వెంటనే మాట్లాడలేకపోయాడు. పైకి వ్యక్తం చెయ్యలేని బాధ ఏదో అతని మనసులో పాములపుట్టలా పెరిగింది. పెళ్లయ్యాక దృతితో సాంగత్యం పెరిగాక అతనికి అతని మీద నమ్మకం తగ్గుతోంది. ధృతిని వదిలి వెళ్లలేనేమోననిపిస్తోంది. ఈ ఒక్క నెలకే ఇంత మార్పు వస్తే ఇంకా ఒక నెల వుంటే ఇంకెంత మార్పు వస్తుందోనని భయంగా వుంది…
అతన్నుండి సమాధానం రాకపోవటంతో అతన్నే చూస్తోంది ధృతి. అతనది గమనించి ”సముద్రమంటూ వున్నాక తుఫాను వుండదా! మనసంటూ వున్నాక అనుభూతులు వుండవా? కానీ అక్కడ మాకు ఇచ్చే ట్రైనింగ్‌లో దేశాన్ని ప్రేమించటం, దేశాన్ని అనుభూతించటమే వుంటుంది. అలా అని నిన్ను మరచిపోతాననుకోను. నీమీద ప్రేమ వుండదనుకోను. ఫోన్లో మాట్లాడతాను కదా! అప్పుడు నువ్వు నా దగ్గర వున్నట్లే అన్పిస్తుంది” అన్నాడు.
”అది నాకు తెలుసు” అంది.
”ఎలా తెలుసు?” అన్నాడు.
”అలా మీరు లేకుంటే సైనికుల భార్యలంతా భర్తల్ని వదిలి ఇంత ప్రశాంతంగా వుండలేరు. ఎవరికి వుండే కమ్యూనికేషన్‌ వాళ్లకు వుంటుంది కదా! అసలు దగ్గరగా వుండి ప్రేమలేని వాళ్లకన్నా దూరంగా వుండి ప్రేమగా వున్న వాళ్లే మన దేశంలో ఎక్కువగా వున్నారట. లేకుంటే అంతమంది భర్తలు పనుల పేరుతో, సంపాదన పేరుతో వాళ్ల భార్యల్ని వదిలి వెళ్లలేరు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *