May 17, 2024

పెళ్లి చూపులు

రచన:దినవహి

“ఒరేయ్ బాబాయ్! అసలు నాకు పెళ్లి అవుతుందంటావా ?” పెద్ద డౌట్ వచ్చింది అబ్బాయికి.
“అలా అనకురా అబ్బాయ్!, వరసకు బాబాయిని కాని, వయస్సులో నీకన్నా కుర్రాణ్ణే కదరా. నీకు పెళ్ళవకుండా నేను చేసుకోనని ఎరక్క పోయి మీ నాన్నకు మాటిచ్చేసాను. ఆనాడిచ్చిన మాట ఇప్పుడు శాపం అయిపోయింది నా ప్రాణానికి.”
“సర్లేరా బాబాయ్.. ఏడవకు.. నా పెళ్లి త్వరగా అవాలని మొక్కుకున్నావనుకో, నా పెళ్లి అయిపోతుంది, కొసరు నీ పెళ్ళీ అయిపోతుంది.. “
“చూస్తే ముదిరిపోయావు నువ్వు – చూడకపోయినా ముదిరిపోతున్నాను నేను.. ఏమో నాకేం రాసి పెట్టుందో..”
“అయినా ఇన్ని సంబంధాలు చూసావు ఒక్కటీ కుదరకపోవడం ఏంటిరా…అబ్బాయ్ ?”అని బాబాయ్ ఇదయ్యాడు …
……

రీలు కొంచెం వెనక్కి త్రిప్పితే .
అబ్బాయ్ పని చేసే ఆఫీస్ కాంటీన్ .. అబ్బాయ్ –ఎదురుగా బాబాయ్ కూర్చుని కాఫీ త్రాగుతున్నారు.
“ఒరే అబ్బాయి, ఇంకాస్సేపట్లో పిల్లగలవాళ్లు ఇక్కడికొస్తారు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడు.. ఇదన్నా ఖాయం చేసుకుందాం”అన్నాడు బాబాయ్.
“బాబాయ్ కొంచెం నెమ్మదిగా మాట్లాడు, ఎవరైనా వింటారు.. “
“వింటే విననియ్యరా, మనమేం బూతు పని చేస్తున్నామా, బూతులు మాట్లాడుతున్నామా..”
ఈలోగా అబ్బాయ్ కొలీగ్ ఒకతను వీళ్ల దగ్గరికి వచ్చాడు..
“ఏంటి రాంబాబు, ఏదైనా పెళ్ళి సంబంధమా, అప్పుడే బూతుదాకా వచ్చేసారంటే కుదిరిపోయినట్టుంది”
సిగ్గుపడిపోయాడు రాంబాబు..
“అబ్బే.. ఏం లేదు..తర్వాత చెప్తాగా” అని గుమ్మందగ్గరకి అతన్ని సాగనంపాడు..
ఈలోగా మరో ఫ్రెండ్ వచ్చి,
“హలో రాంబాబూ! నీ కేసేమయింది.. Reinstate అయిపోయావా”అన్నాడు. గతుక్కుమన్నాడు రాంబాబు..
“.ఆ .ఆ ..అదా .అది అయిపోతుంది.. నేన్తర్వాత చెప్తా..”అని దాటేయ బోయాడు. అదే సమయానికి,
“ఇక్కడ రాంబాబుగారెవ”రంటూ, ఇద్దరు చిన్నవయసు పెద్దమనుషులు లోపలకి వచ్చారు.
“ఆ ఆ … నేనేనండి, రాంబాబు.. రండి మా బాబాయ్ అక్కడున్నాడు.. అక్కడ మాట్లాడుకుందాం ..”అని బాబాయ్ దగ్గరికి తీసుకొచ్చాడు..
“బాబాయ్ .. వీళ్లు నాకోసం వచ్చారు. ఇతను మా బాబాయ్, నా విషయాలన్నీ ఇతనికి తెలుసు.”
బాబాయ్ అంటే .. పాత సినీమాల్లో పెరుమాళ్లు, నాగయ్యల్లాగా ఉంటాడనుకున్న ఆగంతకులు, మరీ heightలో వేణుమాధవ్ కన్నా ఓ గుప్పెడున్న సదరు బాబాయిని చూసి ఖంగుతిన్నారు. నమస్కారం అనాలా ఒద్దా అనుకుంటూ చేతులు జోడించారు. – బాబాయ్ పెద్దమనిషి తరహాలో మాట్లాడబోయాడు
“ఇంతకీ మా సంబంధం మీకెవ్వరు చెప్పారు”అన్నాడు అబ్బాయ్…అది బాబాయ్ దృష్టిలో అడగకూడని ప్రశ్న.. “సీతంపేటలో పెళ్ళిసంబంధాల బ్యూరో ఆయన దగ్గర లిస్ట్ తీసుకున్నాం, అందులో మీ సంబంధం కనిపించింది, మాకు తగిన సంబంధమని వచ్చాం.”
“అందులో మా పాత అడ్రస్సు ఉంది, ఇప్పుడు ఇల్లు మారిపోయాం కదా ”
“అవునండి, ఆ ఇంటికి వెళ్లాం .. అక్కడ సీతమ్మగారట, ఆవిడ చెప్పారు.”
“సీతమ్మ గారా … ఆవిడ పేరుకి సీతమ్మ కాని నిజానికి శూర్పణఖ.. నా గురించి ఉన్నవీ లేనివీ చెప్పేసి ఉంటుంది.. అవునా ?” .. — వాళ్లు ఏదో చెప్పేలోగా మళ్లీ అబ్బాయే
“నాతో పని చేస్తున్న ఒక అమ్మాయి, అర్జంట్ పనుండి శలవు పెట్టాల్సొచ్చింది. కాని నవంబర్ నెల శలవులన్నీ అయిపోయాయ్ .. నన్నొచ్చి రిక్వెస్ట్ చేసింది.. ఆడ కూతురు .. కాదనలేక ఆవిడ సంతకం అటెండన్స్ రిజిస్టర్ లో పెట్టాను. కరెక్ట్ గానే పెట్టాను, అదేదో ఇండిసిప్లైన్ అన్నట్టు సస్పెండ్ చేసేస్తారా …
నిజమేనండి .. క్రొత్త సినీమా కదా … బాపుగారి సీతా కళ్యాణం సినీమాకు మాటనీకి వెళ్లాను, బాస్ వచ్చేటప్పటికి సీటులో లేనట, ఆఫీస్ టైములో సినీమాకు వెళ్లానట, మరి మాటనీలు ఆ టైములోనే కదా ఉంటాయి, ఆ మాత్రం తెలియదా ? అదికూడా ఇండిసిప్లినేనట .. నేను వెళ్లింది .. ఏదైనా లవ్ సినీమాకు వెళ్లానా.. రాముడి సినీమాయే కదా.. అంత మాత్రానికే అందరూ కలసి నన్ను సస్పెండ్ చేస్తారా.. పైగా మా యూనియన్ ప్రెసిడెంట్ ఇంటికి నే పెళ్ళికి వెళ్లి గిఫ్ట్ ఈయలేదని, నాకు సపోర్ట్ రావడం మానేసాడు.. అందుకనే కేసు ఇంకా సెటిల్ కాలేదు.. నాకూ టైమొస్తుందండి.. ఒక్కొక్కణ్ణీ ఏకి పారేస్తాను….” ఊగిపోయాడు అబ్బాయ్ “ఇవన్నీ మాకు తెలియదండి, సీతమ్మగారు మాకు చెప్పలేదండి..”అన్నారు ఆగంతకులు.
“అనుకున్నంతా అయింది” అని బాబాయ్ స్వగతంగా అనుకుని, ప్రకాశంగా
“అబ్బే.. అదంతా ఏదో పాత సంగతండి. వారం పది రోజుల్లో మేటర్ సెటిల్ ఐపోతుంది. మా వాడి ఉద్యోగం పాత బాకీలతో సహా ఆఫీసు వాళ్లిచ్చేస్తారండి.. మీరు నమ్మండి.”
“పాత బాకీలంటావేంటి బాబాయ్. నాకు ఆ లక్షరూపాయల బాకీ తప్ప మరే బాకీ లేదు.”అన్నాడు అబ్బాయ్.
“లక్షరూపాయలు అప్పా?”
“అబ్బ ఉండరా నే మాట్లాడుతున్నా కదా”
“అది పెద్ద బాకీ కాదు బాబాయ్, వీళ్లిచ్చే రెండు లక్షల్లోనూ ఒకటి వాడికిచ్చేస్తే బాకీ “శ్రీ రామ”. వడ్డీ అడిగితే పండగలకీ పబ్బాలకీ మనవాళ్ళు కట్నాలేవో ఇస్తారు కదా, దాంతో రైటాఫ్ చేయించేస్తాను..”
వచ్చిన వాళ్లకి రాంబాబు కారెక్టర్ పూర్తిగా అర్థమయిపోయింది..
ఏకకాలంలో ఒకరి ముఖం ఒకరు చూసుకుని, ముక్త కంఠంతో “మళ్లీ కలుస్తా”మని పలికినవారై ఉలుకు పలుకు లేకుండా కదిలారు. .
“ఏమండీ .. మాట్లాడకుండానే వెళ్లిపోతారేంటి ?”అంటూ వెంటబడ్డాడు రాంబాబు.
“వాళ్లకి ఒక్క డైలాగ్ లేకుండా, స్క్రిప్ట్ అంతా నువ్వే చెప్పేసావు. అక్కడకీ చిలక్కి చెప్పినట్టు చెప్పాను.. వినలేదు..” అన్నాడు బాబాయ్
“ఎలా వింటాను బాబాయ్.. నువ్వు నన్ను చిలక అనుకున్నావు కాని, అబ్బాయిననుకోలేదుగా” అన్నాడు అబ్బాయి. “ఈ తెలివికి లోటులేదు మా వాడికి” అని లోపలనుకున్నాడు బాబాయ్ ..
బాబాయ్, అప్పుడు ఆగంతకులు చెప్పిన సీతంపేట మారేజ్ బురోకు వెళ్లి .. మొత్తానికి బాబాయ్ ఓ సంబంధం సెలెక్ట్ చేసాడు. అబ్బాయికి చెప్పకుండా వాళ్లతో కరెస్పాండెన్స్ చేసాడు. వాళ్లను మొత్తానికి ఒప్పించి పెళ్లి చూపులుదాకా పరిస్థితి తీసుకువచ్చాడు బాబాయ్.
“బాబాయ్ .. వీళ్ళకి నా విషయాలన్నీ చెప్పావా?” అడిగాడు అబ్బాయ్
“అన్నీ నే చెప్పాను. నువ్వింక పిచ్చి వాగుడు వాగకు.”
“సస్పెండయినా, మళ్లీ నా ఉద్యోగం నాకొచ్చేసింది .. అది చెప్పావా”
“నువ్వింక నోర్ముయ్, రేప్పొద్దున్న మా ఫ్రెండ్ కారు తెస్తాను,అందులో పెళ్లి చూపులకి వెళ్దాం, అమ్మా నువ్వూ రెడీగా ఉండండి.. ఇంకో విషయం.. నువ్వక్కడ అడ్డమైన వాగుడు వాగకు.. నాక్కోపం వచ్చిందంటే నీ మూతికి నల్ల ప్లాస్టర్ వేసేస్తాను.” అని బాబాయ్ వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు.
అబ్బాయ్ వెళ్తున్న బాబాయిని ఆపి పిల్ల వివరాలు సేకరించాడు ..
బాబాయ్, మర్నాడు వాళ్ల ప్రెండ్ కారు తానే డ్రైవింగ్ చేసుకుని వచ్చాడు.
“ఒరేయ్ అబ్బాయ్ , రెడీ యేనా” అంటూ లోపలకి వచ్చాడు.
“రావయ్యా మరిదీ, మొత్తానికి మీ పిల్లాణ్ణి ఇంతవరకూ తీసుకొచ్చావు.. కూర్చో కాఫీ ఇస్తాను.” అంది కాంతమ్మగారు.
“ఎందుకే అమ్మా .. అక్కడ పెళ్లివారిస్తారు కదా?” సినీమాల్లోనూ అక్కడా చూసిన సీనులు గుర్తు చేసుకుంటూ అబ్బాయ్ అన్నాడు.. బాబాయ్ కి మతిపోయింది,..
“ఏడిశావులేరా, ఇదిగోనయ్యా కాఫీ”అని “ఎలాగైనా నువ్వే నడుం కట్టుకుని, ఆ మూడు ముళ్ళు వీడిచేత వేయించాసావంటే .. ఆ లోకంలో ఉన్న మీ అన్నగారు ఆనందిస్తారు.” ముక్కు చీదుకుంది కాంతమ్మగారు.
“అంతేకాదు వదినా, ఇప్పుడు పెళ్లి చేస్తే కాని నా పెళ్లి కుదరదు. అలా అని అన్నయ్యకు మాటిచ్చాను కదా.”
“నిజమే ఆయన శ్రీరామ చంద్రుడు, నువ్వు అన్న మాటకు కట్టుబడ్డ లక్ష్మణస్వామివి.” అని నవ్వింది.
రాంబాబు, బాబాయ్, కాంతమ్మగారు మొత్తానికి పెళ్లి చూపులకు బయల్దేరారు. మంచి పనికి ముగ్గురు వెళ్లకూడదని ప్రక్కింటి వాళ్ల పాపను తీసుకొచ్చారు. నలుగురూ కారుదగ్గరకి వచ్చారు.
“ఒరేయ్ అబ్బాయ్!నువ్విలా రా ముందు సీటులోకి. ! వదిన వెనక సీటులో కూర్చుంటుంది. “
అని బాబాయ్ డ్రయివింగ్ చేయబోయాడు.
కెవ్వు అని కేకేశాడు అబ్బాయ్ .. చూస్తే అతని చేతిలో కారు డోర్ హేండిల్ ఉంది.
“కారు సెకండ్ హాండ్ కొంచెం రిపేర్లున్నాయ్ .. మా ప్రెండ్ చెప్పే ఇచ్చాడు .. సారీ.జాగ్రత్తగా సర్దుకో” అన్నాడు బాబాయ్.
కాంతమ్మగారు అది అపశకునంలా ఫీల్ అయి
“ఒరేయ్ అబ్బాయ్, డబ్బులిచ్చి ఈ పాపచేత ఓ పాల పాకెట్ తెప్పించు, శకునం వస్తుంది.”అంది.
కారు స్టార్ట్ చేసాడు బాబాయ్ . “గుయ్ గుయ్ మని కొంచెం సేపు పేచీ పెట్టి, ఒక్క దూకున ముందుకు కదిలింది ఆ పాత ఫియట్ కారు. ఎదురు రాకుండా పాప కొట్టుదగ్గరే ఉండిపోయింది.
“అయ్యో పాప!” అంది కాంతమ్మ గారు
“…య్యోపాప”అన్నాడు అబ్బాయ్
“పాపేంటి” అన్నాడు బాబాయ్
అబ్బాయ్ దిగివెనక్కి వెళ్లాడు.. బాబాయ్ ఫ్రెండ్ కారుని రెండు టైర్లు వెనక్కి నడిపాడు. కొట్టు దాటి వెనక్కి వెళ్లిపోయిందా పాతకారు. ఈలోగా ఓ పెద్దమనిషి ఆ ప్యాకెట్ పిల్ల చేతీలొంచి తీసుకుని ఎదరనుంచి వఛ్చి వదినగారి కిచ్చాడు.
“ఒంటి బాపడి శకునం”అని కాంతమ్మగారు అనుకుని పాల పాకెట్ విండో లోంచి కోపంగా విసిరేసారు. పాపనెక్కించుకుని కారు కదిలింది.
సరే పెళ్లి వారింటికి చేరారు పెళ్లి బృందం. ఆగేటప్పుడు పాత ఫియట్ చేసిన ఘీంకారానికి, కంగారుపడి బయటికి వచ్చారు.. ఆడపిల్ల వాళ్లు. వచ్చినవారు మగపిల్లాడి వారని మరి కొంచెం కంగారు పడి .. ముఖాన నవ్వు పులుముకుని, వీరిని వారు లోపలకి తీసుకెళ్ళారు.. మర్యాదలు పూర్తి చేసారు.
అమ్మాయిని తీసుకొచ్చారు. సన్నగా నాజుగ్గా బానే ఉంది.. బాగా చదువుకుందని కొంచెం దళసరిగా ఉన్నకళ్ళద్దాలు చెప్తున్నాయి. పై కొంగుతో ఆడతనాన్నిదాచుకుంది.. ఆ కొంగే కొంచెం దగ్గరకి లాగి పెరిగిన వయసు దాచుకుంది.
“ఏం పేరమ్మా?” కాంతమ్మగారు ప్రశ్నించింది.
“మంజరి”
“అమ్మా.. రైటేనే ఇందులో ఉంది.. ఎమ్. మంజరి కదా ?” తను బాబాయ్ ని అడిగి వ్రాసుకొన్న కాగితంలో చూసి చెప్పాడు రాంబాబు.
“ఎంతవరకు చదివావ్”
“ఎం ఏ” రాంబాబు చెప్పాడు లిస్ట్ చూసి.
“వంటా వార్పూ వచ్చా?” అడిగింది కాంతమ్మగారు.
“వంటొచ్చు – బాబాయ్ ! వార్పు సంగతి చెప్పలేదేంటి నువ్వు”అన్నాడు అబ్బాయి బాబాయిని చూసి
కాంతమ్మగారికి కొడుకు ధోరణి చికాగ్గా ఉంది..
“మంజరమ్మా! పెళ్ళైతే, నేను మీ దగ్గరే ఉంటాను.. జాగ్రత్తగా చూసుకుంటావా?”అని నవ్వుతూ అడిగింది..
“మీ అబ్బాయిని లిస్టు చూసి చెప్పమనండి”
కాంతమ్మగారు అవాక్కయ్యారు..
అబ్బాయ్ ఇంటర్వ్యూ మొదలెట్టాడు ..
“నువ్వు ఉద్యోగం చేస్తావా?” అడిగాడు రాంబాబు
“మీరు చేస్తున్నారు కదా, మళ్లీ నేనెందుకు?” అంది మంజరి.
“అలా అనికాదు, ఒకవేళ నేను మళ్లీ సస్పెండ్ అయ్యాననుకో .. జీతం సరిపోవాలిగా మరి.”
బాబాయ్ నెత్తి మొత్తుకున్నాడు.. ఆ అమ్మాయి మాట్లాడలేదు .. వినలేదో, వినీ ఊరుకుందో..
మళ్లీ రాంబాబు.. “నీకు ఆ కళ్ల జోడు ఎప్పట్నించి ఉంది..?”
“నాలుగైదేళ్లనుంచి”
“తీస్తే కనబడదా? భయమా”
“మీకు ఆ టోపీ ఎప్పట్నించీ .. , తీస్తే మీ బట్టతల అందరికీ తెలిసి పోతుందని భయమా?”
టోపీ విసురుగా తీయబోయాడు, కంగారులో కళ్ళజోడు పడిపోయింది.. వస్తువులేవీ కనపడటంలేదు, మంజరి కళ్లజోడిచ్చి, టోపీ సర్ది “చూపు బాగోలేదు మీకు— ఇంక పెళ్లి చూపులకెళ్లడం మానేయండి.. శుభ్రంగా ఓ ఆయాను పెట్టుకోండి, సర్వీస్ చేస్తుంది…” అని తెగేసి చెప్పింది.
“వదినా మీ వాడి నిర్వాకంవలన ఈ సంబంధం కూడా … ఇంతే సంగతులు.”బాబాయ్ బాధపడ్డాడు ..
“ఆ పిల్ల మన ఇంటి కోడలవుతుందనుకున్నానయ్యా.”ఆవేదన వ్యక్త పరచారు కాంతమ్మగారు
“వదినా .. ఇంక నాకు ఓపిక అయిపోయింది, ఆగలేను. ఇక టైము వెస్ట్ చేయను. నువ్వూ ఈ ఇంటికో కోడలు కావాలంటున్నావు కనుక,నన్ను నీవు కొడుకుగానే ఆదరిస్తున్నావు కనుక, మంజరి కిష్టమైతే, నేనా పిల్ల మెళ్ళో మూడు ముళ్ళు వేసేస్తాను..నాకు పెళ్ళీ అవుతుంది,నీకు కోడలూ వస్తుంది…
…నువ్వేమంటావు మంజరీ” అడిగాడు బాబాయ్ .
చదువుకున్న పిల్ల కనుక సిగ్గుపడకుండా
“ఓ.కే” అంది..
“బాబాయ్ మరి నా పెళ్లో… ?”అడిగాడు అబ్బాయ్
“పుట్టగానే, మా పిల్లలు ఇంక ఆ పనిమీదే ఉంటారు లెండి, ఏమంటారు బాబాయ్” అని నవ్వింది మంజరి.

—oooOOOooo—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *