May 2, 2024

” వెటకారియా రొంబ కామెడీయా” – 1

రచన: మధు అద్ధంకి madhu

సుబ్బారావు పెళ్ళిచూపులు

 

ఆ ఇంట్లో అందరూ చాలా హడావిడిగా ఉన్నారు.. కారణం  సుబ్బారావుకి పెళ్ళిచూపులు..సదరు సుబ్బారావు కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు..కొన్నాళ్ళు అమెరికాలో పనిచేసి మేరా భారత్ మహాన్ అని ఇండియాకి వచ్చేశాడు…మంచి ఉద్యోగం, మంచి జీతం.. త్వరలో సింగపూర్ పంపుతామని ఆఫీస్ వాళ్ళు చెప్పినా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు…

ఇకపోతే సుబ్బారావు పెద్ద అందగాడు కాదు కాని అనాకారి కూడ కాదు… రాముడు మంచి బాలుడు లాగ అన్నీ మంచి లక్షణాలు ఉన్నాయి…అతను వాళ్ళ తల్లితండ్రులకి ఒక్కగానొక్క కొడుకు. తనకున్న జాబ్ క్వాలిఫికేషన్స్ తో తనను ఎవరు అబ్జెక్ట్ చెయ్యరని వీజీగా పెళ్ళైపోతుందని అతనికి కొద్దిపాటి గర్వంతో కూడిన ఊహ…మరి అతని పెళ్ళిచూపులెలా జరిగాయో చూద్దాం!!!

మీరే కంపెనీలో పనిచేస్తున్నారు అనడిగాడు పె.కూ.త(పెళ్ళి కూతురి తండ్రి)

ఫలాన కంపెనీలో చేస్తున్నా..అన్నాడు పె.కొ(పెళ్ళి కొడుకు)

ఈ సంవత్సరం మీ కంపెనీ పెర్ఫార్మన్స్ బాలేదని షేర్లు అన్ని పడ్డాయి కదా ?అంటే మీకు ఈ సంవత్సరం బోనస్ రాదుగా అన్నాడు పె.కూ.త

మొహం ఎలా పెట్టాలో తెలియక ఒక వంకర మొహం పెట్టి జీవం లేని నవ్వుతో నీళ్ళు నములుతూ అవుననుకుంట అని బిక్కమొహం వేశాడు.పె.కొ

మా అమ్మాయి పనిచేసే ఫలాన కంపెనీలో ఈ సంవత్సరం షేర్లు పెరిగాయి…

దానికి డబల్ బోనస్ వస్తుంది( కంపెనీ షేర్లు తన కూతురి వల్ల పెరిగాయని బిల్డప్ ఇచ్చాడు)

కరెంట్ తీగ మీద వాలిన కాకిలాగ గిలగిల్లాడుతూ చూశాడు పె.కొ.

మీ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అనడిగాడు పె.కూ.త

ఫలాన ఫలాన అన్నాడు పె.కొ

అయి సీ..మా అమ్మాయి ఫలాన చేస్తోంది అంటే మీకంటే పెద్ద పోస్ట్ అన్నమాట అన్నాడు పె.కూ.త..

మాడిపోయిన మసాలా దోశలా మొహం పెట్టి తల అడ్డంగా మూడు సార్లు నిలువునా ఆరుసార్లు ఊపాడు సుబ్బారావు

అప్పటికే సుబ్బారావు చాలా అనీజీగా ఉన్నాడు.. అనవసరంగా వచ్చానేమో అనుకున్నాడు

కొడుకు ఇబ్బంది గమనించి పె.కొ.త(పెళ్ళి కొడుకు తండ్రి) అందుకున్నాడు..

మీ అబ్బాయి అమెరికాలో ఎక్కడ పనిచేస్తుంటాడండీ అనడిగాడు పె.కొ.త

ఫలానా నగరంలోఅన్నాడు పె.కూ.త

ఎక్కడ ఉంటున్నాడు అనడిగాడు పె.కొ.త

ఫలానా ఏరియా లో ఉంటున్నాడు..అన్నాడు పె.కూ.త

అది వేస్ట్ ప్లేస్ అండి.. అక్కడ నల్లోళ్ళు ఎక్కువ ఉంటారని, దొంగతనాలు బాగా జరుగుతాయని అక్కడ ఉన్న మనవాళ్ళందరు ఇళ్ళు మారిపోయారండీ.. మావాడు అక్కడున్నప్పుడు  ఇల్లు కోసం చూస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పారు ఈ సంగతి.. అన్నాడు పె.కొ.త

పె.కూ.త మొహం మాడింది..

మీ అబ్బాయి ఎక్కడ పనిచేస్తున్నాడు అనడిగాడు పె.కొ.త

ఫలానా కంపెనీలో ఫలానా పోస్ట్ అన్నాడు పె.కూ.త

ఆ పోస్ట్ లో పనిచేసే వాళ్ళు మావాడికి రిపోర్ట్ చేస్తుంటారు అన్నాడు పె.కొ.త

పె.కూ.త మొహం ఇంకా మాడింది..అది చూసి నవ్వుకున్నాడు పె.కొ.తా.. లేకుంటే నా కొడుకుని ఇబ్బంది పెడతాడా అనుకున్నాడు..

ఈ లోపల ఆడాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇలా

మా అబ్బాయి రమ్మంటున్నాడండీ. మా అమ్మాయి పెళ్ళి చేసి వెళ్ళాలని అనుకుంటున్నాము.. వాడిది చాలా పెద్ద ఇల్లు, కోడలు కూడ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది..పిల్లాడిని చూసుకోడానికి ఎవరు లేరు మీరు రండత్తయ్యా అంది అందుకని…వాళ్ళింట్లో డిష్ వాషర్, వాషింగ్ మెషీన్, వాక్యూం క్లీనర్ అన్ని ఉన్నాయి అన్నది పె.కూ.తల్ ( పెళ్ళి కూతురు తల్లి)

ఒక్క పనిమనిషి మాత్రం లేదనుకుంటా.. అందుకే మీరెల్తున్నారు కదా?అన్నది పె.కొ.తల్ ( పెళ్ళి కొడుకు తల్లి)  పె.కూ.తల్ మొహం మాడింది..

ఇక వెంటనే పిల్లని పిలిపించకపోతే వీళ్ళు ఆడుకునేలా ఉన్నారని అమ్మాయిని తీసుకు రమ్మని భార్యకి సైగ చేశాడు పె.కూ.త…  ఆవిడ వెళ్ళి పెళ్ళికూతురు సౌమ్య ని వెంటబెట్టుకొచ్చింది.. సౌమ్య చాలా మోడర్న్ గా పంజాబీ సూట్ లో స్టయిల్ గా వచ్చింది..

ఆమె వచ్చి దర్జాగా కాలు మీద కాలేసుకుని కుర్చీలో కూర్చుని హే సుబ్బాయ్ హౌ ఆర్ యూ  అనడిగింది సుబ్బారావుని… వేరెవరితోనో మాట్లాడుతోందేమోనని వెనక్కి తిరిగి చూశాడు సుబ్బారావు… ఇంతలో నిన్నే సుబ్బా రావు అని పిలిచింది సౌమ్య..ఉలిక్కిపడి అయోమయంగా అనీజీగా చూశాడు.. ఇబ్బంది పడుతూ చిన్న నవ్వు నవ్వాడు..

ఇంతలో ఝలక్ దిఖ్లాజా ఏక్ బార్ ఆజా ఆజా ఆజా అనే పాట వినిపించింది.. సుబ్బారావు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు పాట విని.. నేను పాడమని అడగలేదు కదా ఎందుకు పాడిందబ్బా అనుకున్నాడు.. మళ్ళా ఝలక్ అంటూ వినిపించింది. ఇంక చాలండీ అనబోయేలోపల సౌమ్య తన మొబైల్ ఆన్సర్ చేసింది హలో.. అంటూ వెంటనే హాయ్ రవి!  ఏంటి సంగతుల్? సినిమాకా ఇప్పుడా? పెళ్ళిచూపుల మధ్యలో ఉన్నాను…అవతల నుండి సదరు రవి కంఠం అక్కడున్న అందరికీ వినిపిస్తూనే ఉంది..

ఎలా ఉన్నాడు అనడిగాడు రవి

ఒక మాదిరిగా ఓల్డ్ మోడల్ అన్నది సౌమ్య

నచ్చలేదా అనడిగాడు రవి

లేదు అన్నది సౌమ్య

పె.కూ.త వెర్రి నవ్వొకటి నవ్వి పిల్లలు  ఏకాంతంగా ఏదో మాట్లాడుకుంటారని అందరినీ బయటకి తీసుకుపోయాడు. రవితో మాట్లాడుతున్న సౌమ్య సడెన్ గా సుబ్బారావు కేసి చూసి నాలిక్కరుచుకుని ఫోన్ పెట్టేసింది.. సుబ్బారావుతో మాట్లాడటం మొదలెట్టింది..

సౌ: మీ పేరు పాత చింతకాయ పచ్చడిలా ఉంది.. మీరు చేసే ఉద్యోగానికి పేరుకు మాచ్ అవ్వడం లేదు సో పెళ్ళయ్యాక మీ పేరు మార్చుకోవాలి  అన్నది సౌమ్య.

పెళ్ళికి,ఉద్యోగానికి,పేరుకి ఉన్న లింకేంటో అర్ధం కాలేదు సుబ్బారావు కి..

కంపెనీ పేరు అనడిగింది సౌమ్య

ఫలానా అని చెప్పాడు సుబ్బారావు

డెసిగ్నేషన్ అనడిగింది సౌమ్య…

ఇబ్బందిగా కదులుతూ ఫలానా అని చెప్పాడు సుబ్బారావు..

ఓ నాకంటే జూనియర్ పోస్ట్ అన్నది సౌమ్యా

డిప్పకాయ తిన్నవాడిలా మొహం పెట్టాడు సుబ్బారావు..

అఫీస్ హైటెక్ సిటీ లో ఉంది కదా ట్రాన్స్పోర్ట్ ఎలా అనడిగింది సౌమ్య

పూల్ వాన్ వస్తుంది అని చెప్పాడు సుబ్బారావు..

అఫీస్ లో మంచి కాంటీన్ ఉందా? ఎందుకంటే పొద్దున్నే లేచి నీకు టిఫిన్ పెట్టే టయిం నాకుండదు…సాయంత్రం వచ్చాక వంట చేసే ఓపిక ఉండదు అందుకని కాంటీన్లో తినేసి వచ్చేటప్పుడు నాకు కూడ పాక్ చేయించి తీసుకురావాలి..

ఓ వెర్రి చూపు చూశాడు సుబ్బారావు..

ఇంతకు ముందు ఫారెన్ వెళ్ళావా అనడిగింది సౌమ్య…

అమెరికా వెళ్ళాను ప్రాజెక్త్ పని మీద అని చెప్పాడు సుబ్బారావు…

సొంత ఇల్లు, కారు ఉన్నాయా?  అనడిగింది సౌమ్యా.. సొంతిల్లుంది కాని కారు ఇంక కొనలేదు అన్నాడు సుబ్బారావు…అయితే మన పెళ్ళయ్యాక హోండా వాళ్ళ న్యూ మోడల్ వస్తోంది అది కొందాము అన్నది సౌమ్యా..

ఈ పెళ్ళి చేసుకుంటే మాట్లాడే హక్కు కోల్పోతాడని అర్ధమయ్యింది సుబ్బుకి..

ఇంజినీరింగ్ ఎక్కడ చేశావు, నీ పర్సంటేజ్ ఎంత అనడిగింది…ఫలానా అని చెప్పాడు సుబ్బారావు… చాలా తక్కువ కదా అన్నది. బిక్కచచ్చిపోయాడు సుబ్బారావు..

స్మోకింగ్, బూజింగ్ చేస్తావా అనడిగింది. లేదు అన్నాడు సుబ్బారావు.. ఆ టయింలో అతనికి సౌమ్య తనని ఇంటెర్వ్యూ చేసే ఆఫీసర్ గాను తను కాండిడేట్ గాను అనిపించారు..పెళ్ళి అనే ఆఫీస్లో భర్త అనే పొస్టొచ్చినట్టుంది సుబ్బారావుకి… పెళ్ళి మీద ఆశ సన్నగిల్లుతోంది అతనికి

పెళ్ళయ్యాక వేస్ట్ బాస్కెట్స్ మనతోనే ఉంటాయా?  అనడిగింది సౌమ్య

వేస్ట్ బాస్కెట్స్ ఉండటమేంటి?  అనడిగాడు సుబ్బారావు

వేస్ట్ బాస్కెట్స్ అంటే మీ పేరంట్స్ అంది సౌమ్య…

సుబ్బారావుకి షాక్ కొట్టింది… తేరుకోడానికి 5 నిముషాల పైనే పట్టింది…

ఇక మాట్లాడటం అనవసరమనుకుని లేచి గుడ్ బై కొట్టి వెళ్ళిపోయాడు…

పాపం సుబ్బారావు మొదటి పెళ్ళి చూపులు ఈ విధంగా జరిగాయి..ఆ తరువాత చాలా చూపులు జరిగాయి. ఇదే సీన్ రిపీటయ్యింది..

కొందరు ఒకే కంపెనీలో పనిచేస్తే బాగుంటుంది అనుకుని రిజెక్ట్ చేస్తే ఇంకొందరు అమెరికాలో ఎక్కువ కాలం ఉండనందుకు రిజెక్ట్ చేశారు…తన క్వాలిఫికేషన్స్ కి ఎలాగైనా పెళ్లయిపోతుంది అన్న అతని గర్వం సర్వము ఖర్వమయింది…పాపం సుబ్బారావు ఈ పెళ్ళిచూపుల బాధలు పడలేక సింగపూర్ వెళ్ళిపోయాడు..ఇక జీవితంలో పెళ్ళిచేసుకోనని శపధం చేశాడు..

3 thoughts on “” వెటకారియా రొంబ కామెడీయా” – 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *