May 4, 2024

మలాలా యూసెఫ్ జై: ది ఫైటర్

రచన:   డా. జె. గౌతమి సత్యశ్రీ  pic.-for-maalika

 

 

 

 

కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్దులు……  పావన నవ జీవన బృందావన నిర్మాతలు….

అని శ్రీశ్రీ గారు చెప్పినట్లు ఒక పావన నవజీవన బృందావన నిర్మాత పదహారేళ్ళ ఈ పాకిస్తానీ అమ్మాయి మలాలా యూసెఫ్ జై.  ప్రపంచమంతా ఈమెను ఆరాధించడానికి కారణం ఆమె చేస్తున్న పోరాటాలే. పాకిస్తానీ అమ్మాయిలందరికీ చదువుకునే యోగ్యతకు తాలిబన్ మిలిటెంట్ల వల్ల భంగం కలగకూడదని,  ఆమె నిరంతరం జరుపుతున్న పోరాటం ఆమెను ఒక అంతర్జాతీయ చిహ్నం గా నిలబెట్టింది.

Malala-Yousafzai1

మలాలా 1997, జూలై 12 న పాకిస్తాన్ లో నార్త్ వెస్ట్ లో మింగోరా కి చెందిన స్వాట్ వ్యాలీ ప్రదేశంలో జన్మించింది.  ఆమె చిన్నప్పుడు  ఆ ప్రదేశం చక్కటి టూరిస్ట్ ప్రదేశం. వేసవి రాగానే ఎక్కడెక్కడినుండో ప్రజలు ఆ ప్రదేశానికి విహారయాత్రలకు వచ్చేవారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్నంతటినీ తాలిబన్ మిలిటెంట్ ఫోర్స్ ఆక్రమించింది. తాలిబన్ తిరుగుబాటుదారులు పాకిస్థాన్ ని ఆక్రమించి అక్కడి స్కూల్స్ ని తమ చేతిలోకి తీసుకుని మతతీవ్రవాదాన్ని పాఠ్యాంశాలలో చొప్పించి, పిల్లలకి బలవంతంగా అలవర్చి వారి దారిలోకి వచ్చేలా శిక్షణను ఇస్తున్నారు. అది మగపిల్లల స్కూల్స్ లోని పరిస్థితి. ఇక ఆడపిల్లల స్కూల్స్ ను భయపెట్టి మూయించేస్తున్నారు.  ఇది ఆ ఒక్క ప్రదేశంలోనే కాదు, పాకిస్థాన్ చుట్టు పక్కల ప్రదేశాలలో కూడా ఇదే సమస్య. ఎన్నో వేల కుటుంబాలు భయంతో తమ పిల్లల్ని ఆయా స్కూల్స్ కి పంపించక తప్పట్లేదు. ఈ తిరుగుబాటుదారులు ఫార్మల్ ఎడ్యుకేషన్ కు అడ్డుపడుతూ, అడ్డొచ్చిన పౌరులపై దాడులు చేస్తూ, భయపెడుతూ, స్కూల్స్ ని మూయిస్తూ, ఆడపిల్లలని చదవనీయకుండా, మగపిల్లల్ని తీవ్రవాదానికి అలవాటు పడేలా చేస్తున్నారు. మతతీవ్రవాదాన్ని భోదించే స్కూల్స్ ని మదర్సా అని అంటారు. అటువంటి స్కూల్స్ నుండి జాగ్రత్తగా తప్పించుకుని తల్లిదండ్రులను జేరిన పిల్లలు ఆ స్కూల్స్ లో వీళ్ళకి .. ఆఫ్ఘనిస్థాన్ లో జిహాద్ యాత్రకు తమని తాము ఎలా త్యాగం చేసుకోవాలో, ఎలా ప్రాణాలను ఒడ్డాలో శిక్షణ ఇస్తున్నారని ప్రజలకు, మీడియాకు తెలియపరిచారు. ఈ తాలిబన్ లీడర్లు కూడా ఇటువంటి మదర్సాల నుండి శిక్షణ పొందిన వాళ్ళేనట. ఆ శిక్షణ ఇస్తున్నంత కాలమూ పిల్లలకు ఉచిత భోజనం, ఉచిత నివాసం కల్పించడం వల్ల పేదకుటుంబాలకు ఇది ఒకరకమైన ఆకర్షణ. ఈ ఆకర్షణలో పడిపోయి ఎంతోమంది పేదలు తమ బిడ్డలను కోల్పోతున్నారు కూడా. మామూలు స్కూల్స్ కి పంపితే ఉచిత సౌకర్యాలు వుండవు కదా.. అక్కడ పేదరికంది కీలకపాత్ర.  కానీ ఈ వ్యూహం లో పడి, తమకి తాము, తమ బిడ్డల భవిష్యత్తుకు, దేశానికి ఆ తర్వాత ప్రపంచానికి ఎంత తీరని నష్టం కలుగుతుందో కనీసపు అంచనా కూడా వెయ్యలేని బ్రతుకులు. ఇక ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి చూస్తే…  20 యేళ్ళకి పైగానే ఈ తీవ్రవాద దాడులకు ఆఫ్ఘనిస్థాన్ బలయ్యి, అక్షరాస్యత చాలా దెబ్బతిన్నది.  స్త్రీలలో అక్షరాస్యత 12.3 శాతం వుంటే పురుషుల్లో 43 శాతం మాత్రమే వుందిట. జాతీయస్థాయిలో  తీసుకుంటే కేవలం 28 శాతం మాత్రమే. ఇప్పుడు ఈ జాడ్యం పాకిస్థాన్ కి కూడా ప్రాకి, అక్కడ కూడా ఈ విషబీజాలు నాటుకుంటున్నాయి..  మరి ఇంత జరుగుతున్నా ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేదా? ఎందుకు లేదూ?? దీని చరిత్ర చూస్తే ఈ ఆఫ్ఘనిస్థాన్ ఎన్నో విధానాలకి లొంగి, పాలింపబడింది.. మోనార్కీ అని, రిపబ్లిక్ అని, రెలిజియస్ గ్రూప్స్, డిక్టేటర్షిప్స్ అలాగే కమ్యూనిస్ట్ గ్రూప్స్ అని. ఈ విధంగా ఆఫ్ఘనిస్థాన్ స్థిరత్వాన్ని కోల్పోయింది. గత పదేళ్ళనుండి ఈ దేశం NATO (North AtlanTic Treaty Organization, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) దేశాల ఆధ్వర్యంలో వుంది. ఇది వివిధ దేశాల రాజకీయ సమూహము.  తాలిబన్లనుండి ఆఫ్ఘనిస్థాన్ ని రక్షించడం దీని ప్రధాన కర్తవ్యం. ఈ దేశాలలో యునైటడ్ స్టేట్స్ కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నది.  తాలిబన్లతో ఎన్నో రాజీ ప్రయత్నాలూ చేసుకుంటూ శాంతిభద్రతలను నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తూనేవుంది. IRIN (Integrated Regional Information Network, ఇంటిగ్రేటెడ్ రీజినల్ ఇన్ ఫర్మేషన్ నెట్ వర్క్) న్యూస్ ఏజెన్సీ కధనం ప్రకారం రాజీలు కుదుర్చుకుని, ఎన్నో స్కూళ్ళను తిరిగి తెరిపించడం, క్రొత్త స్కూళ్ళను కట్టించడం ప్రభుత్వం చేస్తున్నదట. వాళ్ళతో పడిన రాజీ ప్రకారం, పాఠ్యాంశాలలో మోడ్రన్ సైన్స్ సబ్జెక్ట్స్ తో పాటు, మతపరమైన సబ్జెక్ట్స్ ని కూడా చొప్పించడానికి మాటలు సాగాయిట. ఇంకా ఎన్నో స్కూల్స్ ముఖ్యంగా ఆడపిల్లల స్కూల్స్ ఇంకా మూతబడే వున్నాయి. అభద్రత కారణంగా, సాంప్రదాయక ఆచరణల వల్లన, లింగభేదాల వలన ఆడపిల్లల చదువులు పూర్తిగా కుంటుపడ్డాయి.

malala-taliban-scared

ఇదిలా వుంటుండగా.. తాలిబన్ల వల్ల పాకిస్థాన్ లో కూడా కలకలం రేగింది. ఎన్నో స్కూళ్ళ విధ్వంసాల వల్ల,  ఆడపిల్లల చదువులు కుంటుపడ్డాయి.  వీటిమధ్య నుండి లేచిన ఒక ఉద్యమమే ఈ చిన్నారి మలాలా యూసెఫ్ జై. మలాలా పషతన్ తెగలో పురుషాధిక్యత గల కుటుంబాల్లో జన్మించింది. ఆమె తండ్రి జియాద్దీన్ యూసెఫ్ జై అభ్యుదయ భావాలు గలవాడగుట చేత, మగపిల్లల పేర్లు మాత్రమే కుటుంబ జాబితాలో చేర్చబడే ఆచారంవున్నప్పటికీ,  మగపిల్లల పేర్లతో సమానంగా ఆ పిల్ల పుడుతూనే ఆమె పేరును కూడా కుటుంబ జాబితాలో చేర్చి ఒక అపూర్వమైన మార్పును తెచ్చిన వ్యక్తి.  మలాలా అనే పేరు కూడా 1880 లో బ్రిటిష్ నుండి ఆఫ్ఘన్ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఒక స్వాతంత్ర యోధురాలి పేరు. అటువంటి పేరు ఆ అమ్మాయికి పెట్టడం అనేది కూడా వాళ్ళ అభ్యుదయవాదాన్ని తెలియపరుస్తుంది.  మలాలా తన తండ్రి స్కూల్ లోనే చదువుకునేది. స్కూళ్ళమీద తాలిబాన్ల దాడుల తర్వాత.. మొట్టమొదటిసారిగా మలాలా 2008 లో బహిరంగంగా స్పీచ్ ఇచ్చింది.  అప్పటికి ఆమె వయసు కేవలం 11 సంవత్సరాలు. ఆమె టాక్ యొక్క టైటిల్- ఎంత దైర్యం తాలిబన్ కు, నా ప్రాధమిక హక్కు చదువును నాకు దూరం చెయ్యడానికి?. 2009 లో తాను గుల్ మకాయ్ అని పేరు మార్చుకుని BBC కి ఒక బ్లాగ్ ఓపెన్ చేసి తాను చదువు మానేయాలని, ఆ స్కూల్ మూసేయాలని, ఉద్యమాలు వదిలేయాలని తాలిబాన్ల నుండి తనకు వస్తున్న హెచ్చరికలను ఎప్పటికప్పుడు చేరవేస్తుండేది.  తాను ఈ పేరు మార్చుకొని తన ఐడెంటిటీ ని దాచడానికి కారణం, తాలిబన్లకు దొరక్కుండా వుండడానికి.  ఇంత చిన్న వయసులో ఎంత ఒత్తిడి పిల్లలకి! అయినా సంవత్సరాంతంలో  తానెవరో బయటపెట్టేసింది. ఆపై ప్రజావేదికపై అనర్గళం గా పిల్లల హక్కుల పోరాటమే కాకుండా.. స్త్రీవిద్యాపోరాటం గా కూడా ఉద్యమం ఒక ఊపు అందుకుంది.  ఆమె క్రియాశీలత 2011 లో అంతర్జాతీయంగా బాలల శాంతి బహుమానం (ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్) అలాగే అదే సంవత్సరంలో పాకిస్తాన్ జాతీయ యూత్ శాంతి బహుమానాల్ని (పాకిస్థాన్ నేషనల్ యూత్ పీస్ ప్రైజ్) తెచ్చిపెట్టింది.  ఆమె 14 వ ఏట తాలిబన్ డెత్ వారెంట్ ఇష్యూ చేసింది.  అది తెలుసుకున్న తల్లిదండ్రులు చాలా భయపడ్డారు. ఆమె తండ్రి మొదటినుండి యాంటీ తాలిబన్ ఫోర్స్, అందుకే ఆయన కూడా వ్యతిరేక చర్యలకు కూతురితో ముందంజ వేసాడు.  ఒక మైనర్ బాలికను చంపడానికి తాలిబన్ ముందుకు రాదని భ్రమించాడు కానీ తాలిబాన్ అన్నంత పని చేసింది.  అక్టోబర్ 9, 2012 న స్కూల్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు,  దారిలో బస్సు ఆపి ఆమెపై, ఆమె స్నేహితురాళ్ళపై కాల్పులు జరిపారు. మలాలా కు తగిలిన బుల్లెట్ తలలో ఎడమ భాగానికి చొచ్చుకుని పోయి, అక్కడినుండి మెడ క్రింద భాగానికి ప్రయాణించింది.  మలాలా కోమాలోకి వెళ్ళిపోయింది.  ఆమెను వెంటనే పేష్వార్ లోని ఒక మిలిటరీ హాస్పిటల్ కి తరలించి, అక్కడినుండి బర్మింగ్ హామ్, లండన్ కి తరలించారు. మరికొన్ని సర్జరీలు జరిగి, ఆమె కోమా నుండి బయటికి వచ్చేటప్పటికి కొంతకాల పట్టింది. ఈ పీరియడ్ లో, ఆమెని సపోర్ట్ చేస్తూ.. ఆ దేశంలోని పౌరులెందరో తాలిబన్ కాల్పులకు గురి అయ్యారు. మార్చి, 2013 లో పూర్తిగా కోలుకుని, బర్మింగ్ హామ్ లోనే ఆమె స్కూల్ కి వెళ్ళడం మొదలుపెట్టింది.

తాలిబాన్ ఆమె పై హత్యాప్రయత్నాలు చేసి విఫలం అయి మరింత తప్పు చేసిందనే అనుకోవాలి. ఎందుకంటే,  ఆ తర్వాత జరిగిన విద్యాపోరాటానికి ఆమె చాలా బలమైన శక్తి గా మళ్ళీ ఉద్భవించింది. ఆమె చేస్తున్న ఈ పోరాటాలకు ప్రతీకగా యూరోపియన్ పార్లమెంటు అక్టోబర్ 10, 2013 న “సఖారవ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడం ఆఫ్ థాట్” అనే అవార్డ్ ని ఇచ్చింది. 2013 లో ఆమె 16 వ పుట్టినరోజుకి యునైటడ్ నేషన్స్ కి స్పీచ్ ఇచ్చింది. తన ఆటోబయోగ్రఫీ నంతటినీ ఒక పుస్తక రూపంలో వ్రాసి అదే సంవత్సరంలో రిలీజ్ చేసింది. ఈ అమ్మాయి చేస్తున్న పోరాటాన్ని గుర్తించడంతో అక్టోబర్ 2014 లో చిల్డ్రన్ రైట్స్ యాక్టివిస్ట్  కైలాష్ సత్యార్ధి తో పాటుగా మలాలా కు కూడా నోబుల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. పాకిస్థాన్ ప్రైం మినిస్టరు నవాజ్ షరీఫ్ మలాలా తన దేశానికి గర్వకారణమని, ప్రపంచంలోని పిల్లలందరూ ఆమెలోని స్పూర్తి ని తీసుకుని ముందడుగు వెయ్యాలని పొగిడారు. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ బన్ కి మూన్ కూడా మలాలా ధైర్య సాహసాలకి మెచ్చుకుని ఆమె సింపుల్ గా స్కూల్ కెళ్ళే ఒక అమ్మాయి గ్లోబల్ టీచర్ అయ్యిందని కొనియాడారు. కానీ ఇంత జరుగుతున్నా తాలిబాన్ మలాలాను ఇంకా వాళ్ళ  టార్గెట్ గా పరిగణిస్తుండడం దుదృష్టకరం……

కొన్నికధలు ఇంతేనేమో….

 

 

2 thoughts on “మలాలా యూసెఫ్ జై: ది ఫైటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *