May 2, 2024

మా సినిమా బొమ్మల బాపు

రచన: బదరీనాథ్ దూర్వాసుల

 bapu

తెలుగు లిపిలో ఒక వినూత్న శైలిని, కుంచెతో తనదైన చిత్రలేఖనా పాటవాన్ని, తెలుగు సినిమా ప్రపంచంలో ఉన్నతమైన కళా ప్రమాణాల్ని ఆవిష్కరించిన బొమ్మల బాపూ, ఇక మనకు లేరు! కానీ  నేటి సగటు తెలుగు సంస్కృతిపై వారు నిక్షేపించిన బీజాలు, చిరకాలం వర్దిల్లి  సొబగులిస్తాయి! రసజ్ఞుల హృదయాల్లో పదిలంగా పలు శతాబ్దాలు నిలుస్తాయి!

చిత్ర పరిశ్రమలో ఒక వినూత్న శైలిని ప్రారంభించిన బాపూ-రమణల సాన్నిహిత్యం మరువలేని దృశ్య కావ్యాలను మన ముందుంచింది! సరళమైన సంభాషణలతో, మాండలిక ప్రయోగాలతో, నిబద్ధమైన విలువలతో రూపొందించిన వారి చిత్ర నిర్మాణం మార్గదర్శకమయ్యింది! ఆమ్యామ్యా, తీతా, డిక్కీలో తొంగోట్టేస్తా… లాంటి ప్రయోగాలు ఒక పక్క, గంగావతరణం గీత దృశ్య మాలికా సమన్వయం లాంటివెన్నో మరో పక్క, వారి కీర్తి కుసుమాల సౌరభాన్ని నలు దిక్కులా వ్యాప్తి చేసాయి!

కుంచె మాంత్రికుడో, గాన సమ్మోహనా గాంధర్వుడో, దృశ్య ధనుర్ధరుడో తెలియదు కానీ – మనవాడు, మనందరివాడు, మన తెలుగు వాడు. మన బాపు అనిపించుకున్న ఆ మహానుభావుడు అందని లోకాలకు ఏతెంచాడు! చిత్ర దర్శకత్వం కేవలం ఆయనలో ఒక కోణం మాత్రమే! ఆయన వ్యక్తిత్వ పటిమ వివరిస్తూ పొతే ఎన్నో కోణాలను ఆవిష్కరింపబడతాయి!

“గుట్ట మీద గువ్వా కూసింది …కట్ట మీద కౌజు పలికింది” అనే ఒక పాటలో వారి దర్శక ప్రతిభ తెలుగుదనపు ఒరవడికి మెరుగులు దిద్దింది! “ఎదగడానికెందుకురా తొందరా …ఎదర బ్రతుకంతా చిందర వందర” అనే పాటలో వారి దర్శక పటిమ, వైరాగ్యంతో కూడిన జ్ఞాన దీపికను ఆవిష్కరిస్తుంది! “ఆకాశం దించాలా …నెలవంక తుంచాలా” అంటూ భక్త కన్నప్ప లో వారందించిన రంగుల హరివిల్లు ప్రేమికుల హృదయాల్లో కాంతులు ఇముడుస్తుంది!  ఎన్నని ఉటంకించగలను? లెక్కలేనన్ని పాటలు, వారి మృదు మధుర వైఖరిని తెలియపరుస్తాయి! ఈనాటికీ, పెద్దల ఎదురుగా ఏదైనా పాట పాడాలంటే, వారి చిత్ర సమాహారాల్లోంచి ఏదైనా పాటను ఎంచుకోవలసిందే! ఎబ్బెట్టుతనానికి ఎంతో దూరంగా వుంటాయి బాపుగారి చిత్ర నిర్దేశపు రస గుళికలు!

ఇక ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు, ప్రతి నాయకుడికి వారు క్రొంగొత్త  భాష్యం చెప్పారు! మెత్తటి కత్తికి మెరుపులు దిద్దారు! సంభాషణల సమాహారానికి సరికొత్త పుంతలు తొక్కించారు! ఆనాటి తెలుగునాట, ఇంటింటా, అవే సంభాషణలు! ఇంకా చెప్పాలంటే తెలుగువారి సగటు గ్రాంధికంలో ముత్యాల ముగ్గు సంభాషణలు నిత్య నానుడిలో ప్రవేశించాయి! “మడిసన్నాక కూసంత కలా పోసనుండాలయ్యా”అనే సంభాషణ ప్రతీ తెలుగు హృదయాన్నీ ఉర్రూతలూగించింది! “మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది” అనే సంభాషణ మొరటుగా వున్నా, నిజాన్ని నిక్కచ్చిగా నిగ్గుదీస్తుంది!

అయితే ఒక చిన్న విషయం. సంభాషణలు ముళ్ళపూడివారివైనా, మదిలో ముద్ర వేయించింది బాపూనే! ఆయన తన కుంచె ప్రయోగించి, మస్తిష్కాన్ని మేధించి  కావలసిన శైలిలో గేయ, సంభాషణా రచయితలని, సంగీత దర్సకుల్ని అన్వయించుకునేవారు! నటులలో ఉత్తేజాన్ని నింపి కావలసింది రాబట్టుకునేవారు! వారొక మెత్తటి కత్తి! గీతల మాంత్రికుడు! అందుకనే ఆయన చిత్ర, సాహితీ, సంగీత సౌరభాలు ఇంటింటా పదిలంగా ఉన్నాయి!

సంపూర్ణ రామాయణం వారు నిర్దేశించిన చిత్రాల్లో చాలా ఉన్నత ప్రమాణాలను స్పృశించింది! చాల సందర్భాల్లో రాముని వ్యక్తిత్వాన్ని చూపించే వారి శోధన అనిర్వచనీయం! రామునిలో  రాగ ద్వేషాలను నియంత్రించి దర్సకత్వం చేసిన విధానం  అలనాటి నటుడు శోభన్ బాబు చాలా పొగిడారు! సన్నివేశ పరంగా రామునికి జరుగుతున్న అన్యాయానికి వారి మనసు కోపంతో ఊగిపోయినా, బాపు నియంత్రణతో వారు సన్నివేశాల్లో ఆవేశం అణచుకొన్నారట!! రాముడు మానవ రూపంలోని దైవమండీ, కోపం రాకూడదు అని చెప్పారట!!

అంతెందుకు! రామ శబ్దం లేని వారి చిత్రమే లేదు! మానవ రూపంలో నిలచిన ఆ భగవత్ స్వరూపమంటే వారికి అంతులేని అభిమానం! ప్రతీ దృశ్య కావ్యంలో  వారు రాముని చిత్ర పటాల్ని కొంగ్రొత్త కోణాల్లో చూపించేవారు!

వ్యక్తిగా వారు స్నేహానికి కొత్త నిర్వచనం చెప్పారు! ముళ్ళపూడి వారితో వారి అనుబంధం వర్ణనాతీతం! కలిసి బ్రతికారు, కలిసి జీవించారు, కలిసి అనుభవించారు! కొమ్మ ఒకరైతే పండు మరొకరు! తీగ ఒకరైతే పువ్వొకరు! బొమ్మ ఒకరైతే బొరుసోకరు! వ్యక్తులు వేరైనా ఒకరి కొరకు వేరొకరు పరిశ్రమించారు! అక్కినేని వారికీ, రామారావు గారికీ వీరిద్దరంటే అంతులేని అభిమానం! వారి చిత్రాలకి వీరందుకున్న పారితోషికం అంతంతే! అయితేనేం? ఆ నటులు అందుకున్న ప్రజాదరణ, వంద రెట్ల మూల్యాన్ని అందజేసింది! అది వారికీ తెలుసు, వీరికీ తెలుసు!

తిరుమల తిరుపతి దేవస్థానపు ఆస్థాన సేవకుడిగా వారందించిన చిత్ర పటాలు మరువలేని మణిహారాలు! ప్రతి గుండెలో పదిలమైన పావురాళ్ళు! వేంకటేశ్వరుని పాద ప్రవల్లిక మరపురాని అనుభూతినిస్తుంది! అది చిత్రిస్తున్నప్పుడు- స్వామి ముఖ సౌందర్యం తట్టుకోలేను, నాకు వారి పాదాలే సరి, అని ఎన్నో చిత్రాలు చిత్రించారు!

ఆ మహనీయ వ్యక్తి, బాపు అని ప్రేమతో పిలువబడే సత్తిరాజు లక్ష్మీ నారాయణ గారు, విష్ణు చరణాలను స్పృశించిన సందర్భంలో  అందించిన ఈ విహంగ వీక్షణం, ప్రేమతో స్వీకరిస్తారని, ఆ కళా మూర్తిని స్మరిస్తూ ఆనందిస్తారని ఆశిస్తూ…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *