May 17, 2024

GAUSIPS – ఎగిసేకెరటం-6

రచన:-డా. శ్రీసత్య గౌతమి

“బిశ్వా పి.హెచ్.డి. మూడవ సంవత్సరంలో ఉన్నాడు. ఇంకా మరొక్క సంవత్సరంలో పూర్తయిపోతుంది. ఇప్పుడయినా పి.హెచ్.డి కి సరిపోయినంత డాటా ఉంది. అయినా బిశ్వా ని ల్యాబ్ లో అట్టే పెట్టుకున్నాడు చటర్జీ. ఎందుకంటే అతను వుంటే తనకు వేరే క్రొత్తవాళ్ళని తీసుకొని ట్రైన్ చెయ్యడానికి సహాయంగా వుంటుంది. ఆ పనేదో బిశ్వా మీద పెట్టేస్తే తనకు కొంత సమయం కలిసొస్తుంది, పైగా పరిశోధనల నిమిత్తం బిశ్వాకి తెలిసినంత చటర్జీ కి కూడా తెలియదుగా. అలాగే బిశ్వా నుండి మరికొన్ని పబ్లికేషన్స్ కూడా వస్తాయి. ఇవన్నీ బిశ్వాకే కాదు తన ల్యాబ్ అభివృద్దికి కూడా అవసరమే. అటువంటి బిశ్వాని ఇప్పుడెందుకు సరిగ్గా చూడడం లేదు?” … సూరజ్ ప్రక్కల్యాబ్ లోని తన ఫ్రెండ్ తో వాపోతున్నాడు.

“ఏమోలేరా … ఇంకా ఏమున్నాయో వాళ్ళమధ్య. బిశ్వా డాటాని బాస్ అనుమానిస్తున్నాడేమో?”

నో నో అలాంటిదేం లేదనుకుంటా. అలా అయితే మళ్ళీ చేసి చూపించమనేవాడుగా. లేకపోతే ల్యాబ్లో మరొకరి చేత కూడా చేయించి రిజల్ట్స్ కన్ ఫర్మ్ చేయించేవాడు. అలాక్కూడా జరగటం లేదురా.

పాపం … బిశ్వా మానసికం గా చాలా బాధపడుతున్నాడురా. వాడు మెస్ కి కూడా రావడం మానేసాడు” బిశ్వా గురించి సూరజ్ బాధపడుతున్నాడు.

“ప్చ్ …బిశ్వా డైరక్ట్ గా చటర్జీని అడగాలిరా ఎందుకిలా చేస్తున్నావని. నాతో ఈ విషయాలేమీ కదపటం లేదు బిశ్వా, నిన్న నాకూ కనిపించాడు”.

“అవున్రా … ఇది డైరక్ట్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు. ల్యాబ్లో మిగితా వాళ్ళం కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం ఇదంతా చూసి”.

“ఊ..” అవతలి ఫ్రెండు తల ఊపాడు.

“ఆ సింథియా, బిశ్వా గాడి ప్రాజెక్ట్ కి సూపర్వైజరేంట్రా? ఆమేం చదివింది?”

“తెలీదు” … సూరజ్ సమాధానమిచ్చాడు.

“అసలేం చేస్తాది, మీ ల్యాబ్ లో?”

“అదీ తెలీదురా బాబూ. చటర్జీకేవో అడ్మిన్ పన్లు, ప్రాజెక్ట్ పన్లు ఉంటాయిరా.. అవేవో చేస్తుంది”.

“అంటే నాన్-సైంటిఫిక్”

“అంతే అంతే” … సూరజ్ చెప్పాడు.

“మరిప్పుడు ల్యాబ్లో ఏంటి ఈవిడ?”

“అదే తెలీదు. ఆ స్టూడెంట్లకు ఈవిడ చెప్పిందే వేదం”

అయితే డౌట్ లేదురా. సింథియాకి ముందరనుండీ ఆ స్టూడెంట్లు బాగా తెలుసుండొచ్చు, వీళ్ళందరూ కలిసి పాపం బిశ్వాగాడిని ఆడుకుంటున్నార్రా…పనిచెయ్యకుండా! అయితే వీళ్ళందరి పనీ చటర్జీ ఈ ఒక్క బిశ్వా నుండి ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడురా. అందుకే ఈ ఏడుపంతా”

“బిశ్వా ఒక్కడే ల్యాబ్ లో పనిచేస్తే మరీ యదవలందరూ ఏం చెస్తార్రా?”

“గప్పాలు కొట్టుకొంటూ తిరుగుతారు. ఇప్పుడుమాత్రం చేస్తున్నదేమిటి?….
“అందుకు కన్వీనియంట్ గా పాపం వీడి మీద లేనిపోని కంప్లైయింట్స్ ఇస్తున్నట్లున్నారు”

“ఊ …” సూరజ్ తల ఒకసారి తాటించాడు అర్ధమయినట్లు.
***************
సాయంత్రం 4 అయ్యింది. చటర్జీ తన రూం నుండి ల్యాబ్లోకొస్తూ … డైరక్ట్ గా బిశ్వా దగ్గిరకి వెళ్ళాడు.

“బిశ్వా” … పిలిచాడు చటర్జీ.

“యస్ సార్…” బిశ్వా.

“ఏమి చేస్తున్నావ్?” … చటర్జీ.

“సెల్ లైన్స్ ని గ్రో చేసాను, ఇవాళే ట్రీట్మెంట్స్ కి పెట్టాను. 24 గంటల తర్వాత వాటిని హార్వెస్ట్ చేసి లైసేట్స్ ని తయారుచేసి బ్లాట్ చేస్తాను”. … బిశ్వా.

“ఈ స్టెప్స్ మధ్యలో నీకు వుండే టైం ని ఎలా యూజ్ చేస్తున్నావ్?” … చటర్జీ.

“అంటే?” … బిశ్వా ఆశ్చర్యం.

“అదే నేనడుగుతున్నాను, మొత్తం కలిపి 4, 5 స్తెప్పుల్లో చెప్పావ్. దీని రిజల్ట్ నెక్స్ట్ వీక్ ఇస్తానంటున్నావ్. 4, 5 స్టెప్పులకి ఒక వారం అంటే 168 గంటలు పడుతుందా? 168 గంటల్లో పోనీ 8 గంటలు దీనికి పోయినా మిగితా 160 గంటలు ఏమిచెస్తావ్?” … చటర్జీ గద్దింపు.

బిశ్వా కి ఆశ్చర్యంతో పాటు, అసహ్యం కూడా వేసింది ఆ ప్రశ్నలకు. అయినా అడిగేవాడికి పడేవాడు లోకువన్నట్లు ఓపిగ్గా నోట్ బుక్ చూపించి, ప్రొసీజర్స్ అన్నిటినీ సైంటిఫికల్ గా వివరించాడు. బిశ్వా కి తెలుసు చటర్జీ అడిగే అడ్డమైన ప్రశ్నలకు సైన్స్ ఈజ్ నాట్ ఎన్ ఆన్సర్ అని.

చటర్జీకి తెలుసు తానెంత టార్చర్ పెట్టినా బిశ్వా కి సైన్స్ తప్పా మరోకటి మాట్లాడడం రాదని.
***************
బిశ్వా కనుకొలకుల్లో కన్నీరు ఊరుతోంది.

బిశ్వా తనకోసం తాను పి.హెచ్.డి చేస్తున్నాడు, తన కోసం, తన సొంత ఎదుగుదలకోసం చదువుతున్నాడు, రీసెర్చ్ చేస్తున్నాడు, అది పూర్తయ్యాక ఉద్యోగం చేస్తాడు, తన వాళ్ళని చూసుకుంటాడు. ఇలా అంతా తాను జీవితంలో స్థిరపడడంకోసమే తను 100% పెర్ఫార్మెన్స్ పెడుతున్నాడనీ, ఒక్కొక్క మెట్టూ ఎదుగుతున్నాడనీ, తాను అన్నీ బాగానే చేస్తున్నాడనీ, కన్నవాళ్ళ కష్టానికి తానొక సార్ధకతని కల్పిస్తున్నాడనీ అనుకుంటున్నాడు బిశ్వా. జీవితంలో ఓటములని ఇంకా ఎరుగడు. కేవలం విద్యార్ధి దశ.

చటర్జీ అలా అనుకోవడంలేదు. బిశ్వా తనకోసం బ్రతకాలనుకుంటున్నాడు, తన ఆనందంకోసం బిశ్వా పావు కావాలి, తన ఇబ్బందుల్లో ఒక భాగమవ్వాలి. అందుకే సింథియాకోసం బిశ్వా బాధ్యత పడాలి. డైరక్ట్ గా చెప్పలేడు కాబట్టి … నయానో భయానో రుద్దుతున్నాడు.

“చాలా వర్క్ చేసాడు బిశ్వా. దాంతో రెండు పి. హెచ్.డీ లు ఇవ్వొచ్చు. అతని డాటా బుక్స్ ఆరున్నాయి. ఒక్కడే అదంతా ఏం చేసుకుంటాడు?”

“సింథియా, అది ప్. హెచ్. డీ. లెక్క కాదు. అది ఒక ప్రాజెక్ట్. అది అతని స్వంత ఐడియా మీద రన్ అవుతున్నది, ఫండ్ కూడా అయ్యింది. టొతల్ గా అది అతనిది. నువ్వు ఆ ప్రాజెక్ట్ లొ భాగమయ్యి తన దగ్గర పని నేర్చుకోవాల్సింది”

“వెల్ … నాకేంటవసరం?

“వెల్ … మరిప్పుడు?”

“అదే కదా అవసరమొచ్చింది”

“నేను బిశ్వాని బాధపెడుతున్నాను”

“ల్యాబ్లో ఉన్నవారందరికీ సమయానికి ఆదుకోవడం బాస్ గా మీ బాధ్యత. ఒక్క బిశ్వా గురించే ఆలొచించకూడదు”

“నీకలా అర్ధమయ్యిందా? … చటర్జీ భృకుటి ముడిపడింది.
**********
సింథియా అమెరికా ప్రయాణం, ఆమె అక్కడ స్ఠిరపడడం అనే బాధ్యత చటర్జీ మీద పెట్టింది సింథియా.

ఎలా ఎయితే ఏం … చటర్జీ ఉద్దేశ్యం ప్రకారం … సింథియాకు బిశ్వా తన పి.హెచ్.డి. వర్క్ ను దానం చేసేసి, తాను మళ్ళీ మరో మూడేళ్ళో, నాలుగేళ్ళో క్రొత్త వర్క్ మీద పి. హెచ్.డి చేసుకోవొచ్చు. ఏముంది మరో మూడేళ్ళు … మొత్తం ఆరేడేళ్ళల్లో పి.హెచ్.డి. పూర్తి చేసిన వాళ్ళెందరు లేరు? ఈ లోపుల తాను సింథియాని సెట్టిల్ చేసేస్తాడు అమెరికాలో. అమెరికాలో సింథియా సేఫ్, తన క్రొత్త భర్తతో. మెల్లగా బిశ్వాకూడా పూర్తి చేస్తాడు. ఇది చటర్జీ ఉద్దేశ్యం మరియు సింథియా ఉద్దేశ్యము.

బిశ్వా ఇష్టాఇష్టాలతో వాళ్ళకి సంబంధం లేదు. ఒకవేళా చెప్పినా, బిశ్వా ఒప్పుకోడని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే బిశ్వా యొక్క బలమైన ఐడియాలజీ వ్యక్తిగతంగా మరియు అకడమికల్ గా ఎలాంటిదో వాళ్ళకి తెలుసు. ఇటువంటి మ్యానిప్యులేషన్స్ కి ఒప్పడు. పైగా బిశ్వా ముందు సింథియా కోసం తన యొక్క మరో రూపాన్ని బయటపెట్టుకోలేడు. సింథియా తన బాద్యతలని పూర్తిగా సంఘం మీదే వేసిస్నట్లు తను అనుకున్నది జరగడానికి కొద్దిపాటి సమయం ఇచ్చి ఎదురు చూస్తుంటుంది. మానవసంబంధాలు స్వార్ధపూరితాలు !!!

సింథియా కి తెలుసు తనలాంటి వాళ్ళకి ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది, తాను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గిర పలుకుబడి ఉన్నమనిషి. బిశ్వా ఆఫ్ట్రాల్ ఒక విద్యార్ధి, అదీ అతని విద్య చటర్జీ చేతిలోనూ, చటర్జీ తన చేతిలోనూ ఉన్నది. ఎవరి బలాల్ని వాళ్ళు నిరూపించుకోవడానికి సరైన వాడు బిశ్వా అయిపోయాడు.
************
బిశ్వా సీరియస్ గా పనిలో మునిగిపోయి ఉన్నాడు. హటాత్తుగా చటర్జీ మళ్ళీ వచ్చాడు. సాయంత్రం 4 అవ్వగానే ఈ టార్చర్ మొదలవ్వుతోంది.

మొత్తానికి బిశ్వా ప్రతిరోజూ సాయంత్రం ల్యాబ్ నుండి వెళ్ళేటప్పుడు అవమానంతో బయటకు వెళ్ళేటట్లు చటర్జీ అతన్ని పరాభవిస్తున్నాడు. అతని బ్రెయిన్ ని కండిషన్ చేస్తున్నాడు.

అసలు తనవొక ప్రశ్నలు కూడా కావని చటర్జీ కి తెలుసు. అయినా అక్కడితో పాపం బిశ్వాని వదలకుండా …

“గెట్ ఆల్ యువర్ డాటా ఫ్రం థ డే వన్ యు జాయిండ్ ఇన్ మై ల్యాబ్. థెన్ ఈ విల్ టెల్ హౌ ఎఫెక్టివ్లీ యు షుడ్ యూజ్ యువర్ టైం ఇన్ థ ల్యాబ్”… అని బిశ్వాని విసిగించడం మొదలెట్టాడు.

పాపం, బిశ్వా పని మధ్యలో ఉన్నాడు, హటాత్తుగా చటర్జీ వచ్చి తలతిక్క ప్రశ్నలు వేసి, టైం సెన్స్ నీకు లేదు, దాని గురించి చెప్థాను … నీ మూడేళ్ళ డాటా అంతా తీసుకురా ఇప్పుడే … అంటే అది అలా సాధ్యమా?

పనిచేసుకుంటున్న మనిషికి పని పాడుచేసి టైం సెన్స్ గురించి చెప్పాల్సిన అవసరమేమిటి? టైం సెన్స్ గురించి చెప్పడానికి డాటా ఎందుకు?

ఇలా సైన్స్ ని అడ్డం పెట్టుకొని బిశ్వాని అడుగడుగునా ల్యాబ్లో, మీటింగ్స్ లో, క్రొత్త స్టూడెంట్స్ మధ్య, సింథియా ముందు అవమానాలు పాలు చేసేస్తున్నాడు. అతను చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ లోనూ తప్పుందంటాడు, మరి కరెక్ట్ ఏంటీ అంటే చెప్పడు. బిశ్వాకి ఒక్కసారిగా పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. హటాత్తుగా సింథియా బిశ్వా మీద సూపర్వైజర్ అయిపోయింది. ఆమెనే ల్యాబ్ లోని క్రొత్త స్టూడెంట్స్ ని, బిశ్వా చేసే వర్క్ ని సూపర్వైజ్ చేస్తున్నది. నిజానికి ఆమెకేమీ అర్ధం కాదు, కానీ పదిమందినీ నమ్మించాలి, బిశ్వా వర్క్ అంతా ఆమె ఆధ్వర్యంలో చేసాడని. ఆ వర్క్లో సింథియాకు భాగముందని.

ఈ హటాత్పరిణామానికి బిశ్వా ఖిన్నుడైపోయాడు. చటర్జీ, సింథియా, వచ్చిన మిగితా ముగ్గురు స్టూడెంట్లు తనపై సూపర్వైజర్లయిపోయారు. బిశ్వా బెంగ పెట్టుకొని హాస్టల్ లో తినడం మానేసాడు.

ఎక్స్టర్నల్ కమిటీలో తన డాటా ని చూపించినపుడు, వాళ్ళు ఇంతకు మునుపు చెప్పిన ఎక్స్పెరిమెంట్లను ఎందుకు చెయ్యలేదని అడిగితే … వాటికి కావలసిన కెమికల్స్ ని చటర్జీ కొనివ్వలేదని చెప్పలేకపోయాడు భయంతో. తలవంచుకొని తనపైనే తప్పు వేసుకున్న్నాడు మనసులో ధు:ఖిస్తూ.

ఎక్స్టర్నల్ కమిటీ బ్యాడ్ రిమార్క్ వ్రాసారు బిశ్వాకి. అదే కావాలి చటర్జీ కి. ఎలాగయినా బిశ్వా ని భూస్థాపితం చేసేసి ఆ వర్క్ ని సింథియా కి పట్టం గట్టి … ఆమెని అమెరికాలో సెటిల్ చెయ్యాలి.

ఇలా ప్రతిచోట బిశ్వాని అసహాయుడ్ని చేస్తూ, అవమానిస్తూ వచ్చాడు చటర్జీ. బిశ్వా కొన్నాళ్ళకు పూర్తిగా ల్యాబ్ కి రావడం మానేసాడు ఎందుకంటే ల్యాబ్ కి వస్తే చాలు అతన్ని కూర్చోనివ్వడంలేదు, ఏ పుస్తకం చదవనివ్వడంలేదు, అతని ప్లేస్ లో అతన్ని వర్క్ చేసుకోనివ్వడం లేదు ల్యాబ్ వాళ్ళు. అందరూ ఒక కట్టయిపోయారు, సింథియా గ్రిప్లో వున్నారు.
సూరజ్ ఇవన్నీ దూరం నుండి గమనించి తన పైకెక్కడ వస్తాదో అని ల్యాబ్ వ్యవహారాలకి, బిశ్వాకి దూరం ఉండడం మొదలెట్టాడు.

చటర్జీ చేసిన ఈ మోసానికి మానసికంగా బాగా దెబ్బతిని బిశ్వా వాళ్ళ ఊరెళ్ళిపోయాడు. విశ్రాంతి తీసుకొంటూ మందులు కూడా తీసుకోవడం మొదలెట్టాడు.

ఈలోపల సింథియా బిశ్వా వర్క్ నే కొన్ని ఎక్స్పెరిమెంట్లు మార్చి, ఆ స్టూడెంట్స్ చేత చేయించి ఒక మోస్తరు పి.హెచ్.డి. లాగ చేయించేసి … ఒక సినాప్సిస్ ని కమిటీ కి సబ్మిట్ చేసారు అంతా కలిసి సింథియా కోసం. అది అప్ప్రూవ్ అయిపోయింది.

సింథియా బయట ఒకరిద్దరు సైంటిఫిక్ రైటర్స్ ని పట్టుకొని, డబ్బులిచ్చి వాళ్ళ చేత థీసిస్ వ్రాయించేసి యూనివర్సిటీ మొఖాన పడేసింది.

రాకేష్ ని పెళ్ళిచేసుకొని అమెరికాకి ఎగిరిపోయి కౌశిక్ పుణ్యమా అంటూ ఉద్యోగం సంపాందించి ఇప్పుడు ఊడగొట్టుకొని ఇంట్లో కూర్చుంది.

సింథియా ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది. ఒక లిప్తపాటు ఇలా అనుకొన్నది …

“బిశ్వా ఎలా వున్నాడో. పాపం మానసికంగా దెబ్బ తిని ఆసుపత్రి పాలయ్యాడు కూడా. ఆ ఉసురు ఏమయినా తగిలుంటుందా? అన్ని తెలివితేటలున్నాయి బిశ్వాకి, ఉసురుమని ఏడ్చే బదులు నాకు ఆ మాత్రం సహాయం చెయ్యలేడా? ఆ దేవుడు నాకా తెలివితేటలివ్వలేదు.

ఆ బిశ్వాయే గనుక ఏడ్వకుండా సంతోషంగా నాకు సహాయం చేసివుండుంటే నాకా ఏడుపు తగలకపోయేది, నాకీ ఉద్యోగం పోకపోయేది!”.

Hats off. ఈ అద్భుతమైన ఆలోచనకు ఆమెని పుట్టించిన బ్రహ్మకి కూడా నోట మాట పడిపోయుంటుంది!!!

క్రింద రాకేష్ కార్ హార్న్ శబ్దం, పెద్ద కోలాహలం వినబడింది. త్రుళ్ళిపడి ఫ్లాష్ బ్యాక్ నుండి బయటపడింది సింథియా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *