May 17, 2024

పురాణము – పరిశీలనము

ఓం గం గణపతయే నమః
ఓమ్ శ్రీ వాగీశ్వర్యై నమః ఓం శ్రీ మాత్రే నమః

రచన: కొరిడే విశ్వనాథశర్మ,

 

 

ఓమ్ దేవీం వాచమజనయంత దేవాః ,
తాం విశ్వరూపాః పశవో వదంతి |
సానో మన్ద్రేషు మూర్జం దుహానా,
ధేనుర్ వాగస్మానుప సుతిష్ఠతైతు || ~ తై. బ్రా. 2.4.6.10.

దేవతల అనుగ్రహము వలన ప్రాదుర్భావించిన వాక్కు సమస్త ప్రాణికోటిని నడపించుచూ, జ్ఞానమే లక్ష్యముగా గావించుచున్నది. అట్టి లక్ష్యమును పొంది, జ్ఞానరాశిభూతులైన బ్రహ్మర్ష్యాదులద్వారా శ్రుతి, స్మృతి, పురాణేతిహాసకావ్యనాటకాది సమస్తశాస్త్రములు అవతరించబడినవి. ఇవి లోకమునకు జ్ఞానమునుపదేశించుటయే గాక లోకమును ధర్మపథమున నడిపించుచున్నవి.
ఒక రాజు తన కఠినమైన శాసనములద్వారా ప్రజలను ధర్మ మార్గమున నడిపించు ప్రయత్నం చేసిన, ప్రజలు ఆతనికి భీతిల్లి ఆచరింతురే కాని, భక్తి శ్రద్ధలతో కాదు. కాని వేదశాస్త్రాది వాఙ్మయములు ధర్మోపదేశములద్వారా భక్తిశ్రద్ధలను కలిగించుతూ ప్రజలను సన్మార్గప్రవర్తకులను గావించుచున్నవి. ధర్మజిజ్ఞాసగలవారికి వేదములే ప్రమాణము.( ధర్మం జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శ్రుతిః) అని మనువు తెలిపియున్నాడు.
అట్టి వేదములు మహర్షుల దివ్యముఖారవిందములనుండి నిసృతములై సకల శాస్త్రపురాణేతిహాసాదులకు జన్మస్థానములైనవి. సమస్త లోకులకు పూజనీయములైనవైననూ శబ్దప్రధానములై ప్రభులవలే ధర్మమార్గమును శాసించుటవలననూ, అధ్యయనమున అనేక కఠోరనియమములవలననూ కూడ ప్రజల హృదయములలోనికి చొచ్చుకొనిపొలేకపోయినవి. వాటి నిర్దేశములు అవగతముకావలెనన్న రాజులైననూ. పామరులైననూ పండితులను ఆశ్రయించిన కాని వేదార్థములను తెలిసికొనలేకపోవుచున్నారు. ఇట్టి వేదార్థము పండితులకు కూడ శ్రమైకసాధ్యమైనట్టిదే అగుచున్నది.
ఈ వేదార్థమునే ఆశ్రయించి అటుపిమ్మట స్మృతులు రాగా , అవి వేదార్థామునకు దాదాపుగా లౌకిక భాషానువాదములుగా మాత్రమే ఐనవి. కాని అదే సమయములందు వచ్చిన పురాణములు మనోరంజకములైన ఆఖ్యానోపాఖ్యానములతో ప్రజలమనస్సులను ఆకట్టుకున్నవి. ఇవి మిత్రులవలే ధర్మమునుపదేశించుటలో సహృదయతను పాటించినవి. “ప్రజలకు చేరువగుటలో వేదములను మించినవి. వేదార్థముల కంటే పురాణార్థములే అధికములైనవి. వినసొంపైనవి.” ( వేదార్థాదధికం మన్యే పురాణార్థం వరాననే) అని నారదపురాణము (2.24.17 ) చే ప్రశంసలందుకొన్నవి. అందుకే ఇతిహాసపురాణముల ద్వారానే వేదము స్పష్టముగా వ్యాఖ్యానించబడుతుందని (ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబృంహయేత్) అని మహాభారత(ఆది. 3. 247), పద్మ పురాణాదులు (సృష్టి. 2.51,51) అభిప్రాయపడినవి.
అటు తర్వాత చేర్చదగిన కావ్యాదులు మనోరంజకములైన ఇతివృత్తములనాశ్రయించి అలంకార రసాదులచే నిజకాంతలవలే మనోహరముగా కర్తవ్యోన్ముఖులను గావించుటలోనూ, నడవడికను మార్చుటలోనూ కృతకృత్యములైనవి. ఐననూ కాంతాసక్తుడైన జనుడు తన మిత్రుని పట్ల, ఆతని ఉపదేశము పట్ల సద్భావనాపరుడై, తన కార్యపంథాను, ఎన్నుకొన్నట్లు, ప్రజలుకూడా పురాణాల పట్ల తమ ఆదరాభిమానాలతో తమ లక్ష్యసాధనాలకు, ధర్మాధర్మ విచక్షణ జ్ఞానానికి దర్పణములవలే నెంచుకొన్నారు. అదియును గాక కావ్యాదులలోని అత్యధికములైన ఇతివృత్తములకు పురాణములే పట్టుకొమ్మలైనవి. కావున పురాణములు సదా ఆదరణీయములైనవి.

పురాణ శబ్ద విచారణ
వేదవాఙ్మయమునుండి ‘పురాణ’శబ్దము కానవచ్చుచున్నది. అతీతము, ఆఖ్యానము, పురాణము, ఇతిహాసము,కథ అనువాటికి అంతగా భేదము కానరాదు. ఐతరేయశతపథాది బ్రాహ్మణములకు ఇతిహాస, పురాణ, కల్ప, గాథ, నారాశంసలు అను పేర్లు ( బ్రాహ్మణానీతిహాసాన్ పురాణాని కల్పాన్ గాథా నారాశంసీరితి ) ఆశ్వలయన గృహ్యసూత్రము ( 3.3.1) నందు కనబడుచున్నవి. ఇందువలన పురాణములు వేదకాలీనములైనవి గా తెలియుచున్నది.
వేదార్థాన్ని స్పష్టముగా పూరించుచున్నవి కావుననే “పూరణాత్ పురాణమ్” అను వ్యుత్పత్తినాధారముగా చేసి జీవగోపస్వామి పురాణములు వేదములవలె అపౌరుషేయములని అభిప్రాయపడినాడు. ‘ పురా నయతీతి పురాణమ్’ అని రూపగోస్వామి ’’ప్రాచీనవిషయాలను పొందింపజేయుచున్నది కావున పురాణమ్” అని తెలిపియున్నాడు.
‘పురా అనక్తి ’ ప్రాచీనవిషయములను పొందించునది అనియు ‘పురా నవం భవతి పురాణమ్’ అని యాస్కుని నిరుక్తము. ఇదియే కాక ‘పురాఽపి నవం పురాణమ్’ అను నిరుక్తి కూడా ప్రసిద్ధియే ! పురాతనమైనప్పట్టికినీ ఎప్పటికినీ నూతనమైనదే అను వ్యుత్పత్తి తెలియజేయుచున్నది.
‘పురా పూర్వస్మిన్ భూతమితి పురాణమ్’ అని అమరకోశ గురుబాలప్రబోధిక వ్యాఖ్య. ‘పురా భవమితి పురాణమ్’ అని శబ్ద కల్పద్రుమమ్. ‘పురానీయతే ఇతిపురాణమ్’ అని వాచస్పత్యము. పురాణములందు కూడ ‘పురాతనం పురాణమ్ స్యాత్ తన్మహదాశ్రయాత్.’ అని జైనపురాణములు. “యస్మాత్ పురా హ్యనక్తీదం పురాణం తేన తత్స్మృతమ్” అని వాయు 1.1.202, బ్రహ్మపురాణమ్ – ప్రక్రియపాదం. ” పురాతనస్య కల్పస్య పురాణాని విదుర్బుధాః ” అని మత్స్యపురాణము.
అంతేకాక ‘ప్రాగ్వృత్త కథనం పురాణమ్’ ‘ పురాణగతానాం గతా అణతి కథయతీతి పురాణమ్’ , ‘పురా ప్రాచీన కాలోదన్తం అనక్తీతి పురాణమ్’ అని శుక్రనీత్యాది గ్రంథాలలో కనబడుచున్నవి.

పురాణకర్తృత్వ విచారణ
” అష్టాదశపురాణానాం కర్తా సత్యవతీసుతః” అను వచనానుసారము అష్టాదశపురాణముల కర్త వ్యాసమహర్షి అనునది ప్రసిద్దమే ! ఎంత శ్రమ గావించిననూ ఏ ఒక్కరిచేతకూడ తన జీవితకాలమున అష్టాదశపురాణకర్తృత్వము సాధ్యముకాదని తలంచునట్టి వారలనేకులు కలరు. వ్యాసులనేకులు కావున వ్యాసపదలాంఛనులైన అట్టి మహర్షులనేకులచేత కర్తృత్వము గావించబడియుండుననునది వారి అభిప్రాయము. ఐననూ కొంత పరిశీలన గావించదగినట్టిదే !
” భేదైరష్టాదశైర్ వ్యాసః పురాణం కృతవాన్ ప్రభుః ” అని కూర్మపురాణము (1.52.20) పేర్కొన్నది. పూర్వం బ్రహ్మప్రోక్తమై వేదరాశివలే ఒకే రాశీభూతముగానున్న పురాణమును వ్యాసమహర్షి 18 భాగములుగా గావించాడని కూర్మపురాణము పేర్కొన్నది. ఐతే వ్యాసమహర్షులు అను వారు ఇరువది ఎనమిది మంది యని పేర్లను తెలుపుతూ, 28 వ వ్యాసుడే కృష్ణద్వైపాయనుడని, పరాశరపుత్రుడైన ఈ మహర్షియే వేదవిభజననూ, పురాణవిభాగములను గావించాడని (1. 52. 9, 10) తెలిపియున్నది. దాదాపుగా పురాణములన్నింటిలో వ్యాసావతారములు వర్ణించబడినవి. లింగపురాణము ( 1.25. 124, 125) కూడ వ్యాసపరంపరను పేర్కొంటూ భగవదవతారముగా కృష్ణద్వైపాయనుని పేర్కొన్నది. కాని పురాణకర్తృత్వవిషయమున “ఇతిహాస పురాణాని భిద్యంతే కాలగౌరవాత్” అని ( 1.39.61) అనేకకల్పభేదములవలన పురాణములు విభిన్నములుగా మారును అని చెప్పుచూ, పురాణముల పేర్లతో పాటుు పురాణవిభాజకుల పేర్లను “ మన్వత్రి విష్ణు హారీత యాజ్ఞవల్క్యోశనోఽఙ్గిరాః , యమాపస్తంబసంవర్తాః కాత్యాయన బృహస్పతీ, పరాశర వ్యాస శంఖలిఖితా దక్షగౌతమౌ , శతాతపో వశిష్ఠశ్చ ఏవమాద్యైః సహస్రశః . “( 1.39.64-66) (“భిద్యంతే కాలగౌరవాత్”) అని కూడా పేర్కొన్నది. రాశీభూతమైన పురాణము అష్టాదశభేదములుగా విభజించబడినప్పుడు, అట్టి విభాజకులను అనగా కర్తలను గానే గ్రహించాలనే అభిప్రాయపడుతున్నా. ఇందుకుదాహరణ పులస్త్యమహర్షి వరమువలన, వశిష్ఠమహర్షి అనుగ్రహముచేత పరాశరమహర్షి విష్ణుపురాణమును వ్రాసెను.( “అథ తస్య పులస్త్యస్య, వశిష్ఠస్య చ ధీమతః, ప్రసాదాత్ వైష్ణవం చక్రే పురాణం వై పరాశరః .” ) అని లింగపురాణము(1.64.120, 121) న చెప్పబడుటయే కాక ఈ విషయము విష్ణుపురాణమున (1.1.12-31)కూడ పేర్కొనబడినది. భవిష్యపురాణమున లింగపురాణకర్త ’తండి మహర్షి’ యని పేర్కొనబడినది.

పురాణములు

అష్టాదశపురాణములనునది ప్రసిద్ధమే ! ఇవి మహాపురాణములు, ఉప పురాణములు అని రెండు విధములు. అష్టాదశపురాణల విషయములోనూ, ఉపపురాణాలవిషయములోనూ . అవి ఏవియను వాటి విషయములోనే తర్జనభర్జన ఉన్నది. “ మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయమ్ , అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్ .” అని దేవీ భాగవతం (పూర్వ.1. 3.2.) అని సంక్షిప్తముగా సంకేతాక్షరములద్వారా తెలిపిన ఈ శ్లోకము చాలా ప్రసిద్ధిని పొందినది. అవి ఏవనగా మద్వయం – మత్స్య, మార్కండేయములు , భద్వయం – భవిష్య, భాగవతములు, బ్రత్రయం – బ్రహ్మ, బ్రహ్మావర్త, బ్రహ్మవైవర్తములు, వచతుష్టయమ్- వాయు, వామన , విష్ణు, వరాహ పురాణములు, అ- అగ్ని, నా- నారద, ప – పద్మ, లిం – లింగ, గ – గరుడ, కూ- కూర్మ, స్కా- స్కంద పురాణములని తెలియవస్తున్నది.
కాని ఈ పురాణముల జాబితాను అన్ని పురాణములు అంగీకరించలేదు. అగ్నిపురాణము కూడ ఈ పురాణములశ్లోకసంఖ్యతో పాటు ఈ పురాణముల దానవిధానమును తత్ఫలితమును పేర్కొన్నది. మత్స్యపురాణమున ‘బ్రహ్మవైవర్తము ను బ్రహ్మకైవర్త’మని పాఠాంతరమున్నది. అదేవిధముగా భాగవత, శివ, లింగ,విష్ణు,స్కంద పురాణములందు వాయుపురాణము బదులుగా శివపురాణము అష్టాదశపురాణములలోనొకటిగా చెప్పబడినది. గరుడపురాణము(అధ్యా. 223) శివ వాయుపురాణములను రెండింటిని కూడ మహాపురాణములుగా వామనపురాణమును ఉపపురాణముగా పేర్కొన్నది. పద్మ పురాణము ‘పురాణములు భగవదంగముల’ని పేర్కొనుచూ, శివపురాణాన్ని వామహస్తముగా అభివర్ణించుటచే శివపురాణమును అంగీకరించినట్లైనది . కూర్మపురాణము అష్టాదశపురాణకర్తృత్వవిషయము నే పేర్కొ న్నది కాని పురాణములపేర్లను పేర్కొనలేదు. అంతేకాక వాయుపురాణ వ్రాతప్రతులలోని గ్రంథాంత గద్యములనేకములలో వాయుపురాణము ‘శివపరాహ్వయమ’నిచెప్పబడినట్లు లండన్, ఇండియా ఆఫీస్ సంస్కృత గ్రంథవిషయపట్టిక Vol. V లోన పేర్కొనబడినదని శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శర్మగారు తన గ్రంథములో ప్రస్తావించినారు .
శివపురాణములలో విద్యేశ్వరసంహిత మొదలుకొని ఏడు సంహితలలో చివరిది వాయవీయ సంహిత. గ్రంథాంతమున “ఇతి శ్రీ శివపురాణే సప్తమ్యాం వాయవీయసంహితాయాం…” అని పేర్కొన బడినది. అందువలననే ఇదే వాయు పురాణమని తెల్పేవారున్నారు. ఇక ఈ పురాణాల ప్రస్తావనే లేని పురాణములు బ్రహ్మ, వామనాదిపురాణములు.
ఇట్లే భాగవతముగురించిన చర్చ కూడ కనబడుతున్నది. అష్టాదశపురాణములలో చేర్చబడినది శ్రీ మద్భాగవతమని కొని పురాణములందు, కాదు దేవిభాగవతమునకే అందు స్థానముకలదని మరికొన్ని పురాణములందు రెండువిధములైన సమర్థనములైన వాదములు కనబడుచున్నవి. శివపురాణము దేవీభాగవతమునే వీటిలోనొకటి గాచెప్పినది .అందువలన శివ, వాయు పురాణముల రెండింటి విషయముల లోనూ వాదములున్నవి. అదేవిధముగా భాగవతములు రెండింటిలోనూ నొకటి మహాపురాణములలో లెక్కించబడగా మరొకటి ఉపపురాణముగా లెక్కించబడినదని చెప్పవచ్చును. అదేవిధముగా ఉపపురాణాలవిషయమున కూడా అభిప్రాయభేదములు పురాణములలోనే కానవచ్చుచున్నవి. దాదాపుగా ముప్పది ఉపపురాణములు పేర్లు కనబడుతున్నవి.

పురాణలక్షణములు

పై పురాణములు స్థూలముగా పరిశీలించబడి లక్షణములు ఇట్లు చెప్పబడినవి. “సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ , వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణమ్.” అను పురాణలక్షణమునే చాలా పురాణములు అంగీకరించినవి. అంతే కాక కోశరాజమైన అమరకోశము కూడా ఈ లక్షణమునే సమర్థించినది.
కాని శ్రీమద్భాగవతము పంచలక్షణ విధానాన్నిఖండిస్తూ ..వీటితో పాటు మరొక ఐదు చేర్చి‘పురా ణము దశలక్షణాన్వితమై’నదని పేర్కొన్నది.అట్టి దశలక్షణములను ద్వితీయ స్కంధములో ఒకవిధముగాను, ద్వాదశస్కంధములోనూ కొద్ది మార్పుతో మరొకవిధానముగా చెప్పినది. ద్వితీయస్కంధములో –
“అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః , మన్వన్తరేశానుకథా నిరోధో ముక్తిరాశ్రయః (2.10.1) ” అనియు మరొకచోట … “సర్గోఽస్యాథ విసర్గశ్చ వృత్తీ రక్షాంతరాణి చ, వంశో వంశానుచరితం సంస్థా హేతురపాశ్రయః .” ( 12.7.9)అను దశలక్షణములు చెప్పినది.

పురాణప్రతిపాద్య విషయములు

పై లక్షణాలు కల్గియున్నప్పటికినీ భక్తితత్త్వాన్ని, ఆధ్యాత్మికతాభావమును పెంపొందిచుటే ప్రధానలక్ష్యముగా కనబడును. ఐననూ చతుర్దశవిద్యలలో పురాణములు కూడ చేర్చబడుటవలన ఇవి అధ్యయనము గావించదగినవని అర్థమగుచున్నది. ఐనచో వీటి అధ్యయనము వలన భక్తి కథలే తప్ప ఏమి ప్రయోజనము అన్న అపోహ కలుగుతుంది. కాని అష్టాదశపురాణలను పరిశీలించినట్లైతే అట్తి అపోహలు తొలగి పోగలవు. పురాణాలు పఠితలను, శ్రోతలను కూడా అనేక శాస్త్రనిష్ణాతులను గావించుటలో సమర్థమగుచున్నవి. వీటిలో ధర్మ భక్తి నీతి శాస్త్రములు తమ ఆధిక్యమును చాటుకొన్ననూ, వేదార్థమును, వేదాంతసారమును, వేదాంగవిషయప్రాతినిధ్యమును వెళ్ళడించుచున్నవి.
ఇంకనూ గరుడ కూర్మాదులు పరలోక, జన్మాంతరాది విజ్ఞానమును తెలియజేస్తూ పాపభీతిని కలుగజేస్తూ, సత్కార్యాసక్తిని పెంపొందింపజేయుచున్నవి. భాగవతాదులు భక్తివైరాగ్యముల వైపు ఉన్ముఖుల గావింపజేయుచున్నవి. కర్మసిద్ధాన్తములనుపదేశించుటద్వారా కర్మాచరణాసక్తిని కలిగింపజేయుచున్నవి. ఈ విధముగా సనాతాన ఆర్యసంస్కృతికి పుట్టినిల్లగుచున్నవి. అంతే కాక అగ్నిపురాణాదులు ఛందోవ్యాకరణాలంకారాది శాస్త్రములకు వేదికయైనవి. వాటిపట్ల మక్కువను కలిగించుటలో తోడ్పడుచున్నవి. గరుడాది పురాణములు ఆయుర్వేదమునకు పెద్దపీఠ వేసి కేవలము మానవుల ఆరోగ్యమునకు సంబంధించినవే కాక, గో వృషభ మహిషాది పశు, అశ్వగజాది ప్రాణిసంబంధించిన వైద్యవిధానమును కూడా అందించుచున్నవి. విష్ణుపురాణాదులు జగదుత్పత్తి, సృష్టిక్రమము, కాలవిభజన, జ్యోతిష్య, గ్రహనక్షత్ర సముదాయముల గతులు, భౌగోళికరహస్యములను కూడ విశేషములను తెలియజేయుచున్నవి.కాశీ గయా, ప్రయాగ, కురుక్షేత్రాది పుణ్యక్షేత్రములవిశిష్టతను ప్రశంసించుతూ తత్తత్ క్షేత్రసందర్శనాసక్తులగావించుచున్నవి. ఆయాక్షేత్రచరిత్రలనే కాక సూర్య, చంద్ర వంశరాజుల చరిత్రలను తెలియజేయుచూ, గతకాలీనవైభవములను మహర్షుల త్యాగములను వివరించుచున్నవి. వేదద్రష్టలైన మహర్షుల బ్రహ్మర్షుల ముఖారవిందములనుండి నిసృతములైన అపౌరుషేయములగు వేదములకు సరళతరములైన వ్యాఖ్యానములను గావించుచున్నవి.
అన్నింటియందుకూడ తేలికయైన భాషతో, చిన్నచిన్న అనుష్టుబాది ఛందోవృత్తములద్వారా సరస వినోదకథలతో పాటు ఎన్నో విషయములనుకూడ ప్రతిపాదించినవై పురాణములు విజ్ఞానప్రదాయకములైనవి..
ఇట్లు పురాణములు అంతర్భాగములుగా అనేకవిషయములను ప్రతిపాదించుటలో చాలావరకు ఏకాభిప్రాయమును వ్యక్తీకరించినవైననూ, ఒక్కొక్కపురాణము తమదైన విశిష్టమార్గమును అవలంబిచుచూ ప్రశంసించబడుచున్నవి. కథలలో కూడా ఒక్కొక్కపురాణము తమ వైవిద్ధ్యాన్ని చూపినాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *