May 6, 2024

శిక్షణ (తండ్రి – కూతురు )

రచన : శ్రీ మతి అల్లూరి గౌరీ లక్ష్మి

“నాన్నా!  రేడియోలో నీ భావనొస్తుందీ రోజు. లే ..లే… కాఫీ చేస్తున్నా!”

అమ్మాయి శ్రీ లక్ష్మి మేలుకొలుపుకి లేచాను.

సమయం అయిదున్నర దాటింది. అల్లుడికీ  పిల్లలకీ మెలకువ రాకుండా , ఇద్దరం మొహాలు

కడుక్కుని కాఫీ కప్పుల్తో  మేడ మీదికి చేరాం రేడియో పట్టుకుని. అక్కడున్న కుర్చీల్లో కాఫీ

తాగుతూ రేడియో పెట్టి కూర్చున్నాం. మంగళ ధ్వని, కార్యక్రమ వివరాలయ్యాక “ఈ నాటి భావన శ్రీ శివ సుబ్రహ్మణ్యం గారి శిక్షణ ” అన్న అనౌన్సర్ మాట విని మా అమ్మాయి నా వీపు తట్టింది మురిపెంగా.

“”జీవితంలో ఎన్నో వడిదుడుకులుంటాయి. అన్నీ తట్టు కోవాలి. విపరీతమయిన ఉద్వేగం, ఆవేశం అనవసరం. నిదానం ప్రధానం. అన్ని ఆటుపోట్లకు మనం సిద్ధం కావాలి. సహనంతో సాగుతూ సామర్ధ్యం పెంచుకోవాలి. అసహనం, విసుగు, టెన్షన్ వల్ల ఎటువంటి లాభమూ ఉండదు.

నిత్యం మనం రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. వాటి నుంచి బైట పడుతూంటాం. అప్పుడు అనవసరంగా  హైరానా పడ్డాం స్మీ ! అనుకుంటాం. మళ్లీ అవే సందర్భాలు వచ్చినప్పుడు ఓర్పుతో

ఉండం. ఎప్పట్లానే చిన్నపిల్లల్లా గోల గోల చేస్తాం.  గతం నుంచి ఏమీ నేర్చుకోం. పరిస్థితులు మనకి గురువులు. కొత్త కొత్త కష్టాలు సృష్టించి మనకు శిక్షణ ఇస్తూ ఉంటాయి. దాన్నుండి మనం ఎంతో గ్రహించాలి,  నేర్చుకోవాలి. ఓర్పు, సంయమనం పాటిస్తూ సమస్యలకు అతిగా స్పందించకుండా మనసు పైకి తీసుకోకుండా నిమిత్త మాత్రంగా ఉంటూ ముందుకు సాగిపోవాలి.”

ఇంతలో, కాలింగ్ బెల్ మోగడంతో అమ్మాయి కిందికి పరిగెత్తింది. నేను భావన పూర్తయ్యాక రేడియో కట్టేసి అక్కడే వాకింగ్ చెయ్యడం మొదలు పెట్టాను. నేనొచ్చి వారం అయ్యింది. నా భార్య, నా కొడుకు బిడ్డ పెంపకం కోసం అమెరికా వెళ్ళింది. నేనిలా అమ్మాయి దగ్గరికి వచ్చాను. నేను రిటైర్ అయ్యి నాలుగేళ్ళు అయ్యింది. నా భార్య తిరిగి వచ్చే ముందు నేనూ అమెరికా వెళ్ళాలి . ఏ మాత్రం  వీలు దొరికినా అమ్మాయి దగ్గరికి రావడం నా కిష్టం. శ్రీ లక్ష్మి అంటే నాకు ప్రాణం. అది మా అమ్మ పేరు. అమ్మను చూడడానికి కొడుకు రావాలి కదా!

నేను డాబా దిగేసరికి నా మనవరాళ్లిద్దరూ చదువుకుంటున్నారు. పెద్దది బి టెక్ నాలుగో సంవత్సరం. చిన్నది బి కామ్ మూడో సంవత్సరం. కాఫీ కప్పు తీసుకుని వంటింట్లోకి వెళ్ళాను .

“చూడు నాన్నా ! పనమ్మాయి వచ్చి మూడు రోజులయ్యింది. బెల్ కొడితే ఆమె అనుకుని ఆశగా పరిగెత్తుకొచ్చాను” గిన్నెలు తోముకుంటూ దిగులుగా అంది శ్రీ లక్ష్మి.

“అరె రే ! అని బాధ పడుతూ మనవరాళ్లిద్దరి దగ్గరికీ వెళ్లి “అమ్మకి కొంచెం సాయం చెయ్యచ్చు కదర్రా

బంగార్స్ !” అన్నాను .

వాళ్ళిద్దరూ నోటి మీద వేలుంచుకుని మావల్ల కాదంటూ సంజ్ఞలు చేసి తల ఎత్తకుండా చదువుకుంటూ కూర్చున్నారు.

వంటింట్లోంచి గిన్నెల డబడబలు వినిపిస్తున్నాయి.ఏ క్షణాన్నయినా పనమ్మాయి వచ్చి నా కూతురి మనసుకి ఆనందం కలిగిస్తుందన్న ఆశతో వీధిలోకి చూస్తూ పేపర్ చదువు కుంటున్నాను.

ఇంతలో అల్లుడుగారు లేచారు. ఆయనకి కాఫీ ఇస్తూ “చూశారా ! పనామె ఒక్క రోజు ఊరికి వెళ్ళొస్తానని చెప్పింది. ఇవాళ నాలుగో రోజు ” ధుమధుమలాడుతూ చెప్పిందమ్మాయి.   ‘ ఈ విషయం నాకెందుకు చెబుతున్నావ్ ?’ అన్నట్టు నిరామయంగా చూశాడతను.

దాంతో శ్రీ లక్ష్మికి అరికాలి మంట నెత్తి కెక్కింది.” అలా చూస్తారేంటి ? చెబితే వినడానికి కూడా నెప్పిగా ఉందన్నమాట మీకు! మీరీ కాఫీ తాగి వంటింట్లోకి రండి. నేను  తోమిన గిన్నెలన్నీ టబ్ లో వేసి బైట పెట్టండి ” అంది కసిగా అక్కడి నుండి వెళ్లి పోతూ.

గతుక్కు మన్నట్టు చూసి అల్లుడు నెమ్మదిగా టివి పెట్టుకున్నాడు. వడిలో పేపర్ సర్దుకుని, కాఫీ తాగుతూ భయం భయంగా వంటింటి వైపు  చూస్తున్నాడు , నిజంగానే అన్నంత పనీ చేయిస్తుందా? అన్నట్టు.   పనమ్మాయి రానే లేదు. మా అమ్మాయి ఆమెను తిట్టుకుంటూ ఇల్లంతా గిర గిరా తిరుగుతూ పనులన్నీ చేసుకుంటోంది. టైం పదయ్యింది. అల్లుడు ఆఫీసుకీ, మనవరాళ్లిద్దరూ కాలేజీకీ వెళ్లారు.  ఇద్దరం టిఫిన్ తిని టీ తాగాం.    పేపర్ తెచ్చుకుని కింద పరుచుకుని చదువుతోంది అమ్మాయి.

“అమ్మ ఫోన్ చేసిందిరా శ్రీలూ తనక్కూడా వినిపించా మన భావన” చెప్పాను.

“అమ్మకి నచ్చిందా ?” అంది పేపర్ చదవడం ఆపి. నేను తలూపాను. “బాగా రాసానందిరా !”

“నాన్నా ! ఆ భావనలు రాయడానికి బావుంటాయి నాన్నా!” అంది పేపర్ మడిచి. నేను అర్ధం కానట్టు చూసాను.

“నువ్వు చెప్పినట్టు చీకూ చింతా లేకుండా ఎలా బతగ్గలం నాన్నా ! ఇప్పుడా గిన్నెలన్నీ మళ్లీ తోముకుని, గదులు తుడుచుకుని, తడి బట్ట వేసుకుని, బట్టలుతుక్కునే సరికి పెద్దలు దిగొస్తారు. కోపం, చిరాకూ   రాకుండా ఎలా ఉంటాయి చెప్పు ?” చికాగ్గా లేచి వెళుతూ అంది చీర దోపుకుంటూ. అవుననుకో ! కానీ  నువ్వలా మనసును కష్ట పెట్టుకుని ఇవన్నీ చేసుకుంటుంటే నీకింకా బాధవుతుంది. అందుకే తప్పని దాన్ని తేలిగ్గా తీసుకోవాలి నాన్నా !” అన్నాను.

“మీ వయసుకి అన్నీ పడ్డారు గనక ఆ నిదానం, సహనం , నిబ్బరం తెచ్చుకోగలరు . మాకెలా కుదురుతుంది నాన్నా !ఇద్దరాడ పిల్లలు. వాళ్ళ చదువులు పూర్తయ్యి వాళ్ళ కుద్యోగాలు దొరకాలి. పెళ్ళిళ్ళు కావాలి. పెరిగే ధరలు, అవసరాలు ..ఇవన్నీ కాక ఇంటిపనులు. అందుకే నాకు తిక్క తిక్కగా ఉంటుంది . మాకీ టెన్షన్ లు ఉండకూడదంటే కుదరదు నాన్నా !” కుండ బద్దలు కొట్టి వెళ్లి పనిలో పడింది శ్రీ లక్ష్మి . మరో రెండు రోజులు గడిచాయి. పనమ్మాయి పత్తా లేదు. మూడో రోజు మధ్యాన్నం అమ్మాయి డిక్లేర్ చేసింది. ” ఈ నెలలో ఇది మూడోసారి ఎగేయడం. అప్పుడొక రోజు, ఈ సారి అయిదు రోజులు. ఇక చాలు. మానిపించేస్తున్నాను.”

సాయంత్రానికి పక్కింటి వాళ్ళ సర్వెంట్ మెయిడ్ వచ్చింది. మా అమ్మాయి చెప్పిన పని వివరాలన్నీ

కూల్ గా విని ప్రస్తుతం ఇస్తున్న జీతం కన్నా ఓ వంద ఎక్కువివ్వండి అంది.

“ఎందుకు ?” అదిరి పడింది శ్రీ లక్ష్మి

“ముందావిడ  కన్నా బాగా చేస్తానమ్మా ” అందా మెయిడ్

“సర్లే సర్లే “ అని అమ్మాయికన్నా ముందే నేను తలాడించాను.

మళ్లీ పాత పనమ్మాయి రాగానే నన్ను తీసేస్తే మర్యాదగా ఉండదని ధమ్కీ ఇచ్చి వెళ్ళింది.

మా అమ్మాయికి  కొత్త మ్మాయిని కుదుర్చు కున్నానన్న ఆనందం, పాతామెను మానిపించేసానన్న సంతోషం ఎక్కువ చేసిన జీతం మింగేసింది.

తెల్లారింది. కొత్త మెయిడ్ డ్యూటీలో జాయిన్ అయ్యింది. చిటికెలో పనులన్నీ చక చకా చేసేసింది. మంచి ముగ్గు లేసింది. ఇల్లంతా కొత్త కోడలోచ్చినట్టు   కళ  కళ లాడి పోయింది. మా శ్రీ లక్ష్మి మొహం నిశ్చింత తో వెలిగి పోయింది.

మర్నాడు పాత పని మనిషి నెమ్మదిగా వచ్చి కూర్చుంది. ఊరిలో తను పడ్డ ఘోర, క్రూర ఈతి బాధలన్నీ కడు దయనీయంగా వివరించింది.  మేమిద్దరం మౌనంగా విన్నాం.

ఆ తర్వాత తనని పనిలోంచి తీసెయ్యడం విషయం మీద తన నిరసన వ్యక్తం చేసింది. నిష్టూర

మాడింది. నేనా కొత్తమ్మాయితో మాట్లాడతాను. రేపటినుండి నేనే వస్తానని బెదిరించింది.

నేను కల్పించుకుని “అలా కుదరదని ఆమె ముందే చెప్పి చేరిందిలే. సర్లే ..ఏదో మా అమ్మాయి చేసుకోలేక పెట్టుకుంది. చూద్దాం ! ఆమె సరిగా చేస్తుందో లేదో ? మళ్లీ నిన్నే పిలుస్తాములే ” అని సముదాయించే సరికి కొంత చల్లబడింది.

“పెద్దాయనవు చెబుతున్నావని ఇంటున్నా” అంది నెమ్మదిగా . మా అమ్మాయి బిక్కమొహం వేసుకుని కూర్చుంది .

ఆ తర్వాత “ నాకు రావాల్సిన పైసలియ్యండి మరి ” అంది విసుగ్గా

మేం రెడీ గా ఉంచిన డబ్బులిచ్చి ఊపిరి పీల్చుకున్నాం.

రెండు నెలలు చటుక్కున తిరిగాయి. నా భార్య అమెరికా నుండి ఫోన్ చేసింది. నన్నింకా రెండు నెలలు ఇక్కడే ఉండమంది. కొత్త పనమ్మాయికి మేం పాత బడ్డాము. చీటికీ, మాటికీ డుమ్మాలు కొట్టడం మొదలు పెట్టింది. అమ్మాయికి పాత కష్టాలు మొదలయ్యాయి.

శ్రీ లక్ష్మి ఫస్ట్ తారీకున జీతం ఇస్తూ “ఈ నెలలో మూడు వారాలే వచ్చావు కాబట్టి జీతం కట్ చేస్తున్నా!” అంది. కొత్త మెయిడ్ హర్ట్ అయ్యింది. చాలా బాధ పడింది.”పెద్దోళ్ళు మీకయితే ఉద్యోగాల్లో సెలవులుంటాయి. మాకొద్దా? మీకవసరం అయితే మానరా ? ” అని లా పాయింట్ లు తీసింది. కొంత వాద ప్రతివాదనలయ్యాక చివరికి శ్రీ లక్ష్మి నోరెత్తకుండా ఒక అస్త్రం వేసింది. ” ఇలా అయితే కష్టమమ్మా !మీ ఇష్టమమ్మా ” అనేసి ఇచ్చిన జీతం తీసుకుని వెళ్ళిపోయింది.

ఆమె మర్నాడు వస్తుందా? రాదా ?అన్న ఉత్కంటతో అమ్మాయికీ నాకూ ఆ రాత్రి నిద్ర లేదు. మర్నాడు పనమ్మాయి రోజూకన్నా ముందుగా వచ్చి మమ్మానందింప చేసింది.  ఆ పై, ముందు రోజు మేం కత్తిరించిన జీతాన్ని తీసుకుని హుందాగా వెళ్ళిపోయింది. శ్రీ లక్ష్మికి  మనసులో కొంత అవమానంగా

అనిపించినా  పాపం ఓర్చుకుంది. పరీక్షలు దగ్గర పడ్డాయి. ప్రతిరోజూ అయిదింటికే లేచి పక్కనే కూచుని పిల్లల్ని చదివిస్తోంది మా అమ్మాయి. రోజులు సాఫీగా సాగుతున్నాయి భగవంతుని దయ వలన.

ఇంతలో పనమ్మాయి మా అత్తగారు పోయిందని చెప్పి ఊరికి వెళ్లి పోయింది. మళ్లీ శ్రీ లక్ష్మికి హైపర్ టెన్షన్ ప్రారంభమయ్యింది. నేనా సాయం చెయ్యలేను. ప్రయత్నం చెయ్యబోయినా  ఒప్పుకోదు. పిల్లలు తొంగి చూడరు. అటూ ఇటూ తిరిగి  తీరిగ్గా టి. వి.  చూస్తున్న అల్లుడి మీద అరచిందో రోజు.  ఆమెలో అసహనం,దుఖం, ఆవేశం పొంగుతున్నాయి.

“ ఎంతసేపూ రాష్ట్ర రాజకీయలేంటి ? దేశ రాజకీయలేంటి ? అని ఒకటే ఆరాటం తప్ప ఇంట్లో పనులెలా అవుతున్నాయి ? అన్న విషయం అక్కర్లేదు. ఇవాళ బట్టలు నానబెడుతున్నాను మీరే ఉతకండి అప్పుడు

తెలుస్తుంది ” అని బెదిరించింది.

“అతనేం చేస్తాడు లేమ్మా !” అల్లుడికి వత్తాసు పలికాను.

నా మాటకి ఆమెకి ఆక్రోశం కట్టలు తెంచుకుంది. నా వైపు తిరిగి “నీకు మాత్రం ఏం పోయిందిలే నాన్నా ? ఆ భగవద్గీతలు, మహర్షుల జీవిత చరిత్రలూ చదువుకుంటూ శాంతం, సౌఖ్యం అంటూ నీతిబోధలు చేస్తావు ” అని నన్ను నాలుగు దులిపింది. నేను మౌనం దాల్చాను.

మేం మానిపించిన పని మనిషి క్రమం తప్పకుండా పక్కింట్లో పనికి వస్తోంది. శ్రీ లక్ష్మి కనబడినప్పుడల్లా

“ఏందమ్మ ! పరేషానున్నారు? “అని ఆప్యాయంగా పలకరిస్తూ గిల్లి ఏడిపిస్తోంది.

“దేవుడు ఆడదానికి ఎన్ని అవమానాలు రాసి పెడతాడో నాన్నా ” అంది శ్రీ లక్ష్మి గట్టిగా నిట్టూరుస్తూ.

మళ్లీ ఇంట్లో ఏక పాత్రాభినయాలు మొదలయ్యాయి. వాళ్ళు ముగ్గురూ తేలుకుట్టిన దొంగల్లా తిరుగుతున్నారు. ఎవరూ టి.వి.పెట్టే ధైర్యం చెయ్యట్లేదు.

పది రోజులు భారంగా గడిచాయి. ఆ మర్నాడు  మా పనమ్మాయి ఊర్నుంచి వచ్చేసింది. శ్రీ లక్ష్మి ఊరికి వెళ్లి వచ్చిన తల్లిని చూసి సంబరపడిన పిల్లలా గంతులేసింది. రేడియో పెట్టి తను కూడా పాడింది.ఈ పది రోజులూ తన భుజాలూ, మెడ, నడుమూ నొప్పులైనాయో ఆమెకు చెప్పి సేద దీరింది. “అమ్మయ్య ” అనుకున్నాను తృప్తిగా. ఓ నెల గడిచింది. ఆ పై ఓ బాంబు పడింది. తన భర్తకి మాదాపూర్లో వాచ్ మన్ ఉద్యోగం దొరికిందని చెప్పి టాటా చెప్పి వెళ్లిపోయిందా పిల్ల.

ఏం చేస్తాం ? బాధను దిగమింగి , మరో కొత్త పనమ్మాయిని పెట్టుకుని ఆమె చేతిలో కొత్త రకం హింసలు పడుతున్నాం. రోజులు గడుస్తున్నాయి. “నాన్నా ! ఇక నుంచీ ఇంటి పనంతా నేనే చేసుకుంటాను. ఎవరూ వద్దు “అందొక రోజు నిర్వేదంగా శ్రీ లక్ష్మి.

నేను సర్ది చెప్పాను.   “వద్దమ్మా ! చేసుకోలేవు. పని పిల్లలుంటే కనీసం నెలకి పదిహేను రోజులన్నా వస్తారు. అప్పుడు నీకు రెస్ట్. మిగిలిన నెలా నీకు తప్పదు.”

“మరి డబ్బులు ? .సగం నెలకే మొత్తం ఇవ్వాలా ?” అంది కోపంగా

“ఇవ్వాలి తప్పదు. నెలకి ఎన్ని వేలు ఖర్చయి పోవడం లేదూ..ఇదీ అంతే అనుకో ” అన్నాను అనునయంగా.

శ్రీ లక్ష్మి నా మాటకి ఇదివరకట్లా నిరసనగా, తిరస్కారంగా చూడలేదు. సాలోచనగా చూసింది. ఆ రోజు మొదలు అమ్మాయి ప్రశాంతంగా ఉండడం మొదలు పెట్టింది. పనమ్మాయి వచ్చిన రోజూ, రాని రోజూ మా అమ్మాయి ప్రవర్తన ఒకేలా ఉండడం నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఒక రోజు మధ్యాన్నం పేపర్ చదువుతుండగా మాగన్నుగా నిద్ర పట్టింది. శ్రీ లక్ష్మి ఆనందంగా మాట్లాడుతోంది. అమెరికా నుంచి తల్లి ఫోన్ చేసినట్టుంది. నేను పడుకునే వింటున్నాను.

“బానే ఉన్నానమ్మా ! లేదు. లేదు. ఇప్పుడు నేను టెన్షన్ పడడం మానేసానమ్మా! నిజం ! ఆ పిల్ల వస్తుందా వస్తుంది. వచ్చే టైం దాటిపోతే నేనే చేసేసుకుంటున్నాను. ఆమె ఎక్కడికి పోయింది? ఎప్పుడొస్తుంది ? ఆ సంగతుల గురించి ఆలోచించడం, చింత పడడం మానేసాను. దాంతో దిగులూ పోయిందమ్మా ! ఊరికే వర్రీ అవడం తెలివి తక్కువ తనమే! ఆరోగ్యం పాడూ, మనశ్శాంతి పాడూ తప్ప లాభం లేదు. అందుకే నిమ్మళంగా ఉంటున్నా. నీ ఆరోగ్యం ఎలా ఉంది ? నాన్న బానే ఉన్నారు. ఆయనకు నా గురించే దిగులు తప్పితే మిగిలిన దంతా ఓకే.” ఆ పరమాత్ముడు ఇంటి పనుల విషయం సాకు పెట్టి పనమ్మాయి రూపంలో మా శ్రీ లక్ష్మికి శిక్షణ ఇచ్చినట్టున్నాడు. భగవంతుని సంకల్పం నెరవేరింది. ఈ శిక్షణ మా అమ్మాయికి బాగానే లాభించింది.  ఆమె కిప్పుడు మనో నిగ్రహం  కలిగింది. తత్వమూ బోధ పడింది. ఇక అమ్మాయి జీవితంలో అన్ని దశల్లోనూ ఈ పాఠాన్ని అన్వయించు కోగలదు.

నాకెంతో ఆనందంగా ఉందిప్పుడు.

 

=====

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *