May 2, 2024

“కుక్క తోక వంకర “

రచన: మీనాక్షి శ్రీనివాస్

“ఏమోయ్. ఈ నెలలో ఎవరి పెళ్ళి వుందంటావ్. . ?”చదువుతూన్న పేపర్లోంచి తలెత్తి హటాత్తుగా అడిగాడు శంకరం మాస్టారు.
“ఆ మీదీ . నాదీనూ . . . ”వంటింట్లోంచే అరిచింది పార్వతమ్మ. . .
“అయిపోయిన పెళ్ళి గురించి కాదోయ్ నేనడిగింది . మనం వెళ్ళాల్సిన పెళ్ళి గురించి “తాపీగా అడిగాడు పార్వతి తెచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ .
“మహానుభావా. పాపం . . . ఇది ఆషాఢం. పెళ్ళిళ్ళు చెయ్యరెవరూ మీరు వెడదామన్నా . మీకు కాస్త అయినా మీకిదేం పిచ్చండీ . ఎక్కడెక్కడి వాళ్ళ పెళ్ళిళ్ళకీ వెడతారు తగుదునమ్మా అంటూ వచ్చే నాలుగు పెన్షన్ రాళ్ళూ ఇలా తిరుగుళ్ళకి తగలేసుకోవడం . పైగా అనవసరమైన శ్రమా. “తనూ కాఫీ తాగుతూ అంది.
“ఆ . దొరికింది . ఇదిగో నా శిష్యుడు అబ్బాస్ ఖాన్ గాడి నెంబరు. వాడు పోయిన నెలో. . ఆ ముందు నెల్లోనో బజార్లో కనబడి చెప్పాడు . వాడి పెద్ద కూతురు అశ్రాత్ పెళ్ళి జూలై లో తప్పక రావాలి మాస్టారూ అంటూ ఒకటే ఇదై పోయాడనుకో. “
“హెలో అబ్బాస్ . ఆ ఆ ఆదా బర్సా. ఏమిటీ నాకే ఫోనే చెయ్యబోతున్నావా?. ఇంతలో నేనే చేసానా?. . పాత బస్తీ లోనా? . అవున్లే . మీ అబ్బాజాన్ కోరిక సబబేగా మనవలందరి పెళ్ళిళ్ళూ తన ఇంట్లోనే జరగాలనే ఆయన కోరిక కాదనలేంగా . తప్పకుండా. రేపాదివారమే . . అలాగే . అలాగే . . నువ్వు మరీ అంతలా చెప్పాలటోయ్ . ఆ ఆ అస్సలామా లేకుం. . ”ఫోన్ కట్ చేసాడు ఆయన.
“అంటే . ఇప్పుడు . ఈ పెళ్ళికీ తమరు వెళ్ళాల్సిందేనా?. ఐనా కళ్ళజోడు దగ్గరనుంచి కాలిజోడు వరకూ అన్నీ వెతికివ్వాల్సిందే కదా. . ఎక్కడివక్కడ మర్చిపోయే మహరాజుకి ఈ పెళ్ళిళ్ళు మాత్రం ఎలా గుర్తుంటాయండి బాబూ. . “తల పట్టుకుంది పార్వతమ్మ.
“ఇదిగో . నువ్వూ రాకూడదూ . ముస్లిం నిఖా ఎప్పుడూ చూళ్ళేదుగా. పనిలో పనిగా మీ అన్నయ్యా వాళ్ళనీ ఓ సారి చూసి వద్దాం. ”
“అఖర లేదు. తగుదునమ్మా అంటూ ఆ పెళ్ళికి కూడా . మీరు వెళ్ళి ఉద్దరించడి చాలు. వద్దన్నా వినరుగా . ” అక్కసుగా అంది . . .
“అంత కోపమెందుకోయ్ . నేనేమైనా గుర్రప్పందాలకీ . బారులకీ వెడుతున్నానా?. లక్షణంగా పెళ్ళిళ్ళకేగా. సరే. అలా మన ట్రావెల్ ఏజెంట్ సుందరం దగ్గరకి వెళ్ళోస్తా. ఎల్లుండేగా పెళ్ళి. హైదరాబాద్ తత్కాల్ టికెట్ తీసుకోమని చెప్పొస్తా. ”లేచాడు. చేతిలో పేపర్ పక్కన పడేసి.
***
“పార్వతీ. ఇష్. కాసిన్ని మంచి నీళ్ళందుకో. . అబ్బబ్బా జూలై నెల్లో కూడా ఈ ఎండలేమిటో?. ఇలా కాల్చేస్తున్నాయి. ఆ చేత్తో ఆ ఫేను స్పీడు కాస్త పెంచు. ”పార్వతి తెచ్చిన నీళ్ళు గడ గడా తాగేసాడు. . . .
“తప్పు జూలై నెలలో ఎండలది కాదు . బాలాకుమారుడిలా పరిగెడతారే . మీ వయసుది. . “అవకాశం వదులుకోలేదు పార్వతి.
“ఇంతకీ టికెట్ ఏమైంది. దొరుకుతుందటా. ”
“ఆ . ఎందుకు దొరకదూ. కాక పోతే. . టికెట్ మీద వెయ్యి రూపాయలు ఎక్కువ అవుతుందట. . ఇప్పుడు అక్కడ మహా సభలేవో వున్నాయికదూ. మర్చిపోయాను. ”
“ఏమిటీ . మీ ప్రియ శిష్యుడు సుందరమే. . అంత ఎక్కువ చెప్పిందీ. . . ”
“వాడు లేడనుకో. . వాళ్ళ తమ్ముడు . రాజు. వాడూ నా శిష్యుడే అనుకో. అయినా మరి రోజులలాంటివి. . పోనీ ఓ పని చేస్తే. . ”
“ఏమిటో. . ”
“పోనీ జనరల్ భోగి లో వెడితే. . . . ”
“వెళ్ళడమే. . ఇంక రావడం వుండదు. . . . “మంటగా అంది.
“అదీ నిజమే. ఈ రద్దీలో. . అందులో వెళ్ళడం సాహసమే. పోనీ ఓ పని చేస్తే. . బస్సులో వెడితే. . . . ”
“మరే . కూర్చుని వుండలేనమ్మ వంగుని తీర్ధం వెళ్ళిందట . వెళ్ళండి ఆ ముచ్చటా తీరుతుంది. పది నిముషాలు ఎండలో వెళ్ళొచ్చి అమ్మా అయ్యో అంటున్నారు . బస్సులో వెడతారట బస్సులో. . ఇదిగో కాఫీ. తీరికగా తాగి ఆలోచించండి ఎలా వెడతారో. . “
“ఆ. . ఐడియా. . ఓహో . ఇంటి ఇల్లాలా. . ”
“ఏమిటా గావుకేకలు హడలి చచ్చేలా. ఏమిటో ఆ ఐడియా. ఇలా మీతో కూర్చుంటే నా పని అయినట్లే. . ఓ పక్క అప్పుడే బారెడు పొద్దెక్కింది. ఓ స్నానం లేదు. పూజా లేదు. పనీ లేదు. పాటా లేదు. ఇంతకీ ఏమిటా అమోఘమైన ఐడియా. త్వరగా చెప్పండి. అవతల దోసెలు మాడి చస్తాయ్. “ రుస రుస లాడింది. . . .
“అంతే . ఎప్పుడూ . . తిన్నామా. . పడుకున్నామా. తెల్లారిందా. ఓ సరదా లేదు. . సంతోషం లేదు. ”
“మరే. మీరున్నారుగా . తిందామా. . . తిరుగుదామా అనుకుంటూ. . . కాలికి చక్రాలున్నట్లు. . ఆ తిరగడానికో కారణం పెళ్ళిళ్ళు. నాతో తర్వాత తీరుబడిగా దెబ్బలాడచ్చు గాని ఇంతకీ ఏమిటా. మహత్తరమైన ఐడియా. వుండండి మీ మహత్తరమైన ఐడియాకి మెచ్చి మాడిపోయిన దోసె తెస్తాను తింటూ చెబుదురు గాని. . ”గిరుక్కున వెళ్ళి దోసె ప్లేటుతో వచ్చింది.
“అది కాదే. పాపం అబ్బాస్ అంత ప్రేమగా పిలిచాడా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు. . . ”
“మరే. ఫోన్ చేసి మరీ పిలిపించుకున్నారు. . ఇంతకీ ఎలా వెడుతున్నారు. . ? ”
“మన కారులో. . ”
“ఏమిటీ అంత దూరం. . వీల్లేదు గాక వీల్లేదు. . . . ”
“నా ఇష్టం నే వెడతా. ”
“పదండి . నేనూ వస్తా. అంత దూరం ఒక్కరూ వద్దు. కట్టుకున్నాకా తప్పుతుందా. . కానీ నన్ను మా అన్నయ్య ఇంట్లో దించి మీరు వెళ్ళండి ఆ పెళ్ళికి. నే మాత్రం రాను. “ఢంకా బజాయించి చెప్పింది.
“సరే . అయితే . రేపు ఉదయాన్నే బయలు దేరి. విజయవాడ చేరి అక్కడ అమ్మవారిని దర్శించుకుని . మీ పెద్దమ్మ వున్నారుగా వాళ్ళింట్లో కాసేపు రెస్ట్ తీసుకు ఎల్లుండి తెల్లవారుఝాము బయలుదేరదాం. “ఉత్చాహంగా అన్నాడు.
“కానీండి . తప్పుతుందా. . . . ”
***
“ఏమిటీ ముఖం అలా వేళ్ళాడేసుకు వచ్చారు . మీ అబ్బాస్ బాగా రిసీవ్ చేసుకోలేదా?. . బాగా మర్యాద చేసుకోలేదా. . . . ?” ఉసూర్మంటూ. . ఉదయం అనగా వెళ్ళిన వాడు. తిరిగి తిరిగి రాత్రి ఎనిమిదింటి వేళ. . ముఖం వేలాడేసుకు వచ్చిన మొగుడిని అడిగింది.
“ఛా. అనవసరంగా వచ్చాం. . అసలు ఆ పాత బస్తీ అంతా చెడ తిరిగినా ఆ ఎడ్రస్ దొరకలేదు . ఫోన్ చేస్తే . . స్విచ్ ఆఫ్ వస్తోంది. అలాంటప్పుడు . ఈ పిలవడాలెందుకో. ఛా . ఇంక వెళ్ళకూడదు ఏ పెళ్ళిళ్ళకీ. మంచీ మర్యాదా ఉండటంలేదు ఒక్కళ్ళకీ. “రుస రుస లాడాడు.
తెల్లారి . కాఫీ తాగుతూ అన్నాడు. ”అన్నట్లు . మా పెద తాతగారి ముని మనవడు. వాడెవడూ అవినాష్ గాడి పెళ్ళి ఈ శ్రావణ మాసంలోనే కదూ . మళ్ళీ మీ మేనత్త కొడుకు కూతురిదీ ఆ నెలల్లోనే . అదీ హైదరాబాద్ లోనే కదూ. . అయితే ఇంక పదిహేను రోజుల్లోనేగా ఇక్కడే వుండి అవి చూసుకుని. ”
“. . వారిచే ఆతిద్యం స్వీకరించి. వధూ వరులని ఆశీర్వదించి . వెడదాం. . ఇంక మీరు మారరు. నిన్న రాత్రే కదా అన్నారు ఇంక ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదనీ. ఊ. కుక్క తోక వంకర అని వూరికే అనలేదు మనవాళ్ళు . ఇంక మీరు మారరు. . ఊహ్. ”పూర్తి చేసింది పార్వతి నవ్వుతూ.
“ఒసే . కళ్ళు పోతాయే . కట్టుకున్న మొగుడిని కుక్క తో పోలిస్తే. . . . ”గింజుకున్నాడు .
“లేదు మహాశయా . మొగుడిని కుక్కతో పోల్చలేదు . బుద్దిని తోక వంకరతో పోల్చా. . . . ”భళ్ళున నవ్వేసింది భోళాగా.
***

1 thought on ““కుక్క తోక వంకర “

  1. సరదాగా ఉండి బాగా నవ్వించింది మీనా… అభినందనలు మరీ మరీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *