May 17, 2024

అమ్మాయి వెళుతోంది

రచన: దాసరాజు రామారావు

 

నా ఇంటిని నా ఇష్టానికే వదిలేసి

సర్దిన తీరులో తన ఇష్టాన్ని ముద్దరేసి

కాలానికి నా ఎదురుచూపులానించి

అమ్మాయి వెళుతోంది

 

కట్ చేస్తే

 

గుండెల మీద ఆడినప్పుడు

అ ఆ లు నేర్చుకోవాలన్నానేమో

వీధిలోకి ఉరికినప్పుడు

పట్టుకుపోయేటోడొస్తాడన్నానేమో

చంకనెక్కి, చందమామని చూపినప్పుడు

తెచ్చిస్తనని, మాట తప్పానేమో

ముద్దులొలకబోసినప్పుడు

మూట గట్టుకోవడం మరిచినానేమో

 

కట్ చేస్తే

 

రెండుజడలు వేసుకొన్నప్పుడు

పేరొందే కవయిత్రి కావాలని అని వుంటాను

అక్క చున్ని వేసుకొని గొడవ పడినప్పుడు

అక్క దిక్కే మొగ్గు చూపి వుంటాను

సినిమాల మీద మోజు చూపినప్పుడు

సమాజం చర్చ చేసి వుంటాను

అమ్మ ఒళ్ళో తలపెట్టి గొప్పలు పోతున్నప్పుడు

నా వాటా ఏమీ లేదాని ప్రశ్నించి వుంటాను

 

కట్ చేస్తే

 

విద్యార్హతలను ఉద్యోగంతో తూచ ప్రయత్నించానేమో

టాలెంటే సర్వాధికారి, సర్వాంతర్యామి అయినప్పుడు

వీక్ పాయింట్ దగ్గర వీక్ నెస్ ని రెట్టించానేమో

సెల్ చార్జింగ్ కి కరెంట్ కోతలున్నట్లు

సెల్ రీచార్జీలకి రూల్స్ పెట్టానేమో

రుచులను, అభిరుచులను

బ్రాకెట్లో బంధించానేమో

 

కట్ చేస్తే

 

కాబోయే సరిజోడును

కలల వూహల్తో కొలుస్తున్నప్పుడు

అతిశయోక్తి నుచ్చరించి వుండొచ్చు

వయసు దాటుతోందని

ఆప్షన్ల సంఖ్య కుదించి వుండొచ్చు

కాలం కఠినంగా గడుస్తోందని

హెచ్చరికలు చేసి వుండొచ్చు

తన కాలం కఠినంగా గడుస్తోందని

కన్ను ఒత్త్తిగిల్లిన సంగతి కని, విని వుండకపోవచ్చు

 

కట్ చేస్తే

 

అమ్మాయి వెళుతోంది

ఈ భూమి నుంచి ఆ భూతలస్వర్గానికి

డాలర్ల పక్కన చేరిన ఆయన సందిట్లోకి

 

తను ఏమడిగినా

సృష్టించైనా ఇవ్వడానికి సిద్దమైనా

తను పూదిచ్చిన ఇంటిని

చిటికెనవేలుతోనైనా మలుపకుండా వుంచడానికే  నిర్ణయించిన

 

ఈసారి కట్ చేయొద్దు

 

అయ్య చేతిలో తనను పెట్టినప్పుడు

చేతులతో పాటు మనసూ వణికింది

అరుంధతి నక్షత్రం చూపించినవాడు

అమెరికాకి రమ్మంటున్నడు

 

పెళ్ళి రోజున

నా ఇంటి గడప కడిగి

కడుపు తడి చేసి

కనిపెంచిన రుణం తీర్చుకొని

 

అమ్మాయి వెళుతోంది

 

రుణాలని తేర్పుకోవచ్చు

ప్రేమలని తేర్పుకోవడముంటదా…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *