May 13, 2024

భారతీయసంస్కృతిలో నైమిశారణ్యం

రచన:ఏల్చూరి మురళీధరరావు elchuri

 

 

శ్రీ పరమేశ్వరుని నిస్సీమ కరుణాకటాక్షం వలన భారతీయధరిత్రిపై భక్తిపరులకు సర్వార్థచింతామణియై వెలసి విలసిల్లుతున్న పవిత్రసీమ నైమిశారణ్యం. నిర్మలభావంతో, నిండైన భక్తితో ఒక్కసారి అడుగుమోపినంత మాత్రాన జన్మజన్మల పాపసంచయాన్ని పటాపంచలు చేసి కేవలానుభవానందస్వరూపమైన నిశ్శ్రేయసాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్రం.

పూర్వం బ్రహ్మదేవుడు మనోమయమైన ఒక చక్రాన్ని సృష్టించి దానిని వాయుమండలంలోకి విడిచిపెట్టాడట. అది మహావేగంతో సాగుతుండగా ఎదురుగాలి తాకిడికి దాని నేమి (బండి చక్రాన్ని చుట్టివుండే కమ్మి) విరిగి నేలకొరిగింది. ఆ నేమి పడిన చోటికి ‘నైమిశము’ అని పేరువచ్చింది. కొన్నాళ్ళకు ఆ ప్రాంతమంతా ఒక పెద్ద అరణ్యమయింది. ఆ అరణ్యానికి నైమిశారణ్యమని పేరువచ్చిందని పౌరాణికులంటారు. కాశీఖండం (1-77)లో శ్రీనాథుడు వివరించాడు:

సీ.         ఆది మనోమయంబగు నొక్క చక్రముఁ గల్పించె బ్రహ్మ జగద్ధితముగ;

                        కల్పించి, యా ఖండికలు డొల్చె సత్యలోకంబుననుండి యా కమలగర్భుఁ

                        డది డొల్లి, గిరివిష్టపాంతరంబులు దాఁటి, క్రమముతో భూమిచక్రమున వ్రాలె;

                        వ్రాలి, రంహఃస్ఫూర్తి వచ్చివచ్చి ధరిత్రి నిమ్నోన్నతుల శీర్ణనేమి యయ్యె;

            గీ.         నేమి విరిసిన కతన న న్నేలనెలవు

                        నైమిశం బయ్యె నదియ దా నైమిశంబు;

                        ద న్మహాపుణ్యవనమున ద్వాదశాబ్ద

                        సత్త్రయాగంబుఁ గావించె శౌనకుండు.

అని. కాలక్రమాన సత్త్రయాగాలను నిర్వహించేందుకు ఋషులక్కడ గుమిగూడసాగారు. పగలంతా యజ్ఞాచరణంతో అలసిన మునులు సాయంసమయాలలో తీరికగా సేదతీరిన వేళల్లో పౌరాణికులు వారికి భగవత్కథలను చెబుతుండటం ఆనవాయితీ అయింది. భగవన్మహిమతో విలసిల్లిన చోటు కనుక ఆ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేవారి సంఖ్యకూడా ఎక్కువ కాసాగింది.

నైమిశీయ కుంజం

ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నైమిశారణ్యానికి చేరువనే సప్త సారస్వతం ఉన్నది. సర్వతీర్థాశ్రయమైన ఈ సప్త సారస్వతానికి చెంతనే తూర్పున నైమిశీయకుంజం ఉన్నది. సరస్వతీ నదీతటాన వెలసిన అసంఖ్యాక దైవతీర్థాలలో ఆస్తికులందరికీ ఆరాధనీయమైన ఆనందనికేతనం అది. లోకహితాన్ని ఆచరింపగోరి శ్రౌతయజ్ఞోపాసనతో, పురాణేతిహాసకథాప్రసంగాలతో నిర్జనసరస్తీరాలను స్వాధ్యాయానుష్ఠానపుణ్యాశ్రమాలుగా, పరమార్థసుందర పరమహంసమందిరాలుగా మార్చివేసిన శౌనకాది మహామునులకు నిత్యనివాసమైన దివ్యస్థలం అది.

సరస్వతీ తీర్థాలలో ముఖ్యమైన ప్లక్షప్రస్రవణ తీర్థం, వృద్ధకన్యాక తీర్థం, వంశోద్భేద తీర్థం, ఆదిత్యక తీర్థం, కౌబేర తీర్థం, వైజయంత తీర్థం, నైమిశ తీర్థం, వినశన తీర్థం, ప్రభాస తీర్థం మొదలైనవి ఆ నైమిశీయకుంజానికి చుట్టూ మత్స్య, కురుపాంచాల భూములకు పరిసరాలలో నెలకొన్నాయి. విషయనిరాసక్తులై భగవన్నిష్ఠతో వానప్రస్థాన్ని స్వీకరించినవారికి చరమగమ్యాలైన కామ్యక వనం, అదితి వనం, వ్యాస వనం, ఫలకీ వనం, సూర్య వనం, మధు వనం, ద్వైత వనం, సీతావనం అక్కడే ఉన్నాయి.

ఆర్యావర్తంలో వేదసరస్వతీ దృషద్వతీ నదీపరీవాహాల మధ్యనున్న పుణ్యప్రదేశానికి ఒకప్పుడు బ్రహ్మావర్తమని పేరు. బ్రహ్మావర్తంలోని బ్రహ్మర్షిదేశానికి కాలక్రమేణ కురుక్షేత్రమని పేరువచ్చింది. ద్వాపర యుగంలో చంద్రవంశీయుడైన సంవరణుని కొడుకు కురుమహారాజు ఆ క్షేత్రంలోని ఏడు కోసుల నేలను బంగారు నాగలితో దున్ని, అక్కడ వెలసిన పుణ్యతీర్థాలలో ధర్మకార్యాలను ఆచరించినవారికి మహాపుణ్యఫలం కలగాలని ఇంద్రుని నుండి వరాన్ని పొందినప్పటినుంచి కురుక్షేత్రానికి ధర్మక్షేత్రమని ప్రసిద్ధి ఏర్పడింది. “గ్రహనక్షత్త్రతారాణాం కాలేన పతనాద్భయం, కురుక్షేత్రమృతానాం తు న భూయః పతనం భవేత్” అని నారదీయ పురాణం ఈ కురుక్షేత్రం మాహాత్మ్యాన్ని వివరించింది. సూర్యాదిగ్రహాలకు, అశ్వినీ భరణ్యాది నక్షత్త్రాలకు, తారకలకు సైతం కల్పాంతకాలంలో రాలిపోయే భయం ఉంటుంది. కురుక్షేత్రంలో మరణించినవారికి మాత్రం శాశ్వతమైన అమృతస్థితి నుంచి ఏనాటికీ పతనం ఉండదట. “పుణ్య మాహుః కురుక్షేత్రం – కురుక్షేత్రాత్ సరస్వతీ – సరస్వత్యాశ్చ తీర్థాని” అని పెద్దలంటారు. కురుక్షేత్రమే పరమపావనం కాగా కురుక్షేత్రానికంటె సరస్వతి, సరస్వతికంటె అక్కడ వెలసిన తీర్థాలు పుణ్యదాయకాలు. భగవన్నామ భగవత్స్వరూప భగవత్తత్త్వ భగవద్గుణ భగవల్లీలాకృత్యాల అనుభవం ఏమాత్రం లేనివారికి కూడా ఒక్కసారి సేవించినంత మాత్రాన శౌచము, తపస్సు, దానము, యజ్ఞము మొదలైనవాటికంటె అధికమైన ఫలాలనిచ్చే పుణ్యతీర్థాలవి.

జగత్పావనమైన సరస్వతీ నది వెలసిన నైమిశారణ్యంలో “పృథూదకాత్ పుణ్యతమం నాన్యత్ తీర్థం” అని ప్రసిద్ధికెక్కిన పృథూదక తీర్థం (నేటి పెహోవా) వెలసింది. నిరతిశయ సుఖావాప్తిని, నిశ్శేష దుఃఖనివృత్తిని కోరే భగవదారాధకులు, భక్తితత్పరులు చూచితీరవలసిన అమృతతీర్థం అది.

పృథూదక తీర్థానికి సమీపం లోనే బ్రహ్మయోని తీర్థం ఉన్నది. త్రిశంకునికి స్వర్గస్థితిని కల్పించే విఫలప్రయత్నవశాన వసిష్ఠునితో ఏర్పడిననాటి వైరశుద్ధికోసం విశ్వామిత్రుడు కామ్యతపస్సును చేసి బ్రహ్మర్షిపదాన్ని పొందిన చోటది. అక్కడ స్నానం చేసినవారికి అశ్వమేధయాగాన్ని చేసిన ఫలం కలుగుతుందని ప్రతీతి.

పృథూదకానికి అనతిదూరంలో ఉదంక మహాముని తపస్సుచేసిన ఆశ్రమం ఉన్నది. శంతను మహారాజు అన్న దేవాపి అక్కడే వానప్రస్థాన్ని గడిపి మోక్షపదాన్ని చూరగొన్నాడు. కృతయుగంలో ఆర్ష్టిషేణ మహర్షి ఆత్మయోగాన్ని అభ్యసించి దైవతలోకాన్ని చేరుకొన్నాడు.

ద్వాపరయుగంలో ఒకప్పుడు నైమిశారణ్యంలో యజ్ఞయాగాలకు అవాంతరా లేర్పడ్డాయి. మునులు నైమిత్తిక ద్రవ్యసహాయంకోసం హస్తినాపుర రాజు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళారు. దానగుణం కలికానికైనా లేని ధృతరాష్ట్రుడు వారికి ససేమిరా సాయం చెయ్యను పొమ్మన్నాడు. ఎంత సంగపరిత్యాగం చేసి రాగద్వేషాలను విడిచిపెట్టినవారైనా మునులకు ఎంతో కష్టం తోచింది. మునిగణానికి నాయకత్వం వహించిన బకదాల్భ్యుడు ధృతరాష్ట్రుని ఆనాటి ధూర్తవాక్యాలకు అలిగి, అవకీర్ణ మహాతీర్థానికి వెళ్ళి, అక్కడుంటూ ఆధర్వణీయ మంత్రాలతో కౌరవరాజ్యవినాశనార్థం సర్వాహుతిపూర్వకంగా ఘోరమైన అభిచారహోమం చేశాడు. ఆ హోమఫలంగా దేశమంతటా కరువుకాటకా లేర్పడ్డాయి. కారణం తెలిసికొన్న రాజు స్వయంగా తానే వచ్చి పాదాలకు మోకరిల్లిన తర్వాత గాని ఆయన కోపం చల్లారలేదట.

బకదాల్భ్యమహర్షి అడుగుమోపినందువల్ల అవకీర్ణం నైమిశారణ్యంలోని దర్శనీయస్థలాలో ఒకటయింది.  విశ్వజగతీశ్రేయోధామంగా బ్రహ్మదేవుడు నిర్మించిన ఆ పుణ్యతీర్థంలో ఇప్పటికీ ద్విజత్వప్రాపకసంస్కారవిశేషాలైన ఉపనయనం, తత్తత్త్కాలోచితబ్రహ్మసూత్రధారణం మొదలైన విధులు జరుగుతూనే ఉన్నాయి.

అవకీర్ణానికి పర్యంతభూములలోనే బృహస్పతి తీర్థం, విశ్వామిత్ర తీర్థం, వసిష్ఠ ప్రాచి, ఫల్గు తీర్థం ఉన్నాయి. దేవతీర్థ ఋషితీర్థ పితృతీర్థ బ్రహ్మతీర్థాల వలెనే ఆశ్రయించినంతనే దురంతమైన అవిద్యాబంధాన్ని క్షణలేశంలో నశింపజేసి, అనంతమైన వివేక విజ్ఞాన ప్రకాశాన్ని కలిగించే పుణ్యతీర్థాలు నైమిశారణ్యంలో కోకొల్లలు.

తీర్థసందర్శనకు అవకాశం లేకపోతే, నిండైన భక్తితో కన్నులు మోడ్చి, చేతులు జోడించి, తనువు పులకింపగా మనసారా ఒక్కసారి తలచుకొన్నంత మాత్రాన – కేవలం నామస్మరణమాత్రాన – కోటికోటి దురితాలను తొలగించి, నిఖిల సుఖశాంతులను ప్రసాదించే కురుక్షేత్ర నైమిశారణ్య సరస్వతీ పుణ్యతీర్థాల అనంతమహిమను ఎంత కొనియాడినా తనివితీరదు.

క్రతుకృత్యపరంపర

సత్త్రయాగాలలో లోకసంరక్షణహేతువులై బహుకాల బహుద్రవ్యసాధనీయాలైన సారస్వతం, దార్షద్వతం మొదలైన దీర్ఘసత్త్రాలన్నీ నైమిశారణ్యంలోనే జరిగేవి. ఊర్ధ్వలోకాలనుంచి వేల్పులు సైతం ఇక్కడికి వచ్చి యజ్ఞయాగాలను నిర్వహించేవారు. భూతలాన ధర్మసంస్థాపన నిమిత్తం దేవతానీకం ఒకప్పుడు మహాసత్త్రాన్ని చేసినప్పుడు బ్రహ్మావర్తంలోని కురుక్షేత్రం మొత్తం వారికి యజ్ఞవేదిక అయిందట. “దేవా వై సత్త్రమాసత కురుక్షేత్రే” అని మైత్రాయణీ సంహిత, “దేవా వై సత్త్రమాసత తేషాం కురుక్షేత్రం వేది రాసీత్” అని తైత్తిరీయ బ్రాహ్మణం ఆనాడు దైవతసత్త్రానికి కురుక్షేత్రం వేదిక కావటాన్ని వేనోళ్ళ కొనియాడాయి. తైత్తిరీయారణ్యకంలోనూ ఈ యాగకరణాన్ని గురించిన ప్రశంసలున్నాయి. ఆ మహాసత్త్రపు యజ్ఞవేదిక ఎంత పెద్దదంటే – దక్షిణాన ఖాండవ వనం, ఉత్తరాన తూర్ఘ్నం (ఒకప్పటి యమునాతీర ప్రాంతం), తూర్పున పరిణహం, పశ్చిమాన మరుభూముల దాకా వ్యాపించిందట.

త్రేతాయుగంలో పరశురాముడు ఇరవైఒక్కమార్లు భూమిపై క్షత్త్రియులు లేకుండా ఒక్కొక్కరినీ ఊచకోత కోసి, శమంతపంచకంలో వారి నెత్తురుమడుగు లేర్పరించి, పితృతర్పణక్రియలను నిర్వహించిన నాటినుంచి కురుక్షేత్రంలో శమంతపంచకం చుట్టూ పుణ్యతీర్థాల ఒడ్డున ఎవరో ఒకరు యజ్ఞయాగాలను చేస్తుండటం ఆచారమయింది.

పృథూదకం దగ్గరి అవకీర్ణ తీర్థంలో బకదాల్భ్య ముని ఆశ్రమానికి తూర్పున కొంతదూరంలో – కురుక్షేత్రానికి ఆగ్నేయదిగ్భాగంలోని సువిశాలభూమిభాగాన్ని పరిపాలించిన మహావృషుల రాజు హృతశ్వాస్య ఆల్లకేయునికోసం సోమశుష్ముడు గృహ్యాగ్నిని స్థాపించి, తానే ఉద్గాతగా కూర్చొని ప్రసిద్ధమైన ఒక సత్త్రయాగాన్ని చేయించాడు. సర్వశ్శ్రేయస్సాధనరూపమైన ఆ యజ్ఞోదంతాన్ని గురించి జైమినీయ బ్రాహ్మణంలో ఉన్నది. యజ్ఞోపాసకులైన మహర్షులు ఈ సమస్తవిశ్వాన్నీ, ఈ విశ్వంలోని బహిరంతర ప్రకృతివ్యాపారాలనూ యజ్ఞస్వరూపాలుగానే భావించి తమ శరీరాలను, శరీరస్థితికి ఆధారాలైన ప్రాణాపానాది పంచవాయువులను, చక్షుశ్శ్రోత్రనేత్రాదులైన ఇంద్రియాలను యజ్ఞమయం చేసుకోవాలని, యజ్ఞపురుషారాధనమే జీవితపరమార్థమనీ విశ్వసించి లోకశ్రేయస్సుకోసం చేసిన యజ్ఞాలవి.

పూర్వం శితిబాహు ఐషక్రతుడనే ఋషివరేణ్యుడు యజ్ఞకర్మ నిమిత్తం నైమిశారణ్యానికి వచ్చి నివాసాన్ని ఏర్పరచుకొన్నాడట. యజ్ఞం పూర్తయి, పూర్ణాహుతి వేళకు నైవేద్యాన్ని ఒక కోతి అపహరించుకొనిపోయిందట. ఈ వృత్తాంతం జైమినీయ బ్రాహ్మణంలో ఉన్నది. ఆనాటినుంచి శితిబాహునికి నైమిశుడని, అక్కడివారికి నైమిశీయులని, నైమిశేయులని  పేరు వచ్చిందని పౌరాణికులంటారు.

నైమిశారణ్యంలోని ఈ క్రతుకృత్యపరంపర కారణంగానే అక్కడి భక్తబృందాలకోసం పుణ్యతీర్థాల చుట్టూ ఎన్నెన్నో దేవాలయాలు వెలిశాయి. వైవస్వత మన్వంతరంలో వేనరాజు కొడుకు పృథుచక్రవర్తి కాలంలో ఒకప్పుడు పంటలు లేక ప్రజలు అల్లలాడుతుంటే పృథుచక్రవర్తి కోపించి, భూదేవిని శిక్షించాలని బాణప్రయోగం చెయ్యబోయాడట. భూదేవి గోరూపంలో బ్రహ్మలోకానికి పారిపోయింది. పృథువు ఆమెను వెన్నంటి హతమార్చబోయాడట. భూదేవి ప్రజానీకానికి ఆధారకాశ్యపి అయిన తనను హతమార్చటం భావ్యం కాదని ఆయనకు నచ్చజెప్పి, తాను గోరూపంలో భూతలమంతటా నడుస్తానని, రాజు తన వెంట నడుస్తూ వచ్చినట్లయితే, ఆ విదంగా వారిద్దరూ నడిచిన ప్రాంతాలన్నీ సస్యశ్యామలం కాగలవని మాటయిచ్చిందట. ఆ విధంగా నడిచి పృథుచక్రవర్తి భూజనులకు సస్యసంపాదన చేసినందువల్ల భూమికి ఆయన పేరుమీదుగా ‘పృథ్వి’ అని పేరు కలిగింది. భూమికి సస్యసంపాదన చేసిన తర్వాత పృథుచక్రవర్తి పృథూదకానికి వచ్చి కట్టించిన పృథ్వీశ్వర శివాలయం ఆ ప్రాంతపు దేవాలయాలలో మన్నన గన్నది. ఆ తర్వాతి కాలంలో ఎప్పుడో, అక్కడొక కార్తికస్వామి దేవాలయం వెలిసింది. దానికి ప్రక్కనే ఒక సరస్వతీ దేవాలయం, విశాలమైన చతుర్ముఖ మహాదేవమందిరం ఉన్నాయి. భక్తులు తీర్థయాత్రకు వచ్చి మొక్కులను చెల్లించుకొంటారు.

తీర్థయాత్రలకు వెళ్ళేవారికి విశ్వాసం ప్రధానం. భక్తి ముఖ్యం. గంగా గోదావరీ నర్మదాది పుణ్యజలాలలో చేపలు, మొసళ్ళు మొదలుగా గల జలచరాలు జీవిస్తున్నాయి. వాటిని ఆధారం చేసుకొని ఎంతమందో బ్రతుకుతున్నారు. గుడిగోపురాలలో పశుపక్ష్యాదులు జీవిస్తుంటాయి. ఆ పరిసరాలలో తైర్థికులకు వసతిసౌకర్యాలను కల్పిస్తూ, వారికి ఆవశ్యకమైన సాధనసామగ్రితో వ్యాపారాలు చేసుకొంటూ ఎంతమందో ఉంటారు. వారందరికీ మోక్షం కలుగుతున్నదా? తీర్థసేవన దేవమందిరావాస పుణ్యఫలం చేకూరుతున్నదా? అంటే, వారివారికి గల భక్తిభావన ప్రధానం. భక్తిభావన లేనిచోట భక్తిఫలం కూడా దక్కదన్నమాట. భక్తిసరస్సులో ఓలలాడి, గుండెగుడిలో భగవానుని సుస్థిరంగా నిలుపుకొని, ద్వంద్వాలన్నింటినీ పరిత్యజించి తదేకభక్తితో పుణ్యతీర్థాలను సేవించినవారి భాగ్యమే భాగ్యం. అటువంటి భాగ్యవంతులు సంచరించి ముక్తిపదవిని చేకొన్న పుణ్యస్థలాలలో అడుగుమోపి భక్తి కావింపగలగటం జన్మజన్మల అదృష్టవిశేషవశాన గాని సాధ్యం కాదు. అందువల్లనే జితేంద్రియులు, ద్వైతవర్జితులు, మునులు, మహాత్ములు, మహర్షులు, బ్రహ్మర్షులు, తపోనిధులు, జ్ఞానసంపన్నులు కురుక్షేత్ర నైమిశారణ్య పుణ్యక్షేత్రానికి వచ్చి, యజ్ఞపురుషుని ఆరాధించి – కర్మ జ్ఞానమార్గాలతోపాటు సర్వసులభమైన భక్తిమార్గాన్ని అవలంబించి వేదాధ్యయనంతో, పురాణశ్రవణంతో, నిరంతర భగవన్నామసంకీర్తనతో జీవితాలను తరింపజేసుకొన్నారు.

నైమిశారణ్యం ధర్మశాస్త్రకోవిదులైన పౌరాణికులకు ప్రవచనకేంద్రం కాకమునుపే అక్కడి క్రతుకృత్యపరంపర భక్తజనులకు ఆరాధ్యచరితం అయింది. ద్వాపర యుగంలో కాశీరాజు దివోదాసుడు సరస్వతీ నదీతీరాన పణి – పారావత – వృషయులతో యుద్ధంచేసి, వారు శాస్త్రోక్తంగా అగ్నిముఖంగా సమర్పించిన హవిస్సులను అపహరించిన పాపానికి శాపగ్రస్తుడైనప్పుడు నైమిశానికి వచ్చి, దురితమోచనమంత్రాలతో శ్రౌతయాగ ప్రాయశ్చిత్తవిధులను నిర్వర్తించాడట. పాపచిత్తులకు సైతం శుద్ధిసాధన కావాలంటే యజ్ఞాచరణం, తీర్థసేవనం, పుణ్యక్షేత్రసందర్శనం అవశ్యకర్తవ్యాలని ఈ కథాసందేశం. చంద్రవంశ యయాతి రాజుకు అల్లుడీయన. ఈయన కొడుకే పుణ్యచరితుడని పేరుగాంచిన ప్రతర్దనుడు. త్యాగధనుడైన శిబి చక్రవర్తి చేతులమీదుగా సువర్ణఖడ్గాన్ని అందుకొని, ఆ కత్తితో ఒక బ్రాహ్మణునికి తన కంటిని పెకలించి దానం ఇచ్చిన మహాత్ముడు. ప్రతర్దనుడు అధర్మవర్తనులైన హైహయ వీతహవ్యుని కొడుకులను మట్టుపెట్టిన చోటు నైమిశారణ్యంలో భరద్వాజ మహర్షి ఆశ్రమప్రాంగణంలోనే ఉన్నది. ఇది పృథూదక తీర్థానికి పరిసరప్రాంతం. దీనికి మరికొంత దూరాన వారాహ కల్పంలో ఒక పృథుచక్రవర్తి పృథుపైతామహమనే గొప్ప యజ్ఞం చేశాడట. ప్రాచీ సరస్వతీ నదీమతల్లి తీరాన వలసిన పుణ్యతీర్థాలలో ఇదొక ముఖ్యమైన తీర్థస్థలి.

ప్రాచీ సరస్వతి ఉదంతం

జన్మమృత్యుజరాతీతమైన కైవల్యపదాన్ని చేరగోరిన ముముక్షువులు తన పేరును తలచుకొంటే చాలు – చిద్రూపంలో సాక్షాత్కరించి, సర్వకర్మలను ఆ జ్ఞానాగ్నిలో దహించివేసే మహాశక్తి ప్రాచీ సరస్వతి నైమిశారణ్యంలో ప్రవహిస్తున్నది. నైమిశారణ్య పుణ్యభూములను సర్వసస్యాలతో శ్యామలీకరించిన నదీమతల్లి ఆమె. భక్తులకు తత్తత్కర్మఫలానుభావార్థం కోరిన కోర్కెలను నెరవేర్చే కల్పవల్లి ఆ తల్లి.

రథంతర కల్పంలో విశ్వకర్త పైతామహమనే ఆత్మయజ్ఞానికి పూనుకొన్నాడు. సరస్వతి నదీరూపాన్ని ధరించి, ఆయన మానసతీర్థం నుంచి ప్రాచీ (తూర్పు) ముఖంగా నేలకు దిగివచ్చింది. గంగాద్వారం వద్ద ఒక ప్లక్ష్మవృక్షం (రావిచెట్టు) మూలాన విడివడి నైమిశారణ్యసీమకు వచ్చినందువల్ల ప్రాచీ సరస్వతి అని పేరుపొందింది.

శ్వేత వరాహకల్పంలో వైవస్వత మన్వంతరాన పురువంశంలో భద్రాశ్వ మహారాజుకు ఎనిమిదవ తరంలో జన్మించిన కృతేయుని కొడుకు మతినారుడు ప్రాచీ సరస్వతి ఒడ్డున సారస్వతమనే సత్త్రయాగాన్ని చేశాడు. మహాభక్తుడైన ఆయనకు సరస్వతి సాక్షాత్కరించి, తన అంశతో ఆయనను భర్తగా స్వీకరించి, చంద్రవంశాన్ని అనుగ్రహించిందట. ఆ దంపతులకు తంసువనే పుత్రుడు జన్మించాడు. మతినారునికి అన్యభార్యల యందు శంతురోధుడు, ప్రతిరథుడు పుట్టారు. ఆ శంతురోధుని కొడుకే చరిత్రప్రసిద్ధుడైన దుష్యంత మహారాజు. ఆయనకు శకుంతలయందు జన్మించిన కుమారుని పేరిట భరతవంశం ఏర్పడి ధర్మరక్షణపరాయణం అయింది. సరస్వతి దయ ఒక్కసారి కలిగితే తరతరాలు తరిస్తాయి.

నైమిశారణ్యంలో మతినారుని సారస్వత సత్త్రం జరిగిన చోటనే కామ్యక వనం ఉన్నది. ఎక్కడెక్కడివాళ్ళూ వెతుక్కొంటూ వచ్చి దర్శించుకొనే జగత్పావనమైన చోటిది. ద్యూతక్రీడలో ఓడిపోయి పందెం ప్రకారం వనవాసం చేసినప్పుడు పాండవులుండిన స్థలం. ఇక్కడే వారికి మార్కండేయ ముని సన్నిధిసేవ చేకూరింది. వృత్రాసుర వధ నిమిత్తం ఇంద్రునికి తన వెన్నెముకను వజ్రాయుధంగా అనుగ్రహించిన దధీచి మహాముని ఆశ్రమం కూడా ఇక్కడిదే. ఊర్ధ్వలోకగతికి అవకాశం లేని ఆయనకు సరస్వతి తన ద్వారా ఒక కొడుకును అనుగ్రహించిందట. అందువల్ల సంతానం లేనివాళ్ళు ఇప్పటికీ దధీచ్యాశ్రమంలో సరస్వతికి మొక్కుకొని ముడుపులు కట్టటానికి వస్తుంటారు. ఆ తల్లి దయవల్ల కడుపు పండి వంశం నిలబడుతుందని విశ్వాసం.

త్రేతాయుగాంతాన నైమిశారణ్యంలో బ్రహ్మాత్మక సర్వదేవతాసంప్రీణనార్థం అగ్న్యాధానవిధులతో పన్నెండు సంవత్సరాల పాటు మహాసత్త్రయాగం ఒకటి పెద్దయెత్తున జరిగిందట. పుష్కరాలకు వచ్చినట్లు ఋషులందరూ ఆ క్రియాకలాపాన్ని చూడటానికి తరలివచ్చారు. ఆనాటి సంబరాలను చూడటానికి వెయ్యి కళ్ళు, వర్ణించి చెప్పటానికి వెయ్యి నోళ్ళు ఉన్నా సరిపోనంత మెచ్చుగొలిపే సంబరాలవి. సరస్వతీ నదికి దక్షిణపు ఒడ్డున ఉన్న తీర్థాలన్నీ మునుకొనివస్తున్న ఋషిసందోహంతో పండుగ వేడుకలు జరుగుతున్నప్పటి పట్టణవీథుల వలె కళకళలాడసాగాయి. యాతాయాతజనాల తొక్కిసలాట ఎక్కువయింది. ఎక్కడి నైమిశారణ్యం? ఎక్కడి శమంతపంచకం? నేలంతా ఇసుకవేస్తే రాలనట్లు ఋషులతో నిండిపోయింది. చోటులేకున్నా, ఇంకా ఇంకా తోసుకొనివస్తున్న ఆహూతులను శమంతపంచకం నుంచే వెనుకకు పంపివేయవలసివచ్చింది. అప్పుడు సరస్వతి దయతలిచి, తూర్పుకు మళ్ళి, ఋషులు నిరాశతో తిరిగివెళ్ళిపోతున్న చోటనే ప్రవహింపసాగిందట. అప్పటి నుంచి నైమిశానికి తూర్పువైపున అసంఖ్యాతంగా పుణ్యక్షేత్రాలు, దివ్యకుంజాలు, కోటర కుటీ క్రోడవీథులు, ఓషధీ వనలతలు భక్తుల పాలిటి అక్షయపాత్ర చింతామణీ కల్పతరు కామధేనువులై అవతరించాయి. సరస్వతికి ఆనాటి నుంచి ప్రాచీ సరస్వతి అన్నపేరు నలుగురికీ తెలిసిందట.

పన్నెండేళ్ళకు యాగం పూర్తయిన తర్వాత ప్రాచీ సరస్వతి మళ్ళీ యథాదిశకు మళ్ళిందట. పృథుసరస్వతి ఆ విధంగా తూర్పుకు తిరిగిన ఆ చోటికి పృథూదకమని పేరువచ్చింది. మహాభారత సంగ్రామంలో కౌరవులు ఓడిపోయి దుర్యోధనుడు ద్వైపాయన హ్రదంలో దాగి ఉన్నాడని విన్న బలరాముడు అతనిని చూడటానికి వెళ్తూ ఈ క్షేత్రానికి వచ్చి, తీర్థస్నానం చేసి, సరస్వతిని సన్నుతించాడు:

            చ.         అరయఁగ మేటి పుణ్యనదులందు సరస్వతి; సౌఖ్యసంపదల్

                        నరులకుఁ గల్గు ని జ్జగమునం, బరలోకమునందు నీ సరి

                        ద్వర నొకనాఁడు సేరినను; వాసవముఖ్యసమస్తదేవతా

                        వరులును నిందు మేల్ వడయ వత్తురు; సంస్మృతి సాలు సిద్ధికిన్.

                                                                        – తిక్కన గారి మహాభారత శల్య పర్వం: 2-223)

అని. పుణ్యనదులన్నింటిలో సరస్వతి మేటి అట. ఆ సరిద్వరను (నదులలో శ్రేష్ఠమైన నదిని) ఒక్కమారు సందర్శించుకొన్నా ఇహపరాలలో సుఖము, లక్ష్మీసంపదలు కలుగుతాయట. ఇంద్రాది దేవతలు సైతం ఇక్కడ తీర్థస్నాతులై శుభాలను పొందాలని వస్తారట. సిద్ధికాముకులు తలచుకొంటే చాలునట!

చరిత్రాత్మకమైన సప్త సారస్వతం ఈ పృథూదక తీర్థానికి సమీపాననే వెలసింది.

సప్త సారస్వత వృత్తాంతం

నైమిశారణ్యంలోని పుణ్యతీర్థాలన్నిటిలో ఈ సప్త సారస్వతం పరమపావనమైనది. సరస్వతీ నదినుంచి వెలువడిన ఏడు పాయలకు సంగమక్షేత్రమైనందువల్ల దీనికి సప్త సారస్వతం అనిపేరు. అనాదిగా కర్మపాశవశులై భవసాగరంలో దారితోచక కొట్టుమిట్టుకులాడుతున్న ఆర్తజనులను సంస్మరణ మాత్రాన దరికిచేర్చే పావన నామమంత్రం అది. తీర్థయాత్రలెన్ని చేసినా మనశ్శాంతి చేకూరని మందభాగ్యులకు అంతఃకరణశుద్ధిని, అపరోక్షజ్ఞానాన్ని, జీవన్ముక్తిని ప్రసాదించే పావనములకెల్ల పావనమైన నామతీర్థం శ్రీ సప్త సారస్వతం.

సప్త సారస్వతం వెలసిన చోట కాలూని, ఆ నదీమతల్లిని స్మరించి, ఇష్టదైవతాన్ని ఆరాధించిన భక్తులకు మనస్సు ఇంద్రియవిషయాల నుంచి మరలి అంతర్ముఖం కాగలుగుతుంది. “నేను”, “నాది” అన్న హృదయగ్రంథులు తెగి, అవిద్యామోహం తొలగి, పారమార్థికజ్ఞానం కలుగుతుంది. సుకన్యా మాతరిశ్వుల కొడుకు మంకణకునికి ఈ పవిత్రస్థలంలోనే భగవత్సాక్షాత్కారం కలిగి బ్రహ్మర్షిత్వం సిద్ధించింది. సరస్వతీ మాతృకలు ఏడూ మాతృకల రూపంలో ఈ చోటనే స్వయంవ్యక్తాలు కావటం ఇక్కడి విశేషం.

ఒకప్పుడు సృష్టికర్త విరించి నైమిశారణ్యానికి వచ్చి పుష్కర తీర్థంలో పైతామహమనే యాగం చేశాడట. ఋత్విక్కుల వినియోగార్థమై ఆయన సంకల్పమాత్రాన యజ్ఞశాలలో స్రుక్ స్రువాది హోమద్రవ్యాలన్నీ అక్కడికక్కడే అవతరించాయి. తరులతాదులు అకాలమైనా పుష్పించి ఫలించాయి. ఓషధులు సదస్యులకోసం ఆహారవసతిని సమకూర్చాయి. విరామసమయాలలో గోష్ఠీవినోదంకరణకు అప్సరసలు భగవల్లీలలను కన్నులకు కట్టారు. యాగకర్తలు ఎంతటివారయినా, యాగమన్నాక ధర్మపత్నీసమేతంగా చేయవలసిందే కదా! యాజకులందరూ బ్రహ్మదేవుని ప్రార్థించారు. అప్పుడు సరస్వతి “సుప్రభ” అన్నపేరిట అవతరించి, పుష్కర తీర్థంలో నిలిచిపోయిందట.

వేరొకప్పుడు నైమిశారణ్యంలోని మునులందరూ సమావేశమై వేదార్థాన్ని గురించి, సకర్మక వైదికారాధనలను గురించి, యజ్ఞయాగాల తాత్పర్యాన్ని గురించి, మాయను ఉపాధిగా గ్రహించిన పురుషతత్త్వాన్ని ధ్యానించటం వల్ల కలిగే తత్తదధిదేవతల అనుగ్రహాన్ని గురించి, సమష్ట్యుపాధిలో ఉపహితమైన బ్రహ్మముయొక్క తత్త్వం ఏమిటి? అన్న విషయాన్ని గురించి – పరిపరివిధాల చర్చించుకొంటుండగా సరస్వతి ప్రస్తావన రానే వచ్చిందట. అప్పుడు సరస్వతి “కాంచనాక్షి”యై వారి యెదుటకు వచ్చి ఆ ప్రదేశంలో ప్రవహిల్లసాగింది.

వేదవేత్తలలో అగ్రేసరుడైన రాజఋషి గయ మహారాజు నూరేళ్ళపాటు నిరాహారదీక్షను వహించి నైమిశీయ కుంజం వద్ద ఒక గొప్ప యాగాన్ని చేశాడు. ఆ పుణ్యధనుని దర్శనార్థం సరస్వతి సరస్వతి హిమవన్నగోపరితలాల నుంచి నేలకు దిగివచ్చింది. అప్పటి ఆమె దివ్యస్రవంతీరూపానికి “విశాల” అని పేరు.

ఉత్తర కోసలాలలో ఔద్దాలకి మహర్షి సోపాధిక బ్రహ్మోపాసనకు ఉపక్రమించి, అగ్నిని రగుల్కొలిపి ఇష్టదేవతా నిమంత్రణపురస్సరంగా ద్రవ్యత్యాగరూపమైన మహాయజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఉద్దాలకుడు ఆ శుభతరుణానికి సరస్వతి వస్తే బాగుండుననుకొన్నాడు. ఆయన సంకల్పానుసారం ఆ తల్లి “మనోరమ”యై నైమిశానికి వచ్చింది.

చంద్రవంశంలోని అవాంతరవంశకర్తలలో ఒకడైన కురు మహారాజు దిగ్విజయార్థం కురుక్షేత్రంలో సర్వస్వదక్షిణతోడి విశ్వజిద్యాగాన్ని చేశాడు. వసిష్ఠ మహర్షి సరస్వతిని ఆవాహన చేశాడు. ఆ దేవి “ఓఘవతి” పేరిట నైమిశానికి నిమ్నగారూపంలో వచ్చి ప్రవహింపసాగింది. సకల ధర్మతత్త్వకోవిదుడైన కురుపితామహుడు భీష్ముడు భారతయుద్ధంలో శస్త్రాస్త్రసన్న్యాసం చేసి నేలకొరిగిన తర్వాత జీవన్ముక్తుల దేహత్యాగానికి అనువైన ఉత్తరాయణ పుణ్యకాలంకోసం ఎదురుచూస్తూ శరతల్పగతుడై కాలం గడిపిన చోటు ఇదే.

విశ్వ ప్రజాపతి ఋషభ ద్వీపంలో మహాసత్త్రయాగం చేసినప్పుడు ఆయన కోరికను మన్నించి సరస్వతి గంగాద్వారం వద్ద “సురేణువు” అన్న పేరుతో అవతరించి నైమిశానికి వచ్చి పారసాగింది.

మరొకప్పుడు శతానీకుడు బ్రహ్మదేవుడు హిమవత్పర్వతం పైని ఇష్టకామ్యార్థమనే యాగం చేశాడు. సరస్వతి “విమలోద”గా జన్మించి యాగపరిసమాప్తి వేళకు అక్కడినుంచి నైమిశారణ్యానికి తరలివచ్చింది.

ఈ ప్రకారం – పధ్నాలుగు లోకాలకు చిటారుకొమ్మపై ఉన్న అఖండ సచ్చిదానందస్వరూపమైన సత్యలోకం నుంచి హిమశైలశిఖరాల మీదుగా నేలకు దిగివచ్చిన సరస్వతీ నది ఏడు అంశావతారాలు సుప్రభ, కాంచనాక్షి, విశాల, మనోరమ, ఓఘవతి, సురేణువు, విమలోద ఒక్కచోట కలిసిన పుణ్యతీర్థమే శ్రీ సప్త సారస్వతం. పూర్ణశ్రద్ధతో నమ్మి కొలిచినవారికి కొంగుబంగారమై, సర్వపాపవినాశకమైన సంసారసాగరసముద్ధరణైక జీవన దివ్యమంత్రం అది.

నైమిశారణ్యంలోని సరస్వతి రూపాలు అన్నీ ఇన్నీ కావు. వేర్వేరు కాలాలో, వేర్వేరు ద్వీపాలలో ఆమె ‘సరస్వతి’గా, ‘వైతరణి’గా, ‘ఆపగ’గా, ‘మందాకిని’గా, ‘మధుస్రవ’గా, ‘అంబునది’గా, ‘కౌశికి’గా, ‘దృషద్వతి’గా, ‘హిరణ్వతి’గా లోకానీకాన్ని కాపాడింది. బ్రహ్మలోకం నుంచి ప్లక్షమూలం ద్వారా సన్నిహతి తీర్థాన్ని చేరి, కురుక్షేత్రం మీదుగా ద్వైతవనాన్ని ప్రవేశించి, ‘ప్రత్యక్సరస్వతి’గా సోమనాథ మందిరానికి తూర్పుగా బాణపు వేటు దూరాన ప్రవహించి – త్రివేణీ సంగమానికి పరుగులు తీసింది.

సరస్వతి ఇప్పుడు అతీతకాల యవనిక వెనుక అంతర్హితమైనా నామతీర్థమై విలసిల్లుతూనే ఉన్నది. భక్తబృందాల హృదయసీమలలో జీవనదిగా భావజ్ఞులకు గోచరిస్తూనే ఉన్నది. భక్తులను, ఉపాసకులను, అనురక్తులను, ఆరాధకులను అనుగ్రహిస్తూనే ఉన్నది.

సరస్వతీ నది కృపావిపాకమంతా రూపుకట్టిన సప్త సారస్వతం వెలసిన శుభస్థలికి సమీపాననే త్రైలోక్యవిఖ్యాతమైన శ్రీ నైమిశారణ్యంలో పరాశరుడు, సూత గోస్వామి, శౌనక మహర్షి మొదలైనవారు మునులకు వివిధకాలాలలో అష్టాదశ పురాణాలను, శ్రీ మహాభారతాన్ని తేనెల చిందుగా, వీనుల విందుగా వినిపించారు.

నైమిశారణ్యం

సృష్టిస్థితిలయకారకులైన త్రిమూర్తులకు, సర్వలోకేశ్వరేశ్వరి అయిన శ్రీమాతకు అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రవరేణ్యం శ్రీ నైమిశారణ్యం. ‘పృథివ్యాం నైమిశం తీర్థం” అని వన్నెవాసిని గన్న శ్రీ నైమిశారణ్యంలో సద్భక్తితో ఆచరించిన తపస్సులు, దానాలు, యజ్ఞాలు, శ్రాద్ధక్రియలలో ఒక్కొక్కటీ ఏడేడు జన్మలలో చేసుకొన్న దుష్కర్మలను మటుమాయం చేసి ఐహికాముష్మికసుఖాలను, లక్ష్మీసంపదభివృద్ధులను, సార్వభౌమత్వాది పదవీలాభాన్ని, అమంద మహానందాన్ని కలుగజేస్తాయని ఋషులు వేనోళ్ళ కీర్తించారు. జీవితంలో ఒక్కమారైనా నైమిశారణ్య తీర్థదర్శనపుణ్యలాభం కలగాలని ఉపదేశించారు.

తీర్థమంటే ఏమిటి? తరింపజేసేది. సంసారదుఃఖమనే మహాసముద్రం నుంచి నిర్భరానందఘనమైన కైవల్యతీరానికి చేర్చేది తీర్థం.

ఏది నిజమైన తీర్థం? భగవత్కరుణానుభవానికి ఆశ్రయమైనదే నిజమైన తీర్థం. సత్యము, శౌచము, ఇంద్రియనిగ్రహం, భూతదయ, క్షమాగుణం, సాధుస్వభావం అన్నవే నిజమైన తీర్థాలని; తక్కిన దృగ్విషయతీర్థాలు నిజమైన తీర్థాలు కావని పెద్దలంటారు. భగవంతుని యందు చెక్కుచెదరని భక్తివిశేషం, మనస్సును రాగద్వేషాలకు అతీతంగా ఉంచుకోవటం, పాపకర్మలను చేయాలనే సంకల్పాలను సైతం సమూలంగా అణచివేయటం, పరమార్థతత్త్వజ్ఞానాన్ని కలిగి ఆత్యంతిక దుఃఖనివృత్తిని పొందటమే జనన మరణ సంసారదోషనివారకమైన తీర్థఫలం.

దేనికైనా అంతఃకరణ పరిశుద్ధి అవసరం. అంతఃకరణ పరిశుద్ధి లోపించినవాళ్ళు ఎన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకొన్నా, ఎన్ని తీర్థస్నానాలు చేసినా కల్లు త్రాగినవాడు బురదగుంటలో పడినట్లే సమస్తం నిష్ఫలం అవుతుంది. మలినచిత్తులు తపస్సు చేస్తేనేమి? దానాలిస్తేనేమి? వారి పుణ్యక్షేత్రదర్శనం అపక్షేత్రదర్శనమే. వారి తీర్థసేవనం అతీర్థసేవనమే. అదే మరి విషయనిరాసక్తులై నిర్మలాత్ము లైనవారికో? అసలు తీర్థాదికాలతో ప్రమేయమే ఉండదు. కేవలం భగవదాయత్తచిత్తులై, జ్ఞానరూపజలాలలో మునకవేసి, రాగద్వేషాలనే మలినాలను తొలగించుకొని, మానసతీర్థంలో నిత్యస్నానం చేసే పరమభక్తులకు భక్తిని మించిన తీర్థఫలం ఏమి కావాలి? అందువల్ల బాహ్యశౌచాలకంటె అంతశ్శౌచం ముఖ్యమని గ్రహించి, ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకొని, భక్తిభావన తప్ప వేరొక భావన లేకుండా తదేకభక్తితో నైమిశాదులైన పుణ్యక్షేత్రాలను, తీర్థాలను చేరేవారే నిజమైన భక్తిపరులు. వారే శ్రీ భగవానుని కృపకు పాత్రులు. అటువంటి భక్తిపరులకు ఆవాసం కనుకనే మహాత్ములు, మహర్షులు, మహనీయు లందరికీ శ్రీ నైమిశారణ్యం నిత్యనివాసమయింది.

అందువల్లనే – చంద్రునికి దూరమైనప్పుడు దక్షప్రజాపతి కుమార్తె రోహిణి, శక్తి ముని శాపవశాన ప్రాయశ్చిత్తనిమిత్తం అయోధ్యరాజు సుదాసుడు, దుర్లభమైన చిత్తశాంతికోసం భార్యాపుత్త్రసమేతుడై వసిష్ఠ మహర్షి, గంధర్వలోకం నుంచి శ్రౌతాగ్నిని భూమికి తెచ్చినపుడు పురూరవుడు ఈ నైమిశారణ్య క్షేత్రానికి వచ్చి భగవదారాధన కావించి ఇష్టకామ్యార్థసిద్ధికి నోచుకొని ధన్యులయ్యారు. ఆ ధన్యధన్యులు, ఆ పుణ్యధనులు, ఆ మహనీయులు సంచరించిన ఒక్కొక్కచోట నైమిశారణ్యంలో ఒక్కొక్క పుణ్యతీర్థం ఏర్పడింది. ఆ కథానకాలను ఇతిహాస పురాణోపపురాణాల రూపంలో మునులు మనకు వినిపించారు.

నైమిశారణ్యంలోనే, దీర్ఘసత్త్రయాగాలు జరుగుతుండిన రోజులలో మహర్షులు సమావేశమవుతుండే గోమతీ నదీతీరాననే – సర్వపాపనిష్కాసన సమర్థాలైన కన్యా తీర్థం, అశ్వ తీర్థం, గవాం తీర్థం, కాలకోటి వృషప్రస్థం, బాహుదా తీర్థం ఉన్నాయి. ధర్మశాస్త్రవిహితాలైన అగ్నిహోత్రాది రూప యజ్ఞయాగాల ద్వారా కర్మకాండను ప్రతిపాదించే మంత్రసంహితలు, మంత్రేతర వేదభాగాలైన బ్రాహ్మణాలు, మహవ్రతాది నిరుక్తులతోడి పూర్వకథావిశేషాలతో కూడిన ఆరణ్యకాలు, ఈశావాస్యం మొదలుకొని ముక్తికం దాకా బ్రహ్మవిద్యారహస్యాలను విప్పిచెప్పే ఉపనిషత్తులలో అనేకం – ఇక్కడి మహర్షుల దర్శనంలోనే ప్రాదుర్భవించాయి. బ్రహ్మవంశంలో అత్రికి చంద్రుడు, చంద్రునికి బుధుడు, బుధునికి పురూరవుడు, ఆ క్రమాన ఆయువు – అనేనసుడు – ప్రతిక్షత్త్రుడు – సంజయుడు – జయుడు – విజయుడు – కృతి – హర్యశ్వుడు – సహదేవుడు – నదీనుడు – జయత్సేనుడు – సంకృతి – క్షత్త్రధర్ముడు – సుహోత్రుడు – శాలుడు – ఆర్ష్టిషేణుడు – కాశుడు – దీర్ఘతపుడు – ధన్వంతరి – కేతుమంతుడు, అతనికి భీమరథుడు, ఆ భీమరథునికి జన్మించిన దివోదాసుడు నైమిశారణ్యంలో క్రతుకృత్యాలను నిర్వర్తించి వంశపావనులయ్యారట. దివోదాసుని కాలంలో అయోధ్యా నగరం గంగ ఒడ్డునుంచి గోమతి దాకా విస్తరించిందట. శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం జరిగి రాజ్యం సుఖశాంతులతో సుస్థిరంగా ఉన్న తరుణంలో గోమతికి వచ్చి అశ్వమేధయాగం చేసిన ఉదంతం ఉత్తర రామాయణంలో ఉన్నది. అందువల్ల భక్తజనులు గోమతీ జలాలలో తీర్థస్నాతులై అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవటం పరిపాటి అయింది.

నైమిశారణ్యానికి దరిదాపులలోనే పరమపావనమైన చక్ర తీర్థం, రుద్రావర్తం, “సర్వతీర్థేషు స స్నాతి, మిశ్రకే యో నరః” (మిశ్రకంలో స్నానం చేసిన మనుష్యుడు సర్వతీర్థాలనూ సేవించినట్లే) అని పద్మపురాణం కొనియాడిన మిశ్రక తీర్థం ఉన్నాయి. ఇక్కడే పంచప్రయాగ క్షేత్రం, పురాణప్రసిద్ధమైన అక్షయ వటం, లలితాదేవి మందిరం, గోవర్ధన మహాదేవాలయం, క్షేమకాదేవి గుడి, జానకీ కుండం, ఆంజనేయుని మందిరం, కాశీ తీర్థంలో అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వరాలయం, ధర్మరాజ నిలయం, వ్యాసదేవుని మందిరం, శుకయోగి మందిరం, బ్రహ్మావర్త తీర్థం, గంగోత్తరీ క్షేత్రం, పుష్కర తీర్థం, గోమతీ తీర్థం, దశాశ్వమేధ ఘట్టం, పాండవుల మెట్ట, శ్రీ రామాలయం, శ్రీ రాధాకృష్ణ మందిరం, బలభద్రస్వామి గుడి, పంచపాండవ సమేత శ్రీకృష్ణ దేవాలయం మొదలైనవి లెక్కలేనన్ని దర్శనీయ స్థలాలున్నాయి. కలియుగారంభంలో ధర్మం ఏకపాదమాత్రమై అధర్మం విలయతాండవం చేయసాగినప్పుడు మృగయావినోదమగ్నుడైన పరీక్షిత్తు – తనకు దాహం వేసి మంచినీళ్ళడిగితే ఇవ్వలేదని తపస్సు చేసుకొంటున్న శమీకుని మెడలో చచ్చిన పామును వేసిన చోటు – శమీకాశ్రమం ఇక్కడే ఉన్నది. తండ్రికి జరిగిన అవమానానికి కోపించి పరీక్షిత్తును శపించిన శమీకుని కొడుకు శృంగి ముని ఆశ్రమం, గురువు శమీకుని ఆజ్ఞను పురస్కరించుకొని ఆ శాపవృత్తాంతాన్ని ఇంద్రప్రస్థానికి వెళ్ళి పరీక్షిత్తుకు తెలియజేసిన శమీక ముని ప్రియశిష్యుడు గౌరముఖుని ఆశ్రమం – నైమిశీయ కుంజానికి సమీపంలో దృషద్వతీ నది ఒడ్డున ఉన్నాయి.

నైమిశారణ్య వైభవం

బ్రహ్మనదీ సరస్వతికి పడమటి తీరాన శమ్యాప్రాసంలో ఆశ్రమం నిర్మించుకొని మహర్షి వేదవ్యాసుడు సాత్త్వత సంహితను రచించాడు. ఆ ప్రాంతాననే సహస్రవర్షాల సత్త్రయాగాన్ని నిర్వహించిన శౌనకాదులకు సూత పౌరాణికుడు శ్రీమద్భాగవతాన్ని, దేవీ భాగవతాన్ని, బహుపురాణోపాఖ్యానాలను, ఉపపురాణాలను, శ్రౌతసూత్రాలను, గృహ్యసూత్రాలను, ధర్మశాస్త్రాలను యథోచితంగా వినిపించాడు.

పరమపావనమైన నైమిశారణ్యం పేరు వింటేనే భక్తులకు మనస్సు పరవశిస్తుంది. గతకాలపు తెరవెనుక దాగిన వివిధ పౌరాణికకథలూ గాథలూ జ్ఞాపకానికి వస్తాయి. అక్కడి పురాణప్రవచనాలు, బ్రహ్మనిష్ఠుల జ్ఞానబోధలు, సర్వజ్ఞులైన మహామునుల శాస్త్రప్రసంగాలు, వారి ప్రశ్నోత్తరాలలో దొర్లిన ప్రమాణవాక్యాలు, ఆత్మానాత్మవివేకం, పాపపుణ్యాల ఫలస్వరూపం, భగవంతుని దుష్టశిక్షణ శిష్టరక్షణ లీలాకృత్యాలు, సర్వాతీతమైన భక్తిమహిమ – అన్నీ అనుభవానికి వస్తాయి. మేను గగుర్పొడుస్తుంది. భారతీయధర్మానికి, జాతి సంస్కృతికి మూలకందమైన పుణ్యావాసం అది.

పురాణేతిహాసాలకు పుట్టినిల్లయిన నైమిశారణ్య దివ్యస్థలంలోనే పరాశర మహర్షి మైత్రేయునికి విష్ణుపురాణాన్ని బోధించాడు. అనేకపర్యాయాలు ద్వాదశవర్షీయ దీర్ఘసత్త్రాలను నిర్వహిస్తూ నిష్ఠుర కర్మనిష్ఠులైన మునులు ఆ వ్యాసంగంతో కొంత అలసిపోవటం సహజమే. ఎప్పుడన్నా విరామసమయం దొరికితే నలుగురూ సమావేశమై పరమార్థచింతన కావించేవాళ్ళు. భగవన్నామసంకీర్తనతో సత్కాలక్షేపం జరుగుతుండేది. అటువంటప్పుడు రోమహర్షణుని కొడుకు ఉగ్రశ్రవుడు అక్కడికి వచ్చి, వారికి వేదవ్యాస మహర్షి తనకు నేర్పిన పురాణాలను ఉపదేశించేవాడు. ఆయా వేళలో వారివారి పరిప్రశ్నలను బట్టి – ఈశాన కల్పంలో అగ్నిదేవుడు వసిష్ఠునికి బోధించిన అగ్ని పురాణాన్ని, లక్ష్మీ కల్పంలో శ్రీమహావిష్ణువు శ్రీదేవికి చెప్పిన కూర్మ పురాణాన్ని, గరుడ కల్పంలో విష్ణుమూర్తి మనువుకు ప్రపంచించిన గరుడ పురాణాన్ని, పాద్మ కల్పంలో స్వయంభువు బ్రహ్మకు తెల్పిన పద్మ పురాణాన్ని, బ్రహ్మ కల్పంలో బ్రహ్మదేవుడు మరీచికి నేర్పిన బ్రహ్మ పురాణాన్ని, రథంతర కల్పంలో సావర్ణి మనువు నారదునికై వచించిన బ్రహ్మవైవర్త పురాణాన్ని, భవిష్య కల్పంలో బ్రహ్మదేవుడు లోకకల్యాణార్థమై పలికిన బ్రహ్మాండ పురాణాన్ని, కూర్మ కల్పంలో బ్రహ్మదేవుడు పులస్త్యునికి తెలియజేసిన వామన పురాణాన్ని, తత్పురుష కల్పంలో కుమారస్వామి ప్రబోధించిన స్కాంద పురాణాన్ని – అడిగినవారికి చెప్పవలసిన తీరున, విజ్ఞానావేశంతో వినిపించాడు. లోకవృత్తాన్ని కర్తవ్యాకర్తవ్యాల సమీక్షతో మనస్సుకు హత్తుకొనే విధంగా వివరించాడు. ధర్మాధర్మాలను రెండింటినీ విశదీకరించాడు. జ్ఞానయజ్ఞాన్ని చేస్తూ ఏనాటికానాడు భగవదనురక్తులకు భగవల్లీలామృతాన్ని ప్రసాదం వలె పంచిపెట్టాడు. కథలో కథలో కథను చెబుతూ గుహ్యాద్గుహ్యతరం అయిన రహస్యార్థపరంపరను కరతలామలకంగా ప్రకాశింపజేశాడు. సాంగోపాంగంగా వేదాన్ని చదువుకొని, చదువుకొన్న చదువును అనుభవంలోకి తెచ్చుకొని, “తత్త్వమిదీ!” అని గ్రహించిన మహామహాఋషులకు, ధర్మవేత్తలకు, విజ్ఞానులకు, పండితులకు, కవులకు సైతం కలిగిన సందేహాలకు – ఎప్పటికప్పుడు చిక్కుముడులు విప్పి సమాధానాలు చెప్పాడు. ఎన్నడో జరిగిపోయిన కథల అంతస్సారసంగ్రహణంలో ఒకదాని మతంతో వేరొకదానికి విరోధం ఉన్నదనిపించినప్పుడు – శ్రుతిని ప్రమాణీకరించి, స్మృతిని ఉదాహరించి ధర్మసమ్మతమైన తన తీర్పును ఒక మిత్రుని వలె నేర్పుగా, ఓర్పుగా వివరించి చెప్పాడు. ఒక్కొక్క కథలో ఒక్కొక్క జీవితసత్యాన్ని ఆవిష్కరించాడు. మానవాళి మనుగడకు మార్గం చూపాడు.

నైమిశారణ్యంలోని పుణ్యతీర్థాలను చూసుకొంటూ ఆ మార్గాల వెంబడి నడిచివెళ్ళే యాత్రికులు – సూత గోస్వామి చెప్పిన పూర్వకాలపు కథాసన్నివేశాలను భక్తితో నెమరువేసుకొంటూ, ఆ చోట్లలో సంచరించిన మహాత్ముల జీవితసందేశాన్ని మనస్సులో పదిలపరుచుకొంటూ, అడుగడుగునా వెలసిన గుడులూ గోపురాలలో కానవచ్చే ఆయా భగవన్మూర్తులకు నమస్కరిస్తూ, ఆశ్రమాలలో జరుగుతుండే హవిర్యజ్ఞాల ధూమగంధానికి తన్మయులౌతూ, అక్కడి గాలి మోసుకొనివచ్చే వేదమంత్రాల కలస్వనాలను ఆలకిస్తూ, దీక్షావస్త్రాలను ధరించి తామ్రజటాధారులై, ఆత్మారాములై కనుపించే సాధువులకు మోకరిల్లుతూ – జీవితాలను చరితార్థం చేసుకొంటారు.

సూతుని వృత్తాంతం

నైమిశారణ్యంలో పురాణేతిహాసాల కథకుడుగా కీర్తిగన్న సూత పౌరాణికునికి భారతీయ సంస్కృతిలో అవిస్మరణీయమైన స్థానం ఉన్నప్పటికీ, ఆయనను గురించి ఆస్తికులలో చాలామందికి ఇప్పటికీ అంతగా ఏమీ తెలియదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన అసలు పేరు రోమహర్షణుడు. సంస్కృతంలో రేఫ – లకారాలకు ఉన్న అభేదవ్యవహారం వల్ల లోమహర్షణుడని కూడా అంటారు. రోమహర్షణుడన్న ఆ పేరే (వెంట్రుకలు నిక్కబొడుచుకొనేంత ఉత్కంఠను కలిగిస్తూ శ్రోతలను ఆనందింపజేసేవాడు) ఆయన కథాకథనకౌశలాన్ని సూచిస్తున్నది.

            “లోమాని హర్షయాంచక్రే శ్రోతౄణాం యత్ సుభాషితైః

            కర్మణా ప్రథిత స్తేన లోకేస్మిం ల్లోమహర్షణః.”

అని వాయు పురాణం. ద్వైపాయన మహర్షి పురాణాలను నేర్పుతుంటే తనువు పులకరించినందువల్ల కూడా ఆయనకు రోమహర్షణుడని పేరు కలిగిందట.

            “తస్య తే సర్వరోమాణి వచసా హర్షితాని యత్

            ద్వైపాయన స్యానుభావా త్తతోభూద్రోమహర్షణః.”

అని స్కాంద పురాణం ఈ విషయాన్ని చెప్పింది. నైమిశారణ్యంలో శౌనకాది మునులకు అగ్ని – కూర్మ – గరుడ – బ్రాహ్మ – బ్రహ్మవైవర్త – బ్రహ్మాండ – వామన – స్కాంద పురాణాలను, శ్రీమద్భాగవతాన్ని, శ్రీ దేవీ భాగవతాన్ని బోధించినది ఈయనే. ఈయన కొడుకు ఉగ్రశ్రవుడు కూడా ప్రసిద్ధ పౌరాణికుడే. నైమిశారణ్యంలోనే ఈయన శౌనకాదులకు శ్రీ మహాభారతాన్ని వినిపించాడు. రోమహర్షణుని కొడుకయినందువల్ల ఈయనకు రౌమహర్షణి అని, సూత సుతుడైనందువల్ల సౌతి అని పేర్లున్నాయి. భారత కథానంతరం దాని పర్యంతభాగమైన హరివంశం కూడా ఈయన చెప్పినదే.

‘సూత శబ్దానికి రథచోదకుడని ఒక అర్థం. కర్ణుని పెంపుడు తండ్రి సూతుడే. వర్ణసాంకర్యం వల్ల జన్మించిన సూతులు పదకొండు విధాలట: కరణుడు (వైశ్యునికి శూద్రస్త్రీ యందు జన్మించినవాడు), అంబష్ఠుడు (బ్రాహ్మణునికి వైశ్యస్త్రీ యందు జన్మించినవాడు), ఉగ్రుడు (క్షత్రియునికి శూద్రస్త్రీ యందు జన్మించినవాడు), మాగధుడు (వైశ్యునికి క్షత్రియస్త్రీ యందు జన్మించినవాడు), మాహిష్యుడు (క్షత్రియునికి వైశ్యస్త్రీ యందు జన్మించినవాడు), క్షత్త (శూద్రునికి క్షత్రియస్త్రీ యందు జన్మించినవాడు), సూతుడు (క్షత్రియునికి బ్రాహ్మణస్త్రీ యందు జన్మించినవాడు), వైదేహకుడు (వైశ్యునికి బ్రాహ్మణస్త్రీ యందు జన్మించినవాడు), రథకారుడు (మాహిష్యునికి కరణస్త్రీ యందు జన్మించినవాడు), పారశవుడు (బ్రాహ్మణునికి శూద్రస్త్రీ యందు జన్మించినవాడు), చండాలుడు (శూద్రునికి బ్రాహ్మణస్త్రీ యందు జన్మించినవాడు) అని. మత్స్యదేశపు రాజు విరాటుని బావ కీచకుడు కూడా సూతుడే. వేదాధ్యయనం అన్నది బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన రోజులలో వేదవిజ్ఞానానికి అనర్హులుగా భావింపబడిన బ్రాహ్మణేతరవర్గాలవారిలో ధర్మప్రచారం చేయటానికి క్షత్రియ – బ్రాహ్మణీ ప్రతిలోమ వివాహ సంజాతులైన సూత పౌరాణికులు బయలుదేరి, తమ విద్వత్త మూలాన పురాణవక్తలుగా గుర్తింపును పొందారని పెద్దలంటారు. జన్మతః బ్రాహ్మణులైన శౌనకాది మహామునులు పవిత్రమైన యాగదీక్షామధ్యంలో ఈ సూతపౌరాణికుని నుండి విజ్ఞానవివేకాలను అభ్యసించటానికి వెనుకాడలేదు. ఆ ప్రకారం ఆలోచించిచూస్తే శౌనకుడు తన కాలానికంటె ఎంతో ముందుచూపు కల సమచిత్తుడని, కులాల పట్టింపులు అంతగా లేనివాడని తోపక మానదు. అంతే కాదు. శూద్రులకు విద్యాధికారం లేదని, కులబాహ్యులైనందువల్ల వారికి సంతానం లేనప్పుడు దత్తస్వీకారానికి సైతం అధికారం లేదని, ఎందుకంటే దత్తస్వీకారం సమయంలో పఠించే స్మార్తమంత్రాలను వారు వినకూడదని, ఆ స్వీకారమంత్రాలను వారి యెదుట ఉచ్చరింపకూడదని – ఆ రోజుల్లో ఉండిన విశ్వాసాన్ని త్రోసిరాజని శౌనకుడు తన శౌనక స్మృతిలో వారికి ఆ అధికారాన్ని అంగీకరించాడు. శూద్రుడు కూడా బ్రాహ్మణుని పౌరోహిత్యానికి కుదుర్చుకొని దత్తస్వీకారం చేసుకోవచ్చునని అనుమతించాడు. నైమిశారణ్యంలో భగవత్కథలను వింటూ సమచిత్తాన్ని, స్థితప్రజ్ఞతను అలవరచుకొన్న శౌనకుడు ఆ విధంగా భారతీయ సంస్కృతిలో పెక్కు మార్పులకు ఆద్యుడయ్యాడని భావించటంలో తప్పుండకూడదు. ఆ విశాల కథితకథంతకు పీఠభూమి నైమిశారణ్యమే అన్న విషయాన్ని మనము విస్మరింపకూడదు.

నైమిశారణ్యంలో ఋషులు తనను పెద్దలముందు పెద్దను చేసి గౌరవించినప్పటికీ, ఆనాటి జనారణ్యం ప్రభావం వల్ల కాబోలును, సూతపౌరాణికునికి ఆ పెద్దల ముందు కొంత జంకు ఉన్నట్లే కనబడుతుంది. ఋషులు తనను భగవన్మహిమను వర్ణించి చెప్పమని అడిగినప్పుడు బృహన్నారదీయంలో స్వయంగా సూతుడే –

            “విలోమజోపి ధన్యోస్మి య న్మాం పృచ్చథ సత్తమాః”

అన్నాడు. “నాబోటి విలోమజాతుడిని చెప్పమని అడిగారే, ఓ మహాత్ములారా! నా జన్మ ధన్యమయింది” అని. తర్వాత తర్వాత ఆయన పాండిత్యానికి ముగ్ధులైన పురాణశ్రోతలు ఆయన గోస్వామితను అంగీకరించి, ఆయనను ద్విజునిగానే పరిగణించినట్లు కనబడుతుంది. అందుకే గర్గ సంహితాకారుడు “సూతాః పౌరాణికాః ప్రోక్తాః” అని మెచ్చుకొన్నాడు. అగ్ని పురాణమైతే ఆయన విద్యావివేకాతిశయాన్ని మరీ మరీ ప్రశంసించింది:

            “పృషదాజ్యసముత్పన్నః సూతః పౌరాణికో ద్విజః

            వక్తా వేదశాస్త్రాణాం త్రికాలానలధర్మవిత్”

అని ఆయన వైదుష్యాన్ని తలకెత్తింది.

సంస్కృతంలో “పృషదాజ్యసముత్పన్నః” అంటే ఏమిటి? పృషత్ అంటే బ్రహ్మబిందువు. పృషదాజ్యమంటే యజ్ఞవేళ హవిస్సును మంత్రించేందుకు ముంచే పవిత్రమైన నేయి. ఆ యజ్ఞగుండంలో పుట్టినవాడు పృషదాజ్యసముత్పన్నుడు. ఆ పృషదాజ్యసముత్పన్నునికి సూతుడని ఎందుకు పేరువచ్చింది? అంటే, అందుకొక కథ.   

నైమిశారణ్యంలోని పౌరాణికుల జన్మ కథనాలు

స్వాయంభువ మనువు కాలంలో జన్మించిన చాక్షుష మనువుకు మనుమడైన అంగుని కొడుకు వేనరాజు. రాజ్యానికి వచ్చాక వేనుడు వేదశాస్త్రాల పట్ల అవిధేయుడయ్యాడు. పాపాలు చెయ్యటం మొదలుపెట్టాడు. అధికారం తలకెక్కి, దురహంకారం పెరిగి, దౌష్ట్యం మితిమీరింది. అతని అకృత్యాలను చూసి సహింపలేక మునులు దర్భలను దివ్యాస్త్రాలుగా మంత్రించి అతని శరీరంలో నాటారు. అతను మరణించిన వెంటనే మృతకళేబరంలోని తొడ భాగాన్ని అరణిగా (యజ్ఞంలో అగ్నిని మథించేందుకు వాడే కొయ్యసాధనం) చేసుకొని, ప్రాణోత్సర్గమంత్రాలతో అతనిలోని పాపాలన్నిటినీ ఒక ప్రాణమయతనువుగా బయటికి తీసి, దానిని అడవులకు పంపివేశారు. పాపాపనోదనం జరిగాక మునులు ఆ కళేబరంలో కుడి భుజాన్ని మళ్ళీ మథించారు. ఆ దక్షిణ భుజాస్తంభారణి నుంచి సత్త్వగుణోపేతుడు, ధర్మశీలుడు, అజేయ పరాక్రమశాలి అయిన పృథు చక్రవర్తి సద్యోయౌవనుడై ఉద్భవించాడు. అతని పాలనలో ధరణి సస్యశ్యామలం అయింది.

పాతకకృత్యాల మూలాన ప్రాభవాన్ని కోల్పోయిన లోకంలో మళ్ళీ ధర్మతేజాన్ని వెలుగొందజేయాలని పృథు చక్రవర్తి పృథుపైతామహం అనే మహాయజ్ఞాన్ని సంకల్పించాడు. సర్వసమర్థులైన ఋత్విజులను ఆహ్వానించి, తానే యజమానుడై వేదోక్తమంత్రాలతో శాస్త్రోదితక్రమాన యజ్ఞాన్ని అనుష్ఠించాడు.

ఆ శుభతరుణాన క్రతుహోమంలో ఆహుతిగా సమర్పించిన మంత్రాల మహిమ వల్ల యజ్ఞవేదిక నుంచి “సూత”, “మాగధ” నామాలతో శిశువులిద్దరు జన్మించారు.

మునులు ఆ పసివాళ్ళ చూడచక్కని రూపానికి, ప్రసన్నమైన తేజానికి, వీణ మీటినట్లున్న వారి కంఠస్వరానికి ముగ్ధులై, వారిని మనసారా ఆశీర్వదించారు. “విశ్వశ్రేయాన్ని కోరి పృథువు నిర్వహించిన మహాయజ్ఞంలో ఆవిర్భవించే మహావకాశం మీకు కలిగింది. ఏతత్పుణ్యఫలంగా చిరంజీవులై వర్ధిల్లండి. పృథువు యశోగానం చేసి ధన్యాత్ములై మెలగండి” అని దీవెనలు పోశారు.

ఇది విష్ణుపురాణంలో పరాశరుడు మైత్రేయునికి చెప్పిన ఉదంతం. వాయు పురాణంలో ఇదే కథ మరికొంత వివరంగా ఉన్నది. వేనపుత్రుడు పృథువు యజ్ఞం చేస్తుండగా, అగ్నిగుండం నుంచి సూతుడు జన్మించాడు. దేవతలకు రాజైనందువల్ల ఇంద్రునికి హోమమంత్రాలలో “క్షత్త్రియు”డని సంకేతం. దేవగురువైన బృహస్పతికి “బ్రాహ్మణు”డని వ్యవహారం. యజ్ఞంలో హోత పొరపాటు వల్ల హవిస్సులను సమర్పించేటప్పుడు బృహస్పతికి ఇస్తున్నదానిలో ఇంద్రునికై ఇవ్వమన్నది కూడా కలిసిపోయింది. ఆ కలయిక వల్ల అగ్నిగుండం నుంచి మంత్రఫలంగా సంతానోదయం జరిగింది. “సూతి” నుంచి – అంటే, సోమరసాన్ని పిండే యజ్ఞవేదిక నుంచి జన్మించినందున ఆ శిశువుకు “సూతు”డని పేరువచ్చింది. లింగానుశాసనంలో జరిగిన వర్ణవ్యత్యయాన్ని పురస్కరించుకొనే క్షత్త్రియ – బ్రాహ్మణీ సంగమం వల్ల కలిగిన వర్ణసంకరమని వైదిక పరిభాషలో వ్యవహరించటం జరిగిందట.

            “వైన్యస్య తు పృథో ర్యజ్ఞే వర్తమానే మహాత్మనః

            సుత్యాయా మభవ త్సూతః ప్రథమం వర్ణవైకృతమ్.  

            ఇన్ద్రేణ హవిషా తత్ర హతిః పృక్తం బృహస్పతేః

            జుహావేన్ద్రాయ దైవేన తతః సూతో వ్యజాయత.

            ప్రమాదాత్ తత్ర సఞ్జజ్ఞే ప్రాయశ్చిత్తం చ కర్మసు

            శిష్యహవ్యేన యత్ పృక్త మభిభూతం గురో ర్హవిః

            అధరోత్తరచారేణ జజ్ఞే త ద్వర్ణవైకృతః.

అని వాయు పురాణం 62-వ అధ్యాయంలోని కథనం. బ్రహ్మపురాణంలోని కథకూడా విష్ణుపురాణం వంటిదే. వాయుపురాణంలో చెప్పబడిన విశేషాలకు తోడు అందులో మరికొన్ని వివరాలున్నాయి. ఋషులు సూత – మాగధులను పృథువు యశోగానం చెయ్యమని ఆదేశించినప్పుడు వారిద్దరూ – సద్యోజాతులు కనుక – రాజును గురించి మాకేమీ తెలియదే, మేమేమని స్తోత్రం చెయ్యగలము? అని తమ అశక్తతను వెల్లడించారట. ఋషులు వారికి వాక్శుద్ధిని ప్రసాదించి, ఆనాటినుంచి వారు ఏమని స్తోత్రం చేస్తే పృథువు ఆ మహాకార్యాన్ని నెరవేర్చగలడని వారికి సత్యవాణిని వరంగా ఇచ్చారట. అప్పుడు వారు చేసిన యశోగానం పూర్తయాక రాజు సంతోషించి మాగధుని మగధ దేశానికి, సూతుని అనూప దేశానికి పంపించాడని అందులో ఉన్నది:

            తస్మిన్నేవ కాలే చ యజ్ఞే పైతామహే శుభే

            సూతః సుత్యాం సముత్పన్నః సౌత్యేహని మహామతిః.

            తస్మిన్నేవ మహాయజ్ఞే జజ్ఞే ప్రాజ్ఞోథ మాగధః

            పృథో స్త వార్థం తౌ తత్ర సమాహూతౌ మహర్షిభిః.

            తా వూచు రృషయః సర్వే స్తూయతా మేష పార్థివః

            క్రమైతదనురూపం వా పాత్రం చైవ నరాధిపః.

            తా వూచతు స్తదా సర్వాం స్తా నృషీన్ సూతమాగధౌ

            ఆవాం దేవా నృషీంశ్చైవ ప్రీణయామః స్వకర్మభిః.

            న చాస్య విద్మో వై కర్మ నామ వా లక్షణం యశః

            స్తోత్రం యేనాస్య కుర్యావో రాజ్ఞ స్తేజస్వినో ద్విజాః.

            ఋషిభి స్తౌ నియుక్తౌ తు భవిష్యైః స్తూయతా మితి

            యాని కర్మాణి కృతవాన్ పృథుః పశ్చా న్మహాయశాః.

            తతః ప్రభృతి వై లోకే స్తవేషు మునిసత్తమాః

            ఆశీర్వాదాః ప్రయుజ్యన్తే సూత మాగధ వన్దిభిః.

            తయోః స్తవాన్తే సుప్రీతః పృథుః ప్రదాత్ ప్రజేశ్వరః           

            అనూపదేశం సూతాయ మగధాం మాగధాయ చ.”

అని బ్రహ్మపురాణంలోని 4-వ అధ్యాయంలో ఉన్నది. ఈ కథలో పృథు చక్రవర్తి మాగధుని మగధ దేశానికి, సూతుని అనూప దేశానికి పంపిచాడని ఉన్నది. అనూప దేశం అంటే నేటి నర్మదా నదీతీర ప్రాంతం. ఆ పక్షాన సూతుడు నర్మదాతీరనివాసి అని; పురాణప్రవచనార్థమో, యాగసందర్శనకో అక్కడినుంచి నైమిశారణ్యానికి వస్తూ పోతూ ఉండేవాడని – ఊహించటం సబబే అవుతుంది. పద్మ పురాణం (2:36 అధ్యాయం, 5:1 అధ్యాయం) బ్రహ్మాండ పురాణం (2:36 అధ్యాయం) కూడా ఈ సూత జన్మవృత్తాంతాన్ని ఇదే విధంగా ప్రస్తావించాయి. వేదాధికారం లేని సూతునికి ఈ ప్రకారం అలౌకికావతారమూ, ద్విజత్వాంగీకారమూ సిద్ధించిన తర్వాత ఇతరసూతులతో పృథక్త్వం కూడా ఏర్పడినట్లున్నది. అర్థశాస్త్రంలో కౌటల్యుడు కొంత మల్లగుల్లాలు పడి, “వైశ్యా న్మాగధౌ వైదేహకౌ. క్షత్త్రియాత్ సూతః. పౌరాణిక స్త్వన్యః సూతో; మాగధశ్చ బ్రహ్మక్షత్త్రా ద్విశేషతః” (అర్థ. 3-7) అని పౌరాణిక సూతుడు క్షత్రియ – బ్రాహ్మణీ సుతుడైన సూతుడు కాడని ఒక విశేషనిర్ణయాన్ని చెప్పాడు. కూర్మ పురాణం మరొక్క అడుగు ముందుకువేసి, యజ్ఞకుండంలో ఆవిర్భవించిన సూతుడు స్వయంగా శ్రీ మహావిష్ణువే అని, ఆయన సర్వశాస్త్రకోవిదుడని, ధర్మవేత్త అని ప్రశంసించింది:

            “నియోగాద్బ్రాహ్మణః సార్ధం దేవేన్ద్రేణ మహౌజసా

            వేనపుత్త్రస్య వితతే పురా పైతామహే మఖే.

            సూతః పౌరాణికో యజ్ఞే మాయారూపః స్వయం హరిః

            ప్రవక్తా సర్వశాస్త్రాణాం ధర్మజ్ఞో గురువత్సలః.”

అన్నది. నైమిశారణ్యంలోని మునులు కూర్మపురాణం వినిపించమని సూతుని ప్రార్థించినపుడు “నీవు పురాణసంహితను చెప్పటానికి మనుష్యరూపంలో దిగివచ్చిన సాక్షాత్పురుషోత్తముడివి” అనే అన్నారు.

త్వం హి స్వాయంభువే యజ్ఞే సుత్యాహే వితతే సతి

            సంభూతః సంహితాం వక్తుం స్వాంశేన పురుషోత్తమః.

అని. కథ చెప్పే వ్యక్తి గొప్పదనాన్ని బట్టి కథకూ ప్రామాణికత వస్తుందని వారికి తెలుసు.

వేదవిభాగం

పురాణ సంహితను నిర్మించిన తర్వాత వేదవ్యాసుడు దానిని తన ప్రియశిష్యుడైన రోమహర్షణునికి ఉపదేశించాడు. సూతుడంటే రోమహర్షణుడు ఒక్కడే కాడని, పురాణప్రవచనం చేసిన సూతులందరూ వేర్వేరు వ్యక్తులు కావచ్చునని – కొందరంటారు. ఒకనాడు పృథుచక్రవర్తి చేసిన యజ్ఞంలో ఉద్భవించిన సూతునికి రోమహర్షణుడనే పేరు లేదని, అగ్నికుండం నుంచి పుట్టిన ఆ సూతుని సంప్రదాయాన్ని కొనసాగించిన శిష్యులు, ఆ సూతుని వంశీయులు – అందరూ సూతులేనని వీరి అభిప్రాయమైనట్లు కనబడుతుంది. సూత రోమహర్షణుని కొడుకు ఉగ్రశ్రవుని ‘సౌతి’ అన్నారే కాని, సూత ఉగ్రశ్రవు డనలేదు కాబట్టి వీరి వాదం సరికాదని తెలుస్తుంది.

రోమహర్షణుని నుంచి పురాణసంహితను ఆయన శిష్యుడైన సుమతి (సునీతుడని కొన్ని విష్ణుపురాణం ప్రతులు), అగ్నివర్చుడు, మిత్రాయువు, సుశర్మ, అకృతవ్రణుడు, సావర్ణి అనేవారు అభ్యసించారు. వీరిలో సుమతిది ఆత్రేయ సగోత్రమట. అగ్నివర్చునిది భారద్వాజ సగోత్రం. మిత్రాయువు వసిష్ఠ సగోత్రుడు. అకృతవ్రణుడు (అకృతవర్ణుడని కొన్ని ప్రతులు), సావర్ణి కాశ్యప సగోత్రులు. వీరి గోత్రకర్తలు కూడా నైమిశారణ్యవాసులే అయివుండటం విశేషం. సుశర్మకు గోత్రనామాన్ని పురస్కరించుకొని శాంశపాయనుడనే ప్రసిద్ధి. సావర్ణి తండ్రి పేరు సోమదత్తు డైనందువల్ల ఆయనకు సౌమదత్తి అని పేరువచ్చింది. రోమహర్షణుడు నిర్మించిన పురాణసంహితను బట్టి అకృతవ్రణుడు, సావర్ణి, సుశర్మ సరికొత్త సంహితలను రూపొందించి, తమ భాగాలను వేదశాఖల వలె కాండలుగా విభజించారు. బ్రహ్మండ పురాణమంతటా ఈ శాంశపాయనుడు అడిగితే సూతుడు వినిపించిన కథే.

సూతునికి ఆలయం

          నైమిశారణ్యంలో చక్రతీర్థానికి దగ్గరే దశాశ్వమేధం ఉన్నది. ఆ ప్రక్కనే పాండవుల మెట్ట, అక్కడొక గుడి ఉన్నాయి. దానికి సమీపంలో సూత గోస్వామి విడిదిచేసిన చోటున్నది. అదొక చిన్ని కోవెల. అందులో ఆయన కూర్చొన్న దివ్యాసనం ఉన్నది. దానికి “సూత జీ కీ గద్దీ” అని పేరు. జాతికి అక్షయమైన జీవనిధులను ప్రసాదించిన మహాత్ములను పూజించుకోవటం మన కర్తవ్యం.

శౌనక మహాముని

          నైమిశారణ్యంలోని ఎనభైఎనిమిదివేలమంది ఋషులకు ఉపకులపతి అయిన శౌనకుడు సమస్త ప్రపంచానికీ ఆశ్రయభూతమైన ధర్మస్వరూపాన్ని గుర్తెరిగి, ధర్మమే ఉత్తమోత్తమమైన మోక్షసాధనమని గ్రహించి నివృత్తిమార్గాన్ని అవలంబించిన మహాత్ముడు. సూత పౌరాణికుని వైదుష్యం ఎంతటితో తెలిసి – ఆయనను అడిగి, అనేక పురాణసంహితలను చెప్పించుకొని భారతీయ ధర్మశాస్త్రానికి సువర్ణసౌధాన్ని నిర్మింపజేసిన మహానుభావుడు. వక్తకు తగ్గ శ్రోతృచూడామణి.

శౌనకుని వంశవైభవం సామాన్యమైనది కాదు. ఆయన బ్రహ్మమానసపుత్రుడైన భృగుమహర్షి అన్వయంలో జన్మించాడు. వేదాలను అభ్యసించి, నిత్యయజ్ఞకర్మాచరణంతో ఆశ్రమోచితవిధివిధానం నెరవేర్చుకొన్నాడు. అగ్నిహోత్రసేవే ఆత్మసేవ అని దీక్షించి సత్త్రాయాగాదిక్రతువులను చేశాడు. ఋషిఋణాన్ని తీర్చుకొనేందుకు జ్ఞానయజ్ఞాన్ని చేపట్టి పురాణేతిహాసాలను సూతుని ద్వారా, ఆయన కొడుకు ద్వారా లోకంలో వ్యాపింపజేశాడు. “మహర్షీణాం భృగురహం” అని భగవద్గీతలలో శ్రీకృష్ణ పరమాత్మ అన్నందుకు అంతటి మహర్షి పేరుకు తగ్గట్లు ధర్మనిష్ఠతో జీవితం గడిపాడు.

            ఉత్సఙ్గా న్నారదో జజ్ఞే దక్షోఽఙ్గుష్ఠా త్స్వయంభువః

            ప్రాణా ద్వసిష్ఠ స్సఞ్జాతో భృగు స్త్వచః కరా త్క్రతుః.            

అంటారు. బ్రహ్మదేవుని ఒడినుంచి నారదుడు, బొటనవ్రేలు ద్వారా దక్షుడు, ప్రాణము వలన వసిష్ఠుడు, త్వక్కు (చర్మము) నుండి భృగువు, చేతినుండి క్రతువు జన్మించారట. ఇది కల్పాంతకల్పంలో జరిగిన సంగతి.

భృగువు కొడుకు చ్యవనునికి ఆరుషి యందు ఔర్వమహర్షి, ఆయనకు మనువు కుమార్తె అయిన మరొక ఆరుషి యందు ఆమె తొడనుండి విష్ణుభక్తాగ్రేసరుడైన ఋచీకుడు జనించారు. ఒకప్పుడు విశ్వకర్మ నిర్మించిన శివచాప విష్ణుచాపాలు రెండింటిలో విష్ణుచాపాన్ని స్వయంగా శ్రీమహావిష్ణువే స్వయంగా ఈ ఋచీకునికి ఇచ్చాడు. ఋచీకుని భార్య గాధిరాజు కూతురు సత్యవతి. వీరి కుమారుడే జమదగ్ని. జమదగ్ని భార్య ఇక్ష్వాకురాజు ప్రసేనజిత్తు కుమార్తె రేణుక. వీరికే క్షాత్రతేజోమయుడైన పరశురాముడు జన్మించాడు. ఋచీకుని నుండి సంక్రమించిన విష్ణుచాపమే పరశురాముని ద్వారా – శివధనుర్భంగం చేసి సీతను పెండ్లాడిన శ్రీరాముని కరకమలాలను చేరింది.

చ్యవనుని భార్య వైవస్వత మనువు కొడుకైన శర్యాతి కుమార్తె అని శ్రీ మహాభారత కథనం. వారికి కలిగిన కొడుకు ప్రమతి. ఆయనకు ఘృతాచి అనే అప్సరస యందు మనువు జన్మించాడు. మేనకా విశ్వావసువుల కుమార్తె ప్రమద్వర ఆయన ధర్మపత్ని. వారికి శునకుడు జన్మించాడు. శునకునికి శౌనకుడు జన్మించాడు. నైమిశారణ్యంలో సూత గోస్వామి చేత పురాణప్రవచనం చేయించిన కారణజన్ముడు ఈయనే.

శౌనకుని అసలు పేరు గృత్సమదుడని వైదిక సంప్రదాయం. ఋక్సంహితలోని ద్వితీయ మండలాన్ని దర్శించినది ఈయనే. గృత్సమదుని తండ్రి వీతహవ్యుడు. ఋచీక సుతుడైన జమదగ్నికి రేణుకా దేవి యందు రుమణ్వంతుడు, సుహోత్రుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు అనే అయిదుగురు పుత్రులు కలిగారని బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. సుహోత్రునికి వీతహవ్యుడు, వీతహవ్యునికి గృత్సమదుడు, గృత్సమదునికి కుచేతుడు ఉదయించారట. చాక్షుష మనువు కుమారుడైన వరిష్ఠుడు, ఈ గృత్సమదుడు ఎంతో ఆప్తమిత్రులట. మిత్రులన్నాక ఎప్పుడో అప్పుడు ఏవో అపార్థాలంటూ రాకుండానే ఉంటాయా? ఒకప్పుడు నైమిశారణ్యంలో దేవేంద్రుడు కావించిన వేయి సంవత్సరాల దీర్ఘసత్త్రంలో గృత్సమదుడు ఉద్గాతగా కూర్చొని, సామ సంహిత నుంచి మంత్రాలను తన శాఖానురూపంగా గానం చేశాడట. దేవేంద్రుని ప్రక్కనే వరిష్ఠుడు కూర్చొన్నాడు. గృత్సమదుని మంత్రోచ్చారణలో అనవధానత వల్ల అపస్వరాలు దొర్లాయి. ఆ అపచారానికి వారిష్ఠుడు ఆగ్రహించి – గృత్సమదుడిని పదివేల నూటపద్దెనిమిది సంవత్సరాలు అరణ్యమృగానివై జీవించు! అని శపించాడట. శాపావధి తీరిన తర్వాత గృత్సమదుడు నైమిశానికి తిరిగివచ్చి, యాగాచరణదీక్షను కొనసాగించాడట.

వీతహవ్యుడు కూడా మంత్రద్రష్టగా పేరుపొందినవాడే. ఋగ్వేదం ఆరవ మండలంలో పదిహేనవ సూక్తాన్ని దర్శించిన గొప్ప ఋషి. ఈయనది భారద్వాజ సగోత్రమని సాయణ భాష్యంలోనూ, ఆంగిర సగోత్రమని శౌనకీయ బృహద్దేవతలోనూ భేదం ఉన్నది. బృహద్దేవతలో శౌనకుడు ఈయన తన తండ్రిగారని కాని, తనకు పూర్వుడని కాని చెప్పలేదు. ఈయన హైహయ క్షత్త్రియుడని, భరద్వాజ మహర్షి దయవల్ల బ్రాహ్మణుడైనాడనీ ఒక సంప్రదాయం. ఆ కారణాన వీతహవ్యుడు భారద్వాజ సగోత్రుడనే ప్రసిద్ధి ఏర్పడి ఉంటుంది. వీతహవ్యుడు ఆశ్రయాన్ని పొందినది భృగుమహర్షి ఆశ్రమంలోనని మహాభారతం ఆనుశాసనిక పర్వంలో వేరొక ప్రస్తావం ఉన్నది.

కాత్యాయనుని సర్వానుక్రమణికకు ‘వేదార్థదీపిక’ అనే గొప్ప వృత్తిని (లఘువ్యాఖ్యను) రచించిన షడ్గురుశిష్యుడు మరొక కథను ఉదాహరించాడు:

భరద్వాజుని కొడుకు శునహోత్రుడు. ఆ మహాముని కుమారుడు శౌనహోత్రుడు. శౌనహోత్రుడు యజ్ఞం చేస్తుండగా ఆయనను సంతోషపెట్టడానికి ఇంద్రుడు అక్కడికి వచ్చి సదస్యసమాజంలో కూర్చొన్నాడు. ఇంద్రుడు వచ్చిన వార్త తెలిసి, ఒక్కడే వచ్చాడు కదా – కట్టి పడెయ్యటానికి ఇదే తగిన సమయమని అసురులు యజ్ఞశాలపై దాడిచేశారు. ఇంద్రుడు తెలివిగా యజమానుని రూపంలో అక్కణ్ణుంచి చల్లగా జారుకొన్నాడు. అసురులు శౌనహోత్రుడినే ఇంద్రుడనుకొని బంధించి తీసికొనిపోసాగారు. శౌనహోత్రుడు కలతచెందక వారికి తన కలరూపును, దేవేంద్రుని మహిమను వివరించి చెప్పాడట. ఇంద్రుడంటే ఎవరనుకొన్నారు? నూరు యజ్ఞాలను నిర్విఘ్నంగా నెరవేర్చి అమరలోకానికి అధ్యక్షుడైన పురుషోత్తముడు. మనస్వులలో మొదట లెక్కింపవలసిన మాననీయుడు. జగతీరూపంలో ఉన్న పృథివిని తస్థుషంగా (కదలిక లేనిదిగా) మార్చివేసిన మహామహిమాన్వితుడు. రెక్కలతో లోకకంటకాలుగా మారిన పర్వతాల ఉద్ధతిని ఆపి, వాటిని నేలపై నిలబెట్టిన మహాబలుడు – అంటూ, “సజనాస ఇంద్రః”, “సజనాస ఇంద్రః” అన్న మకుటంతో పధ్నాలుగు ఋక్కులలో తాను ఇంద్రుడను కానని తెలియజెప్పాడు. అసురులు ఆ మాటలను విని, ఈయనతో మనకెందుకని శౌనహోత్రుని నైమిశారణ్యంలో వదిలివేశారట. ఇంద్రుడు ఆయన వాగ్ధోరణికి ముగ్ధుడైనాడట. “ఈనాటి నుంచి నీకు గృత్సమదుడని పేరు కలుగుతుంది. నీ స్తుతిశ్లోకాలు వేదంలో ఒక సూక్తమై వెలయగలవు. నీవు భృగువంశంలో శునకుని పుత్రుడవై జన్మించి, శౌనకుడనే పేరిట ఈనాటి ఈ సూక్తంతోపాటు ఋగ్వేదంలోని ద్వితీయ మండలమంతటికీ ద్రష్టవై లోకవిఖ్యాతిని పొందగలవు” అని వరం ఇచ్చాడట.

శౌనకుని జ్ఞానయజ్ఞం కేవలం సూక్తదర్శనంతో ఆగిపోలేదు. ఆయన ఋక్సంహితాధ్యాయంలో గొప్ప కృషిచేసి అనేకరచనలు చేశాడు. ఆ గ్రంథాలలో కొన్ని మాత్రమే నేడు లభిస్తున్నాయి. అవి: 1. ఋక్ప్రాతిశాఖ్యం 2. ఋగ్వేదచ్ఛందోనుక్రమణిక 3. ఋగ్వేద ఋష్యనుక్రమణి 4. ఋగ్వేద కథానుక్రమణి 5. ఋగ్వేద పాదవిధానం 6. బృహద్దేవత 7. శౌనక స్మృతి 8. చరణవ్యూహం 9. ఋగ్విధానం 10. ఋగ్వేదానువాకానుక్రమణి 11. సూక్తానుక్రమణి 12. శౌనక ప్రతిష్ఠ 13. శౌనక శిక్ష 14. శౌనకీయ గ్రామప్రతిష్ఠ. మత్స్యపురాణం శౌనకుడు రచించిన శిల్పశాస్త్రగ్రంథం కూడా ఒకటున్నదని చెప్పింది.

వేదాలలోని సంస్కృతభాష కాలక్రమాన ప్రజలకు దూరమవుతున్న రోజులలో ప్రసాదగుణం ఉట్టిపడే తీయనైన పలుకుబడితో, అనేక ధర్మశాస్త్రసంపుటాలను చదివి సూక్ష్మాలు పెద్దల నడిగి తెలుసుకొనక తప్పని విషయాలను శౌనకుడు నైమిశారణ్యంలోని ఋషిగణాలు నిమిత్తంగా సూత గోస్వామి ముఖతః లోకమంతటికీ ఆవిష్కరింపజేశాడు. యుగయుగాంతరానుగత కర్కశసమస్యల నుంచి మానవాళికి నిష్కృతిని చూపించాడు. కర్మ జ్ఞాన భక్తిమార్గాలను సామాన్యుల చెంతకు తీసుకొనివచ్చాడు.

వర్తమాన స్థలి: వాదోపవాదాలు

పురాణాలలో విధవిధాలుగా అభివర్ణింపబడిన నైమిశారణ్యం నేడున్నచోటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లక్నో నగరానికి నైఋతిదిశలో 72 కిలోమీటర్ల దూరాన (సీతాపూర్ రైల్వే స్టేషను నుంచి 32 కిలో మీటర్లు) ఒకప్పుడు ఔధ్ రాజ్యమని ప్రసిద్ధికెక్కిన రోహిల్ఖండ్ రైలుమార్గంలోని నింసార్ లేదా నింఖార్ వన్ ప్రాంతమని పెక్కుమంది నమ్ముతున్నారు. దీని చుట్టుకొలత పదిన్నర యోజనాలని పురాణాలు అభివర్ణిస్తున్నాయి. ఇది శ్రీరామావతార పుణ్యక్షేత్రమైన అయోధ్యకు దగ్గరగా – వాల్మీకి మహర్షి ఆశ్రమానికి సమీపాన సుల్తాన్ పూర్ లో ఉన్నదని ప్రఖ్యాత చరిత్రకారులు వి.వి.మిరాశీ గారు భావించారు. నైమిశారణ్యం నింసార్ ప్రాంతాన ఉన్నట్లయితే దీర్ఘసత్త్రాలను నిర్వహించేందుకు ఋషులు బహుదూరాన ఉన్న కురుక్షేత్రం నుంచి తరచూ నడిచివచ్చి వెళుతుండేవారని అనుకోవటం సరికాదనిపిస్తుంది. కౌషీతకీ బ్రాహ్మణం, జైమినీయ బ్రాహ్మణం, కాఠక సంహిత, ఛాందోగ్యోపనిషత్తు మొదలైన వైదికభాగాలలోని వర్ణనలను పురస్కరించుకొని డా. కీథ్ పండితుడు నైమిశారణ్యం కురుభూములలో వెలసి ఉండటమే ôgveda BrŒhmaöas పీఠిక (పుట 45)లో సమంజసమని భావించారు.  సరస్వతీ తీర్థాలలో ప్రసిద్ధాలైన ఆదిత్య తీర్థం, కౌబేర తీర్థం, నైమిశ తీర్థం, పృథూదక తీర్థం, ప్రభాస తీర్థం, ప్లక్ష ప్రస్రవణం తీర్థం, వంశోద్భేద తీర్థం, వినశన తీర్థం, విమలోద్భేద తీర్థం, వృద్ధ కన్యాతీర్థం, వైజయంత తీర్థం, సారస్వత తీర్థం మొదలైన పుణ్యతీర్థాలకు స్మృతికారులలో ప్రముఖుడైన దేవలుడు నామకరణం చేశాడని లక్ష్మీధరుని కృత్యకల్పతరువులో ఉన్నది. నేడు హర్యానా రాష్ట్రంలో ఒకప్పుడు సరస్వతీ నది ప్రవహించిన చోటికి సుమారు తొమ్మిది మైళ్ళ దూరంలో పెహోవా అనబడుతున్న పృథూదక  తీర్థం ఉన్నది. దీనికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఈ కురుక్షేత్ర నైమిశారణ్యం ఉన్నది. నైమిశారణ్య పుణ్యతీర్థాలైన అదితి తీర్థం, ఆర్ణవ తీర్థం, గాలవ తీర్థం, ప్రాచీ తీర్థం, బ్రహ్మయోని తీర్థం, మణిపూరక తీర్థం, రేణుకా తీర్థం, వనగంగా తీర్థం, శాలిహోత్ర తీర్థం, శుక్ర తీర్థం, సోమ తీర్థం కురుక్షేత్రంలోనే ఉన్నాయి. పృథూదకానికి, సరస్వతీ నది అంతర్ధానం చెందిన చోటయిన వినశన తీర్థానికి మధ్యదేశం ఇది. ఋణమోచన తీర్థం, కన్యా తీర్థం, కౌశికీ తీర్థం, పాణిఖాత తీర్థం, మధువట తీర్థం, మిశ్రక తీర్థం, కోటి తీర్థం, సప్త సారస్వత తీర్థం, సోమ తీర్థం, సౌగంధకీ వనం, స్థాణు తీర్థం, కల్పమోచన తీర్థం ఈ ప్రాంతాలలోనివే అని బ్రహ్మ పురాణం, మహాభారతం పేర్కొన్నాయి. మహాభారతంలోని వర్ణనలను బట్టి శమంత పంచకం కూడా ఇక్కడిదే. నైమిశీయ కుంజం, కన్యా తీర్థం, అశ్వ తీర్థం, గవాం తీర్థం, కాలకోటి వృషప్రస్థం కురుక్షేత్రంలోనివే. వాయు పురాణం, బ్రహ్మాండ పురాణం నైమిశారణ్య భూమి కురుక్షేత్రంలోనిదేనని పరిపరివిధాల అభివర్ణించాయి. పాండురంగ వామన కాణే పండితులు History of Dharma§Œstra నాలుగవ సంపుటం (పుట 783)లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదన్న విశ్వాసం అంత ప్రాచీనకాలికం కాదని, ఇది హర్యానా రాష్త్రంలో బాలామవూ రైల్వే జంక్షను నుంచి 16 మైళ్ళ దూరంలో – సర్వవిధాల వాయుపురాణంలో వర్ణింపబడిన తీరున ఉన్నదని నిర్ణయించారు. నాగరికత ప్రబలి పట్నవాసాలకు జనులు తరలిరాక మునుపు నైమిశారణ్యం ఈ మూడు ప్రాంతాలను ఆవర్తించి ఉంటుందని నమ్మేవారున్నారు. ఏది ఏమైనప్పటికీ వేద పురాణాలకు, శైవ వైష్ణవాలకు, శాక్తేయ పీఠాలకు, రాసరసికులైన గౌడీయుల ప్రేమభక్తికి, దక్షిణాచార వామాచార భక్తిమార్గపరులకు, ఆధ్యాత్మికానేక భావధారలకు, సర్వధర్మాలకు నిలయమైన పుణ్యావాసం ఇది. శైవులకు, వైష్ణవులకు, శాక్తేయులకు, స్మార్తులకు, మహర్షులకు, మహాత్ములకు, ఆస్తికులందరికీ ఆశ్రయమైన పుణ్యక్షేత్రం ఇది.

ఆంధ్ర జాతీయ మహాకవి బమ్మెర పోతన గారు శ్రీమహాభాగవతం (ప్రథమ స్కంధం: 36,37) లో ఈ నైమిశారణ్యవైభవాన్ని అద్భుతావహంగా అభివర్ణించారు:

            క.         పుణ్యంబై, మునివల్లభ

                        గణ్యంబై, కుసుమఫలనికాయోత్థితసా

                        ద్గుణ్య మయి నైమిశాఖ్యా

                        రణ్యంబు నుతింపఁ దగు నరణ్యంబులలోన్‌.    

వ.         మఱియును మధువైరిమందిరంబునుం బోలె మాధవీమన్మథసహితం బై, బ్రహ్మగేహంబునుం బోలె శారదాన్వితం బై, నీలగళసభానికేతనంబునుం బోలె వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతీ కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటిపటలమండితం బై,  బలభేదిభవనంబునుం బోలె నైరావతామృతరంభాగణికాభిరామం బై, మురాసురు నిలయంబునుం బోలె నున్మత్తరాక్షసవంశసంకులం బై, ధనదాగారంబునుం బోలె శంఖకుందముకుందసుందరం బై, రఘురామయుద్ధంబునుం బోలె నిరంతరశరానలశిఖాబహుళం బై, పరశురాము భండనంబునుం బోలె నర్జునోద్భేదం బై, దానవసంగ్రామంబునుం బోలె నరిష్టజంభనికుంభశక్తియుక్తం బై, కౌరవసంగరంబునుం బోలె ద్రోణార్జునకాంచనస్యందనకదంబసమేతం బై, కర్ణు కలహంబునుం బోలె మహోన్నతశల్యసహకారం బై, సముద్రసేతుబంధనంబునుంబోలె నలనీలపనసాదిప్రదీపితం బై, భర్గు భజనంబునుం బోలె నానాశోకలేఖాకలితం బై, మరు కోదండంబునుం బోలెఁ బున్నాగశిలీముఖభూషితం బై, నరసింహరూపంబునుం బోలెఁ గేసరకరజకాంతం బై, నాట్యరంగంబునుం బోలె నటనటీసుషిరాన్వితం బై, శైలజానిటలంబునుం బోలెఁ జందనకర్పూరతిలకాలంకృతం బై, వర్షాగమంబునుం బోలె నింద్రబాణాసనమేఘకరకకమనీయం బై, నిగమంబునుం బోలె గాయత్రీవిరాజితం బై, మహాకావ్యంబునుం బోలె సరసమృదులతాకలితం బై, వినతానిలయంబునుం బోలె సుపర్ణరుచిరం బై, యమరావతీపురంబునుం బోలె సుమనోలలితం బై, కైటభోద్యోగంబునుం బోలె మధుమానితం బై, పురుషోత్తసేవనంబునుంబోలె నమృతఫలదం బై, ధనంజయసమీకంబునుం బోలె నభ్రంకషపరాగం బై, వైకుంఠపురంబునుం బోలె హరిఖడ్గపుండరీకవిలసితం బై, నందఘోషంబునుం బోలెఁ గృష్ణసారసుందరం బై, లంకానగరంబునుం బోలె రామమహిషీవంచకసమేతం బై, సుగ్రీవసైన్యంబునుం బోలె గజగవయశరభశోభితం బై, నారాయణస్థానంబునుం బోలె నీలకంఠహంసకౌశికభారద్వాజతిత్తిరిభాసురం బై, మహాభారతంబునుం బోలె నేకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకులసంచారసమ్మిళితం బై, సూర్యరథంబునుం బోలె నురుతరప్రవాహం బై, జలదకాలసంధ్యాముహూర్తంబునుం బోలె             బహువితతజాతిసౌమనస్యం బై యొప్పు నైమిశం బను శ్రీవిష్ణుక్షేత్రంబునందు శౌనకాదిమహామునులు స్వర్గలోకగీయమానుం డగు హరిం జేరుకొఱకు సహస్రవర్షంబు లనుష్ఠానకాలంబుగాఁ గల సత్త్రసంజ్ఞికం బైన యాగంబు సేయుచుండి.

అని. అద్భుతావహంగా ఉన్న ఈ రూపణలన్నీ వివిధ పురాణేతిహాసాధారితాలే గాని కేవలకల్పనలు కావు. నైమిశారణ్యం “బహువితతజాతిసౌమనస్యం” అన్న పోతన్న గారి వర్ణన త్రికాలాలకు అనువర్తిస్తుంది. ఈ విధంగా సనాతమైన భారతీయసంస్కృతికి ఆలవాలమైన శ్రీ నైమిశారణ్య పుణ్యక్షేత్రాన్ని మనసా వాచా కర్మణా సంస్మరించి, సంకీర్తించి, సందర్శించి తరించాలి.

 

 

 

 

3 thoughts on “భారతీయసంస్కృతిలో నైమిశారణ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *