April 28, 2024

వాగుడుకాయ

రచన:  తాడిగడప శ్యామలరావు. syamala tadigadapa

అబ్బాయీ వట్టి వాగుడుకాయలాగా ఉన్నావే?  నీ నోరసలు మూతబడదా? అని ఎవరో అడిగారు.

ఐతేనేం, తన నోటిని అదుపులో ఉంచుకోవటం అతని వల్ల కాలేదు.

ఆయన పేరు గుర్తు లేదు.

ఆయన ముఖమూ గుర్తులేదు.

ఆ మాట మాత్రం అతనికి బాగా గుర్తుండి పోయింది.

స్కూలు పిల్లలంతా అతనికి రాళ్ళడబ్బా అని పేరు పెట్టేశారు.

ఐనా అతడి నోరు మూతపడటానికి చచ్చినా ఒప్పుకోలేదు.

కాలేజీ చదువులకు వచ్చాడు కానీ నోరు మాత్రం కొద్దిగా కూడా మూతబడటం నేర్చుకోలేదు.

కాలేజీ స్టూడెంట్లందరూ ఛాటర్ బాక్స్ అని ముద్దు పేరు పెట్టారు.

బంధువులెప్పుడో వాగుడుకాయ అన్న పేరు ఖాయం చేసేశారు.

ఐతేనేం? నోరెంత ధాటీగా ఉండేదో, చదువుకూడా అంత ధాటీగానే నడిచేది మరి.

చిత్రం ఏమిటంటే, అతడికి దొరికిన ఉద్యోగం కూడా వాగటమే.

అంటే లెక్చరర్ అన్నమాట.

పెళ్ళిచూపుల్లో అమ్మాయి ముందు ఆట్టే వాగకు అని అమ్మ వార్నింగ్ ఇచ్చింది.

అవసరం ఐతే కాని నువ్వు మాట్లాడాల్సిన పనేమీ లేదు అని నాన్నగారు రూలింగ్ ఇచ్చారు.

అమ్మాయితో ఏమన్నా మాట్లాడతారా అని పెళ్ళికూతురు తండ్రి అడగ్గానే అమ్మా, నాన్నా, అన్నయ్యా కూడా కోరస్ పాడేసారు అబ్బెబ్బే అవసరం లేదండీ అని.

ఐనా అమ్మాయితో మాట్లాడనే మాట్లాడాడు.

అదృష్టం బాగుండి ఆ ఆమ్మాయి ముందు మొగమాటం అడ్దం రావటమూ, ఆ అమ్మాయి ఆట్టే అవకాశం ఇవ్వకపోవటమూ పుణ్యమా అని గండం గట్టెక్కింది లెక్చరర్ గారికి.

బావగారు మంచి మాటకారి అంటున్నారు బావమరదులు.

ఒక రోజు భార్యామణి క్లాసుతీసుకుంది.

మీ‌ లెక్చర్లేవో మీ స్టూడెంటు కుర్రాళ్ళ ముందు దంచుకోండి, అందరి ముందూ అస్తమానం అదేపనిగా మాట్లాడుతుంటే నాకు చిన్నతనంగా ఉంది అని.

ఎందుకు చిన్నతనం? ఎవరికైనా తెలియకపోతే చెబుతున్నాననేనా? అసూయపడుతున్నారల్లే ఉంది అని అన్నాడు.

అసూయా లేదు అప్పడాలూ లేవు. అంతా వాగుడుకాయ మహాప్రభో అంటున్నారు. తగ్గండి అంది చిరాగ్గా సతీమణి.

వట్టి ఇడియట్స్  అని ఉడుక్కుని తనకు ఎంత పెద్ద పేరుందో తన సత్తా ఎటువంటిదో తనకు ఎలాంటి ఎలాంటి పెద్దవాళ్ళ ప్రశంసలు వచ్చాయో అంతా వివరంగా ఆమెకు ఒక లెక్చరు వేసాడు.

మహాప్రభో చాలు చాలు వదలండి అనేసి ఆమె మధ్యలోనే లేచి చక్కాపోయింది.

పీహెడీ అంటారే అది కూడా అయ్యింది.

ఇప్పుడు అతడు పెద్ద ప్రొఫెసర్.

ఎంత బాగా మాట్లాడతారో అని పేరు పైగా.

ఇప్పుడు ఎవరెవరో పిలుస్తూ ఉంటారు. ఎవేవో పెద్దపెద్ద ఉపన్యాసాలు దంచుతూ ఉంటాడు.

పేరు పెరుగుతోంది.

సన్మానాలూ గట్రా జరగటం మామూలైపోయింది.

పుస్తకాలూ రాయటం మొదలు పెట్టాడు.

పేరున్నాయన పుస్తకం వ్రాస్తే పెద్దపెద్ద సభలు చేసి మరీ పొగుడుతారు.

తమషా ఏమిటంటే ఆ పొగిడే వాళ్ళల్లో దాదాపు ఎవ్వరూ ఆ పుస్తకాన్ని ఆసాంతం చదవనే చదవరు. కొందరు అక్కడక్కడా చదువుతారు. కొందరు ముందుమాటలూ వెనకమాటలు చదివి వాటితోనే పొగడ్తలబండి లాగిస్తారు. కొందరి తరపున వేరే వాళ్ళు ఎవరో చదివి ఉపన్యాసం కాని నోట్ కాని సిధ్ధం చేస్తారు కూడా అప్పుడప్పుడు.

ఇలాంటి సభల్లో వినటానికి కూర్చునే వాళ్ళూ పిచ్చివాళ్ళు కాదు.

స్టేజీమీది వాళ్ళంతా  ఉపన్యాసంలో ఆ పుస్తకాలని చదివినట్లు నటిస్తే, స్టేజీ ఎదురుగా ఉన్నవాళ్ళంతా విన్నట్లే నటిస్తారన్నమాట.

ఆ మధ్యన ఎవరో ఉపన్యాసకేసరి అని కూడా అన్నారు.

కొంచెం వాగ్ధాటి తగ్గింది. వయస్సు మీద పడింది కదా.

రిటైరై నాలుగేళ్ళు దాటినా ఇంకా సభలూ సమావేశాలూ అంటూ తిరుగుతూనే ఉన్నాడు.

కొంచెం ఓపిక కూడా తగ్గింది.  క్రమంగా తానై ముఖ్యం అనుకుంటే కాని అన్ని చోట్లకీ వెళ్ళటం తగ్గించాడు,

ఎన్నడూ లేనిది ఇంటి పట్టునే ఎక్కువ సేపు ఉండటం జరుగుతోంది.

ఇల్లంతా ఎంతో‌ నిశ్సబ్దంగా ఉంటోంది.

ఉండదా మరి?

పెద్ద కొడుకు ఎప్పుడో అమెరికా చెక్కేసాడు.

చదువుకు సాఫల్యం అమెరికా ఉద్యోగమే అన్న సూత్రం మధ్యతరగతిలోనే స్థిరపడిపోయిందే, ఇంక కాస్త బాగానే ఉన్న అతడి ఇంట్లో వేరేగా ఎలా ఉంటుంది?

సంతానం అంతా మితభాషులు.

వాళ్ళకు ఆట్టే మాట్లాడే అవకాశం వాళ్ళ నాన్న ఎప్పుడన్నా ఇస్తే కదా అని బంధువర్గంలో చలోక్తి

ఇంట్లో‌ రెండవకొడుకూ, కూతురూ ఉన్నా వాళ్ళ చదువులేమో తిరుగుళ్ళేమో. వాళ్ళలోకం వాళ్ళది.

భార్యామణి లోకం వేరే.

వయస్సు పై బడ్డాక ఆవిడ పూజలూ పునస్కారాలమీద పడింది.

నిత్యం వాటితోనే కాలక్షేపం.

ఇంకా ఏమన్నా ఖాళీ సమయం ఉంటే మేడమీది హాల్లో టివీలో ఇంగ్లీషు ఛానెళ్ళ షోలూ సినిమాలూ చూస్తుంది

ఆవిడ.

ఇంటి పట్టునే ఉంటున్నా  అతడికి ఎవరితోనూ ఆట్టే మాట్లాడటం కుదరటమే లేదు.

తన పుస్తకాలకు ద్వితీయముద్రణల గురించి పనిచేస్తూనో, వాళ్ళు వీళ్ళూ పంపిన పత్రాలూ పుస్తకాలూ పరిశీలిస్తూనో ఎక్కువసమయం కాలక్షేపం చేస్తున్నాడు.

ఎప్పుడన్నా ఎంచుకున్న సభలకు వెళ్ళినా కొంచెం సమయమే ఇస్తున్నారు.

అందులోనూ ఎంత లౌక్యంగా అనీ?

పెద్దవారు, మీరు ఐదు నిముషాలు మాట్లాడితే అదే పదివేలు. అదే చాలు, మిమ్మల్ని అంతకంటే కష్టపెట్టం అని.

కొన్ని సభల్లో ఐతే, ఏదో  ఆఖర్న హడావుడిగా ఒక నిముషం మీరు కూడా మాట్లాడండి అంటున్నారు.

మరికొన్ని సభల నిర్వాహకులు మరచిపోయినట్లు నటించి ఊరుకుంటున్నారు.

ఇంకా కొన్ని సభల్లో మొగమాటం లేకుండా అతడిని అసలు వేదిక మీదకు పిలవటమే లేదు,

నేనూ‌ మాట్లాడే పక్షంలో ఐతేనే వస్తాను అంటే ఏదో సభకు పిలవటానికి వచ్చిన ఒక పెద్దమనిషి చిత్రంగా చూసాడు.

అన్న అమెరికా పోతే తమ్ముడు అమలాపురం పోతాడా?

చదువు పూర్తి అవుతూనే అతగాడూ అమెరికా వెళ్ళిపోయాడు.

ఏమాట కామాట చెప్పుకోవాలి. ఆ రెండో కొడుకే‌ కాస్త నయం. ఉన్నంతలో వీలు చూసుకొని అప్పుడప్పుడూ తనతో కబుర్లు చెబుతూ‌ ఉండే వాడు.

వాడు కూడా దూరం కాగానే మొదటి సారి నిజంగా దుఃఖం వచ్చింది.

రెండు మూడు నెలలు దిగులుతో నోరు బందు ఐనంత పని అయ్యింది.

గోరుచుట్టుపై రోకటి పోటు అన్న సామెతను సమయానికి చక్కగా గుర్తుచేసింది అర్థాంగి.

కూతురికి మంచి అమెరికా సంబంధం కుదిర్చింది.

కాబోయే అల్లుడు మంచి యోగ్యుడట.

ఇలా ఎమ్మెస్ చేయగానే అలా మంచి జాబ్ కొట్టేయటమూ, చకచగా మెట్లెక్కేసి ప్రోడక్ట్ ఆర్కిటెక్ట్ ఐపోవటమూ కూడా జరిగాయట.

ఇదంతా ఏమీ నచ్చలేదు అతడికి.

అమ్మాయి కూడా అమెరికా పోతే ఎలా అని ఆక్రోశించాడు.

అమ్మాయి సుఖం చూడాలి కాని పిచ్చిపిచ్చి సెంటిమెంట్లేమిటీ‌ అని భార్యారత్నం చాలా పెద్ద క్లాసు తీసుకుంది.

ముక్తాయింపు ఏమిటంటే, కుటుంబవ్యవహారాలన్నీ ఇన్నాళ్ళూ తనే చూస్తోంది కాబట్టి అంతా తనే నిర్ణయిస్తుందట.

మౌనంగా ఉండిపోయాడు.

ఏమీ‌ తోచటం లేదు.

ఏమీ‌ చదవాలనీ రాయాలనీ‌ అనిపించటం లేదు.

ఎవరూ ఏ సభలకూ ఈ మధ్య పిలవటం లేదు.

ఇంట్లో తన సంగతి పట్టట్లేదు.

పిల్లలా దూరం.

దిగులు దినదిన ప్రవర్థమానం అవుతోంది.

కొంచెం  జబ్బుపడ్డాడు.

అమెరికానుండి ఆదుర్ధా పడుతూ ఫోన్లమీద ఫోన్లు వచ్చాయి.

భార్యామణి పూజలూ వ్రతాలూ జోరుచేసింది.

ఒకసారి హాస్పటల్ దర్సనం చేసుకొని వచ్చాడు.

ఇంటి దగ్గర కొన్నాళ్ళు బెడ్ రెష్ట్ అన్నారు.

భార్యామణి ఒక నర్సును ఏర్పాటు చేసింది.

అందరూ ఉన్న ఒంటరి జీవితం అతడిది

విరక్తితో తన మీద తనకే జాలో అసహ్యమో మొత్తానికి అలాంటిదేదో కలిగింది.

కొంచెం కోలుకున్నాక అధ్యాత్మిక గ్రంథాలు చదవటం మొదలు పెట్టాడు.

అసలు పూజలూ వగైరా తానూ మొదలు పెడితే కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని అనుకున్నాడు.

కాని ఎన్నడూ జీవితంలో వాటి జోలికి పోని తాను ఇప్పుడు అలా చేస్తే అంతా నవ్వుతారని అనిపించి ఆగాడు.

అందుకే భార్య కలెక్షన్‌లో ఉన్న గ్రంథాలతో మొదలు పెట్టి దీక్షగా చదువుతూ ఉన్నాడు.

ఒకరోజు ఏదో పుస్తకం కోసం భార్య చదువుకునే పుస్తకాల గదికి వెళ్ళాడు.

అక్కడ ఆమె చదువుకుంటూ ఉంది.

భర్తకేసి తిరిగి  కనీసం చూడలేదు, పలకరింపు దేవుడెరుగు.

తనక్కావలసిన పుస్తకం తీసుకొని క్రిందికి వచ్చాడు తనగదికి.

ఒకటి రెండు గంటలు దాన్ని తిరగేసి తిరిగి పైకి వెళ్ళాడు ఆ పుస్తకాన్ని అరలో పెట్టెయ్యాలని.

భార్య ఇంకా చదువుతూనే ఉన్నట్లుంది.

ఎందుకో అనుమానం వచ్చింది.

కొంచెం పరీక్షగా చూసాడు.

ఒకటి రెండు సార్లు పిలిచాడు.

జవాబు లేదు.

దగ్గరకు వచ్చి కుదిపాడు భుజం పట్టి.

అలాగే ఒరిగిపోయిందావిడ.

స్థాణువైపోయాడు ఒక్క నిముషం పాటు.

ఎవరెవరో వచ్చారు ఊళ్ళో నుండీ, పొరుగూళ్ళ నుండీ.  ఓదార్చి వెళ్ళిపోయారు.

పిల్లలూ వచ్చారు ఎకాయెకి అమెరికా నుండి. ఓదార్చి వెళ్ళిపోయారు.

నర్సుపిల్ల వచ్చింది. దయగల అమ్మగారు దయగల అమ్మగారు అంటూ ఏడ్చి వెళ్ళింది.

లంకంత ఇంటిలో ఒంటరిగా మిగిలి పోయాడు.

దినచర్య మారింది.

ఇప్పుడు పూజగదిలో తానే కూర్చుని పూజచేస్తున్నాడు.

అదీ వీలైనంత ఎక్కువసేపు చేస్తున్నాడు.

నర్సుపిల్ల ఎవరో వంటావిడను మాట్లాడిపెట్టింది.

ఆవిడ వండినది తినటం.

ఆవిడ కేది యిష్టమైతే అది చేస్తుంది.

మీ‌కేం కూరలు యిష్టం, ఏ పచ్చళ్ళు యిష్టం లాంటి ప్రశ్నలు ఆవిడ ఎప్పుడూ వేయలేదు.

కొడుకులూ కూతురూ ఎంతో అభిమానంతో‌ అగ్గగ్గలాడిపోతూ తరచూ ఫోన్ చేస్తూనే ఉంటారు.

ఎలా ఉందీ ఆరోగ్యం, సరిగా మందులు వేసుకుంటున్నారా అని ఎంతో ఇదిగా వాకబు చేస్తూ ఉంటారు.

ముక్తసరిగా అలాగే, అలాగే, వేసుకుంటున్నాను, బాగానే ఉంది అంటూ జవాబులు చెబుతూ‌ ఉంటాడు.

వంటావిడకో మనవడున్నాడు.

మంచివాడు పాపం.

స్కూలుకు సెలవు వచ్చిన నాడు బామ్మతో పాటే వచ్చి భలే హడావుడి చేస్తాడు.

స్వయంగా తానే డాక్టరు దగ్గరకు తీసుకొని వెడతాడు.

ఒకరోజున డాక్టర్ దగ్గరకు వెళ్ళాలంటే డ్రైవర్ సమయానికి రాలేదు.

వంటావిడ మనవడు తానే ఇంటి యజమాని ఐనంతగా ఆ డ్రైవరుమీద మండిపడిపోయాడు.

అది చూస్తే ఎంత ముచ్చటేసిందో!

ఈ వేళ బామ్మతో ఫిర్యాదు చేస్తున్నాడు పిల్లాడు.

చూడు బామ్మా,  తాత్తయ్యగారు పదిమాటలకు ఒక్క మాటే జవాబు చెబుతారు, అదీ‌ అప్పుడప్పుడూ అని.

వంటావిడ కసురుకుంది. ఒరే, నువ్వైతే వాగుడుకాయవి. అందరూ నీలాగే ఉంటారా అని.

చప్పున గుర్తుకు వచ్చింది.

అబ్బాయీ వట్టి వాగుడుకాయలాగా ఉన్నావే? నీ నోరసలు మూతబడదా? అని ఎవరో అడిగారు.

ఆయన పేరు గుర్తు లేదు.

ఆయన ముఖమూ గుర్తులేదు.

ఆ మాట మాత్రం బాగా గుర్తుండి పోయింది.

చాలా కాలం తరువాత పెదవులమీదకు చిరునవ్వు వచ్చింది.

 

******************

2 thoughts on “వాగుడుకాయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *