May 18, 2024

మా నేపాల్ దర్శనం-2

రచన:మంథా భానుమతి.mantha bhanumathi

 

మరునాడు పొద్దున్నే ఏడుగంటలకి తయారయిపోయి, వాన్ లో పోఖరా బయలుదేరాము. దారిలో “మనకామనా దేవి” ఆలయ దర్శనం.. నాలుగు గంటలు పైగా పట్టింది. ఆలయం కొండ మీదుంది. కొండ కింద నున్న ‘కురింతర్’ అనే ఊరు చేరడానికి నాలుగు గంటలు పైగా పట్టింది. దూరం ఎక్కువ లేదు కానీ, అంతా ఘాట్ రోడ్డు.

హిమాలయ శ్రేణుల్లోంచి మెలికలు తిరుగుతున్న బాటలో వెళ్తుంటే దారిలో దృశ్యాలు కన్నులకి విందే!

కురింతర్ నుంచి కేబుల్ కారులో పది నిముషాలు ప్రయాణం. ఈ సదుపాయం లేనప్పుడు, గుఱాలమీద, కాలి నడకన మూడు నాలుగు రోజులు పట్టేదిట.

మనకామనా దేవి ఆలయం-

ఎక్కడో మారుమూల చిన్న దేశం నేపాల్,, ఏం పెద్ద జనం ఉంటార్లే అనుకున్నాం, మంగళవారం రష్ ఉంటుంది అని హోటల్ వాళ్ళు చెప్తున్నా కూడా.

కేబుల్ కారు క్యూ చూసేటప్పటికి కళ్ళు తిరిగాయి. ఎప్పటికి పైకి వెళ్ళాలి. ఎప్పుడు దర్శనం అవాలి.. తిరుపతి జనరల్ క్యూకి ఏ మాత్రం తీసిపోదు.

పైగా హిమాలయాలు కదా.. ఏప్రిల్ నెలలో ఎండ ఏముంటుందిలే అనుకుంటే అమాయకత్వమే!

నీరసంగా తల మీద చెంగులు, టోపీలు వేసుకుని నిలబడ్డాం. ఈ లోగా ఒకతను కేబుల్ కార్ టికెట్స్ ఉన్నాయి కొంటారా అని హడావుడిగా క్యూలో తిరుగుతున్నాడు. మీకు ట్రావెల్ ఏజెంట్ ఇచ్చాడులే అని చూసుకుంటుంటే.. “టికెట్లున్న వాళ్ళు క్యూలో నించోనక్కర్లేదు. సీదా ఫ్రంట్ కి వెళ్ళిపోండి” అని అరిచాడు.

కాబోసనుకుని మేము గర్వంగా తలెత్తి, అక్కడ నిలబడిన వాళ్ళని జాలిగా చూస్తూ గబగబా ముందుకంటా వెళ్ళిపోయాం. తీరా వెళ్ళాక,

“ఎవరు చెప్పారు? మూడు వంతుల మందికి టికెట్లుంటాయి.. పీచే జావ్..” హేళనగా నవ్వాడు అక్కడి అధికారి. ఈ లోగా రెండు బస్సుల జనం వచ్చి క్యూ మూడు ఫర్లాంగుల దూరం పెరిగింది. ఇంక మా వాళ్ళు నన్ను ముందుకు తోశారు.

నాకు నెగోషియేషన్స్ లో కొంచెం పేరుందిలెండి.

చాలా దూరం నుంచి వచ్చాం బేటా! సబ్ సీనియర్ సిటిజెన్స్ హై.. ప్లీజ్..” ఆ  హేళనతని వెంట పడ్డాను, విదిలిస్తున్నా లెక్క చెయ్యకుండా.

“అడ్డంగా కట్టిన తాడు కింది నుంచి ఒక్కొక్కళ్ళు మెల్లిగా లోపలికి జారుకోండి..” కొంచెం సేపయ్యాక, దయతలచి, నాకేసి చూడకుండా అన్నాడు, పైన ఉన్న వాడికి సైగ చేసి.

మొత్తానికి, స్టేషన్ ఇంకా అర ఫర్లాంగు దూరం ఉందనగా నడుం కలుక్కుమంటుండగా దూరి, ఒక చిన్న కొండ మెట్లు ఎక్కుతున్నాం

ఒకావిడ గట్టిగా దెబ్బలాడ్డం మొదలు పెట్టింది.. సడన్ గా ఎక్కడ్నుంచొచ్చారంటూ.

మమ్మల్ని కాదన్నట్లు ప్రకృతి సౌందర్యం తిలకించడంలో ములిగి పోయాం. అలా చివరి వరకూ సాధిస్తూనే ఉంది. అదృష్టవశాత్తూ, మా ముందున్న ఒడిస్సా దంపతులు, “ఏ హమారా పరివార్ హై..” అంటూ దబాయించారు. మూతి మూడు వంకలు తిప్పింది, నేపాలీ వీర వనిత.

చివరాఖరుకి కేబుల్ కారులో ఆరుగురం వచ్చి పడ్డాం. ఒక సారి కదిలాక, అప్పటి వరకూ పడిన శ్రమ అంతా మర్చిపోయాం. అలా కొండల్లో పైకి వెళ్తుంటే.. కింద తీరుగా పెంచిన పోడూ పంటలు, ఆకాశాన్నంటే శిఖరాలు, చెట్లు.. అందరం మాటలు మానేసి బైటికి చూస్తుండి పోయాం. మా పక్కనుంచి మేకల అరుపులు వినిపిస్తున్నాయి. అంత ఎత్తున ఎక్కడ్నుంచా అని చూస్తే.. మా వెనుకే ఒక కేబుల్ కారు, బోనులా ఉంది. అందులో పది మేకలు తలని కడ్డీల బైటికి పెట్టి అరుస్తున్నాయి. తరువాత తెలిసింది, అక్కడ పశుబలి ఇస్తారని.

కేబుల్ కారు లోనుంచి దృశ్యం.

కేబుల్ కారులోంచి దిగి మళ్ళీ కొన్ని గుట్టలు మెట్లు ఎక్కి దాటుకుని వెళ్తే అప్పుడు మొదలయింది అసలు కథ. పై నుంచి నెత్తి మీదికి చురుక్కుమని పొడుస్తున్న ఎండ.. ఎత్తు ఎక్కువైతే వేడి కూడా ఎక్కువవుతుందనుకుంటా. మెలికలు తిరిగి ఎంత దూరమో తెలియకుండా ఉన్న క్యూ .. పన్నెండు దాటింది. కళ్ళు తిరగడం మొదలెట్టాయి.

“గుడి దగ్గరగా వెళ్ళి కొబ్బరి కాయలు కొట్టడానికి దర్జాగా వెళ్ళిపోవచ్చు.. ఒక సౌ కొట్టండి.” ఒక పంతులు సెలవిచ్చాడు.

అబ్బా.. స్పెషల్ దర్శనం ఇంత చవకా అని సంతోషించి, అలాగే చేశాం. తీరా వెళ్ళిందాకా ఉండి, బైటే కొట్టి, మొహాన ఇంత బొట్టు మెదిపి తోసేశాడు అయ్యవారు. అక్కడ నా బేరాలేం చెల్లలేదు. ఇంతలో క్యూ.. మరో మైలు..

గుమ్మం ఇవతల నుండే మెడలు నొప్పెట్టేలా వంకర్లు తిరిగి చూసి దణ్ణం పెట్టుకున్నాం. ఇంతా చేసి అక్కడ అమ్మవారు మధుర మీనాక్షిలాగో, కంచి కామాక్షిలాగో ఉందనుకుంటే ఆశాభంగమే. వైష్ణోదేవిలో లాగా చిన్న విగ్రహం.. అది కూడా పువ్వులతో కప్పేసి, కాకపోతే లోపలికి వెళ్ళిన వాళ్ళు విగహానికి తల ఆన్చి మొక్కుకోవచ్చుట.

మనకామనా ఆలయం.

ఈ మనకామనా దేవి ఎవరు?

క్రీ.శ. 1614 సంవత్సరంలో జన్మించిన గోర్ఖా దేశపురాణి తన భక్తుడైన లఖన్ థఫాకి మాత్రమే దేవతగా కనిపించేది. ఒక రోజు రాజు, తన తన రాణీని దేవతగా చూసి, ఆ సంగతి రాణీకి చెప్పాడు. చెప్పిన వెంటనే మరణిస్తాడు. రాణీ సతీ సహగమనం చేస్తుంది.   లఖన్ థఫా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే తను మళ్ళీ కనిపిస్తానని ఓదారుస్తుంది. ఆరు నెలల తరువాత, ఒక రైతు పొలం దున్నుతుంటే, నాగలి రాయికి తగిలి, రాతిలోనుంచి రక్తం, పాలు ధారలా వస్తాయి. లఖన్ థఫాకి ఈ విషయం తెలిసి, ఆ ప్రదేశానికి వెళ్ళి, మంత్ర తంత్రాలతో పూజలు జరిపిస్తాడు. అప్పుడు రక్త ధార ఆగిపోతుంది.

అక్కడే దేవతకి గుడి కట్టి, అప్పట్నుంచీ మనసులో కోరికలు తీర్చే దేవత కింద అందరూ ఆరాధిస్తున్నారు.

ప్రస్థుతం అక్కడున్న పూజారి, లఖన్ థఫా పదిహేడవ తరంలోని వాడట.

కొండ దిగి వచ్చేటప్పుడు తీరిగ్గా అక్కడున్న దుకాణాలన్నీ చూసుకుంటూ, రోడ్డు పక్కనే ఉన్న శాఖాహార భోజనశాలలో పప్పు, పనీర్ మటర్ కూర, చపాతీలు, అన్నంతో భోజనం చేశాం. పెరుగు కావాలంటే ప్రత్యేకం చెప్పుకోవాలసిందే. చెప్పిన అరగంటకి తెచ్చాడు. భోజనం బానే ఉంది కానీ, రాత్రికి అందరికీ కడుపు నొప్పి తగులుకుంది.

మళ్ళీ కేబుల్ కారులో తిరుగు ప్రయాణం. కొన్ని కేబుల్ కారు బోనుల్లో మేక శరీరాలు రక్త సిక్తమైన, గోనె సంచుల్లో దర్శనమిచ్చాయి. తలలు పక్కకి తిప్పేసి కూర్చున్నాం.

 

పోఖరా—

మనకామనా దేవికి మనసారా నమస్కరించి, కొండదిగి, పోఖరా పట్టణానికి ప్రయాణమయ్యాం. భారత దేశానికీ, టిబెట్ కీ మధ్యన రవాణాలు ఈ పట్టణం ద్వారా సాగిస్తారు. ఖాట్మండూ తరువాత, నేపాల్ లో  మూడవ పెద్ద పట్టణం. అందులో మా హోటల్, మేమూ వస్తున్న దిశలో కాక ఊరికి అటు పక్కనుంది. మొత్తం నగర సందర్శనం అయితే కానీ చేరలేకపోయాం. సంపన్నులు ఉండే పట్టణంలాగ అనిపించింది. పెద్దపెద్ద భవనాలు, విశాలంగా లేకపోయినా తీర్చిదిద్దిన వీధులు.. లోయలో, కొండల మధ్య ఆహ్లాదంగా ఉంది. మేము వెళ్తుంటే సూర్యాస్తమానం అవుతోంది. ప్రకృతి మాత సోయగాలు చూసి తీరవలసిందే!

పోఖరా “సేతి గండకీ” లోయలో ఒక భాగం. పోఖరా పట్టణం దక్షిణాన ఫేవా సరస్సునుంచి, ఉత్తరాన అన్నపూర్ణా పర్వత శ్రేణి వరకూ విస్తరించి ఉంది. సేతి గండకీ నది పట్టణం లోనుంచి కొన్ని చోట్ల అంతర్వాహిని లాగ ప్రవహిస్తూ ఉంటుంది. ఫేవా సరస్సు ఉత్తరం వైపు ఒడ్డున పర్యాటకులు ఉండే హోటళ్ళు, దుకాణాలు ఉన్నాయి. మా బస అక్కడే హోటల్ మీరాలో ఏర్పాటు చేశారు. సాయంత్రం అందరం దుకాణాల మీద పడ్డాం.. ఏవో చిన్న చిన్న వస్తువులు, పూసలూ, శాలువాలు కొని, రాత్రి విశ్రాంతి తీసుకున్నాం.

మరునాడు పొద్దున్నే ముక్తినాధ్ వెళ్ళాం. ఆ వివరాలు తరువాత చెప్తాను.

ముక్తినాధ్ నుంచి వచ్చిన రోజే హోటల్ కి రాకుండానే నగరంలో చూడవలసినవి చూపిస్తానని డ్రైవర్ పట్టు పట్టాడు. మూడు గంటల్లో మమ్మల్ని గిరగిరా తిప్పేసి తను ఖట్మండూ వెళ్ళిపోవాలిట.

“మేము అలిసి పోయి ఉన్నాం బాబూ ముందు హోటల్ కి వెళ్ళి స్నాన పానాదులన్నీ తీర్చుకుంటేనే కానీ అడుగు ముందుకెయ్యలేమని గొడవ పెట్టాం. గుణుక్కుంటూనే తీసుకెళ్ళాడు. తీరా హోటల్ కి వచ్చాక, గదులు ఖాళీ లేవు, రెండు గంటలు పడుతుందని చెప్పారు. ఈసురో మంటూ మళ్ళీ వాన్ ఎక్కి పదపద మన్నాం.. డ్రైవర్ విజయ గర్వంతో చూస్తుండగా!

డేవి జలపాతం-  “పతలె చాంగ్” (హెల్’స్ వాటర్ ఫాల్)గా ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం, పోఖరా విమానాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్నే డేవిడ్ వాటర్ ఫాల్ అనికూడా అంటారు. పర్ది కోలా నదిలో స్నానం చేస్తున్న డేవిడ్ అనే విదేశీయుడు, అనకట్ట గేటు తెరవడంతో, జలపాతంలోకి పడిపోయి మళ్ళీ కనిపించలేదట. అందుకని ఆ పేరు వచ్చిందని చెప్తారు.

 

 

డేవి జలపాతం

 

ఆవరణలోకి ప్రవేశించగానే ఆహ్లాదకరమైన వాతావరణం.. తీరుగా పెంచిన తోట, అందులో జంతువుల ఆకారంలో కత్తిరించిన చెట్లు. కొంచెం లోపలికి వెళ్ళి, మెట్లు దిగి కిందికి వెళ్తే చిన్న చెరువు, మధ్యలో పెద్ద పళ్ళెంలో దేవత విగ్రహం. ఆ పళ్ళెంలో నాణాలు వెయ్యాలి. తిన్నగా విగ్రహం కాళ్ళదగ్గర పడితే కోరికలు నెరవేరుతాయట.. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా.. సర్ఫేస్ టెన్షన్, బ్యుఓయన్సీ వగైరాలు.. ఒక్క నాణెం పడితే ఒట్టు. వదిలేసి అలా కొండ మీదినుంచి కిందికి పడుతున్న జలపాతం చూసుకుంటూ చకచకా మెట్లు దిగాం.. మళ్ళీ అవన్నీ ఎక్కాలన్న సంగతి మర్చిపోయి..

 

డేవి జలపాతం వద్ద తోటలో శివలింగం, నంది.

 

ఎలాగో కష్టపడి అన్ని మెట్లూ ఎక్కి, తోటలో శివలింగాలని చూసుకుంటూ బయటికి వచ్చాం. నేపాల్ హిందూ రాజ్యం కదా.. ఎక్కడికక్కడా ప్రతీ ఫర్లాంగుకీ చిన్న గోపురం, గుడి.. అందులో కాళీ విగ్రహం కానీ, శివలింగం కానీ! లోపలికి వెళ్ళి నుదిటి మీద పెద్ద బొట్టుతో బయటికి వచ్చే భక్తులు.. హడావుడిగా ఉంటుంది.

 

గుప్తేశ్వరుడి గుహ- ఈ పవిత్రమైన గుహలో శివుడు స్వయంభు వెలిశాడని అంటారు. డేవి జలపాతం ఎదురుగా ఉన్న ద్వారంలోనుంచి వెళ్తే వస్తుంది. పెద్ద హాలు వంటి గదులు దాటాక.. మూడు కిలోమీటర్లు పొడవున్న గుహ. పాకుతూ మోకాళ్ళ మీద నడుస్తూ వెళ్ళాలి. మేము పాకాల్సిన చోటు వచ్చే వరకూ వెళ్ళి దణ్ణం పెట్టి వచ్చేశాం.

 

పోఖరా స్తూపం- డ్రైవర్ చిటపటలాడ్తూనే (ఆ రోజు సాయంత్రానికి ఖట్మండూ చేరుకోవాలి మరి).. తరువాతి మజిలీకి తీసుకెళ్ళాడు. నేపాల్ లో బౌద్ధస్థూపాలు విరివిగా కనిపిస్తాయి.. అందులో పోఖరా టిబెట్ కి చాలా దగ్గర కూడా.. చాలా పెద్ద స్థూపం. ఒరిస్సాలోని నందన్ కణ్ణన్ ని జ్ఞప్తికి తెచ్చింది.

 

 

 

పోఖరా స్తూపం.

ఇవన్నీ చూసేసరికి ఒంటిగంట దాటింది. ఆకలి, నీరసం. హోటల్ కి వచ్చాక స్నాను, భోజనాలు అయ్యాక నిస్త్రాణగా వాలిపోయాం మంచాల మీద. సాయంత్రం ఐదు దాటాక కానీ లేవలేదు. అప్పటికి కాస్త తేరుకుని, టీ తాగి నాలుగడుగులు వేసి ఎదురుగా ఉన్న వీధిలోకి వెళ్ళి, ఫేవా సరస్సు చేరుకున్నాం. సరస్సు మధ్యలో ఉంది వారాహీ దేవి మందిరం.

వారాహీ మందిరం- సరస్సు మధ్యలో ద్వీపం.. అందులో మందిరం. చల్లని సాయంకాలం. చుట్టూ కొండలు, సరస్సు ఒడ్డున దూరంగా చెట్లలో నుంచి తొంగి చూస్తున్న భవనాలు.. మలయ మారుతం. ఓహ్! మా నేపాల్ ప్రయాణం లోని రెండవ అద్భుతమైన అనుభవం. మొదటిది తరువాత చెప్తాను.

రసమయ జగతిని రాసక్రీడలలాగా ఇద్దరిదరం ఒక్కొక్క పడవ మాట్లాడుకుని, ద్వీపాన్ని చుట్టి మరీ.. మందిరానికి తీసుకెళ్ళమన్నాం. మా నావని పదిహేనేళ్ళ అమ్మాయి నడపడానికి వచ్చింది. దాని పేరు కాళీ. సన్నగా.. ఇంకా మొహంలో పసితనపు చాయలు వదల్లేదు. నేను గట్టిగా వద్దనబోతే, అక్కడున్న వస్తాదులాంటి సరంగులు ఫరవాలేదని భరోసా ఇచ్చారు..

మరి వాళ్ళేం చేస్తారుట.. బేరాలు ఆడుతుంటారేమో! చెప్పద్దూ చాలా భయం వేసింది. ఒడ్డు ఎంత దూరం ఉందో మనసులో గుణించుకుంటూనే ఉన్నాను.. అవసరమైతే ఈదుకుంటూ చేరడానికి. కానీ కొంత దూరం వెళ్ళేసరికి నమ్మకం వచ్చేసింది. మూడుసార్లు ఎడం చేత్తో, నాలుగు సార్లు కుడి చేత్తో తెడ్లు వేస్తూ బానే నడిపింది కాళీ.. అలవాటే ననుకుంటా..

 

కాళీ, నేనూ.. ఫేవాసరస్సు.

 

 

 

వారాహీ దేవి మందిరం-

మందిరం ఆవరణ అంతా గచ్చు చేసి ఉంది. మధ్యలో పెద్ద పెద్ద చెట్లు. మందిరం వెనుక తోట. కూర్చోవడానికి గట్లు. నలువైపులా చక్కని దృశ్యాలతో కదలాలనిపించలేదు.

చిన్నదే అయినా పగోడా ఆకారంలో గుడి. కొంచెం పెద్దగా ఉన్న అమ్మవారి విగ్రహం. ఇటూ అటూ చిన్న చిన్న విగ్రహాలు.. అవి ఎవరివో అక్కడ చెప్పే వాళ్ళు లేరు. మూల విగ్రహం మాత్రం.. వారాహి (అక్కడ బారాహి అంటారు.).. లలితా సహస్రనామాల్లోని పేరు. మనం తీసుకెళ్ళిన పూలు స్వయంగా అలంకరిచి, పాదాలు పట్టుకుని మొక్కుకోవచ్చు. గుడి బయట ఉన్న పూజారి, తీర్థం ఇచ్చి, మొహాన పెద్ద బొట్టు పెట్టి పంపేశాడు. చీకటి పడే వరకూ ఉండి, మళ్ళీ నావలో ప్రయాణం చేసి, తేలిక పడ్డ మనశ్శరీరాలతో, హోటల్ కి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ నిద్రకుపక్రమించాం.

మరునాడు పొద్దున్నే విమానంలో ఖట్మండూ చేరుకున్నాం. అరగంట ప్రయాణం. విమానాశ్రయం వద్ద మళ్లీ మా వాన్ డ్రైవర్ తయారుగా ఉన్నాడు. ఇంక వీడ్కోలు పలికే సమయం.. ప్రసన్నంగానే ఉన్నాడు. ఆ రోజంతా ఎక్కడికెళ్ళాలన్నా మా ప్రయత్నాలు మావే అని చెప్పాడు.. “కిశోర్.. ది ట్రావెల్ ఏజంట్.”

వచ్చే నెల ముక్తినాధ్ వింతలు..

 

1 thought on “మా నేపాల్ దర్శనం-2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *