May 7, 2024

సమన్విత

రచన: లలితా రామ్

ఎక్కడో పుట్టి, ఎవ్వరి దగ్గరో పెరిగిన నేను, ఈ అసమాన్యమైన దశకు ఎలాగ చేరానబ్బా అనుకున్నాడు జయకాంత్.
ఒక్క మనిషి తన గురించి తాను ఇంతగా అలోచించడం ఎందుకు? ఇది మొదటి సారి కాదు. ఆఖరి సారి అసలు కానే కాదు.
అదీ అద్దం ముందర నుంచుని, కనుబొమ్మలు ముడుస్తూ, గడ్డం రాసుకుంటూ. తన ఆకృతిని గమనిస్తూ, స్వీయ వ్యక్తిత్వ వర్ణనలో కొద్ది సేపు మునిగి, ఆత్మ స్తుతి, ఆత్మ ప్రదర్శనం చేసుకున్నాడు. ఎంత వారలకైనా ఆత్మ స్తుతి తప్పదు. అది ఆత్మ రక్షణకు అడ్డు పడుతుంది. తనకు తెలియని విషయం కాదు. కానీ ఆ ఇనప హస్తాల నుండి తప్పించుకోలేను, అనుకున్నాడు. పైకి చెప్పుకోలేడు. ఆంతరంగిక నాటకీయం అలవాటు అయిన తరువాత మనిషి మారాడు. ముఖమే మారింది.
కొత్తగా కొన్న న్యూ జీ.ఇ ఫోన్ మొబైల్ పైన “కెవ్వు కేక” అంటూ పాట మోగింది. ఆ పాట విన్నప్పుడల్లా జయకాంత్ ముఖం ఎరుపెక్కుతుంది.
ఒక వారం క్రితం అతి ముఖ్యమైన మీటింగ్ మధ్యలో, గంభీరమైన చర్చల మధ్య ఈ పాట మోగడముతో, సాంస్కృతిక సహాయ మంత్రిగారు చర్చ మానేసి, పాటకు అనుగుణంగా తల ఊపడం మొదలెట్టి, మనసు గుప్త లోకాల వైపు మరలించారని అతనికి అర్ఠమయ్యింది.
ముఖం ఇంకాస్త ఎరుపెక్కి, నవ్వొచ్చింది.
సాంస్కృతిక సహాయ మంత్రి రవివర్మగారు, సమాన నామధేయుని లాగ చిత్రకారుడు కాకపోవచ్చు గానీ, చలన చిత్రాలలో “చలాకీ తండ్రి, తుపాకీ మామయ్య”, “పిరికి బాబాయి” వంటి పాత్రలు తెగ ధరించి, విసుగెత్తి, రాజకీయాలలో దిగారు.
ఇంకొక ఆరు నెలలలో, ఇటలీలోని వెనిస్ లో జరగబోయే అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనములో తెలుగునాడు నుండి ఎటువంటి నాటకం ప్రదర్శించాలి అన్న చర్చ కోసం సమావేశం!
గవర్నమెంటు వారి గెస్టు బంగళాలో సాయంత్రము ఆరు గంటలకు సమావేశం మొదలయింది.
రవివర్మగారు ఒక సిగరెట్టు నోటిలో పెట్టుకొని, ప్రక్కన కూర్చున్న అనంతరామన్ గారి ముఖం పైన పొగ వూదారు, నవ్వు మొహంతో. అనంతరామన్ గారు “నో స్మోకింగ్” అన్న బ్యానరు వైపు చూశారు, కనుబొమ్మలెగరేస్తూ.
రవివర్మ భుజాలు తడుముకోకుండా, “అబ్బే! ఇది లో నికోటీన్. సిగరెట్టు కింద లెక్కకు రాదు.” అన్నారు.
అనంతరామన్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయనకు కళాపోషణ, కళాత్మక, కమనీయ కనకాంగుల పోషణ ఎక్కువ. పగలు ముద్దుగా పేరు పెట్టుకున్న “ సుకుమార సామగ్రి, గట్టి సామగ్రి” అంటే సాఫ్ట్ వేర్, హార్డు వేర్ వ్యాపారం, వాటికి సంబంధించిన నివేదన పత్రాల పరిశీలన. రాత్రిళ్ళు ఇంటి నుండి తప్పించుకుని, మధ్య వయస్సున్న శరీర యంత్రంతో వీలైనంత వరకూ, పానీయ లీలా తరంగిణి.
ఆయన ఏది అయితే అనాలోచితమైన తెగువతో చేయ్యడానికి పూనుకుంటాడో, అదే కార్యం, రవివర్మ మానసిక స్థితి ద్వారా అనుభవించి, సుఖిస్తాడు. తనదే పై చేయి కాబట్టి, అనంతరామన్ గారి ప్రపంచం గురించి తెలుసు కాబట్టి, ఆయనను ఆట పట్టించడం వర్మగారికి ఒక అత్యభిరుచి.
రవివర్మగారు, ఎప్పటి లాగా కార్యక్రమ పట్టిక చదవలేదు! అసలు చూడను కూడా లేదు. సెక్రటరీ ట్విట్టర్, ఈమెయిల్ చూసుకుంటుంది. తన పని విషయములో ఆమెదే పై చేయి.
అన్ని రకాల ఉల్లాస రాక్షసులకూ అనుగ్రహంతో వరాలిచ్చిన సర్వవ్యాపకుడు బ్రహ్మ ప్రత్యక్షమై, తనకు ఒకటేమిటి ఖర్మ, కొన్ని వరాలిస్తే, తనేమి అడగాలో ఒక లిస్ట్ వేసుకున్నాడు.
సెక్రటరీ లిల్లీకు మిమిక్రీ నేర్పించి, మనిషిని అగోచరం చేసి, మీటింగులకు లాక్కెళ్ళిపోతే, ఆమె మాట్లాడుతుంటే, స్త్రీ కంఠ ప్రయోగమైనా గానీ, తాను ప్రతీ మీటింగులో లిప్ సింక్ చేయాలని, ఆయన కాళ్ళను ముద్దాడి మరీ కోరుకుంటాడు.
ఇంకొక వరం? మరి తాను కోరగానే నచ్చిన వంటకాలు తన ముందర వుండాలి. తన భార్యామణి వంట విషయము మరిచిపోవాలి. కొద్దిగా వణికాడు. జిహ్వ చాపల్యం; ఆవిడకు వయసు వస్తున్న కొద్దీ టీవీ సీరియల్సు లో మునిగి, మాడిన అరటి కాయ వేపుడు, చారు నీళ్ళ వంటి సాంబారు తప్ప, వంట మరచినట్టుంది.
“ఇంకా ఎంత మంది రావాలి?” రవివర్మగారు ప్రశ్నించారు.
“తన్వితశ్రీ గారు, భావన గారు, హరిప్రకాష్ గారు, అంతే!” అన్నారు జయకాంత్ మొబైల్ పైన తన ప్రతిబింబం గమనించుకుంటూ. తాను ప్రముఖ తెలుగు సినిమా ప్రొడ్యూసర్! అయినా మనసులో తెలుగు సినిమా హీరోల కన్నా బాగుంటాను అన్న ఒక అభిప్రాయం.
“ఇంతకీ హరిప్రకాష్ ఎవరయ్యా? నా సామి రంగ! నేను వస్తున్నాను, టైం కి రావాలని కూడా తెలియదా? రెండు గంటల్లో నేను మళ్ళీ గవర్నమెంటు నెహ్రూజీ జూబిలీ హాల్ కు పరిగెత్తాలి. ఈ ట్రాఫిక్కులో గంట పడుతుందయ్యా. అసలే నా కారు బాలక్రీడా గిలక వాహనం. నేను వెళ్ళేటప్పటికి అన్నగారు ఫేన్ ఎక్కి కూర్చుంటారేమో.”
“మన ప్రోగ్రాంకు కొత్త డైరెక్టర్ అండీ. మీరేమీ కంగారు పడకండి. అదిగో, కార్లు వచ్చినట్టున్నాయి.”
కార్లు వచ్చాయి అనగానే రవి వర్మ గారికి పరమోత్సాహం, అనంతరామన్ గారికి వెన్నులో వేడి మొదలు అయ్యినట్టే!
ఎందుకంటే తన్వితశ్రీ ఈ మధ్య వరకూ గ్లామరస్ హీరోయిన్. మేకప్పు తీసి వేస్తే అందంగా ఉంటుంది.
కానీ అది మానదు. రెండు అంగుళాల ఫౌండేషన్ క్రీం, టమాటో రంగు లిప్స్టిక్, ఫాల్సు ఐ లేషస్ పెడితే గానీ బెడ్ రూము నుండి దిగదు. ఈ మధ్యే రాజకీయాలలో ప్రవేశించింది. భావన పటేల్ గొప్ప కూచిపూడి కళాకారిణి. ద్రౌపది వంటి అందగత్తె.
వివిధ రాష్ట్రాలతో పరిచయం ఉన్నవారిని, చదువుకున్న వారిని, అంతర్జాతీయ అనుభవం ఉన్నవారిని ఎన్నుకున్నాడు జయకాంత్. కల్చరల్ ప్రోగ్రాంకు, అంతర్జాతీయ సంస్థకు కోట్ల విరాళం ఇచ్చాడు. అందుకని నిర్ణయాలు చేసే హక్కు పొందాడు.
అందరూ కూర్చున్నారు. టీ, వేడి, వేడి పకోడీ, జిలేబీ తో మొదలయ్యింది చర్చ.
తన్విత ఫ్రెంచి పెర్ఫ్యూం పట్టించి, కొత్తగా పెంచుకుంటున్న పెర్షియన్ పిల్లితో సహా వచ్చింది.
“అబ్బో! మీ పిల్లి అందంగా వుందే! పేరేమిటి? ” అడిగారు అనంత రామన్ గారు.
“మోనాశ్రీ. పెర్షియన్ పేరు, నా పేరు కలిసి పెట్టాను.” తన పేరు వినగానే మోనాశ్రీ ఆవలించింది.
“ఇంతకీ మనం ఏమి నాటకం వేయదల్చుకున్నాము?” అన్నాడు హరిప్రకాష్.
వ్యావహారికాంధ్ర మహాభారతమును క్షుణ్ణంగా చదివిన వర్మగారు అన్నారు. “నా ఉద్దేశంలో భారతంలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ మెయిన్ ఎపిక్. అర్జునుడు, కృష్ణ పరమాత్ముడు, ద్రౌపది, అభిమన్యుడు, ఉత్తర, కర్ణుడు ఇలాగ ఎన్నో సమ్మోహనమయిన పాత్రలు.
మన సంస్కృతి, రాజనీతి, తత్వ శాస్త్రాలు, భావానుబంధాలు కళ్ళకు కట్టినట్టు చూపించవచ్చు, సంగీతం, నృత్యం మేళవించి. ఎమంటారు భావనగారు? భారతానికి వున్న జనప్రీతి ఆద్యంత రహితం కదా.”

“బాగానే వుంది అలోచన. మా డాన్సు స్కూలులో ద్రౌపదీ పరిణయము, శర్మిష్ఠ వంటి డాన్సు బాలేస్ చేశాము. ఒక నెలలో మేము సిద్ధమవ్వగలము.”
“ద్రౌపదీ పరిణయం చేయవచ్చు. అందులోని అంతరార్ధము ఫారినర్సుకు తెలుస్తుందా?” అన్నాడు హరిప్రకాష్.
“మీరేమంటారు వర్మ గారు? యూరపులో కూడా ఇటువంటి కథ విని ఉండరు.” అన్నాడు జయకాంత్.
వర్మగారు గొంతు సవరించుకున్నారు. కళ్ళజోడు తీసి చేతిలో పెట్టుకున్నారు.
“వెల్! నాది మాస్కులైన్ దృక్పధం. గ్రీకు పురాణాలలో ఎన్నో వింత కథలు వున్నాయి. పరమేశ్వరుడు ఒక కన్యకు వచ్చే జన్మలో ఐదుగురు భర్తలు కలుగుతారు, అని వరం ఇచ్చాడు, ఆమె ఆత్రుతగా ఐదు సార్లు పతి అన్న మాట అనేసరికి. ఆ కన్య అగ్ని గుండములో ద్రౌపదిగా పుట్టింది.
ఇందులో మనము చూపెట్టవలసినదేమిటంటే, ఈ పురాణానికి మూలం ద్రౌపది.
ఆమె ఐదుగురినీ ఒకే విధంగా ప్రేమించినట్టుగా పురాణంలో చెప్పినా, నా ఉద్దేశంలో అర్జునుడే ఆమెకు ప్రియసఖుడు. తన చిన్న కోరికలూ, ఇష్టాలూ, కష్టాలూ అతనితోనే పంచుకుంటుంది. ధర్మరాజుని ఒక తండ్రిగా, భీమసేనుడిని ఒక అన్నగా, నకుల సహదేవులను కొడుకులుగా భావించిందేమో, అని నా అభిప్రాయం. ఆమెగా నిర్ణయం తీసుకోగల స్వాతంత్ర్యం ఇచ్చి వుంటే కథ మారి వుండేది. ఐదుగురుకీ ఆమె మీద వున్న విపరీత ఆరాధన వల్ల, ఆమెకు ఏర్పడిన హానికి, కురుక్షేత్రం జరిగింది. అంటే నా ఉద్దేశం స్త్రీ సృష్టికి మూలం అని. ”
భావన అన్నది, “భారతంలో గానీ, రామయణంలో గానీ విశేషాలు, మనం ఎన్నో విధాలుగా వ్యాఖ్యానం చేయగలం. ఇన్ మై ఒపినియన్, చక్కగా సెట్లు వేసి, మంచి సంగీతంతో, ఒరిజినల్ డాన్సస్ తో క్రియేటివ్ గా చూపించడమే కావలసినది. ద్రౌపది చాలా తెలివయినది అని నా నమ్మకం.
సత్య భామ అంతటిది ఆమెను, ఐదుగురినీ అంత మచ్చికగా ఎలాగ చూడగలుగుతున్నావు, భర్త ప్రేమ సంపూర్ణంగా పొందాలి, నాకు సలహా ఇవ్వవా అని అడుగుతుంది. శ్రీకృష్ణుడు రాజ నీతిలో ఎంత అమోఘమైన చాతుర్యం కలవాడో, ద్రౌపది మానవ బాంధవ్యాలలో అంత సూక్ష్మ బుద్ధి కలది. ఇవ్వన్నీ మనం స్టేజి పైన చూపించలేము. కానీ, మనం మరపు రాని విధంగా ప్రదర్శించాలి అనుకుంటే, ఈ పరిణయం ఎన్నుకోవచ్చు.”
తన్విత పిల్లి పిల్లను ఒడిలోకి తీసుకుంది. విలాసంగా అన్నది, “ద్రౌపది, సత్యభామ ఎప్పుడు కలిస్తిరి? అయినా ఆవిడ ఎంత మందిని పెళ్ళాడితే మనకేంటి? ఒక్కడికే వండి, చూసుకోలేక పరిషాన్ అవుతున్నారు లేడీస్. సినిమా డాన్సులు పెట్టండి. ఎవ్రీ వన్ విల్ల్ ఎంజాయి కదా.” అన్నది.
జయకాంత్ నవ్వుకున్నాడు. ఈవిడ రూలింగ్ పార్టీలో వుంది కాబట్టి, పిలవవలసి వచ్చింది. అయినా బాలెన్సు కావాలిలే. రకరకాల ఆలోచనలతోనే సక్సెస్ వస్తుంది.
తను సినిమా వాడే. కళాత్మకమైన, ఇంపైన, సరసమైన సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నాడు. వాటిల్లో కూడా ఒక ఐటెం సాంగు, అక్కరలేని దౌర్జన్యం, దాదాలూ ఎందుకు పెట్టాలి, అనుకుని స్వచ్చమైన, రుచ్యమైన సినమాలను ధ్యేయం గా పెట్టుకున్నాడు.
కానీ లాభాల కోసం, అన్నిరకాల సినిమాలలో చేయి పెట్టాల్సి వచ్చింది.
అనంతరామన్ గారు తన పయిప్ వెలిగించారు, నో స్మోకింగ్ అన్న మాట వెనక్కి తోసేసి. గాఢంగా పొగ పీల్చారు.
“భారతం చాలా సారులు చూశాము. సినిమా పాటలు చూడాలనుకుంటే సినిమాలే చూపవచ్చు. కల్చరల్ ఫెస్టివల్ కదా. బహుశా ఇటలీలో సెట్టిల్ అయిన మన భారతీయుల కథ ఒక్కటి, మన రైటర్ సూర్యగంటి శర్మ గారిని రాయమంటే ఒక్క రోజులో రాసిస్తాడు.” అన్నాడు అనంత రామన్.
“మరి శర్మ గారు హైదరాబాదు పొలిమేరలు దాటి ఎప్పుడూ పయనం చేయలేదే. ఆయన చాదస్తపు మనిషి. ఇంటి వంట తప్ప యేమీ తినడు. ఇటలీ గురించి యేమి రాస్తాడు?” అన్నాడు జయకాంత్.
“ఫరవాలేదయ్యా. రైటర్నూ, భార్యామణినీ ఇటలీ కు ఒక రెండు వారాలు మన ఇండియన్సు దగ్గరకు పంపిద్దాము. కధలు కధలుగా అల్లేస్తాడు.” అనంత రామన్ గట్టిగా నవ్వాడు.
“ఖర్చులు ఎవ్వరు భరిస్తారండీ. మన బడ్జెట్టు ఎక్కువ కాదు.” జయకాంత్ అసహనం గా అన్నాడు. “భావన గారి లాంటి కళాకారిణి నుండి ఒక ప్రదర్శనే మేలు.”
“కొత్త కథ ఎందుకండీ? ఇంతకీ భారతంలో ఘట్టాలు ప్రదర్శించడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటో?” అన్నారు వర్మ గారు.
“కథ చెప్తా వినండి. ఇది రామాయణం నుండి తీసుకుని సొంతంగా అల్లిన కథ.”

“సరిపోయింది! ఒక్కరు భారతం, మరొకరు రామాయణం అంటూ, కృష్ణా, రామా అని భజన చేస్తూ, ఇటలీ వెళ్ళి వద్దాము.” అన్నది తన్విత.
“ఇతర దేశస్థులకు మన పురాణాల మీద ఉన్న ఆసక్తి మన వారికి వుంటే, ఎప్పుడో బాగుపడే వాళ్ళం.” అన్నది భావన.
“అంటే నా లాంటి స్టార్స్ వల్ల దేశం చెడింది అంటారా?” అన్నది తన్విత కనుబొమ్మలు ఎగరవేస్తూ.
“అయ్యుండచ్చు. మీరు పౌరాణికాల్లో నటిస్తే తెలిసుండేది.” భావన జవాబిచ్చింది.
సంభాషణ శృతి మించి రాగాన్న పడుతోంది అనుకుని జయకాంత్ అన్నాడు. “మరి రామాయణం లోని నూతన కథను చెప్పండి అనంతం గారూ.”
“వినండి అయితే. సూర్య గంటి గారి చేత, ఒక హాస్య, శృంగార కథ నేనే రాయించాను. ఈ కథను నాటికగా రూపొందించాలని నా ప్రయత్నం.
వాలీ, సుగ్రీవుడూ అపరిమితమైన బలవంతులు కదా. వాలికి అఖండమైన శక్తి యుద్ధం లో కలగాలని వరం కూడా వుంది. పైగా అప్సరస తార అతని భార్య. ఇవన్నీ ఉన్నా వానర రూపం. అన్నా, తమ్ముడూ కలిసి మెలిసి వుండే కాలం లో ఈ విచారం తమ్ముడికి చెప్పాడు. ఇద్దరూ కలిసి, మంచి రూపం కలగాలని బ్రహ్మ దేవుడికి తపస్సు చేశారట.
బ్రహ్మ ప్రత్యక్షమై, మంచి మానవ రూపం ఇస్తా మీ ఇద్దరికీ. కానీ ఒక్క మూడు నెలలకు మాత్రమే. మీ ఇష్టం వచ్చినట్టు ఆనందంగా గడపండి అనేసి, మరి వెను వెంటనే మాయమయ్యాడట. మరి విష్ణు మూర్తికి మిత్రుడాయె. రామాయణం మార్చకూడదు కదా.
అయితే, వాలి, సుగ్రీవుడు కొత్త రూపాలలో, అప్సరసలను పొందాలని ఇంద్ర లోకానికి వెడతారు. అక్కడ ఊర్వశి, మేనక పరిచయం అవుతారు. వారికి బంధం, అనురాగం ఏర్పడి, హాయిగా గడిపే లోపల, ఒక రాత్రి, అప్సరసల కౌగిట్లో వుండగా, వీరికి వానర రూపాలు తిరిగి వచ్చేస్తాయి. తర్వాత కథ చదవండి మరి. ఆసక్తికరంగా లేదూ?”
జయకాంత్, భావన ముఖం, ముఖం చూసుకున్నారు, నవ్వాపుకుంటూ.
ఇటువంటి నాటకం వేస్తే పరువు పోతుంది.
“అనంతంగారూ! కష్టమండీ. మన పురాణాలూ, ఇతిహాసాలూ, ఎంతో ఘనమైనవి. ఉపయుక్తమైనవి. వాలీ, సుగ్రీవుడూ, వారి వానర ధర్మం పాటించి, జీవితం గడిపారు. శ్రీరాముడు తాను క్షత్రియుడు కనుక జంతువులను వేటాడము తన ధర్మం అని చెప్పి, అయినా వాలికి మోక్షం ప్రసాదించాడు. కృష్ణావతారంలో చివర తన మీద బాణం ప్రయోగించే వరం ఇచ్చాడు. ఇటువంటి కథను మార్చి, నవ్వుల పాలు కాలేమండీ.” అన్నాడు జయకాంత్.
“అయితే ఏం చేద్దామయ్యా, ప్రతీ ఒక్కరి అభిప్రాయం వేరేగా వుంటే?” అన్నారు అనంతం గారు.
“నా ఉద్దేశం లో, మనలో ముగ్గురి అభిప్రాయం ప్రకారం, ద్రౌపదీ పరిణయమే బాగుంటుంది.” అన్నాడు జయకాంత్. అతని మాటకు తిరుగు లేదని అందరికీ అవగాహనే.
ఇంతలో రవివర్మగారి మొబైలు ఫోను మోగింది. ఆయన విసుగ్గానే ఫోనులో మాట్లాడ్డం మొదలు పెట్టాడు. ముఖం మారి, చెమటలు పట్టాయి. ఆయాస పడడము మొదలు పెట్టాడు. లేచి, ప్రక్క రూములోనికి వెళ్ళాడు. ఒక పది నిముషాల తర్వాత తిరిగి వచ్చాడు.
“నేను వెళ్ళాలి. ప్రమాదం జరిగింది.” అని వాటర్ బాటిల్ లో వున్న నీరంతా తాగేశాడు.
“వీలైతే చెప్పండి. కారు సిధ్ధంగా వుంది. మీరు ఎప్పుడు బయలుదేరాలి అనుకుంటే అప్పుడు బయలుదేరవచ్చు.” అన్నాడు జయకాంత్.
“రేపు ఎలాగైనా వార్తల్లో వస్తుంది. మా సాంస్కృతిక ఆఫీసులో ఉద్యోగిగా, కొత్తగా ఒక రక్షిత కులం, అంటే ప్రొటెక్టెడ్ కాస్ట్ లోనుండి వచ్చిన అమ్మాయి చేరింది. ఆమె వయసులో చిన్నదైనా ధైర్యం, ఆత్మ విశ్వాసం గల స్త్రీ. పైగా పనిలో దిట్ట. అయితే అది చూసి ఓర్వలేక తోడి వర్కర్లు ఆమెను బాధిస్తున్నారనీ, ఎగతాళి చేస్తున్నారనీ వార్తలు నాకు ఒక వారం క్రితం అందాయి. మీటింగు ఏర్పాటు చేసి, అందరినీ హెచ్చరించాను సూచనగా. ఆమెలో నాకు ఏ బాధా కనిపించలేదు. ఇప్పుడే, ఒక గంట క్రితం, ఆమెను మా ఆఫీసు కారే గుద్ది, బాగా గాయాలు తగిలాయట. హాస్పిటలులో ఐ సీ యూ లో పెట్టారు. కారు నడిపింది మరెవ్వరో కాదు, నా రైటు హేండు. వెళ్ళి యేమి చేయాలి, ఆమెను ఎలాగ కాపాడాలి అని అలోచించాలి.”
“ఆమె ఎక్కడుంది?” అన్నాడు జయకాంత్.
చెప్పారు వర్మ గారు. “మీరు యేమీ కంగారు పడకండి. అక్కడ నాకు చీఫ్ ఆఫ్ సర్జరీ, మిగతా డాక్టర్సు తెలుసు. ఆమెను ప్రత్యేకంగా చూడమని ఇప్పుడే కాల్ చేసి, అడుగుతా.” అని వెంటనే డాక్టర్సుకు కాల్ చేశాడు.
జయకాంత్, రవివర్మగారూ కలిసి హాస్పిటల్ కు వచ్చారు. అద్దాల కిటికీలో నుండి, గాయపడ్డ అమ్మాయిని చూసి జయకాంత్ హృదయం ద్రవించింది. పట్టుమని ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా ఉండవేమో. తలపైన బ్యాండేజి క్రింద కూడా, ఆమె ముఖంలో శాంతం, కారుణ్యం, ఆత్మ విశ్వాసం అతనికి కనిపించాయి.
తను ఎక్కడ, ఎవరికి పుట్టాడో తనకి తెలియదు. రక్త సంబంధం ఉన్న వారెవరో, ఎపుడూ కలవలేదు. అనాధ ఆశ్రమములో పెరిగి, స్వయంకృషితో పైకి వచ్చాడు. ఎక్సెక్యూటివ్ గా ఉద్యోగం వదిలి, సినిమాలలో సహాయ దర్శకుడిగా చేరి, కొందరి సహాయంతో నిర్మాతగా మారాడు. తను పెరిగిన ఆశ్రమాన్ని, మరిన్ని చేరిటీస్ ని స్వంతం చేసుకొని, సంపాదనను వీలయినంత పంచి పెట్టాడు.
గోల్కొండ కోట ప్రాకారాలలో, బిర్లా మందిర్ అభయ హస్తాలలో, హుసేన్ సాగర్ ప్రశాంత సవ్వడిలో చదువుకున్నట్లు గుర్తు.
ఎత్తు పల్లాలు, కృత్రిమ సరోవరాలు, కాస్త చలి, మరింత వేడి వాతావరణం..పెర్ల్ సిటీలో, జెనోం వ్యాలీలో పెరిగాడు. అతి ఒంటరిగా.
తనకు కుల, మత, జాతి, లింగ భేదాలు తెలియవు. విశ్వసించిందల్లా క్రమశిక్షణ, నిరంతర కృషి. నా పయనం ఎక్కడికి, ఎందుకు అని మధన పడడం కంటే, ఈ క్షణం, ఈ గంట, ఈ రోజు ఏమి చేయగలను అన్న కేంద్రీకరణ మాత్రమే అతని ధ్యాస.
కొద్దిరోజులు గడిచాయి. గాయపడ్డ అమ్మాయి పేరు సమన్విత అనీ, ఆమె ఈ మధ్యే ఉద్యోగములో చేరింది అనీ తెలుసుకున్నాడు. తేరుకున్న వారంరోజుల తర్వాత, ఒక సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళాడు. కాఫీ తాగి, నాజూకుగా, తన్వీలత లాగ తన ముందర ఉన్న ఆమెను చూసి, కళ్ళు మరొక వైపు తిప్పుకున్నాడు.
ఆమెతో అన్నాడు. “ఈ ఏక్సిడెంటు చేసిన వారు ఎవ్వరో తెలుసుకొని, వారికి తగిన శిక్ష పడే భాద్యత నేను వహిస్తాను. మరొకరికి హాని చేయాలి అనుకొన్న వారిని అలా వదల గూడదు. మీరు సహకరిస్తారా?”
ఆమె స్థిరంగా అన్నది. “వద్దండీ. ఆ విషయం భగవంతుడే చూసుకుంటాడు. నేను మానవ మాత్రురాలిని. కారు నడిపిన వారిని లీలగా చూశాను. కావాలని చేశారో, తెలియక జరిగినదో నాకు తెలియదు.”
అతను తన జీవిత భాగస్వామిగా ఈ అమ్మాయే కావాలి అని నిర్ణయించుకున్నాడు. తనకి మొదటి బంధువు ఈమే అయ్యుండాలి. ఆమె వంక చూసి నవ్వాడు. తను అనుకున్నది సాధించి తీరత

****************************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *