May 3, 2024

“ముగ్గురు కొలంబస్ లు.”

రచన,  డా. సోమరాజు సుశీల

సమీక్ష- డా. మంథా భానుమతి.

???????????????????????????????

కొలంబస్ ఆల్రెడీ అమెరికా ఎక్కడుందో కనిపెట్టెయ్యడం, ఆ ఊసట్టుకుని ఐరోపా వాళ్ళంతా దాన్ని ఆక్రమించేసి.. అక్కడున్న వాళ్ళలో చాలామందికి వేరే లోకానికెళ్ళిపొమ్మని దారి చూపించేసి, మిగిలిన వాళ్ళని అక్కడక్కడ మూలల్లో ఉండండర్రా అని ఉంచేసి.. ప్రపంచంలో అన్ని దేశాల వారికీ భూమ్మీద స్వర్గం అంటే ఇలా ఉంటుందోచ్ అని చెప్పేశాక.. ఆల్ ద రోడ్స్ లీడ్స్ టు రోమ్ లాగ, ఆల్ ద బ్రైన్స్ గో టు అమెరికా అనే అభిప్రాయాన్ని ప్రపంచ ప్రజలకిచ్చేశాక.. ఈ ముగ్గురు కొలంబస్ లూ ఎవరబ్బా.. వీళ్లు కొత్తగా కనిపెట్టిందేవిటబ్బా అని మనకి ఆశ్చర్యం కలక్క మానదు.

అదేవిటో డాక్టర్ సోమరాజు సుశీలగారి పుస్తకంలో తెలుస్తుంది. భాతరత దేశంలో చదువుకున్నవారు, అంటే తెలుగు భాష చదవగలిగిన వాళ్ళు, అందులో తెలుగు పత్రికలు, పుస్తకాలు చదివేవాళ్ళలో మూడొంతుల ముప్పాతిక మందికి అమెరికా అంటే ఇంటి పక్క పార్కుతో సమానమైపోయింది. ఇట్టిట్టే వెళ్ళొచ్చేస్తున్నారు. మరి ఈ పుస్తకంలో కొత్తగా తెలుసుకునేదేవిటబ్బా అనే సందేహం రాక మానదు. అందుకే ఈ పుస్తకం చదవాలి.

ముగ్గురు కొలంబస్ లలో ఇద్దరు స్లీపింగ్ పార్ట్నర్స్ వంటి వాళ్ళు. అసలు హడావుడి అంతా మన హీరోయిన్  కొలంబస్ దే.  కూతురి కాపురం, ఆ కూతురి కూతుర్ని చూడ్డం ఈ కొలంబస్ ఆశ, ఆశయం. దానికి తోడు అమెరికాలో ఉన్న అమ్మాయి ఆదివారం వచ్చిందంటే చాలు క్లాసు తీసుకోడానికి, నిష్ఠూరాలెయ్యడానికి తయార్.. అదేదో అమ్మ మూలానే అడ్డంకులొస్తున్నట్లు. ఆవిడకే రావడం ఇష్టం లేనట్లు.. అసలు సంగతి, తను పడే పాట్లు ఏమిటో ఎలాగో వివరిస్తుంది మన మహిళా కొలంబస్.

ఏతావాతా తేలిందేవిటయ్యా అంటే.. స్పెయిన్ దేశపు కొలంబస్ ఇండియాకి తనున్న ఐరోపా నుంచి పశ్చిమంగా వెళ్ళడానికి, తద్వారా అమెరికాని అనెక్స్పెక్టెడ్ గా కనుక్కోడానికి ఎంత అవస్థ పడ్డాడో.. అంత అవస్థా ఈ తెలుగు కొలంబస్ పడింది పాపం. ఎలాగో రైలెక్కి, విమానవెక్కి అమెరికా తను చేరి తన మిస్టర్ కొలంబస్ నీ. మదర్ ఇన్లా కొలంబస్ నీ చేర్చిందా.. ఇంక అక్కడ రోజుకో వింత.

ఆ వింతలన్నీ మనందరికీ అనుభవాలే.. కానీ సుశీలగారి కలం చెప్తుంటే వినడం మంచి త్రిల్లింగ్ గా ఉంటుంది. వినడం ఏమిటీ పుస్తకం కదా.. అవును! వినడమే.. కబుర్లు వింటున్నట్లే ఉంటుంది చదువుతున్నప్పుడు.

ఎయిర్ పోర్ట్ నుంచే సైంటిస్ట్ తల్లికి బిహేవియర్ లెక్చర్స్ ఇచ్చే.. అడిగడుక్కీ వాట్ టు డు, వాట్ నాట్ టు డు లు చెప్పే, మధ్య మధ్యలో చలోక్తులు విసిరే కూతుర్ని చూస్తుంటే చాలా మందికి ఆత్మకథ చదువుతున్నట్లే ఉంటుంది. సైలెంట్ గా ఉంటూనే తనక్కావల్సినవి జరిపించుకునే హజ్బెండ్ కొలంబస్.. అమెరికా వెళ్ళింది గార్డెనింగ్ చెయ్యడానికే అన్నట్లు ఎప్పుడూ తోటలోనే కాలక్షేపం చేస్తుంటారు. ఉండీ ఉండీ వారు అనే అరకొర మాటలే మన కొలంబస్ కి టానిక్ లన్నమాట.

అమెరికా పక్కింటి వాళ్ళు పలకరించరనే దురభిప్రాయాన్ని పోగొట్టే కెరెన్, ఇంటికి రిపైర్లకి వచ్చే వాళ్ళు, కార్పెంటర్లు.. అందరితో మర్చిపోలేని అనుభవాలే. రైలు ప్రయాణంలో ఎదురైన వర్ణ వివక్షత ఆశ్చర్యం కలిగించినా.. ఏ దేశంలోనైనా అతాకోడళ్ళ, తల్లీకూతుళ్ళ అనుబంధాలు ఒకటే అని తెలిసొస్తుంది.

ప్రకృతి అందాలు.. సెలయేళ్ళు, కొండలు, సహజంగా ఏర్పడ్డ శిల్పాలతో ఉన్న గుహలు.. అన్ని ప్రదేశాలకీ పాఠకులు కూడా కొలంబస్ లతో ప్రయాణం చేస్తారు. అంతదూరం వెళ్ళి హోరున కురుస్తున్న వానలో ఏమీ చూడలేకపోయినా పెద్ద బాధేం లేదు. డిస్నీ వర్ల్డ్ లో వింతలు, సీ వర్ల్డ్ లో జలచరాల విన్యాసాలు.. యూనివర్సల్ స్టూడియోలో ఆశ్చర్య మైన సెట్టింగులు.. అన్నీ పరిచయం అవుతాయి వెళ్ళని వారికి. అన్నీ చూసిన వారికి.. “గుర్తుకొస్తున్నాయి..’ అనిపిస్తుంది.

సోమరాజు సుశీల గారిది సరళమైన శైలి. ఆసక్తిగా అన్నీ చూపిస్తూ, పాఠకులని చెయ్యి పట్టుకుని తన లోకంలోకి తీసుకుపోగల నేర్పు ఉన్న రచయిత్రి. చాలా సింపుల్ గా ఉన్నట్లే ఉంటుంది.. మనకి తెలియకుండానే నవ్వేస్తాం.. కన్నీళ్ళు పెట్టేసుకుంటాం, అమ్మో అనుకుంటాం.. ఆహా అని ఆశ్చర్యపోతాం.  కొన్ని పోలికలు, వర్ణనలు మామూలుగా చదువుతున్న వాటి కంటే భిన్నంగా ఉంటాయి. మచ్చుకి..

రైల్లో ప్రయాణం చేసేప్పుడు.. నేరేడుపండు రంగులో ఉన్న ఒకావిడ బోగీలోకి రాగానే “బాగా మాగిన పనసపండు మూడురోజులు ఇంట్లో ఉంటే వచ్చే తలనెప్పి పరిమళం అంతా వ్యాపించింది..” ఇటువంటి వాసన అనుభవించిన వారికి బాగా తెలుసు ఎలా ఉంటుందో. అటువంటి పెర్ఫ్యూమ్ వేసుకుందన్నమాట ఆవిడ. ఈ విధమైన వర్ణన అందరికీ రాదు.

మరి మీరు కూడా ముగ్గురు కొలంబస్ లతో అమెరికా వెళ్ళొస్తారు కదూ!

*————————–*

ప్రతులకు- ఉమా బుక్స్, 58- Krishna Reddy Nagar, New Boyinpalli, Secunderabad -500011, T.S

అన్ని ప్రముఖ షాపుల్లోనూ లభ్యం.

5 thoughts on ““ముగ్గురు కొలంబస్ లు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *