May 19, 2024

వెటకారియా రొంబ కామెడియా 4

రచన: మధు అద్దంకిmadhu

డయిటింగ్..డయిటింగ్..డయిటింగ్

ఉస్సూరంటూ ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు రామారావు…

తలబద్దలయిపోతోంది కాస్త కాఫీ పడేస్తావా అంటూ అరిచాడు రామారావు…

ఎక్కడా చప్పుడు లేదు..ఎమయ్యిందబ్బా అనుకుంటూ లోపలికి తొంగి చూశాడు.

.టీ.వీ ఎదురుగా యోగా మాట్ వేసుకుని ఏదో ఆసనం వేయడానికి నానా తిప్పలు పడుతోంది భార్య గజలక్ష్మి..

గజం అంటూ నెమ్మదిగా పిలిచాడు ..

ఉహూ పలకలేదు..ఆసనం వేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యింది..

గజం అని పెద్దగా పిలిచాడు..ఉలిక్కిపడి తలతిప్పి చూసింది ఏంటన్నట్టు..

మొగుడనేవాడు ఆఫీస్ నుండి వస్తాడు వాడి మొహాన కాస్త కాఫీ నీళ్ళన్నా పోద్దామనే ఆలోచన ఉందా అని అరిచాడు రా.రా( రామారావు)

ఏమండీ ఇంత కష్టపడి నేను ఆసనాలు వేస్తున్నా కదా.. ఆ కాఫీ ఏదో మీరు కలుపుకుని నాకూడా కాస్త పడెయ్యొచ్చుకదా అంది గజం..

ఏమి అనే ఓపిక లేక బలవంతంగా పళ్ళు నూరుకుంటూ వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకున్నాడు రా.రా

కాఫీ సరే ఏమి వండి తగలేసిందో అనుకుంటూ గిన్నెలన్నీ మూతలు తీసి చూశాడు..

గిన్నెలన్నీ ఖాళీ..

కోపం నషాళానికి అంటి చిందులు తొక్కడం మొదలెట్టాడు ధన ధన ధన అంటూ..

భూకంపం,భూకంపం అంటూ భూమి అదిరేలాగా పరుగులెడుతూ గజం బయటకి వెళ్ళబోయింది…

గజం రెక్కుచ్చుకుని ఆపేశాడు రా.రా అది భూకపం కాదు కోపంలో నేను తొక్కిన చిందులకి భూమి అదిరింది అని చెప్పాడు..

ఎందుకలా చిందులేశారు అనడిగింది గజం..

ఎందుకా ఆకలేస్తోంది ..ఎమన్నా ఉందేమో తినటానికి అని చూస్తే ఏమీ లేదు..రోజంతా ఏమి చేశావ్ వంట కూడ చెయ్యకుండా అనరిచాడు రా.రా..

ఇవాళ నుండి నేను డయటింగ్ చేస్తున్నా…నాతో పాటు మీరు కూడ చేస్తున్నారు నాకు నైతికంగా మద్దతిస్తున్నారు అన్నది..

ఆ నేనొప్పుకోను అని అరిచి మళ్ళా చిందెయ్యబోయాడు రా.రా..

రెక్కుచ్చుని లాగింది గజం..

చేయి ఊడిపోయిందేమో అన్నంత నొప్పి పుట్టింది రా.రా కి..

సరే చిందెయ్యను కాని ఇంకెప్పుడూ ఇలా రెక్కుచ్చుకుని లాగకు..అర్భకుడిని తట్టుకోలేను అన్నాడు..

గజం….హి హి హీ అని పిలచాడు..

ఏంటీ అన్నట్టుగా చూసింది గజం…ఆకలేస్తోంది గజం అన్నాడు..

సరే ఉండండి తెస్తాను అని వంటింట్లోకి వెళ్ళింది.. ఈ లోపల టీ.వీ ఆన్ చేసి పిలుస్తుందేమో అని చూస్తున్నాడు.. ఇంతలోపల ఒక పళ్ళెం నిండా ఆకు కూరలు ఇంకో పళ్ళెం నిండా కూరగాయ ముక్కలు పెట్టుకొచ్చింది

అదేంటి ఇప్పుడు వంట చేస్తావా అనడిగాడు రా.రా..

హి.హి.హీ అని నవ్వుతూ ఒక్క జెల్లకాయిచ్చింది రా.రా కి మీరు భలే జోకులేస్తారు అంటూ..

ఇవి వంట చెయ్యడానికి కాదు తినటానికి అంది..

పక్కలో బాంబ్ పడ్డట్టు అదిరిపడ్డాడు రా.రా.. ఏమిటీ ఈ గడ్డి ఇప్పుడు నేను తినాలా? అవునండి మరి నేనేమో  నోరు కట్టుకోలేను…. నేను డయటింగ్ చేస్తున్నప్పుడు మీరు మామూలు తిండి తింటే ఇంక నా డయటింగ్ సాగినట్టే అందుకని నాతో పాటు మీరు కూడ డయటింగ్ అన్నది గజం..

హతవిధీ ఎంత దెబ్బ కొట్టావే అనుకుంటూ దిక్కులేని పక్షిలాగా ఒక్కసారి ఆ కాయగూరలవైపు చూశాడు…

ప్లీస్ తినరూ అంటూ బుంగమూతి పెట్టింది గజం..

ప్లీస్ అలా బుంగమూతి పెట్టకు గజం ..మామూలుగానే నిన్ను చూడలేను. మళ్ళా ఆ బుంగమూతి కూడ ఎందుకు అన్నాడు..

మీరు భలే చిలిపి అంటూ చళ్ళున చరిచింది గజం..

ఇదో ఇలా చీటికి మాటీకి నువ్వు తోలు ఊడొచ్చేలా చరిచావంటే నేను ఈ తింది తినను బయటనుండి పిజ్జా తెప్పించుకుని తింటా అని బెదిరించాడు..

ఆ రోజు నుండి మొదలయింది జీవహింస రా.రా కి…

ఒకరోజు పచ్చి కూరలు,

ఇంకో రోజు ఉడికించిన కూరలు..అందులోను ఉడికించిన బెండకాయ..(అది తినలేక వాంతి చేసుకున్నాడు పాపం.)

ఇంకో రోజు కేవలం కూరగాయల జూస్.. కాకర, బెండ, పుదినా ఇలాంటివి.. వీటన్నింటికి తోడు రోజూ 5 కిలోమీటర్ల నడక, ఆసనాలు వగైరా వగైరాలు..

ఈ డయటింగ్ వల్ల గజలక్ష్మి అంగుళం కూడ తగ్గలేదు కాని రా.రా మాత్రం బక్కచిక్కి పోయి, పేగులు, ఎముకలు బయటపడి అస్థి పంజరంలా తయారయాడు..

ఒకరోజు ఉన్నట్టుంది ఆఫీసులో కళ్ళు తిరిగి పడిపోయాడు… కొలీగ్స్ హాస్పిటల్ కి వేసుకుపోయారు…

అతనికి సర్వ రకాల పరీక్షలు చేసి డాక్టర్ చెప్పాడు..ఇతను తిండి తిని చాలా రోజులయినట్టుంది ముందు కడుపు నిండా భోజనం పెట్టండి అని…

అలాగే దాక్టర్ అంటూ గుడ్ల నీరు కుక్కుకుని తలూపింది గజం…

కొన్నాళ్ళ తర్వాత ఇంటికి వచ్చిన రా.రా కి కనిపించిన దృశ్యం ఏంటంటే ఒక ప్లేట్ నిండా పకోడీలు, ఇంకో పళ్లెంలో బర్గర్ పెట్టుకుని భోంచేస్తోంది గజం…

గజం ఏంటి నువ్వు డయటీంగ్ మానేశావా అనడిగాడు రా.రా.. లేదండీ డయటింగ్ చేసి నోరు చచ్చిపోయింది అందుకని అప్పుడప్పుడు ఏదో వారానికి 5 సార్లు మాత్రమే ఇవి తింటుంటాను అన్నది..

హా అంటూ విరుచుకు పడిపోయాడు రా.రా….

ఇదండీ గజలక్ష్మి డయటింగ్ కధ…

 

మీరందరూ కూడ డయటింగ్ పేరుతో కనిపించినవల్లా ట్రై చేయకుండా , కడుపు కాల్చుకోకుండా పౌష్టికాహారం తీసుకుని వ్యాయామం చేయండి…

3 thoughts on “వెటకారియా రొంబ కామెడియా 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *