April 28, 2024

మాయానగరం-10

రచన: భువనచంద్ర  bhuvana

జీవితాన్ని జీవించడం వేరూ.. జీవితాన్ని అనుభవించడం వేరు. వీటి కన్నా గొప్పది అనుభవాన్ని ఆస్వాదించడం. ఇదేమీ మాటలగారడీ కాదు. ఇది అర్ధం కావటానికి తెలివితేటలతో పనిలేదు. డిగ్రీలతోనూ, పదవులతోనూ అంతకన్నా పనిలేదు. కేవలం కొంచెం ఆలోచించగలిగితే చాలు. ఆ మాత్రం ఆలోచించగల తెలివితేటలు వెంకటసామికి వున్నాయి.

శ్రీ వెంకటస్వామి ఒకప్పుడు వెంకటేశా విలాస్ కి ప్రొప్రయిటర్. అంతకుముందు నందినీ విలాస్ లో అప్పట్లో క్లీనర్ కమ్ సర్వర్ కమ్ కుక్. కాఫీ గ్లాసుల జలతరంగిణి వింటూ ‘డబ్బూ కలలు కంటుండేవాడు. ఆ కలల్లో డబ్బేగాక బోలెడంత డబ్బుకి ఏకైక వారసురాలైన ‘నందిని’ కూడా ఉండేది. నందిని ‘నందినీ’ విలాస్ ప్రొప్రయిటర్ మహదేవన్ కూతురు. మహదేవన్ మళయాళీవాడు. ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే రకం. అయినా, ఒక్కొక్కసారి పొరపాట్లు ఎవడికైనా తప్పవు. మహదేవన్ చేసిన పొరపాటు వెంకటసామిని పనిలో పెట్టుకోవడమే.

అలాగని వెంకటసామి సోమరపోతు కాడు. బ్రహ్మాండమైన వర్కరు. నిజం చెబితే మామూలు కంటే ‘ఎక్కువ’ అందగాడు కూడా. ఆ అందమే ‘నందినీ మనసుని ముంచింది.

మొక్కల్లాగే కోర్కెలకి కూడా తమదైన పద్ధతి వుంటుంది. కొన్ని త్వరగా ఎదిగి త్వరగా పడిపోతాయి. కొన్ని ఆలస్యంగా ఎదిగి దశాబ్దాల పాటు నిలిచివుంటాయి. మొక్కలూ కోర్కెలే గాక అమ్మాయిలకీ యీ పద్ధతి వర్తిస్తుంది.

‘నందిని’ కి చిన్నప్పటినుంచే ఆ ‘యావ’ పట్టుకుంది. మగాళ్ళని చూస్తే వళ్ళంతా జలదరించేది. ఏదో కావాలనిపించేది కానీ, ఏది కావాలో తెలిసేదికాదు.

తొమ్మిది, పదేళ్ళ పిల్లగా వున్నప్పుడు ఎవడి చెయ్యి పొరబాటున తగిలినా ఆ పిల్లకి ఓ చిత్రమైన వేడితో వళ్ళంతా పూగిపోయేది. ఎంతగా అంటే కట్టుకున్న బట్టలు పికిలి పోతాయా అన్నంతగా!

పన్నెండేళ్ళకు పెద్దమనిషయ్యింది. అప్పటినించీ అస్పష్టమైన తిప్పలు ప్రాంభమైనాయి. పదినిముషాలకోసారన్నా అద్దం చూసుకోవాలనిపించేది. అదీ మామూలుగా కాదు. తనెంత ‘ఎదుగు’ తోందో స్పష్టంగా చూసుకునేంత!

అలా చూసుకుంటున్నప్పుడే పొరబాట్న వెంకటసామి కళ్ళల్లో పడింది నందిని. కటిక దుకాణం ముందు నించి కుక్కా, బ్రహ్మచారి ముందు ఆడదీ ‘క్రాస్’ చెయ్యకూడదు. ఎందుకంటే కుక్క ఏకంగా కటిక దుకాణం దగ్గిరే సెటిల్ అయిపోతే, బ్రహ్మచారిమాత్రం ఆడదాన్ని పగలూ రాత్రి కూడా మానసికంగానూ, శారీరకంగానూ వెంబడిస్తూనే వుంటాడు. చిత్రం ఏమిటంటే.. నందిని అందమైన అమాయకురాలు. వెంకటసామి పరమకేటు. మగాడ్ని ఉపయోగించుకోవాలంటే ఆడాళ్ళని గుర్తించడం, వారిని తగినట్లుగా మలుచుకుని వారికి తగినట్లుగా ప్రవర్తిస్తూ వాళ్ళని ముంచడం బాగా తెలిసినవాడు. నందినికి పదిహేనూ, వెంకటసామికి ఇరవైరెండు.

క్రూర జంతువులకి కూడా ఒక్కోసారి దయా, జాలీ పుట్టుకురావచ్చు. అలా జాలి పుట్టాకే పులి ఆవుకి పర్మిషనిచ్చింది. (ఇంటికెళ్ళి దూడకి పాలిచ్చిరమ్మని).

నందిని అమాయకత్వానికి వెంకటసామికి అలాంటి జాలే పుట్టింది. కాని ఆ పిల్ల అందం అంతకంతకీ అతన్ని వెర్రివాడుగా చేసింది. కామమైనా ప్రేమైనా చివరికి చేరేది ఒక గమ్యానికేగా! గమ్యానికి చేరాలంటే మొదట అడుగులు పడాలి. కోటిమైళ్ళ పయనమైనా మొదలయ్యేది తొలి అడుగుల్లోనేగా!

“నందినీ.. నువ్వెంత అందగత్తెవంటే… “నీతో ఏ హీరోయినూ సరి తూగదు”. అన్నాడు వెంకటసామి నిబిడాశ్చర్యంతో. మామూలు పరిస్థితిలో నందినీ ఏమనేదో తెలీదు గానీ చూడకూడని పరిస్థితుల్లో చూసిన వెంకటసామిని గట్టిగా నోరు తెరిచి ఏమీ అనలేక గబగబా బట్టలు సర్దుకుని బెరుకుగా భయగా కొంచెం కనీ కనిపించని గర్వంతో వంటగదిలోకి పారిపోయింది.

సంగీతంలో పట్టువున్నవాడికి శృతి చెయ్యడం వెన్నతో పెట్టిన విద్య. కాముకుడికీ ప్రేమికుడికీ కూడా యీ శృతి అనేది తెలియాలి. లేకపోతే కామమూ, ప్రేమా కూడా ‘వికటించే’  ప్రమాదం ఎప్పుడూ పొంచే వుంటుంది.

పొగడ్తకి పడని వారెవ్వరూ? అందునా ఆడపిల్లల సంగతి అడగాలా? అందునా అందమైన ఆడపిల్లల సంగతి చెప్పాలా? మొదట చూపుల్లో ఆరాధనని కురిపించాడు. తర్వాత మాటలతో మౌనాన్ని కరిగించాడు. ఆ తరవాత తన అనంతమైన ‘భక్తి’ని చేతల ద్వారా ప్రదర్శించాడు. మంచినీళ్ళు అందించినా దేవతకి భక్తుడు అందించిన్నంత భక్తిగా అందించేవాడు.

ఆ భక్తిని చూసి పరవశురాలయిపోయింది నందిని.

ఇదో వెర్రిలోకం. ఇప్పుడున్న ‘మెలిక’ ఎప్పుడూ ఇలాగే వుంటుందని ప్రేమిస్తుంది. అలాగే వుండాలని మనసా వాచా కోరుకుంటుంది. కానీ ‘అలాగే’ వుండటం ప్రకృతి విరుద్దం. ప్రేమ కూడా ప్రకృతిలో భాగమే. అదీ మానవ ప్రకృతిలో ఓ భాగమే. వెంకటసామి భక్తికి పులకరించిపోయిన నందిని అతన్నికొంచెం దయదల్చింది. దేవత గదా.. అందుకే కాస్త ముట్టుకోనిచ్చింది. వెంకటస్వామి పిల్లిలాంటివాడు. పిల్లిని ఎంత జాగ్రత్తగా గమనిస్తూ పెంచినా అది పదిళ్ళు తిరక్కమానదు. దాని ప్రకృతి దానిది. మొదట పాదాల మీద పడి వాటిని కళ్ళకద్దుకున్నాడు. ఆ తరవాత ఆ పాదాలకి భక్తిగా (?) ముద్దులు పెట్టాడు. ఆ తరవాత మెల్లగా మోకాళ్ళ సౌందర్యాన్ని వర్ణించాడు. అక్కడ మాత్రం నందిని వెంకటసామిని ఆపింది. కారణం అప్పటికే ఆ పిల్ల వెన్ను జలదరించి కళ్ళు చెమర్చడం. ‘తనువు’ అనే మహా సౌందర్య నిలయానికి తాళం చెవిముద్దు. అదేం ఖర్మోగాని వెంకటసామి ‘ముద్దు అనే తాళం చెవిని వుపయోగించబోయి నప్పుడల్లా ఎవడో ఒకడు అడ్డం తగిలేవాడు.

“నందినీ చూడు.. యీ లోకానికి నా మీద దయలేదు. చచ్చిపోతా” అనేవాడు వెం.సామి.

“వద్దు…అలా అనొద్దు వెంకట్. నువ్వు లేకుండా నేనూ బ్రతకలేనూ. అంటూ నిర్మలంగా రోదిస్తున్నట్లు తల వూగించేది నందిని.

“మరెట్లా మన ప్రేమని బ్రతికించుకోవడం..!” జాలిగా అనేవాడు వెం.సామి. అదే గ్రామఫోను రికార్డు రోజూ నడిచేది.. దాదాపు ఏడు నెలలో ఒక రోజు ‘పరమశవం’ వచ్చేదాక.

‘పరమశవం’ మహదేవన్ కి దూరపుచుట్టమే కాక ‘నందిని’ కి వరసైనవాడు. మహదేవన్ లాగే మళయాళీ పరమశివం మహదేవన్ ఇంటికొచ్చిన వారం రోజుల్లోనే వెం.సామికి ఓ పాయింటు అర్ధమయ్యింది. పరమశివం మామూలుగా ‘పని’కి వచ్చినవాడు కాదనీ త్వరలోనే తనకి యజమానీ, మహదేవన్ కి అల్లుడూ కాబోతున్నాడనీ.

‘డేటు’ ఇంకా ‘ఫిక్స్’ కాలేదు. ‘డేటు ఫిక్స్’ అయితే ‘ఫేటు’ మారిపోతుందని గ్రహించాడు వెంకటసామి.

‘తాళం’ తొందరగా తియ్యకపోతే ‘నిలయం’ దక్కే ప్రసక్తే లేదుకదా! వెంకటసామికి తెలీని రహస్యమేమిటంటే, పరమశివానికి ‘హింస’ అంటే అత్యంత ప్రేమ అని.

పరమశివం కొన్నాళ్ళు, బళ్ళారి లో హోటల్ నడిపాడు. అంచేత తెలుగు బాగా తెలుసు. కానీ తెలుగు తెలియనట్టే నటిస్తూ నందినీ వెంకటసామీల మధ్య సాగుతున్న లవ్ టాక్ ని విన్నాడు. విని గాఢంగా నిట్టూర్చాడు. నిట్టూర్పు ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే నందిని అనాఘ్రాతపుష్పం అని తెలిసిపోయింది గనక.

మూడుముక్కలాటలో ‘మజా’తెలిసినవాడు మరో ఆటకి పోడు.

__________________________________

 

శ్రీమతి సుందరీభాయి కిషన్ చంద్ జరీవాలా’ మనసునామీలో చివురాకు వూగినట్టు వూగుతోంది. పుట్టి బుద్దెరిగాక సుందరి జీవితం లో అనేకానేక సంఘటనలు జరిగాయి. కొన్ని ప్రేమ పరమైనవి. కొన్ని శృంగారపరమైనవి.  ప్రేమకి సంబంధించినవి పెద్దగా ఆమె గుర్తుపెట్టుకోలేదు గానీ, శృంగారపరమైన విషయాల్ని మాతం బాగానే గుర్తుపెట్టుకుంది.

విచిత్రంగా ఆ… శృంగార పరమైనవి కూడా రెండురకాలవి. ఒకటి పార్కు దాకా వచ్చి ఆగిపోయినవి. రెండు ‘పడక’ గదిలో తిష్టవేసినవి. ఆ తరవాత ‘దట్ క్యూట్’ కిషన్ చంద్ జరీవాలా…

మూడుముళ్ళు పడ్డా, కొన్ని అప్రయత్నంగా జరిగిపోయినవి.

అవన్నీ ఒక ఎత్తు అయితే ఈనాటి విరహజ్వాల మరో ఎత్తు. జీవితంలో ఏనాడూ కలగని ఓ అగ్ని, ఓ తపన, ఓ విరహం, ఓ ఇదమిద్దమని చెప్పలేని వేదన. ఆమె విశాల హృదయంలో నేడు చోటు చేసుకుంది. ఎటు చూస్తే అటు ఆనందరావే కనిపిస్తున్నాడు. “అబ్బ ఏమి అందం, అసలు మగవాళ్ళల్లో ఇంత అందం వుంటుందా?” అని నూటాతొంభై ఏడోసారీ మనసులో అనుకుంటూ మూడు మైళ్ళపొడుగున నిట్టూర్చింది.

ప్రేమ అనే పదార్ధం ఏ జాతికీ, ఏ వయసుకి, ఏ బుద్ధి వికాసానికీ, ప్రకృతికీ సంబంధించినదో అదసలు ఇప్పటివరకూ ఎవరికన్నా అర్ధమైందో ఏదో కూడా తెలిసినవారెవరూ కనబడరు. ఒకవేళ కనబడ్డా ‘దేవతా వస్త్రాల’ రహస్యంలాగా ఇదీ ఒక రహస్యమేనే ఉద్దేశ్యంతోనే గుప్తంగా వుంచుతారు గానీ, బయటకు నిర్భయంగా చెప్పిన వారి దాఖలాలు ఏవీ లేవు. ఒకరిద్దరి విషయంలో గొప్ప ప్రేమికులు అని పేరొచ్చినా, అది నిజమో అబద్దమో ఆ ఒకరిద్దరికి మాత్రమే తెలియాలి గాని జనానికి ఖచ్చితంగా తెలీదు.

‘దూరపుకొండలు’ నునుపు లాగా ప్రేమ విషయాలు కూడా చాలా నునుపుగా మెరుపుగా కనిపిస్తాయి.

సుందరీబాయి మానసిక పరిస్థితి చాలా గడబిడగా వుంది. ఎవరికి ఎవరిమీద ఎప్పుడు ‘ప్రేమ’ పుడుతుందో ఎవడూ  చెప్పలేడు. ఆ ప్రేమయొక్క ఎఫెక్టు ఎంత తీవ్రంగా వుంటుందో ఎవడికివాడు అనుభవించాల్సిందే గాని, ఎవడికి ఎన్నిగంటలు లెక్చరిచ్చినా అర్ధంకాదు.

సుందరీబాయి యీ తీవ్రపరిస్థితిలో వుండగా కిషన్ చంద్ జరీవాలా పిల్లిలాగా పడకగదిలో కి వచ్చి సుందరీబాయిని గమనించి అవతలికి వెళ్ళిపోయాడు. ఒక్క విషయం అతనికి స్పష్టంగా అర్ధమైంది. సుందరీ బాయి ‘తనలోతాను’ లేదనీ ఇప్పటిప్పట్లో బయటికి రాదనీ.

ఇందాక అనుకున్నట్టు ప్రేమకి స్పష్టమైన నిర్వచనాలేవీ లేవు. తాత్కాలిక ప్రేమలూ, గాఢ ప్రేమలూ, మబ్బుల్లాగ పాస్ అయి వెళ్ళిపోయే టైం పాస్ ప్రేమలూ, అసలు ఎప్పటికీ ఏ తీరానికీ చేరని ‘జీడీ’ ప్రేమలు (లేక జిడ్డు ప్రేమలు) ఇలా బోలెడన్ని రకాలు వున్నాయి. ఇటువంటి సుఖకరమైన, నిరపాయకరమైన ప్రేమలకి జరీవాలా అతీతుడేంకాదు.

సుందరీబాయి దృష్టిలో కిషన్ చంద్ జరీవాలా ఓ కుక్కపిల్లలాంటివాడు, అంతే. కానీ కిషన్ చంద్ లోనూ ఓ ప్రేమికుడు వున్నాడు. ఆ ప్రేమికుడు ధర్మపత్ని శ్రీమతి సుందరీబాయి ముందు అత్తిపువ్వు ముడుచుకుపోయినట్టు (సారీ అత్తిపత్తి ఆకు లాగా) ముడుచుకుపోయినా, పనిమనిషి ‘శీతల్’  ఎదురుగా మాత్రం పరిపూర్ణంగా విచ్చుకుంటాడు. కారణం ఒకటే… సుందరి ముందుంటే అతన్ని ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్సు వదలదు. దానికి కారణం సాయి.

అదే శీతల్ అయితే జరీవాలాని రెండు చేతులూ జాచి గుండెనిండుగా ఆహ్వానిస్తుంది. శీతల్ కి స్త్రీత్వం వుంది.

చాలామంది ఆడవాళ్ళదగ్గర దొరకనిది ‘స్త్రీత్వం’. ఆ స్త్రీత్వానికి పేదాగొప్పా భేదం లేదు. పదవుల్తోటీ, అందం తోటీ, చదువుల్తోటీ, డిగ్రీలతోటీ అసలు పనిలేదు. కారణం ఏమిటంటే అవన్నీ స్త్రీత్వం ముందు ఎందుకూ పనికిరానివి.

జీవితంలో ఎక్కడా లభించని ఓ గొప్ప తృప్తి, స్త్రీత్వం గలిగిన స్త్రీ సమక్షంలో పురుషుడికి లభిస్తుంది. ఆ తృప్తి ఎంతటిదంటే దైవం కూడా ఆ ‘తృప్తి’ ముందర ఎందుకూ పనికిరానంత.

కిషన్ చంద్ మెల్లగా మేడమీదకి వెళ్ళాడు. అక్కడ అతనికంటూ ఓ చిన్న గదివుంది. అదెంత చిన్నగది అంటే, సుందరీ బాయికి ఆ గది అంటే మహా చిన్న చూపు. ఏనాడూ ఆ గదిలోకి వెళ్ళలేదు. వెళ్ళదు. ఆ విషయం తెలిసి కిషన్ చంద్ ఆ గదిలోకి వెళ్తాడు. అతని సమస్తం వుండేది ఆ గదిలోనే. ఎప్పుడూ అతన్నే గమనించే ఓ రెండు కళ్ళు అతనా గదిలోకి వెళ్ళడం చూశాయి. కంటిచూపు వెళ్ళిన చోటికి మనసూ, మనిషి వెళ్ళకూడదంటారు. అధవా మనసు వెళ్ళినా మనిషి వెళ్ళకూడదంటారు. కానీ ఆ చూపుల బాటని అనుసరిస్తూ ఆ గదిలోకి వెళ్ళింది శీతల్.

ఆమె వస్తుంది… వచ్చి తీరుతుంది అన్న నమ్మకంతో తలుపుకి రెండడుగుల దూరంలో ద్వారం వంకే చూస్తూ నిలబడి వున్నట్టు జరీవాలా. శీతల్ లోపలికి రెండు చేతులూ వెనక్కి నెట్టి తలుపులు మూసి, రెండుచేతులూ వెడల్పుగా జాచింది.

ఒక్క అంగలో ఆమెని చుట్టేసి ఆర్తిగా ఆమె గుండెల్లో తలపెట్టుకున్నాడు (దాచుకున్నాడు అనాలేమో?) జరీవాలా. ఆమె రెండుచేతుల్తోనూ అతని తలని గుండెలకు హత్తుకుంది.

ఓ అనురాగం గంగలా ప్రవహించిందో ఓ మమత మబ్బులా కమ్మేసిందో తెలీదుగానీ- జరీవాలా ఆమెని హత్తుకునే మీదకి కిందకి జారి ఆమె పొత్తికడుపు మీద గాఢంగా తలని ఒత్తుకున్నాడు.

‘సెక్స్’ పేరెత్తితేనే కొందరు అదేదో పచ్చిబూతు విన్నట్టు రకరకాల  అంగన్యాస కరన్యాసాలు చేస్తారు.

ఓరి దేముడా, ఎంత గొప్పవరం అదీ!

తనువునీ, మనసునీ సేదతీర్చి మనిషిని కాసేపైనా మనిషిగా బతకనిచ్చేది అదేగా! (దయచేసి అపార్ధం చేసుకోకండి. కామాందుల శృంగారం గురించి కాదు నేను ప్రస్తావించింది. పరిపూర్ణ స్త్రీత్వం గలిగిన స్త్రీముందు పనివాళ్ళై… ఆ తరువాత పురుషులై.. ఆ తరవాత పరిపూర్ణులయ్యే మనుష్యులయ్యే మగా-ఆడ మధ్య గల అనురాగపూరితమై శృంగారం గురించి).

ఓ అరగంట ఎలా గడిచిందో ఇక్కడ వివరించను గానీ, ఓ అనంతమైన అవ్యాజమైన ప్రేమ మాత్రం శీతల్ హృదయం నించి ప్రవహించి, కిషన్ చంద్ లో పరిమళించిందని మాత్రం ‘సభ్య’ (?) ప్రపంచానికి సవినయంగా చెప్పగలను.

 

మళ్ళీ కలుద్దాం:——–

మీ భువనచంద్ర

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *