May 9, 2024

శ్రీ కృష్ణదేవరాయ వైభవం-5

రచన:-రాచవేల్పుల విజయభాస్కరరాజు

rayalu
విజయనగర రాజకోటలోకి అడుగు పెట్టిన నరసానాయకుడిని చక్రవర్తి రెండవ నరసింహరాయలు సాదరంగా ఆహ్వానించాడు. నగరంలోని అనేకమంది రాజప్రముఖులు, వాణిజ్యవేత్తలు, సామంతరాజులు, ప్రజలు, రాజోద్యోగులందరు కలసి ఎంతో గొప్పగా స్వాగతించారు. ఎవరికి తోచిన రీతిలో వారు గౌరవిస్తూ తమ తమ అభిమాన పూలవర్షం కురిపించారు. తనవారు, పరాయివారు అనే భేదం లేకుండా నరసానాయకుడికి ఇంత పెద్ద ఎత్తున ఆదరణ, సత్కారాలు లభించడంతో చక్రవర్తి నివ్వెరపోయాడు. తప్పు చేశానేమోనని మదనపడ్డాడు. ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వెనువెంటనే అన్ని కీలక పదవులను, అందుకు సంబంధించిన బాధ్యతలను, ఖజానాను తిరిగి నరసానాయకునికి అప్పజెప్పాడు.

కొద్దిరోజుల్లోనే పరిస్థితులు చక్కబడ్డాయి. పరిపాలన గాడిలో పడింది. నరసానాయకుడు తన పదవులను, అధికారాన్ని మరింత కట్టుదిట్టం చేసుకునే పనిలోబడ్డాడు. గతంలో తాను చక్రవర్తి బంధువులను నమ్మడం, వారికి కీలక పదవులు, బాధ్యతలు అప్పజెప్పడం మూలంగా కుట్రలు జరిగాయి. ఫలితంగా అప్పటి చక్రవర్తి తిమ్మభూపాలున్ని బలిగొన్నాయి.

నరసానాయకుడు గత పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకొని ఈసారి అలా జరగకుండా, తన ఉనికిని, చక్రవర్తిని కాపాడుకునేందుకు సంస్కరణలు చేపట్టాడు. తనకు అత్యంత ప్రీతిపాత్రులు, అతినమ్మకస్తులైన వీరాధివీరులను రాజకోటసంరక్షణకు నియమించాడు. కాలు కదిపినా, చీమ చిటుక్కుమన్నా తక్షణమే తనకు సమాచారమందేలా వేగులను నియమించాడు. వారి నియామకపు సంఖ్యను మరింతగా పెంచాడు. చక్రవర్తి రక్షణ నిమిత్తం ఎన్నో ఆంక్షలను విధించాడు. చక్రవర్తికి సంబంధించిన ప్రతి కదలిక తనకు తెలిసేలా ఏర్పాటు చేశాడు. అటు సామ్రాజ్యం నలుమూలలా, ఇటు కేంద్ర రాజధానిలో అడుగడుగునా తన మనుషులను నియమించాడు.

చక్రవర్తిని ఎవరు కలిసినా, ఏం మాట్లాడినా నరసానాయకుడికి తెలిసిపోయేది. సామంత రాజ్యాలనుండి, రాజ్య సరిహద్దుల వరకు ప్రతి చిన్న సంఘటన సైతం నరసానాయకునికి క్షణాల్లో చేరిపోయేది. దీంతో ఇటు సామంత రాజులు, అటు చక్రవర్తి అభద్రతా భావానికి గురవుతూ వచ్చారు. తమ తమ వ్యక్తిగత సమాచారం దగ్గరనుండి రాజరిక వ్యవహారాల వరకు తెలిసి పోతుండడంతో లోలోన రగిలి పోతూ వచ్చారు. ఈ విషయం చక్రవర్తికి కంటగింపుగా మారినప్పటికీ గత సంఘటనల ప్రభావం రీత్యా చేసేదేమీ లేక మిన్నకుండిపోయాడు. ఈ నేపథ్యంలో విజయనగరంలో జరుగుతున్న పరిణామాలను ఇరుగు, పొరుగు రాజ్యాల వారు పసిగట్టారు. విజయనగరంపై దాడి చేస్తే సామంత ప్రభువులు కేంద్ర సైన్యానికి సహకరించరని గ్రహించారు. ఏ క్షణమైనా దాడి చేసేందుకు అదను కోసం కాచుక్కూర్చున్నారు. నరసానాయకునిపై అసంతృప్తితో ఉన్న సామంత రాజులు ఒక్కరొక్కరిగా బయట పడుతూ వచ్చారు. క్రీ. శ. 1495 నాటికి అనేకమంది సామంతులు ఎదురు తిరిగారు. విజయనగరానికి లోబడి తాము కప్పం కట్టేది లేదన్నారు. ఇకనుండి తాము స్వతంత్ర ప్రభువులుగా చలామణి అవుతామని తేల్చి చెప్పారు. అవసరమైతే విజయనగరంతో తాడో, పేడో తేల్చుకునేందుకు తామంతా సిద్దమని ప్రకటించారు.

ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న గజపతి రాజులు క్రీ. శ. 1496 సంవత్సరంలో విజయనగర భూభాగాలపైకి దండెత్తి వచ్చారు. కళింగ రాజ్యం నుండి ప్రతాపరుద్ర గజపతి తరలి వచ్చి ఒక్కటొక్కటిగా విజయనగర సామంత రాజ్యాలను ఆక్రమించుకుంటూ చాలా దూకుడుగా కావేరి నది పర్యంతం ముందుకు కొనసాగాడు.

పరిస్థితి విషమించడంతో గజపతిని ఎదుర్కొనేందుకు సైన్యాన్ని సమాయత్తం చేశాడు నరసానాయకుడు. ఉన్నఫలంగా ఆఘమేఘాలపై తరలి రావాలంటూ కందనవోలు, గండికోట, తుళునాడు, సిద్దవటం, గుత్తి, రాయదుర్గం, మడకశిర, పెనుగొండ, ఆదవాని, తదితర దుర్గాల సైన్యాలను ఆదేశించాడు. యుద్ధ ప్రణాళికా రచనలో మెరికల్లాంటి సాహస వీరులను ఏరికూర్చాడు. వెనువెంటనే గజపతి సైన్యంపై విరుచుకు పడ్డాడు. భయంకర యుద్ధం జరిగింది. గజపతి సైన్యం తునాతునకలైంది. గజపతి రాజ్యానికి వెన్నెముకలాంటి వీరులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా గజపతి వెన్నుజూపి పారిపోవడం మొదలెట్టాడు. వెన్నంటిన నరసానాయకుడు విజయనగర భూభాగాలను తిరిగి వశపర్చుకున్నాడు. దీంతో బుద్ధి వచ్చిన గజపతిరాజు నరసానాయకుడున్నంత వరకు విజయనగర భూభాగాలవైపు కన్నెత్తి చూడలేదు.

గజపతిని ఓడించిన నరసా నాయకుడు రాజధానికి తిరిగి చేరుకోలేదు. అంతటితో ఆగక మరింత సైన్యాన్ని సమీకరించుకున్నాడు. ఎదురు తిరిగిన సామంత ప్రభువుల భరతం పట్టేందుకు కోపంతో రగిలి పోయాడు. ఆ కోపానికి తగిన కారణం గతంలో జరిగిన సంఘటనలే.

క్రీ. శ. 1463 లో నరసానాయకుడు సాళువ నరసింహరాయల వద్ద ప్రధాన సైన్యాధ్యక్షునిగా పని చేస్తున్న రోజులవి. అప్పట్లో కావేరినది దక్షిణభాగంలోని పాలెగాళ్ళు విజయనగర చక్రవర్తికి ఎదురు తిరిగి స్వతంత్ర ప్రభువులుగా చలామణి అవుతూ వచ్చారు. ఆ సమయంలో సాళువ నరసింహుడు చక్రవర్తి తరపున యావత్ రాజ్య మంత్రాంగం నడుపుతూ రాజ్య వ్యవహారాల్లో తలమునకలై ఉన్నాడు. అందువల్ల వీరి ఆటలను కట్టించేందుకు నరసింహరాయలకు తగిన సమయం లేకపోయింది. అయితే ఈశ్వరనాయకుడు, నరసానాయకుడులిద్దరూ ఆ పాలెగాళ్ళ పట్ల ఆగ్రహం చెందారు. ప్రతీకారం తీర్చుకుందామంటూ నరసింహరాయల అనుమతి కోరారు. కానీ రాయలు అనుమతి నొసంగలేదు. అప్పటినుండి ఎదురు చూస్తూ ఏదో ఒక రోజు వారి పీచమణచాలనుకున్నాడు నరసానాయకుడు. ఎప్పటినుండో లోలోపల కుతకుతలాడుతున్న నరసానాయకునికి ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది.

తూర్పు సముద్రతీరం వరకు గల రాజ్యాలను వశపర్చుకున్నాక, దక్షిణ భాగానికి తరలి పోయి ముందుగా చోళ రాజుపై యుద్ధం ప్రకటించాడు. చోళ రాజును ఓడించాక తిరుచునాపల్లి పాలకుడు కోనేటి రాజును అతి సునాయాసంగా జయించాడు. అనంతరం మధురపై దాడి చేశాడు. మధుర పాలకుడైన మానవ భూషణుడిని అణచివేశాడు. అక్కడినుండి నేరుగా పాండ్య రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఉమ్మత్తూరు, శివసముద్రం, శ్రీరంగ పట్నంలపై దాడి చేసేందుకు ముందుకు కదిలాడు. ఎక్కడా ఓటమి లేక పోవడంతో సైన్యంలో ఉత్సాహం పొంగిపొర్లింది. పైగా తమ సైన్యాధ్యక్షునితో పాటు సైన్యానికి కూడా ఉమ్మత్తూరు, శ్రీరంగ పట్నం, శివసముద్రం సామంతులపై ఆగ్రహం ఆకాశాన్నంటింది. ఈ క్షణంలో ఎదురైతే ఆ ముగ్గురు సామంతరాజులను తెగ నరకుతామంటూ నరసానాయకునికి భరోసా ఇచ్చి ఉత్సాహం నూరిపోస్తున్నారు. వారి ఉత్సాహం చూసిన నరసానాయకునికి కూడా ఎక్కడ లేని ధైర్యం వచ్చింది.

ఈలోగా కావేరి నది వద్దకు సైన్యం చేరుకుంది. నదిలో వరద నీరు పొంగి పొర్లుతోంది. దీంతో నది దాటడం సైన్యానికి దాదాపు అసంభవంగా మారింది. దీంతో విజయనగర సైన్యం ఉత్సాహంపై కావేరి నది నీళ్ళు చల్లినట్లయింది. కొద్దిమంది సైన్యం నదిలో నీళ్ళు తగ్గే వరకు వేచి చూద్దామన్నారు. నరసానాయకునికి సైతం ఏం చేయాలో పాలుపోలేదు. ఈలోగా ప్రముఖ దండనాయకులు, మంత్రులు నదీ పరివాహక ప్రాంతం వెంట ముందుకు సాగి ఎక్కడైనా నది దాటేందుకు వీలు చిక్కుతుందేమోనంటూ పరిశీలించారు. ఊహూ… అలాంటిదేమీ కుదరలేదు.

అప్పుడు కొందరు మంత్రులు, ప్రధాన దండనాయకులు ఓ ప్రతిపాదనతో నరసానాయకుని ముందుకు వచ్చారు. నది ఇరుకుగా ఉన్న ప్రాంతంలో పెద్ద పెద్ద బండరాళ్ళను అడ్డుగా నిలిపి ఆనకట్ట కట్టి నది ఆవలికి దాటి పోదామంటూ విన్నవించారు. నరసానాయకుడ్ని వెంట తీసుకుని తాము పరిశీలించిన ప్రదేశాన్ని చూపించారు. ఆనకట్ట కట్టేందుకు గల అవకాశాలను, అక్కడ లభించే పెద్ద పెద్ద బండరాళ్ళను, పుష్కలంగా అందుబాటులో ఉన్న మొరుసుమట్టిని చూపించారు. అన్నీ పరిశీలించిన నరసానాయకునికి ఈ ప్రతిపాదన ఎంతగానో నచ్చింది. ఆ వెంటనే ఆనకట్ట నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఏనుగుల ద్వారా పెద్ద పెద్ద బండరాళ్ళను కావేరినది నీటి ఉధృతికి అడ్డుగా నిలిపారు. మొరుసుమట్టి పేర్చి చావుబ్రతుకులతో ఆనకట్ట నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా నరసానాయకుడు పెద్ద సైన్యంతో తరలి వచ్చి కావేరినదికి అడ్డుగా ఆనకట్ట నిర్మిస్తున్నాడనీ, ఇక కొద్ది రోజుల్లో ఉమ్మత్తూరు, శ్రీరంగ పట్నం, శివసముద్రంలపై ముట్టడి తప్పదంటూ ఆ ముగ్గురు సామంత ప్రభువులకు వేగులు సమాచారమందించారు. వెనువెంటనే వారు కోటలోకి ఆహార పదార్థాలు చేర్చుకుని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ క్షణంలో యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు తమ సైన్యాన్ని, ప్రజలను అప్రమత్తం చేశారు. ఆ ముగ్గురు ప్రభువులు తమ తమ కోటల పరిరక్షణకు సాహస వీరులైన కొద్దిమంది సైన్యాన్నుంచి, మిగిలిన సైన్యాన్ని మూకుమ్మడిగా సమన్వయ పరచి యుద్ధ క్షేత్రానికి తరలించారు.

అక్కడి విషయం అలా ఉంటే ఇక్కడ విజయనగర సైన్యం ఆనకట్ట నిర్మాణ పనులను చకాచకా పూర్తి చేసేశారు. తక్షణమే నదిని దాటి ఏనుగులు, గుర్రాలతో సహా ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. ఇరుపక్షాలు శ్రీరంగపట్నం వద్ద తలపడ్డాయి. భీకరయుద్ధం జరిగింది. విజయనగర సైన్యం యుద్ధ వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తుల ధాటికి శతృసైన్యం ఎన్నో రోజులు నిలబడలేక పోయింది. అచిర కాలంలోనే ముగ్గురు శతృవుల ఉమ్మడి సైన్యం చిత్తు చిత్తుగా ఓడిపోయింది. శ్రీరంగపట్నం దుర్గాధిపతి హోయస్సణేంద్రుడు నరసానాయకునికి బందీగా చిక్కాడు. అనంతరం శివసముద్రం, ఉమ్మాత్తూరు స్వాధీనమయ్యాయి. ఈ దండయాత్రలో భాగంగా తిరుచ్చి, తంజావూరు, చోళ మండలం, చేర, మధురై, శ్రీరంగపట్నం, గోకర్ణం, శివసముద్రం, ఉమ్మాత్తూరు, కేప్ కామెరిన్ లను నరసానాయకుడు విజయనగరంలో కలిపేశాడు.

యుద్ధంలో విజయం లభిస్తే రామేశ్వరం వస్తానని నరసానాయకుడు రామేశ్వర స్వామికి మ్రొక్కుకున్నాడు. ఆదవాని దుర్గాధిపతి కాచప్ప నాయకుని కుమారుడు చిన్న కాచప్ప నాయకుడు నరసానాయకునితో ఎంతో సన్నిహితంగా మెలిగేవాడు. ఆ కారణంగా రాయదుర్గం పరిధిలోని అగళి స్థల పరిపాలకునిగా చిన్న కాచప్ప నాయకున్ని నియమించాడు నరసానాయకుడు. రామేశ్వరం వెళ్ళే క్రమంలో చిన్న కాచప్పను వెంటనిడుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక నరసానాయకుని ఆజ్ఞ మేరకు రామేశ్వర స్వామి సన్నిధిలో ఒక దాన శాసనం ప్రకటించాడు. అగళి శంకరేశ్వర స్వామి అంగరంగ వైభోగాలకు, నిత్యధూప, దీప నైవేద్యాలకు అగళి స్థల పరిధిలోని పినగానహళ్ళి అనే గ్రామాన్ని చిన్న కాచప్ప నాయకుడు దానంగా ఇచ్చాడు. ఆ వెంటనే గ్రామానికి ఇమ్మడి కాచాపురం అంటూ నామకరణం చేశాడు. అయితే ఈ దానాన్ని అగళి స్వామి సన్నిధిలో కూడా ప్రకటించి ఆ మేరకు అక్కడ కూడా శాసనం వేయించాలంటూ నరసానాయకుడు ఆదేశించాడు.

రామేశ్వరం నుండి తిరిగి వచ్చిన కాచప్ప నాయకుడు శాలివాహన శకం 1419 పింగళి నామ సంవత్సరం, చైత్ర మాసం శుక్ల పక్షం నవమి, శనివారం రోజున శాసనం వేయించాడు. (క్రీ.శ. 1497 వ సంవత్సరం ఏప్రిల్ నెల 17వ తేదీ శనివారం రోజు) నరసానాయకునితో పాటు రామేశ్వరం వెళ్ళి వచ్చిన చిన్న కాచప్ప నాయకునికి నరసానాయకుని గుణగణాలు,నిజాయితీ ఎంతగానో నచ్చాయి. విజయనగర రాజ్యానికి ప్రస్తుత చక్రవర్తి నామమాత్రమైనందున రాజధానిలో కూర్చుని సకల భోగభాగ్యాలు అనుభవించక ఇలా ప్రాణాలకు తెగించి శతృ రాజులతో యుద్ధం చెస్తూ నిజమైన నమ్మినబంటులా వ్యవహరిస్తున్న నరసానాయకుని నిజాయితీ పట్ల కాచప్ప ముగ్దుడయ్యాడు. తాను కూడా ప్రభు భక్తికి మారు పేరులా నిజాయితీగా, నిక్కచ్చితంగా వ్యవహరిస్తానంటూ రామేశ్వర స్వామి సన్నిధిలో వాగ్దానం చేశాడు. యుద్ధభూమినుండి, రామేశ్వరం నుండి తిరిగి వచ్చిన నరసానాయకుడు రాజధాని చేరుకున్నాడు.

అదిగో ఇదిగో అనే లోగానే క్రీ. శ. 1498 లో పోర్చుగీసు దేశ నావికుడు వాస్కోడగామా కాలికట్ చేరుకున్నాడు. విదేశీ వాణిజ్యం వల్ల అధిక సంపదను సొమ్ము చేసుకోవచ్చనీ మొదట వీరి రాకను అనుమతించాడు నరసానాయకుడు. కాగా కాలికట్ రాజు జామెరిన్ తో మొదట స్నేహం కొనసాగినప్పటికీ ఆ తర్వాత పోర్చుగీసులు గర్వం తలకెక్కి విభేదించారు. దీంతో వాణిజ్య అనుమతులు రద్దయ్యాయి. ఫలితంగా వాస్కోడగామా వెనుదిరిగి వెళ్ళి తిరిగి క్రీ. శ. 1502 లో వచ్చాడు. వచ్చీరావడంతోనే కాలికట్ నగరంపై ఫిరంగులతో దాడి చేశాడు. రేవులో దిగి అక్కడ దొరికిన 800 మంది మత్స్యకారులను చంపేశాడు. ఆ వెంటనే క్రీ. శ. 1503 లో తమ రక్షణ కోసం కాలికట్ లో ఓ కోటను కట్టుకున్నాడు. కొచ్చిన్ రాజు సహకారంతో అక్కడ ఓ ఫ్యాక్టరీ కట్టుకున్నాడు. పోర్చుగీసు వారికి ఆశ్రయం ఇచ్చినందువల్ల కాలికట్ రాజు కొచ్చిన్ రాజుపై ఆగ్రహించి నిరంతర యుద్ధాలకు పాల్పడ్డాడు. పోర్చుగీసుల నుండి ఫిరంగుల సాంకేతిక పరిజ్ఞానం సంపాదించుకునేందుకు గాను నరసానాయకుడు ఈ విషయంలో మౌనం వహించాడు.

ఎన్నెన్నో యుద్ధాలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి అటు సాళువ నరసింహరాయలకు, ఇటు రెండవ నరసింహరాయలకు విజయ పరంపరను అందించిన నరసానాయకుడు సాళువ నరసింహరాయల చివరి కోరికను నేరవేర్చలేక పోయాడు. కొండవీడు, ఉదయగిరి, రాయచూరు, ముద్గల్లు దుర్గాలను ఆక్రమించలేకపోయాడు. రాజ్యాన్ని పూర్తిస్థాయిలో విస్తరించ లేకపోయినప్పటికీ శతృవులను విజయనగర భూభాగాల్లో కాలుమోపనియ్యలేదు. రెండవ నరసింహ రాయల పట్ల కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ అక్కడ ఆయన స్వార్థం ఎక్కడా కనబడదు. ఎప్పటికప్పుడు తన చక్రవర్తిని అంత: కలహాల నుండి కాపాడాలన్న తాపత్రయమే తప్ప మరో స్వార్థం లేదు. సామ్రాజ్య పరిరక్షణకు ప్రాణాలు తెగించి పోరాడాడే కానీ విలాసవంతమైన జీవితం గడపలేదు.
ఈ నేపథ్యంలో క్రీ.శ. 1503 లో నరసానాయకుడు తీవ్ర అశ్వస్థతకు గురయ్యాడు. ఆరోగ్యం బాగా క్షీణించింది. రాజవైద్యులు తమ శక్తి మేరకు వైద్యం అందిస్తున్నారు. ఎందరెందరో ప్రముఖులు, సామంతులు నరసానాయకుని ఆరోగ్యం కుదుట పడాలని దేవుడ్ని ప్రార్థించారు. దేవుళ్ళకు మాన్యాలిచ్చి ప్రాణాలు కాపాడాలంటూ వేడుకున్నారు. అలాంటి వారిలో కర్నూల్ జిల్లా పాణ్యం పాలెగాడు ఒకరు, బొక్కసం దేవప్ప నాయకుని కుమారుడు హోనప్ప నాయకుడు పాణికేశ్వర గ్రామాన్ని దేవునికి మాన్యంగా ఇచ్చి నరసానాయకున్ని కాపాడమంటూ వేడుకున్నాడు. వీరందరి ప్రార్థనలు నరసానాయకున్ని రక్షించలేక పోయాయి. క్రీ.శ. 1503 సంవత్సరంలో సెప్టంబరు 17వ తేదీ అనంతరం నరసానాయకుడు కన్నుమూశాడు.

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *