May 17, 2024

అ…ఆ… చిత్రకవిత

చిత్రం : చిత్ర ఆర్టిస్ట్

కవిత: మాలతి దేచిరాజు

aksharamala

సరస్వతీదేవి చేతిలో వీణలా

ఒకప్పుడు చిన్నారుల చేతుల్లో నిలిచిన పలక..

నేడు నిస్సహాయమై ముక్కలై పోయింది……

బలపం పట్టాల్సిన పసిచేతులతో

బలవంతంగా పని చేయిస్తోంటే ..

చూడలేక ఆకలి బాధ

“అ” అక్షరానికి బదులు..

శ్రమకు ఆయుధంగా వారిని మార్చేస్తే

బదులు పలకలేక …

బాలకార్మిక వ్యవస్థ దోపిడిలో

అమాయకమైన బాల్యం

భవిష్యత్తును కోల్పోతోంటే……

వాగ్దేవి నిలుచుంది….

బాధాతప్త హృదయంతో…

తడిబారిన కళ్ళతో…

బాల కార్మికచట్రాల మధ్య నలిగే ఈ బాల్యం…

నిస్సహాయమైన ఈ చూపుల్ని…

బుగ్గలపై జాలువారుతున్నఆ చిన్నారి కన్నీళ్లు తుడిచి…

ఎదురు తిరిగించి…. పలకను చేతబట్టించి

అక్షర గళమై, ఆక్షరాస్య గగనాన

భావిభారత భాగ్యవిధాతై వర్ధిల్లాలి…

ఈ దీవెన ఫలిస్తే, పనిచేసే చేతులు పలకను పడతాయి …

నీలాలు కారు కన్నీళ్లు అక్షర జ్యోతులై ప్రజ్వరిల్లుతాయి..

బాలకార్మికుడు భావిపౌరుడై కదులుతాడు

అప్పుడే చిగురిస్తున్న పచ్చని ఆశల్ని

భవితల ఆమని తాకకుండానే

నేలకు రాలుస్తున్న ఈ బాలకార్మిక శిశిరాన్ని,

వెచ్చని శ్వాసతో వెనక్కి నెట్టుతూ

ముందుకు సాగుతారు,,, అక్షరమై వెలుగుతారు….

ఆ క్షణాలే రావాలి … అమ్మ ఆశీర్వచనాలై

పలకాబలపాన్ని బాలకార్మికులకు అందించి

ముందు తరాల తలరాతను మార్చమంటూ …

విధాతకి తన వీణను పలకగా మార్చి,

శృతిని బలపంగా చేసి,

రాగాలను అక్షరాలుగా వినిపించింది

ఆ చిన్నారుల చేతులు…పనిముట్టును కాదు…

పలకా బలపాన్ని చేతపట్టాలన్న ఆకాంక్షతో

ఈ అక్షరాలలో ధ్వనించింది కవనమై!

నిరంతరం వెలగాలి అక్షరజ్యోతులై….

6 thoughts on “అ…ఆ… చిత్రకవిత

Leave a Reply to Lakshmi Yalamanchili Cancel reply

Your email address will not be published. Required fields are marked *