May 13, 2024

ఆరాధ్య – 3

రచన: అంగులూరి అంజనీదేవి                  anjanidevi

http://www.angulurianjanidevi.com 

anguluri.anjanidevi.novelist@gmail.com

 

మాటల మధ్యలో రాకేష్‌ గురించి వున్నది వున్నట్లు చెప్పింది ఆరాధ్య… అంతా విని ‘రాకేషే కాదు. రాకేష్‌కన్నా ఇంకా డేంజర్‌ ఫెల్లోస్‌  వున్నారు బయట. అమ్మాయిలు అంత త్వరగా ఎవరినీ నమ్మకూడదు. నమ్మినా ఒంటరిగా ఎక్కడికంటే అక్కడికి వెళ్లకూడదు. నీ పట్ల రాకేష్‌కి దుష్టబుద్ధి కలగనందుకు సంతోషించు..” అన్నాడు.

అతనలా అంటుంటే నిజమే ఈ విషయంలో తను చాలా లక్కీ అనుకుంది.

”కాశిరెడ్డికి నేను నీకు ఉద్యోగం ఇప్పించినట్లు తెలిసి ఒక రోజు నిన్ను చూడాలని, నాతో నిన్ను పరిచయం చేయించుకున్నాడు. ఆరోజు బస్‌లో రాకేష్‌ వెంటబడింది నువ్వే అని గుర్తుపట్టాడు. ఇక అప్పటి నుండి కాశిరెడ్డి వూరుకోలేదు. ”రే! రాకేష్‌! అప్పుడు బస్‌లోంచి ఒకమ్మాయి నీ వెంట పడింది కదా! ఎవరా అమ్మాయి? ఏం జరిగిందో చెప్పు” అంటూ వెంటబడ్డాడు. పైగా కామెంట్స్‌ కూడా… నువ్వు కాశిరెడ్డికి తెలుసని రాకేష్‌కి తెలియదు. అయినా కూడా నీ గురించి అతను ఒక్క మాట కూడా బ్యాడ్‌గా చెప్పలేదు. అదే మాకు ఆశ్చర్యమనిపించింది. ఎందుకంటే రాకేష్‌లాంటి వాళ్లెప్పుడూ అలా వుండరు. రాకేషే కాదు ఏ అబ్బాయి అయినా తనకి ఒక అమ్మాయితో క్లాష్‌ వచ్చిందీ అంటే ఆ అమ్మాయి గురించి నెగటివ్‌గానే చెబుతాడు. అందుకే అబ్బాయిలతో ఫ్రెండ్‌షిప్‌ చేసేటప్పుడు అమ్మాయిలు ఒకటికి రెండు సార్లు బాగా థింక్‌ చేశాకనే చెయ్యాలి. కేర్‌ఫుల్‌గా వుండాలి. ఇప్పుడు రాకేష్‌ మా గదిలో లేడు. కాశిరెడ్డిని భరించలేక వేరే ఫ్రెండ్స్‌ గదికి షిఫ్ట్‌ అయ్యాడు. అతను మా గదిలో లేకపోయినా ఆఫీసులో మాత్రం నా క్యూబికల్‌ పక్కనే వుంటాడు. రోజూ కన్పిస్తాడు” అన్నాడు.

ఆరాధ్య ఆసక్తిగా ”అలాగా! అతను వర్క్‌ విషయంలో ఎలా వుంటాడు?” అంది.

ఆమె వర్క్‌ చేసే బిల్డింగ్‌ వేరే కాబట్టి రాకేష్‌ ఆమెకు కన్పించడు. ఆమె రాకేష్‌కి కన్పించదు.

”అతనా!” అన్నాడు నవ్వుతూ హేమంత్‌.

హేమంత్‌ నవ్వు వినగానే అర్థమైపోయింది ఆరాధ్యకి రాకేష్‌ ఆఫీసులో ఎలా వుంటాడో! అయినా అతనేం చెబుతాడో అని అతనివేపే చూసింది.

”రాకేష్‌కి పనికన్నా పనికిరాని కబుర్లు ఎక్కువ… ఆఫీసుకి సమయానికి వచ్చినా వెంటనే పనిని ప్రారంభించడు. గాసిప్‌లతో సమయాన్ని బాగా వృధా చేస్తాడు. ఆఫీసులో వున్న ఇంటర్‌నెట్‌ను కూడా సక్రమంగా ఉపయోగించుకోడు. సోషల్‌ నెట్‌వర్క్‌ మీద గంటలు గంటలు గడిపేస్తాడు. ఎప్పుడు చూసినా పర్సనల్‌ మెయిల్స్‌ చూసుకోవటం, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లోకి వెళ్లటం చేస్తుంటాడు… ఫోన్లొస్తే చాలు సెల్‌ ఫోన్‌ని చెవి దగ్గర పట్టుకుని అలాగే కూర్చుంటాడు. అతను సరిగా పని చెయ్యడు. పక్క కూబికల్‌ అతనిని పని చెయ్యనియ్యడు. నేను చాలాసార్లు చెప్పి చూశాను. పనిని నిర్లక్ష్యం చేస్తే డెడ్‌లైన్‌ సమయానికి పూర్తి చేయలేమని… అయినా వినేవాడు కాదు. నేనిక చెప్పటం మానేశాను” అన్నాడు హేమంత్‌.

రాకేష్‌ విషయం వదిలేస్తే హేమంత్‌ మాటలు ఎవరు విన్నా ఆఫీసు వర్క్‌ను నీట్‌గా నేర్చుకుంటారు. దానికి నిదర్శనం ఆరాధ్యనే! ఆరాధ్య కూడా హేమంత్‌ తనకి రిఫరెన్స్‌ ఇచ్చాడు కాబట్టి పనిపట్ల కాన్‌సన్‌ట్రేషన్‌ పెడుతోంది. హేమంత్‌ చెప్పిన మెలకువల్ని పాటిస్తోంది.

”ఇక వెళ్దామా?” అంటూ లేచాడు హేమంత్‌.

ఆరాధ్య ”సరే!” అంటూ ఆమె కూడా లేచి హేమంత్‌తో పాటే బైక్‌ వరకు నడిచి, అతను బైక్‌ స్టార్ట్‌ చెయ్యగానే అతని వెనకాల కూర్చుంది.

ఎప్పటిలాగే వాళ్లిద్దరు మాదాపూర్‌ పెట్రోల్‌పంపు చేరుకోబోతుండగా అటువైపు నుండి అదే సమయంలో ఇంటికొస్తున్న శార్వాణి వాళ్లను చూసింది.

ఆరాధ్య శార్వాణిని చూడలేదు. ఆమె ఎప్పటిలాగే ఇంటికెళ్లింది. శార్వాణి ఆరాధ్యకన్నా ముందే ఇంటికెళ్లింది.

ఎప్పుడైనా శార్వాణి ఆఫీసు నుండి వచ్చిన ఆరాధ్యను చూడగానే నవ్వుతుంది. కాఫీ తాగమంటుంది. రీఫ్రెష్షయి రిలాక్సవమని చెబుతుంది. ప్రేమగా మాట్లాడుతుంది.

ఈరోజు అలాంటిదేం లేదు. ఆరాధ్యవైపు చూడాలంటేనే ఇష్టంలేని దానిలా అయిష్టంగా చూస్తూ ”నువ్వు మా ఇంట్లో వుండొద్దు ఆరాధ్యా! వెంటనే వెళ్లిపో! నీ సామాన్లు కూడా కొన్ని బయటపెట్టాను. ఇంకా ఏమయినా లోపల వుంటే వెళ్లి తెచ్చుకో!” అంది. ఆవిడ అటు, ఇటు కదలకుండా గోడలా అక్కడే నిలబడింది.

ఆరాధ్యకు అర్థంకాక బొమ్మలా నిలబడి దిక్కులు చూస్తోంది. ఆవిడ అలా అంటుంటే గదిలోకి వెళ్లలేకపోతోంది.

”నువ్వు గదిలోకి వెళ్లినా వెంటనే నీ సామాన్లతో బయటికిరా! అక్కడ వుండొద్దు” అంది.

ఆరాధ్య కళ్లలో నీళ్లు తిరిగాయి.

”ఆంటీ! నేనేం చేశాను? మీరు నన్నెందుకిలా అవమానించినట్లు మాట్లాడుతున్నారు?”

”మీరేమీ చెయ్యరమ్మా! అబ్బాయిల బైక్‌ల మీద మాత్రం తిరుగుతారు. జరగరానిది ఏమైనా జరిగితే మీ తల్లిదండ్రులు ఏడవరు. మామీద వచ్చి పడతారు. బాధ్యతగా చూడలేనప్పుడు మీ ఇంట్లో ఎందుకుంచుకున్నారు? అని అడుగుతారు. ఇవన్నీ మాకెందుకు చెప్పు? ఇలాంటి తలనొప్పులు మాకు అవసరమా?” అంది.

శార్వాణి మాటలు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యాయి ఆరాధ్యకి…

”ఆంటీ! నేనూ, అతనూ ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇంట్లో చెప్పాలని వెయిట్‌ చేస్తున్నాం. అంతవరకు మీరు కూడా కొంచెం ఓపిక పట్టండి. ఈ విషయంలో నేను హామీ ఇస్తాను” అంది.

”చాలు చాలు నీ హామీలు. జాబ్‌ ఇప్పిస్తాను హైదరాబాదు రమ్మని హ్యాండిచ్చిన ఆ రాకేష్‌ని నువ్వు నమ్మి అతని బైక్‌ మీద తిరుగుతావేమో కాని నేను నమ్మను. నువ్వతని మాయలో మళ్లీ పడిపోయావు. నీ కర్మ” అంది.

”ఆంటీ! ఇతను రాకేష్‌ కాదు. ఇతను వేరే!” అని ఆరాధ్య హేమంత్‌ గురించి చెప్పబోయేంతలో ఉపేంద్ర వచ్చాడు.

”వాళ్లను అలా చూసి ఏంటీ మీ ఇద్దరేదో ఘర్షణ పడుతున్నట్లున్నారు? ఏం జరిగింది?” అని అడిగాడు.

ఏం జరిగిందో శార్వాణి చెప్పింది.

”ఈ ఒక్కసారికి వార్నింగ్‌ ఇచ్చి వదిలెయ్‌! ఇంకెవరి బైక్‌లు ఎక్కదులే!” అన్నాడు ఉపేంద్ర.

ఆ… ఇదేంటి వీళ్లు నన్నిలా అనుకుంటున్నారు అని నివ్వెరపోతోంది ఆరాధ్య. ఏదో చెప్పబోయింది.

”నువ్వింకేం చెప్పకు. మా ఆయన డబ్బు మనిషి. నెలనెల నువ్విచ్చే డబ్బుల కోసం ఆయన అలాగే అంటారు. నేను మాత్రం నిన్ను ఉండనివ్వను. ఇప్పుడే వెళ్లిపో! వెళ్తావా? వెళ్లవా?” అంది కోపంగా!

ఆరాధ్య ఇంకేం మాట్లాడలేదు. రోషంగా గదిలోకి వెళ్లింది. వెంటనే తన సామాన్లతో బయటకొచ్చింది.

రోడ్డు మీదకొచ్చి నిలబడి హేమంత్‌కి కాల్‌ చేసింది.

”హేమంత్‌! ఆంటీ నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టారు. ఇప్పుడు నా పరిస్థితేంటి?” అంటూ జరిగింది మొత్తం చెప్పింది.

అంతా విని ”ఏం కాదు. నువ్వేం కంగారు పడకు. నువ్వెక్కడున్నావో చెప్పు” అన్నాడు హేమంత్‌.

చుట్టూ చూసి ఆమె ప్రస్తుతం ఎక్కడున్నదో చెప్పింది.

”అక్కడే వుండు. నేనొస్తున్నా…” అంటూ వెంటనే షార్ట్‌లోంచి డ్రస్‌లోకి మారి ఇంట్లోంచి బయటకొచ్చాడు. బైక్‌ మీద కూర్చుని బైక్‌ను ఎప్పుడూ పోనంత స్పీడ్‌గా పోనిచ్చాడు. అతను పోతున్న వేగానికి  ఒత్తుగా వున్న అతని క్రాప్‌ పట్టుకుచ్చులా వెనక్కి ఫోల్డయి గాలి తాకిడికి చెదిరిపోతోంది. చూపులు అతి చురుగ్గా రోడ్డుమీద కదులుతున్నాయి. అతనంత స్పీడ్‌గా బైక్‌ను నడుపుతున్నా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూనే వెళ్లాడు.

బైక్‌ దిగి ఆమె దగ్గరకి వెళ్లాడు… ఈ కొద్ది సమయంలోనే ఆమె పడిన మానసిక వత్తిడి ఆమె ముఖంలో కన్పించింది.

ఆమె భుజాల చుట్టూ చేయివేసి ”ఏయ్‌! పిచ్చీ! ఎందుకలా ఫీలవుతావు? నేనున్నాను కదా!” అంటూ ఆమె తలను గుండెలకు అదుముకున్నాడు…

ఆమె ఒక్కక్షణం మౌనంగా ఒదిగి ఆ తర్వాత సున్నితంగా అతని చేతిని విడిపించుకొని ”ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం హేమంత్‌?” అంది.

అతను వెంటనే ఆమె బ్యాగ్‌ను బైక్‌ మీద పెట్టుకొని

”ఎక్కు. వెళ్దాం!” అన్నాడు.

ఆమె బైక్‌ ఎక్కగానే బైక్‌ స్టార్ట్‌ చేసి, ఆమె పని చేస్తున్న ఆఫీసుకి దగ్గర్లో వున్న లేడీస్‌ హాస్టల్లోకి తీసికెళ్లాడు.

హాస్టల్‌ వార్డెన్‌తో మాట్లాడి ఆరాధ్యను అందులో జాయిన్‌ చేశాడు.

జాయిన్‌ చేసి బయటకొస్తుంటే ”ఒక్క నిముషం హేమంత్‌!” అంటూ వెనక నుండి పిలిచింది ఆరాధ్య.

గేటు వరకు వెళ్లిన హేమంత్‌ తిరిగి చూసి ”ఏమైనా కావాలా? చెప్పు తెచ్చిచ్చి వెళ్తాను” అన్నాడు.

”వద్దు హేమంత్‌!” అంది

”మరింకేంటి? ఎందుకు పిలిచావో చెప్పు?” అన్నాడు.

”చెప్పాలి. లేకుంటే నా మనసులో నేను ఏమనుకుంటున్నానో నీకెలా తెలియాలి?” అంది.

”అంటే! ఇంకా మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకునే స్టేజిలోనే వున్నామంటావా?”

”ఛ…ఛ అది కాదు హేమంత్‌! మా వాళ్లెవరూ దగ్గర లేకపోయినా అంతకన్నా ఎక్కువ కేర్‌గా నన్ను చూసుకుంటున్నావు. అది చెప్పాలనే పిలిచాను… నాకు మా మమ్మీ, డాడీలకన్నా, మా బాబాయిలు, పిన్నిల కన్నా నువ్వే ఎక్కువగా అన్పిస్తున్నావు. నిజం హేమంత్‌!” అంది నవ్వి.

ఆమె చాలా ఓపెన్‌గా మాట్లాడుతున్నట్లు ఆమె పెదవులు చాలా స్థిరంగా కదులుతున్నాయి. ఆ పెదవుల మధ్యలో వెన్నెల మెరిసినట్లు లేలేతగా కన్పిస్తున్న ఆ నవ్వునే చూస్తూ ”థాంక్యూ! అవసరమైతే కాల్‌ చెయ్యి ఆరాధ్యా!” అంటూ వెళ్లిపోయాడు హేమంత్‌.

అక్కడే నిలబడి చాలాసేపు అతను వెళ్తున్న వేపే చూసింది ఆరాధ్య.

ఒక మనిషి కోసం ఇంకో మనిషి పడే తపన, తాపత్రయం అంటే అదే!

 

* * * * *

 

హేమంత్‌, ఆరాధ్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ విషయం హేమంత్‌ తన స్నేహితులతో కూడా చెప్పుకున్నాడు. ”హ్యాపీరా!” అంటూ హేమంత్‌ని హగ్‌ చేసుకొని తమ సంతోషాన్ని తెలియచేశారు.

ఆరాధ్య ఇంట్లో చెప్పింది ”నేను హేమంత్‌ని పెళ్లి చేసుకుంటా” అని… పెళ్లిళ్ల పేరయ్యలు చూపించిన ఫోటోలు, నెట్‌లో చూసిన ఫోటోలకంటే హేమంత్‌ ఫోటోనే వాళ్లకి బాగా నచ్చింది. హైటు, వెయిట్‌, రంగు, చదువు, ఉద్యోగం అన్నీ నచ్చాయి. నచ్చనివి కొన్ని వున్నాయి. అందుకే ఆరాధ్య చెప్పగానే తటపటాయించారు. ఆ తర్వాత ఆరాధ్య వాళ్లను ఒప్పించటానికి చాలా కష్టపడింది. నొప్పించకుండా కొంత జాగ్రత్తపడింది. వాళ్లు పెళ్లి ఎలా జరిపించాలనుకుంటున్నారో, దానికి హేమంత్‌ ఏమంటాడో ఏమో ఒకసారి అతనితో మాట్లాడి ఏ విషయం అయినా మాతో చెప్పమన్నారు శాంతారాం, రమాదేవి.

”అతనితో మీరే మాట్లాడవచ్చు కదా?” అంది ఆరాధ్య.

”ఇది మన బంధువుల సంబంధం అయితే వాళ్ల తల్లిదండ్రులతో, వాళ్లవైపు పెద్దవాళ్లతో మాట్లాడేవాళ్లం. ఇప్పుడు అతనివైపు ఎవరూ లేరంటున్నావు కదా! పైగా ప్రేమించానంటున్నావు. నీ మాటకు విలువ ఇచ్చి ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాం. ఏది మాట్లాడినా మా మాటగా నువ్వే అతనితో మాట్లాడు. అవసరాన్ని బట్టి మేముకూడా మాట్లాడతాం!” అన్నారు.

ఆరాధ్య ఏం మాట్లాడలేదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పెళ్లి జరిగితే చాలనుకుంది. అసలే హేమంత్‌ చాలా సెన్సిటివ్‌గా వుంటాడు. ఎంత సెన్సిటివ్‌గా ఉంటాడో అంత షార్ట్‌టెంపర్‌. అతనితో ఏది మాట్లాడబోయి ఏది మాట్లాడినా ఇబ్బంది అవుతుంది. చివరకు తన పెళ్లి ఆగిపోతుంది. మెంటల్‌గా ఇతన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయిపోయాక మరొకరిని పెళ్లి చేసుకొని లైఫ్‌ని కంటిన్యూ చెయ్యలేదు. ఈరోజుల్లో నచ్చినవాళ్లని ప్రేమించి పెళ్లి చేసుకోలేక బాధపడుతున్నవాళ్లే ఎక్కువగా వున్నారు. దానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు. ఏదో పిల్లలు ప్రేమించుకున్నారులే పెళ్లిచేసేద్దామనుకోరు. కాబట్టి ప్రతిచోట మామాటే నెగ్గాలనుకుంటారు. ప్రేమ గురించి అసలు ఆలోచించరు. పైగా ప్రేమ మాట వింటేనే అంతెత్తున ఎగురుతారు. అలాంటప్పుడు తనకు ఈమాత్రం ఛాయిస్‌ దొరకటం ఎటుచూసినా ప్లస్‌పాయింటే అన్పించింది.

ఆఫీసు అవర్స్‌ అయ్యాక లిఫ్ట్‌లో ”హేమంత్‌! మన పెళ్లి గురించి మా ఇంట్లోవాళ్లు ఏమన్నారో నేను నీతో మాట్లాడాలి” అంది.

”సరే! అటువెళ్లి ఓ రెస్టారెంట్‌లో కూర్చుందాం! కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం! రిలాక్స్‌డ్‌గా వుంటుంది” అన్నాడు. వాళ్ల వెంట లిఫ్ట్‌లో కాశిరెడ్డి కూడా వున్నాడు. ”నేను రూంకెళ్తాను హేం!” అంటూ లిఫ్ట్‌ డోర్‌ తెరుచుకోగానే బయటకెళ్తూ అన్నాడు కాశిరెడ్డి.

”మీరు కూడా మాతో రండి అన్నయ్యా!” అంటూ కాశిరెడ్డిని పిలిచింది ఆరాధ్య.

”ఓ.కె.” అంటూ కాశిరెడ్డి కూడా వాళ్లతోపాటు రెస్టారెంట్‌కి వెళ్లాడు. ముగ్గురు ఓచోట కూర్చున్నారు. ఎవరికివాళ్లు చాలా ప్రశాంతంగా వున్నారు.

ఆరాధ్య తనకి ఎదురుగా కూర్చుని వున్న హేమంత్‌ని, కాశిరెడ్డిని చూస్తూ మాటలు ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తోంది.

”మాట్లాడు ఆరాధ్యా! మీ ఇంట్లో ఏమన్నారు?” అడిగాడు హేమంత్‌.

”మన పెళ్లికి ఒప్పుకున్నారు హేమంత్‌! పెళ్లి వాళ్లే చేస్తామన్నారు. నువ్వు రిసెప్షన్‌ చేస్తే సరిపోతుంది” అంది.

హేమంత్‌ తనలో కలిగిన ఉలికిపాటును అణచుకోలేక ”రిసెప్షనా?” అన్నాడు.

”మరి నువ్వు పెళ్లి చేస్తే మావాళ్లు రిసెప్షన్‌ పెట్టుకుంటారు. కానీ మా వంశ ఆచారం ప్రకారం పెళ్లి అమ్మాయి ఇంట్లోనే జరగాలి. అలాగే జరగనివ్వండి! మావాళ్లకి కూడా ఆ అసంతృప్తి లేకుండా వుంటుంది” అంది.

”మీరు పెళ్లి చెయ్యటం, నేను రిసెప్షన్‌ చెయ్యటం ఈ రెండు పద్ధతులు నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు రిజిష్టర్‌ మేరేజ్‌ చేసుకోవాలని వుంది. అలాగే ఫిక్సయిపోయాను” అన్నాడు హేమంత్‌.

”మా నాన్న ఒక్కడే కాదు ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు వున్నారు. వాళ్లు చిన్నచిన్న బంగారు షాపులు పెట్టుకొని మా వూరిలోనే స్థిరపడిపోయారు. రిజిష్టర్‌ మేరేజ్‌కి వాళ్లెవరూ ఒప్పుకోరు. రేపు మనిద్దరి మధ్యన ఏం జరిగినా రిజిష్టర్‌ మేరేజ్‌ చేసుకున్నందువల్లనే ఇలా జరిగింది. పెద్దవాళ్ల దీవెనలా! పాడా అంటారు. అయినా పెళ్లి అనేది గ్రాండ్‌గా చేసుకోవాలి కాని రిజిష్టర్‌ మేరేజ్‌ ఎవరైనా చేసుకుంటారా?” అంది ఆరాధ్య.

”నేను చేసుకుంటాను. దానికో డేట్‌ని కూడా ఫిక్స్‌ చేసుకున్నాను. 12-12-2012. ఆ డేట్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆ డేట్‌ కోసమే చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. అలాంటి అంకెలు పది సంవత్సరాలకోసారి మాత్రమే వస్తాయి. మన పెళ్లి రిజిష్టర్‌ ఆఫీసులో ఆరోజే జరగాలి”

నవ్వింది ఆరాధ్య ”ఇదే విషయంపై పెళ్లిళ్ల పేరయ్య మాట్లాడటం విన్నాను హేమంత్‌! అంకెల గారడి తప్పితే అంత ప్రాధాన్యతేం లేదట 12-12-12 డేట్‌కి… జన్మ, నామ, నక్షత్రాలకి అనుగుణంగా కాకతాళీయంగా ముహూర్తాలు కుదిరితే తప్పులేదు కాని పట్టుబట్టి మూడు పన్నెండ్లు మీద మోజుతో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదట. అయినా రిజిష్టర్‌ మేరేజ్‌ చేసుకోవటానికి మనమేమైనా అనాధలమా!”

ఏమాత్రం ఆలోచించకుండా ”నేను అనాధనే!” అన్నాడు హేమంత్‌.

స్టన్నయి చూశారు కాశిరెడ్డి, ఆరాధ్య.

ఒకసారి ఆరాధ్య అతని వివరాలు అడిగితే ”నాకు ఎవరున్నారో, ఎవరు లేరో తెలియదు కాని నా చిన్నప్పటి నుండే నేనెవరికి టచ్‌లో లేను” అన్నాడు కాని ఇలా అనాధనని చెప్పలేదు. కాశిరెడ్డికి కూడా అంతే తెలుసు. ఇప్పుడేంటి ఈ ట్విస్ట్‌? హేమంత్‌ ఎందుకలా మాట్లాడుతున్నాడు? అబద్దాలు చెప్పే మనిషికూడా కాదు.

”మీరు అనాధ అని నాకెప్పుడూ చెప్పలేదేం?” అంది ఆరాధ్య.

”ఇప్పుడేంటి అయితే! నేను అనాధనని చెబితే నాకు నిన్ను ఇవ్వరని అందరూ వున్నారని అబద్దం చెప్పాననుకుంటున్నావా?”

”అలా అని నేను అనడంలేదు”

”నువ్వెలా అన్నా జరిగేది రిజిష్టర్‌ పెళ్లే!”

”రిజిష్టర్‌ మేరేజ్‌కి నేను ఒప్పుకోను. మావాళ్లు గొడవ చేస్తారు”

”అయితే గుడిలో చేసుకుందాం!” అన్నాడు హేమంత్‌.

”అది కూడా ఒప్పుకోరు. అలా చేసుకుంటే మా బంధువులు మా గురించి బ్యాడ్‌గా అనుకుంటారు. దిక్కులేనివాళ్లు, లేచిపోయిన వాళ్లు, లేదంటే రెండోపెళ్లి, మూడోపెళ్లి వాళ్లు చేసుకున్నట్లు గుడిలో పెళ్లేంటి అంటారు. ఒకవేళ మనం అలా చేసుకున్నా కళ్యాణమంటపంలో పెళ్లిచేస్తే వచ్చిన వాళ్లకి అన్నం పెట్టవలసి వస్తుందని నలుగుర్ని వెంటేసుకొచ్చి గుళ్లో పెళ్లి చేసుకున్నారని చూసేవాళ్లు మావాళ్లని తిట్టిపోస్తారు. చీప్‌గా చూస్తారు. అది మీకు ఇష్టమా?”

”ఇష్టమా! అంటే పరిస్థితులను దృష్టిలో వుంచుకొని ఏదైనా ఆలోచించాలిగా! అతిగా ఆలోచిస్తే అబాసుపాలయ్యేది నేనే ఆరాధ్యా!”

”అంతపెద్ద డైలాగులెందుకు? మావాళ్లు పెళ్లిచేస్తారు. అదీ శాస్త్రోక్తంగా! ఒప్పుకోండి! చాలు”

”మీవాళ్లు శాస్త్రోకంగా పెళ్లిచేస్తే నేనిక్కడ రిసెప్షన్‌ పెట్టుకోవాలి. రిసెప్షన్‌ అంటే మాటలు కాదు. నాకు చేసేవాళ్లు ఎవరున్నారని… దేనికైనా నేనే తిరిగి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లికొడుకును చేశాక బయట తిరగకూడదని నువ్వే అన్నావ్‌! మరెవరు తిరిగి చెయ్యాలి?” అన్నాడు.

హేమంత్‌ వైపు ఒకరకంగా చూసింది ఆరాధ్య. ఆ చూపులు బాగాలేవు. హర్టయ్యాడు హేమంత్‌.

”ఇదేం గోలరా కాశిరెడ్డీ! అసలు నాకీ పెళ్లొద్దు. ఏం వద్దు. నన్నిలాగే వుండనివ్వు. ప్రతిదీ వాళ్ల ఇష్టమేనా! నా ఇష్టం ఏం వుండదా? దీన్ని ఏమంటూ ప్రేమించానోగాని అన్నీ కష్టాలే నాకు. హాయిగా ఒక్కరోజు కూడా వున్నది లేదు” అన్నాడు.

ఆరాధ్య ఏం మాట్లాడలేదు. హేమంత్‌నే చూస్తూ అలాగే కూర్చుంది.

కాశిరెడ్డి ”కూల్‌, కూల్‌” అంటూ హేమంత్‌ భుజం పట్టుకున్నాడు.

”అరే! పెళ్లంటే పెద్దవాళ్లు కావాలి. బంధువులు కావాలి. ముందుకొచ్చి ప్రేమతో పెళ్ళి సాంగ్యాలు చేసేవాళ్లు కావాలి అంటే ఎంత చెప్పినా అర్థం చేసుకోదేం! మంత్రాలు, అక్షింతలు, బాజాలు కావాలని నాకు మాత్రం లేదా? మన స్నేహితుల పెళ్లిళ్లు ఎన్ని చూడలేదు నేను! నాక్కూడా నా పెళ్లిలో అందరిలాగే నలుగు పెట్టించుకోవాలని, తలంటి మంగళ స్నానాలు చేయించుకోవాలని, పెళ్లికొడుకును చేశాక బాసింగాలు కట్టించుకోవాలని, ముహూర్తం టైంకు జిలకర బెల్లం నెత్తిన పెట్టించుకోవాలని, తాళికట్టి, తలంబ్రాలు పోయాలని వుంది. ఇంతెందుకు పురోహితుడు పెళ్లికూతుర్ని, పెళ్లి కొడుకును కళ్యాణమంటపం లోంచి బయటకి తీసికెళ్లి అరుంధతీ నక్షత్రాన్ని చూపించేంత వరకు ఏమేమి చేస్తారో అవన్నీ నాక్కూడా చేయించుకోవాలని వుంది. కానీ నాకు అవన్నీ చేసేవాళ్లు లేరురా!” అన్నాడు బాధగా.

”సరే! మీకు ఎవరూ లేరని అవన్నీ వదులుకుంటున్నారు. నాకు అందరూ వున్నారు. నేనెందుకు వదులు కోవాలి? పెళ్లేమైనా రెండుసార్లు, మూడుసార్లు చేసుకుంటారా? జీవితంలో ఒక్కసారేగా? మీరే చెప్పండి అన్నయ్యా! ఈయనకు ఎలా చెబితే అర్థమవుతుందో!” అంది ఆరాధ్య వెంటనే కాశిరెడ్డివైపు చూస్తూ.

”కాశీ! నువ్వేం మాట్లాడకు” అన్నాడు హేమంత్‌.

కాశిరెడ్డికి వాళ్లను చూస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అయోమయంగా వుంది. వీళ్లేంటి పెళ్లి గురించి ఇంతగా చర్చించుకుంటున్నారు? ఇది చర్చ కూడా కాదు. వాదన. అని మనసులో అనుకున్నాడు.

”హేం! నేనోమాట చెప్పనా? వింటావా?” అడిగాడు.

”చెప్పు! వింటాను” అన్నాడు హేమంత్‌.

”మీ ఇద్దరు ఒకటి కావాలనుకున్నప్పుడు వెళ్లేదారి కూడా ఒకటి కావాలి. అలాగే మాటకూడా! రెండు మాటలు ఎప్పుడైనా రెండు లోకాలను సృష్టిస్తాయి. అలా వద్దు. రిజిష్టర్‌ మ్యారేజికి వాళ్లు ఒప్పుకోవటం లేదు కాబట్టి నీక్కూడా శాస్త్రోక్తంగా చేసుకోవడం ఇష్టమే కాబట్టి అలాగే కానీయ్‌!” అన్నాడు.

”నీకేమైనా పిచ్చారా! నువ్వుకూడా అలాగే మాట్లాడుతున్నావ్‌” అన్నాడు కోపంగా హేమంత్‌.

”పిచ్చికాదు. నువ్వెందుకిలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది హేం! నీవైపున పెద్దవాళ్లెవరూ లేరనేగా! నేను మా అమ్మా, నాన్నలతో మాట్లాడతాను. నీ తరుఫున మా అమ్మా, నాన్న వచ్చి నీ పెళ్లి జరిపిస్తారు. చాలా! ఇక ఆరాధ్య చెప్పినట్లు విను” అన్నాడు.

కాశిరెడ్డిని మనసులోనే మెచ్చుకుంది ఆరాధ్య.

హేమంత్‌ కళ్లు అప్రయత్నంగానే చెమర్చాయి.

”వాళ్లకెందుకు శ్రమ?” అన్నాడు హేమంత్‌.

”ఇది శ్రమ కాదు. శుభకార్యం. మా ఇంట్లో మా ఇద్దరన్నయ్యల పెళ్లిళ్లు జరిగాయి కాబట్టి ఇదేమంత కొత్తకాదు. మేమందరం హ్యాపీగా పాల్గొంటాం. ఇంకా మనవైపున మన ఫ్రెండ్స్‌ వున్నారు. అందర్నీ పిలుద్దాం! రిసెప్షన్‌ గురించి కూడా నువ్వేం కంగారు పడనవసరం లేదు. పదిరోజులు ముందుగానే ఆర్డరిద్దాం?” అన్నాడు.

హేమంత్‌ మాట్లాడలేదు.

ఏ విషయం చెప్పు అన్నట్లు హేమంత్‌వైపు చూసింది ఆరాధ్య.

ఆరాధ్యను చూస్తుంటే… అతను అనుకున్నట్లు ఆమె రిజిష్టర్‌ మ్యారేజ్‌కి ఒప్పుకునేలాలేదు.

”హేం! నువ్వింకేం ఆలోచించకు. పెళ్లి వాళ్లను చెయ్యనియ్యి. ఇక్కడికి వచ్చాక రిసెప్షన్‌ మనం చేసుకుందాం! రిసెప్షన్‌ విషయంలో నాకో ఐడియా వుంది. అన్నయ్యల పెళ్లిళ్లప్పుడు అరేంజ్‌మెంట్స్‌ అన్నీ దగ్గరుండి చూసిందంతా నేనే! మనం ఒక్క రిసెప్షన్‌ హాల్‌కి ఆర్డరిస్తే చాలు అందులోనే మ్యూజిక్‌, ఎ.సి. పవర్‌ ఫ్రీ వుంటుంది. మీ ఇద్దరు కూర్చోటానికి మహరాజా ఛైర్స్‌కి, స్టేజ్‌డెకరేషన్‌కి విడిగా ఆర్డర్‌ ఇవ్వాల్సి వుంటుంది. ఫుడ్‌ సెక్షన్‌ సపరేటుగా వుంటుంది. ఒక కారును ఆరోజంతా మనతోనే వుంచుకుందాం! ఓ.కేనా!” అన్నాడు.

హేమంత్‌ కాశిరెడ్డి చేయిని గట్టిగా, అప్యాయంగా పట్టుకొని ”ఓ.కే!” అన్నాడు. ”ఇప్పుడైనా నవ్వుతావా!” అన్నట్లు ఆరాధ్యవైపు చూశాడు.

ఆరాధ్య నవ్వీ నవ్వనట్లు ఓ నవ్వు నవ్వింది.

ముగ్గురు కలిసి కాఫీ తాగారు. కాశిరెడ్డి, హేమంత్‌ వాళ్ల రూంకెళ్లారు. ఆరాధ్య తనుండే హాస్టల్‌కి వెళ్లింది.

 

* * * * *

 

తెల్లవారే హైదరాబాదు పక్కన ఓ పల్లెటూరులో వుంటున్న తన తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లి హేమంత్‌ పెళ్లి గురించి చెప్పాడు కాశిరెడ్డి.

కాశిరెడ్డి తల్లి కళ్యాణమ్మ, తండ్రి శ్రీనివాసరెడ్డి హేమంత్‌ పెళ్లిని దగ్గరుండి చెయ్యటానికి అంగీకరించారు. హేమంత్‌తో మాట్లాడారు. హేమంత్‌ కూడా వాళ్లతో చక్కగా, ప్రేమగా మాట్లాడాడు.

”హేమంత్‌! నువ్విక నీ స్నేహితులతో కలిసి రూంలో వుండొద్దు. మీ ఇద్దరు వర్క్‌ చేస్తున్న ఆఫీసుకి దగ్గర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకో! పెళ్లికి ముందే నువ్వా ఇంట్లోకి మారితే పెళ్లికూడా ఆ ఇంట్లో వుండే చేసుకోవచ్చు” అంటూ సలహా ఇచ్చింది కళ్యాణమ్మ.

”అలాగే ఆంటీ!” అన్నాడు హేమంత్‌.

”అంతేకాదు హేమంత్‌! నీకు మాతో ఎప్పుడు అవసరం అన్పిస్తే అప్పుడు కాల్‌ చెయ్యి. వచ్చి వెళ్తాము. పెళ్లికి రెండురోజుల ముందు నుండి నీ దగ్గరే వుంటాము. నువ్వేం టెన్షన్‌ పడకు. ఈలోపల అన్ని పనులు కాశిరెడ్డి చూసుకుంటాడు” అని ధైర్యం చెప్పింది.

ఆ క్షణం నుండి ఆమె ఎలా చెబితే అలా చెయ్యాలనుకున్నాడు హేమంత్‌. ఆమె అతనికి ఆంటీలా అన్పించటం లేదు. అమ్మలాగే అన్పిస్తోంది. ఆమెకూడా ”హేమంత్‌! నిన్ను మా కాశిరెడ్డిలాగే అనుకుంటున్నాం. మా దగ్గర పరాయివాడిలా వుండొద్దు” అంది.

సంతోషపడ్డాడు హేమంత్‌.

హేమంత్‌, ఆరాధ్యల కోసం పెళ్లికి ముందే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. రెండు బెడ్‌రూంలు, ఒక హాలు, పూజగది, కిచెన్‌, బయట బాల్కనీ వుంది. కళ్యాణమ్మ ఆ ఇల్లంతా తిరిగి చూసి ”చూడటానికి ఇల్లు బాగుంది. కానీ మీ ఇద్దరికి సింగిల్‌ బెడ్‌రూం ఒక్కటి వుండి, చిన్న హాలు, కిచెన్‌ వున్నా సరిపోయేది. సింపుల్‌గా వుండేది. వర్క్‌కూడా తక్కువగా వుండేది. ఇప్పుడు అంత చిన్నగా ఎవరూ కట్టడం లేదు. డబుల్‌ బెడ్‌రూమ్స్‌ లేని అపార్ట్‌మెంటే లేదు” అంది.

హేమంత్‌, కాశిరెడ్డి ఆమె మాటలు వింటూ ఆమెతోనే వున్నారు.

ఎరుపు అంచున్న పసుపుపచ్చని పట్టుచీరలో వున్న కళ్యాణమ్మ నుదుటబొట్టు, పాపిటలో సింధూరం పెట్టుకొని లక్ష్మీదేవిలా వుంది. ఆమె ఇల్లంతా తిరుగుతుంటే తన తల్లి ఉంటే ఇలాగే తిరిగేదేమో అనుకున్నాడు మనసులో హేమంత్‌.

కళ్యాణమ్మ పూజగదిలో దేవుని పటాలు పెట్టి దీపాలు వెలిగించి హేమంత్‌ చేత కొబ్బరికాయ కొట్టించింది. స్టౌమీద ఇత్తడిగిన్నె పెట్టి పాలు పొంగించింది. వాళ్లిద్దరికి పాలు ఇచ్చి ఆమెకూడా తాగింది.

”ఇక నేను వెళ్తాను హేమంత్‌! నీ సామాన్లన్నీ ఈరోజే ఈ ఇంట్లోకి మార్చుకో! ఈరోజు నుండి ఈ ఇంట్లోనే వుండు” అంది.

”అలాగే ఆంటీ!” అన్నాడు హేమంత్‌.

శ్రీనివాసరెడ్డి కళ్యాణమ్మతో రాలేదు. ఆయనది ఫైనాన్స్‌ బిజినెస్‌. ఎప్పుడు చూసినా బిజీగానే వుంటాడు. ఎంత బిజీగా వున్నా కాశిరెడ్డి దగ్గరకు మాత్రం రాకుండా వుండడు. వచ్చేటప్పుడు కళ్యాణమ్మచేత స్వయంగా పచ్చళ్లు, పొడులు, సున్నుండలు చేయించుకొస్తుంటాడు. నెయ్యి అంటే కాశిరెడ్డికి ఇష్టమని దాన్నెప్పుడూ మరచిపోడు. ఎప్పుడు వచ్చినా కాశిరెడ్డి స్నేహితులతో ప్రేమగా మాట్లాడి వెళ్తుంటాడు. అంతేకాదు ”ఇవన్నీ మీరుకూడా తినండి! కాశిరెడ్డి ఒక్కడేకాదు. నేను వస్తుంటే మీ ఆంటీ మీ అందర్ని తినమని పేరుపేరునా గుర్తుచేసి చెప్పింది” అని ఆప్యాయంగా చెబుతాడు. వాళ్ల దృష్టిలో అంకుల్‌, ఆంటీ చాలా మంచివాళ్లు. ఫాస్ట్‌ఫుడ్‌కన్నా కళ్యాణమ్మ పంపిన పిండివంటల్నే వాళ్లు బాగా ఇష్టపడుతూ తింటారు.

వీకెండ్స్‌లో కాశిరెడ్డి తప్పకుండా ఊరెళ్లి వస్తుంటాడు. అప్పుడప్పుడు హేమంత్‌ని కూడా తీసికెళ్తుంటాడు. హేమంత్‌ని చూస్తుంటే వాళ్లకి పరాయివాడిలా అన్పించడు. అతని మాటతీరు, చూపించే ప్రేమ, ప్రవర్తన ఇవన్నీ వాళ్లకి బాగా నచ్చుతాయి. అందుకే కళ్యాణమ్మ ”హేమంత్‌ పెళ్లికి పెద్దలం మనమేనండీ!” అని అన్నప్పుడు శ్రీనివాసరెడ్డి ”తప్పకుండా కళ్యాణీ!” అని సంతోషంగా ఒప్పుకున్నాడు.

”కానీ మనిద్దరం కలిసి ఎప్పుడెప్పుడు వెళ్లాల్సి వస్తుందో ముందుగా చెబితే ఆ డేట్స్‌ని నేను నా డైరీలో నోట్‌ చేసుకుంటాను. మిస్‌కాకుండా వుంటాను” అన్నాడు.

భర్త గురించి ఆమెకు తెలుసు కాబట్టి నవ్వి ”అలాగేనండీ! ప్రస్తుతం హేమంత్‌ కోసం తీసుకున్న ఇంట్లో పాలు పొంగించాలి. మీరు అవసరం లేదు. నేనొక్కదాన్నే వెళ్లి వస్తాను” అంటూ డ్రైవర్ని తీసుకొని వచ్చింది.

కాశిరెడ్డి హుషారుగా అటుఇటు చూసి ”ఈ వాతావరణం చూస్తుంటే మన హేమంత్‌ ఇప్పటినుండే ఒక ఇంటివాడయ్యాడనిపిస్తోంది మమ్మీ!” అన్నాడు.

ఆమె నవ్వింది. అక్కడే కూర్చుని వున్న హేమంత్‌ మాత్రం నవ్వలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు. అతనెందు కంతగా ఆలోచిస్తున్నాడో అర్థం కాలేదు.

కళ్యాణమ్మ కాశిరెడ్డి వైపు చూసి ”ఏదైనా హోటల్‌కెళ్లి డ్రైవర్ని టిఫిన్‌ తినేసి రమ్మని చెప్పు కాశీ! నేను హేమంత్‌తో మాట్లాడాలి” అంటూ కాశీని బయటకు పంపింది.

కాశిరెడ్డి ఆ పని చూసి వెంటనే లోపలికి వచ్చి తల్లి పక్కనే కూర్చున్నాడు.

తల్లి పక్కన కూర్చున్న కాశిరెడ్డిని చూడగానే తన తల్లి గుర్తొచ్చింది హేమంత్‌కి… ఈమధ్యన హేమంత్‌ని వాళ్ల అమ్మ జ్ఞాపకాలు ఎక్కువగా వెంటాడుతున్నాయి. ఆమె ఇప్పుడు ఎక్కడుందో! ఏం చేస్తుందో! అసలు వుందో లేదో తెలియదు. ఎన్నో రోజులు, సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయినా అమ్మను మరచిపోలేక పోతున్నాడు. అమ్మ దగ్గర తనున్నది ఆరు సంవత్సరాల వయసు వచ్చేంత వరకే అయినా అమ్మ ప్రేమను ఏడు జన్మలకి సరిపడా చవిచూశాడు. అమ్మ ప్రేమలో వుండే స్వచ్ఛతను, గాఢతను దగ్గరుండి అనుభవించాడు. ఇప్పుడది కావాలంటే తనకి దొరుకుతుందా? హేమంత్‌ కళ్లు అనుకోకుండానే చెమర్చాయి.

హేమంత్‌ భుజంమ్మీద చేయి వేసి ”అమ్మ గుర్తొచ్చిందా హేమంత్‌?” అని అడిగింది కళ్యాణమ్మ. ఆమెతో ఒకసారి తన బాల్యం మొత్తం చెప్పాడు. అతను చెబుతున్నది వింటున్నంతసేపు వాళ్ల అమ్మను ఊహించుకుంటూ ఆమె వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంది. ఆమెకు ఎదురైన దురదృష్టకరమైన సంఘటనలకి జాలిపడింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఏది ఏమైనా హేమంత్‌ అమ్మ చేసింది మంచిపనే అన్పించింది. అప్పట్లో ఆమె అలాంటి కఠోరమైన నిర్ణయం తీసుకోకుంటే ఈరోజు హేమంత్‌ అనేవాడు వుండేవాడు కాదు. ఆమె నిర్ణయం చాలా గొప్పది. అమూల్యమైనది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మొక్క భూమిని చీల్చుకుంటూ బయటకొచ్చాక దాన్ని ఎదగనివ్వాలి కాని దానికి నీరు పొయ్యాలనో చీడపడితే మందులెయ్యాలనో ఆదిలోనే చిదిమెయ్యకూడదు. అన్ని విలువలకన్నా అత్యంత విలువైనది మనిషి ప్రాణం… దాన్ని తృణప్రాయంగా చూడకూడదు. డబ్బుతో ముడిపెట్టకూడదు. డబ్బుకన్నా విలువైనది ప్రాణం. కానీ ప్రాణం నిలవాలంటే డబ్బును ఆశ్రయించాల్సిందే. కొన ఊపిరితో కొట్టుకుంటున్న ప్రాణాన్ని నిలపాలంటే ఆక్సిజన్‌ రూపంలో డబ్బే ముందుకు రావాలి. డబ్బులేకుంటే ఆక్సిజన్‌ లేదు.

”ఆంటీ!” అని పిలిచాడు హేమంత్‌.

ఆలోచిస్తున్న కళ్యాణమ్మ ఉలికిపాటుగా చూసి ”చెప్పు హేమంత్‌!” అంది.

”నా పెళ్లికి లగ్నపత్రిక రాయించాలట ఆంటీ! తాంబూలాలు మార్చుకోవాలట”

”అవును హేమంత్‌! దాన్నే నిశ్చితార్థం అంటారు. వాళ్లు వస్తే ఇక్కడే లగ్నపత్రిక రాయిద్దాం! ఇప్పుడు నీకంటూ ఓ ఇల్లుకూడా వుందిగా! అన్నీ ఇందులోనే జరిపిద్దాం! వచ్చినవాళ్లకి మర్యాదలు ఘనంగా చేద్దాం!”

”అలా వాళ్లు ఒప్పుకోవటం లేదాంటీ! వాళ్ల బంధువులంతా వాళ్ల ఊరిలోనే వున్నారట. వాళ్లంతా ఇంత దూరం రాలేరట. బంధువులందర్ని పిలుచుకొని ముహూర్తం పెట్టుకుంటే మంచిదని లగ్నపత్రిక అక్కడే రాయిద్దామంటున్నారు. నన్నే అక్కడికి రమ్మంటున్నారు” అన్నాడు.

అది ఆమెకు నచ్చకపోయినా మౌనంగా వుంది.

”మా ఆఫీసులో నేను చేస్తున్న ప్రాజెక్ట్‌ను బట్టి నాకు లీవ్‌ దొరకటం కష్టం ఆంటీ! ఆరాధ్య పరిస్థితి కూడా అలాగే వుంది. రీసెంట్‌గానే జాబ్‌లో చేరింది కాబట్టి లీవ్స్‌ వుండవు. ఈ ముహూర్తం దాటితే మళ్లీ పెళ్లి ముహూర్తాలు లేవట. ఇప్పటికే ఆలస్యం అయింది. పెళ్లి పనులకు టైం సరిపోదంటున్నారు. పసుపు కొట్టందే పెళ్లిపనులు స్టార్ట్‌ చెయ్యటానికి లేదట. లగ్నపత్రిక రాయించనిదే పసుపు కొట్టటానికి లేదట. మరి మేమిద్దరం లేకుండా లగ్నపత్రిక రాయించవచ్చా ఆంటీ?”

ఆలోచిస్తోంది కళ్యాణమ్మ.

”ఆరాధ్య బాగా ఫీలవుతోంది ఆంటీ!”

”ఎందుకు?”

”పెళ్లిబట్టలు కొనాలి, బంగారం కొనాలి. చీరల మీదకి బ్లౌజెస్‌ కుట్టించాలి. అసలే పెళ్లిళ్ల సీజన్‌. షాపింగ్‌ కూడా మనం అనుకున్నంత వేగంగా జరగదు అని ఒకటే కంగారు పెట్టేస్తోంది” అన్నాడు.

కళ్యాణమ్మ ఆరాధ్యను చూడకపోయినా ”ఆ అమ్మాయి అన్నది కరెక్ట్‌ హేమంత్‌!” అంది.

”అందుకే నేను తనకో ఐడియా ఇచ్చాను ఆంటీ! కానీ తను దానికి ఒప్పుకోవటం లేదు”

”ఏంటా ఐడియా?”

”లగ్న పత్రిక అక్కడ వాళ్ల బంధువుల సమక్షంలోనే రాయించి ఇక్కడ నాకు మెయిల్‌ పెట్టమన్నాను. తను చెప్పినట్లే వాళ్ల బంధువులకి కూడా నా తరఫున వెడ్డింగ్‌ కార్డు అందేలా ప్రింట్‌ చేయిస్తానన్నాను . అంతే    ”ఎక్కడైనా లగ్నపత్రిక మెయిల్‌ పెడతారా? అసలు ఇది పెళ్లి అనుకుంటున్నారా? కంప్యూటర్‌ వర్క్‌ అనుకుంటున్నారా?” అంటూ ఎగిరింది. ఏది మాట్లాడినా ”ఇది పెళ్లికదా! అన్నీ సవ్యంగా, శాస్త్రోక్తంగా జరగాలి కదా!” అంటుంది. ఎంతసేపు తను చెప్పినట్లే నేను వినాల్సి వస్తుంది. ఒక్కటి కూడా నా మాట ప్రకారం జరగాలని చూడటం లేదు” అన్నాడు.

ఆమె హేమంత్‌నే చూస్తూ వింటోంది.

వెంటనే కాశిరెడ్డి కల్పించుకొని ”పోనీలేరా హేం! ఇప్పటి నుండే మాట పట్టింపులు దేనికి?” అన్నాడు.

హేమంత్‌ ముఖం అదోలా పెట్టి

”నాకు పేరెంట్స్‌ లేరని తనకు ముందే చెప్పాను కదరా! అన్నీ సవ్యంగా జరగాలి. అన్నీ శాస్త్రోక్తంగా జరగాలి అంటే ఎలా? రోజూ ఫోన్లో గంటలు, గంటలు ఇదే చర్చ. అదేం అంటే ‘పెళ్లి మావాళ్లేగా చేసేది. వచ్చి తలంబ్రాలు పొయ్యడమేగా! మీకేం బాధ?’ అంటుంది. ఆ పెళ్లేదో ఇక్కడే చేసుకుంటానురా! లేకుంటే పెళ్లయ్యాక రోజుకి నాలుగుసార్లు ‘మన పెళ్లి మావాళ్లే చేశారు. మీరేం చేశారు?’ అన్నా అంటుంది” అన్నాడు.

కళ్యాణమ్మ నచ్చచెబుతూ ”వద్దు హేమంత్‌! పెళ్లి వాళ్లనే చెయ్యనియ్యి. ముందుగా రాముడు సీత దగ్గరకి వెళ్తాడు కాని సీత రాముడు దగ్గరకి వెళ్లకూడదని పెద్దలు అంటుంటే విన్నాను. పెళ్లి ఆడపిల్ల ఇంట్లోనే జరగాలి” అంది.

”నేను వద్దు అనలేదు ఆంటీ! కానీ నేనొక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ని…

వాళ్లు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లలేను. ఏది చెయ్యమంటే అది చెయ్యలేను. నా లిమిట్స్‌ నాకున్నాయి. నా ఫార్మాలిటీస్‌ నాకుంటాయి. వాటిని వాళ్లు అర్థం చేసుకోవటం లేదు. అమ్మాయికి బంగారం పెడతారట, స్థలం కొనిస్తారట. పెళ్లిచేసి ఇస్తారట. అలా అని ప్రతిదీ నేను వాళ్లను ఫాలో అవ్వాలంటే ఎలా? ఏది మాట్లాడినా నేను హర్టయ్యే విధంగానే మాట్లాడుతున్నారు. మళ్లీ మేమలా మాట్లాడలేదు అంటుంటారు. ఆరాధ్య వాళ్ల ఇంట్లోవాళ్లకి ఇచ్చినంత సపోర్టు నాకు ఇవ్వటం లేదు. ఏది మాట్లాడబోయినా ‘మీదేముంది. అంతా మావాళ్లే చూసుకుంటారు కదా! మీరేం మాట్లాడకండి’ అంటుంది. ఇలాంటి మాటలే నాకు నచ్చటంలేదు” అన్నాడు.

కళ్యాణమ్మ లేచి నిలబడింది. ఆమె ఎందుకలా నిలబడిందో ఒక్కక్షణం అర్థం కాలేదు కాశిరెడ్డికి, హేమంత్‌కి…

”కూర్చోండి ఆంటీ!” అన్నాడు హేమంత్‌ తన మాటలు ఆమెకు ఇబ్బంది కల్గించాయేమోనని కలవరపడ్డాడు.

”ఇప్పుడే వస్తాను హేమంత్‌! నువ్వు నాతోరా కాశిరెడ్డి!” అంటూ తన కొడుకును పక్కకి తీసికెళ్లింది కళ్యాణమ్మ.

”ఏంటి మమ్మీ! ఉన్నపళంగా లేచి వచ్చావు?” అడిగాడు కాశిరెడ్డి.

”నాకెందుకో ఈ సంబంధం హేమంత్‌కి కరెక్ట్‌ కాదనిపిస్తుందిరా!”

”కరక్ట్‌ అయినా కాకపోయినా తప్పదు మమ్మీ!”

”ఎందుకలా?”

”హేమంత్‌ ఆరాధ్యను ప్రేమించాడు. జాబ్‌ కూడా తన రెఫరెన్స్‌తోనే ఇప్పించాడు. నువ్వు ఆరాధ్యను చూడలేదు కాని హేమంత్‌కి తగినట్లే అందంగా వుంటుంది. అమ్మాయే కదా మనకు ముఖ్యం. వాళ్ల ఫ్యామిలీ దేముంది చెప్పు!” అన్నాడు.

ఆమె అది విని ”అది కాదు కాశీ!” అంటూ కాశిరెడ్డితో ఇంకేం మాట్లాడదలచుకోలేదు. ఇక్కడ కావలసింది లోకజ్ఞానమో! లోకరీతినో, తన అనుభవమో కాదు. పెళ్లి… అందుకే ”సరే! రా వెళ్దాం!” అంది. కాశిరెడ్డి ఆమెతో పాటు కదిలాడు. వాళ్లిద్దరు వెళ్లి ఎప్పటిలాగే హేమంత్‌ దగ్గర కూర్చున్నారు.

వాళ్లు అంత సడెన్‌గా పక్కకెందుకెళ్లి వచ్చారో హేమంత్‌కి అర్థం కాలేదు.

”హేమంత్‌! పెళ్లంటే ఏ ఒక్కరి వల్లనో, ఇద్దరి వల్లనో అయ్యేది కాదు. అలాంటప్పుడు నువ్వు సంయమనం పాటించాలి. ఎవరు చెప్పినట్లు ఎవరు విన్నారూ! ఎవరు ఎవరికి సపోర్టు చేస్తున్నారూ అన్నది కూడా ఇప్పుడు మనం ఆలోచించకూడదు. పెళ్లి ఎలా చేస్తున్నారు? వేదబ్రాహ్మణులు చెప్పిన టైంకు పెళ్లి చేస్తున్నారా? లేదా? అన్నది చూసుకోవాలి. నిశ్చితార్థానికి ఎప్పుడు రమ్మన్నారు?” అడిగింది కళ్యాణమ్మ.

”అంతకుముందు వాళ్లిచ్చిన డేట్సు నా వల్లనే డ్రాప్‌ అయ్యాయి ఆంటీ! రేపు బాగుంది. రమ్మన్నారు” అన్నాడు హేమంత్‌.

”రేపు శుక్రవారం కదా! నిశ్చితార్థం ఎలా చేస్తారు?”

”ఇప్పటికే లేటయిందని తప్పంతా నామీద పెట్టి రోజూ ఫోన్లో ఆరాధ్య ఒకటే సతాయిస్తోంది” అన్నాడు హేమంత్‌.

”మరి రేపు వెళ్లాలి అంటే మనం ఇక్కడి నుండి ఎప్పుడు బయలుదేరాలి. నువ్వెప్పుడైనా ఆ ఊరికి వెళ్లావా?”

”వెళ్లలేదాంటీ! బస్‌లో అయితే పన్నెండు గంటలు టైం పడుతుందట. ట్రైన్‌ జర్నీ అయితే పది గంటలు టైం పడుతుందని ఆరాధ్య చెప్పింది. రేపు వెళ్లాలి అంటే ఇవాళ నైట్‌ ట్రైన్‌కి వెళ్లవలసి వుంటుంది. లేదంటే ఈవినింగ్‌ బస్‌కి…”

”నేను, అంకుల్‌ వెళ్లి తాంబూలాలు మార్చుకొని వస్తాము. మా ప్రయాణ ఏర్పాట్లు చూడు. బస్‌కి వద్దు. నడుంనొప్పి. అన్ని అవర్స్‌ జర్నీ చెయ్యలేం. ట్రైన్‌కి వెళ్తాం! సీటు రిజర్వేషన్‌ కాకుండా బెర్త్‌ రిజర్వేషన్‌ చేయించు. హాయిగా నిద్రపోయి తెల్లవారి లేచేవరకు వాళ్ల ఊరొస్తుంది” అంది.

”తప్పకుండా ఆంటీ! ఈ విషయం ఆరాధ్యతో చెబుతాను. అవన్నీ తనకు బాగా తెలుసు. ఆన్‌లైన్లో బుక్‌ చేస్తుంది” అన్నాడు.

ఆమె నవ్వి ”ఇప్పటినుండే ఆరాధ్యమీద డిపెండవుతున్నావన్నమాట!” అంది.

”ఇది డిపెండ్‌ కాదాంటీ! ఆ వర్క్‌ తనకి బాగా తెలుసు. చేస్తుంది. అంతే! ఎందుకంటే తనెక్కువగా వాళ్ల ఊరికి వెళ్తుంటుంది కదా! ఆ నాలెడ్జి ఎక్కువ” అన్నాడు.

ఆమె లేచి కారువైపు నడుస్తూ ”నేనూ, అంకుల్‌ ఇవాళ నైట్‌కి బయలుదేరి ఆరాధ్యవాళ్ల ఊరువెళ్తాము. నీ తరుఫున నీ స్నేహితుని తల్లిదండ్రులు వస్తున్నట్లు వాళ్లకి ఇన్‌ఫర్‌మేషన్‌ ఇవ్వు. మాకు చేసే మర్యాదల్లో ఏ లోటు రాకూడదని ముందే చెప్పు!”

”అలాగే ఆంటీ! అవన్నీ ఆరాధ్య ముందుగానే వాళ్ల పేరెంట్స్‌కి చెబుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది రాదు” అంటూ హామీ ఇచ్చాడు.

ఆమె కారులో కూర్చోగానే కారు కదిలింది.

కాశిరెడ్డి, హేమంత్‌ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్లారు.

 

* * * * *

 

సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకి పావుగంట ముందే తమ కారులో రైల్వేస్టేషన్‌కి చేరుకున్నారు కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి. వాళ్లను రైలు ఎక్కించటానికి హేమంత్‌, కాశిరెడ్డి బైక్‌ మీద వచ్చారు.

ట్రైన్‌ రైట్‌ టైంకు నడుస్తోంది.

పదకొండు గంటలకల్లా ట్రైనొచ్చి స్టేషన్లో ఆగింది.

కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి ట్రైన్లో కూర్చున్నారు.

వెయిటింగ్‌లో లేకుండా వాళ్ల బెర్త్‌లు వాళ్లకి రెడీగా వున్నాయి.

హేమంత్‌ ఇంతవరకు ఆరాధ్య కుటుంబ సభ్యులనెవరినీ చూడలేదు. ఆరాధ్య చెబితే వినడమే. అప్పుడప్పుడు దగ్గర కూర్చుని వాళ్లతో ఫోన్లో మాట్లాడిపించింది. అంతే! అందుకే వాళ్ల గురించి ప్రత్యేకించి కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి గార్లతో ఏమీ చెప్పలేకపోతున్నాడు. ట్రైనయితే ఎక్కించారు. ట్రైన్‌ కదిలింది.

కళ్యాణమ్మ, శ్రీనివాసరావు పడుకోలేదు. మాట్లాడుకుంటూ కూర్చున్నారు.

”ఇవాళ, రేపు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్లు తక్కువగా వున్నారు కళ్యాణి! అందులో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. నాకెందుకో వీళ్లిద్దర్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది” అన్నాడు శ్రీనివాసరెడ్డి.

”అంత ముచ్చటపడాల్సింది ఏముందండీ! ఈ ప్రేమ వివాహాలనేవి యుగయుగాల నుండి వున్నాయి” అంది కళ్యాణమ్మ.

”ఆ యుగాలు ఇప్పుడు లేవు కళ్యాణి! ఆ ధర్మాలూ ఇప్పుడు లేవు. కాలంతో పాటు అన్నీ మారిపోతున్నాయి. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ పరిచయాలే ప్రపంచాన్ని ఏలుతున్నాయి” అన్నాడు.

నోట్‌బుక్‌ తప్ప ఫేస్‌బుక్‌ తెలియని కళ్యాణమ్మ ”అదేం బుక్కండీ!” అని ఆసక్తిగా అడిగింది.

శ్రీనివాసరెడ్డికి వున్నంత అవుట్‌లుక్‌ ఆమెకు లేదు. ప్రతిదీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస మాత్రం ఎక్కువగానే వుంది. అందుకే అలాగే చూస్తోంది భర్త ఏం చెబుతాడో వినాలని…

”ఫేస్‌బుక్‌ గురించి నీకు చెప్పినా అర్థం కాదు. దాని అవసరం కూడా నీకు లేదు” అన్నాడు.

”అది కంప్యూటర్‌ ముందు కూర్చుని యూత్‌ చేసే పని కళ్యాణీ! నువ్వు పడుకో!” అన్నాడు.

”నేనుపడుకునే అడుగుతున్నా! ఆ ఫేస్‌బుక్‌లో యూత్‌ చేసే పనేంటో చెప్పొచ్చుగా. వింటాను” అంది. ఆమెకు నిద్ర రావటం లేదు. భర్త చెప్పే కబుర్లు వింటూ పడుకోవాలని వుంది.

ఆయన నవ్వి ”ఇప్పుడు ఫేస్‌బుక్‌ గురించి తెలియనివాళ్లే లేరు” అన్నాడు.

”అలా అనకండి! నేను లేనా! నాలాంటి వాళ్లు ఎందరున్నారో మీకు తెలుసా?”

”ఓకే… ఓకే… ఫేస్‌బుక్‌ పని ఏంటంటే ఎన్నో యోజనాల దూరంలో వుండే ఇద్దరు వ్యక్తుల్ని కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి వాళ్లతో చాటింగ్‌ చేయిస్తుంది. ఇందులో మంచీ-చెడూ రెండూ వుంటాయి. చెడు ఏంటంటే ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసుకొని తమ క్వాలిఫికేషన్లు, రంగూ, హైట్‌, వెయిట్‌ అన్నీ అబద్దాలే చెప్పుకుంటారు. అందులో వేరే వాళ్ల ఫోటో పెట్టి అది నాదే అని ఇంకో అబద్దం చెప్పి ఒకర్ని ఒకరు ఆకర్షించుకుంటారు. ఆ తర్వాత ఒకరిని ఒకరు రియల్‌గా చూసుకోవలసి వచ్చినప్పుడు ఒకరికి ఒకరు నచ్చక అటు నుండి అటే పారిపోతుంటారు. పెళ్లివరకు వెళ్లరు. ఇలా బ్రేకప్‌ అయిన  ప్రతిసారి ఆనందంగా పార్టీ ఇచ్చుకుంటారట. అదికూడా వాళ్ల ఎంజాయ్‌లో ఓ పార్ట్‌ అట. అబ్బా! పెద్ద నస పోయింది. అని అనుకుంటారట. వినటానికి ఇదంతా చెత్త, చెత్తగా లేదూ?”

”అలాయేం లేదు లెండి! ఎందుకంటే లోగడ కలం స్నేహాలు కూడా, ఇలా ఒకరిని ఒకరు చూసుకోకుండానే సాగేవి. చూసుకున్నాక ఒకరి కళ్లకి ఒకరు నచ్చక ఉత్తర ప్రత్యుత్తరాలు ఆగిపోయేవి. కాకపోతే పార్టీలు, పబ్బులు, జోష్‌ కేకలు, పాష్‌ డ్రస్‌లు వుండేవి కావు. ఇంతటి స్వేచ్ఛ కూడా లేదు. కాలం తెచ్చిన మార్పు వల్లనో ఏమో ఇప్పటి పేరెంట్స్‌ కొందరు అప్పటి పేరెంట్స్‌లా లేరు. ఎవరి పర్సనల్‌ ప్రాబ్లమ్స్‌కి వాళ్లే ఇంపార్టెన్స్‌ ఇచ్చుకుంటూ ఆనందమైనా, బాధ అయినా ఇండివిడ్యువల్‌గా ఎదిగిపోవాలన్న తాపత్రయంలో వున్నారు. అందుకే పరిచయాల పరిధి పెరిగి అది అంతై ఇంతై అన్నట్లు విస్తృతమై, వికృతమై, కలుషితమై ఇంకా ఏదో అయ్యేలా వుంది. అంతే!”

”అంతే అని అంత తేలిగ్గా తీసెయ్యకు కళ్యాణి!  అసలు ఈ ఫేస్‌బుక్‌ వల్లనే కొన్నిచోట్ల ఫేక్‌ లవర్స్‌ పెరిగిపోతున్నారట. భార్యా, భర్తలు కూడా విడిపోతున్నారట…”

”అది మాత్రం నేను నమ్మను. విడిపోవటం, కలిసి వుండటం అనేది దైవనిర్ణయం. ఫేస్‌ బుక్‌ వల్లనో, నోట్‌బుక్‌ వల్లనో అయితే కాదు. అందుకే మనలో ఎవరైనా సరే ‘నిన్న అలా లేదే! మొన్న అలా అయిందే! ఈరోజు ఎందుకిలా వుంది?’ అన్నది పట్టించుకోకూడదు. మంచి ప్రతిచోటా వుండనట్లే చెడు కూడా వుండదు. చెడు లేకుంటే మంచి విలువ తెలియదు. మంచి ఎంత ముఖ్యమో చెడు కూడా అంతే ముఖ్యం. తెలుపు ఎంత ముఖ్యమో నలుపు కూడా అంతే ముఖ్యం. వెలుగు ఎంత ముఖ్యమో చీకటి కూడా అంతే ముఖ్యం… ఇవి ఒకదాని వెంట ఒకటి వుంటేనే జీవన వైవిధ్యం బావుంటుంది.

సింహాలు వున్నప్పుడు లేళ్లు కూడా వుండాలి. పాములు వున్నప్పుడు ఎలుకలు వుండాలి. కప్పలు వున్నప్పుడు కీటకాలు వుండాలి. లేకుంటే ఎక్కడి ఆట అక్కడే ఆగిపోతుంది. ఆటే లేకుంటే గెలిచేదెవరు? ఓడేదెవరు? ఇకనాకు నిద్రొస్తుంది” అంటూ ఆమె దుప్పటి ముసుగు పెట్టుకుంది.

ఏదైనా వుంటే గబగబ మాట్లాడేస్తుంది. ఆ తర్వాత నోరెత్తదని శ్రీనివాసరెడ్డి కూడా దుప్పటి నిండా కప్పుకొని పడుకున్నాడు. ఆయనకు తన భార్య మాటల్ని ఖండించాలనిపించలేదు. ప్రతిచోటా మనిషి మార్పును ఆశిస్తున్నాడు. అందుకే ప్రస్తుతం సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫేస్‌బుక్‌ యూజర్లు పెరిగిపోతున్నారు. ఈ ఫేస్‌బుక్‌ వల్ల చిన్ననాటి స్నేహితులు కలుసుకోవచ్చన్న ప్లస్‌పాయింట్‌ ఒకటి బలంగా వుంది. ట్విటర్‌ కూడా సెలబ్రెటీల పుణ్యమా అని బాగానే వర్ధిల్లుతోంది. ఇప్పటికే ఫోన్‌, ఇంటర్‌నెట్‌, కీబోర్డ్‌, మౌస్‌, హెడ్‌ఫోన్స్‌ వైర్‌లెస్‌ అయ్యాయి. ఇక ముందు చార్జర్లు, హోల్డర్లు, వైర్లకు స్వస్తి చెప్పేలా వున్నాయట. ఇవన్నీ కాలంతోపాటు వస్తున్న మార్పులు. తను కూడా తన బిజినెస్‌ వ్యవహారాలన్నిటిని లాప్‌టాప్‌ ద్వారానే నడిపిస్తుంటాడు. నెట్‌ కనెక్షన్‌ లేనిదే క్షణం గడవదు. ఇవన్నీ అభివృద్ధి అనుకునేవాళ్లకి అభివృద్ధి అన్పిస్తుంది. ప్రతిబంధకం అనుకునేవాళ్లకి ప్రతిబంధకం అన్పిస్తుంది. ఏదైనా చూసే చూపును బట్టే వుంటుంది అని అనుకుంటూ ఆయన కూడా నిద్రపోయాడు.

రైలు లయబద్దంగా ఊగుతూ తన ప్రయాణం తను చేస్తోంది.

ఉషోదయం వేళ. సమయం ఏడు గంటలు అయింది.

కళ్యాణమ్మా, శ్రీనివాసరెడ్డి ట్రైన్లోనే బ్రష్‌ చేసుకొని కాఫీ తాగారు.

ఆరాధ్య వాళ్ల ఊరు రాగానే వాళ్లిద్దరు చాలా ఉత్సాహంగా ట్రైన్‌ దిగారు.

స్టేషన్‌ దగ్గరకి ఆరాధ్య తమ్ముడు సునీల్‌ వచ్చి వాళ్లను రిసీవ్‌ చేసుకున్నాడు. సునీల్‌ నిన్ననే మద్రాసు నుండి ఇంటికి వచ్చాడు. ఆ విషయమే వాళ్లతో చెప్పి తనను వాళ్లకి పరిచయం చేసుకున్నాడు.

స్టేషన్‌ బయటకొచ్చి వాళ్లను ఆటోలో ఎక్కించుకొని వెళ్లాడు సునీల్‌.

నెమలి పింఛం రంగులో వున్న ఉప్పాడ చీరె కట్టుకొని అంచురంగున్న బ్లౌజులో చాలా పద్ధతిగా వుంది కళ్యాణమ్మ. ఖరీదైన డ్రస్‌లో ఆమెకు తగిన విధంగానే వున్నాడు శ్రీనివాసరెడ్డి.

స్వీట్‌ హౌజ్‌ ముందు ఆటో ఆగగానే సునీల్‌తో పాటు వాళ్లిద్దరు కూడా దిగారు.

తమ షాపు ముందు ఆగిన ఆటోలోంచి హేమంత్‌ స్నేహితుని తల్లిదండ్రులు దిగుతున్నది శాంతారాం చూసి కూడా తల వంచుకొని తనపని తను చేసుకుంటున్నాడు. వాళ్లు ఆ పరిసరాలను గమనిస్తూ ఆయన్ని చూశారు. కాని ఆయనే ఆరాధ్య తండ్రి అని వాళ్లకి తెలియదు. షాపు ముందున్న చెక్కబల్లలపై, రాతి బల్లలపై కొందరు కూర్చుని టీ తాగుతున్నారు. పేపర్‌ చదువుతున్నారు.

సునీల్‌ ‘రండి’ అంటూ వాళ్లను తనతో తీసుకెళ్లాడు.

ఇంటి ఆవరణలోకి వెళ్లగానే రమాదేవి చీపురుకట్టతో ఎదురైంది. ఆమె అప్పుడే నిద్రలేచినట్లుంది. కాస్త దూరంగా వున్నప్పుడే ‘ఆవిడ మా మమ్మీ!’ అని చెప్పి పనిమీద పక్కకెళ్లాడు సునీల్‌.

తనకి ఎదురుగా వస్తున్న ఆ కొత్త వ్యక్తులు హేమంత్‌ స్నేహితుని తల్లిదండ్రులని తెలుసు. హైదరాబాదులో ట్రైనెక్కారని కూడా తెలుసు. వాళ్లను రీసీవ్‌ చేసుకోటానికి సునీల్‌ని పంపినట్లుకూడా తెలుసు రమాదేవికి. అయినా ఆమె ఎందుకో వాళ్లవైపు చూసింది తక్కువ. తలవంచుకున్నదే ఎక్కువ. ఆమె ఎందుకలా వుందో. చూస్తుంటే చిత్రంగా అన్పించింది కళ్యాణమ్మకు. సొంత కూతురి నిశ్చితార్థానికి తాంబూలాలు మార్చుకోటానికి వచ్చిన పెద్దల పట్ల తల్లిగా ఆమె ఎలా స్పందించాలి? ఎంత మర్యాదగా, ప్రేమగా పలకరించాలి? అలాంటిదేం లేదక్కడ. కనీసం తనను తాను పరిచయం చేసుకుందామన్నట్లు రమాదేవి వైపు నవ్వుతూ చూసి చిన్నగా నవ్వింది కళ్యాణమ్మ. శ్రీనివాసరెడ్డి కళ్యాణమ్మ పక్కన హుందాగా నిలబడి చుట్టూ పరిశీలనగా చూస్తున్నాడు.

రమాదేవి వాళ్లవైపు అప్పుడే చూసినట్లు ఓ చూపు చూసి ‘కూర్చోండి’ అంటూ బయట రెండు కుర్చీలు వుంటే వాటివైపు చేయి చూపించింది. ఆమె లోపలే నిలబడి వుంది. చేతిలో వున్న చీపురు అలాగే వుంది. ఆ కుర్చీలు రాత్రి నుండి బయటే వున్నట్లున్నాయి. వాటిపై మంచు రాలి వుంది. ప్రహరీగోడ ఎత్తు లేకపోవటం వల్ల రోడ్డుమీది మట్టికూడా వాటిపైకి చేరి వుంది. బోగన్‌విలియా చెట్టు కింద ఎవరో ఒకావిడ కూర్చుని గిన్నెలు తోముతోంది. పెద్దగా చప్పుడు చేస్తోంది. దాని పక్కనే ప్లాస్టింగ్‌ చెయ్యని మెట్లమీద నుండి ఒకాయన సగం అరిగిపోయిన చీపురు పట్టుకొని హడావిడిగా దిగాడు. ఆయన  పైన శుభ్రం చేసి వచ్చినట్లుంది. రొప్పుతున్నాడు. వీళ్లవైపు చూడలేదు.

వాళ్లిద్దరు అక్కడ నిలబడి వుండగానే టెంట్‌హౌజ్‌ నుండి షామియానా, వంటసామాన్లు వచ్చాయి. వాటిని ఇద్దరు వ్యక్తులు మెట్లు ఎక్కి పైకి పట్టుకెళ్లారు. వంట సామాన్లను మాత్రం బోగన్‌విలియా చెట్టుకింద పెట్టారు.

నిశ్చితార్థం అరేంజ్‌మెంట్స్‌ పైన చేస్తున్నారు. అదంతా మా ఊరిలో వుండే మా బంధువుల కోసమే కానీ మీకోసం కాదన్నట్లు శ్రీనివాసరెడ్డిని, కళ్యాణమ్మను ఎవరూ చూడటం లేదు.

కళ్యాణమ్మ బయట కూర్చోకుండా భర్తవైపు చూసి ”రండి! లోపలికెళ్లి కూర్చుందాం!” అంది. శ్రీనివాసరెడ్డికి పిలవకుండా లోపలకెళ్లటం నచ్చలేదు. ఆయన ఎవరికైనా మర్యాద ఇస్తాడు. అలాగే ఆశిస్తాడు. కానీ కళ్యాణమ్మ మాత్రం ఆయన చేతిని సున్నితంగా తాకి ‘శుభకార్యం కోసం వచ్చాం మనం లోపలే కూర్చోవాలి. అది పద్ధతి. సెంటిమెంట్‌గా ఆలోచించి చెబుతున్నా మనం ఇప్పుడు బయట కూర్చోకూడదు. హేమంత్‌ బాగుండాలి. మనం అతనికోసమే వచ్చాం’ అంది. ఆయనకి మాత్రమే విన్పించేలా. ఆమె భావాన్ని అర్థం చేసుకున్న శ్రీనివాసరెడ్డి హేమంత్‌ మీద ప్రేమతో లోపలికి అడుగుపెట్టాడు.

అక్కడ డ్రస్సింగ్‌ టేబుల్‌కి ఎదురుగా డబుల్‌కాట్‌ వుంది. దాని పక్కన పెయింట్‌ వెలిసిపోయిన పాత టేబుల్‌ మీద కంప్యూటర్‌ వుంది. పక్కనే బీరువా, అక్కడ రెండు కుర్చీలు వున్నాయి.

కుర్చీల్లో కూర్చున్నారు శ్రీనివాసరెడ్డి, కళ్యాణమ్మ.

రమాదేవి వాళ్లు ఎక్కడ కూర్చున్నా ఒకటే నాకు అన్నట్లు వాళ్ల వైపు సరిగా చూడటం లేదు.

శాంతారాం షాపులోంచి ఇంట్లోకి వచ్చాడు. వాళ్లకి ఎదురుగా వున్న డబుల్‌కాట్‌ మీద కూర్చుని ”పంతులుగారు ఇప్పుడు పదిగంటలకి వస్తామన్నారు. ఒకవేళ ఇప్పుడు వీలుకాకపోతే మధ్యాహ్నం మూడు గంటలకి కూడా ముహూర్తం పెట్టుకోవచ్చన్నారు. అది అయ్యాక సాయంత్రం నాలుగు గంటలకి మేము పసుపు కొట్టుకుంటాం. అసలు ముందు మీరు పసుపు కొట్టుకోవాలి. ఆ తర్వాత మేము పసుపు కొట్టుకోవాలి. కానీ మనకు అంత టైం లేదు కాబట్టి మీరు ఇంటికెళ్లాక మంచిరోజు చూసుకొని పసుపు కొట్టుకోవచ్చు. మీరు స్నానాలు చెయ్యండి! మావాళ్లందరు కూడా వస్తారు” అని చెప్పి లేచి వెళ్లిపోయారు.

వాళ్లిద్దరి స్నానాలకి ఏర్పాట్లు చేసారు. తినటానికి పప్పు పొంగలి చేసిపెట్టారు. ఆ మర్యాదలన్నీ బోగన్‌ విలియా చెట్టుకింద కూర్చుని గిన్నెలు తోమినావిడే చేసింది. ఆవిడ ఆరాధ్య తల్లి రమాదేవికి స్వయానా అన్నయ్య భార్య. ఆమె పేరు సీతాలమ్మ. పొట్ట నడుంకి అతికినట్లు బక్కగా వుంది. పొట్టిగా వుంది. ఎత్తు పళ్ళు, తెల్లజుట్టు, వ్యంగ్యంగా నవ్వుతూ, మాట్లాడుతూ, టపటప కళ్లు ఆర్పుతూ చూడటానికి వింతజంతువులా వుంది. ఆవిడ ఎప్పటికీ ఆ ఇంట్లోనే వుంటూ పనులు చేస్తుందట. ఆవిడ భర్త ఊరి చివరన ఏదో ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌గా వున్నాడట.

అదే ఊరిలో ఉన్న శాంతారాం తమ్ముళ్లు, మరదళ్లు, వారి పిల్లలు అక్కయ్యలు, బావలు వారి పిల్లలు, పిల్లల పిల్లలు కూడా వచ్చారు. అప్పటికే పదకొండు గంటలు అయింది. రాహుకాలం వచ్చింది.

పంతులు గారు మిద్దెమీద షామియాన కింద కూర్చుని మంత్రాలు చదువుతున్నారు. ఒక్కొక్కరే పైకెళ్లి చాపల మీద, కుర్చీలమీద కూర్చున్నారు. రమాదేవి ఏదో మరచిపోయినట్లు గబగబ వచ్చి ”పంతులు గారు పిలుస్తున్నారు మీరుకూడా రండి! పైకెళ్లి కూర్చుందాం! లగ్నపత్రిక రాస్తున్నారు” అంది.

ఆశ్చర్యపోయి చూస్తూ ”పన్నెండు కావస్తుంది. ఇప్పుడెలా లగ్నపత్రిక రాస్తారు? పైగా రాహుకాలంలో” అంది కళ్యాణమ్మ.

”అవన్నీ నాకు తెలియవు. వచ్చినవాళ్లు అంతసేపు కూర్చోలేరట. పనులున్నాయట. భోజనాలు చేసి వెళ్లిపోవాలంటున్నారు” అంటూ ఆమె పిలుస్తున్నా ఆగకుండా వెళ్లింది.

కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి ఇక తప్పదన్నట్లు పైకెళ్లి కూర్చున్నారు.

 

ఇంకా ఉంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *